అనసూయమ్మ 2022, జనవరి 30న తన 97వ యేట హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మావోయిస్టు నాయ‌కుడు   అమరుడు కామ్రేడ్‌ సంతోష్‌ (మహేష్‌)కు కన్నతల్లి. దండ‌కార‌ణ్య సాహిత్య సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక ‘రుంకార్ అమెకు తలవంచి వినమ్ర శ్రద్దాంజలి అర్చిస్తున్నది. ఆమె బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది.

అనసూయమ్మ దాదాపు 80 యేళ్ల క్రితం ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి స‌హ‌చ‌రిగా వర్తమాన జనగామ జిల్లా కడవెండిలో అడుగుపెట్టింది. విసునూరు దొరలతో వీరంగమాడి, కరడుగట్టిన భూస్వామ్యానికి బీటలుబార్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య అమరత్వం రూపంలో తొలిత్యాగాన్ని అందించిన గ్రామంగా కడవెండి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది.

పుట్టిన వర్గం, ముఖ్యంగా కులం రీత్యా ఆమె తొలియవ్వనం ఇంటి గడప లోపలే గడిచిపోయింది.ఇద్దరు బిడ్డలూ, ముగ్గురు కొడుకులకు తల్లి అయింది. అయితే ఆమె వ్యక్తిత్వం ఆమెను భర్త చాటు భార్యగా వుండనివ్వలేదు. పిల్లల పెంపకంల, వాళ్లకు విద్యా బుద్ధులు చెప్పించడంలో, కుటుంబానికి చెందిన ఇతర వ్యవహారాల్లో ఆమెదే నిర్ణయాత్మక పాత్ర.

తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తిరిగి జగిత్యాల జైత్రయాత్ర పల్లెలనూ, పట్టణాలనూ చుట్టుముట్టినప్పుడు కడవెండి వెంటనే స్పందించింది. సీపీఐ (ఎం-ఎల్‌) రాజకీయాలకు ప్రభావితం అయింది. 1980 ల ప్రారంభంలో ఆ వూళ్లోకి రాడికల్‌ రాజకీయాలు  ప్రవేశించాయి. ఆమె ముగ్గురుకొడుకులూ ఎం-ఎల్‌ రాజకీయాలతో మమేకం అయ్యారు. ఒకరు చండ్ర పుల్లారెడ్డి పక్షం తీసుకుంటే, ఇద్దరు రాడికల్స్‌గా మారారు. ఆమె రాడికల్‌ రాజకీయాలను అభిమానించింది, ప్రేమించింది, సొంతం చేసుకుంది. చండ్ర పుల్లారెడ్డి అనుయాయులను తీవ్రంగా విమర్శించింది. ఆ ఇల్లు ఒకవిప్లవ కేంద్రంగా మారింది. అనాడు విరసం, జననాట్య మండలి నేతృత్వంలో అ వూళ్లో జరిగిన ప్రతి కార్యక్రమానికీ అమె చేయూతనిచ్చింది. అ కార్యకర్తలకు తన ఇంట్లో ఆశ్రయాన్ని ఇచ్చింది.

“గ్రామాలకు  తరలండి’లో భాగంగా ఆ వూరికి వచ్చిన రాడికల్‌ పిల్లలకు అన్నం పెట్టింది.

 అలా అనాటి రాడికల్‌ పిల్లలు ఆమెలో గోర్కీ ‘అమ్మ’ను చూసుకున్నారు. ఆ తర్వాత పెరిగిన నిర్బంధంలో తరచూ ఇంటి మీద జరిగే పోలీసు దాడులను అమె ధైర్యంగా ఎదుర్కొంది. పోలీసు అధికారులతో ధిక్కార స్వరంతో మాట్లాడే అమెను చూస్తే ఊరంతా అబ్బురపడేది. 1984లో ఒకేరోజు తేడాతో ఆమె ఇద్దరు కొడుకులూ  అరెస్టయ్యారు. అ దుఃఖాన్ని అమె ధైర్యంగా అధిగమించింది. అ తర్వాత జైల్లో వున్నకొడుకులను తరచుగా కలుస్తూ, వాళ్లకు నైతికంగా మద్దతునిస్తూ, వాళ్ల నుండి ప్రేరణను పొందుతూ, అ ప్రేరణను వూళ్లో వ్యాపింపజేసింది. కొడుకులు జైల్లో వున్నా అమె ఇల్లు “అక్కలకూ, అన్నలకూ” ఆశ్రయమిస్తూనే వుండింది. ఆ వూరికొచ్చే దళానికి ఆమె పెద్ద దిక్కుగా మారింది. ఎంతో మద్దతునిచ్చింది. జబ్బుచేసిన దళసభ్యులను తన ఇంట్లో పెట్టుకొని విప్లవానికి సేవ చేసింది.

నిత్య నిర్బంధం, పోలీసు దాడుల మధ్య కూడా తన ఇల్లును విప్లవకారులకు ఉక్కుకోటగా మలిచింది.

ఆ ప్రాంతంలో పని చేసిన కామ్రేడ్స్‌ మాటల్లో చెప్పాలంటే ఆమె ఒక రహస్య పార్టీ సెల్‌ సభ్యురాలి వలె పార్టీకి ఎన్నో రకాలుగా సేవలందించింది. కొన్నాళ్ల తర్వాత విప్ల‌వ‌ రాజకీయాల్లో కొనసాగుతున్న ఒక కొడుకు పోలీసుల ముందు లొంగిపోయాడు. అ తర్వాత కూడా విప్లవం పట్ల అమె విశ్వాసం చెక్కుచెదరలేదు. అ విప్లవ రాజకీయాలతోనే కొనసాగింది.

1999,     డిసెంబర్‌ 2న అమె జీవితంలో శోక సముద్రం ఉప్పొంగింది. నాటి కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్‌ శ్యాం, మురళిలతో పాటు అమె చిన్న కొడుకు కామ్రేడ్‌ మహేష్‌ అమరత్వంచెందిన రోజది. అ కడుపుకోతను అమె నిబ్బరంగా ఎదుర్శొంది. తన కొడుకు ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదనీ, అది ప్రభుత్వం చేసిన క్రూర హత్యనీ, న్యాయవిచారణను డిమాండ్‌ చేస్తూ హైకోర్ట్‌లో

న్యాయ పోరాటం చేసింది. రీపోస్ట్‌ మార్టం జరిపే దాకా కొడుకు మృతదేహాన్ని తీసుకుపోనని ఖరాఖండిగా చెప్పింది. అమె పట్టుదల ముందు తలవంచిన ప్రభుత్వానికి రీపోస్ట్‌మార్టం చెయ్యక తప్పలేదు. అ తర్వాత కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లి విప్లవ సాంప్రదాయాలతో అంత్యక్రియలు జరిపించింది. పితృస్వామ్యాన్ని ధిక్కరిస్తూ కాళోజీతో కల్సి కొడుకు చితికి నిప్పు పెట్టింది. ఆ రోజు జరిగిన సంస్మరణ సభలో ఆమె చేసిన ప్రసంగం అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో ఉత్తేజం నింపింది. అ తర్వాత కొడుకు స్టూపం కట్టుకోవడానికి పోలీసు రాజ్యంతో తీవ్రంగా పోరాడింది. స్థూప నిర్మాణాన్ని అడ్డుకోవడానికి గాను బహిరంగ స్థలంలో ఎక్కడా

అనుమతినివ్వని పోలీసుల దుర్మార్గానికి ఆమె తలవంచలేదు. తన ఇంటి ప్రాంగణంలోనే స్థూపాన్నికట్టించింది. ఏటా డిసెంబర్‌ 2న స్మారక సభ జరిపించింది.

 ఒకనాడు ఇంటి నాలుగు గోడలకే పరిమితమైన అమె, అ తర్వాత విప్లవకారులకు అండగానిలవడమే కాదు, ఆ వూరికి సంబంధించిన అన్ని సామాజిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకొనేది. ప్రజా పంచాయితీల్లో పాల్గొని న్యాయం పక్షాన నిలబడి నిర్భీతిగా మాట్లాడేది. ఆమె మాట క్లుప్తంగా, సూటిగా, నిక్కచ్చిగా, కుండబద్ధలు కొట్టినట్టుగా వుండేది. అందుకే అమె అంటే ఇరువర్గాల నుండి

డబ్బులు మింగి పంచాయితీలు చేసే మధ్యవర్తులకు భయం. పీడిత ప్రజలకు అపారమైన గౌరవం. పెద్దలంతా అమెను ‘సూర్యమ్మ గారూ” అని పిలిస్తే, చిన్న వాళ్లంతా ‘అమ్మా’ అని పిలిచేవాళ్లు. “అమ్మ” అమె సర్వనామంగా మారింది.

అమెతోటి సాటి కులం మహిళలు కేవలం ఇంటి పనికే పరిమితమయ్యేవారు. ఆమె మాత్రం అ కట్టుబాట్లను తెంచుకుని పొలానికి వెళ్లి దగ్గరుండి వ్యవసాయం చేయించేది. ఈ విధంగా విశిష్టమైన వ్యక్తిత్వంతో అమె ఒక ప్రత్యేకమైన మహిళగా అ వూరి ప్రజలపై, ఆ వూరితో సంబంధాలున్న విప్లవకారులపై తనదైన ముద్ర వేసుకుంది. అణగారిన వర్గాల పక్షాన నిలబడి తన జీవితాన్ని సార్ధకం చేసుకుంది.

 కామ్రేడ్‌ అనసూయమ్మకు జోహార్లు!

Leave a Reply