“గత సంవత్సరం, కొంతమంది జిల్లా రిజర్వ్ గార్డులు గ్రామానికి వచ్చి నన్ను పట్టుకుని, నక్సలైట్లు ఎక్కడ దాక్కున్నారో చెప్పమని వేధించడం మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు అడవిలో తిప్పారు. చాలాసార్లు శారీరకంగా హింసించి, చివరకు అడవిలో వదిలేశారు, ”అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాల ఆరోపణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న స్మిత (పేరు మార్చబడింది) అన్నారు.

గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న భద్రతా బలగాల శిబిరాలకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో నిరసనలు చేస్తున్న వేలాది మంది గ్రామస్తుల్లో స్మిత ఒకరు.

స్మిత గ్రామంలో మాదిరిగానే, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీజాపూర్, సుక్మా, తదితర జిల్లాల్లోని గ్రామాల్లో భద్రతా దళాల శిబిరాలకు, రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, భద్రతా సిబ్బంది దోపిడి, దుర్వినియోగం, అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.

2021 మే లో బీజాపూర్‌లోని సిల్‌గేర్‌లో నిర్మించబోయే పోలీసు శిబిరానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గ్రామస్థులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి ముగ్గురు గ్రామస్థులను చంపిన తర్వాత, ఇతర నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కూడా నిరసనలు ప్రారంభమయ్యాయి.

ఆదివాసీలు తప్పుదారి పట్టించారనే అధికార కాంగ్రెస్ నాయకులు భావననూ, ఈ నిరసనల వెనుక మావోయిస్టుల హస్తం ఉందనే పోలీసు అధికారుల అనుమానాన్నీ నిరసనలు చేస్తున్న ఆదివాసీలు ఖండించారు.

వివిధ పారామిలటరీ బలగాలు 2018లో 7,  2019లో 10, గత సంవత్సరం 16 కొత్త క్యాంపులను బస్తర్‌లో ప్రారంభించాయి.

సిల్‌గేర్‌లో ఏం జరిగింది?

2021 మే లో, సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న సిల్‌గేర్‌ గ్రామంలో భద్రతా దళాలు క్యాంపుని  ఏర్పాటు చేశాయి. ఈ క్యాంపుని అడవిలో వున్న ఆదివాసీలు మొదట్లో గుర్తించలేదు. అయితే, 2021 మే 12 నాడు గ్రామస్థులు స్థానిక బజార్‌కు వెళ్లినప్పుడు, హఠాత్తుగా ఏర్పాటైన ఈ పోలీసు క్యాంపును చూశారు.

వెంటనే గ్రామస్తులు ఆ శిబిరాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ క్యాంపు దగ్గరకు చేరుకున్నారు. అందుకు పోలీసులు నిరాకరించడంతో, నిరసన తెలిపేందుకు సమీపంలోని గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. మే 17న, భద్రతా బలగాలు అక్కడకు వచ్చిన వారిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ గర్భిణి కూడా మృతి చెందినట్లు సమాచారం.

బస్తర్ అంతటా ఆందోళనలు

కాంకేర్

ఇటీవల బస్తర్‌లోని కాంకేర్ జిల్లాలో ‘బెచ్‌ఘాట్’పై ప్రతిపాదిత వంతెన, సీత్రంలో పర్యాటక కేంద్ర ఏర్పాటుకి వ్యతిరేకంగా వేలాది మంది ఆదివాసీల నిరసనలు ప్రారంభమయ్యాయి.

కాంకేర్ నిరసనలో పాల్గొనేందుకు అబూజ్‌మడ్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల నుండి కూడా వందలాది మంది ఆదివాసీలు 2021 డిసెంబర్ 6నుండి కోటరీ నదికి సమీపంలో వుంటున్నారు.

“మా మాట వినేవారు లేరు. ఇక్కడ చాలా చలిగా ఉంది, మేము ఇక్కడ ఒక నది పక్కన కూర్చొని మాకు అవసరంలేని అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాము. మా అంగీకారం లేకుండా జరుగుతున్న ఈ పనులకు వ్యతిరేకంగా దాదాపు 300 గ్రామాల నుండి ప్రజలు వచ్చి నిరసన తెలుపుతున్నారు.” – మైని కచ్లం, కంకేర్ జిల్లాలోని కందాడి గ్రామ సర్పంచ్

“మేము చేస్తున్న నిరసనను ఎవరూ పట్టించుకోరు. మాకు సెక్యూరిటీ క్యాంపు అక్కర్లేదు, బస్తర్‌లో ఆదివాసీలను ఏం చేస్తారో చూశాం. సిల్‌గేర్‌లో ఏమి జరిగిందో మీరు చూడలేదా?” అని మరో నిరసనకారుడు గజ్జు పడ్డ ప్రశ్నిస్తున్నారు.

“మాకు వంతెనలు, టూరిస్ట్ హబ్‌లు అక్కర్లేదు. ఒకసారి వారు పర్యాటక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తే మా దేవుళ్లకు ఇబ్బంది కలుగుతుంది, మేము దానిని అనుమతించము”అని అతను తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.

మరింత లోతట్టు ప్రాంతాలలో రాబోయే భద్రతా దళ క్యాంపులకు వ్యతిరేకంగా బీజాపూర్ జిల్లాలోని పుస్నార్, బుర్జి గ్రామాలలో కూడా 2021 అక్టోబర్ 5నుండి నిరసనలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్‌లను నెరవేర్చకపోతే త్వరలోనే తమ సంఖ్య వేలకు పెరుగుతుందని నిరసనకారులు తెలిపారు.

సుక్మా

2021 నవంబర్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కొంటా ప్రాంతంలోని సింగారం, గోంపాడ్‌లలో నిరవధిక నిరసనలు జరుగుతున్నాయి. 2008, 2015లో జరిగిన ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ, ఆ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది గ్రామస్తులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. .

నారాయణ్‌పూర్

2021 అక్టోబర్‌లో, వివిధ రాష్ట్ర కార్యక్రమాలకు వ్యతిరేకంగా వందలాది గ్రామస్తులు అబూజ్‌మడ్‌లోని కొడక్‌నార్‌ ప్రాంతంలో నిరసనలు ప్రారంభించారు. అబూజ్‌మడ్‌ ప్రాంతంలోని తడోనార్‌లోని దట్టమైన వెదురు అడవులను ఆదివాసీలు తమ ప్రార్థనా స్థలంగా భావిస్తారు. దేవ్ దాంగ్ అని పిలువబడే జాత్రలో ప్రతిష్టించే దేవుడి జెండాను తయారు చేయడానికి ఇక్కడి వెదురును ఉపయోగిస్తారు.

జిల్లా కేంద్రం నుంచి అబూజ్‌మడ్‌ కుతుల్ (మావోయిస్ట్ కీలక ప్రాంతం) వరకు ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

2021 అక్టోబర్‌లో నిరసన తెలిపేందుకు కస్తూర్‌మెట గ్రామంలో వందలాది మంది గ్రామస్తులు కొడ్కనార్‌లోని దేవ్ వెదురు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. 2021 అక్టోబర్ లో ఒక గ్రామస్తుల ప్రతినిధి బృందం కూడా జిల్లా కేంద్రానికి వచ్చి దేవ్ వెదురు అడవిని నరికివేయవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి మెమోరాండం సమర్పించింది.

ఆదివాసీల డిమాండ్‌లు :

బీజాపూర్‌లోని సింగారం, గోంపాడ్, పుస్నార్, సుక్మాలోని సిల్‌గేర్, సర్కెగూడ, ఎడ్సెమెటా వంటి గ్రామాలు ప్రస్తుతం బస్తర్‌లో ఆందోళనా మైదానాలు. పోలీసు ఎన్‌కౌంటర్‌లపై విచారణ డిమాండ్ చేయడం నుండి రాష్ట్ర ప్రాయోజిత అభివృద్ధి ప్రాజెక్టుల వ్యతిరేకత వరకు జరిగే నిరసనలతో బస్తర్ అట్టుడుకుతోంది.

ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజాపూర్‌కు చెందిన రామ్‌సింగ్ కడ్తీ, “జూలై 15న, పొలాలు దున్నుకోడానికి మా బంధువుల దగ్గర వున్న ఎద్దులను తీసుకురావడానికి తామోడి గ్రామం నుండి దంతెవాడలోని నిలవయ గ్రామానికి వెళ్ళాము. మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడకు వచ్చిన DRG జవాన్లు ఎద్దుని తీసుకువస్తున్న మా వాళ్ళు ముగ్గురిని పట్టుకుని చంపేసి, మావోయిస్టులుగా ముద్ర వేశారు.” అని వివరించారు.

అత్యాచారాలు, చట్ట వ్యతిరేక హత్యలు, పోలీసుల అణచివేతలకు సంబంధించి అనేక సందర్భాల్లో బస్తర్‌లోని ఆదివాసీలు ఆరోపణలు చేశారు. 2012లో జరిగిన అలాంటి ఒక పోలీసు ఎన్‌కౌంటర్‌లో 17 మందిని హత్య చేసి మావోయిస్టులుగా ముద్ర వేసారు, జరిగిన ఘటనపై 2019లో విచారణ చేసిన జ్యుడిషియల్ కమిషన్, సర్కేగూడలో పోలీసు బలగాల చేతిలో హతమైన వారు మావోయిస్టులు కాదని తన నివేదికలో పేర్కొంది.

బస్తర్ అంతటా పోలీసు శిబిరాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు విద్యార్థులు, ఆదివాసీ యువకులు నాయకత్వం వహిస్తున్నారు.

“రాజ్య అణచివేత, మావోయిస్టులపై పోరాటం పేరుతో క్రూరమైన హత్యలు, అత్యాచారాలు, హింసలు ఇతర అంశాల  సుదీర్ఘ చరిత్ర నుండి బస్తర్‌లో నిరసనలు ఉద్భవించాయి. ప్రజలు ఇకపై మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేరు.”

ప్రభుత్వం ఏమంటోంది?

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ స్పందన:

“బస్తర్ విషయానికి వస్తే, నిరసనలు జరిగిన ఏకైక ప్రదేశం సిల్‌గేర్‌లో మాత్రమే నిరసనలు జరిగాయి. ఈ నిరసనలు కొత్త రక్షణ శిబిరానికి వ్యతిరేకంగా జరిగాయి. ఈ ప్రక్రియ మొత్తంలో మేము స్థానిక ఆదివాసీలు, ఎన్నికైన ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నాము. ఎన్నికైన ప్రతినిధుల బృందాన్ని, సంబంధించినవారినందరినీ కలిశాను. సీఎం హౌస్‌లో ఆ ప్రాంత ప్రజలను కలిశాను. చాలా కాలంగా నిరాదరణకు గురైన ప్రాంతంలో సామాజిక అభివృద్ధి జరుగుతున్నందువల్ల వారు క్యాంపుకు అనుకూలంగా ఉన్నారు. మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇలా చేయడం ప్రతి మూలకు పాలన చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. అందుకే వారు క్యాంపుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టమవుతోంది.”

అయితే, బస్తర్ అంతటా సమగ్ర అభివృద్ధి కేంద్రాలుగా పనిచేసేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు.

“గతంలో, ఆధార్, రేషన్ కార్డ్ వంటి ప్రధాన స్రవంతి సేవల కోసం స్థానిక పరిపాలన ఈ ప్రాంతంలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించింది. ఇది గణనీయమైన సంఖ్యలో ప్రజల సేవలు- సౌకర్యాల పరిధిని చివరి మైలు వరకు చేరుకోగలిగింది.  దీనిని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన చట్టవ్యతిరేక సంస్థ ప్రాయోజిత, రాజకీయ ప్రేరేపిత ఆందోళన. మేము లేవనెత్తిన అన్ని సమస్యలను పరిష్కరించాము, ఇప్పుడు కూడా అదే నిబంధనలతో ఉన్నాము, అంటే, అనుకున్నట్లుగా క్యాంపు ఏర్పాటు కావాలి. భూమిని గుర్తించడంలో మాకు సహాయం చేయాలని నేను సామాజిక కార్యకర్తలను అభ్యర్థించాను. అలా చేయడం ద్వారా మేము భూమిని అటవీ హక్కుల చట్టం కింద ఆదివాసీలకు కేటాయించగలము.”

బస్తర్ ప్రజలు, పోరాడగలరని, మరింత దృఢంగా పోరాడగలరని సిల్‌గేర్ నిరసన రుజువు చేసిందని ఆదివాసీ కార్యకర్తలు, స్థానిక జర్నలిస్టులు అంటున్నారు. అందుకే కొన్నేళ్ల క్రితం జరిగిన అఘాయిత్యాలకు నిరసన తెలిపేందుకు  ప్రజలు ముందుకు వస్తున్నారు.

బస్తర్‌లోని మొత్తం నిరసనలకు సిల్‌గేర్ కీలక కేంద్రంగా మారింది. యువ విద్యార్థులు ఈ నిరసనను ఇంత దూరం తీసుకువచ్చారు, మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలిచారు. బస్తర్ నుండి నక్సలిజంను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయం సాధించాలి అని అనుకుంటే ఈ నిరసనను గుర్తించి, చర్చను ప్రారంభించాలి. అలా జరగనట్టయితే ఈ యువ మనస్సులు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతారు, అది బస్తర్‌లో పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.

ద క్వింట్ సౌజన్యంతో..

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Leave a Reply