ఇది పోయే కాలం కదా..
ఇది పోగొట్టుకునే కాలం కదా..

అయిన వాళ్ళనూ..
అంటుగట్టుకున్నోళ్ళనూ..

జ్ఞాపకాల సీసాలోకి
మనసు గాయాలు మాన్పే
అమ్మఒడి స్పర్శగా
తర్జుమా చేసుకుని
ఔషధంలా ఒంపుకుని
బిరడా బిగించుకుని
బరిగీసుకు బతుకుతున్నది
నిజమే కానీ..

ఆస్తులో ఆత్మాభిమానాలో
హోరెత్తిన హోదాలో..
అందలాలో.. ఆలింగనాలో..

బంపర్ ఆఫర్లుగా
కలిసొచ్చిన
కలసొచ్చిన వైరల్ రుతువులో..
క్లియరెన్సు సేల్ ధమాకాలో..

ఒడిసి పట్టిన
నెత్తుటి త్యాగాల గద్దెలు
తాకట్టు పెట్టిన
దగుల్బాజీ తనమా..??

ఏమైందనీ
ఏమైపోయిదనీ
ఇప్పుడెందుకీ
తలపోతంతంటావా..

వీళ్లంతా
నావాళ్ళనుకున్న నమ్మకం..

వీళ్ళుమాత్రమే
నావాళ్ళనుకున్న భ్రమా
తేలిపోయిందిప్పుడు..
మనసు తేటబారిందిప్పుడు..

కురిసే మబ్బుల
కరచాలనం కోసం
వొళ్ళంతా చిట్లిన
బిడ్డల నెత్తుటి చారలు
త్యాగాలు తలకెత్తుకుని..

తలదాచుకునే మట్టిగోడలన్నీ
ఎర్రమన్ను అలికి
తెల్లని ఆశలు విరబూసే
సఫేదు సున్నపు ఛీటాల్లో..

హరివిల్లై విరబూసే
హరియాలీలను దర్శిస్తూ..

మా అమ్మీలు పాడే
చెక్కు చెదరని ఆశల
మొహరం మాథం
విషాద గీతాలు

భుజంమీద చెయ్యేసి
నన్నెప్పుడూ
ఓదారుస్తుంటాయి..

ఆకురాలు కాలం
అడవి లేని కాలం కాదనీ..

రాలిపడ్డ ఆకులతో
రాజ్యం రాజేసే నిప్పు
పొగబార్చొచ్చు గానీ..

జల్ జంగల్ జమీన్ల
మానుతున్న గాయాల
పోటెత్తే పెదాల మీంచి
చిగురు తొడిగే
చిరునవ్వుల గుబురుల్నీ..

ఆ గుండెల్లో
గూడుకట్టుకున్న గువ్వల్నీ..
చెరిపెయ్యలేవనీ..

ఔను..
ఆశలైనా..
నమ్మకాలైనా..
ఎవరిమీదైనా…

ఇది..
కోల్పోయే కాలం మాత్రమే కాదు..

విల్లంబులూ..
విశ్వాసాలూ..
ప్రోది చేసుకునే కాలం కూడా..
పదును పెట్టుకునే కాలం కూడా.

Leave a Reply