నూతన సంవత్సరానికి ఒమిక్రాన్‌ స్వాగతం పలుకుతున్నది. గత సంవత్సరం కొవిడ్‌ మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకోవాలంటే భయమేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం తెంపేసింది. మానవత్వాన్ని మంట గలిపింది. మర్చిపోలేని బాధలను మిగిల్చింది. ఆప్తులను కోల్పోయాం. కడసారి చూపుకు నోచుకోలేకపోయాం. అంత్యక్రియలు అనాథల తరహాలో జరిగాయి. ప్రజల ఆశలను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఛిద్రం చేసింది. కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉపాధి పోయింది. మానవ సంబంధాలు మారిపోయాయి. పేదలు నిరుపేదలు అయ్యారు. కానీ, అదానీ, అంబానీ వంటి సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగింది. అందుకే నూతన సంవత్సరం ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశలు లేవు. సెకండ్‌ వేవ్‌ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షలాది మందిని చంపేసింది. ప్రజలు వైద్యం కొరకు ఆస్తులను అమ్ముకున్నారు. అప్పులు చేశారు. పేదరికంలోకి కూరుకుపోయారు.

ధనిక పేదల మధ్య ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరిగాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. అయినా, పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోన్నారు. అన్నం పెట్టే అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆయువు తీసుకుంటున్నారు. గిట్టుబాటు ధరకోసం రైతు రోడ్డెక్కాల్సి వచ్చింది. చదువుకున్న యువత ఉపాధి దొరక్క ఆత్మహత్య చేసుకుంటున్నారు.

మోడీ సర్కార్‌ 2016 నవంబర్‌లో చేపట్టిన డీమోనిటైజేషన్‌, 2017 జూలై నుంచి అమలులోకి తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను(జిఎస్‌టి), ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి కార్పొరేట్‌ అనుకూల విధానాల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పతనమైంది. గోటి మీద రోకటి పోటు అన్నచందంగా కొవిడ్‌ భీభత్సం సమాజాన్ని అతలాకుతలం చేసింది. ఫలితంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం పేదలను, మధ్యతరగతిని కృంగదీస్తోంది. బ్యాంకులలో దాచుకున్న మిడిల్‌ క్లాస్‌ సేవింగ్స్‌ హారతికర్పూరంలా కరిగిపోయాయి.

కొవిడ్‌ తీవ్రతకు ఉపాధి కల్పించిన పట్టణాలను వదిలి వలస కూలీలు పల్లెబాట పట్టారు. వేతన జీవులు ఉపాధి కోల్పోయి గ్రామీణ ఉపాధి హామీ పనులకు పోటీపడ్డారు. చదువుకున్న యువత గొర్రెలు, బరైలను మేపుకోవడం మేలనుకున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి పెంచి, పెట్రోల్‌-డిజిల్‌పై పన్నులు పెంచి, గ్యాస్‌ బండపై రేటు పెంచి ఆదాయం పెంచుకోడానికి వెంపర్లాడాయి. ఇందుకోసం దోపిడీ మార్గాలను ఎంచుకున్నాయి. పన్నులు పెంచాయి. వసూళ్లకు పాల్పడ్డాయి.

ప్రజలను ఆదుకునే బాధ్యతను మర్చి వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. చేసిన సాయానికి రెట్టింపుగా దండుకోవడానికి తాపత్రయపడ్డాయి.

కరోనా బీభత్సం కొంతమందికి అద్భుత దీపంగా మారింది. ఊహకు అందని విధంగా సంపదను పోగు చేసింది. ప్రపంచస్థాయి బిలియనీర్ల స్థాయికి చేర్చింది. ఫార్మా కంపెనీలకు కాసులు కురిపించింది. ప్రజల నిస్సహాయత, అత్యవసర వైద్యం అక్షయపాత్రగా మారింది. కార్పొరేట్‌ ఆస్పత్రులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాక్సిన్‌ వ్యాపారం ఊహించని లాభాలకు కారణమైంది. స్వదేశీ వ్యాక్సిన్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయింది. కరోనా వైరస్‌ పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కాసుల ఖజానాగా పనికొచ్చింది. ఆస్పత్రిలో బెడ్‌ మొదలు మందులు, ఆక్సిజన్‌ వరకు బ్లాక్‌ మార్కెట్‌ సరుకులుగా మారిపోయాయి. మాస్కులు, శానిటైజర్ల వ్యాపారం “మూడు పువ్వులు, ఆరు కాయలు” తరహాలో వర్ధిల్లుతూనే ఉన్నది. సామాన్యులను ఎన్నో బాధలు పెట్టిన కరోనా పిడికెడు మంది క్యాపిటలిస్టులకు, వ్యాపారులకు మాత్రం తరతరాలకు సరిపోయే సంపదను పోగుచేసింది. రెండేళ్లపాటు చిదిమేసిన కరోనా ఇకనైనా పోతుందా అని ఎదురుచూసిన ప్రజలకు ఒమిక్రాన్‌ “నిన్ను వదల బొమ్మాళీ” అంటూ వెంటాడుతున్నది. కొత్త సంవత్సరానికి కొత్త వేరియంట్‌ స్వాగతం పలుకుతున్నది.

పేదరికం విస్ఫోటనం:

దేశంలో పేదరికం అడ్డు అదుపు లేకుండా పెరుగుతోంది. సరళీకరణ ఆర్థిక విధానాల వికృత ఫలితాల కారణంగా దేశవ్యాప్తంగా 7.6 కోట్ల మంది ఎనిమిదేళ్ల కాలంలో కొత్తగా పేదరికపు కోరల్లో చిక్కుకున్నారు. ఏడున్నర దశాబ్దాల భారత చరిత్రలోనే ఈ స్థాయిలో పేదరికం పెరగడం ఇదే మొదటిసారి! యుపిఎ ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన ఈ పేదరికపు పెరుగుదల నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో మరింతగా విజృంభించింది. పెద్దనోట్ల రద్దు వంటి అనాలోచిత చర్యల ఫలితంగా లక్షలాదిమంది ప్రజలను పేదరికం ముంచెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2011-12 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది పేదరికంలో ఉండగా 2020 చివరి నాటికి 88 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.

మార్చి 2020లో కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కోట్లాది మంది ఉపాధిని, జీవనోపాధిని కోల్పోయారు. ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన అధ్యయనంలో భారత్‌లో పేదరికం రెట్టింపు అయినట్లు తెలిపింది. మధ్యతరగతి వారు కొవిడ్‌ ముందు 9.9 కోట్ల మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 6.6 కోట్లకు పడిపోయింది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త సంతోష్‌ మెహ్రోత్ర తన సహచరుడు జాజాతి కేసరి పరిదాతో చేసిన అధ్యయనం ప్రకారం 2021 చివరి నాటికి మరో 2 కోట్లు అదనంగా పేదరికంలోకి జారుకున్నారు. నేషనల్‌ శ్యాంపిల్‌ సర్వేతో పాటు, గడిచిన రెండు దశాబ్దాల లేబర్‌ ఫోర్స్‌ నివేదికల ఆధారంగా, ప్రణాళిక శాఖ, నీతి ఆయోగ్‌లు ఆమోదించిన టెండూల్మర్‌ విధానంలో వారు చేసిన ఈ అధ్యయనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నిరుద్యోగ తాండవం :

గడిచిన ఐదున్నరేండ్ల కాలంలో దేశంలో ఐదు లక్షలకు పైగా పారిశ్రామిక సంస్థలు మూతపడ్డ్దాయని పార్లమెంటులో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి స్పష్టం చేశాడు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి, కొవిడ్‌ నేపథ్యంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2, 36, 282 సంస్థలు, 2018-19లో 1, 43, 233 సంస్థలు మూతపడ్డాయని కేంద్ర మంత్రి తెలిపాడు. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తాండవిస్తోంది. లేబర్‌ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొని ఉంది. విపరీతంగా పెరిగిన నిరుద్యోగుల సంఖ్యతో 2021న సంవత్సరం ముగిసింది. దేశంలో 11 నెలల్లో నిరుద్యోగం రెండూ శాతం అదనంగా పెరగడంతో రెండు రోజుల క్రితం ముగిసిన పాత సంవత్సరంలో 8.01 శాతానికి నిరుద్యోగం ఎగబాకింది. దేశంలో నిరుద్యోగుల ఆక్రందనలు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి. పరిస్థితి గతంకంటే బాగా క్షీణించింది. అయితే ఒమిక్రాన్‌ విజ్బంభణలో సామాజిక కార్యకర్తలు, బుద్ధిజీవులు నిరుద్యోగం పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021 జనవరిలో 6.52 శాతంగా ఉన్న నిరుద్యోగం పదకొండు నెలల్లో 8.01 శాతానికి పెరగడం పరిస్థితుల క్షీణతను తెలియజేస్తున్నాయి.

సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) డేటా ప్రకారం, గత నవంబర్‌లో నిరుద్యోగం నిష్పత్తి హర్యానాలో అత్యధికంగా 29.3 శాతానికి పెరిగిపోయింది. జమ్మూ కశ్మీరులో 21.4 శాతం, రాజస్థాన్‌లో 20.4 శాతం, బీహార్‌లో 148 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌లో 13.6 శాతం, త్రిపురలో 13 శాతం, గోవాలో 12.7 శాతం, జార్ధండ్‌లో 11.8 శాతంగా నమోదు కాగా, అత్యల్పస్థాయిలో 0.6 శాతానికి ఒడిశాలో, మేఘాలయాలో 0.8 శాతంగా నిరుద్యోగం నమోదైంది. దేశమంతటా ఇలా అత్యధిక స్థాయిలో అటు పట్టణాల్లో, ఇటు గ్రామాల్లో నిరుద్యోగం తాండవిస్తున్నది. లేబర్‌ మార్కెట్‌లో దేశానికి పట్టిన ఈ వైకల్యాన్ని సరిదిద్దే విషయంలో మోడీ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలోనే నిరుద్యోగం అత్యధికంగా ఉందని సిఎంఇఇ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

కొవిడ్‌-19 విపత్తు మొదట 2020లో విజ్బంభించినప్పుడు ఎన్నడూ చూడని పరిస్థితుల్ని దేశం మొదటిసారి చవిచూసింది. భారతదేశంలో లాక్‌డౌన్‌ ఒక సరికొత్త పరిణామంగా తెరమీదకు వచ్చింది. ఇక తదుపరి 2022 కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరంలో లేబర్‌ మార్కెట్‌ పరిస్థితి దయనీయంగా ఆరంభమైంది. పదులు, వందల స్థాయి నుండి వేలకేసుల స్థాయికి ఒకవైపు మెల్లిగా దేశంలో ఒమిక్రాన్‌ కమ్ముకువస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక జనసాంద్రత గల దేశంగా భారత్‌ పరిస్థితిపై హెచ్చరికలు, పెదవి విరుపుతూ గడచిన పది రోజులుగా పెరుగుతూ ఉండటంతో ఆర్థిక వ్యవస్థ, దానిపై ఆధారపడిన పట్టణ, గ్రామీణ నిరుద్యోగం గ్రాఫ్‌ ‘పెరుగుదలతప్ప, తిరోగామి బాటపట్టే పరిస్థితి ఊహకు అందడం లేదు.

ముగింపు :

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమైన నాటి నుండి ఉపాధి రహిత వృద్ధి కొనసాగుతోంది. అందువల్ల పెరుగుతున్న జనాభాకు అనుగుణ్యంగా ఉపాధి పెరగడం లేదు. ఉద్యోగాలు చేయడానికి తగినంతగా యువత ఉన్నప్పటికీ వారిని చేర్చుకొనే స్థాయికి పారిశ్రామిక రంగం వృద్ధి కాలేదు. స్వయం ఉపాధి రంగమూ పుంజుకో లేదు. సాంకేతిక విద్యలో పట్టభద్రలు కోకొల్లలుగా తయారవుతున్నారు. కానీ పరిశ్రమలకు అవసరమైన స్థాయి నైపుణ్యాలు వారిలో కరవుకావడంతో వారు కూడా నిరుద్యోగ జన సంఖ్యను పెంచుతున్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణ నత్తడనకగా సాగుతున్నది. విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను హరించడానికి సైతం కేంద్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు. మరోవైపు 2030 నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి 44 నుంచి 30 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. ప్రస్తుత అంచనా ప్రకారం 2030 నాటికి 145 కోట్ల మందికి వ్యవసాయేతర రంగాల్లో పని కల్పించాల్సి ఉంటుంది. వారందరికీ ఉపాధి కల్పించే విధానాలను అవలంభించకపోతే తలెత్తే పర్యవసానాలకు బాధ్యులెవరు? అందుకు గాను ఏటా 8-9 శాతం చొప్పున ఆర్థిక వృద్ధి రేటు ఉండాలి. అదీ ఉపాధి సహితమైనది కావాలి. అది జరగాలంటే ఆర్థిక విధానాలను అందుకనుగుణంగా మార్చాలి.

ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతున్నా ఉద్యోగాల లభ్యతలో అది ప్రతిఫలించకపోవడం మరొక సమస్యగా ఉంది. చదువుకొంటున్న యువత ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టితో ఏళ్ళ తరబడి కాలక్షేపం చేయడం, తమకు జీవితంలో ఉద్యోగం రాదనే నైరాశ్యంలో కూరుకుపోవడం సర్వసాధారణమైపోయింది. ఇటువంటి యువతను సమీకరించి సంపద సృష్టిలో భాగస్వాములను చేయాలి. వంద కోట్ల వయోజనులున్న ఇండియాలో వేతన ఉద్యోగులు ఎనిమిది కోట్ల మందే కావడం గమనార్హం. మిగతా 92 కోట్ల మంది ఏమి చేస్తున్నట్టు? 2021 డిసెంబర్‌ నెలలో మళ్ళీ అత్యధిక స్థాయికి చేరిన నిరుద్యోగ పెరుగుదల కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఒమిక్రాన్‌ భయాలతో పరిస్థితులుమరింత ఉధృతం అయ్యే ప్రమాదం లేకపోలేదు. లాక్‌డౌన్‌లకు తొందరపడకుండా తగిన జాగ్రత్తలతో పారిశ్రామిక రంగం పుంజుకొనేలా చూడాలి. ఎక్కడికక్కడ పనిపాట్లు కల్పించే సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విశేషమైన దన్ను ఇవ్వాలి. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా యువతకు నైపుణ్యాలు కల్పించడం, ప్రభుత్వ వ్యయాన్ని అధికంచేసి ఉద్యోగ ఉపాధులను పెంచాలి. పట్టణ ఉద్యోగిత పుంజుకొనేలా చేయడంపై ప్రభుత్వ వ్యూహకర్తలు దృష్టి సారించాలి. లేని పక్షంలో సమాజం చాలా అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రజా ప్రయోజనాల కోసం కార్పొరేటు అనుకూల ప్రపంచీకరణ ఆర్థిక విధానాల నుండి వైదొలగడం తప్ప మరో మార్గం లేదు. అందుకు పాలకులపైన ప్రజల ఒత్తిడి పెరగాలి.

Leave a Reply