(వర్తమాన కథా సందర్భంలో వసంతమేఘం తెలుగు కథకులు, సాహిత్య విమర్శకులతో ఒక సంభాషణ జరపాలనుకుంది. మానవ జీవితానుభవం, దానికి అవతల ఉండే సంక్లిష్ట వాస్తవికత, అనుభవానికి దృక్పథానికి ఉండే ఉమ్మడి ప్రాంతం, కళగా మారే అనుభవంలో ప్రయోగం పాత్ర.. వంటి అంశాలపై కొన్ని ప్రశ్నలను వసంతమేఘం టీం వారికి పంపించింది. ఇదొక సంభాషణా క్రమం. తెలుగు కాల్పనిక, విమర్శరంగాలకు దోహదం చేస్తుందనే ఆశతో ఆరంభించాం. గత సంచికలో ఇద్దరు సాహిత్యకారుల అభిప్రాయాలు ప్రచురించాం. ఈ సంచికలో మరో ఇద్దరి స్పందనలు మీ కోసం.. వసంతమేఘం టీ)
1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా?
అనుభవమే దారి చూపిస్తుంది. కానీ, ఆ దారిని వెలిగించే దృక్పథం ముఖ్యం అనుకుంటా. ఇది కథారచనకే పరిమితమయ్యే విషయం కాదు. మిగిలిన సాహిత్య ప్రక్రియలకు కూడా వర్తించేదే అయినా, కథకి యెక్కువగా వర్తించే విషయం. వెలుగు పడని దారి చీకటిగా వుండి, కథ అంతరంగాన్ని కప్పేస్తుంది.
2. ఈ కోణంలో వర్తమాన కథను మీరు ఎలా చూస్తారు?
వర్తమాన కథ గురించి ఇంకా నా ఆలోచనలు స్పష్టంగా లేవు. ఈ కథల్లో వర్తమాన లక్షణాన్ని ఎట్లా చెప్పాలో ఇంకా తేటపడడం లేదు. ఈ కథకులకు ఇంకా గట్టి వెన్నెముక ఏర్పడినట్టుగా నాకు అనిపించడం లేదు. గట్టి వెన్నెముక లేనప్పుడు కోణం బలహీనంగానే వుంటుంది. రాయాలన్న తపన మాత్రమే కనిపిస్తోంది కానీ ఆ తపన ఎటు ఛానెల్ చెయ్యాలో తెలియని గందరగోళం, తక్షణ కీర్తికోసం ఆరాటం ఎక్కువగా వర్తమాన కథని నడిపిస్తున్నాయని అనిపిస్తోంది.
3. ఇవాళ మన చుట్టూ ఒక కొత్త కథా ఆవరణ ఉన్నది. చాలా మంచి కథలు వస్తున్నాయి. అందులోని అనుభవం వల్ల మనకు కొత్త కథలని అనిపిస్తోందా? లేక దృక్పథం వల్ల కొత్త కథలని అనిపిస్తోందా?
పైన చెప్పిన సమాధానానికే నేను కట్టుబడి వున్నా. మంచి అనేది మీరు ఎట్లా నిర్వచిస్తున్నారో నాకు తెలీదు. అది మరీ వ్యక్తిగత అభిరుచిగా మారిందేమో! అనుభవం మారినంతగా కథ మారలేదని నా అభిప్రాయం. అట్లాగే, ఆ అనుభవానికి తగిన దృక్పథమూ ఏర్పడలేదని మాత్రం కచ్చితంగానే అనిపిస్తోంది.
4. అసలు జీవితానుభవానికి, దృక్పథానికి ఉమ్మడి క్షేత్రం ఎలా ఉంటుంది? తేడా ఎలా ఉంటుంది?
చాలా మంచి ప్రశ్న. అసలు ఆ వుమ్మడి క్షేత్రం వుండాలన్న ఆలోచన ఇప్పటి కథకులకు వుందా అనే ప్రశ్న కూడా ముఖ్యమే. దృక్పథ రాహిత్యం కూడా “దృక్పథం”గా చెలామణీ అయ్యే కాలంలో వున్నాం కదా! కథకులకు అనుభవంతో సరైన సంభాషణ లేదు ఇప్పుడు- ఆ సంభాషణ లోపించినప్పుడు ఉమ్మడి క్షేత్రం అనే ప్రసక్తి కూడా రాదు.
5. అనుభవానికి, కళకు ఉన్న సంబంధాన్ని వర్తమాన కథల ఆధారంగా ఎలా చెప్పవచ్చు?
రొటీన్ అనుభవాలేమీ వర్తమాన కథలుగా మలచలేమని చాలాసార్లు రుజువు అవుతూనే వుంది. కథగా మరే అనుభవానికి వొకానొక ప్రత్యేకత, నిర్దిష్టతా వుండాలేమో అనిపిస్తోంది ఇప్పటి కొన్ని కథల్ని చదువుతూ వుంటే- రొటీన్ అనుభవాలు రాసిన పెద్ద కథకుల కథలు కూడా ఇట్టే తేలిపోవడం కూడా ఈ మధ్య కాలంలో చూశాను. అట్లా కాకుండా భిన్నమైన అనుభవంలోంచి రాసిన చిన్న కథకులు కూడా గొప్ప కథ రాయడమూ చూశాను. తెలంగాణ కథల సంకలనాలు వరసగా చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఆ కథల్లోని అనుభవం మన దాకా చేరడంలో ఇప్పుడు యాస కూడా అడ్డంకి కావడం లేదు. గతంలో యాస వొక అడ్డంకి అనుకున్న సందర్భాలు వున్నాయి కాబట్టి ఈ మాట అంటున్నా.
6. ప్రయోగం వల్ల కథ అనేక అర్థాలను సంతరించుకుంటుంది. అయితే ఇటీవలి కథల్లో దృక్పథం వల్లనే మంచి ప్రయోగంగా మారిన కథలకు, ప్రయోగం వల్లనే దృక్పథ సమస్య వచ్చిన కథలకు ఏమైనా ఉదాహరణలు ఇవ్వగలరా?
ప్రయోగాలకు స్వాగతం చెప్పే అభిరుచి నాది. అవి వొక్కోసారి విఫలమైనా సరే, వాటిని మనం ఆహ్వానించాల్సిందే. అయితే, ఇట్లా ప్రయోగ తపనలో పడిపోయిన కొన్ని కథలు దృక్పథాన్ని అందుకోలేకపోవడం ముఖ్యంగా 2010 తరవాతి కొత్త కథకుల్లో కనిపిస్తుంది. ఆ కథలు కేవలం అనుభవ శకలాలుగా మాత్రమే పడివుంటున్నాయి.
7. ఒక కథ ప్రభావం పాఠకుల మీద శిల్పం వల్ల మిగిలి(గుర్తు ఉండటం) ఉంటుందా? లేక దృక్పథం అందించే ఎరుక వల్ల మిగిలి ఉంటుందా?
శిల్పం, దృక్పథం రెండూ బలంగానే ప్రభావం చూపిస్తాయి. ఏది బలహీనమైనా పాఠకుల్ని ఆ కథ హత్తుకోలేదు.