ప్రొ. ప‌ద్మ‌జా షా

(ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తాయ‌ని ప్రొ. ప‌ద్మ‌జాషా(జ‌ర్న‌లిజం విభాగం, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం) అంటున్నారు. ఇండియాలో లిబ‌రల్ డెమోక్ర‌సీ పాదుకొన‌డానికి అవ‌కాశం లేని సామాజిక ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.  వ్య‌క్తి స్వేచ్ఛ లేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం..వ‌సంత‌మేఘం టీం)

1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా అల్ప సంఖ్యాకులను, దళితులను తీవ్రంగా పీడనకు గురిచేస్తారు అని అర్ధం చేసుకోవచ్చు . గెలుపు ద్వారా తమ భావజాలానికి ప్రజలు ఆమోద ముద్ర వేశారని చెప్పుకుంటారు.

2. ఒకవేళ రాబోయే జనరల్‌ ఎలక్షన్స్‌లో ఏదో ఒక ఓట్ల సమీకరణ బలపడి బీజేపీ ఓడిపోతే దేశం ఫాసిజం నుంచి విముక్తి చెందినట్లేనా? 

ఎలెక్షన్లల్లో భజపా ఓడిపోతే, ఆ ఎదురుగాలి ఆధారంగా  ప్రతిపక్షాలకు ఫాసిస్ట్ శక్తులను బలహీన పరిచేందుకు కొంత ఆసరా దొరుకుతుంది.  సాధారణ పౌరులు, రాజకీయ నాయకుల, పార్టీల అనుచరులు తమ మద్దతు ని పెద్దగా భావజాలం ఆధారంగా ఇవ్వరు. అందుకే ఎవరు గెలిస్తే వారి పంచన చేరతారు. అందుకే ప్రతిపక్షాలు గనక గెలిస్తే, ఓడిపోయిన పార్టీల నుంచి  విడిపోయి గెలిచిన వాళ్ళకి మద్దతు పలికే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా వాడుకొని, ప్రతిపక్షాలు ఇప్పటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి.  

3. కొంత మంది బీజేపీని, ఫాసిజాన్ని సమానార్థంలో చూస్తున్నట్లుంది. మీరేమంటారు?

భాజపా ఒక ఫాసిస్ట్ ధోరణి ఉన్న, ఫాసిస్ట్ భావజాలం నుంచి పుట్టిన పార్టీ. ఏ ఇజమూ నూటికి నూరు పాళ్ళు మనం పుస్తకాలలో ఇచ్చుకున్న నిర్వచనాలకి  మ్యాచ్ కాదు. ఎందుకంటే ఈ ధోరణులు  దేశ  కాల పరిస్థితులు, భౌగోళిక ఉనికి, చరిత్ర మొదలైన వాటి ప్రభావం తో ఒక్కో చోట ఒక్కో స్వరూపాన్ని దాలుస్తాయి. ప్రజాస్వామిక రాజకీయాల ఒత్తిడికి లొంగి తమ అసలు స్వరూపాన్ని దాచి, అభివృద్ధి గురించి మాట్లాడినా, అంతిమంగా అధికారం వచ్చాక ఆ పార్టీ ఫాసిస్ట్ ఎజెండానే అమలు చేస్తుంది.  అంటే అంతర్జాతీయంగా, జాతీయంగా పెట్టుబడి దారి వ్యవస్థను బలపరచడం, యుద్ధ పరిశ్రమలకు అండగా ఉండటం, శ్రామికుల హక్కులని హననం చేసి కొందరు పెట్టుబడిదారులకి లాభం కలిగించటం, ఈ ముఖ్య ఆశయం సాధించే ప్రక్రియలో జనాన్ని మతకలహాల్లో ముంచేసి ప్రాణభయంతో బతికే పరిస్థితి కలిగించటం చేస్తారు.  

4. అసలు బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల రాజకీయాలు ఎంత పని చేశాయి? సంఘ్‌ప‌రివార్‌ సామాజిక, భావజాల కారణాలు ఎంత పని చేశాయి?

1960ల్లో, 70ల్లో ప్రజాస్వామిక రాజకీయాల మీద నమ్మకం సడలడం మొదలైంది. పెద్ద విప్లవ ఉద్యమాలు వచ్చినాయి. ఎమర్జెన్సీ తరవాత  మళ్ళా ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టే ప్రయత్నం జరిగింది. కానీ ఆ దశకంలోనే ఆరెస్సెస్ భావజాలం కూడా ఎమర్జెన్సీ వ్యతిరేక శక్తుల వెనకే బలపడింది. ఆర్ధిక సంక్షోభాలు, దానికి పరిష్కారంగా వచ్చిన ప్రపంచీకరణ, అన్నీ కలిసి ఫాసిస్ట్ శక్తులకు సమాజంలో వేళ్ళూనుకునే అవకాశాన్ని కల్పించాయి. అదే దశకంలో రాజకీయాల్లో నేరస్తులు వస్తున్నారని, ఈ ధోరణి నియంత్రించాలని మొదటగా చర్చ కూడా వచ్చింది. కానీ అప్పటి నాయకులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ప్రజలు నిర్లిప్తంగా ఉండటమే కాక అటువంటి నేరస్తుల్ని పెద్ద మెజారిటీలతో ఎన్నుకొని శాసన సభలకి పంపారు. పాల్ బారాన్ లాటిన్ అమెరికన్ రాజకీయాల్లో లుంపెన్ శక్తులు ఏవిధంగా లుంపెన్ అభివృద్ధికి పునాదులు వేశారని చెప్తారో అట్లే ఇక్కడ  కూడా లుంపెన్ డెమోక్ర‌సీకి పునాదులు పడ్డాయి. ఆరెస్సెస్ ప్రముఖంగా నేర చరిత్రకల వారికీ నేరస్వభావం ఉన్న వారికి ఈరోజు ఒక స్థావరంగా ఉందంటే, రాజకీయంగా లుంపెన్ డెమోక్రసీ లో అధికారంలోకి రావటానికి అది అవసరం. సాధారణ ప్రజలకి ఇది ఆమోద యోగ్యం చేయటానికి, మతం, దేవుళ్ళు, తిలకాలు, కాషాయ వ‌స్త్రాలు తీసుకొస్తారు. మతాల ప్రతీకల ద్వారా అల్ల కల్లోలాలు సృష్టించవచ్చు. ఆ కల్లోలంలో  నుంచి వచ్చిన ఆగ్రహాన్ని వోట్లలోకి మలుచుకోవచ్చు.  డెబ్భైల దశకంలో ఆరెస్సెస్ మళ్ళీ తలెత్తుతున్న రోజుల్లో అధికార పార్టీలు, సమాజం ఏమరుపాటు తో ఉండటం నే టి  పరిస్థితికి ముఖ్య కారణం. ప్రజాస్వామ్యాన్ని, దాని విలువలని కాపాడుకోవటం ఒక నిరంతర ప్రక్రియ.

5. ఈ ఏడేళ్లలో సంఘ్‌ప‌రివార్ సాంఘిక, సాంస్కృతిక దాడుల మీద వచ్చినంత విమర్శ దాని రాజకీయార్థిక విధానాల మీద రాలేదు. దీనికి ఫాసిజాన్ని  అర్థం చేసుకోవడంలోనే లోపం  ఉందనుకోవాలా?

హిందూ సమాజం కుల వ్యవస్థ వల్ల అసమానతలను జీర్ణించుకొని, నిత్యం అన్ని స్థాయిల్లో తమకంటే సామాజికంగా తక్కువ అనుకున్న వాళ్ళ పట్ల క్రూరంగా ఉండటం సాధారణం. ఆధిపత్య ధోరణి, పితృస్వామ్య ధోరణులు సమాజం మొత్తంలో పాకి ఉన్నాయి. ఇతరుల పట్ల సాంఘికంగా, సాంస్కృతికంగా అసహనంతో వివక్షతో ఉండటం కూడా సర్వ సాధారణం. కాకుంటే రాజ్యాంగంలో, చట్టాలలో కొన్ని పరిధులు ఉండటం తో, మరీ బహిరంగంగా ఇటువంటి ప్రవర్తన, కనీసం, నగరాల్లో ఉండేది కాదు. గత నాలుగేళ్ల గా ఇది ఒక పధ్ధతి ప్రకారం పేట్రేగు తోంది. వీడియోలు తీసి ఘనత చాటుకోవటం, నేరస్థులకు ఎటువంటి శిక్ష లేక పోవటం, నేర నిర్ధారణ జరిగినాక అటువంటి వ్యక్తులకి శాసన సభల కు టిక్కెట్లు ఇవ్వటం, పదవులు కట్టపెట్టటం మొదలయ్యింది. ప్రతి ఫాసిస్ట్ ప్రయత్నంలోనూ లంపెనైజేషన్, విపరీతమైన హింస, కొందరిని శత్రువులుగా చేసి హింసించి, నిత్యం  జనాన్ని భయభ్రాంతుల్ని చేసి వారి పై పూర్తి నియంత్రణ సాధించటం జరుగుతుంది. ప్రజలకి రాజకీయ ఆర్ధిక విధానాలలో అన్ని పార్టీలు ఒకే లాగ కనిపించ సాగాయి. భాజపా కి ఉన్న ముఖ్య వ్యత్యాసం హిందూ మతోన్మాదం. మతోన్మాదం ద్వారా చాల మందిలో ఇతర మతాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టారు. ద్వేషం అప్పటికే కొంత ఉండటం తో అది పెద్ద కష్టం కాదు. రాజకీయ ఆర్ధిక విధానాలకి ఫాసిస్ట్ ధోరణులకు ఉన్న సంబంధాన్ని ఏ పార్టీ కానీ, పౌర సమాజం కానీ ప్రయాసపడి ప్రజలకు తెలిసేట్టు  చెప్పలేక పోయాయి. గమనిస్తే నేటి రాజకీయాల్లో కేవలం అల్పసంఖ్యాకులను హింసించటం వల్లనే భాజపాకి మద్దతు వస్తోంది. ఆర్ధిక విధానాలు ఎంత దారుణంగా ఉన్న, కేవలం ముస్లిం-క్రిస్టియన్ వ్యతిరేకత ప్రాతిపదికగా వాళ్లకి ఓట్లు వేస్తున్నారు. ఈ ఓట్లు వేసేవారిలో హిందూమతంలో  కుల వివక్షకు గురైన వాళ్ళుకూడా ఉంటారు. 

6. బూర్జువా ప్రజాస్వామ్యం ఉన్న సమాజాలన్నిట్లో ఫాసిజం తలెత్తుతుందని చెప్పలేం కదా? మరి ఇండియాలో ఫాసిజం రావడానికి కారణాలను ఎక్కడ చూడాలి?

ఫాసిజానికి ముఖ్య పునాది మతమైనా, జాత్యహంకార మైనా  ఉంటాయి.  ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల‌ని  చెప్పుకునే చాలా దేశాల్లో కనిపిస్తాయి. అమెరికాలో ఉంది. ట్రంప్ అధ్య‌క్షుడిగా  ఉన్నప్పుడు బాగా బలపడ్డది. అక్కడ మతం, జాత్యహంకారం రెండు బలంగా ఉన్నాయి. కానీ కొంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ, అక్కడి పరిపాలనా వ్యవస్థ కొంత పరిపక్వం చెంది ఉండటంతో నిలదొక్కు కుంటున్నారు. భారత దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా పరిపాలన వ్యవస్థ భ్రష్టు పట్టింది. పోలీస్, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, జవాబుదారీతనం లేకుండా ఉంటున్నాయి. నియంత్రణ లేని పరిస్థితిలో ఫాసిస్ట్ లుంపెన్ ధోరణులు బాగా బలపడ్డాయి. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామిక విలువలని పటిష్టం చేసే పని మొదలు పెట్టాలి. 

7. ఫాసిజాన్ని నిలువరించాలంటే లిబరల్‌ డెమోక్రసీని కాపాడుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఇండియాలో లిబరల్‌ డెమోక్రసీ ఎంత మేరకు పాదుకొన్నది?

ఇండియా లో సెమి-ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ సమాజం చూస్తే. చాలా ప్రాంతాల్లో కుల వివక్ష 2000 ఏళ్ల  క్రితం ఎట్లా ఉండేదొ నేటికీ అట్లాగే ఉంది. బహిష్కరణలు, వెలివేతలు యథేచ్ఛగా కొనసాగుతాయి. అన్యాయం జరిగినప్పుడు వ్యవస్థలో బలవంతులకే మద్దతు ఉంటుంది. ఖాప్ పంచాయతీలు,  ఎన్నికల మీద గ్రామీణ పెత్తందార్ల కంట్రోల్, మహిళల పరిస్థితి చూస్తే  సెమి ఫ్యూడల్ వ్యవస్థ లాగానే అనిపిస్తుంది. పట్టణాల్లో ఉన్న అగ్ర కుల వ్యక్తులకి, ధనిక వర్గాలకి మాత్రం కొంత లిబరల్ డెమోక్రసీ అనిపించచ్చు. ఫాసిస్ట్ ధోరణలు బలపడటం తో వాళ్లలో కూడా కొందరికి ఇదివరకు ఉన్న స్వేచ్చ కొంత తగ్గి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఇప్పుడు ప్రాణాలకే ముప్పుగా ఉంది.

విపరీతమైన ఆర్థిక అసమానతలు ఉన్న  భారత్ వంటి దేశాల్లో లిబరల్ డెమోక్రసీ కొందరికే పూర్తిగా ఉపయోగపడుతుంది. మన దేశంలో దీనికి కులం తోడైనప్పుడు వ్యక్తి స్వేచ్ఛ‌ పూర్తిగా హరించుకుపోతుంది. వ్యక్తి స్వేచ్ఛ లేని లిబరల్ డెమొక్రసికి అర్థం లేదు. లిబరల్ డెమోక్రసీ ని కాపాడుకోవాలనుకునే వాళ్ళ బాధ్యత ముందుగా కుల వివక్షని, ఆర్ధిక అసమానతలని, రెంటిని నియంత్రించాలి. ఫాసిజానికి ఈ అసమానతలు మూలం. 

Leave a Reply