ఇది విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. 1925 ఆగస్టు 9న అంటే ఇప్పటికి తొంభై ఏడేళ్ల క్రితం కాకోరీ రైలునాపి ఖజానా కొల్లగొట్టిన విప్లవాకారుల బృంద నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. కాకోరీ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన నేరారోపణలో శిక్షలు పడిన విప్లవకారుల కథ. వీరిలో రాంప్రసాద్ ‘బిస్మిల్’, అష్ఫఖుల్లా ఖాన్ ‘వారాసీ’, రాజేంద్రనాథ్ లాహిరి స్వయంగా ఖజానా కొల్లగొట్టిన ఘటనలో పాల్గొన్నవారు. వీరిలో రాజేంద్రనాథ్ లాహిరిని అప్పటి సంయుక్త రాష్ట్రాల (ఇప్పటి ఉత్తరప్రదేశ్) గోండా జైలులో నిర్ణీతమైన తేదీకి రెండు రోజుల ముందే 1927 డిసెంబర్ 17న ఉరి తీశారు. ఎందుకంటే అతన్ని నిర్ణీత తేదీకి ముందే జైలు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం అంది జైలర్ భయపడి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మిగతా ముగ్గురిని బిస్మిల్, అష్ఫక్, రోషన్ సింగ్‌లను 19 డిసెంబర్న ఉరితీసారు. కనుక బిస్మిల్ ఆత్మకథ అనువాదం చేసిన ఇంగువ మల్లికార్జున శర్మ అనుబంధాల్లో అమరులు రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, అష్ఫఖుల్లా ఖాన్ ‘వారాసీ’ల గురించి కూడా సంక్షిప్త అనువాదాలు చేసాడు. ప్రసిద్ధ విప్లవకారుడు, రచయిత శివశర్మ, రాంప్రసాద్ తల్లిగురించి రాసిన పరిచయం ‘నా డైరీలో ఒక పేజీ’ కూడ ఇందులో ఉండడం ఎంతో సముచితంగా వుంది. ఈ అనువాదానికి మల్లికార్జున శర్మ మన్మధనాథ గుప్తా అనే మరో విప్లవకారుడు, కాకోరీ కుట్ర కేసులో యావజ్జీవ శిక్ష పడిన రచయితతో ముందుమాట రాయించాడు.
రాంప్రసాద్, అష్ఫాక్‌ల అపూర్వ స్నేహం గురించి ఈ పుస్తకం గానీ, యశపాల్ రాసిన ‘సింహావలోకనం’ (ఆలూరి భుజంగరావు గారి అనువాదం) గానీ చదవని వారికి కూడ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇద్దరూ ఎంత విప్లవకారులో అంతటి స్నేహితులు, అంతటి కవులు కూడ. రాంప్రసాద్ ‘బిస్మిల్’ పేరుతో కవిత్వం రాయడమే కాకుండా బోల్షివిక్ విప్లవం గురించి, విప్లవపార్టీ నిర్మాణం గురించి, ఇంకా ఎన్నో రచనలు చేశాడు, అనువాదాలు చేశాడు. అష్ఫాకుల్లా ఖాన్ ‘వారాసీ’ అనే పేరుతో కవిత్వం రాశాడు. ఉరిశిక్ష పడిన తరువాత వేరు వేరు జైళ్లలో ఉంచినప్పటికీ ఉరిశిక్షకు ముందు ఇద్దరికీ కలుసుకొనే అవకాశం వచ్చింది. అంతకు ముందు విప్లవ పార్టీ రహస్య కార్యకలాపాలలో కలిసి పని చేశారు. నిజానికి విప్లవకారులుగా జీవిక కోసం, అంతకన్నా ముఖ్యంగా ఆయుధాలు కొనడం కోసం, విప్లవ ప్రచారానికి పత్రికలు, పుస్తకాలు, కరపత్రాలు వంటివి ప్రచురించడానికి, తలదాచుకోవడానికి, శత్రు దృష్టి పడకుండా తరచూ ఆవాసాలు మార్చడానికి, ప్రయాణాల ఖర్చుల కోసం డబ్బు అవసరమైనప్పుడు ఏం చేయాలన్నది ఏ విప్లవ నిర్మాణానికైనా, ముఖ్యంగా అది సాయుధ విప్లవ పార్టీగా రహస్యంగా పని చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్య సమస్యే అవుతుంది. వ్యక్తుల దగ్గర, వాళ్లు ఎంత ధనవంతులైనా దోచుకోవద్దు అనే కఠోర నిర్ణయం వల్ల తర్జన భర్జన చేసి ప్రభుత్వ ఖజానాలు అయితే దోచుకోవచ్చు, దాడి చేయవచ్చు అని నిర్ణయించుకున్నారు.
ఈ విప్లవ బృందం ఉంటున్న, పని చేస్తున్న చోట అనుకూలంగా ఉన్న కాకోరి రైలును దోపిడీ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు అష్ఫాక్ నిజానికి తీవ్రంగా వ్యతిరేకించాడు. రైలు, రైల్వే ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అతి ముఖ్యమైన శాఖ కనుక తీవ్ర రాజ్య నిర్బంధం వస్తుందని హెచ్చరించాడు. కానీ తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగి దాడిలో, చర్యలో అష్ఫాక్ గూడ పాల్గొనాలనే నిర్ణయం జరిగాక మాత్రం ఆయన క్రియాశీలంగా పాల్గొనడమే కాకుండా ఆ ఖజానా పెట్టెను గొడ్డళ్లతో పగులగొట్టి డబ్బును అందులో పాల్గొన్న మూడు బృందాలకు పంచడంలో కూడా ప్రధాన భూమిక నిర్వహించాడు.
తెలంగాణలో కొండపల్లి నాయకత్వంలో విప్లవ పార్టీ నిర్మాణం జరిగినాక నిధుల సేకరణ కొరకు గార్ల (అప్పటి వరంగల్ జిల్లా) రైల్వే స్టేషన్ దగ్గర గార్ల ఒడ్డున విప్లవ దళం దాడి చేసి రైల్వే రిజర్వు పోలీసుల నుంచి ఆయుధాలు కూడ స్వాధీనం చేసుకున్న ఉదంతాన్ని శివసాగర్ ‘నీకిస్తా తమ్ముడా’ అనే గీతంలో వర్ణిస్తాడు.
తర్వాత కాలంలో విప్లవకారులు, సానుభూతిపరులు, విప్లవ రచయితలపై పభుత్వం పెట్టిన సికిందరాబాదు కుట్ర కేసులో ఈ గార్ల దగ్గర రైలుపై దాడి, నడిగూడెం బ్యాంకు దోపిడీ వంటి చర్యల ప్రస్తావన వస్తుంది.
ప్రభుత్వ ఆస్తులపై దాడి, స్వాధీనం అనే చర్యలను షహీద్ భగత్ సింగ్ రాజకీయ విప్లవానికి అవసరమైన ఆర్థిక చర్యలుగా పేర్కొన్నాడు.
విప్లవపార్టీకి అన్నము, ఆశ్రయమూ వంటి సాధారణ అవసరాలన్నీ ప్రజలే సమకూరుస్తారు. సమాచార సేకరణ, సంబంధాలు వంటివి కూడ ప్రజలు, సానుభూతిపరులు చేయగలరు. కాని ఆయుధాల కొనుగోలు, అది కూడా రహస్యంగా కొనుగోలుకు ఇటువంటి దాడులు అనివార్యమవుతాయి. విప్లవ పార్టీ తనకు తాను ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారు చేసుకునేదాక ఇందుకు ప్రధాన వనరు శత్రువే. అంటే ముఖ్యంగా రాజ్యం, ఆయుధాలు కలిగివుండే పాలకవర్గాలు. అందుకే చైనా విప్లవకాలంలో ఒక జానపద గీతం ప్రచారంలో వుండేది. “ఆహారం, ఆశ్రయం ఎవరు ఇస్తారు – ప్రజలు. ఆయుధాలు ఎవరు ఇస్తారు – శత్రువు”
* * *
రాంప్రసాద్ బిస్మిల్ తన ఆత్మకథ రాసిన పద్ధతి ఒక అత్యంత నిజాయితీ పరుడు, విప్లవ నిబద్ధత, నిమగ్నత కలిగిన నిర్భీతవీరుడు రాసిన ఆత్మవిమర్శ వలె వున్నది. ఆ ఆత్మ (స్వీయ) విమర్శ చేసుకొని ఆయన వచ్చిన నిర్ణయాలతో మనకివాళ ఏకీభావం వుండకపోవచ్చు కాని ఆయన విప్లవంలోకి వచ్చిన కాలంలో, సామాజిక నేపథ్యం, రాజకీయ వాతావరణంతో పోల్చినప్పుడు ఆయనను నడిపించిన బ్రిటిష్ వలసవాద వ్యతిరేక దేశాభిమానం, దేశభక్తి నిరుపమానమైనవి.
మనమందరం అవిభక్త ఉత్తర ప్రదేశ్‌లో (అప్పటి సంయుక్త రాష్ట్రాలు) చంబల్ వ్యాలీ గురించి వినే వుంటాం. చంబల్ వ్యాలీ గురించి బ్రిటిష్ సామ్రాజ్యవాద వలసపాలకులైనా, ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ్ వరకైనా మనకిచ్చిన అవగాహన అక్కడ దారిదోపిడీలు చేసే బందిపోట్లు వుంటారని, మండ్యా రాజు వి పి సింగ్ మొదలుకొని గోరఖ్‌పూర్ పీఠాధిపతి ఆదిత్యనాధ్ వంటి ముఖ్యమంత్రుల దాకా ఇక్కడి దళిత, అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఈ ‘బందిపోట్ల’ సమస్యను ఇప్పటికీ ‘ఎన్కౌంటర్ల’ ద్వారానే పరిష్కరిస్తున్నారు. జయప్రకాష్ నారాయణ్ పేరు విడిగా ఎందుకు ప్రస్తావించానంటే ఆయన వాళ్ల సామాజిక నేపథ్యాలను అర్ధం చేసుకొని వాళ్లను సంస్కరించే ప్రయత్నం చేశాడు. అయితే చంబల్ వ్యాలీ నుంచి ఒక ఫూలన్ దేవి ఇటువంటి గాథలతో మనకు పరిచయమై పార్లమెంటరీ రాజకీయాల్లో విజయం సాధించాక, ఆమె జీవితం ఆధారంగా వచ్చిన సినిమా(లు), పుస్తకాలు (తెలుగులో కూడా) చదివాక గానీ మనకు ఎంతో కొంత చంబల్ వ్యాలీలోని దళిత, అణగారిన కులాల, వర్గాల జీవితాలు, పోరాటాలు అర్థం కాలేదు.
విచిత్రంగా రాంప్రసాద్ చంబల్ వ్యాలీలో అటువంటి నేపథ్యం కాకుండా, అందుకు భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చాడు. స్థానిక ప్రభువులకు, ప్రభుత్వాలకు శిస్తులు చెల్లించడానికి నిరాకరించే బ్రాహ్మణ భూకామందుల వంశం నుంచి, ముఖ్యంగా అందుకు జగమొండి వాళ్లుగా పేరు పొందిన రెండు ఊళ్లలో ఒక ఊరి నుంచి వచ్చినవాడు. బహుశా ఈ పరిచయం ఆయన మనకు తన రక్తంలో రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని, పాలకులను మొండిగా ప్రతిఘటించే జీన్స్ ఉన్నదని చెప్పడానికి తన వంశచరిత్ర చెప్పి ఉంటాడు. అయితే ఆయన తాత కాలానికి ఇంట్లో దరిద్రం తాండవించి బతుకు దెరువుకు షాజహాన్పురాకు పోవాల్సి వచ్చింది.
తండ్రి పదిహేనురూపాయల కొలువు పొందేవరకు కూడ ఎంత దారిద్ర్యం అనుభవించారో రాశాడు. తిండికి కూడా ఎంత కటకట పడినారో….
అట్లాగే ఎంతో అణచివేత అమలయ్యే బ్రాహ్మణ కుటుంబాల్లో స్త్రీలే ఎంత వ్యక్తిత్వం గలవారుగా రూపొందుతారో నాయనమ్మ, తన అమ్మల ఉదాహరణ నుంచే రాస్తాడు. ఇల్లు నడపటం, వ్యవహారాల విషయంలో సమర్థురాలైన నాయనమ్మ విశ్వాసాల విషయంలో ఎంత కరడుగట్టిన పితృస్వామ్య భావాలు కలిగిందో కూడ రాస్తాడు. తనకు చెల్లెళ్లు పుట్టి, వాళ్లకు పెళ్లిళ్లు కూడ అయ్యాయంటే తమ వంశంలో నాయనమ్మ మాటను కాదని తన తల్లి ఆడపిల్లలను కనిపెంచాలని నిర్ణయం తీసుకోవడమే కారణమంటాడు.
అట్లానే పెంచిన నాయనమ్మ తనకు తాను బతికి, పెళ్లి చేసుకుని వ్యవహర్త ఎట్లా కాగలిగిందో ఎపుడయినా ఊహించిందా అనిపిస్తుంది.
ఇంక భూస్వాములు, జమీందారులు దళితులపై అమలుచేసిన దారుణమైన అణచివేతను ఒక మాదిగ స్త్రీ పెళ్లి చేసుకొని అత్తగారి యింటికి వచ్చి అప్పటి ఆచారాల ప్రకారం జమీందారు పాదాలకు పాదాభివందనం చేసినపుడు ఆమె పట్టా గొలుసులు పెట్టుకున్నందుకు, ఆమె పాదాలను తొక్కి నలిపేసిన ఉదంతం రాస్తాడు.
అయితే ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్ జిల్లాలో దళిత యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు, అందుకు రాజ్యం మద్దతు, ఆ కథనాలు చదువుతున్న మనకు ఇప్పుడు ఆ గతం కూడ ఏమీ ఆశ్చర్యం కలిగించదు.
రాంప్రసాద్ బిస్మిల్ తన ఆత్మకథలో ఆ మాత్రమైనా రాయగలిగాడు. అందుకోసం కాకున్నా, ఉరిశిక్ష పడిన విప్లవకారుడుగా ఆయన రాసిన ఆత్మకథ జైలు నుంచి బయటికి రాగలిగింది. అచ్చయింది, నిషేధించబడింది. మర్యాదస్తులైన ప్రసిద్ధ రచయితలు పట్టించుకోకున్నా తెలుగులో వచ్చి మనం కూడా చదువగులుగుతున్నాం.
కాని ఇవ్వాళ హథ్రాస్ అనేది ఒక ఊరు పేరు కాదు. ఒక దళిత జీవితం పట్ల, దళిత యువతి జీవితం పట్ల, వయసు పట్ల బ్రాహ్మణీయ భావజాలానికీ, రాజ్య స్వభావానికీ ప్రతీక అయింది. అయితే అటువంటి హథ్రాస్‌లో వాస్తవంగా ఏం జరిగిందో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మూలాల్లోనికి కూడా వెళ్లి చెప్పగలిగిన సిద్ధీఖి కప్పన్లకు, అతికుర్ రహమాన్‌లకు అక్కడికి ప్రవేశం లేదు. హథ్రాస్ వాస్తవాలు తెలుసుకోదలుచుకున్న జర్నలిస్టులు ఇవ్వాళ ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాల దృష్టిలో టెర్రరిస్టులు. దేశద్రోహులు.
రెండవ ప్రపంచ యుద్ధానికి, ఆ మాటకొస్తే రాంప్రసాద్ పుట్టిన మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వపు దేశానికీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కూ ఈనాటి ఉత్తరప్రదేశ్‌కూ స్త్రీ, దళిత స్త్రీ స్థితిగతుల్లో తేడా ఉందా? మాయావతి పలుమార్లు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అనే ఆలోచనలకి ఈ పుస్తకంలో దళిత జీవితాల స్వల్పమైన సమాచారమే నాకు ప్రేరణ అయింది.
రాంప్రసాద్‌కు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పవద్దని వాళ్ల అమ్మ చెప్పింది. నిజాయితీగా, నిర్భయంగా బతకమన్నది.
అందుకే నాయనమ్మ వ్యక్తిత్వంలో, వైరుధ్యాలు మాత్రమే కాదు అవి యాదృచ్చికమే గానీ..
ఇంక తన బలహీనతలు, దొంగతనాలు, భంగు తాగడం వంటివి కూడా ఏమీ దాచుకోకుండా చెప్పాడు. తండ్రి డబ్బులే దొంగిలించి పట్టుబడి దెబ్బలు తిన్నాడు. బడిలో చేర్పిస్తే ఎగ్గొట్టి వ్యసనపరుడయ్యాడు. చదువుకోవడం లేదని తండ్రి చితకగొడితే గాయపడి కదలలేని స్థితికి వచ్చాడు. తాను చేసిన తప్పులకు తండ్రి కొట్టిన దెబ్బలకు శరీరం అంతా ఎన్ని గాయాలై కదుములు కట్టాయంటే ఎంతో వ్యాయామం చేసి సుదృఢమైన తన శరీరం, తర్వాత కాలంలో పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడానికి కూడ సిద్ధమైందంటాడు.
ఒక సంకల్పం నడిపించిన విచిత్రమైన జీవితం అది. వ్యసనాల నుంచి వ్యాయామం దాకా చివరకు బ్రహ్మచర్యం పాటించడమే కాకుండా విప్లవంలోకి వచ్చేవాళ్లు పాటించాలనిపించేంత కఠోర క్రమశిక్షణను కూడ అలవరచుకున్నాడు. అయితే తల్లి చేసిన బోధనలు, ఆచరణ, ఆ తర్వాత కాలంలో ఆర్య సమాజ్ గురువుల ప్రభావం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ అలవడింది. విప్లవాచరణలో అవే నిలుపుకున్నాడు.
“విద్యాబుద్ధుల విషయంలోనే కాదు విప్లవజీవితంకు సంబంధించి కూడ ఆమె ప్రోత్సాహం వలనే, ఆమె సవ్యవహారం వల్లనే తాను దృఢ సంకల్పుడై, ఎంతటి ప్రమాద స్థితి వచ్చినా ఎంత క్లిష్ట పరిస్థితి ఏర్పడినా తన సంకల్పాన్ని వదిలి పెట్టనంత దృఢ దీక్ష అలవరచుకున్నానని” రాంప్రసాద్ తన అమ్మ గురించి రాస్తాడు. “మా అమ్మగారు నాకిచ్చిన ఆదేశం ఎవరికీ హాని తలపెట్టకూడదనే. ప్రాణహాని కలిగించకూడదనేదే. నీ శత్రువుకైనా సరే ఎప్పుడూ మరణదండన యివ్వవద్దని ఆమె కోరేది. ఆమె యిచ్చిన ఈ ఆదేశాన్ని పాటించడానికిగాను నేను ఒకటి రెండుసార్లు ప్రతిజ్ఞాభంగం చేయడం తప్పనిసరైంది కూడా”…
రాంప్రసాద్ బిస్మిల్ మాత్రమే కాదు, కాకోరి కుట్ర కేసులో ముద్దాయిలందరూ, ఒక శతాబ్దం క్రితమే చట్టాల్లో, శిక్షాస్మృతిలో మరణదండన ఉండరాదని, ప్రాణాన్ని తీయగలమే కాని తిరిగి ఇవ్వలేమని విశ్వసించారు.
ఉరి తీయడానికి ముందు రోజు రాంప్రసాద్‌ను కలవడానికి ఆయన కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు. తల్లి తట్టుకోలేదని ఆమెకు చెప్పకుండానే తండ్రి గోరఖ్‌పూర్ జైలుకు బయల్దేరి పోతాడు. కాని బిస్మిల్ తల్లి శివశర్మను వెంటబెట్టుకొని వెళ్లి ములాఖాత్ సమయానికి అక్కడికి చేరింది. జైలు అధికారులు ఈ పిల్లవాడు ఎవరంటే మా చెల్లెలు కొడుకు అని చెప్పింది. తల్లిని చూసి రాంప్రసాద్ ఏడ్వసాగాడు, కానీ అమ్మ కళ్లలో ఒక్క నీటి చుక్కయినా లేదు. ఆమె గొంతెత్తి బిగ్గరగా ‘నా కొడుకు వీరుడు. అతని పేరు వింటేనే బ్రిటిషు ప్రభుత్వం వణికిపోతుంది అని నేను అనుకుంటూ వస్తున్నాను. కాని వాడు చావంటే భయపడతాడని నాకు తెలియదే. ఏడుస్తూ చావాలనుకుంటే అసలీ పనిలో వృథాగా వేలెందుకు పెట్టావురా’ అని కూకలేసింది. బిస్మిల్ తేరుకొని ఆమెను ఓదార్చాడు. చావంటే భయం వల్ల కాదు, అమ్మంటే అనురాగం వల్ల కన్నీరు ఉబికి వచ్చిందని చెప్పాడు. అమ్మ నా చెయ్యి పట్టి లాగి నన్ను ముందుకు తోసింది. ఇతడు మీ మనిషే. పార్టీ విషయంలో ఏం చెప్పాలనుకుంటే అది యితనికి చెప్పవచ్చు అని రాంప్రసాద్‌కు చెప్పింది. అప్పుడామె స్థిర చిత్తం, ధీర స్వరూపం చూచిన జైలు అధికారులంతా “ఇలాంటి వీరమాత కొడుకు వీరుడు కాకుండా ఎలా పోతాడ”ని వ్యాఖ్యలు చేయసాగారు.
ఇది చదువుతుంటే నా కళ్ల ముందు ‘తల్లులు బిడ్డలు’ (హుస్సేన్) నవలలోని బెల్లంపల్లి గజ్జెల లచ్చవ్వ తల్లి రూపమే మెదిలింది.
“స్వతంత్ర భారత దేశ చరిత్ర రాయబడేటప్పుడు, అప్పుడు అందులో ఏదో ఒక పుటపై నీ పేరు కూడ ఉజ్వలంగా రాయబడుతుంది. తన కొడుకుల మరణవార్త విన్న గురుగోవిందసింగ్ జీ ధర్మపత్ని ఎంతో ఆనందంతో గురువు కోసం, ధర్మ రక్షణార్ధం ప్రాణాలు బలి యిచ్చిన తన వీర పుత్రుల స్మరణలో మిఠాయిలు పంచిపెట్టింది. జన్మనిచ్చిన ఓ తల్లీ! తుది ఘడియల్లో నా హృదయం ఏ ప్రకారంగానూ విచలితం కాకుండా నీ చరణ కమలాలకు ప్రణమిల్లి పరమాత్ముని స్మరిస్తూ నేను ఈ శరీరం త్యాగం చేసేటట్లు నాకు వరమీవమ్మా” అని బిస్మిల్ రాసుకున్నాడు.
దీనిని బట్టి, తర్వాత తన గురుదేవుల గురించి రాసినదానిని బట్టి రాంప్రసాద్ బ్రిటిష్ వలసవాదం నుంచి విముక్తికి ఎంచుకున్న మార్గం ఆర్య సమాజ్ మార్గంలో చివరివరకు సాగిందని, ఆయన చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో విప్లవపార్టీలో పని చేయగలిగాడు గానీ భగత్ సింగ్ సంపర్కంలోకి రాలేదని అర్థం చేసుకోవచ్చు. ఆయనపై కాంగ్రెస్‌లో అతివాదిగా గుర్తింపు పొందిన తిలక్ ప్రభావం ఎంత బలంగా ఉందో కూడ ఈ పుస్తకంలో వివరమైన ఘట్టం వుంది. లాలా హరదయాళ్ వంటివాళ్ల ప్రస్తావన ఉన్నప్పటికి అప్పటి ఉత్తరప్రదేశ్ వాతావరణంలో ఆయనపై గదర్ పార్టీ ప్రభావం కూడ లేదని గ్రహించవచ్చు. ఇది ఇప్పటి పాఠకులకు ఆశ్చర్యమే కలిగించవచ్చు.
రాంప్రసాద్ బిస్మిల్ బోల్షివిక్ విప్లవంతో కూడా చాల ప్రభావితుడయినాడు. ఆ కార్మికవర్గ విప్లవం గురించి ‘కాథరాయన్’ అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశాడు. కాకోరి కుట్ర కేసులో అరెస్టయినాక ఆయన తన రహస్య విప్లవపార్టీ కార్యకలాపాలనన్నింటినీ విశ్లేషించుకొని సరియైన విప్లవశక్తుల్ని సమకూర్చుకోలేకపోయామని, కార్మికులను, రైతాంగాన్ని సమీకరించి సంఘటితపరిచి ప్రజల్లోకి పోలేకపోయామని, అందువల్ల ఇంక విప్లవ పార్టీని రద్దు చేసుకొని సంస్కరణ పంథా చేపట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. విప్లవానికి జనం విద్యావంతులు కావడం ముందస్తు అవసరంగా భావించాడు. ఆర్యసమాజ్ హిందూ మత సంస్కరణకు, జ్ఞానానికి, హవనానికి చాలా ప్రాధాన్యమిచ్చి దయానంద ఆర్య విద్యా (డిఎవి) పాఠశాలలు విస్తృతంగా స్థాపించడమనేది ఈ నాటికీ చూడవచ్చు. బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఇంగువ మల్లికార్జున శర్మ ఇలా రాసి ఉంటాడు: “…. ఆ రోజుల్లోనే ఆయన తర్వాత విప్లవకారులు – భగత్ సింగ్, భగవతీ చరణ్ ఆజాద్ ప్రభృతులకు కొంత నిరాశను, వైముఖ్యాన్ని కలిగించాయని కూడా తెలుసు. అయినప్పటికీ అయిదేళ్లు తిరుగక ముందే దేశవ్యాప్తంగా భీభత్సవాద కార్యక్రమాలను విసర్జించి విప్లవకారులు ప్రజా ఉద్యమ నిర్మాణానికి సంఘ నిర్మాణ కార్యకలాపాలకు ద్విగుణీకృత ఉత్సాహాలతో పూనుకోవడం కూడా ఎంతైనా గమనార్హం…”.
ఇదే విషయాన్ని సోషలిస్టు విప్లవ కోణం నుంచి విశ్లేషిస్తూ మన్మథనాథ గుప్తా ఈ పుస్తకానికి రాసిన ముందుమాట బిస్మిల్ జీవసారాన్ని మాత్రమే కాదు ఈ పుస్తక సార్ధక, అవసర సారాన్నీ యిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి అవసరమైన విప్లవ ప్రజాస్వామిక లౌకిక వాదాన్ని బిస్మిల్ తన జీవితంలో ఆచరించడమే కాదు భారత దేశ విముక్తికి మార్గంగా ఆయన ప్రతిపాదించాడని కూడా అర్ధమవుతుంది. “భారత స్వాతంత్ర్య సాధన కోసం 1857 నుండి 1947 దాకా సాగిన విప్లవోద్యమంలో ఒక మహత్తరమైన, గణనీయమైన అంశమేమిటంటే అది ఎన్నడే గానీ మందపడి నిలిచిపోలేదు. పైగా దినదిన ప్రవర్ధమానవవుతూ వచ్చింది. అజీముల్లా, తాంత్యా తోపేల అస్పష్ట వ్యతిరేక భావాల దశ నుండి పరిపూర్ణ సోషలిస్టు భావజాలానికి కేంద్రంలా ఉండే స్థాయికి ఎదిగింది.”
నిర్దిష్టంగా చెప్పుకోవాలంటే షహీద్ భగత్ సింగ్ విప్లవోద్యమ నాయకత్వంలోకి వచ్చి ఎంతో అత్యున్నత స్థాయిలో తాత్విక ఫిలాసఫీ ఆఫ్ బాంబ్‌లో వివరించి, నేనెందుకు నాస్తికుణ్ణయ్యానని పుస్తకం రాసి పార్లమెంటు అంధత్వాన్ని, బధిరత్వాన్ని బట్టబయలు చేశాక కార్మికవర్గ చైతన్యం ఫాసిజాన్ని ఎదుర్కొనే ఒక పోరాట శక్తిగా మారింది.
మన్మదనాథ గుప్తా భావించినట్లుగానే రాంప్రసాద్, అష్ఫాక్‌ల ప్రగాఢ మైత్రి పాత తరహా లౌకికవాదపు అత్యున్నత దశ అని చెప్పవచ్చు. తదనంతరం భగత్ సింగ్ ఉరిశిక్షతో జైలులో బందీ అయి ఉన్నపుడు అది తర్వాతి ఉన్నత శిఖరాన్ని అందుకున్నదని చెప్పవచ్చు. సోషలిస్టు భావనా శ్రేణుల్లో అది అత్యున్నత శిఖరం.
షహీద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల ఉరితీత తర్వాత దేశంలో పెల్లుబుకిన విప్లవోత్తేజం స్పెయిన్ యుద్ధం, రెండవ ప్రపంచ యుధ్ధాల కాలం నుంచి అంతర్జాతీయ బ్రిగేడ్, ఫాసిస్టు వ్యతిరేక కమ్యూనిస్టు నాయకత్వ ప్రజాస్వామిక వెల్లువ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఇప్టాలు నిర్వహించిన పాత్ర – తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తమ గుణాత్మక స్థాయికి చేరుకున్న అంశాలన్నీ ఇపుడు చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడే వున్నాయి.
1947 హైదరాబాదు రాజ్యంపై నెహ్రూ-పటేల్ సైన్యం దురాక్రమణకు ఇవ్వాళ విమోచన, సమైక్యత పేరుతో వక్రీకరించే సంఘ్ పరివార్, ఫ్యూడల్ దళారీ శక్తుల కుట్రలు ముఖ్యంగా దేశప్రజలను హిందూ ముస్లింలుగా చీల్చి పాలించే 1857 నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాద కుట్ర కొనసాగింపు మాత్రమే.
ఇంక స్థలవిస్తర భీతితో ఈ పుస్తకంలో పరచుకున్న రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ అలీ వారాసీ ప్రాణస్నేహాన్ని, అది పరిమళించే కవిత్వాన్ని వివరించబోవడంలేదు గానీ రాంప్రసాద్ బిస్మిల్‌కు ఎంతో ఇష్టమైన కబీర్ దోహాల అనువాదాన్నయినా చదువుకొని విప్లవంలోని ప్రేమతత్వాన్ని పాఠకులు గ్రహిస్తారని ఆశిస్తాను.
నాగపూర్ అత్యంత భద్రతా కేంద్ర కారాగారంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ, సంకల్పంలో దృఢమవుతూ, శారీరకంగా శిథిలమవుతున్న కామ్రేడ్ జి. ఎన్. సాయిబాబా కూడా అదే ప్రేమ తత్వాన్ని కబీర్‌కు ప్రేమతో కవిత్వీకరిస్తున్నాడు.
రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ అలీ వారాసి, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరిలను ఎన్నిక చేసుకొని ఉరి తీయడంలోనే భారతదేశంలో వైవిధ్య సంస్కృతీ సంఘటనను ఉరి తీసే సామ్రాజ్యవాద మోనోపలీ కుట్ర వుంది.
దేశంలో విప్లవ వర్గపోరాటం ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్యాన్ని కూడా అమలుచేస్తున్న సుదీర్ఘకాల అనుభవంలో ఈ బిస్మిల్ ‘ఆత్మకథ’ నుంచి మనం ప్రతీకలుగా గ్రహించవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే – అది బిస్మిల్ అష్ఫాక్‌ల యుగళ గీతం వంటి శ్రేణులను కలుపుకోవడమే. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సామాన్య ప్రజలు రైతుబిడ్డలుగా హిందూ, ముస్లిం మత విశ్వాసాలతోనే భారత సైన్యంలో చేరి తిరుగుబాటు చేసి చూపారు.
కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసి చూపారు. ప్రగతివాద రచయితల సంఘం పెట్టి ప్రేంచంద్, సజ్జాద్ జహీర్‌లు చేశారు. ఇప్టా ద్వారా బలరాజ్ సహాని, కె.ఎ. అబ్బాస్, ఇంకా ఎందరో రచయితలు, కళాకారులు చేశారు. అన్నిటికన్నా ఆదర్శప్రాయంగా తెలంగాణలో కామ్రేడ్స్ అసోసోయేషన్ తెలంగాణ రైతాంగ ఉజ్వల పోరాటానికి దిక్సూచి అయింది.
రేపు ఉరి తీస్తారనగా ఇవ్వాళ కూడా బిస్మిల్ తన ‘ఆత్మకథ’ రాస్తూనే ఉన్నాడు. అందులో ఆయన ‘తుదివేళ మాటలు’ అని 1927 కాలానికి చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎంత స్మరణీయమో ప్రస్తావించి ఆ అమరవీరుల విప్లవాన్వేషణ ప్రక్రియకి ఒక సాఫల్యమైన అర్థాన్ని ఆవిష్కరిద్దాం.
“… ప్రాణత్యాగం చేస్తున్న ఈ సమయంలో అయ్యో, మా బలిదానాలు వృథా అయిపోయాయే అని నిరాశ చెందడం లేదు… లార్డ్ బర్మన్ హెడ్ బుర్రలో హిందూదేశంలోని హిందూ-ముస్లిం కలహాలను ఉపయోగించుకొని భారతదేశాన్ని బంధించి ఉంచే సంకెళ్ళను యింకా గట్టిగా బిగించే యోచన కలిగించాడని నాకు గట్టి నమ్మకం. కాని తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది. (గయే థే రోజా చోడ్నే – సమాజ్ గలే జడ్గయా). భారత దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వారు హిందువుల్లో దాదాపు అందరూ, ముస్లింలలో కూడా అధిక సంఖ్యాక నాయకులు ఏకగ్రీవంగా రాయల్ కమీషన్ (సైమన్ కమీషన్) నియామకాన్ని వ్యతిరేకించారు. దానిలోని సభ్యుల ఎంపికను తీవ్రంగా వ్యతిరేకించారు… కాకోరీ కేసులో ఉరిశిక్షలు పడ్డ మా దయా ప్రార్థనల్ని వైస్రాయి తోసిపుచ్చిన తక్షణమే నేను శ్రీ మోహన్‌లాల్ సక్సేనాకు ఒక లేఖ రాశాను. హిందూ దేశ నాయకులందరూ హిందూ ముస్లింలందరూ వచ్చే కాంగ్రెస్‌లో కలిసికట్టుగా సమావేశమై మమ్మల్ని స్మరించుకోవాలని అందులో కోరాను. అష్ఫఖుల్లా ఖాన్‌ను రాంప్రసాద్ కుడిభుజమని ప్రభుత్వం వారే ఖరారు చేశారు. పచ్చి ముస్లిం అయిన అష్ఫఖుల్లా ఖాన్ విప్లవ పార్టీలో చేరి, పక్కా ఆర్యసామాజికుడు అయిన రాంప్రసాద్‌కు కుడిభుజం కాగలిగినప్పుడు మరి భారత దేశంలోని హిందువులు, ముస్లింలు తమ తమ చిన్న చిన్న స్వార్థ ప్రయోజనాలను విస్మరించి దేశ స్వాతంత్ర్యం కోసం ఒక్కటి కాలేరా?
….. నేనైతే నా పని పూర్తి చేశాను. మహమ్మదీయుల నుండి ఒక నవ యువకుడిని వెలికితీసి నేను భారత ప్రజలకు చూపించాను. అతడు అన్ని పరీక్షలలో కృతార్ధుడు అయాడు కూడా. కనుక ఇప్పుడు ఎవరైనా గానీ మహమ్మదీయులను నమ్మరాదనే విధంగా మాట్లాడేందుకు సాహసించ లేరు. అదే మొదటి అనుభవం. అయినా పూర్తిగా సఫలమైంది. దేశ ప్రజలను మేము ప్రార్థించేది ఇదే. మేము ఉరికంబాలు ఎక్కడం వల్ల మీకు ఏ కొంత దు:ఖం కలిగినా మీరంతా, హిందూ ముస్లిం ప్రజలంగా.. ఒక్కటవాలనే పాఠం తీసుకోండి…”
దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసినవారు ముగ్గురుంటే అందులో జెడ్ ఎ అహ్మద్, మౌలానీ భషానీ వంటి ముస్లింలు ఇద్దరు వున్నారు.
కామ్రేడ్స్ అసోసియేషన్ అయితే రాజబహదూర్ గౌర్ తప్ప మిగతా అందరూ ముస్లిం మేధావులు – ఆలంఖుంద్ మీరీ వంటి ప్రొఫెసర్, మగ్దూం వంటి కవులు అందులో ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపు యిచ్చిన ముగ్గురు నాయకుల్లో మగ్దూం ఉన్నారు. అన్నదమ్ములను చీల్చాలని పెద్దన్న అబ్బాసలీని విసునూరు దొర చేరదీసి ప్రలోభపెట్టినా బందగీ పోరాడి భూమి కోసం, న్యాయం కోసం తన పోరాటంతో కడివెండి దొడ్డి కొమరయ్యకు, పాలకుర్తి ఐలమ్మకి, కమ్యూనిస్టు పార్టీకి మార్గదర్శి అయ్యాడు. ఇది గత చరిత్ర చదువుకోవడానికి. వర్తమాన ఆచరణయే గీటురాయి కావాలి.
ఇవ్వాళ సంఘ్ పరివార్ బ్రాహ్మణీయ హిందూత్వ భావజాలం వాళ్లు-మనం అనే భేదభావాల విషాన్ని రంగరించి అన్ని రంగాల్లో వెదచల్లుతున్నది.
సిఎఎ వ్యతిరేక పోరాటంలో దేశ ప్రజల పౌరసత్వ పోరాటంలో ముందున్నవారు షహీన్ బాగ్ ముస్లిం మహిళలు. మరి ఇవాళ ముస్లిం ఇళ్లు మాత్రమే కాదు వీళ్ల ఉనికే బుల్ డోజింగ్ చేసే ఆధిపత్య రాజకీయ సంస్కృతి. పిఎఫ్ఐ సభ్యుల పేరుతో ముస్లింలపై దేశవ్యాప్త దాడులను మౌనంతో ఉపేక్షిద్దామా? మన మానవీయతలో అవిభాజ్య భాగమైన రాజకీయ సంస్కృతిని సమైక్యంగా పునరావిష్కరిద్దాం.
ఫెలో ట్రావెలర్