జననాట్యమండలి నిర్దిష్ట విప్లవోద్యమ నిర్మాణ సాంస్కృతిక సంస్థ.  నక్సల్బరీ పంథాను రచించిన చారు మజుందర్ నాయకత్వాన్ని స్వీకరించిన సిపిఐ (ఎంఎల్) పార్టీ ఆట-మాట-పాట అది. ఆ విప్లవ పంథాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవంతో శ్రీకాకుళం సెట్‌బ్యాక్ తర్వాత ఆచరణలో పెట్టాలనుకున్నపుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సంస్థగా డాక్టర్ రాజారావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజానాట్యమండలి అనుభవాల వెలుగులో జననాట్యమండలిని రూపొందించింది. అయితే దీనికి ఇతర ప్రజాసంఘాల వంటి కార్యనిర్వాహక, కార్యవర్గ నిర్మాణం లేదు. 1986లో హైదరాబాదులో రాంనగర్‌లో అప్పటి పీపుల్స్ వారి కార్యదర్శి శ్యాం (నల్లా ఆదిరెడ్డి) అరెస్టయినపుడు పెట్టిన రాంనగర్ కుట్ర కేసులో వేసిన చార్జ్‌షీట్‌లో మొదట పార్టీ ప్రజా సంఘాలుగా చూసిన వాటిలో ఒక్క జననాట్యమండలికే గద్దర్‌ను ఇన్‌చార్జి (బాధ్యుడు – బి విట్టల్, గద్దర్) గా చూపారు. ఫైనల్ చార్జ్‌షీట్‌లో ఇన్‌చార్జి, జననాట్యమండలిని కూడా తొలగించి పార్టీ సభ్యుడు అన్నట్లుగానే మరో రెండు ప్రజాసంఘాల కార్యదర్శులతో పాటు ఉంచారు. అప్పుడాయన అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ ప్రస్తావన ఎందుకంటే జననాట్యమండలి నిర్మాణానికి తానుగా కె.ఎస్ కంటోన్మెంట్‌లో తనకు సంబంధంలో ఉన్న శంకరన్ కుట్టి ద్వారా ఆర్ట్ లవర్స్ సంస్థాపకుడు నర్సింగరావు, గద్దర్‌లను కలుసుకొని చర్చించాడు.

నర్సింగరావు గడీ గోడలను మాత్రమే కాదు బడిలో తరగతి గదుల గోడలను కూడ ఇరుకుగా భావించే ఆదర్శాలకు ఆకర్షితుడయ్యాడు. ‘సాక్షి’ ఆదివారం సంచికలో ఖదీర్ బాబుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు బడికన్నా బడి గోడల మీద పడే ఉదయపు ఎండ ఎంతో ఇష్టమయ్యేదంటాడు.

గద్దర్ తండ్రి గుమ్మడి శేషయ్య డాక్టర్ బాబాసాహెబ్  అంబేద్కర్‌తో ప్రత్యక్ష పరిచయమున్న అంబేద్కరిస్టు. ఔరంగాబాద్ జిల్లాలో మేస్త్రీగా పనిచేసేవాడు. తన కొడుకుకు, కూతుళ్ళకు చదువుకోవాలని చెప్పడమే కాదు, కూతుళ్ళను పెద్ద చదువులు చదివించాడు. కొడుకులకు ఆత్మగౌరవ సూచకంగా నర్సింగరావు, విఠల్‌రావు అని పేర్లు పెట్టాడు. ఇంటి గోడమీద ‘జ్ఞానం వెలుగునిచ్చును’ అని ఎప్పటికీ వెన్నుతట్టే సూక్తినిరాసి పెట్టాడు.  అయితే బడిలో పంతులు విఠల్‌రావు భుజం మీద జందెపు పోగు కనిపించలేదు కనుక రావు తొలగించి పేరు నమోదు చేసాడు. తల్లి లచ్చుమమ్మ,  ‘ఒసే లచ్మీ కైకిలికి వస్తావా’ అంటే ‘రానని’, ‘లక్ష్మమ్మా పనికి పోదామా’ అంటే వస్తాననే ఆత్మగౌరవాన్ని ప్రదర్శించిన సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ.

ఈ ఇద్దరూ ఆర్ట్ లవర్స్‌లో ఉండగానే అటు నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలతో ప్రభావితులైనారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మిలిటెంట్‌గా, ప్రజాస్వామికంగా జోక్యం చేసుకున్నకొల్లిపర రామనరసింహారావు రాజకీయ ప్రమేయానికి లోనయ్యారు. ఆర్ట్‌లవర్స్ జననాట్యమండలిగా రూపొందే దశలో కె.ఎస్, ఐ.విల నుంచి ఎల్.ఎస్.ఎన్ మూర్తి దాకా నూతన ప్రజాస్వామిక వ్యవసాయవిప్లవ పాఠాలు, ఆచరణ, అధ్యయనం చేసారు. ఇద్దరికీ చెరబండరాజుతో సన్నిహిత పరిచయం, అనుబంధం ఉన్నది. అదినిర్మాణంలోకి కూడ వచ్చింది. విరసం ఎం.టి. ఖాన్, రంగనాథంలు నిర్వహించిన పీడితప్రజల పక్ష పత్రిక  1991 నవంబర్ సంచికలో వి. బి. గద్దర్ పేరుతో ‘ఆపర రిక్షోడో’ అనే పాట అచ్చయ్యింది. అట్లా అతని పట్ల ఆసక్తి కలిగింది. ఇప్పుడు శ్రమ దోపిడీ గురించి మనం పాటలు రాయాలి గనుక ‘ఆపర బండోడు’ అనే జానపద శైలిలో మనిషి తొక్కే రిక్షామీద మనిషి కూర్చుని ప్రయాణం చేసే వ్యవస్థ గురించి మేం చర్చించుకున్నామని నర్సింగరావు చెప్పాడు. అది అక్కడితో ఆగలేదు. ‘రక్తంతో నడుపుతాను నా రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు’ అని విశ్లేషించేదాకా ఎదిగింది. కల్లు దుకాణం వాతావరణాన్ని చిత్రించి ‘కల్లు ముంతో మాయమ్మ’ అని శ్రమజీవుల కష్టాలు మరిపించే మద్యపానాన్ని, ‘నన్నేలే రాజ్యానికి మారుపేరువే నీవు’ అని ఎరుక కలిగించి, ఇంక నేను ‘నా రక్తం తాగెటోని రక్తం తాగుతా’ననే సంసిద్ధత వైపు నడిపిస్తాడు. వడ్డెరోళ్ళ గురించి రాసినా, గ్యాంగ్ మెన్‌ల గురించి రాసినా, సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మ గురించి రాసినా, కొమురెల్లి కొండల్లో నిప్పులు రాజేసిన అన్నలు, చెల్లెళ్ల నుంచి ప్రేరణ పొందమంటాడు.

తొలి కళాభినివేశంతో ‘ఓరోరి అమీనోడా ఓరోరి సర్కిలోడా’ వంటి పీడితుల కసిని చిత్రించే పాటలు రాసాడు. ‘జనసేన కదిలిందిరో, ఎర్రసేన కదిలిందిరో’, ‘పోదామురో జనసేనలో కలిసి, ఎర్రసేనలో కలిసి’ వంటి పాటలు దళచర్యల కాలంలోనే, ఇంక ప్రజాపంథా చేపట్టి, దండకారణ్య పర్‌స్పెక్టివ్‌లో ‘జనతన రాజ్యం’ ఏర్పడి ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడక ముందే రాసాడు.

1971లో వీరశైవ హాస్టల్‌లో (ఆర్‌విబిఆర్ మహిళా కళాశాల ఎదురుగా) విరసం రెండవ మహాసభల నాటికి ‘సృజన’ ‘సాహితీ మిత్రులకు’ గాఢ స్నేహమైంది కానీ ఆయన ప్రదర్శన చూసే అవకాశం మాత్రం 73 మే నెలలో అంజలి టాకీస్ దగ్గర ఇచ్చిన గద్దర్ ప్రదర్శనతోనే సాధ్యమైంది. మర్నాడు రాత్రి వీరశైవ హాస్టల్ పక్కన ఉన్న శ్రీపతి ఇంటికి ఆహ్వానించి ‘సాహితీ మిత్రులు’ అప్పటిదాకా ఆయన రాసిన 16 పాటలు విన్నారు. అన్నం తినే కంచం మీద దరువు వేస్తూ పొద్దుపోయే రాత్రి దాకా ఆయన వినిపించిన పాటలు ఒక అపూర్వమైన అనుభవంగా జ్ఞాపకం ఉండిపోయాయి అప్పుడే.

ఆ పాటలు అడిగి తీసుకుని సృజనలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుసగా ప్రచురించి విరసం మొట్టమొదటి సాహిత్య పాఠశాల 1973 అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో నిర్వహించినప్పుడు ఆ 16 పాటలను ‘విబి గద్దర్ పాటలు’ పేరుతో సృజన ప్రచురణలుగా వెలువరించింది.

ఆ తర్వాత ఇంకా జననాట్యమండలి 1977 నాటికి ఒక సమిష్టి నిర్మాణంగా పటిష్టమై నాకు తెలిసినంతవరకు ‘జననాట్యమండలి’ పాటలు గానే వేలు, పదివేలు, లక్షల సంఖ్యలో ఆయనవిగాని, వంగపండువి గానీ, ఇతర పాటల రచయితలవి గానీ కలుపుకొని పేర్లు లేకుండానే వెలువడి విస్తృత ప్రచారాన్ని పొందినవి.

1985-90 అజ్ఞాతం నుంచి బయటికి వచ్చాకనే ఆయన అజ్ఞాతంలో రాసిన ‘ప్రతి పాట వెనుక ఒక కథ ఉంది’  ‘తరగని గని ప్రజలు’ గద్దర్ పేరుతో వెలువడినవి. విప్లవ సాంస్కృతిక విశ్లేషణకు, ప్రజల పాటల, కళారూపాల సృజనకు తరగని గని అని చేసిన ఈ అపూర్వ పరిశోధనకు విశేషాదరణ వచ్చి హిందీ (ఆముఖ్) లోనూ, ఇంగ్లిషులోనూ (వసంతా కన్నభిరన్ అనువాదం) వెలువడినవి. ‘తరగని గని ప్రజలు’ని హిందీలోకి ఎఐఎల్ఆర్‌సి కార్యవర్గ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు, ‘ఆముఖ్’ సంపాదకుడు కంచన్ కుమార్ అనువాదం చేసి, తరువాత పుస్తకంగా కూడా వచ్చింది. బహుశా బెంగాలీలో కూడా వెలువడింది.

వరంగల్ విరసంసాహిత్య పాఠశాల రెండవ రోజు హనుమకొండ జీవన్ లాల్ గ్రౌండ్స్‌లో రాత్రంతా నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జననాట్యమండలియే కాకుండా కానూరి వెంకటేశ్వరరావు, జనసేన, చెరబండరాజు, ఎన్‌. కె (ఈ నలుగురూ అప్పటికి విరసం సభ్యులే) విప్లవ గానాలాపనలతో వేలాది మంది ప్రజలు ఉర్రూతలూగారు. సహజంగానే గద్దర్ ముద్ర ఉండే ఉంటుంది.

సిపిఐ (ఎంఎల్) సిఒసి నిర్మాణమయినట్లు ఒక భారీ ఊరేగింపు, సభల ద్వారా ప్రకటించాలని నిర్ణయం తీసుకుని మేడే రోజు మడికొండ నుంచి ఆజంజాహీ మిల్లు దాకా ఒక భారీ ఊరేగింపు సూరపనేని జనార్ధన్ ఆధ్వర్యంలో, పార్టీ జెండాలతో నిర్వహించబడింది. ఉపన్యాసాల తర్వాత ‘వీర కుంకుమ’ నాటకం, ‘బీదల పాట్లు’ నాటిక ప్రదర్శింపబడినవి. అప్పటికింకా నర్సింగరావు దొర వేషం గద్దర్ వ్యవసాయ కూలి వేషం వేస్తున్నారు. బీదలపాట్లు నాటిక అల్వాల్‌లో ప్రదర్శించడంతోనే జననాట్యమండలి ప్రారంభమైంది. నాటిక వేదిక, సామాగ్రి మొదలుకొని పాత్రల వరకు అది ఎట్లా ఎక్కడ ప్రదర్శిస్తే అక్కడ ఒక గ్రామ  వర్గాల పొందిక రూపంలో ఉంటుందనే విషయం ఈ రచనలో ముందు కూడా వస్తుంది. కానీ ప్రతి నాటకాంతం ‘ఖతం’ కార్యక్రమంతో కానవసరం లేదని మార్క్సిస్టు అమ్ములపొదిలో ‘ఖతం’ అనే కార్యక్రమం శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో చేరిన ఒకానొక పోరాట రూపమే కాని అది ఏకైక పోరాట రూపం కాదని అవగాహనకు అఖిల భారత స్థాయిలో 1969 లోనే పార్టీ కేంద్ర కమిటీలో పనిచేసి కామ్రేడ్ చారు మజుందార్ మరణానంతరం చెల్లాచెదరైన నాయకులు కె.ఎస్, అప్పలసూరి, సునీతి ఘోష్ (బెంగాల్), ష్రాఫ్ (కశ్మీర్) శర్మ (పంజాబ్), యూపీ నుంచి కూడ ఒకరు కలిసి ఏర్పడిన సిఓసి అవగాహన ఇక్కడ ప్రదర్శనలో ప్రతిఫలించి భూస్వామి మీద దాడిని అట్లా స్థగితం చేసి ఆపినప్పుడు, ప్రేక్షకులే వేదిక మీదికి దాడి చేయడానికి లేచారు. వాళ్లను సమదాయించడం కష్టమైంది. అప్పటికే అనంతపురంలో పరిటాల శ్రీరాములు విరసం ఏర్పాటుకు ముందే చైతన్య సాహితి అనే సంస్థ పెట్టి విరసంలో విలీనం చేసి 75 జనవరి మహాసభల్లో విరసం కార్యవర్గ సభ్యుడు అయ్యాడు. 1975 మే నెలలో రాజమండ్రిలో కార్యవర్గ సమావేశంలో పాల్గొని హైదరాబాదుకు వచ్చి  జననాట్యమండలి బృందాన్ని ధర్మవరం తాలూకాలో ప్రదర్శన ఇవ్వడానికి తీసుకుపోయాడు. ఆయన ధర్మవరం తాలూకాలో 18 గ్రామాల్లో రైతు కూలీ సంఘాలు పెట్టి భూ పోరాటాలు చేపట్టాడు. ఒక నెల రోజులపాటు ప్రదర్శన ఇప్పించడానికి వాళ్ళను తీసుకపోయాడు. 20 తేదీన తీసుకువెళ్లి గ్రామాలు తిరుగుతూ బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు జూన్ 8వ తేదీన బస్సు మీద భూస్వామి గూండాలు బాంబులు, గొడ్డళ్ళతో దాడి చేశారు. ‘మీరు నా కొరకే దాడి చేశారు కదా బస్సు ప్రయాణికులకు హాని తలపెట్టకండ’ని బస్సు దిగిన ఆయనను కత్తులతో, గొడ్డళ్ళతో నరికేసారు. ఆ సందర్భంలో బస్సులోనో, అనంతపురం జిల్లాలోనో ఉన్న గద్దర్ కొంతకాలం అక్కడే అజ్ఞాతంలో ఉండి ఎమర్జెన్సీ ప్రకటించగానే ఇంక ఏ కార్యకలాపాలకు అవకాశం లేక వెంకటాపురం తిరిగి వచ్చాడు. ఆయన సహచరి విమల చెప్పిన ప్రకారం కొన్నాళ్లకు వాళ్లు అతి నిరాడంబరంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎమర్జెన్సీలో రెండవ విడత 1976 జూన్ 26 అరెస్టులు జరిగినప్పుడు వాళ్ల గది నుంచే  పోలీసులు అరెస్టు చేసి పది రోజులపాటు పోలీసు లాకప్‌లో చిత్రహింసలు పెట్టారు. ఉన్నత పోలీసు అధికారి బుద్ధిస్టుగా గద్దర్ పట్ల విశేష అభిమానం, స్నేహం వున్న  ఆంజనేయ రెడ్డి గారి జోక్యంతో విడుదల చేశారని విమల గద్దర్ మరణానంతరం ఒక టీవీ ఛానల్‌లో చెప్పింది. మరణానికి ముందు జరిగిన గుండె ఆపరేషన్ సందర్భంలో కూడ కుటుంబ మిత్రుడిగా ఆంజనేయ రెడ్డి గారిని వెంట తీసుకుపోయామని గద్దరు కొడుకు సూర్యం చెప్పాడు.

1977 మార్చి 23న ఎమర్జెన్సీ ఎత్తివేసే సమయానికి వంతెన కింద నీరేమో కానీ చాలా రక్తం ప్రవహించింది.

ఎమర్జెన్సీ విధించిన జూన్ 26, 1975 నుంచి సరిగ్గా నెల రోజుల లోపల జులై 24-25 మధ్యరాత్రి గిరాయిపల్లి విద్యార్థి అమరులుగా, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ప్రచారం పొందిన సూరపనేని జనార్థన్, లంకా మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్‌ల బూటకపు ఎన్‌కౌంటర్‌లతో మొదలై ఈ కాలమంతా తార్కుండే కమిటీ దృష్టికి వచ్చినవే 75 బూటకపు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి.

శ్రీకాకుళ పోరాట కాలం నుంచి నిర్దిష్టంగా చెప్పాలంటే 1969 మే 27 పంచాది కృష్ణమూర్తితో పాటు ఆరుగురి ఎన్‌కౌంటర్ నుంచి అమరుల మీద, బూటకపు ఎన్‌కౌంటర్‌ల మీద ఎన్నో పాటలు వచ్చాయి. ‘శ్రీకాకుళంలో కొండలెరుపెక్కాయి’, ‘మన వీరుడు పంచాది’, ‘ఈ విప్లవాగ్నులు ఎచటివని’ వంటి పాటలు సమకాలీన రైతాంగ ఉద్యమకారులే రాస్తే 1972 లో జార్జిరెడ్డి హత్యకాలం నుంచి తెలంగాణలో జరిగిన విప్లవకారుల హత్యలు, ఎన్‌కౌంటర్‌లపై గద్దర్ ఇతర జననాట్యమండలి సభ్యులు అద్భుతమైన పాటలు రాసారు. వాటిలో విద్యార్థి అమరుల మీద గద్దర్ రాసిన హోళీ హోళీల రంగ హోళీ పాట ఒకటి లంబాడీ జానపద ట్యూన్‌లో ఉండడం వల్ల, రెండవది లాల్ సలామ్ లాల్ సలామ్ సలామున్‌హలై వంటి ఖవాలీ రూపంగానూ, ధూలా రూపంగానూ పాడుకునే దూదేకుల, ముస్లిం (హుస్సేన్, హసన్) సంప్రదాయానిది. అదే కాలంలో ఖవాలీగా కూడా చాలా ప్రచారం పొందింది. జననాట్యమండలి ఏర్పడిన నాటి నుంచి ఖవాలీ బాలన్నగా పేరుపొందిన కంటోన్మెంటు కామ్రేడ్ అమరుడయ్యేదాకా ఎన్ని వందల సభల్లో పాడాడో. ఎమర్జెన్సీకన్నా ముందే ‘ఏం బతుకులు మనయిరో, యములా రాజ్యమ్ములో’ వంటివి మాల మాదిగల జీవితాల మీద రాసిన ఆర్ద్రమైన గీతాలు ప్రసిద్ధమైనవి.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఎన్‌కౌంటర్లపై రాసిన పాటల్లో ఆయన మరణించాక కూడ విస్తృత ప్రచారంలోకి వచ్చిన అమరుల మీద రాసిన ‘వందనాలు వందనాలమ్మో నా బిడ్డలు’ వంటి పాటలు అసహజ మరణాలు ఉన్నంతకాలం అజరామరంగా ఉంటాయి.

జననాట్యమండలి ఏర్పడిన రోజుల్లో ‘భారతీ కిరయాలో’ వంటి నృత్య రూపకాలు కాదగిన బతుకమ్మ పాటలు, చెరబండరాజు ‘కొండలు పగలేసినం’ నృత్య రూపకం, గొల్ల కురుమ గోత్రం వంటి భూపాల్ నృత్య రూపకం ఉండేవి.

జెఎన్ఎం అయినా ప్రజాకళామండలి అయినా రాజ నరసింహ ప్రత్యమ్నాయ సాంస్కృతిక రంగంలోనే కొనసాగుతున్నాడు.

తెలుగు ప్రజా సాంస్కృతిక విప్లవానికి విప్లవ కమ్యూనిస్టులు అందించిన, విప్లవీకరించిన జానపద రూపాల్లో మొట్టమొదటిది బుర్రకథ. అందులోను నాజర్ బుర్రకథ.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి అయితే జముకు కథ అందులోను అక్టోబర్ 31 అని కోరన్న, మంగన్నల అమరత్వాలను, మొండెంఖల్లులో శ్రీకాకుళం గిరిజన మహాసభను చిత్రించే జముకుల కథ సుబ్బారావు పాణిగ్రాహిది. ఈ రెండూ తాంబూర (వీణ వంటి) సంగీత వాయిద్యాన్ని, జముకు అనే పంబ సంగీత వాయిద్యాన్ని శిష్ట సమాజం చూసే అంటరాని కులాల నుంచి సమకూర్చి ఒక సామాజిక విప్లవానికి కూడ దారితీసింది. గద్దర్ జననాట్యమండలి ద్వారా తెలంగాణలో చుక్క సత్తెయ్య, మిద్దె రాములు ద్వారా విస్తృత ప్రచారం పొందిన ‘ఒగ్గు కథ’ ను విప్లవీకరించి గిరాయిపల్లి విద్యార్థి అమరులపై ఒగ్గు కథ రాసాడు. ఒగ్గు కథ సంప్రదాయకంగా గొల్ల కురుమ కులాల్లో లేదా వాళ్లను అనుమతించే శూద్ర కులాల్లో రాత్రిపూట శవాన్ని ఇంట్లో ఉంచాల్సి వచ్చినప్పుడు బల్లెం అంటే ఒక పెద్ద డోలు వంటి వాయిద్యం మంద్రంగా వాయిస్తూ, ఎంతో విషాదంగా దీర్ఘంగా చెప్పే ఒగ్గు కథ. ఒగ్గు అంటే మాట. వృత్తాంతం. ఒక కథ. నరేటివ్. దానిని గద్దర్ ఎంత వేగంతో, ఎంతో వీర, ధీర భావోద్వేగంతో విప్లవీకరించాడంటే ఇప్పుడది ఎక్కడైనా వేదికలపై డోలక్, డప్పు వంటి వాయిద్యంతో కూడా ఇద్దరు వంతలను చేర్చుకొని కథలుగా చెప్పవచ్చు. ఒక నడక గెంతుగా ఉరుకులు పరుగులుగా మారడం ఎటువంటిదో, ఒక జానపద గీతం ప్రజా గీతమై విప్లవ సందేశంగా మారడం అటువంటిది. అందుకే అమరుల మీద జననాట్యమండలి గాని, విప్లవ సాంస్కృతికోద్యమం గానీ అందులో విప్లవ సాంస్కృతిక నిర్మాణాల్లో గాని కొనసాగినంత కాలం దాని సాంస్కృతిక నాయకులుగా ఉన్న గద్దర్, వంగపండుల అమరులపై పాటలు అమరత్వాన్ని, ఒరిగిపోతున్న విప్లవకారుల చేతి నుంచి మునుసాగుతున్న విప్లవకారులు అందుకునే పోరాట ఎర్రజెండాల వలె ఉంటాయి. వీళ్లు రాసే అమరత్వ గానాలన్నీ అటువంటి వేగం విప్లవ పార్టీ శ్రీకాకుళోద్యమం సెట్‌బ్యాక్‌కు గురయినాక స్వీయ విమర్శ చేసుకుని ప్రజాపంథాను చేపట్టి రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువ జన సంఘాలు స్థాపించడంతో మొదలైంది.

ఆర్.ఎస్.యు 74 అక్టోబర్ లో ఏర్పడి 75 ఏప్రిల్ లోనే ప్రథమ మహాసభలు జరుపుకున్నా, ఆర్.వై.ఎల్ 75 జూన్‌లోనే ఏర్పడ వలసి ఉండి, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పై మరో విప్లవ పార్టీ దాడి, తీవ్ర నిర్బంధం, రాజ్య హింసల వల్ల ఆగిపోయి ఇంతలో ఎమర్జెన్సీ వచ్చినా ఒక విధంగా ఎమర్జెన్సీ విప్లవ పార్టీకి గ్రామాల్లో భూ సంబంధాల అధ్యయనానికి 21 నెలల వ్యవధినిచ్చింది. అట్లే ఆర్.ఎస్.యు నాయకత్వంలో కార్యనిర్వాహక వర్గంలో వున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి వంటి వాళ్ళు అరెస్టయినా ఎందరో సాధారణ సభ్యులు, కార్యకర్తలుగా మారి అప్పటికైతే అరెస్టు వారంట్ నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాత జీవితాన్ని అంటే గ్రామాల భూ సంబంధాల అధ్యాయనానికి దోహదం చేసినది.

ఇటువంటి అవసరమే  1985-89 ఆట-మాట-పాట బందయిన కాలంలో జననాట్యమండలికి వచ్చింది. అయితే ఈ రెండు సందర్భాలు కూడ మొదటిది 1977-79. ఎమర్జెన్సీ అనంతర వెసులుబాటుకాలంలో విప్లవ ప్రచారానికి విస్తృత దోహదం చేసి 1980లో పీపుల్స్‌వార్ ఏర్పడి దండకారణ్య పర్‌స్పెక్టివ్ రచించుకున్నాక వీరిలో చాల మంది రాడికల్ విద్యార్థులు, యువజనులు, పూర్తి కాలపు విప్లవ జీవితాన్ని ఎంచుకొని అజ్ఞాత జీవితంలోకి వెళ్లారు. అట్లాగే జననాట్యమండలి నాయకత్వం నుంచి కూడ 1992లో పార్టీ పై నిషేధం తర్వాత 1995లో స్పెషల్ కాన్ఫరెన్స్ ప్రత్యామ్నాయ ప్రజా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడానికి గ్రామ రాజ్య కమిటీలు అమలుచేయడానికి నిర్ణయించుకున్నప్పుడు విప్లవోద్యమ దండకారణ్య పర్‌స్పెక్టివ్ ఆచరణలో సంజీవ్, పద్మ, దివాకర్, రమేశ్‌లు అజ్ఞాత జీవితానికి వెళ్లారు. పద్మ, దివాకర్‌లు ఎన్‌కౌంటర్‌లలో అమరులయ్యారు. అమరులయ్యేనాటికి దివాకర్ నలగొండ జిల్లా  పీపుల్స్‌వార్ పార్టీ కార్యదర్శి కూడ. రమేష్ చిరకాలం ఏఓబి అజ్ఞాత జీవితం కోందులు, గోండుల మధ్య విప్లవ నిర్మాణంలో, సాంస్కృతిక నిర్మాణంలోనూ పాల్గొన్నాడు. సంజీవి లెహంగ్ పేరుతో దండకారణ్య సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించే స్థాయికెదిగాడు.

అట్లా వెళ్ళిన రోజుల్లో అజ్ఞాతంలో సాయుధ జననాట్యమండలి ఏర్పడిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ జననాట్యమండలి వాగ్గేయకారులైన గద్దర్, వంగపండులను ఆలంబనగా చేసుకుని విప్లవోద్యమ ప్రచారం బాహాటంగా చేసుకునే అవకాశం ఉన్నంతకాలం జననాట్యమండలి కొనసాగించాలనే ప్రయత్నం డప్పు రమేష్ బహిరంగ జీవితానికి వచ్చి, చర్చల కాలంలోనూ, చర్చలు ముగిసాక 2006లో విరసం 20వ రాష్ట్ర మహాసభలు హైదరాబాదులో జరిగే దాకా కొనసాగినది. ఎందుకంటే ఎమర్జెన్సీకి పూర్వం జననాట్యమండలిలో నాయకత్వంలో వున్నవాళ్లు ఒకరిద్దరు 1985 దాకా కొనసాగి, తిరిగి 1990 నుంచి కూడా కొనసాగిన గద్దర్, వంగపండులకు విశేష ప్రజారాశుల్లో ఉన్న గుర్తింపు జననాట్యమండలి గుర్తింపే. భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక విశాల సాంస్కృతిక వేదికగా ప్రజా కళామండలి ఏర్పడినపుడు వంగపండు దానిలో చేరి అధ్యక్షుడైనా అందులో ఎక్కువ కాలం కొనసాగలేక పోయాడు.

ఆర్.ఎస్.యు, ఆర్.వై.ఎల్‌లు 1978 ఫిబ్రవరి, మే నెల మహాసభల్లో ‘గ్రామాలకు తరలండి’ పిలుపు ఇచ్చి 1985 దాకా ప్రతి ఎండాకాలమంతా కొనసాగిన చరిత్ర అది ఒక ఉజ్వలమైన కాలం. వాటి ప్రేరణతో రైతుకూలీ సంఘాలు ఏర్పడడం, లేదా 1981 తర్వాత రైతు కూలీ సంఘం మహాసభలు జరిగి రాష్ట్రమంతటా విప్లవ నిర్మాణానికి బలమున్న ప్రతిచోట రైతు కూలీ సంఘాలు పెట్టి, మరికొన్ని చోట్ల జననాట్యమండలి పెట్టి  విద్యార్థి యువజనులను ప్రచారానికి ఆహ్వానించడం, అట్లా చేపట్టిన భూస్వాధీన పోరాటాలు వరుసగా 1977 నుంచి 80 వరకు రాడికల్ పార్టీ గానే ఈ నిర్దిష్ట ఎం.ఎల్ పార్టీ గుర్తింపు పొందింది. అది మాత్రమే ఇక్కడ చెప్తే చాలు.

ఈ కాలంలో విప్లవోద్యమం, విప్లవ పార్టీ నిర్మాణాలు బలంగా ఉన్న ప్రతి గ్రామంలో, పట్టణంలో కూడ ఆర్.ఎస్.యు ఆర్.వై.ఎల్‌లే కాదు జననాట్యమండలి కూడ ఏర్పడింది.

వి.బి గద్దర్ పాటలు ప్రచురించినప్పటికే ‘సాహితీ మిత్రులు’ 1974-75 నాటికి ముఖ్యంగా వరంగల్ సాహిత్య పాఠశాలలోనే కాకుండా, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో, వడ్డేపల్లిలో మరికొన్ని చోట్ల జననాట్యమండలి ప్రదర్శనలిచ్చాక వి బి గద్దర్ పాటలు పునర్ముద్రణలో ఒక బాక్స్ ఐటమ్ వంటి ప్రకటన చేశారు. ‘ఇప్పటి అవసరం ప్రతి గ్రామంలో ఒక నాస్తిక సంఘం రావడం’ వంటి ప్రకటనలు, 1962 చైనా యుద్ధం తరువాత వేల సంవత్సరాల భారత-చైనా ప్రజల సంబంధాలు ద్వేషపూరితమైన నేపథ్యంలో ‘ప్రతి గ్రామంలో ఇవాళ కావల్సినవి భారత-చైనా మిత్రమండలివంటివి’ అనే ప్రకటనలు కూడా శ్రీశ్రీ చేసినాడు. కానీ జననాట్యమండలి గ్రామాలలో గడ్డివేళ్ళ స్థాయి ప్రజలపై వేసిన ప్రభావాన్ని చూసిన ‘సాహితి మిత్రులు’ ఇవ్వాళ ప్రతి గ్రామంలో అన్నిటికన్నా అత్యావశ్యకంగా జననాట్యమండలి నిర్మాణం జరగాలి అని ప్రకటన ఇచ్చారు.

అట్లా వరంగల్ జిల్లాలో వడ్డేపల్లి, బట్టుపల్లి, ఉనికిచెర్ల, జాగీరు వంటి ప్రాంతాల్లోనూ, వరంగల్ పరిసర గ్రామాల్లోనూ, సింగరేణిలో బెల్లంపల్లి, గోదావరిఖని వంటి ప్రాంతాల్లో వందల జనాట్యమండలిలు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి చెప్పాల్సింది అమరుడు సాహు గ్రామమైన మాణిక్యాపూర్‌లో సాహుతో కలిసి శ్యాం జననాట్యమండలిని ఏర్పాటు చేసి అజ్ఞాత జీవితానికి వెళ్లే దాకా జమ్మికుంట, హుజురాబాదు మొదలు చాలా చోట్ల ప్రదర్శనలిచ్చాడు. మంతెన, గోదావరిఖని ప్రాంతంలో ఏర్పడిన జననాట్యమండలి జగిత్యాల జైత్రయాత్ర సభ  1978 సెప్టెంబర్ 7న జరిగినప్పుడు ఆ వేదికపై జెఎన్ఎం ప్రదర్శన ఇచ్చింది. అల్లం రాజయ్య ‘సైరన్’లో, హుస్సేన్ ‘తల్లులు-బిడ్డలు’ ప్రామాణిక సాహిత్య సర్వస్వం (సికాస ఉద్యమానికి సంబంధించినంతవరకు) లో ఈ వివరాలు పాఠకులు చదివే ఉంటారు. ఇట్లాగే కొమర్తి, మేరంగి, బొడ్డుపాడు వంటి గ్రామాల్లో, పార్వతీపురంలో కూడ జనకళామండలి, జననాట్యమండలి ఏర్పడినవి.

జననాట్యమండలి కేంద్ర బృందమనదగిన టీం ఆ రోజుల్లో పని చేసిన విధానం అలవర్చుకోదగింది. ఈ సందర్భంలో ఏ ఒకరిద్దరో తప్ప మిగతా అందరికందరూ కంటోన్మెంట్ ఏరియా నుంచి వచ్చిన నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన వారని గుర్తుపెట్టుకోవాలి. అందరూ వెంకటాపురంలో కూడి, బయలుదేరి సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌కి వచ్చి, స్టేషన్ ముందు ప్రదర్శన ఇచ్చి, టికెట్‌కు, తమ ఆహారానికి అవసరమైన విరాళాలు ప్రజల నుంచి సేకరించేవారు. ప్రయాణం పొడుగునా రైలు ఆగిన చోట మరో కంపార్ట్‌మెంటుకు మారుతూ ప్రదర్శనలిచ్చేవారు. వీలైనంతవరకు ప్రదర్శన ఇవ్వాల్సిన ఊరికి ఒకరోజు ముందు సాయంత్రానికి చేరుకొని విప్లవాభిమానులై, గ్రామంలో అప్పటికే ప్రజల మధ్య పనిచేస్తున్న కార్యకర్తల ఇళ్లలో, ఇంటికి ఒకరిద్దరు తినడానికి వెళ్లి జనాన్ని కూడగట్టి తమ పరిచయంతో పాటు ఆ గ్రామంలో భూసంబంధాలను, సమస్యలను, ప్రజలు చేపడుతున్న పోరాట రూపాలను తెలుసుకొని మర్నాడు తమ ప్రదర్శనల్లో వాటికి నిర్దిష్ట రూపాలు కూడా ఇచ్చేవారు. వడ్డేపల్లి వంటి గ్రామంలో పింగళి జమీందారీ కుటుంబం, తెలంగాణ రైతాంగ పోరాట పూర్వపు దాసీ వ్యవస్థ సామాజిక అవశేషాలు అప్పటి పోరాటంలో వాళ్లు నిర్వహించిన పాత్ర మర్నాడు వేదిక మీదకు వెళ్లే పాత్రల్లో రూపు కట్టేది. నర్సింగరావు ‘దాసి’ సినిమాని ఆయన స్వయంగా అధ్యయనం చేసిన ప్రజ్ఞాపురం, అల్వాల్ వంటి పుట్టిన, పెంపకం వచ్చిన గ్రామాలే కాకుండా, ‘మాభూమి’ సినిమాలో చిత్రించిన వరంగల్ జిల్లా ఆత్మకూరు గడీయే కాకుండా మడికొండ, వడ్డేపల్లి వంటి గ్రామాలలో జననాట్యమండలి పరిశీలనలు కూడా చోటు చేసుకుని ఉంటాయి. ఈ సందర్భాల్లో వడ్డేపల్లి, కేసముద్రం వంటి గ్రామాల్లో దొరలు, పట్వారీల మేనరిజంను, ఊత పదాలు కూడా తెలుసుకొని మర్నాడు వాటిని అనుకరిస్తే ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో చప్పట్లు కొట్టేవారు.

జననాట్యమండలి సభ్యులకు అవసరమయ్యే గొంగడి, పంచె వంటి ఆహార్యాలు, డప్పులు, గజ్జ్జెలు, డోలక్ వంటివి కొనుక్కోవడానికి కూడా ప్రజల మీద ఆధారపడి విరాళాలు, ప్రదర్శనలు పాటల ద్వారా సేకరించేవారు. ఆరంభ కాలంలో ప్రకాశం జిల్లా కారంచేడులో భూస్వాములు జననాట్యమండలి ప్రదర్శనపై దాడి చేసి వాళ్ళ గొంగళ్ళు, డప్పులు, డోలక్ వంటివి బావిలో పడేసి గ్రామం నుంచి తరిమేస్తే లెనిన్‌గ్రాడ్, స్టాలిన్‌గ్రాడ్ వంటి పేర్లున్న గ్రామాల్లో ప్రదర్శనలిచ్చి అవి కొనుక్కున్నారు. పూర్తిగా ప్రజల మీద అది కూడ పేద, మధ్యతరగతి, పెటీ బూర్జువా సెక్షన్ల మీద ఆధారపడి వెంకటాపురం, నెల్లూరు, చేబాల (రాయలసీమ) వంటిచోట్ల రోజుల తరబడి, కొన్నిచోట్ల నెలరోజుల వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించుకున్నారు. మాణిక్యాపురంలో శ్యాం, సాహులు నిర్మాణం చేసిన జననాట్యమండలి బృందంలో ఈనాటికీ మిగిలినవారందరూ ఇప్పటికీ, శ్యాం అంత్యక్రియల కాలం నుంచీ, ఎక్కడ రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా, తర్వాత కాలంలో ప్రజా కళామండలి కార్యక్రమాల్లోకి, ప్రజాస్వామిక తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లోకి వచ్చి ప్రదర్శనలిస్తూంటారు. వారి వారి బతుకుదెరువు వృత్తులు, కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఆనాటి జననాట్యమండలి స్ఫూర్తిని నిలుపుకుంటుంటారు.

జననాట్యమండలి డప్పుల చప్పుడు జనం గుండెల చప్పుడయినట్లే, దొరలు, ప్రజాశత్రువులు సాంఘిక బహిష్కరణకు గురియైన ప్రాంతాలలో ఒక సాంస్కృతిక ఆయుధంగా పనిచేసింది. ఆ విధంగా అది ప్రజాయుద్ధ సాంస్కృతిక స్వరమైంది. జెఎన్ఎమ్‌లో ఉన్నంతకాలం గద్దర్ ప్రజా యుద్ధ గానమయ్యాడు. ఎఐఎల్‌ఆర్‌సి ఏర్పడే నాటికి 1981 లోనే ముఖ్యంగా బొంబాయిలో వస్త్ర పరిశ్రమల (టెక్స్టైల్ మిల్స్) కార్మికుల చారిత్రాత్మక సమ్మె నాటికి, అందులో ప్రధాన భూమిక నిర్వహించిన భారత్ నవ్ జవాన్ సభ, ఆవాన్ నాట్య మంచ్ ఆవిర్భావం నాటికి జననాట్యమండలి అనుభవం మహారాష్ట్రకు, ముఖ్యంగా బొంబాయిలో ఆవాన్ నాట్య మంచ్‌కు అవసరమైంది. జీవించిన కాలంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమర్ షేక్ వలె లెజెండ్‌గా మారిన విలాస్ గోఘ్రే, ఇవాల్టికీ లోక్ షాయిర్‌గా కార్యక్రమాలిస్తున్న శంభాజీ భగత్, స్ట్రీట్ ప్లే అనుభవం ఉన్న అశ్విన్ టంబాట్ వంటి వాళ్ళు ఎందరో జననాట్యమండలి నుంచి, ముఖ్యంగా హిందీ తెలిసిన గద్దర్, సంజీవ్, దివాకర్‌, డప్పు రమేష్‌ల నుంచి, డప్పు, డోలక్ లకు రమేష్, దయానించి శిక్షణ పొందారు. విలాస్ గోఘ్రే గూడ అంజయ్య ‘ఊరు మనదిరా వాడ మనదిరా’ పాటను కూడా ఆ తూగు, ఆ ట్యూన్ వచ్చేట్లుగా ‘యహ్ గావ్ హమారా, యహ్ గలి హమారీ’గా అనువాదం చేశారు.

 ఇప్పటికే బహుళ ప్రచారం పొందినట్లుగా పార్టీ ప్రజాపంథా చేపట్టి కొండపల్లి సీతారామయ్య ‘వ్యవసాయ విప్లవాన్ని జయప్రదం చేయండి’ అని పుస్తకం రాస్తే, ఆయన పాఠాలు విని, పుస్తకం పలుమార్లు అధ్యయనం చేసి గద్దర్ ‘భారతదేశం భాగ్యసీమరా’ పాటలో వ్యవసాయ విప్లవ ఆవశ్యకతనంతా సారాంశంగా ఎంతో సులభంగా అద్భుతమైన ప్రబోధ గీతంగా రాసి భూస్వామ్య, సామ్రాజ్యవాదం దాడిని, దానిని నూతన ప్రజాస్వామిక దీర్ఘకాలిక పోరాటంతో అంతం చేయాల్సిన అవసరాన్ని ఎంతో కవితాత్మకంగా వివరించాడు. ‘భారత్ అప్నా మహాన్ భూమి’ అని విలాస్ గోఘ్రే మరాఠీ, హిందీలలోకి చేశాడు. ఈ రెండు పాటలు మరాఠీ, హిందీలోకి అనువాదమై దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది మొదలు పీపుల్స్ వార్ ఏర్పడిన అన్ని రాష్ట్రాలలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ఎఐఎల్‌ఆర్‌సి ఏర్పడేనాటికే జననాట్యమండలి, గద్దర్, సంజీవ్‌లు విప్లవ గాయకులుగా గుర్తింపు పొంది ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచారు. ఈ నేపథ్యం నుంచే కెవిఆర్, కంచన్ కుమార్ మొదలైన వారి కృషి వల్ల ఉత్తర భారతంలో మరో రెండు విప్లవ పార్టీల (సిపిఐ (ఎంఎల్) పార్టీ యూనిటీ- ఎంసిసిఐ) అనుబంధ సాంస్కృతిక సంస్థలతో కలిసి ఎఐఎల్‌ఆర్‌సి ఏర్పడింది. బెంగాల్, బీహార్‌లలో రెవల్యూషనరీ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, క్రాంతికారీ బుద్ధి జీవి సంఘ్, క్రాంతికారీ సాంస్కృతిక్ సంఘ్, పంజాబ్‌లో క్రాంతికారీ సాంస్కృతిక్ మంచ్ మొదలు 1990 నాటికి కేరళలో జనకీయ సాంస్కృతిక వేచి కూడా కలిపి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాష్ట్రాల నుంచి 20 సంస్థలు ఎఐఎల్‌ఆర్‌సిలో భాగమైనవి. ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రదర్శనల గురించి వివరించడానికి ఇక్కడ సాధ్యం కాదు. కానీ రెండు సందర్భాల్లో ఆయన జననాట్యమండలి బాధ్యుడుగా నాలుగు ఎం.ఎల్ పార్టీలు ఏర్పాటు చేసిన ఎన్‌కౌంటర్ వ్యతిరేక కమిటీలలో నిషేధింపబడిన పీపుల్స్ వార్‌కు ప్రకటిత సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడని మాత్రం చెప్పాలి. అవి – మొదటిసారి సిపిఐ (ఎంఎల్) మధుసూదన్ రాజ్ ఎన్‌కౌంటర్ సందర్భంగా, రెండవ సారి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ముగ్గురు నాయకుల ఎన్‌కౌంటర్.

1983లో ఎఐఎల్‌ఆర్‌సి ఆవిర్భావ సభ (ఢిల్లీ)లో జననాట్య మండలి ప్రదర్శనలు సుప్రసిద్ధ నాటక రచయిత, ప్రయోక్త గురుశరణ్ సింగ్ మొదలుకొని దేశవ్యాప్త కళా బృందాల, కళాకారుల, బుద్ధి జీవుల దృష్టినాకర్షించింది. అట్లే 1985లో సింధ్రీలో జరిగిన మహాసభలు అప్పటికింకా అవిభక్తంగా ఉన్న బీహార్‌లోని ఝార్ఖండ్ ఆదివాసీ ప్రాంతం కనుక అక్కడి దళిత, ఆదివాసీ ప్రజానీకంపై ఎంతో ప్రభావాన్ని వేసి రాంబలి యాదవ్, సుందర్ వంటి దళిత, ఆదివాసీ సమాజాల నుంచి అద్భుతమైన కళాకారులు రూపొందారు. ఝార్ఖండ్ ఆదివాసీ బాలికల నృత్యం, ప్రదర్శనలు జననాట్యమండలి పై ప్రభావం వేసినవి.

అప్పటికే 1981లోనే ఇంద్రవెల్లి మారణకాండ జరిగింది. ఆ కాల్పులు జరిగిన సమయానికి జననాట్యమండలి అదిలాబాదు జిల్లా ఆదివాసీ గ్రామాల్లో ఇంద్రవెల్లి గిరిజన రైతుకూలీ సంఘం సభ ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నది. ఇంద్రవెల్లిలో ప్రవేశించక ముందే ఈ నిర్బంధం, కాల్పుల వార్త విని ఆ ఆదివాసీ ప్రాంతంలోనే తిరుగుతూ గద్దర్ రగల్ జెండా బ్యాలే (నృత్య రూపకం) రాసాడు.

మైదాన ప్రాంత విప్లవోద్యమానికి ‘నక్సల్బరీ బిడ్డలు’ ఎంత ప్రేరణనిచ్చిందో అంతకు మించిన ప్రేరణ ‘రగల్ జెండా’ దేశవ్యాప్త ఆదివాసీ ఉద్యమాలకు ఇచ్చింది. రగల్ జెండాలో ‘అడవి తల్లికి దండాలో’ అనే ప్రకృతి వర్ణనతో మొదలై దోపిడి ప్రవేశం, ఆదివాసీ (ఏకలవ్యుని) బొటనవేలు మీద పట్వారీ కలంతో పొడిచి, పోడు భూమి నెత్తుటి సంతకంతో కబ్జా చేసుకునే దృశ్యం వచ్చేవరకు మనసు ఒక ఆహ్లాద, అన్యాయ ఘట్టాల నుంచి ఉలికిపడి ఆక్రోశంతో మానసికంగా బ్యాలేలో వలెనే సాయుధమవుతుంది. రాష్ట్ర స్థాయిలో గానీ, బయటి రాష్ట్రాల్లో గాని ప్రదర్శించినపుడు ఈ ఆదివాసీ పాత్రలో దివాకర్ నటించేవాడు. ఇంద్రవెల్లి స్థూపావిష్కరణ కాలం నుంచి 1985లో కూడ గద్దర్ ప్రతి ఇంద్రవెల్లి సంస్మరణ సభకు వెళ్లేవాడు. జననాట్యమండలి బృందంతో గానీ, తీవ్రమైన ఆంక్షలు ఉన్న కాలంలో ఒక్కడుగా గాని ఇంద్రవెల్లి స్థూప నిర్మాణం మొదలు ఆవిష్కరణ వరకు అక్కడే నివాసం ఉండి నిర్బంధాలు, కేసులు భరిస్తూ, నిజామాబాద్ జైల్లో కూడ గడపాల్సి వచ్చిన గంజి రామారావు గారే స్థూపావిష్కరణ కూడ రైతుకూలీ సంఘం అధ్యక్షుడుగా చేయాలని సూచన వచ్చినా ఆయన కోరికపై గద్దర్ చేతనే స్థూపావిష్కరణ జరిగింది. 1984లో చంద్రపూర్ పౌర హక్కుల సంఘం నాయకుడు, సుప్రసిద్ధ న్యాయవాది ఏక్‌నాథ్ సాల్వేతో కలిసి వెళ్లి ఇంద్రవెల్లి స్థూపం దగ్గర చుట్టూ తుపాకుల మధ్యన ప్రదర్శన ఇచ్చాడు. 1984లో అప్పటి సిరొంచ జిల్లా కమలాపూర్‌లో ఆదివాసీ రైతు కూలీ సంఘం సభల్లో పాల్గొనడానికి వెళ్లిన జననాట్యమండలి సభ్యులంతా నాగపూర్‌లో అరెస్టయి నాగపూర్ జైల్లో తమ ప్రదర్శనలతో కమలాపూర్‌లో అడ్డుకున్న సభలను నిర్వహించుకున్నారు. 1991లో బస్తర్‌కు వెళ్లినట్లుగానే అనురాధాగాంధీ ఆహ్వానంపై జననాట్యమండలి బృందం మొత్తం నాగపూర్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ప్రదర్శనా స్థలం గేట్లకు తాళం పెట్టి గద్దర్‌ను అరెస్టు చేసి జననాట్యమండలిపై రాష్ట్ర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసారు. ఏక్‌నాథ్ సాల్వే అప్పటి ముఖ్యమంత్రి శరద్ పవార్‌కు చేసిన విజ్ఞప్తిపై ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకొని గద్దర్‌ను విడుదల చేసారు.

‘రగల్ జెండా’ ప్రస్తావనతో జననాట్య మండలి, గద్దర్‌ల అనుబంధం అరణ్యోద్యమంతో ఎంత పెనవేసుకొని ఉన్నదో చెప్పడానికి ఈ వివరాలు రాసాను. జననాట్యమండలి వినుకొండ, భద్రాచలం నుంచి బస్తర్‌లో, భిలాయి దాకా బస్సు యాత్ర దానికదే ఒక దృశ్యకావ్యమవుతుంది. 1985-89 అజ్ఞాత జీవితం వల్ల జననాట్యమండలి 1987లో కలకత్తాలో జరిగిన ఎఐఎల్ఆర్‌సి మూడవ మహాసభలకు వెళ్లలేక పోయింది.

1990 జనవరిలో విరసం ఇరవయ్యేళ్ల మహాసభలో జననాట్యమండలి బృందాన్ని అజ్ఞాతం నుంచి బయటికి పంపించాలన్న ఒత్తిడి విప్లవోద్యమంపై పెరిగింది.  దానితో  20 ఫిబ్రవరిన 18 ఏళ్ల జననాట్యమండలి వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్లకుండా ఉన్న దివాకర్, రమేష్‌లు రైతు కూలీ సంఘం నరసన్న అధ్యక్షతన నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ సభల కోసమే చలసాని ప్రసాద్ హైదరాబాదులో ఉండిపోయాడు. వంగపండు బృందం వచ్చింది. గద్దర్ అజ్ఞాతం నుంచి వచ్చిన విషయం ప్రకటించడానికి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రావిశాస్త్రి అధ్యక్షతన ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సదస్సులోనే మొదటిసారిగా తన అజ్ఞాత జీవిత తాత్విక అంతస్సారమనదగిన ‘పొద్దుతిరిగిన పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే’ గీతాన్ని గద్దర్ ఆలపించాడు. ఈ రాకకు ఒకరోజు ముందు అప్పటిలో ఓడియన్ థియేటర్ (నారాయణగూడ)లో ఒక దినమంతా ‘జననాట్యమండలి-గద్దర్’పై సదస్సు నిర్వహించబడింది. ఇందులో కాకరాల గారు ‘ప్రజాయుద్ధ నౌక గద్దర్’ అనే పత్రాన్ని చదివి గద్దర్ కవిత్వాన్ని, కళా ప్రదర్శనను విశ్లేషించారు.

ఎన్టీఆర్ ఆట-మాట-పాట నిషేధానికి తీవ్ర నిరసన, ప్రతిఘటన పెరిగి ఆయన పభుత్వం  బీటలు వారుతున్న కాలంలోనే జననాట్యమండలి బహిరంగ జీవితానికి రావాలన్న డిమాండ్ పెరిగింది. 1990 జనవరిలో హైదరాబాదులో జరిగిన విరసం సభలు ఆ డిమాండ్‌కు ఊతమిచ్చాయి.

అపుడు బెజవాడలో ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న ఎన్. వేణుగోపాల్ ఆంధ్ర పత్రిక సాహిత్య సంచికలో గద్దర్ అజ్ఞాతం నుంచి పంపించిన ‘ప్రతి పాటకు ఒక కథ వుంది’ని సీరియలైజ్ చేసాడు. అపుడే మొదటిసారి తెలుగు సమాజానికి గద్దర్ బహిరంగ జీవితానికి రావల్సిన అవసరాన్ని ఎత్తి పడుతూ వ్యాసం రాసి మొదటిసారి ఖాదర్ మొహియుద్దీన్ ‘ప్రజాయుద్ధ నౌక గద్దర్’ అనే పదబంధాన్ని శీర్షికగాపెట్టాడు. సోవియట్ రష్యా విప్లవ సాహిత్యంతోను, సినిమాతోను ప్రభావితుడైన ఖాదర్‌కు బహుశా ‘బ్యాటిల్ షిప్ పోటెంకిన్’ నుంచి ఆ ప్రేరణ వచ్చి ఉంటుంది. ఇంక సోవియట్ సినిమాతో, ముఖ్యంగా ఐసెన్‌స్టెయిన్ బ్యాటిల్‌షిప్ పోటెంకిన్’ సినిమాతో ఉన్న విశేష పరిజ్ఞానం, ప్రభావాల వల్ల కాకరాల గారు తన ప్రసంగ పత్రానికి ఆ పేరు ఎంచుకున్నారు.

1905లో విఫలమైన విప్లవం ఆధారంగా తీసిన సినిమా అది. రష్యాలో ప్రజలు, విప్లవకారులు జార్ చక్రవర్తి నియంతృత్వాన్ని ఎదిరించి పోరాడుతుంటే బ్యాటిల్ షిప్ పోటెంకిన్‌లో ఉన్న నౌకా కార్మికులు చేతులు ముడుచుకొని కూర్చోలేక తమ అధ్వాన్నమైన ఆహార, వసతి, జీవన ప్రమాణాల గురించి నావలోనే సమ్మె చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు. నావికా సైన్యం చేసిన దాడి, దౌర్జన్యంలో ఒక కార్మికుడు చనిపోతాడు. ఇంతలో నావ ఓడరేవు చేరుతుంది. అప్పుడు ఈ కార్మికులు మరణించిన కార్మికుని మృతదేహాన్ని డెక్ మీద పెట్టుకొని నగరం నుంచి ఈ యుద్ధనావను చూడడానికి వస్తున్న ప్రజలకు తమ సమ్మె గురించి, ఈ సంఘటన గురించి వివరిస్తూ విప్లవంలో ఒక సృజనాత్మకమైన మానవీయమైన పోరాటానికి ఆ కార్మికుని మృతదేహాన్ని ఒక పోరాట ప్రతీకగా చేస్తారు. సరిగ్గా గద్దర్ 1997 జనవరిలో ఆ పాత్ర నిర్వహించాడు. జననాట్యమండలి, ఎఐఎల్‌ఆర్‌సి ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కొరకు ఏర్పడిన తెలంగాణ జన సభ, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌లకు వెనుక ఆలోచనలో, నిర్మాణంలో పార్టీ ఉన్నది. కాకపోతే వరంగల్‌లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సభ ఏర్పాటుకు ముందు మారోజు వీరన్న నాయకత్వంలోని పార్టీ సూర్యాపేటలో ప్రత్యేక తెలంగాణ సదస్సు నిర్వహించవచ్చు. అంతకన్నా ముందు బోనగిరిలో గాదె ఇన్నయ్య, సామ మల్లారెడ్డి, నందిని సిద్ధారెడ్డిలు ప్రత్యేక తెలంగాణ సదస్సు నిర్వహించి, గద్దర్‌ను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి దించాక గానీ ఏప్రిల్ 97 ఎఐపిఆర్ఎఫ్ సదస్సుకు దారి తీయవచ్చు.

1994డిసెంబర్ నుంచి 95 మార్చ్ వరకు రాష్ట్రం లోని అన్ని జైళ్లలో రాజకీయ ఖైదీల, లైఫర్ల విడుదల కోసం పీపుల్స్ వార్ ఖైదీలు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణల నాయకత్వంలో సాగిన పోరాటానికి మద్దతుగా మూడు నెలలకు పైగా బయట సాయిబాబా, పవన్‌లు కన్వీనర్‌లుగా ఏర్పడి ఎఐపిఆర్ఎఫ్ రవి (కామ్రేడ్ రవి తర్వాత కాలంలో అజ్ఞాత జీవితానికి వెళ్లి అనతి కాలంలోనే తిగుల్ ఎన్‌కౌంటర్లో మరో ఏడుగురితోపాటు అమరుడయ్యాడు) నిర్వహించిన శిబిరంలో పోరాటంలో క్రియాశీలంగా పాల్గొని ‘జైలు సైరన్ మోగెనో జంగ్ సైరన్ మోగెనో’ అనే పాటతో ఉత్తేజ పరచాడు.

అట్లాగే ఎస్సి వర్గీకరణ కొరకు ‘మాదిగ దండోరా’ ప్రజాస్వామిక ఆకాంక్షను బలపరుస్తూ ఏర్పడిన ఏభై సంఘాలతో (అందులో మాల, మాదిగ సంఘాలు కూడ కలుపుకొని) గద్దర్ ఎస్సీ వర్గీకరణ ఐక్యవేదిక కన్వీనర్ కావడంలో కూడ సూత్రబద్ధంగా అప్పటి పీపుల్స్ వార్ తీసుకున్న ప్రజాస్వామిక డిమాండ్ ఉంది. చర్చలు జరిగిన రెండుసార్లు కూడ పార్టీ ప్రతిపాదనతోనే ఆయన చర్చల ప్రతినిధిగా పాల్గొన్నాడు.

కాని ఎన్‌కౌంటర్ మృతదేహాల స్వాధీన కమిటీ ఏర్పడడము ఏదో ఒక సద్వోఘటన నుంచి సాధ్యమైంది. పీపుల్స్ వార్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రామేశ్వర్ అలియాస్ సురేష్‌ను మజ్జిగ రాజు అనే మరో కమిటీ సభ్యునితో పాటు హైదరాబాదు పాత నగరంలో అరెస్ట్ చేసి మెదక్ జిల్లా నర్సాపూర్లో అడవుల్లో కాల్చివేసి ఎన్‌కౌంటర్ ప్రకటించారు పోలీసులు. రామేశ్వర్ సోదరుడు అరెస్టు వార్త తెలిసిన ఉదయమే గద్దర్ దగ్గరికి వెళ్లి ఆయన ప్రాణాలు కాపాడమని కోరాడు. అతణ్ణి తీసుకొని నర్సాపూర్ ఆసుపత్రికి చేరుకునే వరకు సురేష్ శవాన్ని నగ్నంగా చితి మీద పెట్టి నిప్పటించడానికి పూనుకున్నారు పోలీసులు. గద్దర్ వెళ్తూనే ఆయన ఒంటి మీద చొక్కా తీసి సురేష్ మృతదేహంపై వేసి డిమాండ్ చేసి ఆ మృతదేహాన్ని అతని సోదరునికి అప్పగించాడు. రక్త బంధువులు లేని మజ్జిగ రాజు మృతదేహాన్ని సమీప బంధువుగా క్లెయిమ్ చేసి అక్కడే దహనం చేశాడు. ఏప్రిల్ 97 నాటికి ‘మృతదేహాల స్వాధీన’ డిమాండ్ ఒక మానవీయ చర్యగా నిశ్శబ్దాన్ని ఛేదించి 97 ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులతో హత్యా ప్రయత్న కుట్రగా మారిన క్రమమంతా ఇప్పుడు నెత్తురుతో రాయబడిన చరిత్ర. ఆయన తన మరణం ముందు తన జీవితకాలంలోనే అమరత్వంపై ఒక తాత్విక గీతం రాశాడు. ఆ వెన్నుపూస దగ్గర మిగిలిన తూటాయే 25 ఏళ్ల తర్వాత ఆయనకు మరణాంతకమైంది.

మరణించడానికి 11 సంవత్సరాల ముందు 2012లో ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చినట్లు, దానిని పార్టీ ఆమోదించినట్లు సిపిఐ (మావోయిస్టు) తెలంగాణ కమిటీ స్పోక్స్‌మెన్ జగన్ ప్రకటించాడు.

బహుశా గద్దర్ ఒక్కడే కనీసం మూడు దశాబ్దాలకు పైగా తాను పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీ సభ్యుణ్ణి అని బహిరంగ ప్రజాజీవితంలో ఉంటూ చెప్పుకున్న వాడు. ఐదు సంవత్సరాల అజ్ఞాత జీవితం నుంచి వచ్చిన దగ్గర్నుంచి ఆయన అభిమానుల్లోనూ, శత్రు శిబిరంలోనూ సర్వత్రా ఆ గుర్తింపు ఉంటూనే ఆయన కాల్పుల నాటికి ప్రజా గాయకుడు గానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడ రూపొందాడు. అయితే అజ్ఞాత జీవితం నుంచి బయటికి వచ్చినపుడు రాంనగర్ కుట్ర కేసులో గానీ, పార్టీపై నిషేధం విధించినప్పుడు గాని పోలీసులు అరెస్టు చేయడానికి సాహసించలేకపోయారు. అయినా నిషేధింపబడిన విప్లవ పార్టీ సభ్యుడిగా నిర్మాణంలో ఆయన 1995లో సస్పెన్షన్‌కు గురయ్యాడు. 1996 అక్టోబర్ 20న ‘సుప్రభాతం’ పత్రిక కోసం మల్లేపల్లి లక్ష్మయ్య, గిరి నాగభూషణం ఆనంద్‌ను ఇంటర్వ్యూ చేసారు. అప్పుడు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి ఆనంద్ (ఇటీవలే అమరుడైన కటకం సుదర్శన్) గద్దర్ సస్పెన్షన్ తదితర అంశాల మాటేమిటి అని అడిగినపుడు ‘గద్దర్ స్వయంగా ఆత్మవిమర్శ చేసుకున్నాడు. పార్టీ కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నదనే వాక్యాన్ని ఉపసంహరించుకున్నాడు. గద్దర్‌ను పార్టీ నుంచి తొలగించలేదు. సస్పెండ్ మాత్రమే చేశారు. ఆయన సస్పెన్షన్ ఎత్తివేత విషయమై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గద్దర్ తన తప్పును తాను ఒప్పుకొని రెక్టిఫై అయ్యాడు ఇటీవల ఒక ప్రెస్‌మీట్‌లో విప్లవోద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం మీకు తెలిసిందే.’ (దండకారణ్యమే అతని చిరునామా కార్మిక వర్గ పుత్రుడు కామ్రేడ్ ఆనంద్ జ్ఞాపకాలు రచన – అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురణ పేజీ 101 నుంచి).

అంటే గద్దర్ 2012 నాటికి విప్లవోద్యమ పంథాను వదిలి ఎన్నికల మార్గం ఎంచు కున్నందుకే పార్టీకి ఆయనకు మధ్య ఎన్నో విషయాల మీద ఎంత సుదీర్ఘ చర్చ జరిగినా ఆయన రాజీనామా ఇవ్వక తప్పలేదని, పార్టీ అంగీకరించక తప్పలేదని స్పష్టం.

1974లో పార్వతీపురంలో పౌరహక్కుల సంఘం సభలు జరిగినప్పుడు శ్రీశ్రీ ఆ సభకు వచ్చాడు. అప్పటికే కొమర్తి, మేరంగి వంటి గ్రామాల్లో పేదల సంఘం భూ పోరాటాలు నిర్వహిస్తున్నది. ఆరోజు ఆ సభకు అడ్డుపడి పోలీసులు ఆ సంఘ నాయకుడు గంటి ప్రసాదం, జననాట్యమండలి భూపాల్, జనకళామండలి వాసు వంటి వారిని అరెస్టు చేసారు. అయినా శ్రీశ్రీ ఊరేగింపులో మెడలో ‘నేను నక్సలైటును’ అని అట్ట తగిలించుకొని నన్ను అరెస్టు చేయమన్నాడు.

శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, గోర్కీ ‘అమ్మ’ చదివి వేలాదిమంది కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో అప్పటి అవిభక్త కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు స్వయంగా అన్నాడు.  శ్రీశ్రీ ఎన్నడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కాదు. ఆయన విరసం అధ్యక్షుడు గానే అభిశంసనకైనా, సస్పెన్షన్‌కైనా, పదవి రద్దయి సభ్యునిగా కొనసాగడానికైనా విరసం చర్యలే కానీ పార్టీ ప్రమేయం లేదు.

గోర్కి బొల్షివిక్ పార్టీ సభ్యుడు. విప్లవానంతరం సోవియట్ రచయితల అకాడమీ అధ్యక్షుడు కూడ అయ్యాడు. 1930ల ప్రపంచ పాసిస్టు యుద్ధ కాలంలో ‘రచయితలారా మీరెటువైపు’ అని పిలుపు ఇచ్చి అంతర్జాతీయంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కమ్యూనిస్టు, ప్రజాస్వామిక రచయితల ఐక్య సంఘటనకు దోహదం చేసినవాడు. ఆయన విప్లవానికి పూర్వం లెనిన్ ముందు “నేను సాహిత్యంలో ఏమైనా కావచ్చు కానీ రాజకీయాల్లో ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తిస్తాను” అని ఒప్పుకోవాల్సి వచ్చిందట.

గద్దర్ జననాట్యమండలిని (1972) నుంచి, ఎఐఎల్‌ఆర్‌సిలో (1983) సంస్థాపక కార్యవర్గ సభ్యుడు (1983-99) ప్రధాన కార్యదర్శి (1999-2002) గా ద్వారా విప్లవ సాంస్కృతిక నాయకుడిగా నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో నిర్వహించిన పాత్ర గురించి మాత్రమే కాదు 2012 రాజీనామా తర్వాత కూడ ఆయన ఎంచుకున్న ఎన్నికల రాజకీయాల్లో చేసిన పనుల గురించి కూడ మావోయిస్టు పార్టీ మాత్రమే వస్తుగత (ఆబ్జెక్టివ్) నిర్ణయం చేయగలదు. చేస్తుందని ఆశిద్దాం.

One thought on “విప్లవ సాంస్కృతికోద్యమం – గద్దర్

  1. గోర్కి బొల్షివిక్ పార్టీ సభ్యుడు. విప్లవానంతరం సోవియట్ రచయితల అకాడమీ అధ్యక్షుడు కూడ అయ్యాడు. 1930ల ప్రపంచ పాసిస్టు యుద్ధ కాలంలో ‘రచయితలారా మీరెటువైపు’ అని పిలుపు ఇచ్చి అంతర్జాతీయంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కమ్యూనిస్టు, ప్రజాస్వామిక రచయితల ఐక్య సంఘటనకు దోహదం చేసినవాడు. ఆయన విప్లవానికి పూర్వం లెనిన్ ముందు “నేను సాహిత్యంలో ఏమైనా కావచ్చు కానీ రాజకీయాల్లో ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తిస్తాను” అని ఒప్పుకోవాల్సి వచ్చిందట.

Leave a Reply