విప్లవకారులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధపడడం వల్ల బయట సమాజానికి అజ్ఞాతంలో ఉండి పనిచేసే విప్లవకారులు ఎలా ఉంటారు అనే విషయం అర్థం అయింది. విప్లవకారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కామ్రేడ్ ఆర్కే బయట ఉన్న ఆ కొద్ది రోజుల్లోనూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపపజేశాడని చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆయనను అనేక విషయాల మీద ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ప్రతి క్షణం తాను ప్రజల తరుఫున మాట్లాడడానికి వచ్చాననే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారని అనిపించింది. ఇంగ్లీషు పత్రికల విలేఖరులు అడిగిన ప్రశ్నలను అనువాదం చేయించుకొని మళ్ళీ తెలుగులోనే జవాబులు చెప్పేవారు. దానివల్ల సామాన్య ప్రజలు కూడా ఆయన మాట్లాడిన ప్రతిమాటనీ అర్థం చేసుకొనే అవకాశం కలిగింది. ఆయన ఎమ్మే చదువుకున్నారు అని అమరులయిన తరవాతనే తెలిసింది.
చర్చల సందర్భంలోనే ఒకరోజు దళిత సంఘాలను, మహిళా సంఘాలను, మైనారిటీ సంఘాలను కలిసి ఆయా సామాజిక సమస్యల పట్ల తమ అవగాహనను పంచుకున్నారు. మహిళా సంఘాలతో పాటు మహిళా మేధావులను, ఫెమినిస్టులను కూడా ఆహ్వానించారు. మహిళా విముక్తి పట్ల తమ దృక్పథాన్ని గురించి చర్చించారు. అవగాహనా పత్రాన్ని కూడా అందరికీ ఇచ్చారు. మహిళా విముక్తి గురించి చాలా విషయాలను ఆయన చర్చించారు.
సాధారణంగా అజ్ఞాతజీవితం గడిపే విప్లవకారుల గురించి చాలా విషయాలు బయటి సమాజానికి తెలిసే అవకాశం ఉండదు. అమరులయిన తరవాతనే వాళ్ళ జీవితాలను గురించి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల చర్చలు చేయడానికి వాళ్ళు తమ మధ్యకు వస్తున్నారంటేనే ప్రజలకు విపరీతమైన కుతూహలం కలిగింది. ఇక మీడియా, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటికి తీసింది.
మొదటి సారిగా పేపర్లు ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టాడని రాస్తేనే ఆ విషయం తెలిసి, అరె ఈయనకూ ఒక కులం ఉండక తప్పదా అనిపించింది. ఆయన పార్టీలో ఎలా జీవించాడో తెలీని వాళ్ళకి, తమ ‘‘సిద్ధాంతాలు’’ దేనికైనా సరే ఆపాదించేసే వాళ్ళకి విప్లవోద్యమం మీద దాడి చేయడానికి ఇది ఒక ‘‘ఆయుధం’’ లాగా దొరికింది. ఉదాహరణకు చర్చల సమయంలో మంజీర గెస్ట్ హవుస్ లో ఉన్న ప్రతినిధి బృందానికి ప్రభుత్వం చేస్తున్న భోజన ఏర్పాట్లు చూసి ఆయన తమకు ఇలాంటి ఏర్పాట్లు అవసరం లేదనీ ‘‘సాధారణ’’ భోజనం చాలని అన్నారు. దీనికి కంచ ఐలయ్య గారు చెప్పిన తాత్పర్యం ఏమంటే ఆయన ‘‘బ్రాహ్మడు’’ కాబట్టి మాకు ‘‘పప్పన్నం’’ చాలు మాంసాహారం వద్దు అన్నాడు లేక పోతే బీఫ్ పెట్టమని అడిగి ఉండేవాడు, అని. ఈ విషయం వార్తా పత్రికల్లో ప్రముఖంగా వచ్చినప్పుడు కామ్రేడ్ ఆర్కేతో కలిసి పనిచేసిన ఒకాయన ‘‘ఐలయ్య గారిని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే మీరు తినగలిగేవన్నీ ఆర్కే తినగలడు. ఆర్కే తినేవి మీరు ఎప్పుడైనా ఒక్క సారైనా తిన్నారా? తినగలరా?’’ అని అన్నాడు. ‘‘కొంతకాలం క్రితమే తెలిసింది, ఐలయ్య గారు వెజిటేరియన్ అని. ఈ సమాచారం నిజం అయితే కనక ఆయన బీఫ్ తినమని అందరికీ చెప్పడం మానుకుంటే మంచిది’’, అని కూడా అన్నాడు. ఈ మాటలు అన్నది ఆర్కే ఆర్గనైజర్ గా పనిచేస్తున్న కాలంలో ఆయన ప్రభావంతో కార్యకర్తగా మారిన ఆ దళితవాడలోని దళితబిడ్డడే. ఆర్కే అజ్ఞాతజీవితంలో పంది మాంసం, గొడ్డుమాంసమే కాదు ఉడుములు, పిల్లులు, పాములు కూడా తిన్నాడనీ, ప్రజలు తినగలిగేవి ఏవైనా ఆయన తింటాడనీ ఆ తరవాత చాలా మందే చెప్పారు.
ఆయన పూర్తి కాలం పని చేయాలని నిర్ణయం తీసుకున్నపుడు పార్టీ ఆయనను పలనాడుకు పంపింది. అక్కడ గామాలపాడు దళితవాడలో ఆర్గనైజరుగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఒక రకంగా విప్లవకారుడిగా ఆయన జీవితానికి అక్కడే బలమైన పునాది పడిరది. అక్కడే ఉంటూ ప్రజలను కూడగట్టాలి. ముందు వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోవడానికి వాళ్ళల్లో ఒకడిగా మెలుగుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనాలి. ఆయన తొందరగానే వాళ్ళతో కలిసిపోయాడు.ఆయనకు అక్కడ తక్షణంగా కనిపించిన సమస్య దళితవాడలో అందరూ వాడుకునే బావి దగ్గరగా ఉన్న పెద్ద పేడ కుప్ప. నీళ్ళు పడ్డప్పడు, ముఖ్యంగా వర్షాకాలం వచ్చినపుడు అది కరిగి బావిలోకి ఆ నీళ్ళు కారేవి. ఆ నీళ్ళే అందరూ తాగడానికి వంటకీ వాడుకోవాలి. కానీ వెళ్ళగానే దాని గురించి మాట్లాడ్డం కాకుండా మొదలు అందరితో పాటు తానూ అవే నీళ్ళు తాగాడు. తరవాత అందరినీ కూడగట్టి పార పట్టుకొని తను ముందు నడిచి అక్కడి యువకులను కదిలించాడు. అందరూ కలిసి పేడను తవ్వి కుప్పను దూరంగా జరిపారు. బావిలోకి మురుగు నీరు పోతున్న మార్గాలను మూసేశారు. వాళ్ళలో ఒకడిగా కలిసిపోవడానికి తనకి ఇది మొదటి మెట్టు.
ఇక దళిత వాడలో తిండి ఎలా ఉండేదంటే ఒక్కసారి వేట చేసి పందిని కొడితే కావలిసినంత మాంసం. దానిని ముక్కలుగా కోసి తీగలకి కట్టి ఎండబెడతారు. వాటిని నిల్వ ఉంచి అప్పుడప్పుడూ ఉప్పూ కారం అద్ది కాల్చి తినడం లేదా నూనెలో వేపుకొని తినడం. గొడ్డుకారంలో కొద్దిగా ఉప్పు వేసి పోపు చేసుకొని అన్నంలో కలుపుకొని ఈ మాంసం ముక్కలు నంజుకొని తినేవారు. ఈ ముక్క ఒక్కసారి నోట్లో వేసుకుంటే అది గట్టి రబ్బరు ముక్కలాగా సాగుతుంది తప్ప ఎంతకీ నలగదు. ఆ తిండి అలవాటు చేసుకోవడం సామాన్యమైన విషయం ఏం కాదు. ఆర్కే పూర్తికాలం పనిచేయడానికి వచ్చినపుడు దళిత వాడల్లో ఇదే తిండి తినడంతో ఆయన విప్లవ జీవితం ప్రారంభం అయ్యింది అని గుంటూరు జిల్లాలోని చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా చర్చల కాలంలో ఈ విషయాలు బాగా బయటికి వచ్చాయి. గామాలపాడులోనే కాకుండా గుంటూరు జిల్లాలోని అనేక పల్లెల్లో దళిత ఆత్మ గౌరవ పోరాటాలు జరిగాయి. రాడికల్ యువజన సంఘాల నేతృత్వంలో దళితులు పోరాటాలు చేశారు. ఉమ్మడి బావుల నుండి నీళ్ళు తోడుకోవడం, చెప్పులు వేసుకొని నడవడం, పెళ్లి ఊరేగింపులను ఊరి మధ్యనుండి తీయడం, కుర్చీల్లో కూర్చోవడం ఇవన్నీ పోరాడి సాధించుకోవాల్సి వచ్చింది. అటువంటి పోరాటాలు నడిపిన యువజన సంఘాలను నిర్మించే పని ఆ ప్రాంతంలో ఆర్కే చేశారు.
చర్చల సమయంలో ఒక విలేఖరి ఆయనను ఒక మాట అడిగాడు. ‘‘ఇన్నేళ్ల తరవాత మీ అమ్మగారిని కలుస్తున్నారు కదా ఎలా ఫీలవుతున్నారు?’’ అని. అప్పుడాయన ఏదో జవాబు చెప్పారు. కానీ తరవాత ఆయనను కలిసిన పాత కాలం మిత్రులతో ఆ విషయాన్ని పంచుకుంటూ తాను మొట్టమొదట పని చేసిన ప్రాంతంలోని ఒక దళిత వాడలో తాను ఆశ్రయం తీసుకున్న ఇల్లూ , ఆ ఇంటి తల్లి తనను ఒక పెద్ద కొడుకులా భావించి ఆదరించడం, ఆమె చేతిలోనే తాను మొదటి సారిగా పంది మాంసం ఎండు ముక్కలను తినడం, ఆ వాడలోని సమస్యలను గురించి ఆమెతో చర్చించడం, నీ తమ్ముళ్ళను మంచి దారిలో పెట్టు నాయనా అని ఆమె అడగటం అవన్నీ ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ అమ్మ అనగానే నిజానికి ఆమె గుర్తుకు వచ్చింది అని చెప్పాడని అన్నారు. నిజానికి ఇది తన కన్నతల్లిని తక్కువ చేయడం కాదు. విప్లవంలోని తల్లికి సమాన గౌరవం ఇవ్వడం.
మన దేశంలోని ఒక దౌర్భాగ్యం ఏమంటే మనకు ఏమాత్రం సంబంధం లేకుండా మనం పుట్టేటప్పటికే మనకు ఒక కులం నిర్ణయమై పోయి ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చడానికి కులవ్యవస్థను పునాదులతో సహా పెకిలించివేయడానికి ఈ సమాజాన్ని మార్చాలని విప్లవకారులు తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. తమ కుటుంబాన్ని వదిలిపెట్టి అడవుల్లో జీవిస్తూ అట్టడుగు ప్రజలతో కలిసి పోయి జీవించే వాళ్ళని, మరణించేవరకూ ఆ ఆచరణని వదిలిపెట్టని వారినీ ఇప్పటికీ అగ్రకులం అనీ, బ్రాహ్మణుడు’’ అనీ గుర్తించడం ఏమి ఆశించి చేస్తున్నారు అని ఆశ్చర్యం కలుగుతుంది. మన దేశంలో కులం అనేది ఒక వాస్తవం. అయితే సమాజాన్ని మార్చాలనుకునేవారి ఆచరణే ప్రజలకు గీటురాయి. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాస్తవాలు ప్రచారం చేయడానికి ప్రజల చేతుల్లో ఒక ఆయుధంగానూ పనిచేస్తుంది, బురద చల్లదలుచుకున్న వాళ్ళకు కూడా అంతే అవకాశం ఇస్తుంది.మరో రెండు విషయాలు కూడా ఆర్కే గురించి చెప్పుకోవాలి. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలి. దానికి కొంత చైతన్యపూర్వక కృషి జరగాలి. ప్రతి వాళ్ళూ వ్యక్తిగత జీవితంలో అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్కే కులాంతర వివాహం చేసుకున్నారు.
విప్లవోద్యమంలో చేరమని ఎంతో మందికి చెప్పినట్టే తన కొడుక్కి కూడా చెప్పారు. ప్రభావితం చేశారు. విప్లవోద్యమంలో త్యాగాలు, అమరత్వాలు తప్పవని తెలుసు కనుక అందరి తల్లిదండ్రుల లాగే కడుపుకోతను అనుభవించారు.ఆయనను తెలిసిన వాళ్ళందరూ ఆయన చాలా సున్నిత మనస్కుడని చెప్తారు. చాలా అప్యాయంగా ఉంటాడనీ, ఎవరైనా ఆయనకు ఏ సమస్యనైనా చెప్పుకోగలుగుతారనీ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో ఉన్నపుడు విప్లవోద్యమ ప్రాంతంలో విప్లవ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీ నుండి గైడ్ చేశారని కూడా తెలుస్తోంది.
సామాన్య కార్యకర్తగా మొదలయ్యి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీకి చెందిన అత్యంత ఉన్నత కమిటీలో బాధ్యతలు తీసుకొనే వరకూ ఎదిగారు. విప్లవోద్యమానికి తన వంతు కృషిని చివరి శ్వాస వరకూ అందించారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు.
జోహార్ కామ్రేడ్ ఆర్కే!!