నాకంటే 
ఎంతో ముందు
నువ్వెందుకెళ్ళిపోయావ్ 
ఈ భూమ్మీంచి..

బాధ్యతగా 
బహు మురిపెంగా 
నువ్వల్లుకున్న 
సామ్యవాద సిద్ధాంతాల 
ఏ ఏ సమీకరణల 
నిర్ధారణ కోసం 
నిన్ను నువ్వే మరిచిపోయే 
ఏకాంత అగాధాల్లో 
తలమునకలై ఉన్నావో అక్కడ..

నా పురా స్మృతుల 
ఎన్నటికీ అలసిపోని 
జ్ఞాపకాల కడలి 
అలల హోరులో
ఎప్పటికీ సజీవంగా
చెలిమి కాంతులీనుతూనే 
వెలుగై ఉంటావు నా సురా..

నాదేముందిలే..
ఎముకలనంటే 
చర్మపు గూడవడానికి 
ఈ దేహం పడే 
ఉబలాటదేముందిలే గాని..

చుట్టూతా 
చిక్కనవుతున్న చీకటి 
అయినా 
కొలిమిలో నిప్పులు 
ఇంకా మండుతూనే ఉన్నాయి..

పరుగెడతాయనుకున్న
పాదాలు పడావైపోతేనేం 
నిటారుగా నిలబడాల్సినవి
నీరుగారిపోతేనేం..

ఎడతెరిపి లేని 
నిప్పులవాన
ఊపా ధోకాలై
ఎంతగా కమ్మేసినా..

సాగుతూనే ఉన్నాను.. 
సలసలా 
మసలుతూనే ఉన్నాను..
 
అననీ..
ఒంటరి అననీ.. 
ఉడిగిపోయిన 
వృధ్ధాప్యం అననీ..
అంతమైన 
అలజడి అననీ..
వాడేమైనా అననీ...

పచ్చని బతుకుల 
అడవి అందాలను 
చెర బట్టిన 
సకల మూకల 
వెన్నుల్లో
వణుకు పుట్టించే 
తూటాల మాలను..

సమర గీతాన్ని 
సమూహాన్ని నేను!!

Leave a Reply