నవంబర్ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్ హన్మంతు తండ్రి పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం. కానీ ప్రతి జీవికి మరణం సహజమే కదా! అయితే, ఇలాంటి తల్లుల, తండ్రుల మరణం ఎందుకు బాధాకరమైనదంటే, వీరు బతికి వున్నన్నాళ్లు తమ బిడ్డల కోసం పరితపించిన వాళ్లు. తమ కన్నబిడ్డలను ఒకసారి కళ్లారా చూడాలనే ఒక అతి సాధారణ కొరిక తీర్చుకోవడానికి అసాధారణంగా పలవరించినవాళ్లు. ఆ సాధారణ కోరిక తీరకుండానే కుమిలి కుమిలి ఏడ్చి కన్నుమూసినవారు.
ఇది ఒక పార్శ్వము మాత్రమే. మరో పార్శ్వము చాలా గొప్పది. వీళ్లు జీవితాంతం తమ బిడ్డల విప్లవాశయాలు నెరవేరాలని ఆకాంక్షించిన వారు. వాటి విజయాలను తాము చూడాలనీ తపించినవారు. వారు ఎన్నడూ తమ బిడ్డల కార్యాచరణను తప్పు పట్టలేదు. వారు పోలీసులు దుశ్చర్యలకు, కౌన్సిలింగులకు లొంగని ధీశాలురు. అందుకే వారి మరణం విప్లవోద్యమం పేర్కొన్నట్టు కలిచివేసేదే. ఉద్యమం వేర్వేరు సందర్భాల్లో వారి విప్లవ సేవలను స్మరించుకున్నది. దేశ వ్యాపితంగా విప్లవ ప్రజలు, ప్రజా సైనికులు వారి సేవలను డిసెంబర్ 2నాడు ఎత్తిపట్టారు. అదే ఆ తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటుతోంది. అందుకే మాకు జన్మనిచ్చిన వారికి మేం తుదివరకు గుర్తు పెట్టుకొని ఉంటాం. లక్ష్యసాధనకు మేం మరింత అంకితమవుతూ కన్నీటి నివాళులతో వారిని స్మరించుకుంటాం.
వయసు మీరిన తరువాత మరణం సహజమే కానీ, వారు ఎలా జీవించారనేదాన్ని మరణం తర్వాత మననం చేసుకోవడం ద్వారా వారి చరిత్రను భావితరాలను అందించినవారమవుతాం. ఆ చరిత్ర పీడిత ప్రజల వుద్యమాలతో ముడిపడిన చరిత్ర అయినపుడే దానికి సార్ధకత వుంటుంది. ఆ చరిత్ర దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తుల చరిత్ర అయితే ఇతరులకు ఆదర్శంగా వుంటుంది. వారిని ఆలోచింపచేస్తుంది. విప్లవకారుల కుటుంబాలను రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, రాజ్యం చేసే వత్తిళ్లకు సాధారణంగా లొంగకుండా తమ బిడ్డల కార్యాచరణ పట్ల కనీసంగా సానుభూతితోనైనా వున్న కుటుంబాలు కాగా, రెండవది, రాజ్యం వత్తిళ్లను తట్టుకోలేక తమ బిడ్డలను వెనక్కిరమ్మని కోరక తప్పని కుటుంబాలు.
రెండవ రకం కుటుంబాలలో అత్యధికం రాజ్యం వత్తిడితోనే తప్ప తమ పిల్లల కార్యాచరణను తప్పుపడుతూ కాదనేది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, తమ పిల్లలను ఇంటికి రమ్మని తాము కోరినంత మాత్రాన వారు రారనీ, వారికి వారి ఆశయాలు, లక్ష్యాలు వున్నాయనీ పోలీసుల వత్తిడికి కోరక తప్పడం లేదనీ ఆ కుటుంబాలకు స్పష్టంగానే తెలుసు. పోలీసులు దీనికి కౌన్సిలింగ్ అని పేరు పెట్టుకున్నారు. కానీ నిజానికి అది ఎంతమాత్రం కౌన్సిలింగ్ కాదు. అది హింస, వత్తిడి, వేదన, అవమానం తప్ప ‘గాయపడిన’ మనసులకు, తల్లిడిల్లే హృదయాలకు ఓదార్పు కానే కాదు. ఈ నేపథ్యంలో మాకు తెలిసిన మా అమ్మ గురించి మీతో పంచుకుంటున్నాం.
అమ్మ పేరు మల్లోజల మధురమ్మ. ఆమెకు ముగ్గురు సంతానంలో ఇద్దరు దేశం కోసం అనడం కన్నా పీడిత ప్రజల కోసం అమ్మను వదలి, కుటుంబాన్ని వదలి విప్లవబాట పట్టారు. ఆడపిల్లలు లేకపోవడం అమ్మకు పెద్ద చింతగా వుండేది. కనీసం చస్తే ఏడ్వడానికైనా ఆడపిల్ల వుండాలిరా! అంటుండేది. కానీ, ఆమె పెద్దపల్లి పెద్దవ్వగా అందరినీ ఆప్యాయతను చూరగొని తన మరణం ఎందరినో ఏడిపించిందనీ అమ్మకు తెలువదు కదా! మా తండ్రి వెంకటయ్య భారత స్వాతంత్య్ర సమరయోధుడు. అమ్మ కాపురానికి వచ్చేనాటికి మూడేళ్ల పాప. వందేళ్ల క్రితం బాల్య వివాహాలే జరిగేవి కదా! వాళ్లది తొలుత సంపన్న కుటుంబమే అయినప్పటికీ ఆమెకు బుద్ధి తెలిసేనాటికే ఆమె భర్తకు కాంగ్రెస్ రాజకీయాలు అబ్బి ఆయన కర్ర వ్యాపారంలో ప్రవేశించినప్పటికీ అందులో రాణించలేకపోయి రాజకీయాలకే అంకితమయ్యాడు.. వ్యాపారం అచ్చిరాక చాలా వరకు ఆస్తులు కోల్పోయారు. ఇల్లు గడవడానికి మరి కొంత ఆస్తి కరిగిపోయింది. ఈ లోపు అధికార మార్పిడి జరిగిపోయింది. సంబరాలు కొంతకాలం సాగాయి. కానీ, తెలంగాణలో మరో యుద్ధ ఫ్రంట్ కొనసాగుతోంది.
తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజులు అవి. ఆ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహిస్తుండిరది. ఆ పోరాటంలో వెంకటయ్య మితృలు వుండేవారు. నైజాం అరాచకాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆ పోరాటాన్ని అభ్యుదయ కాంగ్రెస్ వాదులంతా సమర్ధించేవారు. వారిలో వెంకటయ్య ఒకరు. రహస్య జీవితం గడుపుతున్న తన స్నేహితులకు ఇంటికి వస్తే వారికి నిరభ్యంతరంగా ఆశ్రయం ఇచ్చేవారు. తుదకు కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకత్వం చేసిన ద్రోహానికి తెలంగాణలో జరిగిన నైజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఓటమి పాలైంది. పోరాటంలో అనేక త్యాగాలతో వీర రైతాంగం సాధించుకున్న 10 లక్షల ఎకరాల భూమి తిరిగి తుదకు భూస్వాములకే దక్కింది. ఆ పోరాటం సాధించుకున్న అనేక విజయాలు వమ్ము అయినాయి. నాలుగువేల అమరుల సాక్షిగా ఆ పోరాట విరమణ తీరని ద్రోహం తలపెట్టింది. కానీ, ఆ పోరాటాల నుండి పాలకవర్గాలు, కమ్యూనిస్టులు అవసరమైన గుణపాఠాలు తీసుకున్నారనడానికి దేశంలో ముందుకు వచ్చిన పలు భూసంస్కరణలే ప్రబల సాక్షంగా మనముందున్నాయి. ఎర్ర పోరాటాలకు అవకాశం ఇవ్వకూడదనీ నెహ్రూ తెచ్చిన సామాజిక సంస్కరణలూ మనముందున్నాయి. అవి కమ్యూనిస్టుల త్యాగఫలమే! ఆ పోరాటాల వారసులు వెంకటయ్య కుమారులు ఇద్దరు విప్లవోద్యమంలోకి వెళితే.. వారిలో ఒకరు అందులో అమరుడై ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ మొత్తంలో వెంకటయ్య కుటుంబం ప్రజల పక్షానే నిలిచింది. కాకపోతే, ఆయన తుదివరకు ఖాదీ గుడ్డలో లేదా కాంగ్రెస్ బ్రాండ్ లాల్చీ పైజామాలే వేసుకున్నా, అనేక తంటాలు పడి విధిలేక స్వాతంత్య్ర సమరయోధుల ఫించన్ సంపాదించుకున్నా విలువలతో కూడిన జీవితాన్నే కొనసాగించాడు. పిల్లలకూ అవే నేర్పాడు.
వెంకటయ్య ఇల్లు కాంగ్రెస్, కమ్యూనిస్టు, సాయుధ పోరాట రాజకీయ చర్చలకు కేంద్రం. మధురమ్మ ఆ ఇంటికి ఎవరు వచ్చినా, వారి రాజకీయాలతో ప్రమేయం లేకుండా వాళ్లందరితో కలివిడిగా వుండేది. వారు ఆమెను ఏదో వరుసతో సంబోధిస్తూ గౌరవించేవారు. పురుషుల మధ్య ఏరా అంటే ఏరా అనుకునే స్థాయిలోనే స్నేహం వుండేది. ఆ ప్రాంతంలో గట్టెపల్లి మురళీధర్ రావు గారంటే భూస్వాములకు పెద్ద భయం. ఆయన రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నడిపినవాడుగా ప్రతీతి. ఆయన తరచుగా వెంకటయ్య ఇంటికి వస్తూ పోతూ రాజకీయ పార్టీలలో దిగజారుతున్న విలువల గురించి చర్చించేవారు. పెద్దపల్లిలోనే కడు పేదరికాన్ని అనుభవిస్తూ కమ్యూనిస్టు రాజకీయాలకు అంకితమైన బుక్క నంబయ్య కూడ వీరి చర్చలలో పాల్గొనేవారు. కాంగ్రెస్, సాయుధ పోరాట కమ్యూనిస్టు, ఎన్నికల కమ్యూనిస్టు రాజకీయాలు వారి మధ్య జరిగేవి. రష్యా, చైనాలు వారి మధ్య కేంద్ర బిందువుగానే వుండేవి. భారత-చైనా యుద్ధం విషయంలో దాదాపు ముగ్గురు ఒకే అవగాహనతో వుండేవారు. ఎర్ర గులాబీ, సోషలిస్టు నెహ్రూను తప్పు పట్టేవారు. ఆ నేపథ్యంలో కొంతకాలానికి నక్సల్బరీ రాజకీయాలు ఆ ఇంటిని ఆవహించాయి.
నక్సల్బరీ రాజకీయాలతో ఆ ఇంటి వాతావరణంలో మార్పు స్పష్టంగా అగుపించేది. అప్పటికే ఆరు పదులు దాటిన వెంకటయ్యకు విలువలు పతనమవుతున్న కాంగ్రెస్ రాజకీయాల పట్ల తీవ్ర విముఖత ఏర్పడిరది. కాంగ్రెస్‌లోనూ సోషలిస్టు భావాలు వున్నవాళ్ళు మధ్య మంచి విలువలతో కూడిన స్నేహం, ప్రజలలో వారికి మంచి గుర్తింపు వుండేది. కమ్యూనిస్టులకు కూడ విలువలతో కూడిన నిజాయితీపరులనే గౌరవం వుండేది. ఈ వాతావరణంలో గతంలో ప్రేంచంద్, అడవి బాపిరాజు, కొడవటిగంటి కుటుంబారావు, చలం, వీరేశలింగం రచనలు, రక్తకన్నీరు, మాలపెల్లి నాటకాల చర్చలు జరిగే ఇంట్లోకి రష్యా సాహిత్యం ప్రవేశించింది. రంగనాయకమ్మ, యద్దనపుడి సులోచనారాణి నవలల స్థానంలో మాక్సిం గోర్కీ నవల అమ్మ చేతికి వచ్చింది. అమ్మ బడికి పోయి చదువునేర్చుకున్నదేమీ కాదు. ఆమె చదువు ఎట్ల నేర్చుకుందో తెలియదు కానీ, అక్షరాలు కూడబలుక్కుంటూ మధ్యహ్న ‘తీరిక’ వేళ కునుకు తీయకుండా పుస్తకంతో కుస్తీ పట్టేది. కొడుకులు దగ్గరుంటే చదివిపెట్టమని వినేది. ఆమె పెద్ద కుమారుడి ప్రపంచమే వేరు. ఆయన ఇలాంటి వ్యవహారాలలో తలదూర్చేవాడు కాదు. ఆయనకు రాజకీయాలకన్నా ఇల్లు గడవడంపైనే ధ్యాస ఎక్కువ!
ఆర్థికంగా రోజులు కష్టంగానే గడుస్తున్నాయి. పంటల దిగుబడి తక్కువగా వుండి అప్పులు లేకుండా ఇల్లు గడిచేది కాదు. పిల్లల చదువుకు భూమి అమ్మడం తప్ప మరో గత్యంతరం లేని స్థితి. కానీ పెద్దలకు రేపటి పిల్లల భవిష్యత్తు గురించి వుండే బెంగతో వున్న 20 ఎకరాల భూమిని కాపాడుకోవాలనీ, తమ పిల్లల నుండి మాట రాకుండా వుండాలనీ తల్లి తండ్రులిద్దరూ భావించేవారు. అయినప్పటికి కొంత కొంత అమ్మక తప్పేది కాదు. చివరకు వెంకటయ్య కొద్దికాలం కేశోరాం సిమెంట్ కంపెనీలో చిరు వుద్యోగంలో చేరాడు. అమ్మ ఇంట్లో చాలా శ్రమ పడేది. పిల్లలతో కలిసి గడ్డి కోసుకరావడం, బర్లను సాదడం, పాలు, పెరుగు కొంత అమ్మడం, వ్యవసాయ పనులలో పాల్గొనడం, ఇంటి వెనుక పెరట్లో పిల్లలను పట్టుకొని కూరగాయల చెట్లు పెంచడం మున్నగు పనులలో పాల్గొంటూ పిల్లల చదువుల కోసం అనేక కష్టాలు పడ్డారు వారి తల్లి తండ్రులు. కానీ, వారు అనేక ఆశలు పెంచుకుంటున్న పిల్లలలో ఇద్దరు తమకు నచ్చిన రాజకీయాల దారిని ఎంచుకుంటున్నారనీ వారికి త్వరలోనే అర్ధమైంది. నడిపి కుమారుడి ప్రభావంతో చిన్న కొడుకు ఆ దారే నడుస్తున్నాడనీ తేలిపోయింది. కానీ, వారిని వారించాలనుకోలేదు. ముఖ్యంగా తండ్రి. తల్లి ప్రేమ చిన్నాడినైనా తనతో నిలుపుకోవాలనీ ఆరాటపడిరది. తన తమ్ముని కూతురిని ఇచ్చి వివాహం చేయాలనీ కూడ మేనరికాన్ని గుర్తు చేసేది. అయినప్పటికీ ఆ స్థితి దాటిపోయిందనీ వారికి తెలిసి ఇక వారింపులు మానుకొని ప్రమాదకర మార్గం ఎంచుకున్నారనీ జాగ్రత్తగా వుండాలనీ తల నిమురుతూ హెచ్చరించడం మొదలైంది. ఎమర్జన్సీ నాటికి పోలీసులు తమ పిల్లల కోసం ఆరా తీయడం పెరిగి అర్ధరాత్రి సోదాలకు ఇంటికి రావడం మొదలైంది. అప్పటికే అమ్మ లోబీపీతో, బాపు హై బీ.పీ.తో బాధపడుతున్నారు.
ఎమర్జన్సీ చివరలో రహస్య జీవితం గడుపుతున్న తమ పెద్ద కొడుకు కోటీశ్వర్లు సిరిసిల్ల ప్రాంతంలోని మరిగడ్డలో అరెస్టు అయిన వార్త తెలియగానే తల్లి గుండెలు బాదుకుంది. తండ్రి తనకు పరిచయం వున్న వకీళ్ల వద్దకు పరుగు తీశాడు. దేశ వ్యాపితంగానే ఇందిరా ఫాసిజానికి వ్యతిరేకంగా రాజకీయ వాతావరణంలో వస్తున్న మార్పు ఫలితంగా కోటేశ్వర్లును కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన కొంత కాలం జైల్లో వుండి బయటకు వచ్చి విప్లవ రాజకీయాలలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. పెద్దపల్లి కేంద్రంగా ఆయన కార్యకలాపాలు నడిచేవి. వివిధ విద్యా సంస్థలలో రాడికల్ విద్యార్ధి సంఘాలు, హక్కుల కార్యకర్తలతో సంబంధాలు-సంఘ నిర్మాణం, వుద్యోగులతో సంబంధాలు ముఖ్యంగా దళిత మితృలపై కేంద్రీకరణ, ఉపాధ్యాయులతో సంబంధాలు, అరెస్టయినవారి విడుదల కోసం నిర్విరామంగా కృషి చేయడం, గ్రామీణ సమస్యలపై సోదర కామ్రేడ్స్‌తో మంతనాలు, ప్రచురణలు పార్టీ అప్పగించిన అన్ని పనులలో బాధ్యతగా పాల్గొంటూ రాష్ట్ర వ్యాపితంగా విప్లవ రాజకీయాల ప్రచారానికి సభలు, సమావేశాల నిర్వహణ, వాటిలో వక్తగా ప్రసంగించడం ఆయన దినచర్యగా మారింది. ఈ క్రమంలో ఇంటికి వచ్చే ఆయన మితృలందరికీ అమ్మ అమ్మగా, బాపు బాపుగా వుండేవారు. వారి అవసరాలు కనుక్కునేవారు. ఇల్లంతా సందడిగానే వుండేది. అన్నతో సంబంధాల రీత్యా అమరులు జాపా లక్ష్మారెడ్డి (జిల్లా రాడికల్ విద్యార్థులంతా బాపూగానే సంబోధించేవారు, పోలీసులు సివిల్‌లో దాడిచేసి హత్య చేశారు), అమరభారతి (వకీలు, ఆర్కియాలాజిస్టు), బి ప్రకాశ్ మాస్టర్ వరకు వివిధ స్థాయిలలో ఉద్యమంతో పెనవేసుకుపోయినవారు అరుదుగా, తరచుగా వచ్చే అనేక మంది కామ్రేడ్స్‌కు ముందు కనిపించేది వాకిట్లో బాపు, ఆ తరువాత అమ్మే. అమ్మకు పని భారం పెరిగినప్పటికీ విసుగు, విరామం లేకుండానే చేసిపెట్టేది. వాళ్లంతా తన కొడుకు వద్దకు వచ్చిన మంచి పిల్లలనే భావనే ఆమెను అందరికి అమ్మను చేసింది. బాపును బాపు చేసింది.
అమ్మ పుట్టింది బ్రాహ్మణ కులమే అయినా, వుండడానికి భూమి వున్నా, కింది మధ్య తరగతి జీవితం గడుపుతూ కష్టం అంటే ఏంటో, పేదరికం అంటే ఏంటో, శ్రమ విలువ ఏంటో తెలిసిన శ్రమ జీవి. అమ్మకు అన్ని పార్టీల రాజకీయాల గురించి ఇంట్లో జరుగుతున్న చర్చలతో, భర్త సాన్నిహిత్యం, పిల్లలతో, వారి మితృలతో వినే పోరాటాల వార్తలతో అర్ధమవుతుండేది. ప్రత్యేక తెలంగాణ కావాలనీ తన కొడుకులు జెండాలు పట్టుకొని వీధులలోకి పరుగెత్తడం, పోలీసులు కాల్పులలో వందలాది పిల్లల మరణాలు ఆమెలో ప్రాంతాల మధ్య తారతమ్యాలను అర్ధం చేయించాయి. అయితే, తమ వీధిలో, తమ ఇంటిపక్కన వున్న కోస్తాకు చెందిన లెక్చరర్ ప్రశాంతరాజు, మేరీల కుటుంబాన్ని మాత్రం ఏమనకూడదనీ కోరేది. వాళ్ల కుటుంబాలను ఇబ్బంది పెట్టవద్దని అనేది. ఆ తరువాత పట్టణ యువతలో 1977 నాటికి రాజకీయాలలో రాడికల్స్దే ప్రథమ స్థానం అయింది. రమేజాబీపై పోలీసుల అత్యాచారంతో పెద్దపల్లిలో విద్యార్థి, యువజనులు చేసిన ఆందోళన, బెల్లంపల్లిలో రాజేశ్వరిపై బొగ్గుబావి దొర కొడుకు జరిపిన అత్యాచారం, హత్య రాజ్య స్వభావం గురించి తెలియజేసింది. సమాజంలో పెరుగుతున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, లంచగొండి తనం, వరకట్న హత్యలు, ఆడపిల్లల జీవితాలు, అత్యాచారాలు ఆమెను మార్పు వైపు ఆలోచింపచేశాయి. ఆమె తన పిల్లలతో మీరు ఏ అమ్మాయిని పెళ్లాడినా ఆమె నా కోడలే, నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు అని స్పష్టంగానే చెప్పేది. మీకు ఇష్టమైన అమ్మాయిలనే వివాహం చేసుకోండి అని వరకట్నాల ప్రస్తావనే తెచ్చేది కాదు. తండ్రికి అలాంటి పట్టింపులు అంతకన్నా వుండేవి కావు.
అమ్మా జీవితంలో 1980 తరువాత రాజ్యంతో అవమానాలు, ఇబ్బందులు, వత్తిడి పెరిగింది. వారు బాపును వేధించడాన్ని అమ్మ తట్టుకోలేకపోయేది. కోటీశ్వర్లు తమ ప్రాంతంలోనే రైతాంగం మధ్య పని చేస్తున్నంత కాలం వార్తలు తరచుగా తెలుస్తుండేవి. ఎన్నడూ ఆ ఇంటి కడప తొక్కని ఆ ప్రాంత భూస్వాములు కూడ తొంగిచూడడం, పరిచయాలు పెంచుకోవడం, తమ కొడుకు గురించి గొప్పగా మాట్లాడడం మొదలైంది. రైతుల జీవితాలలో మార్పులను అర్ధం చేసుకుంటూ ఆ తల్లి ఎంతో సంతోషించేది. గట్టెపల్లి మురళిగారు కూడ ఇంటికి వచ్చి కొడుకు చర్యలు, రాజకీయ కార్యకలాపాల గురించి అమ్మాతో నా కొడుకులు చేయని పని నీ కొడుకు చేస్తున్నాడమ్మా అంటూ ‘వాడూ నా కొడుకే’ అని గర్వపడేవాడు. ఓసారి ఓ కామ్రేడ్ చేతిలో రామబాణం ఆక్సిడెంటల్లా ఫైర్ అయి తన కొడుకు గాయపడినాడని, చేతి ఎముక విరిగిందనీ తెలిసింది. నవిరిగిన చేతికి పట్టీతో కొడుకు రహస్యంగా కలసినపుడు ‘మొత్తానికి బతికినావు బిడ్డా! వాటితో జాగ్రత్తగా వ్యవహరించాలని కొడుకు యోగక్షేమాలు తెలుసుకుంటూ కంటతడి పెట్టింది. మరో పదేళ్లకు ఆయనకే మరో సహచరుడి చేతిలో ఏకే ఆక్సిడెంటల్ ఫైర్ అయి దండలో నుండి తూటా దూసుకుపోయిన వార్త మాత్రం అమ్మ వరకు చేరలేదు. అప్పటికే కోటీశ్వర్లు రాంజీగా దండకారణ్య బాధ్యతలలోకి మారాడు. 1982 ఏప్రిల్‌లో అడవికి వెళ్లిన తన చిన్న కొడుకు అనతికాలంలోనే 1982 ఆగస్టులోనే అరెస్టవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. అవి బూటకపు ఎన్ కౌంటర్లలో విష్ణవకారులను పిట్టల్లా కాలుస్తున్న రోజులు. తమ కళ్ల ముందే తనను అమ్మా అని పిలిచే బయ్యపు దేవేందర్ రెడ్డి లాంటి వీరులను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని తెలిసింది. చిన్నకొడుకు అరెస్టయి.. మహదేవ్పూర్ ఎస్.ఐ లింగయ్యకు బాపుతో ఉన్న పరిచయం కొద్ది చంపకుండా జైలుకు పంపినప్పుడు వకీళ్లను పెట్టి కరీంనగర్, చంద్రపుర్ జైళ్లకు, కోర్టులకు తిరిగిన తన భర్త ఇబ్బందులను అమ్మ కూడ పంచుకునేది.
బాపును పోలీసులు వేధించడంతో పాటు తమ ప్రాంతంలో విప్లవకారుల కుటుంబాలపై పెరుగుతున్న పోలీసుల దౌర్జన్యాలు ఆమెను బాధించేవి. వడ్కాపుర్ చంద్రమౌళి తండ్రి చేయి విరిగినపుడు అమ్మ ఆ కొడుకు ఎక్కడున్నాడో కానీ, తండ్రిని పోలీసులు చంపుకు తింటున్నారనీ కంటతడి పెట్టింది. జిల్లాలో వందలాది ఇండ్లు పోలీసులు కూల్చారు. తమ ఇల్లూ కూల్చడంతో గుడిసె బతుకు తప్పలేదు. కానీ రెండవ విడత దాన్ని పోలీసులు కూల్చారు. తెలంగాణలో పరమ క్రూరమైన పోలీసు అధికారులను శిక్షించడంలో భాగంగా విప్లవకారుల సైనిక చర్యలు పెరుగుతుండడంతో, వారు ప్రజల మీద విరుచుకు పడడం, విచక్షణా రహితంగా దాడులు చేయడం వారి ఆగడాలు ప్రజలలో వారిపై అసహ్యన్ని పెంచి విప్ల్ణవకారులను ప్రజలను మరింత దగ్గరగా చేసి వారిని కాపాడుకోవాలనీ, అందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలనీ వారిలో చైతన్యాన్నిపెంచాయి. వారిలో దొరలతో తాము అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, బుగ్గిపాలైన ఆడపిల్లల జీవితాలు, మొదటి రాత్రి దొర గడిలో గడపక తప్పని వివాహిత మహిళల జీవితాలలో అన్నలే లేకపోతే, మార్పు ఎక్కడిది? జీవితంపై బతుకాలనే ఆశ చిగురించేదెక్కడిది? ‘‘నీ కాల్మొక్తా, బాంచెన్’’ బతుకులు తలెత్తుకు తిరిగేలా చేసిందే అన్నలు. దొరల గడీలకు బలైన బానిస రోజులకు కాలం చెల్లిపోయిందనీ తమ ప్రాణాలనున ఫణంగా పెడుతున్న అన్నల కోసం ఏదైనా మంచిదే అనే వైపు తయారు చేశాయి. విప్లవపార్టీకి అన్నలనేది ఒక సర్వనామంగా మారింది. ప్రజల హృదయాలలో జండర్ భేదం లేని పదమది. క్రమంగా తమ ఇద్దరి కొడుకుల ఆచూకీ తెలియకుండా పోయింది. పత్రికలలో తప్ప వారి గురించి సమాచారం అందని దుస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తప్ప వారి గురించి ఇంటికి వచ్చేవారు కరువయ్యారు. ఉన్న కొడుకుతో కష్టాలు పంచుకుంటూ, లేని కొడుకుల కోసం కన్నీరు పెట్టుకుంటూ సంసారనౌకను నెట్టుకపోవడమే వారికి జీవితం మిగిల్చింది.
తెలంగాణ మలి ఉద్యమం ముందుకు వస్తున్న రోజులు. మళ్లీ వాతావరణంలో మార్పులు ప్రారంభమైనాయి. విప్లవ సానుభూతిపరులు అమ్మా, బాపులను పలకరించడం, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం, వారికి అవసరమైన సహాయాన్ని అందివ్వడం మొదలైంది. వారి పిల్లలు పార్టీలో ఉన్నత స్థానాలలో వున్నారన్న రిపోర్టులతో, ఇక వారు లొంగిపోయే స్ధితి లేదనే దానితోనే పోలిసులు ఇంటిముఖం చూడడం తగ్గింది. ఆ క్రమంలో 1997 డిసెంబర్లో తెలంగాణ డిక్లరేషన్ ప్రకటించిన రోజే బాపు అనారోగ్యంతో కన్ను మూయగా, అమ్మ మరీ ఒంటరైంది. అమ్మను ఓదార్చే వాళ్లలో, పిల్లల గురించి పంచుకునే వాళ్లలో బాపు లేని జీవితం అమ్మను గాయపరిచింది. కానీ, కొడుకులు వున్నారన్న ఆశ, ఎన్నటికైనా తనను చూడ వస్తారన్న నమ్మకం, వాళ్ల రాజ్యం వస్తుందన్న విశ్వాసం ఆమెలో బతుకు పట్ల తీపిని పెంచింది.
కొడుకులు తన వద్దకు రాకపోయినా వుత్తరాల ద్వారా పలకరించడం అమ్మకు చాలా ఊరట నిచ్చింది. అమెరికా రాజకీయాల నుండి దండకారణ్య ఆదివాసీ జనజీవితాల వరకు అనేక మంది అమ్మలకు వార్తలు చేరుతుండేవి. పౌర, పోలీసు అధికారులు అమ్మను పలకరించడానికి, అమ్మ ద్వారా ఏవో లొంగుబాటు పిలుపులు ఇప్పించడానికి పూనుకున్న ప్రతి సందర్భంలో వారికి అమ్మ వారికి దీటుగా జవాబు ఇచ్చేది. ఇట్లా ఎందరో తల్లులు తమ పిల్లల ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నారు. అట్లాగే విప్లవోద్యమంలో ఉండే వారి పిల్లల ప్రతిస్పందన విప్లవోద్యమంపై విశ్వాసాన్ని ఇనుమడిరప చేసేది.
అమ్మా! నీ మరణం మన కుటుంబానికి తీరని లోటే. అయతేనేం, నీ జీవితం ఆదర్శవంతమైనది. నీ పేరు విప్లవ సేవలందించిన కోట్లాది సానుభూతిపరుల జాబితాలో చేరి చిరస్మరణీయమైనది. తెలంగాణలోనేగాక దేశవ్యాప్తంగా విప్లవకారుల తల్లులు తమ బిడ్డల రాజకీయాలకు అనుగుణంగా జీవించి మరణించి ఆ జాబితాలో చేరారు. మా అమ్మను స్మరించుకొనే సందర్భంలో వారందరికీ మా వినమ్రనివాళి.
వేణు, మైన, తార