బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల నుంచి భారత పాలకవర్గాలైనా దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు అధికార మార్పిడి జరిగి 75 ఏండ్లు కావస్తోంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ అని ఘనంగా పాలకవర్గాలు చెబుతున్నాయి. అయినా ఈ దేశ ప్రజలు కనీసం కడుపు నిండా తిండిలేక, ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి సరిపోయే బట్టలేక, సరైనా వైద్యం అందక, నాణ్యమైన విద్య లేక కోట్లాదిమంది సతమతమవుతున్నారు. నోరున్నా న్యాయం కావాలని అడగలేని అభాగ్యులు కోటాను కోట్లు ఉన్నారు. దీనికి కారణం మన పాలకుల అప్రజాస్వామిక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, ఫాసిస్టు అణచివేత ధోరణులు అని స్పష్టమవుతోంది. అన్ని రంగాలలో అసమానతలు, వివక్షలు కొట్ట వచ్చినట్లు కనబడుతున్నాయి. రాజ్యాంగం హామీ ఇచ్చినట్లు ప్రజలందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం, స్వేచ్ఛ‌ అందని ద్రాక్షగానే మిగిలాయి. 

నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సార్వభౌములు. ప్రజలకు హక్కులు ఉంటాయి. పాలకులకు బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థ జాతి స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగాలి. అది ప్రజల ఆకలి తీర్చి, ఉపాధి కల్పించి, ఆత్మ నిబ్బరంతో, ప్రగాఢమైన ఆత్మ విశ్వాసంతో నిలబడగలిగేటట్టు చేయాలి. జాతులన్నిటికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కల్పించాలి. వారి భాష-సంస్కృతులను పరిరక్షించి, అభివృద్ధిపరచుకునే అవకాశం కల్పించాలి. కానీ, మన దేశ ప్రజాస్వామ్యం తత్భిన్నంగా కొనసాగడం మనం గమనిస్తూనే ఉన్నాం. వివక్షను నివారించి, అసమానతలు తగ్గించడానికి బదులు అవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సమాజ వికాసానికి, వ్యక్తి వికాసానికి కీలకమైన విద్యారంగం కునారిల్లిపోతున్నది. యువతకు సరైన విద్య అందక వీధులు కొలుస్తున్నారు. ఇక మన ఆరోగ్య రంగం ఎంత అధ్వాన్నంగా ఉందో కొవిడ్‌ అల కళ్లకు కట్టినట్టు చూపించింది. బాల్యం పోషకాహార లేమితో బలైపోతోన్నది. అత్యధిక పేద ప్రజలు జీవితాంతం కడుపుకు  చాలినంత అన్నం దొరకక, చేతికి పని దొరకక కండెల్లా తిరుగుతున్నారు.

అధిక జనాభా గల మనలాంటి దేశంలో పెట్టుబడి సాంధ్రత గల పరిశ్రమల స్థాపన నిరుద్యోగాన్ని పెంచుతుంది. కనుక మనదేశంలో శ్రమసాంధ్రత సాంకేతికతను ఉపయోగించుకునే పరిశ్రమల స్థాపన జరగాలి. వ్యవసాయ రంగాన్ని మరింతగా స్వయం సమృద్ధిగా అభివృద్ధి చేసుకోగలగాలి. ఆహార పదార్థాల కోసం ఎట్టి పరిస్థితులలో ఇతర దేశాలపై ఆధారపడని వ్యవసాయ పారిశ్రామిక రంగాల సమన్వయాన్ని, స్వావలంబనను సాధించాలి. పెట్టుబడుల కోసం దేశీయ పొదుపు పెరగాలి. పరిశ్రమల రంగంలో దేశీయ పెట్టుబడులకు విస్తారంగా అవకాశాలు కల్పించబడాలి. అటువంటప్పుడే ప్రజలందరి భాగస్వామ్యంతో సమ్మిళితవృద్ధి కొనసాగుతుంది. ఇందుకు భిన్నంగా ‘‘విదేశీ పెట్టుబడులే అభివృద్ధికి సాధనం’’ అంటూ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలతో ఈ వ్యూహం అమలు వేగవంతమైంది. ఈ పెట్టుబడులు ఆధునిక సాంకేతికతను తీసుకు వస్తాయని, దానితో ఉత్పాదకత పెరిగి సుస్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇక పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమం వేగంగా ముందుకు సాగుతుందని, వెనుకబడిన, తృతీయ ప్రపంచ దేశాలన్నీ, భారతదేశంతో పాటు రకరకాల ప్రోత్సాహకాలు, రాయితీలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి పోటీపడటం మనం చూస్తున్న దృశ్యం.

1991లో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడు వ్యాపార దిగ్గజాలకు, ప్రభుత్వంలోని విధాన కర్తలకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు, బహుళజాతి సంస్థలకు మధ్య అపవిత్రమైన లంకె కుదిరింది. ఇప్పుడు వీరి మధ్య బంధం ఇంకా బిగుసుకుంటున్నది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంబానీలు, అదానీల సంపద మోడీ పాలనలో నాలుగు రెట్లు పెరిగింది. ఆర్థిక రంగం మీద వారి పట్టు రాకెట్‌ వేగంతో పెరుగుతోంది. మూడు దశాబ్ధాలుగా పాలకులు అత్యుత్సాహంతో అమలు చేసిన, ఇంకా మరింత జోరుగా అమలు చేస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు ప్రజల బతుకులను బాగు చేయలేనప్పుడు అవి ఎందుకు, ఎవరి కోసం? స్థూలంగా చెప్పాలంటే ఈ సంస్కరణలు ఒకటి రెండు బడా వ్యాపార సంస్థల గుత్తాధిపత్యాన్ని అవధులు మించి పెంచి పోషిస్తున్నాయి. పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో నూతన ఆవిష్కరణలతో ప్రపంచ మార్కెట్‌ను విశేషంగా ఆకట్టుకొని భారీగా ఎగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని అపారంగా సంపాదించుకొనేలా సమాజ వికాసాన్ని సాధించడానికి బదులు ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం బాగు పడడానికి దారులు వెడల్పు చేస్తున్నారు. ప్రభుత్వం అండతో ఆ వర్గం దేశీయ మార్కెట్‌ ద్వారా ప్రజలను దోచుకోడానికి పాలకులు తోడ్పడుతున్నారు. 

1991 జూలై నుంచి అమలులోకి తెచ్చిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు కార్పొరేట్ల లాభాలు పెంచడానికి తోడ్పడ్డాయి తప్ప ప్రజల జీవితాలను బాగుపర్చడానికి దోహదపడలేదు. ఆర్థిక సంస్కరణల లక్ష్యం ప్రజల బతుకులు బాగుచేయడానికి కాదని మూడు దశాబ్ధాల అనుభవం తేటతెల్లం జేస్తోన్నది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రపంచంపై నెలకొల్పే లక్ష్యంతో రూపొందించిన సిద్ధాంతం. మన దేశంలో అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు ఆ సిద్ధాంతంలో అంతర్భాగమే. అందువల్లనే ప్రభుత్వ ఆర్థిక విధానాలు కార్పొరేట్లు గరిష్టంగా లాభాలు సంపాదించడమనే ఏకైక లక్ష్యంతో అమలు జరిగాయి. అందుకోసం  దేశీయ సహజవనరులను దోచిపెట్టారు. ప్రజలను బలి చేశారు. ఈ కాలంలో ప్రజల్లో పేదరికం, యువతలో నిరుద్యోగం,  ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు ఊహించని రీతిలో పెరిగాయి. ప్రజల ఆదాయాలు తగ్గి కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. దీనికి తోడు కరోనా విపత్తు ప్రజల జీవితాల మీద వినాశకర ప్రభావాన్ని మరింత పెంచింది. ఇంకా దాని విధ్వంసం కొనసాగుతోంది. 

అచ్చేదిన్‌, ‘సబ్‌ కా సాత్‌- సబ్‌ కా వికాస్‌’ అన్న నినాదాలతో అధికారంలోకి వచ్చిన మోడీ కొంతమంది తన అస్మదీయులనే ప్రోత్సహించి అందలం ఎక్కించారు. అందుకు ఉదాహరణంగా అదానీ, అంబానీ కుటుంబాల సంపదలు ఎలా పెరిగాయో గమనిస్తే అర్థమవుతుంది. 2001 వరకు అదానీ చిన్న ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇవాళ ప్రపంచ కుబేరుల జాబితాలో 14వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే ముఖేశ్‌ అంబాని 13వ స్థానంలో ఉన్నాడు. మోడీ ప్రధాని అయ్యే నాటికి అదానీ ఆస్తులు ఒక్క గుజరాత్‌లోనే ఉండగా ఇవాళ దేశ వ్యాప్తంత ఆయన ఆస్తులు విస్తరించాయి. 2013లో ఆయనకున్న ప్రాజెక్టులు 44 కాగా 2018 నాటికి 92కి చేరాయి. అదానీ, అంబానీలతో పాటు దేశంలో గుప్పెడు సంస్థలకు మాత్రమే మోడీ ప్రభుత్వం  అన్ని రకాల తోడ్పాటు అందిస్తోంది.

2014లో నరేంద్ర మోడీ అధికారానికి రాకముందు ఫోర్చ్స్‌ అత్యంత ఐశ్వర్య వంతుల జాబితాలో ముఖేశ్‌ అంబానీ 40వ స్థానంలో ఉన్నారు. అప్పుడాయన సంపద విలువ 18.6 బిలియన్‌ డాలర్లు. అనాడు డాలర్‌ విలువ 62 రూపాయలు. అంటే 1.15 లక్షల కోట్లు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడేళ్లలో అతడి సంపద అనేక రెట్లు పెరిగింది. ఫోర్చ్స్‌ ఇండియా జాబితా ప్రకారం 2020 నాటికి అంబానీ సంపద విలువ 588.7 బిలియన్‌ డాలర్లు. ఆనాడు డాలర్‌ విలువ 71 రుపాయలు అంటే 4.18 లక్షల కోట్లు. 2021 నాటికి 7.18 లక్షల కోట్లకు పెరిగింది. ప్రపంచ అత్యంత ఐశ్వర్యవంతుల్లో అంబానీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అలాగే గుజరాత్‌కు చెందిన అదానీ కూడా ఉహించలేనంత ఎత్తుకు ఎదిగాడు. ఫోర్చ్స్‌ ప్రకారం 2014లో అదానీ సంపద విలువ 7.1 బిలియన్‌ డాలర్లు కాగా, 2020 నాటికి 25.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. 2021 నాటికి అదానీ సంపద 5.05 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలో రెండవ అత్యంత ఐశ్వర్యవంతుడయ్యాడు. టెలికం, చమురు, పెట్రో కెమికల్స్‌, చిల్లర వ్యాపార రంగాల్లో ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తున్నది. టెలికం రంగంలో టెలీ రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నియమాలను కూడా ధిక్కరించి రిలయన్స్‌ జియో అప్రతిహతంగా విస్తరించుకుంటున్నది. జియో కారణంగా ప్రభుత్వ రంగంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ దారుణంగా దెబ్బ తినడమే కాకుండా ఐడియా వంటి ప్రైవేటు సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి విలవిలలాడుతున్నాయి. 

మూడు దశాబ్ధాల సంస్కరణలు అమలైన కాలంలో ద్రవ్య పెట్టుబడిదారీ విధానపు కొల్లగొట్టే స్వభావం పూర్తిగా బహిర్గతం అయింది. దాని ఆటవిక ప్రవృత్తి (యానిమల్‌ స్పిరిట్‌) ప్రజల ఉమ్మడి ఆస్తులను, సహజ వనరులను, ప్రజల శ్రమను అన్నీ స్థాయిల్లో ప్రైవేట్‌ పరం చేయడం, ప్రజల మీద వినియోగం (యూజర్‌) చార్జీలను మోపడం వేగంగా జరిగిపోతోంది. ఈ విధానం అమలు జరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులపై ప్రత్యక్ష పన్నులు తగ్గి, ప్రజలపై పరోక్ష పన్నులు పెరిగిపోతోన్నాయి. 2007లో అమెరికాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం 2008 నాటికి అన్ని దేశాలకు పాకింది. అది ఇవ్వాళ్టీకి కుదుట పడలేదు. కానీ ప్రపంచ కుబేరుల సంపదలు దశాబ్ధ కాలంలో అంటే 2018 నాటికి రెట్టింపు అయ్యాయి. ఈ సంపద పెరుగుదల ఉత్పత్తిని పెంచడం ద్వారా సాధించలేదు. చట్టా వ్యాపారం, సేవా రంగం ద్వారా సంపదలు పెంచుకున్నారు. ఈ కాలంలోనే సంపదలో కార్మికుల వేతనాల వాటా తగ్గింది. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా నిజవేతనాలు పొందలేక పోతున్నారు. అంటే మిగులులో కార్మికుని వాటా తగ్గి యజమాని వాటా పెరిగిందని గుర్తించాలి.

పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని, సామాజిక న్యాయమే లక్ష్యమని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనడానికి తాజా నివేదికలే నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా భారత్‌ ఇప్పుడు అతి కొద్దిమంది వ్యక్తులు, కుటుంబాలను మాత్రమే కోటీశ్వరులుగా తయారు చేసే ఫ్యాక్టరీగా మారిపోయింది. పేదలకు బతుకులేని పరిస్థితులు కల్పిస్తున్నది. దేశంలోని బిలియనీర్ల సంఖ్య పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరికి అనుకూలంగా ఉందో చెప్పకనే చెప్తున్నది. ఐఐఎఫ్‌ ఎల్‌హెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ సెప్టెంబర్‌ 30న విడుదల చేసిన వివరాల ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 7,18,000 కోట్ల రూపాయలతో ఆసియాలో నంబర్‌ వన్‌గా ఉన్నారు. గౌతం అదానీ, ఆయన కుటుంబం ఐదు నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1.4 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న అదానీల ఆదాయం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.06 లక్షల కోట్లకు చేరింది. అంటే ఏడాది కాలంలోనే అదానీల ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఆ కుటుంబ ఆదాయం రూ.5,05,900 కోట్ల రూపాయలు. ఒక రకంగా చెప్పాలంటే, గౌతం అదానీ, ఆయన కుటుంబ ఆదాయం రోజుకు 1,002 కోట్ల రూపాయలు. అదానీ కుటుంబానికి చెందిన వినోద్‌ శాంతిలాల్‌ అదానీ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. శాంతిలాల్‌, ఆయన కుటుంబ ఆదాయం 1,31,600 కోట్ల రూపాయలు. 

భారత ‘టాప్‌ 10’ కుబేరుల జాబితాలో ఈసారి కొత్తగా నలుగురికి చోటు దక్కింది. అంబానీ, అదానీలతో పాటు శివ్‌ నాదార్‌ (హెచ్‌సిఎల్‌/ 2,36,600 కోట్లు), ఎస్‌పి హిందూజా (హిందుజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌/ 2,20,200 కోట్లు), ఎల్‌ఎన్‌ మిట్టల్‌ (ఆర్సెలార్‌ మిట్టల్‌ గ్రూప్‌/ 1,74,400 కోట్ల రూపాయలు), సైరస్‌ పూనావాలా (సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా/ 1,63,700 కోట్ల రూపాయలు), రాధాకిషన్‌ దమానీ (అవెన్యూ సూపర్‌మార్ట్స్‌/ 1,54,300 కోట్లు), కుమార మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా/1,22,200 కోట్లు, జే చౌదరీ (స్కాలర్‌ గ్రూప్‌/ 1,21,600 కోట్ల రూపాయలు) టాప్‌ 10 ధనవంతుల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ, గతం కంటే శరవేగంగా దేశ సంపదను కార్పొరేట్‌ రంగానికి బాహాటంగా, నిస్సిగ్గుగా కట్టబెడుతున్న చర్యలు ఇప్పుడు అందరికీ బాగా తెలిసినవే. ప్రభుత్వ ఆస్తులు తరగిపోతుండగా, కార్పొరేట్‌ దిగ్గజాలు మరింత బలపడుతున్నారు. అందుకు నిదర్శనమే ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ రిచర్‌ లిస్ట్‌, దేశంలోని 119 ప్రధాన నగరాలకు చెందిన 1,007 మంది నికర ఆదాయం 1,000 కోట్ల రూపాయలు. అదే సమయంలో ఒక సాధారణ ఉద్యోగి సగటు ఆదాయం నెలకు 16,000 రూపాయలు లేదా సంవత్సరానికి 1,92,000 రూపాయలు. ఇక కార్మికులు, రోజు కూలీల ఆదాయం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడం కష్టం కాదు. 

ప్రపంచ వ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టు రట్టు చేస్తూ సంచలన విషయాలు (రహస్య పత్రాలు) మరోసారి అక్టోబర్‌ 7 సాయంత్రం బహిర్గతమయ్యాయి. ఐదేళ్ల క్రితం ‘పనామ పేపర్ల’ పేరుతో పేలిన బాంబుకంటే శక్తివంతంగా ‘పాండోరా పేపర్లు’ ఎంతోమంది అక్రమ భాగోతాలను వెలుగులోకి తెచ్చాయి. అక్రమ పెట్టుబడుల వివరాలు, రహస్యంగా పన్ను తక్కువ ఉన్న దేశాలకు సంపదను తరలించిన వివరాలు దీనిలో ఉన్నాయి. ఈ జాబితాలో 91 దేశాలకు చెందిన వందల మంది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ధౌత్యాధికారులు, బిలియనీర్లు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. మనదేశానికి చెందిన ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపిలు, దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవారు అందరు కలిసి 380 మంది ఉన్నారు. ఇప్పుడీ ‘పండోరా పేపర్స్‌’ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం రేపుతోంది. అనిల్‌ అంబానీ, సచిన్‌ టెండ్కూలర్‌, జాకీష్రాఫ్‌, నీరా రాడియా లాంటి ప్రసిద్ధుల పేర్లు బయటకొచ్చాయి. పాతికేళ్ళ పైచిలుకుగా ఇలాంటి ‘పెద్దలు’ ఇంధ్రభవనాలు, సముద్రతీర నివాసాలు, విలాసవంతమైన నౌకలు లాంటి ఆస్తిపాస్తుల రూపంలో తమ సంపదను దాచేస్తున్నారని కథనం. ప్రపంచం నలుమూలల్లోని 14 వేర్వేరు న్యాయ, ఆర్థిక సేవల సంస్థల నుంచి సేకరించిన కోటీ 20 లక్షల రహస్యపైళ్ళను తిరగేస్తే తేలిన విషయమిది. ఇలా రహస్యంగా సంపదను పోగేసుకున్న వారిలో జోర్డాన్‌ రాజు, చెక్‌ ప్రధాని సహా రష్యా అధ్యక్షుడు పుతిన్‌, పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ల సన్నిహితులూ ఉన్నారు. 

గత మూడు దశాబ్దాలుగా, ప్రత్యేకించి గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం అమలుపరుస్తున్న విధానాలు, చట్ట సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్పొరేట్‌ దోపిడీ శక్తుల అనుకూల చట్రంలో పకడ్బందీగా రూపొందిస్తున్నటువంటివే. వీటి ప్రధాన లక్ష్యం, శ్రామికులచే సృష్టించబడిన విలువ/ సంపదంతా కుబేరులకు/ బిలియనీర్లకు, బలమైన కార్పొరేట్‌ శక్తులకు  బదిలీ చేయడమే. తద్వారా మెజారిటీ ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లోకి నెట్టబడతారు. ఇట్లా కొద్దిమంది చేతిలో సంపద కేంద్రీకరణ, మోజారిటీ ప్రజల దుర్భర దారిద్య్రం ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు. కొద్దిమంది చేతిలో సంపద పోగు పడటానికి, కేంద్రీకరించబడటానికి ప్రభుత్వాల తోడ్పాటు ఏ రూపంలో ఉంటుందంటే,  సరళీకరించబడిన పారిశ్రామిక విధానాలు, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేట్‌ శక్తులకు సులువుగా పరపతి అందటం కోసం విత్తరంగ సంస్కరణలు, కార్పొరేట్‌ శక్తులు బకాయిపడిన లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణమాఫీ మొదలైన అనేకానేక చర్యల వల్ల మన పారిశ్రామిక రంగం, సేవలు, మౌలిక వసతులతో కూడిన తృతీయ రంగం మీద శక్తివంతమైన కార్పొరేట్ల ఆధిపత్యం బలపడిరది.

సాపేక్షికంగా మిగులును విపరీతంగా పెంచుకునే పెట్టుబడుల ప్రయత్నాల వల్ల ఏర్పడుతున్న సాంకేతిక ప్రగతి, ఆటోమేషన్‌, డిజిటల్‌ విప్లవం, కృత్రిమ మేధస్సు మొదలైన వాటితో ఉపాధి కల్పన అధికంగా ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పారిశ్రామిక రంగం నుండి బయటకు నెట్టివేయబడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్నుతో ఈ ప్రక్రియ మరింత వేగవంతమైందన్న కఠోర సత్యం మనందరికీ తెలిసిందే. ‘వాణిజ్య సౌలభ్యం’ కోసం అంటూ ప్రభుత్వం విస్తారంగా మార్పులతో అమలుపరుస్తున్న ద్రవ్య విధానం, కోశ విధానం, వాణిజ్య విధానం మొదలైనవన్నీ ఈ క్రమాన్ని బలంగా వేగవంతం చేస్తున్నాయి. నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, కొవిడ్‌ విపత్తు వల్ల సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు మూతబడడంతో కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇవ్వాళ్టీకి ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు.  

ప్రభుత్వం నిష్పాక్షికంగా ఉండి ప్రైవేటు కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ సాగేలా చూడడానికి బదులు అది అంబానీలు, అదానీల అడుగులకు మడుగులత్తుతున్నది. కంపెనీల మధ్య పోటీ ఉంటే అవి నూతన ఆవిష్కరణల కోసం విశేషంగా కృషి చేసి దేశ ఆర్థిక రంగానికి తోడ్పడతాయి. ప్రపంచ ఆవిష్కరణల కొలబద్ధ భారతదేశాన్ని48వ స్థానంలో ఉంచింది. అదే సమయంలో చైనా 14వ స్థానంలో వెలిగిపోతున్నది. విమానయాన రంగంలో అదానీకి కట్టబెట్టిన గుత్తాధిపత్యాన్ని గమనిస్తే కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఇంతవరకు ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆధీనంలో ఉన్న గునాహతి, జైపూర్‌, అహ్మదాబాద్‌, త్రివేండ్రం, మంగళూరు విమానాశ్రయాలను 50 ఏళ్ల పాటు నిర్వహించడానికి అదానీకి ఇచ్చేశారు. ఇంకా రైల్వేలు, రోడ్లు తదితర అనేక రంగాలు ప్రభుత్వం చేయిజారిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశం దివాళా తీసి పారిశ్రామిక దిగ్గజాల సంపద విపరీతంగా పెరిగిపోతున్నది. 

భారత్‌లోని 10 శాతం సంపన్న కుటుంబాల చేతిలో దేశ భౌతిక, ద్రవ్య ఆస్తులు 74 శాతం పైగా ఉన్నాయి. రూపాయల లెక్కల్లో చూస్తే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న యావన్మంది ప్రజల యావదాస్తి విలువ రూ.274.6 లక్షల కోట్లు. అందులో 10 శాతం అతి సంపన్నుల వాటా రూ.139.6 లక్షల కోట్లు . కాగా గ్రామీణ భారత్‌లో ఆస్తుల మొత్తం విలువ రూ.238.1 లక్షల కోట్లు. అందులో ఆ 10 శాతం వాటా రూ. 132.5 లక్షల కోట్లు. ఇక దిగువ 50 శాతం సంగతి చూస్తే వారి చేతిలోని ఆస్తుల విలువ గ్రామీణ ప్రాంతంలోని ఆస్తుల్లో 10.2 శాతం, పట్టణ ప్రాంతం ఆస్తుల్లో 6.2 శాతం, 130 కోట్ల దేశ జనాభాలో 10 శాతం అనగా 13 కోట్ల మంది 70 శాతం పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. 75 సంవత్సరాల స్వదేశీ పాలన తదుపరి ఇదీ పరిస్థితి. గరీబీ హఠావో అన్నా, సబ్‌ కా వికాస్‌ అన్నా అవి ఓట్ల రాజకీయాల్లో భ్రమలు గొలిపే మాటలు, మోసకారి భాషణలనక తప్పదు. అధికార బదిలీ జరిగిన  నాటినుండి పాలక వర్గాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధాన దుష్ఫలితం ఇది. ఆర్థిక సంస్కరణలు సంపద సృష్టితో పాటు కేంద్రీకరణను వేగిరపరిచాయి అంతే. 

జనాభాలో మూడింట‌ రెండు వంతులు నివసించే గ్రామీణ భారతంలో ఈ అసమానత మరీ హెచ్చుగా ఉంది. గ్రామీణ జీవనానికి పట్టుగొమ్మ అయిన వ్యవసాయరంగం గత మూడు దశాబ్దాల్లో ప్రభుత్వాల నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన కారణంగా 3-4 లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామీణ చేతివృత్తులు ధ్వంసమైనాయి, వ్యవసాయ కార్మికుల్లో అత్యధికులు పొట్టచేతబట్టుకుని  పట్టణాలకు వలసలు పోతున్నారు. వారి విషాదాన్ని గత సంవత్సరం కరోనా దాడి సందర్భంలో చూశాం. సబ్‌ కా  సాత్‌ నినాదం కొరగానిదైంది. ప్రపంచంలో మనది 5వ ఆర్థిక వ్యవస్థ అని ఘనంగా బాకాలూదుతున్నారు. కానీ ఐరాస ఏటా విడుదల చేసే మానవాభివృద్ధి సూచీలో మనదేశం 131వ స్థానంలో ఉందని చెప్పరు. ప్రపంచ కుబేరుల సంఖ్యలో మనదేశం 4వ స్థానంలో ఉంది. అదే సమయంలో అన్నార్థుల సంఖ్య అసంఖ్యాకమవుతుంది. 

ప్రపంచంలో ఆర్థాకలితో, ఆర్థాయుష్షుతో మగ్గుతున్న ఐదేండ్లలోపు పిల్లల్లో 40 శాతం మనదేశంలోనే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక యువతను కలిగి ఉన్న మన దేశంలో ఉద్యోగం రాక దిక్కులు లెక్కిస్తున్నారు. ఉరితాళ్లకు వెళ్లాడుతున్న రైతులున్నారు. జీవచ్ఛవాలుగా మిగిలిన వృత్తిదారులున్నారు. ఇంత దారుణంగా ప్రజలు జీవితాలు గడుపుతుంటే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సెలవిచ్చే దగాకోరు పాలకులున్నారు. మరీ జరుగుతున్న అభివృద్ధి ఏమైపోతోందీ, ఎవరికి చెందుతోందీ అనేదే అసలు ప్రశ్న. నూటికి 70 శాతంగా ఉండి ఉత్పత్తికి చెమటను ధారపోస్తున్న కార్మిక కర్షక వర్గాల అభివృద్ధా? లేక ఆ ఉత్పత్తిని దోచుకు తింటున్న 10 శాతం మంది పారిశ్రామికవేత్తలూ, కాంట్రాక్టర్లూ, వ్యాపార దిగ్గజాల అభివృద్ధా? అంటే.. 10 శాతం మంది బడాబాబుల అభివృద్దేనన్నది పలు నివేదికలు స్పష్టం చేస్తున్న పచ్చి నిజం. 

2014లో బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దేశపాలనలో, ఆర్థిక విధానాలలో గుణాత్మక మార్పు చోటు చేసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపిత మోడీ హిందూత్వ ఫాసిస్టు పాలన, ద్రవ్య పెట్టుబడిదారీ విధానం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం విష కలయికతో కొనసాగుతోంది. రాజ్యాంగ సంస్థలు అన్నీ మోడీ ప్రభుత్వ జేబు సంస్థలుగా మారి వాటి స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయాయి. ప్రణాళిక సంఘం రద్దు, వస్తు సేవల పన్ను అమలు, ఫెడరల్‌ రాజ్యాంగానికి తూట్లు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మికుల కోడ్స్‌, ప్రతిపక్షాలపై ఈడి దాడులు చేయించి తన పార్టీలోకి తీసుకోవడం. ప్రశ్నించే గొంతుకలపై ఉపా, దేశ ద్రోహం చట్టం ప్రయోగించి అక్రమంగా నిర్బంధించడం, లవ్‌ జీహాద్‌, గోరక్షణ పేరుతో మహిళలపై, మైనారిటీలపై భౌతిక దాడులు చేయడం, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 రద్దు చేయడం, పౌరసత్వ చట్ట సవరణ, సర్వం ప్రైవేట్‌ అప్పగించడం, చివరికి ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ పేరుతో ఆశ్రితులకు అప్పగించే ప్రభుత్వ విధానాలు, లౌకిక-ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి హిందూత్వ ఫాసిస్టు పాలన సాగించడం మనం చూస్తూనే ఉన్నాం.

మోడీ పాలనలో ఆహర కొరత, ధరల పెరుగుదల సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నది. యుపిఎ పాలనలో రద్దుచేసిన మొండి బాకీలు కాక ఇప్పుడు మరో పది లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రాని బాకీలుగా ప్రకటించబోతున్నారు. గతంలో ముంచినవి, ఇవీ కలిపి వేరే పేర్లతో కేంద్రం అమ్ముతున్న ప్రభుత్వ సంస్థలను రుణాలు ఎగ్గొట్టిన వాళ్లే కొంటున్నారు. ఉద్యోగులను తగ్గిస్తున్నారు. కార్మిక సంఘాలు లేకుండా చేస్తున్నారు. దేశం అధోగతికి నెట్టబడుతున్నది. ఓట్లు రాబట్టిన తరువాత ఏమైనా చేయవచ్చు అనుకుంటూ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఎర చూపి మతం, కులం కార్డులు ఉపయోగించి గెలుస్తున్నారు. అందరూ అదే బాట పడితే ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? గుప్పెడు మార్వాడీ, గుజరాతీ తదితర పెట్టుబడిదారులు దేశాన్ని, దేశ సంపదను, సంస్థలను గుప్పెటపడుతున్నారు. యువతరం, విద్యావంతులు సరైన ఉద్యోగాలు లేక తల్లడిల్లుతున్నారు. ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఇంత దుర్భర పరిస్థితి గత ఏడు దశాబ్ధాలలో ఏనాడు లేదు.  

2019లో మోడీ రెండవసారి తిరిగి అధికారంలోకి రాగానే 2022 నాటికి ‘నూతన భారతదేశం’ ఆవిష్కరిస్తామని ప్రకటించారు. నూతన భారతదేశం అనేది బ్రాహ్మణీయ హిందూత్వ నిరంకుశవాదం, కార్పొరేట్‌ ద్రవ్య పెట్టుబడిదారీ విషకలయిక అని మనం అర్థం చేసుకోవాలి. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాష్‌, ఆత్మ నిర్బర్‌(స్వావలంబన) అని నిత్యం మోడీ ప్రవచించే మాటలు వట్టి డొల్ల అని రుజువైంది. మోడీ ఫ్రభుత్వ విధానాలు అన్నీ ప్రజల కడుపుకొట్టి అదానీ, అంబానీ వంటి ఆశ్రితుల సంపదలు పెంచడమేనని ఫోర్చ్స్‌, హురూన్‌ నివేదికలు రుజువు చేశాయి. అంతేకాదు దోపిడీ, అవినీతి, పీడన మోడీ పాలనలో కలగలసి పోయాయి. అయితే మోడీ కలలు గంటున్న ‘నూతన భారతదేశానికి’ సవాలుగా వర్గ-ప్రజా పోరాటాల రూపంలో షాహిన్‌బాగ్‌లో మహిళలు, ఢల్లీిలో రైతులు సాగిస్తున్న ఉద్యమం హిందూత్వ ఫాసిస్టు పాలన పునాదులను పెకిలిస్తున్నాయి. ప్రజా ప్రతిఘటన, ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుంది. ప్రజాతంత్ర కార్యక్రమం ప్రాతిపదికన ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విముక్తి లక్ష్యాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన చారిత్రక అవసరం నేడు లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులపై ఉంది.  

Leave a Reply