(పీఆర్సీ సాధ‌న‌కు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవ‌ల గ‌ట్టి పోరాట‌మే చేశారు. కానీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల పేరుతో నాయ‌క‌త్వం వంచించింద‌నే అభిప్రాయం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇంత‌కూ చ‌ర్చ‌ల వ్య‌వ‌హారం ఏమిటి? ఉద్యోగ‌, ఉపాధ్యాయ ఉద్య‌మాల స్థితిగతులు ఏమిటి? అనే కోణంలో ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు ర‌మ‌ణ‌య్య ఈ ఇంట‌ర్వ్యూలో వివ‌రిస్తున్నారు..- వ‌సంత‌మేఘం టీం)


1. పి.ఆర్‌.సి. సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ ప్రభుత్వంతో చేసిన చర్చల లోగుట్టు ఏమిటి?


“లోగుట్టు అంటూ ప్రత్యేకంగా అనకోవడానికి లేదు. అంతా బహిరంగ రహస్యమే. దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు, పరిపాలనా విధానాలకనుగుణంగా వీరు మౌల్డ్‌ కావడము అందుకనుగుణంగా పాలకవర్గాలకు సహకరించినందుకు అంతిమంగా వారు పొందే ప్రయోజనాలకు ఎక్కడా భంగం కలగకుండా వారు నష్టపోకుండా నిస్సిగ్గుగా వ్యవహరించడమే వారి లోగుట్టు.

సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో మొదలైన నూతన ఆర్థిక విధానాల వలన మెరుగైన వేతనాలు సౌలభ్యాలు సౌకర్యాలు పొందిన పరిపాలనా యంత్రాంగం అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు దిగువ ఎగువ మధ్యతరగతి స్థాయి నుంచి ‘నియోరిచ్‌ వర్గంగా తయారయ్యారు. పరిపాలనపరంగా ఫ్యూడల్‌ బ్యూరోక్రటిక్స్‌గా తయారయ్యారు. సంస్కరణల ప్రారంభంలో వారి సహకారం అవసరం కాబట్టి వారి ఆర్థిక డిమాండ్లు సులభంగానే ప్రభుత్వాలు పరిష్కరించాయి. తరువాతి దశలో ఆర్థిక సంస్థరణలలో ఉద్యోగులే టార్గెట్‌ అయ్యారు. ఇంతకాలం ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో మెరుగుగా వున్న ఈ వర్గం తదుపరి మానవ వనరుల మీద చేసి వ్యయాన్ని నియంత్రించడం అదుపు చేయడం మొదలైన తర్వాత క్షేత్రస్థాయిలో ఉద్యోగ వర్గాలలో అలజడి అభద్రత మొదలైంది. కాని నాయకత్వాన్ని పాలకుల ప్రలో(లా)భాలలో నుంచి తమకు కలిగే ప్రయోజనాలను వదులుకోలేక తమనే నమ్ముకున్న ఉద్యోగులను మోసం చేయక తప్పలేదు. అయితే ప్రభుత్వంతో చర్చలలో పాల్గొన్న స్టీరింగ్‌ కమిటీతో చర్చలలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు చర్చలలో నోరు మెదపలేక ప్రభుత్వాన్ని నిలదీయలేక దానివల్ల వచ్చిన అప్రతిష్టను కొంచెమైనా తగ్గించుకోడానికి “డిఫర్‌” అవుతున్నామని మరలా ఉద్యమం చేస్తామని చెప్పడం వారి వారి రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోటానికే తప్ప మరొకటి కాదు.

2. చర్చలకు వెళ్ళేముందు సభ్య సంస్థలు జె.ఏ.సి.లు స్పష్టమైన విధి, విధానాలను స్టీరింగ్‌ కమిటీకి నిర్దేశించలేదా?

శ్రీ అశుతోష్‌ మిశ్ర గారి నివేదిక ఉద్యోగ సంఘాలకు అందజేయడం, పి.ఆర్‌.సి. అమలు కోసం జారీ చేసిన జి.ఓ.ఎమ్‌.ఎస్‌.నెం. 1 రద్దు చేయడం, జనవరి 22 మాసానికి పాత పి.ఆర్‌.సి.2015 మేరకు వేతనాలు చెల్లించాలి. ఈ మూడు అంశాలు అంగీకరిస్తేనే చర్చలకు హాజరవ్వాలనేది స్టీరింగ్‌ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం. ఈ నిర్ణయాలకు నాయకత్వం ఎక్కువ రోజులు కట్టుబడి ఉండలేకపోయింది.

3. చారిత్రక విజయవాడ ఆందోళన తర్వాత స్టీరింగ్‌ కమిటీకి ఉద్యమ విశ్వాసం కలిగి వుండాలికదా? దేనికి ఇలా జరిగింది?

సుదీర్ఘకాలంగా ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం క్రియాశీలకంగా సీరియస్‌ ఉద్యమాలకు దూరమైంది. మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ, సరళీకరణ నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత, ఆ విధానాల అమలుకోసం (పాలకవర్గాలకి) ప్రభుత్వాలకి పరిపాలనలో కీలకభూమిక పోషించే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సహకారం చాలా ముఖ్యం. అందుకోసం మొదటగా వారిని ప్రజల నుంచి వేరుచేయడం చాలా అవసరం. ప్రజలను పేదరికంలో ఉంచుతూనే ఉద్యోగస్వామ్యం యొక్క వేతనాలు పెంచటం ద్వారా వారి ఆర్థిక స్థోమతను ‘పెంచడమేగాక, పాలకుల అవినీతిలో వారిని భాగస్వాములని చేయడం జరిగింది. ఆర్థికంగా సమాజంలో ఒక నియోరిచ్‌ వర్గాన్ని తయారుచేసింది. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించే నాయకత్వానికి పదవీ విరమణానంతరం పరిపాలనాపరమైన రాజకీయ పదవులు ఇవ్వడం, ఎమ్‌.ఎల్‌.సి., ఎమ్‌.ఎల్‌.ఏ., కార్పోరేషన్‌ పదవులు ఇవ్వడం వారి వెయిటేజీని బట్టి మంత్రివర్గంలో చోటు కల్పించడం వరకు అవకాశం ఇవ్వడం ద్వారా నాయకత్వాలని లోబరచుకున్నారు. ప్రలోభాలకి లోనయ్యే నాయకత్వాలు తమ ఉద్యోగవర్గాలకి జరిగే అన్యాయాన్ని గుర్తించలేని విధంగా గుడ్డివారైపోయారు. అలాంటి ట్రేడ్‌ యూనియన్‌లు ప్రజల గురించి వారి సమస్యల గురించి పాలకవర్గాల పరిపాలనా విధానాల ప్రభావంతో ప్రజలకు జరుగుతున్న నష్టం గాని వివిధ ప్రభుత్వాల అభివృద్ధి పేరుతో జరుగుతున్న నష్టం గాని, వివిధ ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలు, విధానాలలో డొల్లతనం గురించి ప్రజలను జాగృతం చేసే స్థితిని కోల్పోయారు. ఇదే పరిస్థితి వారు ప్రాతినిద్యం వహించే ఉద్యోగస్వామ్యానికి వర్తిస్తుంది. ప్రభుత్వం అలా సక్సెస్‌ అయింది కాబట్టి నియామకాలలో కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ విధానం, రెగ్యులర్‌ ఉద్యోగులకు సి.పి.ఎస్‌. అమలు లాంటి సంస్కరణలు అమలు చేయగలిగింది. ఆ క్రమంలోనే ప్రపంచబ్యాంకు షరతులలో భాగంగా మానవవనరుల మీద చేసే వ్యయం తగ్గించటం నియంత్రించటం అనే షరతు అమలు చేయడంలో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం కమీషన్‌ నివేదికను దాచిపెట్టి షరతుల మేరకు తయారు చేసిన సవరించిన వేతన సవరణ నివేదికను కార్యదర్భుల కమిటీ పేరుతో తెరమీదకు తెచ్చింది.

చర్చల పేరుతో వివిధ జె.ఏ.సి.ల సంఘాల నాయకత్వాలను పిలిచింది “కన్విన్స్‌ చేయించి ఫిట్మెంట్‌ 23% నికి ఒప్పించ గలిగింది. ఫిట్మెంట్‌ మీద ప్రభుత్వ ప్రకటనకన్నా ట్రేడ్‌ యూనియన్‌ నాయకత్వాల క్రియాశూన్యతను జీర్ణించుకోలేని రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు ఒకరకంగా తిరుగుబాటు చేశారని చెప్పవచ్చు. ఈ సందర్భంలోనే మెజార్టీ ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే ఫ్యాష్ట్రో ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చింది. ఉద్యోగ స్వామం నుంచి ఈ కార్యాచరణకు అందరూ స్పందించారు. ఫ్యాష్టోతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం మరింత బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని ప్రతి ట్రేడ్‌ యూనియన్‌ పి.ఆర్‌.సి. సాధన సమతిలో భాగమై ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 3 నాటి ఛలో విజయవాడకు నిరంతరం పెరుగుతున్న మద్దతు చూసి ప్రభుత్వం భయపడిన మాట వాస్తవమే అయినా ఈ ఉద్యమం సమ్మెదాకా పోతే పరిపాలనాపరమైన సమస్యలకన్నా ఉత్పన్నమయ్యే రాజకీయపరమైన సమస్యలు ఆలోచించి ఒకవైపు ఛలో విజయవాడను భగ్నం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే తమ విశ్వసనీయ ట్రేడ్‌ యూనియన్‌ నాయకత్వం ఇలా ఉద్యోగులను రోడ్జెక్కించడం నచ్చని ప్రభుత్వం వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది. సక్సెస్‌ అయింది. చర్చలలో తమ కనుకూలమైన పరిషారానికి ఒప్పించింది.

జి.ఓ.ఎమ్‌.ఎస్‌.నెం. 1 రద్దు, జనవరికి పాతజీతాలు ఇవ్వడం, అశుతోష్‌ మిశ్రా నివేదికను ఇవ్వడం ఈ మూడు డిమాండ్లు అంగీకరిస్తేనే చర్చలకు వస్తామన్న నాయకత్వం ఏ ఒక్క డిమాండ్‌ ఒప్పుకోకపోయినా బేషరతుగా చర్చలకు పోవడం అంటే ‘తెరవెనుకి ఏదో జరిగింది అనేది స్పష్టమవుతుంది. అయితే చర్చల అనంతరం బయటకొచ్చి మేము డిఫర్‌ అవుతున్నామన్న మూడు ఉపాధ్యాయ సంఘాల ప్రకటనలో కూడా ఔచిత్యం లేదు. జి.ఓ.ఎమ్‌.ఎస్‌.నెం. 1 రద్దు, అశుతోష్‌ మిశ్ర నివేదిక సంఘాలకు ఇవ్వడం జనవరికి పాత జీతాలు ఇవ్వడం వాటిలో ఏ ఒక్క షరతు అంగీకరించకుండా స్టీరింగ్‌ కమిటీతో చర్చలకు వెళ్ళడం ఉపాధ్యాయ సంఘాల తప్పు. ఫిట్మెంట్‌ మీద ఇక “చర్చలేదు” అన్నప్పుడయినా చర్చలు బహిష్కరించి బయటకు వచ్చి మేము డిఫర్‌ అవుతున్నామని చెప్పినా ఉపాధ్యాయలోకం నమ్మేది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఫిట్మెంట్‌ కోసం మరలా ఉద్యమం చేస్తాం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. లక్షలాది మంది నా వెనుక నిలబడి నాకు స్థైర్యాన్ని ధైర్యాన్ని కల్గిస్తే వారిని నమ్మించి మోసం చేసి ఈ రోజు మరలా నల్ల రిబ్బన్లతో ఉద్యమం మొదలు పెడతాం అంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి లేదు. వాస్తవిక పరిస్థితిని అవగతం చేసుకున్న డి.టి.ఎఫ్‌. మరికొన్ని సంఘాలు మలిదశ ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని, కాకపోతే ఈ నమ్మకద్రోహాన్ని విస్పతంగా ఉపాధ్యాయలోకంకి వివరించి పడిలేచిన కెరటంగా మరలా కొత్తరూపంలో ఉద్యమానికి సన్నిదమవుతుంది. కాని సంస్కరణల అనుకూల దళారీ నాయకత్వం వెంటనడవదు.

4. మిగతా ఉద్యోగ సంఘాలతో పోల్చితే ఉపాధ్యాయ సంఘాలకే ఉద్యమ అనుభవాలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఈ సంఘాలకే కొంత ధృక్పథబలం కూడా ఉందని సమాజం అనుకుంటుంది. పి.ఆర్‌.సి. సాధన సమితి స్టీరింగ్‌ కమిటీలో కొందరు నాయకులైనా ఇలా చేస్తారని ముందే ఊహించలేదా?

వివిధ ఉద్యోగ కార్మిక సంఘాలతో పోలిస్తే ఉపాధ్యాయ సంఘాలకు ఉద్యమబలం, అనుభవంతో బాటు బలమైన దృక్పథం ఉన్నదనడంలో సందేహం లేదు. కాని అది (వామపక్ష అభ్యుదయ భావజాలం కలిగి పార్లమెంటరీ బాటలో నడిచే సంఘాలు) ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానాల అమలైన తర్వాత వారి వారి ధృక్పథం మసకబారింది. వారి ఉద్యమ ధృక్పధం క్రమం కూడా పాలకుల కనుసన్నలకు అనుగుణంగా అంటే మౌలికంగా సరళీకృత ఆర్థిక విధానాల మౌలిక భావనలకు భంగం వాటిల్లకుండా ఉద్యమ క్రమం నడచింది. జరుగుతున్నపరిణామం నేపథ్యం మాకున్న సందేహాలు మాకున్నాయి. ప్రభుత్వం మొదట 23% ఫిట్మెంట్‌ ప్రకటన తర్వాత వచ్చిన విమర్శల నేపధ్యంలో నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అనివార్యంగా డిమాండ్ల సాధన కొరకు ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. డిమాండ్ల సాధనకు ఉద్యమ ఆవశ్యకతను గుర్తించిన వివిధ శాఖల ఉద్యోగుల వారి వారి నాయకత్వాల మీద తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగుల వివిధ ఉద్యోగసంఘాల జె.ఏ.సి.లు ఉపాధ్యాయ ఉద్యమానికి మద్దతివ్వడమే గాక ఉద్యమాన్ని విసృతం చేయడానికి ఒక విసృత వేదిక ఏర్పాటుకు ఉపాధ్యాయ ఉద్యమం సహకరించింది. కాని పి.ఆర్‌.సి. సాధన సమితి నాయకత్వం తన వెనుక ఉన్న ఉద్యమ బలం విస్మరించింది. చర్చలలో ప్రభుత్వ వాదనకు బలమైన వాదన లేక ప్రతివాదన వినిపించలేక తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేకుండా సాధన సమితికి నాయకత్వం వహించిన వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమిష్టిగా బాధ్యత వహించాలి.

5. జరిగిందంతా సరే ఇప్పుడు ఉద్యమాన్ని ముందకు తీసుకెళ్ళడానికి ఉన్న అవకాశాలేమిటి?

వాస్తవానికి ఉద్యమం ముందుకు తీసుకుపోవడానికి అనుగుణమైన క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. లక్షలాదిమందిని కదలించిన ఉద్యమం అంతిమంగా చర్చలలో నాయకత్వం యొక్క వైఫల్యాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఒకవైపు, నిరాశ, నిస్సహాయత ఒకవైపు ఉన్నాయి. జరిగిన వైఫల్యాన్ని ఎదుర్కోడానికి తిరిగి ఉద్యమంలో నిలబటానికి అంతటా అందరిలో అలుముకున్న ఈ నిరాశ నిస్పృహలే కారణ. కెరటం విరిగిపడింది మరలా అంత పెద్ద ఎత్తున కెరటంలా ఉద్యమం ఎగసిపడాలంటే అందుకు తగిన సంసిద్ధతను సమకూర్చుకునే ప్రయత్నాన్ని మరలా ఉపాధ్యాయ ఉద్యమమే ఆ బాధ్యత తీసుకుంటుంది.

6. ఉపాధ్యాయ సంస్థలతో కలిసి పనిచేయడానికి మిగతా ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయా?

ప్రస్తుతానికి సిద్ధంగా లేవు. కాని దీన్ని మరలా ఉపాధ్యాయ ఉద్యమమే అందుకు సిద్ధపడుతుంది.

7. పి.ఆర్‌.సి. స్టీరింగ్‌ కమిటీతో విభేదించి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించగానే ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బహుశా నిర్బంధం పెరిగేలా ఉంది ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా?

ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యమం నిర్చంధంలోనే వుంది. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాష్టో పూర్వ చైర్మెన్‌ శ్రీ కె.నారాయణరెడ్డి గారు సస్పెన్షన్ లో ఉన్నారు. పూర్వ ఛైర్మన్ శ్రీ కె. నారాయణ రెడ్డి గారు , పూర్వ సెక్రటరీ జనరల్ శ్రీ కె నరహరి గారులను వేధించడం కొరకు అప్పటి కమీషనర్‌ సి.సి.ఏ. రూల్స్‌కు విరుద్ధంగా చార్జిమెమోలు జారీ చేయడం జరిగింది. ఏకపక్షంగా వాటి అమలుకు అధికారుల మీద ప్రభుత్వం తీసుకురాని ఒత్తిడి లేదు. నిర్బంధ పెరగడం తగ్గడం అనేది ఉండదు, సాపేక్షంగా ఉపాధ్యాయ ఉద్యమం మీద నిర్బంధం తీవ్రంగానే కొనసాగుతుంది. పోలీసు దెబ్బల్లాగ ఈ వేధింపులు బయటకు కనపడవు. ఇంతకన్నా పెద్ద నిర్బంధం అమలు చేసినా ఉపాధ్యాయ ఉద్యమం ఆ నిర్బంధాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంది.

8. మొన్నటి చర్చలలో బెట్‌ సోర్భింగ్‌ ఉద్యోగుల సమస్యల చర్చలకు రాలేదనే ఆరోపణ వుంది. ఇప్పుడు జరగబోయే ఆందోళనలో అయినా వాళ్ళ సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది?

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల అమలులో భాగంగా మానవ వనరుల మీద అయ్యే వ్యయాన్ని తగ్గించడం నియంత్రించడంలో భాగంగా నియామకాలలో శాశ్వత విధానం కాకుండా ఎలాంటి భద్రతకు గ్యారెంటీలేని ముఖ్యంగా సర్వీసుకాలంలో పదవీ విరమణ అనంతరం జీవిత భద్రతకు ఎలాంటి హామీ లేని విధంగా నియామకాలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రస్తుత కొత్తగా ఎమ్‌.టి.ఎస్‌. (మినిమం టైం స్కేల్‌) విధానం అన్ని విభాగాలలో అమలులోకి వచ్చింది. ఇది పాలకుల ప్రభుత్వ విధానపరమైన అంశం కాబట్టి ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ డిమాండ్‌లలో అగ్రభాగాన ఉంటుంది. అదే సందర్భంలో చర్చలలో అంత ప్రాధాన్యత ఉండదు. ట్రేడ్‌ యూనియన్‌ దృక్పథం కూడా సరళీకరణ విధానాలకు అనుగుణంగా మౌల్డ్‌ కావడమే. ట్రేడ్‌ యూనియన్‌కు విధానపరంగా సరైన ధృక్పథం ఉంటే నియామకాలలో కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్ , ఎమ్‌.టి.ఎస్‌. విధానం, రెగ్యులర్‌ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం, సి.పి.ఎస్‌. విధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పుడే వాటి అమలుకు వ్యతిరేకంగా పోరాడి అద్దుకుని వుండేవి. ఇప్పుడైనా కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్ , సి.పి.ఎస్‌. ఎంప్లాయిస్‌, రెగ్యులర్‌ ఉద్యోగులను మించి ఇంచుమించు సమానంగా ఉండడం గమనించవచ్చు. ఈ విధానాలలో ఉన్న అభద్రతను గుర్తించిన లక్షలమంది ఆలస్యంగానైనా గుర్తించి సంఘటితపడటం మొదలైన తర్వాతనే ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం వారి డిమాండ్లను తలకెత్తుకున్నది. అందులో భాగంగానే పి.ఆర్‌.సి. సాధన సమితి ప్రభుత్వం చేసిన చర్చలలో ఈ అంశానికి అంత ప్రాధాన్యతనీయలేదు. వివిధ ప్రభుత్వాలు తమ పరిపాలనలో అనుసరిస్తున్న సరళ ఆర్థిక విధానాలు కేవలం ఉద్యోగస్వామ్యం మీదనే ప్రభావం చూపడం లేదు. ఈ విధానాల ప్రజల అభివృద్ధి విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు కదలినప్పుడు ప్రజలను కదలించకలిగినపుడే అందులో భాగంగానే నియామకాలలో వచ్చిన కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ , ఎమ్‌.టి.ఎస్‌., సి.పి.ఎస్‌. విధానాలు రద్దుకు సాధ్యమవుతుంది. అభివృద్ధిలో పాలక విధానాలు దృక్పథం ట్రేడ్‌ యూనియన్‌ దృక్పథం కలగలసి వున్నంతకాలం ఈ విధానాల రద్దుగావు. అంతవరకు సి.పి.ఎస్‌. రద్దు, కాంట్రాక్టు నియామకాల రెగ్యులరైజేషన్‌ ఔట్ సోర్సింగ్ వారికి మెరుగైన వేతనం నియామకాలలో కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్, ఎమ్‌.టి.ఎస్‌. విధానం రద్దు డిమాండ్స్‌ అగ్రభాగాన ఉంటాయి. కానీ చర్చలలో వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.



Leave a Reply