‌‌నవ మాసాలు మోసి   జన్మనిచ్చిన పిల్లలపై  ఏ అమ్మకు ప్రేమ ఉండదు!? స్వచ్ఛమైన అమ్మ ప్రేమని దేనితో వెలకట్టగలం? అమ్మ తన రక్తమాంసాలతో పుట్టిన పసికందును కంటికి రెప్పలా కాపాడుతుంది. చందమామను చూపిస్తూ ఆప్యాయత, అనురాగాలనే గోరుముద్దలుగా తినిపిస్తుంది. తొస్సుబోయే పసినాటి చిలిపి పలుకులకు మాటవుతుంది. బుడి, బుడి తప్పటడుగులకు నడకవుతుంది. ఈసమెత్తు కల్లాకపటం తెలియని మమకారాన్నందిస్తుంది. ఎవ్వరికీ తలొంచని తెగువ, ధైర్యాన్నిస్తుంది. ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకొని బతుకు బండి లాగుతుంది. పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు ప్రపంచాన్నే జయించానని సంబరపడిపోతుంది. వారు సమాజమే హర్షించదగ్గ పిల్లలుగా పరివర్తన చెందినప్పుడు ‘నింగి-నేలా నాదే ‘ అన్న పరిపూర్ణ విశ్వాసంతో సంతోష పడుతుంది. వారికేదన్నా జరిగితే గుండెలవిసేలా రోదిస్తుంది తల కొట్టుకొంటూ.

‌‌అదే విప్లవోద్యమంలోనే ఇద్దరూ భాగమైతే…ఆ బంధం విప్లవోద్యమ రాజకీయాలతో రాటుదేలి మరింత దృఢంగా నిలబడి అందరికీ ఆదర్శంగా నవ సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. ఆ విప్లవంలోనే కళ్ళముందే కన్న పిల్లలు నేలకొరిగినప్పుడు ఆ పిల్లల త్యాగాన్ని మనసారా ఆహ్వానిస్తుంది. అటువంటి అమ్మలు విప్లవోద్యమ బాట ఎంచుకోవటానికి ఒక్కొక్కరికీ ఒక్కో నేపథ్యం ఉంది. విప్లవమే సర్వస్వమనుకొని ప్రజల పిల్లల్నే తమ పిల్లలుగా తీర్చిదిద్దారు. కాలంతో వచ్చే సమస్యలను పరిష్కరించారు. అందరికీ ‘అమ్మై’ అక్కున చేర్చుకున్నారు.

అలాంటి అమ్మల గురించి…

‌ఒక ప్రత్యేక మీటింగు. జమైన కామ్రేడ్స్ చకచకా పనులు చేసేస్తున్నారు. మీటింగు హాలు తయారీ పూర్తి కావచ్చింది. రకరకాల రాజకీయ నినాదాలతో, అమరుల ఫోటోలతో. హాలు ఒక రకమైన ‘ఎర్రని’ వాతావరణాన్ని పులుముకొంది. లైనుగా ఉన్న ఫోటోల్లో మొదటిది మొన్ననే సంస్మరణ సభ జరుపుకున్న కామ్రేడ్ నర్మద దీదీ (ఉప్పుగంటి కృష్ణ కుమారి, నిర్మలా కుమారి) ది. దండకారణ్య మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి విరామ మెరుగక విశేషంగా పని చేసిన కామ్రేడ్. (2018 వ సంవత్సరంలో కేన్సర్ వ్యాధికి ట్రీట్‌మెంట్‌కు వెళుతున్న క్రమంలో అరెస్టై ముంబయిలోని బైకుల్లా మహిళా జైలుకు తరలించబడింది. ఫాసిస్టు ప్రభుత్వం సరైన సమయంలో సరైన వైద్యం అందించని కారణంగా ముంబయి వెస్ట్ బాంద్రా లోని ‘శాంతి ఆవేదన్ హూస్పైస్ కేర్ సెంటర్’ లో 2022 సంవత్సరం ఏప్రిల్ 9 న తుదిశ్వాస విడిచింది.) లైనుగా ఉన్న ఫోటోలను చూస్తుండగా ఒక ఫోటో దగ్గర నా చూపు ఠక్కున ఆగిపోయింది. బక్కపల్చగా (అమ్మ భాషలో రివట లా) ఉన్న ఒక మహిళా కామ్రేడ్ యూనిఫామ్ ఫోటో, ఆ పక్కనే పంజాబీ డ్రస్ లో ఉన్న మరో ఫోటో. ఫోటో కింద కామ్రేడ్ యోగిత అని బ్రాకెట్‌లో ‘అస్మిత’ అని రాసి ఉంది.

‌’ఎవరీ కామ్రేడ్?’ మనసులో అనుకుంటూ పైకి అనేశాను.

‌నేను అలా అనటం, నా చూపు హాల్లో ఉన్న రామ్‌కో దీదీ వైపు పడటం, దీదీ నన్ను చూడటం…అంతా లిప్తపాటులో జరిగిపోయింది. నా వెనుక నిలబడిన కామ్రేడ్ నుంచి జవాబు రాకముందే దీదీ ఆర్తీగా చూసిన చూపే నాకు జవాబయ్యింది.

‌’అమ్మనుకుంటా’ అనుకున్నాను. అక్కడి నుండి నా చూపు ముందుకెళ్ళలేదు.

‌‌మీటింగు మొదలైంది. రామ్‌కో దీదీ కరెక్ట్ గా టయానికి వచ్చేది. తన వంతు వచ్చినప్పుడు నిష్కర్షగా మాట్లాడేది. దీదీ మాట్లాడే తీరుకు ముచ్చటేసింది. మీటింగు మధ్యలో ఒక కామ్రేడ్ చెప్పగా తెలిసింది దీదీ గురించి. నేనైతే ముందెప్పుడూ రామ్ కో  దీదీని కలవలేదు. అందుకే ఒకరోజు యోగిత గురించి అడిగినప్పుడు ఇలా చెప్పడం మొదలు పెట్టింది .

దీదీ మాటల్లోనే…

‌‌”మాది గడ్‌ఛిరోలి జిల్లాలోని టిఫ్రాగఢ్ ఏరియా. గొర్రెకస గ్రామం. గడ్‌ఛిరోలి అంటేనే నిర్బంధం విలయతాండవం చేసే ప్రదేశం గుర్తుకొస్తుంది. నిరంతరం గ్రామాలపై ఇనుప బూట్ల జల్లెడ, దాడులు. ఒక్కొక్క ఇంటి మీద తెల్లారే సరికి మూడు, నాలుగు సార్లు దాడి జరిగేది. ఇళ్ళల్లోని ఏ వస్తువుని వదిలే వారు కాదు. ఒక్కో రూపాయిగా దాచుకున్న డబ్బులు, కొద్ది పాటి బంగారు, వెండి ఆభరణాలు, బియ్యం, పప్పులు, ఇతర యావత్తు తిండి సామాన్లతో పాటు, కత్తి, పలుగు, పార, గొడ్డలి వంటి పనిముట్లు… ఇంట్లో  ఏదున్నా దోచుకొనేవారు. అరెస్టు-మిస్సింగ్ కేసులు-హత్యలతో గ్రామాలు తల్లడిల్లేవి. సిరొంచ, అహిరి, టిఫ్రాగఢ్ ఏరియాల్లో పోలీసు దాడికి గురి కాని గ్రామం లేదు, శత్రు వలలో చిక్కని రైతు లేడు. 1992వ సంవత్సరంలో మంగజరి అనే గ్రామం మీద దాడి చేసిన పోలీసులు 14 మందిని అరెస్ట్ చేసి ఏడుగురిని మాయం చేశారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియదు. సంఘంలో పని చేస్తున్నాడని రేంగులవాయ్ గ్రామ ఆదివాసీ రైతు లచ్చమన్ నేతమ్ ను పోలీసులు అరెస్టు చేసి చెట్టుకు కట్టేసి శరీరమంతా తూట్లు  పడే విధంగా  కాల్చి చంపారు. అంత పాశవిక దమనకాండ ఉన్నప్పటికీ గ్రామ ప్రజలంతా సంఘ నాయకత్వంలో ఒకటయ్యారు. ఎన్నో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను పరిష్కరించుకొన్నారు. ఈ సమయంలోనే సంఘ కార్యకలాపాలపై, నాయకత్వంపై పోలీసుల డేగ కళ్ళు పడ్డాయి. దొరికిన వారిని దొరికినట్లు కొట్టటం, అరెస్టు చేయటం-చంపటం మామూలై పోయింది. సంఘ నాయకత్వం నెలల తరబడి అడవిలోనే కాలం గడిపేది. కన్నుగప్పి ఇంటి ముఖం చూడటం తప్ప. అటువంటి పరిస్థితుల్లో నా సహచరుడు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొన్నాడు.

‌‌మాకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పేరు యోగిత. పాడి (గోత్రం) పద్దా. యోగిత మూడవ సంతానం. చాలా హుషారైన పిల్ల. చిన్నప్పట్నుంచే ఇంటి పనులు అన్నీ చేసేది. ఇంటి పని, వంట పని మొత్తం. పనికి బద్దకస్తురాలు కాదు. చదువులో కూడా అంతే. ఏ తరగతిలోనూ ఫెయిల్ కాలేదు. అలా 12 వ తరగతి వరకు చదివింది. పోలీసు దాడులు రోజు రోజుకి పెరిగాయి. దాడికి వచ్చిన పోలీసులు నా సహచరుడి ఆచూకీ కోసం నాకు వంద, రెండు వందలు ఇవ్వటానికి ప్రయత్నించేవారు. నేను తీసుకొనేదాన్ని కాను. ఆడుకొంటున్న పిల్లగాడి జేబులో పెట్టేసేవారు. నన్ను లొంగదీసుకోవటానికి శత విధాలా ప్రయత్నించారు. కానీ నేను అన్నిటికీ తెగించాను. ఇంటి దగ్గర ఉండలేని పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా సహకరించారు.  అలా నేను కూడా నా సహచరుడి బాట పట్టాను. అది 2001లో. అప్పుడు యోగిత వయస్సు 9 సంవత్సరాలు. నేను వచ్చేటప్పుడు ఏడవలేదు. ఆ చిన్న వయసులో దానికి అర్థమయ్యిందో లేదో? అయినా రోజూ పోలీసులు చేసే దాడులను చూసింది గదా! గాబట్టే ఏడవలేదనుకున్నాను. నేను విప్లవోద్యమంలోకి వచ్చిన చాలా రోజులకు చూడటానికి వచ్చింది. రెండు రోజులున్నది. తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయింది. మొదటిసారి అలా వదిలిపెట్టటంతో  బాధనిపించింది. కానీ ఏం చేయను? పరిస్థితులు అలా ఉన్నాయి.

‌‌సమయం చూసుకొని మమ్మల్ని చూడటానికి వచ్చేది. స్కూల్లో తన ఈడు పిల్లల గురించి చెప్పేది. వాళ్ళ నాన్న దగ్గర కన్నా నా దగ్గరే చనువు ఎక్కువ. అప్పుడప్పుడు తన బుల్లి-బుల్లి అక్షరాలతో లెటర్ రాసేది. సెలవులకు వచ్చిన ప్రతిసారీ మనవాళ్ళు పిలిచి మాట్లాడేవాళ్ళు. అలా విన్నప్పుడు తన ఎదుగుదలకు ఎటువంటి ఢోకా లేదనిపించేది.

‌‌2013 లో రిక్రూట్ అయ్యింది. మనవాళ్ళు రాసిన లెటర్ ద్వారా  ఆ సంగతి తెలిసింది. రిక్రూట్ అయిన కొత్తలో కామ్రేడ్ సృజన దీదీ (2020 మే నెలలో అమరురాలైన రాగో ఈమే) తో ఉంది. తర్వాత మనోజ్ దాదాతో. 2017 నుండి ఎస్.జెడ్.సి. సభ్యుడు కామ్రేడ్ పవన్ (భాస్కర్) కు గార్డ్ గా ఉంది. ఒక్క రక్షణ విషయమే కాక పవన్ కు ఆరోగ్యం బాలేని సమయంలో ఎంతో సేవ చేసింది.

కంప్యూటర్ కూడా  నేర్చుకొంది. ఇవన్నీ విన్న నాకు తనను చూడాలని మనసు ఊవ్విళ్ళూరింది. కానీ పనుల వల్ల సాధ్యం కాలేదు. తర్వాత కలిసింది. ఎన్నో విషయాలు చెప్పింది. వింటున్న నాకే ఆశ్చర్యమేసింది. రెప్పవాల్చకుండా తన కళ్ళల్లోకే చూస్తున్న నన్ను ‘ఏమ్మా!’ అని కదిపింది ‘.

‌భయమంటే తెలియని పిల్ల. తనకు మస్తు ధైర్యం ఉండేది. ఎన్నో ఫైరింగ్స్ లలో ఉంది. ఇద్దరం పాల్గొన్న ఫైరింగ్స్ కూడా ఉన్నాయి.

‌2021 నూతన సంవత్సరం. ముందు రోజు గులాబ్‌జామ్ చేశాం. తెల్లవారుజామున లేచి నేను టీ పెట్టటానికి కట్టెలు ఏరుతున్నాను. యోగిత నా దగ్గరకొచ్చింది.

‌ ‘మ్మా! రోజూ లేచి నిప్పు దగ్గరకు పోతున్నావ్. టీ అలవాటు బాగానే ఉందే, గుట్టల మీదుండి ఢాం అంటే  తెలియకుండా ఉన్నావు’ అంది.

అది విన్న నా మనసు చివుక్కుమన్నది. రాజేసిన నిప్పు దగ్గర్నుంచి ఇవతల కొచ్చేశాను.

‌గడ్‌ఛిరోలి అంటేనే భీషణ నిర్భంధం కదా! ఎవరు ఏ పని చేసినా సెక్షను వారీగానే. అలా ఆ రోజు మొదటి సెక్షన్ కామ్రేడ్స్ కాలకృత్యాలకు వెళ్ళారు. రెండవ సెక్షన్ వాళ్ళం ఆగాం. కొద్దిమంది కామ్రేడ్స్ అదర-బదర కిట్లు వేసుకొంటున్నారు.

 ఏమైందనుకునేంతలో… ‘పోలీసులొస్తున్నారు, సామాను పట్టుకోండి ‘ కామ్రేడ్ పవన్ సైగ చేశాడు.

నా సామాను నేను పట్టుకుంటుండగా యోగిత నా దగ్గరకొచ్చి  ‘మ్మా! సామాను ఇటివ్వు, వాగు పెద్దగుంది ‘ అన్నది.

 ‘నే…పట్టుకుంటాలే! ‘ అన్నాను .

 ‘అమ్మను నిదానంగా తీసుకురండీ అస్మిత ‘ పవన్ మధ్యలో నుండి అన్నాడు.

‌‌ ఫైరింగ్ కాలేదు గానీ చాలా దూరం పోలీసులు మమ్మల్ని వెంబడించారు. అందుకే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వేరే ప్రదేశానికి పోవాలనుకున్నాం. వాగులు-వంకలు, కొండలు-గుట్టలు దాటుకుంటూ ఉదయం 7 గంటలకు మొదలైన మా ప్రయాణం మధ్యాహ్నం 3 గంటలకు ఆగింది. అంత దూరం నడిచాం గానీ అది కూడా ఏమంత సురక్షిత ప్రదేశం కాదు, ఉన్నంతలో ఒక మోస్తరుది. గల గల పారుతున్న వాగు నీళ్ళతో అన్నం వండాం, గబగబా తిన్నాం. ఇంత నోట్లో వేసుకొన్నామో లేదో మళ్ళా ఫైరింగ్ అయింది. కానీ ఎవరికీ ఏం కాలేదు. మన కామ్రేడ్స్ ప్రతిఘటించటంతో సేఫ్ గానే రిట్రీట్ అయ్యాం. కొంత సామాను పోయింది అంతే. ఆ ఫైరింగు తర్వాత కొన్ని రోజులు ఇద్దరం కలిసే ఉన్నాం.

2021 ఫిబ్రవరి 4 వ తేదీ. నేను విడిపోయేరోజు. ‘కొద్ది రోజులు కలిసుంటారా?’ అని మన కామ్రేడ్స్ అడిగారు.

అలా అడిగినప్పుడు యోగిత కేసి చూశాను. దాని మొఖం చూడగానే కలిసుండాలనిపించింది. మరింతలోనే నా పని గుర్తొచ్చింది.

‌ ‘ఇప్పటికే చాలా రోజులయ్యింది. ఎప్పుడన్నా వస్తాలే! ‘ అని అందరికీ చేతులు కలిపాను.

చివరిగా యోగితకు. యోగితను దగ్గరకు తీసుకున్నాను. మురిపెంగా ముద్దు పెట్టుకున్నాను. ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతి కలిగించే కరచాలనం చేసింది. అదే చివరిదవుతుందని ఊహించనేలేదు.

‌‌2021 మార్చి 29 వ తారీఖు. మహారాష్ట్ర సి-60 కమాండోస్ తో ఖోబ్రామెండ గ్రామ అంచుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. సి-60 బలగాలతో వీరోచితంగా పోరాడుతూ ఐదుగురు కామ్రేడ్స్ అమరులయ్యారు. వారిలో యోగిత కూడా ఉంది. విన్న నాకు దుఃఖమాగలేదు. ఎంతంటే కట్టలు కట్టలేనంత.  (కన్నీళ్ళు తుడుచుకొంటూనే…) తన రూపమే కళ్ళ ముందు కదలాడింది. తన ఆనవాలు కోసం వెతికాను. అనుకోకుండానే బ్యాగు మీద చేయి పడింది. లోపల తడిమాను. చేతికి కాగితం దొరికింది. బయటకి తీశాను. లెటర్. నా చిట్టి తల్లి యోగిత రాసిన లెటర్. తెరచి చూశాను. కన్నీరు ధారగా కారుతోంది. అవి అక్షరాలు కాదు, ఆణిముత్యాలు. ఆణిముత్యాల్లాంటి అక్షరాలు. ఆ అక్షరాల్లో నా చిన్నారి రూపమే కనపడుతుంది, మాట్టాడుతున్నట్టే ఉంది.‌’మ్మా! ఒక్కొక్కరు ఎక్కడికీ పోవద్దే…! నాన్నకు కూడా చెప్పే…! ఆరోగ్యం బాలేనప్పుడు మాత్రలు తినడం మర్చిపోవద్దే! అలా…’ అని ఇంకా చాలా రాసింది.

 ఎంతసేపైందో తెలియదు.   ఏదీ తినాలనిపించలేదు. నీళ్ళు కూడా తాగాలనిపించలా. ఎంత మరచిపోదామన్నా  అయిత లేదు. అక్కడ్నుంచి మేము వేరే ప్రదేశానికి పోవాలి. అందరూ కిట్లు వేసుకొని నా కోసం ఆగారు. నేను నా సామాను పట్టుకుంటుండగా కామ్రేడ్స్ వచ్చి అందుకొన్నారు. వారితో అడుగులో అడుగు వేస్తున్నాను. అడుగు వేస్తున్నానే గానీ యోగిత గురించిన ఆలోచనలే ముందు పరుచుకొంటున్నాయి. ఆగకుండా వస్తున్న కన్నీటికి నా దగ్గరున్న తువ్వాలు కూడా సరి పోవటం లేదు. ముందు, వెనుక నడుస్తున్న కామ్రేడ్స్ కు అర్థం కాకుండా ప్రయత్నం చేశాను, బాధను దిగమింగు కోవటానికి.

‌‌కొద్దిగా తేరుకొని… ఆ  ఫైరింగు లో  కూడా యోగిత  ఏ మాత్రం భయపడలేదట. శత్రు కురిపిస్తున్న గుళ్ల వర్షంలో కామ్రేడ్ పవన్ గాయాలయ్యి కింద పడిపోయాడు.

యోగిత ఫైర్ చేస్తూనే ‘పవన్ దాదా, ఇటు రా!’ అని పిలిచిందట. పవన్ నుండి సమాధానం రాకపోయేటప్పటికీ ఒక్క ఉదుటున పవన్ దగ్గరకు ఉరికి ‘పద దాదా!’ అని లేవదీసిందట. తీవ్ర గాయాలయ్యి లేవలేని పవన్ ఎ.కె. తుపాకీని యోగిత చేతిలో పెట్టాడంట.

 ‘దాదా, దాదా’ అని ఏడుస్తూనే అక్కడే కవర్ తీసుకొని మేగజిన్ ఖాళీ అయ్యే వరకు కసితీరా శత్రువును ప్రతిఘటించింది. శత్రు తూటాలకు తానుకూడా అక్కడే నేలకొరిగిందట. అసలు అంత ధైర్యం ఉంటదని అనుకోలా. వీళ్ళు, వాళ్ళు చెప్పినా నా చెవి కెక్కలా. కని పెంచింది నేను కదా! అనుకొన్నాను. 

‌‌అందుకే, పోలీసులు యోగిత తమ్ముడ్ని పిలిచి ‘యోగిత ఏమతుందిరా నీకు? పవన్ కు గార్డుగా ఉందా? వాడు చనిపోతే వాడి ఎ.కె. పట్టుకొని మేగజిన్ ఖాళీ అయ్యే వరకు హీరో వలె ఫైర్ చేసింది’ అన్నారట.

నాకిప్పుడు చాలా చాలా గర్వంగా ఉంది. అమరురాలై కూడా శత్రువును ముచ్చెమటలు పట్టించిన యోగిత గుర్తుకొస్తే…నింగి-నేలను జయించాననే తృప్తి, ఆనందం కలుగుతోంది” అన్నది.

‌‌నిజం కదా! పిల్లలు మంచి భవిష్యత్తును ఎంచుకొన్నప్పుడు అమ్మా, నాన్నలకు ఎంత గర్వమో కదా? అమ్మకైతే మరీ ఎక్కువ కూడాను.

*‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ *‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ *

 ‌‌కామ్రేడ్స్ గుడ్డు, సోమ్లికి పుట్టిన పిల్ల మంగ్లి. గుడ్డు మా దగ్గరున్న 17 వ ప్లాటూన్ కు డిప్యూటీ కమాండర్. 2020వ సంవత్సరం నవంబరు నెలలో కాంకేర్ జిల్లా అంతాగఢ్ బ్లాక్ పతకల్‌బేడ గ్రామ అంచుల్లో జరిగిన కౌంటర్ అంబుష్ లో శత్రువును ప్రతిఘటిస్తూ అమరుడైన ఆదర్శ కామ్రేడ్. ఆ ఘటనలో కామ్రేడ్ గుడ్డుతో పాటు కంపెనీ-5లో కామ్రేడ్స్ జ్యోతి, బద్రులు కూడా అమరులయ్యారు.

‌‌గుడ్డు అమరుడైనప్పుడు సోమ్లి అంత బాధ పడిందో లేదో గానీ, మంగ్లిని వదిలి పెట్టటానికి మాత్రం బాగా ఘర్షణ పడింది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు చీకటి పడుతుండగా మంగ్లి వెళ్ళిపోయింది. మంగ్లి కూడా అంత ఈజీగా పోలేదు. మొండికేసింది. మొరాయించింది. మంగ్లిని విడిచి పెట్టిన రోజు సోమ్లి నిద్ర పోలేదు. మంగ్లి వస్తువులను తడిమి, తడిమి చూసింది. తెల్లవార్లు వెక్కి, వెక్కి ఏడ్చింది.

‌‌విప్లవోద్యమ పరిస్థితిని బట్టి పిల్లల్ని దగ్గర ఉంచుకోలేం. అలాగని ఎవరికైనా ఇద్దామంటే…మనసు ఒప్పదు. ఈ రెండింటి మధ్య బాగా ఘర్షణ పడుతూ నలిగిపోయింది సోమ్లి. చివరికి వదిలి పెట్టటానికి సిద్ధపడింది. ఇప్పుడు సోమ్లి ఊర్లోకి పోయినప్పుడు మంగ్లి వయసు పిల్లలు ఎవరొచ్చినా ముద్దాడుతుంది. మురిసిపోతుంది. మంగ్లికి అందించిన స్వచ్ఛమైన ప్రేమను అందిస్తుంది.

 అది అమ్మ ప్రేమంటే…

‌‌ఇది రాస్తున్న సమయంలోనే ఒక విషాద వార్త చెవిన పడింది. అక్టోబర్ 31 వ తారీఖున ఉత్తర బస్తర్ డివిజన్ లో బూటకపు ఎన్‌కౌంటర్. కామ్రేడ్స్ దర్శన్, జాగేష్ ల అమరత్వం. నేను ఇష్టంగా పిలుచుకొనే ‘బక్కసారూ’, అదే జాగేష్ గురించి కొన్ని వాక్యాలు…

‌‌కాంకేర్ జిల్లా అంతాగఢ్ బ్లాక్ లోని ఆమబేడ స్టేషన్ పరిధిలోని కోత్తుకోడు పంచాయతీలో ఉన్న హీరనపార గ్రామంలో కామ్రేడ్ జాగేష్ జన్మించాడు. వయసు 28 సంవత్సరాలు. జాగేష్ కి అమ్మా, నాన్నలు ముద్దుగా పెట్టిన పేరు బిశ్రామ్. పాడి హలామి. 2009లో విప్లవోద్యమంలో భాగమయ్యాడు. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. బక్క పల్చగా, గట్టిగా గాలేస్తే పడిపోయేటట్లు ఉన్న ఆకారం జాగేష్‌ది. మొట్ట మొదట జాగేష్ ను చూసినప్పుడు చిన్నప్పటి ఒక సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది.

‌‌’నేను, చెల్లాయ్ రోజూ ఉదయం 8 గంటలకు స్కూలు కి బయల్దేరే వాళ్ళం. మా ఇంటి నుండి రోడ్డుకి 500 గజాల దూరం. మేం ఇంటి నుంచి బయల్దేరి రోడ్డు మీదకొచ్చేటప్పటికీ రోడ్డు మీద కనపడే ఒక దృశ్యం మాకు నవ్వాగకుండా చేసేది. ఎవరన్నా చూస్తారేమోనని చేయి అడ్డం పెట్టుకొని మరీ నవ్వేవాళ్ళం. బక్కగా, గట్టిగా గాలేస్తే పడిపోయేటట్లున్న ఒకబ్బాయిని చూసి. ఆ అబ్బాయి నడక కూడా నిటారుగానే. రోజూ ఇదే  దృశ్యం, కరెక్ట్‌గా ఎ.పి.టి. పెట్టుకున్నట్టు.

‌‌మొదటి సారి జాగేష్ ను చూసినప్పుడు ‘బెద్దమ్ ఇచ్చున్ పతలా మంతిన్, వడి వాత్తే ముట్టివిన్ బా?’ (ఎంటీ ఇంత బక్కగా ఉన్నావ్! గాలేస్తే పడిపోవ్ గదా!) అడిగాను.

నవ్వి ‘ఊడకల్ బోర్ ముట్టింతోర్’ (చూద్దాం ఎవరు పడతారోనని) అన్నాడు.

‌‌జాగేష్ అంటే వాళ్ళ అమ్మకు ఎంతో ప్రేమ. అమ్మ ఊహించని నిర్ణయం జాగేష్ తీసుకొన్నప్పుడు అన్ని విధాలా ఆలోచించింది. అడ్డు చెప్పకపోగా ప్రోత్సహించింది. అప్పుడప్పుడు వచ్చి చూస్తే చాలనుకొంది. కానీ సంవత్సరాల తరబడి కొడుకు కనపడక పోయినా బాధ పడలేదు. తన కొడుకు లాంటి కొడుకులను, కూతుళ్ళను చూసి మురిసిపోయేది. అందరినీ ప్రేమగా పలుకరించేది. కమ్మని వంటలు చేసేది. కొసరి, కొసరి వడ్డించేది. వచ్చిన పని పూర్తయి తిరిగి వెళ్ళిపోతున్న కొడుకులకు, కూతుళ్ళకు దుఃఖాన్ని ఆపుకొని వీడ్కోలు పలికేది.

ఇది ‘అమ్మ ప్రేమంటే’…

‌‌ఎక్కడ్నుంచి వచ్చారో, ఎవరు కన్నారో తెలియక పోయినా వారిని ఆదరించి, అక్కున చేర్చుకొని ‘మేం ఉన్నాం గదా! ఏం కాదు మీకు!’ అని కొండంత భరోసా ఇస్తున్నారే…అదిగో అటువంటి ‘అమ్మలు’ అటువంటి ‘అమ్మ ప్రేమ’ కావాలిప్పుడు. తెగువ, ధైర్యంతో పెరిగిన కొడుకులు, కూతుళ్ళు కావాలిప్పుడు. అప్పుడే సమాజ మార్పు కోసం జరిగే పోరుబాట సుగమమవుతుంది.

‌‌జాగేష్ అమరత్వానికి కొన్ని నెలల ముందు అమ్మ చనిపోయింది. జాగేష్ లేడన్న చేదు నిజాన్ని విని, మానసికంగా కుంగి క్రుశించి. ఈ విషయం బతికున్న జాగేష్ కు తెలియదు.

‌‌ఒకరి గురించి మరొకరికి తెలియని విషమ పరిస్థితి. ‘సమాధాన్ దాడి’. ఈ దాడి పల్లెను వదల్లేదు, పట్టణాలను వదల్లేదు. అంతా కార్పోరేటీకరణ-సైనికీకరణ మాయ. ప్రశ్నించిన వారిని ‘అర్బన్ మావోయిస్ట్’, ‘పెగాసస్’ ప్రకంపనలతో సన్మానం. తమ లాభాలకనుగుణంగా  5 జి దాడి.

‌‌ఈ స్పీడు యుగంలో ఆకాశంలో చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమ ఉండదు; కిటికీల్లోంచి కువకువలాడే పిట్టల్ని చూసి ఆనందపడే బాల్యమూ ఉండదు. ఒకర్ని ఒకరు పట్టించుకోని డిజిటల్ (స్వార్థపూరిత) యుగం. ఈ డిజిటల్ యుగం కోసమే మోడీ నవంబర్ లో ఢిల్లీలో ‘తీవ్రవాదం-ఆర్థిక వనరు’ విషయంపై పెట్టిన మీటింగు. ఇదంతా రేపటి మరో నూతన దాడి కోసమే. పేరు ఏదైనా పెట్టొచ్చు. సమాధానానికి కాలం చెల్లిపోయింది కనుక.

‌‌కానీ కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, ఎవరి కోసం ఆగదు. కోట్లమంది ప్రజలకు విప్లవోద్యమమే  ఆశాజ్యోతి. విప్లవకారుల అమరత్వం వారికొక ప్రతీక, ఒక సింబల్. అందుకే కామ్రేడ్స్ యోగిత, జాగేష్ ల అమరత్వం స్ఫూర్తిగా ప్రకృతిని, సమాజాన్ని ఆరాధించే, ప్రేమించే, కాపాడే పిల్లలు మళ్ళీ, మళ్ళీ పుడతారు. అమ్మల ప్రేమను తెగింపుగా మలుచుకొని.

‌‌వేలమంది కామ్రేడ్స్ ను బలి తీసుకున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ విధానాలను తిప్పికొడదాం! ఘమాసాన్ ను ముందుకు నడిపిద్దాం! అదే అమ్మలకిచ్చే, అమ్మ ప్రేమకిచ్చే నిజమైన కానుక.

(పిల్లల్ని కోల్పోయిన అమ్మలందరికీ…)

One thought on “విప్లవానికి వెలుగునిచ్చే అమ్మ ప్రేమ…

Leave a Reply