కొందరు నిర్మిస్తుంటారు. మరి కొందరు కూలదోస్తుంటారు.
ఇళ్లు, వీధులు, ఊళ్లు మాత్రమే కాదు. జీవితాన్ని కూడా కూలదోస్తారు. తరతరాలుగా మానవులు నిర్మించుకున్న సంస్కృతిని నేల మట్టం చేస్తారు. మానవాళి నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేస్తారు.
పాలకులు కూలదోస్తుంటారు. ప్రజలు లేవదీస్తుంటారు.
ఢల్లీిలో సంఘ్ ప్రభుత్వం ముస్లిం జనావాసాలను బుల్డోజ్ చేయడం కేవలం ఒక తాజా విధ్వంస ఉదాహరణ మాత్రమే. మైనారిటీల ఇండ్ల మీదికి బుల్డోజర్లను తోలడం, పేదల తల మీది నీడను తొలగించడం, బతుకు తెరువును నేలమట్టం చేయడం ఒక ప్రతీకాత్మక విధ్వంసం. అందువల్ల కూడా దేశమంతా ఈ విధ్వంస చిత్రాన్ని నేరుగా పోల్చుకోగలిగింది.
అంతక ముందే సకల పార్శ్వాల్లో ఈ భయానక నిర్మూలనా కార్యక్రమం మొదలైందని మనకు తెలుసు. ఆ మాటకొస్తే ప్రజలు ఎప్పటి నుంచో ఎన్నెన్ని రకాలుగా నిర్మిస్తూ వచ్చారో ఆ అన్ని దారుల్లోవాళ్లు కూలదోస్తూ వచ్చారు. మొదట బహుళ, చర్చా సంస్కృతిని విధ్వంసం చేశారు. మనుషులు జీవితం గురించి అలవర్చుకున్న తార్కిక, హేతుచింతనను తుడిచేసి కర్మకాండల ఇరుకు చట్రంలో ‘క్రమబద్ధం’ చేశారు.
వీళ్ల విధ్వంసం అక్కడ మొదలైంది. బౌద్ధాన్ని ధ్వంసం చేశారు. శరణాగతి, భక్తి తప్ప మనిషికి విమర్శనాత్మక క్రియాశీలత లేకుండా చేయాలని చూశారు. భక్తి అనే లొంగిపోయే, క్రయా రహిత, అతార్కిక సంస్కృతినే ఉపఖండ సంస్కృతిగా ప్రచారం చేశారు. దాని నుంచే సాహిత్యం, కళలు, ఆలోచనలు అన్నీ తయారు చేశారు. మానవ సృజనాత్మకతను కొల్లగొట్టారు.
కానీ ఉత్పత్తిదాయకమైన మానవ ఆచరణ మహాద్భుతమైనది. అదొక్కటే సజీవమైనది. నిత్య చలనం, నిర్మాణం, పలు వైరుధ్యాల పరిష్కారం దాని సజీవ లక్షణం. శ్రమ నుంచి జ్ఞానాన్ని, సంస్కృతిని ఉత్పత్తి చేశారు. వాటిని వాళ్లు ఒక పథకం ప్రకారం అంటరానివి చేశారు. మనిషిలోని సకల శక్తులను లోబరుచుకున్న, ఏకశిలా సదృశుడైన మహాకాయుని, సర్వాంతర్యామిని కల్పించారు. అదే విశ్వాత్మ, అదే ఏకాత్మ.
సరిగ్గా సంఫ్‌ుపరివార్ ఆ ఏకాత్మ మీద నిర్మాణమైంది. ఇక అక్కడి నుంచి అది ఏం చెప్పినా ఏకత్వమే. దేశ సమైక్యత అన్నా అదే. సమగ్రత అన్నా అదే. ఆ ఐక్యతలో మరో విభిన్నతకు తావు లేదు. ఆ సమగ్రతలో మరే కొత్తదానికి చోటు లేదు.
ఈ పదజాలానికి అభివృద్ధి అనే మాటను చేర్చింది. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తన మనుగడ కోసం అలవర్చుకున్న సంక్షేమం, అభివృద్ధి అనే మాటలు వాడకుండా ఏ ఆధిప్యత దోపిడీ భావజాలం మనుగడ సాగించలేని చారిత్రక ప్రపంచం ఇది.
అభివృద్ధి అంటే కార్పొరేట్ల అభివృద్ధి. అచ్ఛే దిన్ అంటే కార్పొరేట్లకు మంచి రోజులు. నిజంగానే అనేక సంక్షోభాల మధ్య భారత కార్పొరేట్లకు ఇవి ఎంత మంచి రోజులు. వాళ్లకు ఈ మంచిని అందించడానికి సర్వశక్తివంతమైన భగవత్ భావన ఇప్పుడు సర్వంసహాధికార రాజ్య భావనగా మారింది. రాజ్యానికి ఇంత తిరుగులేని శక్తిని మనం ఈ ఆధునిక కాలంలో ఎప్పుడైనా చూశామా? మతం, కులం, మెజారిటీ వాదం, దేశభక్తి, జాతీయతలాంటివన్నీ గతంలో ఉన్నవే అయినా ఇప్పుడవి ఈ సర్వంసహాధికార రాజ్యం చేతిలో ఆధునిక మారణాయుధాలుగా మారాయి. అభివృద్ధి కోసం ఎంత మానవ హననానికైనా సిద్ధపడగల దౌర్జన్యం సంతరించుకున్నది. దీనికి చట్టాలతో పని లేదు. అవసరమైతే అన్ని రకాల చట్టాలు తయారవుతాయి.
ఫాసిజం అంటే సమాజంలో, రాజ్యంలో, రాజకీయార్థికంలో పెచ్చరిల్లిన నిరంకుశ అధికారం. మామూలు మనుషుల్లోంచే కూలదోతకు చేతులు లేవడం. ఒకరి మీదికి మరొకరిని ఉన్మాదంగా ఉసిగొల్పడం. రాజ్య నిరంకుశత్వానికి, దోపిడీకి అనుగుణంగా సాగే సకల విధ్వంసమే ఫాసిజం. ఇందులో ఏ ఒక్కటో ప్రధానమని, మిగతావి అప్రధానమని అనుకుంటే ఫాసిజం అర్థం కానట్లే. దాని బుల్డోజింగ్ సంస్కృతి తెలియనట్లే.
మనకు ఢల్లీిలోని కూల్చివేతలు తెలిశాయి. పత్రికల్లో వార్తలయ్యాయి. నిరసనలు, ప్రతిఘటనలు ఉత్తేజకరం అయ్యాయి. కానీ ఇంతకంటే తీవ్రమైన బుల్డోజింగ్ దండకారణ్య ఆదివాసుల మీద సాగుతోంది. వాళ్లు నిత్యం బుల్డోజర్లకు ఎదురు నిలుస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. ఉత్పత్తికి దోహదం చేసే, కింది నుంచిప్రజాస్వామ్యాన్న అనుభవంలోకి తెచ్చే నిర్మాణాలను కూలదోయడానికి ఆకాశంలోంచి కురుస్తున్న బాంబులను తమ ప్రాణాలతో అడ్డగిస్తున్నారు.
వాళ్లు ఆదివాసులు కాబట్టి, అడవుల్లో ఉంటారు కాబట్టి అవి వార్తలు కావు.
వాళ్లను నేల మీది నుంచి నేల మట్టం చేయడం లేదు. ఆకాశంలోంచి బాంబుల వర్షం కురిపించి విధ్వంసం చేయాలని రాజ్యం ప్రయత్నిస్తోంది. మనం ఊహించగలమా?
దేశ రాజధానిలో ఇండ్ల మీదికి, వాడల మీదికి బుల్డోజర్లను తోలడం చూసి మనం దిగ్భ్రాంతికి గురయ్యాం. కానీ దేశానికి గరిమనాభి దండకారణ్యంలో ఏకంగా బాంబులతో విడతల వారిగా దాడులు జరుగుతున్నాయి. బాంబుల మోత మొదలైందంటే ఒక రోజంతా సాగవచ్చు. ఎన్నిరోజులైనా సాగవచ్చు. కొంత విరామం. మళ్లీ ఆరంభం.
ఇది ఇప్పుడే మొదలు కాలేదు. సరిగ్గా గత ఏడాది ఈ రోజుల్లోనే దక్షిణ బస్తర్‌లో బాంబు దాడులు జరిగాయి. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్ధరాత్రి మొదలు పెట్టి మరుసటి రోజు మధ్యాన్నం దాకా ఆకాశంలోంచి బాంబులు విసిరారు. జనావాసాల మధ్య సైనిక క్యాంపులు ఎలా పెడతారని ఆదివాసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం డ్రోన్ దాడులు.
మళ్లీ తాజాగా ఏప్రిల్ 28, 29 తేదీల్లో దంతెవాడ సరిహద్దులో బాంబులు వేశారని బేలాబాటియా రాశారు. ఆడవుల్లో, పొలాల్లో పేలిన బాంబు శకలాలను పిల్లలు తీసుకొచ్చారని అన్నారు. ఆమె ఒక్కరేగాదు. ఇంకా అనేక మంది ఈ యుద్ధాన్ని ఖండించడానికి ముందుకు వచ్చారు.
ఈ దేశంలో జనరంజక మేధావులే కాక అట్టడుగు, ఆదివాసీ ప్రజల గురించి పట్టించుకొనే బుద్ధి జీవులకు కొదువ లేదని వాళ్లు రుజువు చేశారు. ముప్పైమంది వివిధ ప్రజా సంఘాల నాయకులు, రచయితలు, మేధావులు దండకారణ్యంలో వైమానిక దాడులను ఖండిస్తూ పత్రికా ప్రకటన ఇచ్చారు. తాము ఎంచుకున్న ఈ పనికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి జాతీయ స్థాయిలో ప్రచారం అనే అనే అర్థవంతమైన పేరు పెట్టారు.
తెలుగు రచయితలు, మేధావులు, నిత్యం సోషల్ మీడియాలో పలు విషయాలు విమర్శనాత్మకంగా విశ్లేషించేవారు కూడా ఈ పని చేయాలని ఆశించడం తప్పు కాదు కదా.
ఈ యుద్ధమంతా చత్తీస్‌ఘడ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమా? లేక కేంద్రంలోని సంఘ్ పరివార్ ప్రభుత్వానిదా? రాజ్య దుర్మార్గంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఎవరిది ఫాసిజం, ఎవరిది ఇతరం? అనే సందేహాలే అక్కరలేదు. అన్ని పాలక పార్టీల్లోకీ బీజేపీని వేరు చేయగల లక్షణాలను పక్కన పెట్టాల్సిన పని లేదు. అందరినీ కలిపే విషయాలను విస్మరించాల్సిన పని లేదు.
బుల్డోజింగ్ సంస్కృతిని ఎవరు ఎక్కడ ఆరంభించారు? ఎవరు ఎట్లా శరవేగంగా ముందుకు తీసికెళుతున్నారనేదే చర్చనీయాంశం. విధ్వంసాల గురించి కోపంగా, దు:ఖంగా, ఆగ్రహంగా ప్రశ్నించాల్సిందే. అదొక్కటే సరిపోదు. ఎక్కడికక్కడ ప్రజలు నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఎత్తిపడతామా లేదా? అనేదే అసలు విషయం.
ప్రశ్నించాల్సిందే