మిత్రుడు ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసాలను గతంలో వేర్వేరుగా వీక్షణం పత్రికలో చదివినప్పటికీ, ఇటీవల వాటిని ‘సమాజ చలనపు సవ్వడి’ అనే పుస్తకం రూపంలో మళ్లీ ఒక్క చోట చదివితే ఏర్పడే అవగాహన మరింత శాస్త్రీయం,సమగ్రమూ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, సామాజిక పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి,వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు రాజకీయార్థిక దృక్పథానికి మించిన ప్రత్యామ్నాయ దృక్పథం ఏదీ లేదని ఈ పుస్తకం రుజువు చేస్తుంది.
సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే విషయాలకు సంబంధించి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఈనాటికీ వ్యక్తమవుతున్న కాలంలో ‘సమాజ చలనపు సవ్వడి’ అనే ఈ పుస్తకం పాఠకులకు స్పష్టమైన రాజకీయార్థిక అవగాహనను అందిస్తుంది.
సామాజిక మార్పు అనేది ప్రకృతిలో జరిగే మార్పు కంటే చాలా భిన్నమైనది. అది ప్రకృతిలో పూవు పూచి, కాయ కాచి, పండై రాలిపోయినట్లుగా నిర్దిష్ట కాలపరిమితిలో జరిగే పరిణామం కాదు. మనిషి, సమాజం రెండూ నిత్య చలనశీల స్వభావం గలవి గనుక సామాజిక మార్పు క్రమం సరళరేఖ వలె కొనసాగదు. అనేకానేక గొలుసుకట్టు పరిమాణాత్మక మార్పులు కిందుమీదుగా, గజిబిజి(criss-cross)గా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సామాజిక మార్పు క్రమంలో ప్రతిధోరణుల(counter-tendencies) పాత్ర కూడా ఉంటుందని మార్క్స్ అంటాడు. సమాజంలో జరిగే పరిమాణాత్మక మార్పులు వాటంతటవే క్రమానుగతంగా గుణాత్మక మార్పులుగా పర్యవసించవు. అందుకే చరిత్రలో మానవ కర్తృత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ మానవ కర్తృత్వంలో కేవలం ఆచరణకే కాదు దృక్పథానికి కూడా కీలకమైన పాత్ర ఉంటుంది. దృక్పథం ఏ మేరకు శాస్త్రీయంగా ఉంటే, తత్సంబంధిత ఆచరణ ఆ మేరకు గుణాత్మకమైన మార్పుకు దారి తీస్తుంది.
ఈ నేపథ్యంలో చూసినప్పుడు సమాజపు మౌలిక స్వభావం ఏమిటి అనే విషయం పట్ల మన అవగాహన అత్యంత సరైనదిగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. భారత సమాజం అర్ధ వలస, అర్థ భూస్వామ్య సమాజం అనే నిర్ధారణ మొట్టమొదటిసారిగా 1948-50 ల లోనే జరిగినప్పటికీ, ఈనాటికీ ఆ నిర్ధారణ విషయంలో భిన్నమైన వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాటి అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ మొదలుకొని నేటి కొన్ని మార్క్సిస్టు-లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీల దాకా భారత సమాజం పెట్టుబడిదారీ సమాజంగా మారుతున్నదని లేదా మారిందని, అర్ధ వలస, అర్థ భూస్వామ్య వాదనకు ఇక కాలం చెల్లిందని వాదనలు చేస్తున్నాయి. కొందరైతే సామ్రాజ్యవాదంతో ప్రమేయం లే(పోరాడ)కుండా పెట్టుబడిని ప్రజాస్వామీకీకరించే పోరాటాలు చేపడితే కుల నిర్మూలన జరిగి, ప్రగతి సాధ్యమవుతుందని అసాధ్యమైన వాదనలను చేస్తున్నారు.
మరోవైపు నక్సల్బరీ పంథా నాయకుడు చారు మజుందార్ మొదలుకొని నేటి సిపిఐ మావోయిస్టు పార్టీ దాకా వివిధ విప్లవ కమ్యూనిస్టు పోరాటాల అనుభవాల తోనూ, పలు నిర్దిష్ట అధ్యయనాల ద్వారా ఎప్పటికప్పుడు భారత సమాజాన్ని అర్ధ వలస, అర్థ భూస్వామ్య సమాజమని అనేక సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. ఈ పుస్తక రచయిత వేణుగోపాల్ కూడా ఇందులోని ‘చరిత్ర గమనం’, ‘మారిన రూపాలు- మారని దోపిడీ’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘గ్రామీణ జీవన దృశ్యం’ లాంటి వ్యాసాల ద్వారానే కాకుండా, ‘చలనంలో విషయం-చలనంలో అధ్యయనం’, ‘సమాజ స్వభావం, పరివర్తన-పోరాట వ్యూహాలు’ అనే చివరి రెండు ముఖ్యమైన వ్యాసాల ద్వారా పైన పేర్కొన్న భిన్న వాదనలకు ప్రతివాదనలు చేసి, సామాజిక మార్పుల్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు రాజకీయార్థశాస్త్ర, సైద్ధాంతిక అవగాహనను అందించాడు.
ఈ అవగాహన ప్రకారం చారిత్రక భౌతిక వాదం యాంత్రికమైనది కాదు. అధ్యయనం, ఆచరణ(పోరాటం) అనేవి వేర్వేరు అంశాలు కావు. మార్క్స్, ఎంగెల్స్ లు చెప్పినట్టుగా సమాజ చలనం భౌతిక నియమాల ఆధారంగా జరుగుతుందనేది నిజమే అయినప్పటికీ, ఆ సమాజ చలనం సహజమైన, స్వయంచాలిత పరిణామంగా ఉండదు. ఆ చలనాన్ని ప్రగతి దిశగా నడిపించడానికి స్వీయ మానసిక (వర్గ)పోరాట శక్తులు చైతన్యయుతంగా,శాస్త్రీయంగా వర్గ పోరాటాలను నిర్వహించకపోతే, సామాజిక చలన క్రమంలో అనేక ప్రతిధోరణులు తలెత్తుతాయి. వాటిని నివారించడానికి సమాజ స్వభావం పట్ల ఎప్పటికప్పుడు సరైన, శాస్త్రీయమైన రాజకీయార్థిక దృక్పథాన్ని ఏర్పరచుకొని, సకల ప్రజా (వర్గ)పోరాటాలను సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయమైన రీతిలో దీర్ఘకాలిక వర్గ పోరాటాలను కార్మికవర్గ నాయకత్వంలో నిర్వహించాలి.
ఈ పుస్తకం సమాజ స్వభావం గురించి సరైన మార్క్సస్టు సైద్ధాంతిక అవగాహననే కాకుండా, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి రేటు, బడ్జెట్ కేటాయింపులు, వస్తు, సేవల పన్ను, గణాంకాల మాయ వంటి సులభంగా కొరుకుడుపడని అనేక ఆర్థిక విషయాల గురించి సాధారణ పాఠకులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో సరైన రాజకీయార్థిక విశ్లేషణను అందిస్తుంది. కనుక ‘సమాజ చలనపు సవ్వడి’ అనే కవితాత్మక శీర్శిక కల్గిన ఈ పుస్తకం అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం.