విపరీతమైన వర్షం కురుస్తోంది. చుట్టూ చిమ్మ చీకట్ల కమ్ముకున్నాయి. ఎటూ దారి కానరావడం లేదు. ఎదురుగా ఉన్న మనుషుల ఆకారాలు కూడా స్పష్టంగా అగుపడడం లేదు. ఆ వర్షం మధ్యనే కంపెనీ నడక సాగిస్తోంది. అయితే, దారి కానరాని పెద్దలు చేతి రుమాలు అడ్డం పెట్టుకొని లైటు వెలుతుర్లు ఎక్కువ దూరం వెళ్లకుండా అనివార్యంగా లైటు వినియోగిస్తూ తడుముకుంటూ తమ గార్డుల సహాయంతో నడుస్తున్నారు.
గెరిల్లాలు తమ ప్రయాణం ఎవరికీ అర్ధం కాకుండా ఉండడానికి సాధారణంగా ఊర్లు తగులకుండానే వెళ్తుంటారు. కానీ, వర్షంతో రాత్రి దారి తప్పితే తెల్లవారి ఎదురయ్యే ప్రమాదాలు ఆలోచించిన కమాండర్ ఊరి మధ్యలో నుండే నడవక తప్పదని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఊర్లో ప్రభుత్వం పంచిన సోలార్ లైట్లు ఇంటింటికి ఉన్నాయి. వీధుల్లోనూ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పగలంతా వేసవి ప్రతాపంతో ఎండ కాయడంతో బ్యాటరీలు ఫుల్ చార్జ్ అయిన ఫలితంగా వెలుతుర్లు విరజిమ్ముతున్నవి. దాదాపు 45 మంది నడకతో కంపెనీ ఊరి చివరకు చేరింది. అప్పటికి తెల్లవారడానికి మరో రెండు గంటలే మిగిలింది.
చివరి ఇంట్లో అలికిడి వినపడుతోంది. ఇంట్లో అప్పటికే లేచిన మహిళలు పనుల్లోకి దిగిపోయారు. కానీ, జనతన సర్కార్ల నిర్మాణానికి ముందులా ఇంటింటా సుయ్…సుయ్…. అంటూ రోకలి పోట్లతో వడ్ల దంపులు వినపడడం లేదు. జనతన సర్కార్లు చేపట్టిన విప్లవ సంస్కరణలలో భాగంగా గ్రామాలలో వడ్ల గిర్నీలు పెట్టడం మొదలైంది. వాటితో బండ చాకిరిలాంటి శ్రమ నుండి తరతరాల ఆదివాసీ మహిళకు విముక్తి లభించింది. మహిళల అలికిడి, ఇంట్లో సోలార్ వెలుతుర్లతో గెరిల్లాలు మరింత అప్రమత్తమై ఎలాంటి శబ్దాలు చేయకుండానే ఊరి దాటారు.
ఈలోగా ఆ ఇంటి వివరాలు తెలుసుకోవడానికి ఆగిన స్థానిక కామ్రేడ్స్ వచ్చి తమ ఫార్మేషన్లో కలిశారు. అక్కడే ఉన్న కమాండరు ఆ ఇంటి రిపోర్టు ఇచ్చారు.
“అ ఇల్లు ఊరి సాహుకారిది. మనకు ఎప్పుడైనా ఆయనే సరుకులు సమకూరుస్తాడు. కొద్ది క్రితమే స్థానిక దళ కామ్రేడ్స్ వచ్చి దుకాణం నుండి సరుకులు తీసుకెళ్లారట. అందుకే ఇంటివాళ్లు తెలివితో ఉన్నారు. మనకు నమ్ముకస్తుడే, అయితే తరచూ పోలీసులు వేధిస్తుంటారు.
అయినా ఇప్పటికి గట్టిగానే ఉన్నాడు అంటూ వారు తమ రిపోర్టు పూర్తి చేశారు.
“పదండి అంటూ కమాండర్ నోటి నుండి వెలువడడమే అలస్యం, కంపెనీ నడక మొదలైంది. అంతా రేగడి నేల. వర్షానికి బాగా తదవడంతో కాళ్లకు చెప్పులు, బూట్లు లేనప్పటికీ, అవి చేతికి ఎప్పుడో చేరినప్పటికీ బురదలో నడక సాగడం లేదు. కాళ్లకు మట్టి పెద్దలు గట్టిగా పట్టేస్తున్నాయి. నీళ్ళు .. నిలిచిన చోట జారుతోంది. యువకులు బలంగా ఉండడంతో ఆ బురదలో సైతం వేగంగానే నడుసున్నారు. జారి కిందపడినా నవ్వుతూ మళ్ళీ లేచి నడక సాగిస్తున్నారు. కానీ, వయసు పైబడినవారు మూడు కాళ్లతో నడక సాగిస్తున్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు. అ బురదలో జారిపడిపోతే ముదిరిన ఎముకలు విరిగితే మళ్లీ అతకడం కష్టం అనే ఎరుకతో చాలా నెమ్మదిగా లైటు సహాయంతో నడుస్తున్నారు. లైటు వెలుతుర్లు ప్రయాణంలో అత్యంత ప్రమాదకరం అని తెలుసు. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. ఈ విషయంలో కమాంకర్ సైతం వారిని వారించలేకపోతున్నాడు. తెల్లారకముందు డేరా చేరాలన్న తపన ఆయనది.
మూడు రకాలవాళ్లతో కంపెనీ నడుస్తుందడంతో గెరిల్లాల ప్రయాణ వేగం చాలా పడిపోయింది. అందుకే కామ్రేడ్ చే గెరిల్లా దళ వేగమెంత అంటే ఆఖరివారి నడకంతా అని జవాబు ఇచ్చాడట! యువకులు, మధ్య వయసువాళ్లు పెద్ద ఇబ్బంది లేకుండానే నడుస్తున్నప్పటికీ వయసు మీరిన వెటరన్స్ తోనే నడక మందగించింది. ఆ వెటరన్స్ లో ప్రతాప్ ఉన్నప్పటికీ, ఆయన శరీర ధారుఢ్యం దెబ్బతినని ఫలితంగా యువకులతో పోటీ పడుతున్నప్పటికీ చేతి బడుగ సాయం లేకపోతే ఆయన నడక సాగేది కాదు అ బురదలో.
ప్రతాప్ యువకులతో నడిచినందున ముందు బ్యాచిలో ఉండి వెనుకవారి కోసం ఆగాడు. తనతో ఉన్న యువ గెరిల్లాల తలలపై తిండి సరుకుల మూటలున్నాయి. మూటలతో పాటు కొందరి జబ్బలకు సోలార్ ప్లేట్లుంటే, మరికొందరికి బ్యాటరీలున్నాయి. వీపున ఉన్న కిట్లలో కంప్యూటర్లు మోస్తున్న వాళ్లూ ఉన్నారు. వాళ్ల మధ్యన నిలిచి అవి చూస్తున్న ప్రతాప్‌కు పార్టీలో జరిగిన మార్పులు తళుక్కున మనసులో మెదిలాయి.
సమావేశ తీర్మానాలు కార్బన్ పేపర్లతో కాపీలు చేసుకున్న రోజులు పోయి స్క్రీన్ ప్రింటింగులు రావడం, ఆ తరువాత కంప్యూటర్లు రావడం వరకు జరిగిన మార్పులు ఆయన ఊహల్లో మెదిలాయి. ఆలోపు ‘కాకలు తీరిన యోధులు” (వెటరన్స్) చేరుకోవడంతో అంతా కలసి మరో పది నిముషాలు నడిచి ‘విశ్రాంతి’ కోసం ఆగారు. కమాండర్ విజిల్ వేయడంతో ఎవరి ఫార్మేషన్లో వాళ్లు ఆలస్యం చేయకుండా నిలుచున్నారు.వారి విశ్రాంతికి గంటే మిగిలింది. సెంట్రీ డ్యూటీ వచ్చిన వాళ్లకు ఆ గంట కూడా ఉండదు.
“కామ్రేడ్స్, మరో గంటలో తెల్లారిపోతుంది. ఉదయాన్నే ఒక బ్యాచ్ స్థానిక కామ్రేడ్సును వెతకడానికి వెళ్లాలి. మిగితా వాళ్లం భోజనాలు ముగించుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ స్థలం, పోలీసుల దృష్టిలో ఉన్నదే. వారు గస్తీకి వెళ్లిన ప్రతి సందర్భంలో ఈ స్థలాన్ని చెక్ చేయకుండా వెళ్లరు. ఊరు వాళ్లు నీళ్లు ఇక్కడి నుండే తీసుకువెళ్తారు. ఊర్లో జనం బాగున్నారు. సెంట్రీలు అలసటలోనూ అప్రమత్తంగానే ఉండాలి” అని బ్రీఫింగ్ చేసి “లైన్ థోడ్” అనడంతో ఎక్కడి వాళ్లు అక్కడ విడిపోయి పాల్తీన్ షీట్లు పరచుకొని పడిపోయారు. ‘వెన్నంటుకుంటే కన్నంటుకుంటుంది’ అంటూ యవ్వనంలో చెప్పిన ప్రతాపకు అది ఇపుడు గతమైపోయింది. ఇపుడు ప్రయాణ బడలికతో వెంటనే నిద్రరావడం లేదు. ఇటు, అటు ఎంతో దొర్లితే కానీ నిద్రపట్టని స్థితి!
తనతోటి మిగితా వాళ్లకు పాపం నడుం వాల్చాక సోదర గెరిల్లాలు కాసేపు కాళ్లు మర్ధనం చేస్తేనే కానీ మళ్లీ ఉదయం నడకకు వారు తమ శరీరయంత్రాన్ని సిద్ధం చేసుకోలేరు. వారికన్నా తన పరిస్థితి ఇప్పటికైతే మెరుగేననుకుంటూ ప్రతాప్ కళ్లు మూసుకున్నాడు.
ప్రతాప్‌కు తెలివిపడే సరికి భళ్లున తెల్లారింది.
స్థానికులను వెతకడానికి వెళ్లాల్సినవాళ్లు వెళ్లారు. ముందు లేసిన వాళ్లు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. నిప్పు రాజేసే వాళ్లు ఆ పనిలో నిమగ్నమై వెటరన్స్ కు వేడినీళ్లు ఇచ్చే పనిలో పడ్డారు. ప్రతాప్ లేచి బ్రష్ చేసుకుంటూ తనలో తానే ముసిగా నవ్వుకుంటుంటే, పక్కనున్న నీలిమ గమనించి అడిగింది.
“ఏం లేదులే, దళంలో ఈ బ్రష్‌ల కోసం జరిగిన ‘యుద్ధం” గుర్తొచ్చింది. మాబోటి కాలేజీ పిల్లలకు కొత్తలో గెరిల్లా దళంలో బ్రష్‌లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే, నాయకత్వం వారించేది. రోజూ స్నానం అంటే చాదస్తపు బ్రాహ్మలనేవారు. తుదకు ఆదివాసీ యువత అక్కడక్కడ బ్రష్‌లు వేయడం మొదలయ్యాక కానీ, ఈ బ్రష్‌లు మాకు మంజూరు కాలేదు తల్లీ! మేం నాయకత్వంలోకి వచ్చాక 21వ శతాబ్దపు మావోయిస్టులుగా మారుదాం అనే చర్చ ప్రారంభించాం. దానితో మాబోటి వాళ్లకు మినహాయింపు దొరికింది. మీరు అదృష్టవంతులు తొలి కష్టాలు తీరాక పరిచిన దారుల్లో మీ పయనం సాగుతోంది” అంటూ పాల్తీన్ షీట్లో కూచోని ఛాయ్ కి ఉపక్రమించాడు. మిగితావాళ్లు పొయ్యి చుట్టూ చేరి ఛాయ్ తాగుతున్నారు.
ఉన్నఫలంగా ‘ఢాం, ఢాం, ఢాం, అంటూ హఠాత్తుగా డేరాపై పోలీసు కాల్పులు ప్రారంభమయ్యాయి. కాల్పులు చాలా రాపిడ్ గా జరుగుతున్నాయి.
ఊహించని పరిణామం నుండి తేరుకున్న గెరిల్లాలూ వెంటనే బదులు ఇవ్వసాగారు. కమాండర్ ఫైర్ చేస్తూనే కాల్పులను సమన్వయించడానికి పరిస్థితిని ఆకళింపు చేసుకుంటున్నాడు. ఎవరి కవర్లలోకి వాళ్లు వెళ్లి పోయారు. అప్పటికి జరిగిన అనేక కాల్పులలో మంచి అనుభవం గడించిన కమాండర్ కావడంతో చాలా నిబ్బరంగా ఉన్నాడు. కాకపోతే, ఆయనతో ఉన్న ముఖ్యమైన వెటరన్స్ ను ఆ కాల్పుల మధ్య నుండి ముందు క్షేమంగా రిట్రీట్ చేయించాలన్నదే ఆయన ఆరాటం. ఆయన ఎంపిక చేసుకున్న వారిని తనతో పెట్టుకొని మిగితా వాళ్లకు రిట్రీట్ కాషన్ ఇచ్చాడు.
వెటరన్స్ తో ఉన్న రక్షణ సిబ్బంది అత్యంత అంకితభావంతో నున్నవారు. నాయకత్వాన్ని రక్షించుకోవడానికి వాళ్లు తమ ప్రాణాలను లెక్కచేయరు.
వాళ్లంతా ఉద్యమంలో నమ్మకమైన కుటుంబాల నుండి భర్తీ అయిన వాళ్లలో నుండి ఎంపికైన వాళ్లు. వాళ్ల కుటుంబాలు పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండడమే కాకుండా పార్టీ నిర్మాణాలలో భాగమైన వారి పిల్లలు కావడం విశేషం. వారు అ కాల్పుల నుండి తమ బాధ్యులను క్షేమంగా రిట్ చేయగలిగారు.
కాల్పుల నుండి ఒక 10 నిముషాల దూరం వెళ్లాక కాసేపు ఆగిపోయి కమాండర్ బ్యాచ్ కోసం వారంతా నిరీక్షించారు. కానీ, కాల్పులు ఇంకా సాగుతునే ఉన్న శబ్దాలు స్పష్టంగా వినపడుతున్నాయి. అక్కడి నుండి ఇంకొంత దూరం వెళ్లి కొండ ఎక్కడం సురక్షితం అని భావించిన వెటరన్స్ కొండపైకి దారితీశారు.
వెటరన్స్ బ్యాచు కొండ ఎక్కేసరికి కమాండర్ బ్యాచు వచ్చి వారిని కలిసింది. 40 నిముషాలు జరిగిన కాల్పులలో ముగ్గురు పోలీసులు గాయపడి ఉంటారనీ, అది తాము గమనించామని చెపుతూనే తమ వెంట గాయపడి ఉన్న రమేష్‌ను కమాండర్ చూపాడు.
రమేష్ భుజానికి తూటా పడింది. “ఇన్సాస్ తూటా కావడంతో గాయం తీవ్రత తక్కువుంది. దాని క్యాలిబర్ ఎస్.ఎల్. ఆర్. కన్నా తక్కువ అంటూ కమాండర్ తూటాలలోని తేడా చెపుతూ రమేశ్ గాయాన్ని వివరిస్తూ “ఇంకొంత దూరం వెళ్దాం ” అన్నాడు.
కార్పెటు సెక్యూరిటీ విస్తరించాక పోలీసు క్యాంపులు అతి సమీపంలో వెలిశాయి. ఒక్కొక్క క్యాంపు 8-5 కి.మీ దూరంలోనే ఉంటూ అదనపు బలగాలతో అనేక క్యాంపులు వెలిశాయి. ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్, ఎస్ఎ బలగాలు లక్షల సంఖ్యలో తిష్ట వేశాయి.
ప్రత్యేక ఆపరేషన్స్ సందర్భంగా ఎన్ఎస్ఎఫ్ దిగుతుంది. ఒకచోట కాల్పుల ఘటన చోటు చేసుకున్నదంటే దాదాపు 50కి.మీ.కు పైగా పరిధిలో ముమ్మర గాలింపులు చేపడుతున్నారు. ఆ గాలింపుల నుండి ప్రజలు, భౌగోళిక పరిసరాలే రక్షణ కవచంలా గెరిల్లాలను కాపాడడం కమాండర్ దృష్టిలో ఉన్నందునే ఘటనాస్థలం నుండి ఇంకొంత దూరం వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాడు.
జబ్బకు గాయమైన రమేష్‌లో ఎలాంటి ఆందోళన లేదు. అందరితో పాటు ఆయన నడక సాగిస్తున్నాడు. ఆయన కిట్టు, తుపాకి ఇతర కామ్రేడ్స్ పట్టుకున్నారు.
దాహంతో గెరిల్లాల నాలుకలు పిడుచకట్టుక పోతున్నాయి. ఫైరింగ్ పూర్తి చేసుకొని వచ్చిన గెరిల్లాలు నీళ్ల కోసం తన్లాడుతున్నారు. కానీ, ఎవరి దగ్గరా చుక్క నీళ్లులేవు. కాల్పుల మధ్య నీళ్ల డబ్బాలు వదిలివేశారు. రాత్రి కుండపోత వాన కురవడంతో దారిలో బండలపై అక్కడక్కడ గుంతల్లో నీళ్లు నిలిచి పోయాయి. మబ్బు ఇడిసిన ఎండ మహా తీవ్రంగా ఉంటుందనే తెలంగాణ నానుడి గుర్తొచ్చిన ప్రతాప్‌కు గతంలో దాహానికి తమ మూత్రం తామే తాగినట్లు చెప్పితే విన్న అనుభవాలు గుర్తొచ్చాయి.
అంతే, తన ముందు తన గార్డు ఓ గుంత ముందు కూచోని చారెడన్ని నీళ్లతో గొంతు తడి ఆర్పుకోవడాన్ని గమనించాడు. వారించే ప్రయత్నం చేయబోయి విరమించుకున్నాడు. ఆ గుంతలో స్పష్టంగానే క్రిములు, బురదలాంటి మట్టి అగుపడుతున్నాయి. కానీ, ఆ క్షణాన దాహం తీర్చుకోవలన్న ఆరాటం అర్థమైన ప్రతాప్ మౌనంగా నడుస్తున్నాడు. అడవిలో ఆదివాసులు దొరికినచోట నీళ్లు తాగడం రోజూ గమనిస్తున్నందున అ సహజ ప్రక్రియను శుభ్రతా, ఆరోగ్యం పేరుతో వారించడం అసందర్భం అనుకున్నాడు. ఆ స్థితిలో ఎవరున్నా చేసేదదే అనుకున్నాడు.
క్షణ క్షణం పెరుగుతున్న ఎండలో కొండలపై కంపెనీ నడకసాగిస్తోంది. మరో గంట నడిచేసరికి అందరి పరిస్థితి ఒకేలా తయారైంది. అకలి కన్నా దాహం అందరినీ దహించిస్తోంది. పరిస్థితి అర్ధం చేసుకున్న కమాండర్ ఆగాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికి ఫైరింగ్ జరిగిన చోటు ఐదు కిలోమీటర్లుంటుందేమో!
తూర్పుకు చేయి చూపుతూ స్థానిక కామ్రేడ్ ‘ఇంకొంత దూరం వెళితే మంచిదేమో, ఈవైపు నుండి మనం వచ్చిన దారి దగ్గరే అవుతుంది” అన్నాదు.
ఎండాకాలం కావడంతో అడవిలో నీడ కూడా కరువే అయింది. మార్చి నుండే ఇంకా కొన్ని చోట్ల ఇంకా ముందే అకులు రాలుతుంటాయి. మళ్లీ తొలకరి వరకు చెట్లు చిగురించవు. ఎండను భరించాల్సిందే!
ముందు కాల్పులలో గాయపడిన పేషంటుకు వైద్యం చేయాలి. ఆయన గాయాన్ని శుభ్ర పరచాలి. దొంగ వానలకు (అకాల వర్షాలు) ఎండిపోయిన కాలువ పక్కన చిన్న చిన్న చెట్లు చిగురిస్తున్నవి. ఆ నీడనే ఆవేళ మహాభాగ్యంలా ఉంది. కొద్ది దూరంలో ఉన్న మామిడి చెట్టు కింద పేషెంటు సేద తీరుతున్నాడు. స్థానిక కామ్రేడ్ ఆ పరిసరాలపై పట్టు ఉండడంతో చేతులలో డబ్బాలతో నీళ్ల వేటకు నడుం బిగించారు. ఈ గంట తర్వాత డబ్బాలలో నీళ్లతో కామ్రేడ్స్ చేరుకున్నారు. ఈలోగా క్షతగాత్రుడికి ముందు ఒక టీ.టీ. ఇచ్చారు. డ్రెస్సింగ్ కు అవసరమైన తయారీలలో నిమగ్నమైన దాక్టర్ నీళ్లు రావడంతో గాయాన్ని శుభ్రపరిచే పనిలోకి దిగాడు.
కమాండర్ నీళ్లు తెచ్చిన కామ్రేడ్స్ నుండి రిపోర్టు తీసుకుంటున్నాడు. ఈ పరిసరాలలో పోలీసుల అనుపానులేమీ లేవు. మేం వెళ్లిన దారిలో ఎక్కడా అడుగుల జాడ అగుపడలేదు. గ్రామస్థులు మాత్రం అడవిలో కలిశారు. వారు కూడా ఈ మధ్య పోలీసుల కదలికలు ఈ గ్రామాలవైపు లేవన్నారు. కాకపోతే స్థానిక దళం వాళ్లు మనకు కాల్పులు జరిగిన చోటే గత కొద్ది రోజులుగా ఉంటూ, తునికి ఆకు పనులు చూసుకుంటున్నారని జనాలు చెప్పారు అంటూ తమకు దొరికిన సమాచారాన్ని కమాండర్‌కు వివరించారు.
ఈలోగా గాయానికి గెరిల్లా డాక్టర్ చికిత్స చేశాడు. గాయం త్వరగా మానుకోవడానికి కుట్టు వేశాడు. జబ్బలో తూటా లేదని క్లియర్ చేశాడు. ఆంటిబయటిక్ మాత్రలు ఇచ్చాడు. కమాండర్ అక్కడికి చేరుకొని ఏం చేయాలి అన్నట్టు నిలబడడం ప్రతాప్ గమనించాడు.
“వెళ్లడమా’ అంటూ కమాండర్ వైపు కనుబొమ్మలు ఎగురవేస్తూ చూశాడు ప్రతాప్.
“వెళ్లితేనే మంచిది. మిగిలిన నీళ్లతో మనవాళ్లు ఛాయ్ చేస్తున్నారు. కనీసం ఓ గంటన్నర నడిస్తే వంట ఏర్పాట్లు చేసుకునే స్థలానికి చేరుకుంటాం.
అందరి కడుపులో పేగులు అల్లరిచేస్తున్నాయి. కానీ రామేశ్ నడుస్తాడా అన్నదే నా సందేహం” అంటూ కమాండర్ ప్రతాప్ ముందు ప్రశ్న వదిలాడు.
రమేష్ ముసిముసిగా నవ్వుతూ ‘నా జబ్బకే కదా గాయమైంది. నా కాళ్లు ఓ.కే. నేను నడవగలను. ఈ మాత్రం గాయానికే గెరిల్లాలు నడువలేకపోతే ఎలా’ అనడంతో ప్రతాప్‌కు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేకుండాపోయింది.
నీలిమ వాళ్ల సంభాషణను శ్రద్ధగా వింటూ గెరిల్లాల పట్టుదల చూసి చాలా ఇన్స్పైర్ అయింది. ఆ సంసిద్ధతే లేకపోతే నిజంగానే గెరిల్లాల యుద్ధ జీవితంలో కష్టమేననుకుంది మనసులో. వాళ్ల సంభాషణలో కమాండర్ పదే పదే రమేశ్ కాకుండా ఉచ్చారణలో ‘రామేశ్ అనడం, ప్రతాప్ మాత్రం రమేశ్ అనడం ఆమె బాగా గమనించింది. ఛాయ్ తాగుతూ అదే విషయాన్ని ప్రతాప్ ముందుంచింది.
“మొత్తానికి చాలా బాగా గమనించావు నీలిమా! ఆదివాసులు హిందవులు కాదనడానికి ఇంతకన్నా నీకు మరో ఉదాహరణ అవసరం లేదు.
వాళ్లకు రాముడి గురించి తెలియదు. వాళ్ల సంస్కృతిలో రామచంద్రుడు ఇంకా చోటు చేసుకోలేదు. వాళ్లు ప్రకృతి ఉపాసకులు. మనం రామ చిలక అంటామే, వాళ్లు దాన్ని గోండిలో “రామే” అంటారు. అందుకే నేను పుట్టి పెరిగిన నా బ్యాక్ గ్రౌండ్లో రమేశ్ అని నేనంటే, ఆయన పుట్టి పెరిగిన నేపథ్యంలో రామేశ్ అంటూ అనడం సహజమే. బయటి హైందవ ప్రభావంతో, భిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని పట్టించుకోని చదువుల పుణ్యమా అంటూ వాళ్లలో వాళ్లు, మనం కూడా వాళ్లకు పొసగని పేర్లు దళాలలో పెడుతున్నాం. నాది హైందవ సంస్కృతిలో భాగమైన ఉచ్చారణ.” అంటూ టూకీగా చరిత్రను తడిమిన ప్రతాప్ ఛాయ్ గ్లాసు కడిగి తన కిట్టు జబ్బలకు ఎక్కించి చేతికర్ర తీసుకొని, నీళ్ల సీసా, రేడియో మరిచిపోకుండా ఎడమ జబ్బకు వేలాడేసుకొని తలకు టోపీ పెట్టడంతో మిగితా కామ్రేడ్‌కు వెళ్లడమనే విషయం అర్థమై అనుకరించసాగారు.
కామ్రేడ్ రాంజీ గెరిల్లాలకు ఉండాల్సిన సామానుల లిస్టు 1980ల చివర్లో తయారు చేసినపుడు నీళ్ల సీసా, అగ్గిపెట్టె, తాడు, ఓ కత్తి, టార్చీలాంటివి తప్పక ఉండాలని రాశాడు. కమాండోల శిక్షణలో కూడా అలాంటివి బూర్జువా సైనిక నిపుణులు పేర్కొనడం సహజం. అడవిలో తప్పిపోతే తమకు తాము ఆకలి తీర్చుకోవడానికి అవి అవుసరమవుతాయని ఆ లిస్టు ఉనికిలోకి వచ్చింది.
కంపెనీ అనుకున్న విధంగా గంట నడిచి చేరాల్సిన స్థలానికి చేరింది. రోల్ కాల్ కు ఎవరి వరుసలలో వాళ్లు నిలుచున్నారు. కమాండర్ ‘ఈ పూట అక్కడే ఆగుదాం, తెల్లారి మనవాళ్ల కోసం ప్రయత్నం చేద్దాం, వెతకడానికి వెళ్లిన మన గెరిల్లా కామ్రేడ్స్ కూడా రావచ్చు? అంటూ బ్రీఫింగ్ పూర్తి చేశాడు. లైన్ల నుండి విడిపోయిన గెరిల్లాలు తమ ఫార్మేషన్ ప్రకారం కవర్లు చూసుకొని పాల్తీన్ షీట్లు పరచుకున్నారు.
నీళ్లకు వెళ్లాల్సిన వాళ్లు 15 నిముషాల దూరంలోనున్న నీళ్ల వద్దకు బయలుదేరారు. కిచన్ డ్యూటీ వాళ్లు ఆ పనులలోకి వెళ్లారు. పొయిల కర్రలు తెచ్చేవాళ్లు ఏరుకొచ్చి పొయ్యి దగ్గర వేశారు. చీకట్లో మంట వెలుతురు ఎక్కువ దూరం అగుపడని విధంగా కిచన్ వాళ్లు ఏర్పాట్లు చేసుకొని వంటకు సిద్ధమయ్యారు.
“కాలుతున్న గెరిల్లాల కడుపులకు సరిపడా బియ్యం మనవద్ద లేవు అంటూ కమాండర్ వచ్చి ప్రతాపకు రిపోర్టు చేశాడు. అన్నంలోకి కూరకు ఏమి లేదు, పప్పు మూట నిన్న దాడిలో వదిలేశారు, ఉప్పు కూడా నిండుకుంది” అంటూ కొసమెరుపులు వినిపించాడు.
“చింతపండు ఏమైనా ఉంటే పచ్చిపులుసు చేస్తే? అన్న ప్రతాప్ కు ‘అదెక్కడిది” కమాండర్ జవాబు ఇచ్చాడు.
ప్రతాప్ కు ఎటూ పాలుపోవడం లేదు. తను కాకుండా తనతో తనకన్నా పెద్దవాళ్లున్నారు. వాళ్ల గురించి, వాళ్ల మధుమేహం, రక్తపోటులాంటి వ్యాధుల గురించి ఒక రకమైన చింత అయితే, యువ గెరిల్లాల ఆకలి ముఖాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. వాళ్ల ఆకలి తీర్చడం ఎలా? అన్నదే ఆయనకు అంతుపట్టడం లేదు. పోలీసు కాల్పులు జరగకుంటే స్థానికులను సులువుగానే దొరికించుకునేవాళ్లు కానీ, ఇపుడు వాళ్లు కలిసేవరకు పరిచయం లేని కొత్త ప్రాంతంలో అకలి బాధ తీర్చుకునేదెలా! అన్న ఆలోచనలతో సతమతమవుతుండగా సెంట్రీ నుండి కామ్రేడ్స్ వేగంగా వచ్చి ఆయన ముందు నిలబడడంతో ప్రతాప్ ‘ఏం జరిగిందన్నట్టు చూశాడు.
సెంట్రీ ముందు నుండి వేగంగా ఎవరో ఇద్దరు నడుస్తూ, గుసగుసలాడుతూ వెళ్లారు. వాళ్లు ఎవరన్నది అర్ధం కాలేదు. కానీ, వాళ్లు మాట్లాడింది మాత్రం కోయలోనే అని అర్థమైంది! అంటూ రిపోర్టు చేశారు.
“ఎవరయి ఉంటారు? ఏమైనా స్థానికులే అయి ఉందాలి. వాళ్లను గమనిస్తూ చీకట్లో వెనుక ఫాలో అయి ఉంటే క్లియర్ అయ్యేది! అంటూ ప్రతాప్ ‘సరే, వాళ్లు ఎవరైనా మిమ్మల్నైతే గమనించలేదు కదా!” అంటూ “ఉదయం క్లియర్ చేసుకుందాం” అని చెప్పి వాళ్లను పంపించాడు.
రాత్రి పది దాటింది. కప్పులో అన్నం తీసుకొని వచ్చి ప్రతాప్ ఎదురుగా కమిలి నిల్చుంది.
“ఏంటి, కప్పులో అన్నం….?” ప్రతాప్.
“అందరికీ పంచారు. సరిపడా బియ్యం లేవు కదా! తలా కప్పు అన్నం వచ్చింది” కమిలి.
ముందే కమాండర్ రిపోర్టు చేసి ఉన్నందున కప్పులోని అన్నం పళ్లెంలో వేసుకొని, నీళ్లు కలుపుకొని అంబలిలా గటగటా తాగేశాడు. అదే ఆ పూటకు పరమాన్నం అనుకున్నాడు. ‘యువకులకు కప్పెడు అన్నం ఏ మూలకు సరిపోదు” అనుకొని నోరు కడుక్కొని పాల్తీనులో మేను వాల్చాడు.
రేపుదయం ఏం చేయడం? అనే ప్రశ్న ఆయనను నిద్రలోకి జారుకోనీయడం లేదు.
ఉదయం తొమ్మిది గంటలవుతోంది. డేరా చుట్టూ ప్రొటెక్టివ్ పెట్రోలింగ్ కు వెళ్లిన బ్యాచు ఉత్సాహంగా రావడం కమాండర్ గమనించాడు. వాళు దగ్గరికి చేరడంతో “ఏంటి? నవ్వుతూ వస్తున్నారు” అంటూ కమాండర్ ఆత్రంగా ప్రశ్నించాడు.
‘మన వాళ్లు కలిసిండ్రు అన్నా రెండు బ్యాబీలు కలిశాయి. నిన్న జరిగిన ఫైరింగ్ శబ్దాలు విని మనలను వెతుక్కుంటూ వస్తున్నారట ‘ అంటూ పట్టలేని సంతోషంతో చెప్తుండగానే వాళ్లు డేరాలోకి చేరుకున్నారు. అందరు కలుసుకోవడంతో వాతావరణం అంతా ఎంతో తేలికయిపోయీ సంబురాలతో నిండిపోయింది. అకలి మరిచిపోయి ఎక్కడివారు అక్కడే తమ అనుభవాలను కొత్తగా చేరుకున్న గెరిల్లాలతో పంచుకోసాగారు. కమాండర్, ప్రతాప్ కొత్తగా వచ్చిన బ్యాచుల కమాండర్లతో టూకీగా మాట్లాడుకొని పదిహేను నిముషాలలో వచ్చి “సర్దుకోండి అని చెపుతూనే విజిల్లో కూడా తెలిపాడు.
చకచకా గెరిల్లాలందరూ కిట్లు సదరుకున్నారు. అక్కడికి పది నిముషాల దూరంలో ఉన్న స్థానిక కామ్రేడ్స్ డేరాకు చేరుకొన్నారు.
డేరాలో ఉన్నవారికి లాల్‌సలాం చెప్పారు. అకలికన్నా ముందు స్నానం చేయాలని అందరి మనసులూ కోరుకుంటున్నాయి. రెండు రోజులుగా స్నానం లేకపోవడమే కాకుండా ఫైరింగ్ తరువాత ఎండలో నడవడం, కొండలెక్కడంతో ఒళ్లంతా చెమట వాసనలతో గుప్పుమంటున్నాయి. ఇక మహిళలకైతే మరిన్ని సమస్యలు. తెల్లబట్ల సమస్య ఉన్నవాళ్ల సంగతి చెప్పడానికి లేదు. దానితో పొలోమని వెళ్లి స్నానాలు ముగించుకొని వచ్చేసరికి వేడి వేడి అన్నం, పప్పుతో భోజనాలు తయారు కావడంతో గెరిల్లాలందరూ కడుపునిండా తిని ఆపూట నిశ్చింతగా పగటి నిద్రలోకి జారుకున్నారు.
మరుసటి రోజు ఉదయాన్నే రోల్ కాల్లో సాయంత్రం రెండు పెళ్ళిళ్ల ప్రోగ్రాం ఉంటుందని స్థానిక కమాండర్ ప్రకటించాడు. పెళ్లి పెద్దలు, తదితర వివరాలు తరువాత చెప్పుతాం అన్నాడు.
రోల్ కాల్‌కు వెళ్లిన కామ్రేడ్స్ వచ్చి డేరాలో తమ బాధ్యులకు పెళ్లిళ్ల విషయం చెప్పారు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. టిఫిన్ సమయానికి క్యాంపులో నూతన వధూవరుల ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. పెళ్లి చేసుకోబోతున్న రెండు జంటల పేర్లు, వాళ్ల గోత్రాలూ వాళ్ల ఫోటోలు వక్తల పేర్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ గురించి పోస్టర్లలో రాశారు. టిఫిన్ తింటూ గుంపులు గుంపులుగా కామ్రేడ్స్ ఉద్యమంలో పెళ్లిళ్ల గతం, వర్తమానంతో పాటు కాబోయే వధూవరుల గురించి కలబోసుకుంటున్నారు. పోస్టర్లలో ఒక జంటకు చెందిన మహిళ పక్కన గోత్రం పేరు రాయకపోవడం మీద స్థానిక కామేడ్స్ మధ్య ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. మధ్యలో కార్తీక్ వారితో చేరిపోయి భిన్న సంస్కృతుల సంప్రదాయాలను వివరిస్తున్నాడు.
కామ్రేడ్స్, ఆమె తెలుగు అమ్మాయి. తెలుగువాళ్లలో గోత్రాలుంటాయి కానీ ఆదివాసీ గోత్రాలకు వాటికి ఏం సంబంధం లేదు. బయట ఉన్నది కుల సమాజం. మన ఆదివాసీలు కొత్తగా ఎవరు ఎక్కడ ఎప్పుడు కలుసుకున్నా వెంటనే మీరు ఎవరు లేదా ఏంటోళ్లు అని ఒకరినొకరు అడిగినపుడు వెంటనే వారు తమ గోత్రం పేరు చెప్పేస్తారు. దానితో వెంటనే అ నూతన పరిచయస్తుల మధ్య సంబంధాలు ఏ కోవలోకి వస్తాయని లెక్కలు తేల్చుకుంటారు. సోదర సంబంధాలా లేక సోదరేతర సంబంధాలా అనేది తెలుస్తుంది. ప్రపంచమంతా ఇది ఆదివాసులలో ఉంది. అదే ఆదివాసేతరులలో మీరెవరు అంటే వెంటనే వాళ్ల కులం చెప్పుకుంటారు. నికృష్ట కుల వ్యవస్థ నరనరాన జీర్ణించుకపోయిన వారు ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ఆలోచనలలో మునిగిపోతారు. ఇక్కడ మానవ సంబంధాలను, అక్కడ కుల సంబంధాలను పోల్పుకుంటారు. ఇది సంస్కృతుల మధ్య అంతరం. అందుకే మనం కులవిముక్తి కావాలంటాం” అంటూ ఇక తన పని ముగిసిందనుకున్న కార్తీక్ అక్కడి నుండి చేయి కడుక్కోవడానికి వెళ్లిపోయాడు.
మరో గుంపు తాపీగా ఛాయ్ తాగుతూ డాక్టర్ కామ్రేడ్లను మెచ్చుకుంటున్నారు. ‘డాక్టర్ కామ్రేడ్ ఆదివాసీ. ఆయన 7వ తరగతి చదివి పార్టీలోకి వచ్చి డాక్టర్ టైనింగ్ పొందాదు. వేసెక్టమీ ఆపరేషన్లు చేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. బయట సాధారణంగా ఆపరేషన్స్ ఫెయిల్యూర్ రేటు 4 శాతం ఉంటే మన గెరిల్లా కంపెనీ డాక్టర్ చేసిన ఆపరేషన్లలో బహుశా 2 శాతం మించి ఉండవు. ఈ ప్రాంతం ప్రజలకు, గెరిల్లాలకు కలసి వందల ఆపరేషన్లు చేసి ఉంటాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫెయిల్ అయినవి కూడా ఊళ్లల్లో రైతులు ఈయన వద్దకు వస్తారు! అంటూ కంపెనీ కమాండర్ డాక్టర్ ప్రతిభ గురించి వివరిస్తుంటే, మధ్యలో నీలిమ అడ్డుకుంది.
“ఉద్యమంలో ఆపరేషన్లు కంపల్సరా! కామ్రేడ్” అని అడిగింది.
కమాండర్ ముసిగా నవ్వుతూ ‘కాదనుకుంటా” అన్నాడు.
“అంటే ఉద్యమంలో పిల్లలు కనడంపై ఎలాంటి నిషేధం లేదన్నమాట’-నీలిమ
“పెళ్లికి ముందే ఆపరేషన్ ఎందుకు” అంటూ అమాయకంగా అడిగిన నీలిమకు కమాండర్ జవాబు ఇవ్వకుండా, అలాంటివి కార్తీకే బాగా చెపుతాడనుకొంటుంటే ఈనే అటు వైపే రావడం గమనించాడు. ‘కార్తీక్ దా చాయ్ తీసుకొని ఇక్కడికే రండి, నీలిమాకు పెద్ద పెద్ద సందేహాలున్నాయి” అన్నాడు.
ఛాయ్ గ్లాసుతో వస్తున్న కార్తీక్ చదువుకున్న అమ్మాయి కదా!” అన్నాడు. “అదేం లేదు కార్తీక్ గారు, మీరు మీ పని మీదా వెళ్లండి’ అంటూ నీలిమ తన డేరాకు దారితీసింది.
“ఏమో, నాకు ఈ మధ్య చాదస్తం పెరుగుతున్నట్టుంది. ఎవరు ఏది అడిగినా చరిత్రలోకి వెళ్లి వివరించడంతో కుర్రాళ్లు జడుసుకుంటున్నారు” అంటూ కార్తీక్ స్వగతంలో గొణుగుతూ తన కరీంనగర్ లో కాలేజీ రోజుల్లో రాడికల్ విద్యార్థి నాయకుడు నారదాసు పొరపాటున రోడుపై అగుపడితేనే “అమ్మ బాబోయ్” అనుకొని తప్పుకున్న గతాన్ని గుర్తు చేసుకొని నవ్వుకున్నాడు. నీలిమ కూడా నన్నూ అలా అనుకోవడం లేదు కదా! అన్న పుట్టెడు సందేహంతో డేరాకు చేరాడు.
సాయంత్రం నాలుగు కావస్తోంది. క్యాంపులోని వారంతా ఒక్కొక్కరు పెళ్లి స్థలానికి చేరుతున్నారు. వెటరన్ కామ్రేడ్స్ తమ గార్డులతో ముందే చేరుకున్నారు. కాబోయే జంటల కామ్రేడ్స్ కూడా చేరుకున్నారు. వెటరన్స్ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ నవ్వుతూ హాయిగా జోకులేసుకుంటున్నారు.
అడవి పచ్చగా చిగురిస్తోంది. లేలేత చిగుళ్లతో చెట్లు యవ్వనంలోకి అడుగు పెడుతున్నట్టున్నవి. వాటికీ పెళ్లి కళే వస్తున్నట్టు ఉంది. కొద్ది రోజుల క్రితం పడిన వర్షం వల్ల వాతావరణంలో ఒక్కసారి పచ్చతనం, చల్లదనం నిండిపోయింది.
గెరిల్లాల క్యాంపుకు దగ్గర ఉన్న ఊరి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంబరంగా విప్లవకారుల పెళ్లి వేడుక చూడాలని ముస్తాబై వచ్చారు. కమాండర్ ఐదు నిముషాల వ్యవధితో సభను ప్రారంభించాడు.
మొదట గెరిల్లా కళాకారులను ఆహ్వానించాడు. ఆ తదుపరి వక్తలను వేదికను అలంకరించ వలసిందిగా కోరాడు. పెళ్లికి పెద్దగా నేరో దీదీ ఉండాలని విజ్ఞప్తి చేశాడు. చివరకు కాబోయే రెండు జంటలను రావల్సిందిగా కోరగా అక్కడ ఉన్న వాళ్లంతా చప్పట్లు కొట్టి ఆ జంటలను అభినందించారు. కమాండర్ పిలిచిన వెంటనే జంటలు వేదిక పైకి వెళ్లారు. కళాకారులు ఉత్సాహంగా పెళ్లి సంబరాల పాటలు మొదలు పెట్టారు. అయితే, పాట ఎక్కువ దూరం వినపడకుండా చూడాలని మొదటి కమాండర్ చేసిన హెచ్చరికతో కొద్దిమందే కోరస్లో కలిశారు. అలాంటి నిబంధనే లేకుంటే, శ్రోతల కన్నా పాడేవారే దండకారణ్యంలో ఎక్కువ ఉంటుంటారు.
“పెళ్లోేయమ్మా పెళ్లి… గెరిల్లాల పెళ్లి అంటూ కళాకారులు చాలా శ్రావ్యంగా పాడారు. పాటలో పితృస్వామ్యాన్ని చీల్చి చెండాడారు. మహిళలపై కొనసాగుతున్న పురుషాధిపత్యాన్ని వివక్షను ప్రశ్నించారు. ప్రజా సైన్యానికి సాంస్కృతిక వినోద కార్యక్రమాలు లేకపోతే మందబుద్ధులవుతారని (డల్ విట్టెడ్) మావో చేసిన హెచ్చరిక ఆ ఆహ్లాద వాతావరణంలో ప్రతాప్ మనసులో మెదిలింది.
పెళ్లి పెద్దగా నిర్ణయమైన కామ్రేడ్ నేరో లేచి నిలబడింది. తన కళ్లజోడు సర్దుకుంది. ముసిముసి నవ్వులతో బిగించిన పిడికిలెత్తి “పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికీ లాల్‌సలాం’ అంది. పెళ్లి జంటల వివరాలన్నీ అంటే వాళ్లు ఉద్యమంలోకి వచ్చిన నేపధ్యం, ప్రస్తుతం వారి బాధ్యతలు, వారు పార్టీ ముందు ఉంచిన తమ పెళ్లి ప్రతిపాదనలు పారదర్శకంగా సభకుల ముందుంచింది. వారు ఐచ్చికంగానే కుటుంబ నియంత్రణకు సిద్ధపడి పురుష కామ్రేడ్స్ ఆపరేషన్ చేయించుకున్నారని వివరించింది. ఆ తర్వాత కళాకారులను మరో పాట పాడాల్సిందిగా కోరింది.
“ఈసారి ఆ అవకాశం పాత కళాకారుడికే, నేనే పాడుతాను, నాకు అవకాశం ఇవ్వాలి” అంటూ కార్తీక్ ముందుకు వచ్చి తన పెళ్లిలో తాను పాడిన పాట అంటూ, ఆ పాట అమరుడు నల్లా ఆదిరెడ్డి (శ్యాం) ద్వారా తాను విన్నాననే పరిచయ వాక్యాలు చెప్పి పాట మొదలు పెట్టాడు.
“పొదాం కలసి పోరాటానికి వస్తావా నువు నా వెంటా,
ప్రజల కోసమై ప్రాణం ఇద్దాం ఉంటావా,
నువు నా జంటా కళ్లూ కళ్లూ కలుసుకొని చెప్పే ఊసులు ఏముంటాయి
మనసూ మనసూ విప్పుకొని చేసే బాసలు ఏముంటాయి
ఉంటే ప్రాణం, పోతే ప్రాణం నక్సలైట్లకు ప్రజలే ప్రాణం”
ఆ పాట పాడుతున్నంత సేపూ అమరుడు నల్లా ఆదిరెడ్డి గొంతుతో ఆ పాట విన్నవాళ్ల కళ్ల ముందు ఆయనే మెదిలాడు.
చేతిలో చిన్న కాగితపు ముక్కతో నేరో నిల్చొని ఉంది. రెండు జంటలను లేచి నిలబడాలని కోరింది. పెళ్లి ప్రతిజ్ఞ పొజిషన్లో నిలబడాలని వారిని కోరడంతో వారు అటెన్షన్లోకి వెళ్లి తమ ఎడమ భూజంపై తుపాకులు పెట్టుకొని కుడి చేతితో లాల్ సలాం పొజిషన్లోకి వెళ్లారు.
పెళ్లి ప్రతిజ్ఞ చేయించడంలో భాగంగా నేరో చదవడం ప్రారంభించింది. ఆ జంటలు ఆమె చెపుతున్న పదాలన్నీ ఉచ్ఛరించారు. సారాంశంలో “తాము ఉద్యమంలో ఒకరిని మరొకరం ఇష్టపడ్డామనీ, పెళ్లి బంధం వారి వికాసానికి తోడ్పడేలా చూసుకుంటామనీ, అది వారి అభివృద్ధికి ఆటంకం కాకుండా ఉండేలా మసలుకుంటామనీ, విప్లవ సిద్ధాంత అధ్యయనంతో పితృస్వామ్యాన్ని నిర్మూలించి స్త్రీ పురుష సమానత్వ అవగాహనతో మహిళా విముక్తికి పాటుపడుతామనీ’ ప్రతిజ్ఞ చేయడం పూర్తవగానే నేరో నవ వధూవరులను మాట్లాడాల్సిందిగా కోరింది.
మొదట ప్రతిమ లేచి నిలబడి మాట్లాడడానికి సిద్ధమైంది. ‘నేను ఉద్యమంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. నేను ఇక్కడి ఆదివాసీ కామ్రేడు ఇష్టపడ్డాను. కానీ, నా అభిప్రాయాన్ని వెల్లడించడానికి ముందు చాలా తటపటాయించాను. నాకున్న సమాచారం మేరకు బహుశ ఇదే దండకారణ్యంలో ఒక తెలుగు అమ్మాయి, ఒక ఆదివాసీ అబ్బాయిని ఈ రకంగా పెళ్లి చేసుకోవడం. ఇప్పటి వరకు అంతా తెలుగు యువకులు ఆదివాసీ మహిళలను వివాహమాడిన చరిత్రే ఉంది. నా మనసులోని ప్రతిపాదనను పార్టీ ముందు ఉంచడంతో ఇది ఒక బ్రేక్ త్రూ అంటూ నాయకత్వం ప్రోత్సహించింది.
ఇకపోతే పిల్లల విషయంలో పార్టీలో ఎలాంటి ప్రతిబంధకాలు లేవనీ, అది భార్యా భర్తల ఇష్టానికే పార్టీ వదలి వేస్తుందని చెప్పారు. దానితో మేం ఇద్దరం చర్చించుకున్నాం. పిల్లలను కనడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఒక ప్రాకృతిక సహజ ప్రక్రియనేది అందరికీ తెలిసిందే! కాకపోతే ఇంకా అది ఒక సామాజిక బాధ్యత కూడా! కానీ, దాని మూలంగా కనీసం సంవత్సరకాలం మహిళ ఉద్యమ పనులకు దూరమవడం అనివార్యం. నేను ప్రత్యక్షంగా సీదో దీదీ విషయంలో చూశాను. అందుకు నేను సిద్ధంగా లేను. నా సహచరుడు నాతో ఏకీభవించాడు. ప్రజల పిల్లలంతా మన పిల్లలే కదా అని మేం భావించాం. పార్టీలో ట్యూబెక్టమీ కన్నా వెసెక్టమీనే ప్రోత్సహిస్తున్నందునా నా జీవిత సహచరుడు అందుకు వాలంటరీగా సిద్ధపడ్డాడు. మేం పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ, ఉద్యమ సంప్రదాయాలను గౌరవిస్తూ తుదివరకూ నిలిచి అమరుల ఆశయాలను కొనసాగిస్తామని” చెబుతూ ప్రతిమ మరో విడుత అందరికి లాల్‌సలాం చేసి మడ్కాం పక్కన కూచుంది.
ఆ తరువాత నేరో కోరిన విధంగా వరుసగా మిగితా ముగ్గురూ మాట్లాడారు.
నేరో గెరిల్లా కళాకారులతో ప్రతి పెళ్లిలో పాడే ‘పెళ్లి పాట” పాడించింది.
అ పాట పాడుతున్నంత సేపు ప్రతాప్ కు పీబీ షెల్లీ పద్యం.. మనుషులు వస్తుంటారు, పొతుంటారు కానీ నేను మాత్రం శాశ్వతంగా ప్రవహిస్తాననే.. ‘ది బ్రూక్” పద్యం గుర్తొచ్చింది. ఉద్యమంలో ఉండగా ఆ పాట రవీందర్ రాశాడు. కానీ ఆయన ఉద్యమం నుండి మడిమ తిప్పినా పాట మాత్రం ఉద్యమ ఆస్తిగా మిగిలిపోయింది.
“ కామ్రేడ్స్, ఇప్పుడు మన నాయకులు కామ్రేడ్ రుషిదా ఈ సందర్భంగా మాట్లాడుతారని” నేరో చెప్పగా ఆయన లేచి నిలబడ్డాడు. రెండు విప్లవ పార్టీల విలీనం నుండి పార్టీలో ‘దాదా’ అనడం మరుగున పడిపోతూ, బంగాళీ సంప్రదాయమైన ‘“దా’ నడుస్తోంది.
ఒక్కసారి అక్కడి వారందరినీ చూసి రుషి టైం చూసుకున్నాడు. గొంతూ, అద్దాలూ సర్దుకున్నాడు. వాటర్ బాటిల్ అందుబాటులోనే ఉందని గమనించాడు. తనవైపే ఎంతో శ్రద్ధగా చూస్తున్న గెరిల్లాలను ఉద్దేశిస్తూ బుషి కామ్రేడ్స్, ముందుగా నూతన పెళ్లి జంటలకు, పెళ్లి పెద్దకు, ఆసీనులైన సోదర కామేడ్స్కు, తమ ఆట పాటలతో అలరిస్తున్న కళాకారులకు నా రెడ్ శల్యూట్స్” అంటూ పిడికిలెత్తాడు. అందరూ ప్రతి వందన చిహ్నంగా చేతులెత్తారు.
కామ్రేడ్స్, 1984 మార్చ్ 1 నాడు మన దండకారణ్యంలో ఒకేసారి మూడు జంటలకు అప్పటి అంధ్ర రాష్ట్ర పార్టీ కమిటీ కార్యదర్శి కామేడ్ ప్రహ్లాద్ నిర్వహణలో పెళ్లిళ్లు జరిగాయి. 1984 ఫిబ్రవరి 24, 25 తేదీలలో కమలాపురంలో జరుగాల్సిన రైతుకూలీ సంఘం తొలి మహాసభకు వచ్చిన ఆయన, ఆ మహాసభను ప్రభుత్వం విచ్చిన్నం చేశాక రహస్యంగానే ప్రతినిధులను సమావేశపరిచి సభను జయప్రదం చేసుకొని అక్కడి నుండి మేమంతా మరో చోటికి చేరుకొని వివాహ వేడుకలను జరుపుకున్నాం. ఆ తరువాత నుండి ఇప్పటి వరకు గత మూడున్నర దశాబ్దాలలో ఉద్యమంలో వందల పెళ్లిళ్లు జరిగాయి.
ఇపుడు కూడా ఒక వైపు హిందుత్వ శక్తుల సమాధాన్ సైనిక క్యాంపెయిన్‌లో శతృవుతో నిత్యం దాడులను, అమరత్వాలను, క్షతగాత్రులను చూస్తున్నాం. మరోవైపు గతంలో లేని విధంగా చట్టపరంగా ప్రభుత్వాలను నిలదీస్తూ జరుగుతున్న ప్రజా పోరాటాలు చూస్తున్నాం. ఈ రెండింటితో పాటు పిరికిపందలు పారిపోవడాలు, కోవర్టుల విద్రోహాలూ చూస్తున్నాం. మరోవైపు వివాహాలు, పునర్వివాహాలు, నూతన శిశువులకు జన్మ నివ్వడాలు అన్నీ అత్యంత సహజంగానే మన నాలుగు పదుల ఉద్యమంలో భాగంగా సాగిపోతున్నాయి. మన పార్టీలో జరిగిన మొదటి పెళ్లిళ్లకు ఇక్కడిలాగే హాజరైన గ్రామస్తులు వధూవరులను అభినందిస్తూ ఆ సభలో మాట్లాడుతూ మంచి సందేశం విన్పించారు. వారిలో 60 సంవత్సరాల రైతు కొడపే లాలయ్య మాట్లాడుతూ “మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు, ఎవరు పంపారో తెలియదు. నాలుగేళ్లుగా మాతో ఉంటున్నారు. మీతో వచ్చినవాళ్లలో మాకోసం ప్రాణమిచ్చినోళ్లు కూడా ఉన్నారు. ఇపుడు మీరు ఒక కొత్త రివాజును మొదలు పెట్టిండ్రు. ఇప్పటివరకూ మా ఆదివాసులను బయటివారు “మామా” అనే అంటుంటారు. అంటే మా ఆడపిల్లలతో సంబంధాల పెంపర్లాట అది. వారెవరైనా చాటు మాటు సంబంధాలే తప్ప ఈ రకంగా పెళ్లిళు చేసుకోవడం నా జీవితంలో నేను చూడలేదు. మీరు మాత్రం మా ఆదివాసీ అమ్మయిలను పెళ్లి చేసుకొంటున్నారు. మేం మిమ్ములను కోరేది ఒక్కటే, దొంగ సర్కార్ మీ గురించి ఏమేం పుట్టిస్తున్నదో అందరం వింటున్నదే! మీకు మీ దేశంల పెళ్లిళ్లు కాకపోవడంతో అడవులకు వచ్చారని అది ప్రచారం చేస్తోంది. ఆ మాటలు పూర్తిగా అబద్దమనీ మీరు రుజువు చేయాలి. మా ఆడపిల్లలను బుట్టలేసుకొని మాకు ద్రోహం చేసి, మమ్మల్ని తిరిగి మా పాత బతుకుల్లకు దొబ్బకుండా మాతోనే ఉండాలనే కోరుకుంటున్నాం. మీతో మేం కలిసినందుకు ఇకపై మీరు లేకుండా మేం బతుకలేం. మేం సర్భార్ నజర్ల ఇపుడు నక్సలైట్లమే! మీరు తుదివరకూ మాతోనే ఉండాలని పదే పదే కోరుతున్నా అని లాలయ్య చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నాడు అంటూ రుషి గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
అదే సందర్భంగా ఆ పెళ్లిలో కామేడ్ ప్రహ్లాద్ చేసిన హెచ్చరికను కూడా రుషి అందరి ముందు ఉంచాడు. “బయటి సమాజంలో పంతులు భార్య పంతులమ్మ అవుతుంది, పట్వారీ భార్య పట్వారమ్మ అవుతుంది. భర్తల సదా భార్యలకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా గ్రామాలలో పటేల్ భార్య పటేల్ బాయి అవుతుంది. కానీ, ఇపుడు ఇక్కడ వివాహం చేసుకుంటున్న ముగ్గురు మగ కామ్రేడ్స్ మన కమాండర్లే, కానీ వారి సహచరిలు కమాండరమ్మలు కాకూడదు. ఆ ఎరుకతో పార్టీ కమాందర్లు వ్యవహరించాలి అన్నాడు. ఆ కామ్రేడ్ చేసిన హెచ్చరికనే మనం పాటిస్తున్నాం అంటూ రుషి తనకెంతో ప్రియమైన ఆ అమర సహచరుడ్ని గుర్తు చేసుకున్నాడు.
‘అప్పటితో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఉద్యమంలో జీవిత సహచరులు ఒకే చోట ఉంటున్నప్పటికీ శారీరక సంబంధాలకన్నా మానసిక అనుబంధాలతోనే మమేకమై జీవించాల్సి వస్తోంది. అడుగడుగునా శతృవు దాడులే మనకు అనేక ఆటంకాలను కల్పిస్తున్నాయి. వాటి మధ్యే వైవాహిక జీవితాన్ని గడుపక తప్పడం లేదు. విప్లవం కోసం అన్నిటినీ భరించాలి కామ్రేడ్స్” అని చెప్పి ముగించాడు రుషి
నూతన జంటలు లేచి నిలబడి పెళ్లికి వచ్చిన వారందరికీ బిస్కట్లు ఇచ్చారు. ఆ పక్కనే గంజులో ఉన్న పాయసం కూడా దొప్పలలో ఇవ్వడంతో గెరిల్లాలు ఎంతో ఇష్టంగా దాన్ని ఎంజాయి చేస్తున్నారు. గెరిల్లాలంతా పెళ్లి నృత్యాలకు అనుమతి కోసం ఎదురు చేస్తున్నారు.
నేరో సభ ముగిసినట్టు చెప్పి గంట సేపు వివాహ నృత్యాలకు కమాండర్ అనుమతి లభించింది” అని ప్రకటించింది.
గ్రామస్థులూ, గెరిల్లాలూ నూతన జంటలూ పొలోమంటూ నృత్యాలకు దిగారు. షీర్ ఇటూ అటూ డబ్బా కోసం పరుగెడుతున్నాడు. ఆయనకు డోలు వాయించడం మహా ఇష్టం. నృత్యం చేసేవారు కూడా ఆయనను బాగా ఇష్టపడుతారు. డోలుకు డాకాకు (స్టెప్స్) మంచి సమన్వయం కుదురుతుందని ఆయన వాద్యాన్ని అందరూ బాగా నచ్చుతారు. షదీరు వాద్యానికి తగినట్టు డాకాలు కలుపుతూ వారంతా ఎంతో సంతోషంగా నృత్యాలు చేస్తున్నారు.
లాంగ్ విజిల్ వినపడడంతో గెరిల్లాలు, గ్రామస్థులు నిట్టూర్పులు విడుస్తూ నృత్యాలు ఆపి వాగు వైపు దారి తీశారు. కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనాలకు సిద్ధమయ్యారు. వెటరన్స్ కూడా కిచన్ వద్దకే చేరుకున్నారు. పెళ్లి వార్త తెలియగానే గ్రామసభలో చర్చించి ఊరివాళ్లు రెండు మేకలు, రెండు కోళ్లు ఇవ్వడంతో నాన్ విజ్ విందుతో అందరూ హాయిగా భోజనాలు ముగించారు.
దూరంగా ఏదో ఊర్లో డోళ్లు కొడుతున్నారు. ప్రతాప్ ఆలకించాడు. ఆలకించాడు. ఎండాకాలం ముగింపులో పెళ్లి డోళ్లు వినవస్తున్నాయి ఏంటి? అనుకుంటూ ప్రతాప్ గ్రామస్తులతో కూడి గెరిల్లాలు, పార్టీ నాయకులు అంతా కలిసి చాలా సంతోషంగా విందారగించడం చూస్తూ నిన్నటి రోజు కాల్పులు, గాయాలు, గుక్కెడు నీళ్ల కోసం తన్లాట, చాలీ చాలని కూర లేని తిండి, ఈరోజు విందు ఎంత గమ్మత్తు! ఒకవైపు సమరం మరోవైపు సంబరం! అనుకుంటుండగా కార్తీక్ చేరి ‘ఈరోజు కార్యక్రమం ముగిసింది కామ్రేడ్, గుడ్ నైట్ ఉదయం కలుద్దాం అంటూ రుషితో కలిసి తన డేరావైపు దారి తీశాడు. ఊరివైపు ఊరివాళ్లు, డేరాలవైపు గెరిల్లాలు కదిలారు.