ఈ తరం మహిళలు నిర్మిస్తున్న పోరాట గాథ

ఇది కొత్త తరం పోరాటాల యుగం.  సాంప్రదాయక విలువలను, దోపిడీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ మహిళలు పోరాటాల్లోకి వస్తున్నారు. తద్వారా పోరాటాలు కూడా కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందులో వెచ్చ ఘాట్ పోరాటం ఒకటి.

‌‌బహుళజాతి కంపెనీల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్  జిల్లాలోని చిత్రం, వెచ్చఘాట్, కాంధాడిల్లో బిఎస్.ఎఫ్ క్యాంపుల నిర్మాణం, పరాల్‌కోటని పర్యాటక కేంద్రంగా మార్చాలని, కోత్రి నది మీద వంతెన నిర్మాణం, మర్రొడ నుండి రోడ్డు నిర్మాణం చేయాలని ఆదివాసులు చాలా కాలంగా పోరాడుతున్నారు.   ఈ పథకాల  వల్ల ఆదివాసీ-మూలవాసీ ప్రజల అస్థిత్వానికీ, సంస్కృతికి అపార నష్టం వాటిల్లుతుంది. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ప్రజలు జల్-జంగల్-జమీన్ మరియు పర్యావరణం, ప్రజల స్వావలంబనను రక్షించటానికి 2021 డిశంబరు 7 వ తేదీ నుంచి వెచ్చఘాట్ పోరాటం మొదలు పెట్టారు. మా గ్రామాల్లో ‘పోలీస్ క్యాంపు, పర్యటన స్థలం, వంతెన, రోడ్లు అనుమతించబోమ’ని పెసా చట్టం 5వ షెడ్యూల్ ప్రకారం ‘గ్రామసభలకే సర్వాధికారాలుండాల’నే డిమాండ్స్ తో పోరాటాన్ని మొదలు పెట్టారు.

‌‌సంవత్సర కాలం నుంచి జరుగుతున్న ఈ పోరాటంలో చేసిన ధర్నా, రాస్తారోకో, సభ, మహా పంచాయతీలకు మహిళలు విస్తృతంగా కదిలారు. ఎండనక, వాననక, చలనక అన్నింటికీ తట్టుకొని పాలు తాగే పిల్లలను సైతం చంకనేసుకొని ధర్నాలో పాల్గొన్నారు. వ్యవసాయ పనులు, సీజనల్ వారీగా ఉండే అటవీ ఉత్పత్తుల సేకరణ (విప్ప పూవు, తునికాకు, రేఖ, గార, హరింగ…), ఇంటిపనులు ఉన్నప్పటికీ మహిళలు ఉత్సాహంగా ధర్నాలో పాల్గొన్నారు. మహాన్ భూమ్‌కాల్ సంఘర్ష్ లో అమరులైన వీర వనితల స్ఫూర్తిగా పోరాటంలో పాల్గొని ఒక అడుగు ముందుకేశారు.

‌‌పోరాటం మొదలైన దగ్గర నుంచి జరిగిన కార్యకలాపాల్లోనూ, పోరాటానికి ముందుండి నాయకత్వం వహించిన కమిటీలోనూ, వివిధ టీమ్స్…వక్తల టీమ్స్, ప్రచార టీమ్స్, సాంస్కృతిక టీమ్స్ లోనూ నడివయసు మహిళలు, యువతులు ముందుండి పోరాట సందేశం ప్రజలకు అందించటంలోనూ, ఎప్పటికప్పుడు ఆయా రూపాల్లో పోరాటాన్ని ప్రచారం చేయటంలోనూ, ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పటానికి చేసిన ఆయా కార్యక్రమాల్లోనూ, వాటిని విజయవంతం చేయటానికి శాయశక్తులా కృషి చేశారు.

 ‌‌పితృస్వామ్య సమాజం ఇప్పటికీ మహిళలను రెండవ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నప్పటికీ, నేడు వెచ్చఘాట్ పోరాట మహిళలు ‘మేం మొదటి శ్రేణి పౌరులమే’ అని  నిరూపించారు.

అందుకే వారి నినాదాలు …

  • మాకు పోలీసు క్యాంపు వద్దు, మాకు కడుపు నిండా తిండి కావాలి,
  • మాకు పర్యటన కేంద్రం వద్దు, మాకు తాగటానికి నీళ్ళు కావాలి,
  • మాకు రోడ్లు వద్దు; వంతెన వద్దు, మాకు ఉండటానికి ఇంత భూమి కావాలి, మా అడవిపై మాకే అధికారం కావాలి’

…అని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. దీన్నుంచి వెనుకడుగు వేయలేదు. ఎవరు ప్రశ్నించినా ఇదే సమాధానం. ఒకటి కాదు, రెండు కాదు. చుట్టుపక్కల డజన్ల కొలదీ ఊర్ల మహిళలు. అంతేకాదు ఎక్కడెక్కడి నుండో వచ్చినవారు కూడా వున్నారు.

‌‌ఈ పోరాటం మొదలైన వేదిక నుంచే జరుపుకున్న కార్యక్రమాల్లో కూడా మహిళలు, యువతులు విస్తృతంగా భాగస్వాములయ్యారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని ఖండిస్తూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో రాసుకున్న హక్కులను ఉల్లంఘిస్తుండటానికి నిరసనగా ఒక రోజు చేసిన నిరాహార దీక్షలో మహిళలు పాల్గొన్నారు. ‘మాడియా రాజ్య స్థాపన’ దినోత్సవమైన ‘మహాన్ భూమ్‌కాల్ సంఘర్ష్ దివస్ గా ఫిబ్రవరి 10 ని, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరుపుకొని వాటికున్న ప్రాముఖ్యతను ఒక స్పిరిట్ గా తీసుకొని ముందుకు పోవాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. వీటితో పాటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, క్రూరమైన చట్టాలలో ఉన్న లొసుగులను సభల్లో ఎండగట్టారు. శత్రు చేసిన, చేస్తున్న నరసంహారం…సార్కిన్‌గూడ, తాడబల్ల, సిలింగేర్ ఘటనలను, సుక్మా జిల్లాలో ప్రజలపై చేసిన డ్రోన్ దాడులను ఖండించారు. అలాగే చుట్టుపక్కల జరుగుతున్న సిలింగేర్, హసదేవ్ పోరాటాలకు సంఘీభావం తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలనే డిమాండ్‌తో అటవీ ఉత్పత్తుల రేట్లు పెరుగుదలకు, వడ్లు రేట్ల పెంపుకు జరిగిన పోరాటాల్లో కూడా మహిళలు పాల్గొన్నారు.

‌వెచ్చఘాట్ పోరాటానికి వెన్నంటి ఉన్న అన్ని రకాల ప్రేరకాలను అందిస్తూ సంవత్సరం నుంచి పోరాటంలో పాల్గొన్న మహిళలు అభినందనీయులు. ఈ కార్యక్రమాల్లో బెంగాలీ మహిళలు, యువతులు పాల్గొనటం విశేషం. అలాగే పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వారికి సరైన సమయంలో సరైన వైద్య చికిత్స అందించి పోరాటంలో చురుకుగా వారిని పాల్గొనేటట్లు చేసిన మహిళా వైద్య టీమ్ సేవలు అభినందనీయం. సంవత్సరం పొడవునా జరిగిన సభలకు వేదిక నిర్వాహకులుగా ఉండి సభను నడిపించటం, సభ  ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజలకు అందించటంలోనూ మహిళలు చాలా కృషి చేశారు.

 ఆదివాసీ మహిళలు  ఈ పోరాటాన్ని  నలుమూలలకు వ్యాపించేలా తమ బాధ్యతను నేరవేర్చటం, బస్తర్ సంభాగ్ ను సమన్వయం చేసే వేదిక వరకు మహిళ పరిణితి చెందటం హర్షదాయక విషయం.

దేనికంటే ఆదివాసీ మహిళా ఇప్పుడే పోరాటంలోకి రాలేదు. తరతరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు.  ఆదివాసీ-మూలవాసీ ప్రజలు అడవితో మమేకమై అవినాభావ సంబంధంతో జీవనాన్ని గడుపుతున్నారు. ఆదివాసులను ‘అడవి’ నుండి వేరు చేసి విడిగా చూడలేము. తెల్లారి లేచింది మొదలు పొద్దు గూకే వరకు అడవితోనే వారి జీవితం. వారి ఆర్థిక వ్యవస్థ, సామాజిక-సాంస్కృతిక జీవనం కూడా అడవితోనే ముడిపడి ఉంటుంది. నిరంతరం అడవితోనే పెనవేసుకొని ఉండటంతో వారి జీవితానికి ఎటువంటి కఠిన సమస్య లేదు. ఆహార సేకరణకు అడవే వారికి ఆధారం. ఆయా సీజన్స్ లలో వందకు పైగా సహజ ఉత్పత్తులు సులభంగా దొరుకుతాయి. ఈ సహజోత్పత్తి కారణంగానే ఆదివాసులు ఎవరిముందు తలొంచలేదు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యవాదం ముందు కూడా.

‌‌భారతదేశానికి బ్రిటీష్ వారి రాకతో ఆదివాసీ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేసింది. బ్రిటీష్ వారు అడవిని, అడవిలో ఉన్న సంపదను కబ్జా చేయటానికి ముందు ‘అటవీ చట్టాలను’ తీసుకొచ్చారు. ఈ చట్టాల వలన ఆదివాసీ ప్రజలు అడవికి దూరమైపోయారు. జీవితం దిన దిన గండంగా మారింది. సొంత గడ్డ మీదే పరాయి వాడి పాలన కింద బతకాల్సిన దయనీయ పరిస్థితి. పరాయి వాడి దాస్య శృంఖలాల నుండి విముక్తి కావటానికి, జల్-జంగల్-జమీన్ లపై ఆదివాసీ-మూలవాసీ ప్రజలకే హక్కు-అధికారాలుండాలని ఆదివాసీ ప్రజల నాయకులు గేంద్ సింహ్, గుండాధూర్, డేబిర్‌దూర్ ల నాయకత్వంలో 1910 లో భూమ్‌కాల్ పోరాటాన్ని నడిపి విజయవంతం చేశారు.  ఈ అన్ని పోరాటాల్లో మహిళలు ఉన్నారు.  సాంప్రదాయిక ఆయుధాలైన విల్లంబులతో బలవంతుడైన, పరపతి, ఆధునిక ఆయుధాలు ఉన్న బ్రిటీష్ సామ్రాజ్యవాదంతో సాగిన పోరాటాల్లో మహిళలు అనేక రకాలుగా భాగమయ్యారు.  కానీ బ్రిటీష్ సామ్రాజ్యవాదం క్రూరమైన దమనకాండను ప్రయోగించి ఆ పోరాటాన్ని అణచివేసింది.

‌‌1947 లో తెల్లోళ్ళు పోయి నల్లోళ్ళు అధికారంలోకి వచ్చారు. అయినా ఆదివాసీ ప్రజల జీవితాల్లో వీసమెత్తు మార్పు లేదు. ప్రభుత్వాల మోసపూరిత పద్ధతులను వ్యతిరేకిస్తూ ఆదివాసీ ప్రజలు లెక్కలేనన్ని పోరాటాలు చేశారు. కానీ ఏ పోరాటాలు అక్షరీకరించబడలేదు. ప్రజలు చేస్తున్న పోరాటాలను పక్కదారి మళ్లించటానికి ప్రభుత్వం ‘పెసా’ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీన్ని కూడా రాజ్యాంగంలో రాసుకున్న విధంగా అమలు చేయ లేదు. ప్రజల దైనందిన అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, సాగునీరు-త్రాగునీరు, విద్య-వైద్యం లను తీర్చకుండా బహుళజాతి కంపెనీలకు, బడా పెట్టుబడిదారుల లాభాలు చేకూర్చే విధంగా గనుల తవ్వకం, రోడ్డు, రైల్వే లైనుల నిర్మాణం, భారీ ప్రాజెక్టులు, భారీ డ్యామ్, భారీ పవర్ ఫ్లాంట్ తదితరాల నిర్మాణానికి కంకణం కట్టుకొంది.

‌‌కేంద్రంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ బి.జె.పి. అధికారంలోకి వచ్చాక ఈ పథకాల వేగం మరింత పెరిగింది. ఆదివాసీ ప్రజలు నివసించే ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న కోట్ల రూపాయల ఖనిజ సంపదను, ప్రాకృతిక సంపదను దోచుకోవటానికి అమాయక ఆదివాసీ ప్రజలను తమ ఉక్కుపాదంతో అణిచి వేయటానికి కూడా సిద్ధపడ్డారు. కార్పెట్ సెక్యూరిటీని విస్త్రతం చేశారు, కమ్యూనికేషన్స్ ను వేగవంతం చేశారు. ప్రశ్నించిన వారిని అర్బన్ మావోయిస్టులుగా, ప్రస్తుతం ‘కలంపట్టిన నక్సల్స్ గా’ ముద్రవేసి ఉపా వంటి క్రూరమైన చట్టాల కింద తప్పుడు కేసులు మోపి జైళ్లలో బంధిస్తున్నారు, విప్లవోద్యమ ప్రాంతాల్లో సాధారణ ప్రజలను సైతం కాల్చి చంపుతున్నారు. ప్రజల సంస్కృతి-సాంప్రదాయాలు, ఆచార- వ్యవహారాలపై దాడులు చేస్తూ మూలవాసీ ప్రజలను అవమానం చేస్తున్నారు. పైగా ఆజాదీ వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’ అని ఢంకా భజాయిస్తున్నారు. ‘ఎవరి కొచ్చిందీ ఆజాదీ? దేని కోసం అమృత మహోత్సవ్?’ అని మూలవాసీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఏ పోరాటమైనా, ఏ చిన్న నిరసన అయినా సారాంశంలో జల్-జంగల్-జమీన్ లపై సర్వాధికారాలు దక్కాలనేదే.

‌‌ప్రజల మనుగడకే ఆటంకంగా ఉన్న నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ, రాజ్యాంగంలో రాసుకున్న చట్టాలను అమలు చేయాలని ప్రజలు వీధుల్లోకొస్తున్నారు. రాజ్యాంగంలో రాసుకున్న ప్రకారం గ్రామసభ ఆమోదం లేకుండా ఏ నిర్మాణం తల పెట్టరాదని సంవత్సర కాలంగా జరుగుతున్న పోరాటమే వెచ్చఘాట్ పోరాటం. ఈ పోరాటం ఆరంభం నుంచి ఇందులో మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఈ తరం యువతులు ముందుండి నడిపిస్తున్నారు. ‌ఆదరించి ఆశ్రయ మివ్వటమే తప్ప ఆక్రమించే స్వభావం లేని ఆదివాసీ ప్రజలు ముఖ్యంగా మహిళలు దోపిడీ వర్గ ప్రభుత్వాలు ప్రాకృతిక సంపదను, ఖనిజ సంపదను దోచుకోవటానికి చేస్తున్న కార్పోరేటీకరణ-సైనికీకరణ ప్రయత్నాలను బట్టబయలు చేస్తూ ముందుకెళుతున్న వెచ్చఘాట్ లో మహిళలు ప్రదర్శిస్తున్న పోరాట స్ఫూర్తి అందరికీ ప్రేరణదాయకం.

Leave a Reply