విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు భీమాకోరేగావ్ కేసులో దాఖ‌లుచేసిన అన్ని పిటిష‌న్ల‌ను బాంబే హైకోర్టు బుధ‌వారం కొట్టివేసింది. కంటి శ‌స్ర్త‌చికిత్స పూర్తిచేసుకుని మూడు నెల‌ల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన ద‌ర‌మిలా శాశ్వ‌త బెయిలు కోసం పెట్టిన ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. కండీష‌న్ తొల‌గించి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే వీలు క‌ల్పించేందుకూ నిరాక‌రించింది. ఇక మిగిలింది తాత్కాలిక  మెడిక‌ల్ బెయిల్‌. ఈ బెయిల్‌ను కూడా తీసివేసిన‌ట్టే! మూడునెల‌ల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గ‌డువు తీర‌గానే స‌మీక్షిస్తామ‌ని త‌న తీర్పులో కోర్టు చెప్ప‌కపోవ‌డ‌మే దీనికి కార‌ణం. కాట‌రాక్ట్ చికిత్స చేయించుకుని జైలుకు వెళ్లిపోవాల‌ని న్యాయ‌మూర్తి స్ప‌ష్టంగానే ఆదేశించారు. నిజానికి, వీవీ విష‌యంలో ఎన్ఐఏ ఇదే కోరుకుంది. ఆయ‌న‌ను తిరిగి జైలుకు పంపాల‌ని ఏడాదిగా ఈ సంస్థ చేయ‌ని కుట్ర‌లు లేవు. ఇందుకు అది చేస్తూ వ‌చ్చిన వాద‌న‌లే న్యాయ‌మూర్తి  త‌న తీర్పుగా చ‌దివి వినిపించారు. *ఆరోగ్య‌ప‌రిస్థితులు చూసుకోడానికి జైలులో వైద్యులున్నారు.. మెడిక‌ల్ బెయిల్ తీసివేసి ఆయ‌న‌ను వెంట‌నే జైలుకు పంపేయండి* అని ఈ సంస్థ తెస్తున్న ఒత్తిడికి జ‌డ్జి పూర్తిగా లొంగిపోయారు. అందువ‌ల్లే ఈ తీర్పును, ఎన్ఐఏ తీరును విర‌సం ఖండిస్తోంది. కోర్టులు వాచ్య రూపేణా ప్ర‌క‌టించుకునే ప్ర‌జాస్వామిక, లౌకికి అనుకూల వైఖ‌రికీ.. అవి లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చే తీర్పుల‌కు పొంత‌న ఉండ‌టం లేదు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఇటీవ‌లికాలంలో గ‌మ‌నిస్తున్న కొత్త పోక‌డ ఇది. అయితే, మిగ‌తా రాజ్యాంగ అంగాల మాదిరిగానే జ్యుడీషియ‌రీని కూడా నిరంకుశ ఉద్యోగ‌వ‌ర్గ‌మే న‌డిపిస్తోంది. జ‌వాబుదారీత‌నం, బాధ్య‌త లేని వ్య‌వ‌స్థ ఇది. ప్ర‌జా ప్రాతినిథ్యం లేని ఇలాంటి వ్య‌వ‌స్థ‌లు గాజుక‌న్ను న్యాయ‌మే అందించ‌గ‌ల‌వు. అందుకే ఇలాంటి తీర్పులు వ‌స్తున్నాయి. వ్య‌వ‌స్థ అన్న త‌ర్వాత రాజ్యాంగం ప్ర‌కారం పోయి ప్ర‌జామోదం పొందే కొంద‌రు బ్యూరాక్ర‌ట్లు, రెండు, మూడు మంచి తీర్పులు ఇచ్చే న్యాయ‌మూర్తులు ఉంటూనే ఉంటారు. అటువంటి పిడికెడు మందిని చూపించి వ్య‌వ‌స్థ‌ల‌ను స‌మ‌ర్థించుకోవ‌డం పాల‌క‌వ‌ర్గాల‌కే చెల్లు. ప్ర‌జా ఉద్య‌మాల ఒత్తిడి వ్య‌వ‌స్థ‌ల‌పై నిరంత‌రం ఉండ‌ట‌మే నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం! పుట్ట‌డ‌మే ఎన్ఐఏ వంటి సంఘ్ సంస్థ‌లు ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య‌చేశాయి. ప్ర‌జా ఉద్య‌మాల‌ను బ‌ల‌ప‌రిచే అన్నిర‌కాల‌ భావ‌జాలాల‌పై క‌క్ష పూని ప‌ని చేస్తున్నాయి. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను లొంగ‌దీసుకుని అన్యాయ‌మైన తీర్పుల‌ను రాయిస్తున్నాయి.  

తీవ్ర అనారోగ్యంతో గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన వీవీ ఆరు నెల‌ల కాలానికి మెడిక‌ల్ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ బెయిల్ గ‌డువు ఆ ఏడాది సెప్టెంబ‌రుతో ముగిసింది. అప్పుడు వీవీ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వేసిన మూడు పిటిష‌న్ల‌పై నిర్ణ‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కు కోర్టు సాగ‌దీసింది. నిజానికి, వీవీని తిరిగి జైలుకు పంపింపాల‌ని ఎన్ఐఏ తెచ్చిన ఒత్తిడే ఈ సాగ‌దీత‌కు కార‌ణం. అయితే..ఇదే కేసులో జైలుకు పంపిన ప్ర‌తిష్ఠ క‌లిగిన జేసూట్‌ స్టాన్ స్వామి దుర్భ‌ర మ‌ర‌ణం కోర్టును వెనుక‌డుగు వేసేలా చేసింది. జైలుకు తిరిగి వెళ్లాల్సిన గ‌డువు ముగిసిపోతున్నా..బెయిల్‌పై చివ‌రినిమిషం వ‌ర‌కు స్పందించేది కాదు. ఆయ‌న క్షేమం కోరే కుటుంబ‌స‌భ్యుల‌ను, న్యాయ‌వాదుల‌ను ప్ర‌తిసారీ తీవ్ర ఆందోళ‌న‌లోకి నెట్టేసేది. మూడు వారాలుగా తీర్పును రిజ‌ర్వులో పెట్టిన కోర్టు.. వీవీ వేసిన మూడు పిటిష‌న్ల‌లో దేనినీ స్వీక‌రించలేదు. మొత్తంగా విచార‌ణ ప్ర‌క్రియ‌నే ఒక ప్ర‌హ‌స‌నంగా ముగించేసింది. ఈ క్ర‌మంలోనే మూడు బెంచీలు మారాయి. వీవీ పిటిష‌న్ల‌పై  రేపో మాపో తీర్పు వ‌స్తుంద‌ని ఆశించిన‌ప్పుడ‌ల్లా.. బెంచ్ మారిపోయేది. ఎన్ఐఏకు న‌చ్చిన బెంచ్ ఏర్ప‌డేవ‌ర‌కు ఈ డ్రామా విసుగూవిరామం లేకుండా సాగింది. రెండోసారి వేసిన బెంచ్.. వీవీ త‌ర‌ఫు వాద‌న‌లు విన‌డానికే ఇష్ట‌ప‌డ‌లేదు. ఎన్ఐఏ ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయింది. వీవీ వ‌య‌సు..దీర్ఘ‌కాలిక‌ అనారోగ్య స‌మ‌స్య‌లు, కుటుంబ స‌ప‌ర్య‌లు అవ‌స‌ర‌మైన శారీర‌క స్థితి.. వీటిలో వేటినీ ప‌రిగ‌ణించకుండానే మూడో బెంచ్ దుర్మార్గ‌మైన తీర్పు రాసేసింది. వీవీని తిరిగి జైలుకు పంపాల‌ని జ‌రుగుతున్న కుట్రలో భాగ‌మైన ఈ తీర్పును విర‌సం వ్య‌తిరేకిస్తోంది. కండీష‌న్ తొల‌గించి, కుటుంస‌భ్యుల‌తో క‌లిసి ఉండేలా శాశ్వ‌త బెయిల్‌ను ఇవ్వాల‌నే న్యాయ‌మైన డిమాండ్‌ను అంద‌రం బ‌ల‌ప‌రుద్దాం.  

– అర‌స‌విల్లి కృష్ణ‌, అధ్య‌క్షుడు

– రివేరా, కార్య‌ద‌ర్శి 

విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం 

Leave a Reply