రాలిపడుతున్న ప్రతి పువ్వు

తన అమరత్వపు గుబాళింపులతో

ప్రజల మనసులను ఆవహిస్తుంది

ఎగిసిపడుతున్న ప్రతి కన్నీటి చుక్క

అమరుల ఆశయాల సాధనకై

ఆదేశిస్తున్నది, శాసిస్తున్నది

         
2022 ఏప్రిల్‌ 9, మహారాష్టలోని గడ్‌ చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో మరో విషాదకర దినంగా మిగిలిపోతుంది. ఆ ఉద్యమానికి దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం అలుపెరుగని విప్లవ సేవలు అందించి దండకారణ్య విప్లవ ప్రజలు అపార ప్రేమాభిమానాలను చూరగొన్న  కామ్రేడ్‌ నర్మదక్క తుదిశ్వాస విడిచింది.  గత మూడు సంవత్సరాలు గా అనేక తప్పుడు కేసులలో ఇరికించబడి విచారాధీనంలో వున్న 61 సంవత్సరాల  న‌ర్మ‌ద కేన్సర్‌ వ్యాధికి సరైన చికిత్స దొరుకకుండా పోయి, అంతిమంగా చికిత్స కరువై మరణపు అంచులలో మృత్యువుకై నిరీక్షించే హాస్పైస్‌ కేంద్రంలో   కన్నుమూసింది. ఆ అంతిమ ఘడియలలో తన సహచరున్ని ఆమె వద్దకు చేర్చడంలో పోలిసులు అలసత్వం ప్రదర్శించి ఆ అవకాశాన్ని దక్కకుండా చేశారు.

ప్రపంచాన్నే తనదిగా భావించిన ఆమె తుదకు ఒంటరిగానే, తన మృత్యు బాధను తానే భరిస్తూ, పంచుకునేవారు కరువై తన జీవిత సహచరుడి చివరి చూపుకైనా నోచుకోకుండా భరించలేని యాతనలతో మౌనంగా, శాశ్వతంగా కళ్లు మూసుకుంది.

పట్టణాల్లో, నగరాల్లో, పనిలో, అడవిలో, ప్రయాణాలలో, ఆస్పత్రిలో, శత్రు శిబిరంలో నిర్మ‌ల‌, కిర‌ణ్  ఎడబాటెరుగని జంటగానే ఉన్నారు. వారి విప్ల‌వాశయాలు వారిని తుదివరకు కలిపి ఉంచాయి. కానీ, ఇక శేష జీవితంలో కిరణన్నకు తోడు.. ఆమె మిగిల్చిన స్మృతులు, ఆదర్శాలు, ఆశయాలు. అవే ఆయ‌న‌కు సాంత్వన.

నర్మద ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కొండపావులూర్‌ లో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో 1960ల ప్రారంభంలో జన్మించింది. ఆమెకు తల్లి తండ్రులు కృష్ణకుమారి అని  పేరు పెట్టుకున్నారు. కృష్ణకుమారికి ఇద్దరు అన్నలు కాగా తండ్రి సుబ్బారావు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రోజులలో అభిమానిగా వుండేవాడు. కృష్ణకుమారి తన ఉన్నత పాఠశాలవిద్యను అక్కడే పూర్తి చేసుకొని 1980 నాటికి పాలిటెక్నిక్‌ విద్యనభ్యసించడానికి హైదరాబాదుకు చేరుకుంది. అప్పటికే హైదరాబాదు సహ రాష్ట్రమంతా కాలేజీలు, పాఠశాలలు రాడికల్‌ విద్యార్థుల విప్లవ రాజకీయాలతో, విప్లవాదర్శాలతో యువ తరాన్ని ఆకట్టుకునే కేంద్రాలుగా ఉండేవి. ఇంట్లో తన తండ్రి నుండి వంట పట్టించుకున్న కమ్యూనిస్టు ఆదర్శాలకు,

భావాలకు ఆ వాతావరణం మరింత ప్రోత్సాహాన్నిచ్చి ఆమెను ఒక విఫ్లవకారిణిగామలచడానికి ఎంతగానో దోహదపడినాయి. ఆ రకంగా ఆమె అనతికాలంలోనే పూర్తికాలం విప్లవోద్యమానికే అంకితం కావాలనే నిర్ణయం తీసుకొంది. ఆ క్రమంలో విప్ల‌వోద్య‌మంతో పరిచయాలు ఏర్పడి కిర‌ణ్‌తో  వివాహం జరిగింది.

కిర‌ణ్‌తో జీవిస్తూ ఆయన నిర్వహిస్తున్న ఉద్య‌మ  ప్రెస్‌ పనులలో పాలు పంచుకోసాగింది. ఆ క్రమంలోనే హిందీ భాషను అభ్యసించాలనే కోరికతో ప్రైవేట్‌ గా హిందీ భాషా పరిక్షలు రాయడం ప్రారంభించి క్రమంగా స్నాతక పట్టా పొందింది. ఆ సమయానికి దండకారణ్య విప్లవోద్యమం నిలదొక్కుకొని అనేక నెత్తుటి త్యాగాలతో మధ్య భారతంలో విప్లవోద్యమం విస్తరించసాగింది. ఆ విస్తరణ, దండకారణ్య లక్ష్యం నేపథ్యంలో అప్పటికి నూతనంగా ఏర్పడిన ఫారెస్టు కమిటీ హిందీలో పార్టీ పత్రికను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్నిఅమలు చేయడంలో భాగంగా   కామ్రేడ్‌ ఆలూరి భుజంగారావు-లలిత (అమ్మా,బాపు)ల జంట,   కిరణన్న- నిర్మలల జంట మధ్య భారతానికి చేరింది. ఇక మన నిర్మల అప్పటి నుండి తన పేరును మధ్య భారతంలోని ప్రసిద్ద నర్మదా నదీ సంకేతంగా విప్లవ లక్ష్య సాధనకు చిహ్నంగా నర్మదగా నిర్ణయించుకుంది. తను తుది శ్వాస విడిచే వరకు ఆ పేరుతోనే కొనసాగింది. విశాల విప్లవ ప్రజలలో అదే ఆమె చిరునామాగా నిలిచిపోయింది. నిర్మలగా రెండు పదుల జీవితం గడుపగా నర్మదగా 42 ఏళ్ల జీవితం ఆమెది.

ఆమె విప్లవ సేవలను, లార్జర్‌ దాన్‌ లైఫ్‌ సృతులను ఈ సంక్షిప్త స్మరణలో తలచుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అయినప్పటికీ తెరిచిన పుస్తకం లాంటి ఆమె జీవితం గురించి కొంత తెలుసుకుందాం.  

కామ్రేడ్‌ నర్మద, 1987-1994 ప్రారంభం వరకు మధ్య భారతంలోని వివిధ పట్టణాలలో ప్రభాత్‌ పత్రిక నిర్వహణలో నిమగ్నమైంది. అయితే, 1991లో  దండక్‌ అడవులలోకే ప్రభాత్‌ ప్రెస్  త‌ర‌లింది. దానితో 1994 వర్షాకాలం నాటికి కామ్రేడ్‌ నర్మద దండకారణ్యం చేరింది. అప్పటికే ఆ వుద్యమం గురించి ఆమెకు అన్ని వుద్యమ ప్రాంతాల రిపోర్టుల ద్వార కరతలామలకం అనే చెప్పుకోవచ్చు. 1991లో  రాజకీయ తరగతుల కోసం గడ్చిరోలీ అడవులను సందర్శించింది కూడ.

1994 వర్షాకాలం నుండి 2018 శీతాకాలం వరకు ఆమె దండకారణ్యంలోనే గడిపింది.ప్రారంభంలో తన సహచరుడు అడవికి చేరుకోవడంలో వివిధ కారణాలతో జాప్యం జరుగుతున్నప్పటికీ ఆమె మాత్రం ఇక తన చిరునామ దండకారణ్యమనే నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. అడవి జీవితానికి ఆమె అలవాటు పడడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆమెలోని అచంచలమైన పట్టుదలే అందుకు కారణం. ఆమె మాతృభాష తెలుగు కావడం, తాను విప్లవ ప్రస్థాన ప్రారంభంలో తమిళ భాషతో కొంత పరిచయం ఉండడంతో ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన స్థానిక ప్రజల ప్రాచీన భాష కోయ నేర్చుకోవడం చాల సులువైంది. హిందీభాష అభ్యాసానికి బయట ఉన్నపుడు ఇంట్లో బాపు, బయటి ప్రజల వాతావరణం ఆమెకు ఎంతో తోడ్పడినాయి. దానితో అడవిలో తను ఒంటరిగానే పత్రికా తీసుకరావడంలో కొన్ని భాషా సమస్యలు అనివార్యంగానే ఎదురైనప్పటికీ సునాయసంగానే వాటన్నింటిని విప్లవ పట్టుదలతో అధిగమించింది. దండకారణ్యంలో ప్రెస్‌, పత్రిక నిర్వహణ అంటే    నర్మదక్కనాయకత్వంలోనే ప్రారంభమైంది కొనసాగింది. కాలానుగుణంగా అనేక మార్పులు చోటుచేసు కున్నప్పటికీ ఒక్క ప్రెస్‌ అనేక ప్రెస్‌ లుగా, ఒక్క పత్రిక అనేక పత్రికలుగా అభివృద్ధి చెంది నేటికీ నిర్విరామంగా గత 35 సంవత్సరాలుగా ప్రభాత్‌ పత్రిక కొనసాగుతోంది. ఆ కృషి ప్రారంభంలోనర్మద సేవలు అద్వితయమైనవి.

1996 నాటికి అడవిలో ప్రెస్‌, పత్రిక ప్రారంభ కష్టాలను అధిగమించి నిలదొక్కుకున్నవి. ఆ త‌ర్వాత నర్మదక్క   చిరకాల వాంఛ అయిన మాస్‌ వర్క్‌ (ప్రజలలో పని)లోకి వెళ్లిపోయింది.   గడ్చిరోలీ కి వెళ్లి ఇక  2018 అక్టోబర్ లో తాను కేన్సర్‌ చికిత్సకై ఆస్పత్రికి వెళ్లేవరకు గడ్చిరోలీ కేంద్రంగానే పని చేసింది.   1991-94 నాటి నిప్పులు చెరిగే నిర్బంధం నుండి గడ్చిరోలీ  అపుడపుడే బయట పడుతున్న రోజులు. 1984 నాటి కమలాపుర్‌  మహాసభ నాటి నిర్బంధం నుండి కోలుకున్న తరువాత మరింత విస్తృత స్తాయిలో, తీవ్ర స్థాయిలో విరుచుకపడిన నిర్బంధం అది. ఉద్య‌మాన్ని  ప్రజలు ఇంకా పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. స్థానిక యువత విప్లవోద్యమంలో చేరినప్పటికీ ప్రజలలో అనేక అనుమానాలు కొనసాగుతున్న పరిస్థితులలో తొలుత ఆమె పెరిమిలి, ఆ తరువాత గట్ట, భామ్రాగఢ్ ప్రాంతాలలో ఆర్గనైజర్‌ గా పని చేసి ప్రాథమిక అనుభవాన్ని గడించసాగింది. ఆ తరువాత ఆమె మొత్తం గడ్చిరోలీ డివిజన్‌ వుద్యమం పై క్రమంగా పట్టు సాధించింది. 1992లో నూతనంగా స్థానిక ఆదివాసీ యువతీ యువకులతో ఏర్పడిన సీ-60 (క్రాక్‌ కమాందోస్‌) వారి ముమ్మరమైన దాడులు, మరోవైపు 1991లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్పెషల్‌ ఆక్షన్ ప్లాన్‌’లో భాగంగా ముమ్మరమైన బూటకపు సంస్కరణలు, లొంగుబాటు పథకాల మధ్య కామ్రేడ్‌ నర్మద ప్రజలను విప్లవోద్యమంలో సంఘటితపరిచింది. ఆటు పోట్ల మధ్య కొనసాగుతూ పెంపొందుతున్న గడ్‌ చిరోలి విప్లవోద్యమంలో 2000 నాటికి ఒక నూతన ఉత్సాహం వెల్లివిరియ సాగింది.  

నర్మద ప్రజలలో అతి సులువుగా కలిసిపోయెది. ఆమె స్థానిక ప్రజల యాసతో కూడిన భాషను పట్టుకోగలిగింది. మరోవైపు మహారాష్ట్రలోని గడ్‌ చిరోలీలో మరాఠీ నేర్చుకోవడం అనివార్యం. ఆమె దానిని అర్ధం చేసుకునే మేరకు నేర్చుకోగలిగింది. దానితో ఆమె ఒక మంచి ఆర్గనైజర్‌ గా ప్రజలలో, విద్యార్థులలో, ఉద్యోగులలో, యువకులలో పేరు తెచ్చుకుంది. వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి   ఎంతగానో కృషి చేసేది. మరోవైపు పార్టీ 2000 నాటికి విప్ల‌వోద్య‌మ స్థావ‌ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమైంది. అందులో భాగంగా   మొదట గ్రామాలలో వర్గ విశ్లేషణ చేపట్టింది. ఆ ప్రక్రియ ఆమెకు అక్కడి ముందరి చరిత్రను తెలుసుకోవడంతో పాటుగా పరిస్థితులను  స‌మ్ర‌గంగా  అర్ధం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడినాయి. పెరిమిలి ప్రాంతంలోని కరుడు గట్టిన తెగ భూస్వామ్య విధానాన్ని రూపుమాపి తదనంతర క్రమంలో జనతన సర్కార్లను నిర్మించడానికి ఆ వర్గ విశ్లేషణ ఆమెకు ఒక ప్రాతిపదికను ఏర్పర్చింది. 2000 తరువాతి నుండి డివిజన్‌ ఉద్యమంలో నూతన శక్తుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. అందులో కామ్రేడ్‌ నర్మద తానున్న ప్రాంతంలో కృషి చేసింది. 

అంతకు ముందు అక్కడక్కడ గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడినప్పటికి వాటిని తిరిగి విప్లవ ప్రజా కమిటీలుగా రూపాంతరం చేయడంతో పాటు ప్రజాపునాది బలంగా ఏర్పడి వున్న చోట నూతనంగా వాటి నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ముందుకు వచ్చింది.   జనతన సర్కార్ల నిర్మాణానికి కావలసిన వాతావరణాన్ని ప్రజలలో పెంపొందించడానికి   మొదట వ్యవసాయ అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి నిలిపింది. అనేక గ్రామాలలో చెరువులు, కుంటల నిర్మాణంతో పాటు ఇతర వ్యవసాయ కార్యక్రమాలను తీసుకుంది. రైతు కుటుంబంలో పుట్టి విద్యార్థిగా ఎదిగి విప్లవోద్యమంలో ఒక ఆర్గనైజర్‌ గా సకల పనులను నేర్చుకోవడంలో చురుగ్గా, చొరవతో ముందుండేది.

ఆమె 1996లో ప్రభాత్‌ పత్రికా నిర్వహణ బాధ్యతల నుండి మాస్‌ వర్క్‌ కు బదిలీ అయినప్పటికీ పెంపొందుతున్న మహిళా ఉద్యమ అవసరాల రీత్యా 1996లో నూతనంగా ప్రారంభమైన “పోరు మహిళ (హిందీలో సంఘర్ష్‌ రథ్‌ మహిళా) పత్రికా నిర్వహణ బాధ్యతలను చేపట్టక తప్పలేదు.   

2013లో గడ్‌ చిరోలి సబ్‌ జోన్‌ లో భారీ నష్టాలు చోటు చేసుకున్నాయి. వివిధ ఎదురు కాల్పుల, బూటకపు ఎదురు కాల్పుల మటనలలో దాదాపు పాతిక మంది  అసువులు బాసారు. దానితో, ఇక గడ్చిరోలీ  విప్లవోద్యమం త్వరలో పూర్తిగా తుడిచి పెట్టుక పోతుందనీ పోలీసులు సవాళ్లు విసిరారు. నిజంగా ఆనాటి క్లిష్ట పరిస్థితులు నాయకత్వానికి పెద్ద పరీక్ష లాంటివే. 2011 నాటికే మొత్తం దండకారణ్య విప్లవోద్యమం గడ్డు పరిస్థితికి, 2013 నాటికి దేశ వ్యాపిత విప్లవోద్యమం గడ్డు పరిస్థితికి చేరిన కష్ట కాలంలో  గడ్చిరోలీ  ఉద్యమాన్ని నిలబెట్టుకోవడం కత్తి మీద సాములాగే మారింది. అలాంటి విపత్కర పరిస్థితులలో   ఆమె తన వంతు నాయకత్వ పాత్ర పోషించడంలో ముందుంది.

2014లో గడ్‌ చిరోలీలో చేపట్టిన నూతన ఎత్తుగడలు దేశ వ్యాపితంగా నూతన మూలవాసీ పోరాటాలకు దారి చూపాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఆమె గడ్చిరోలీ లో యువతను, మేధావులను చేరదీసి వారిని తన లక్ష్యానికి అనుగుణంగా మలచుకుంటూ, విప్లవ నిర్మాణాలలో కొత్త చైతన్యాన్ని పెంపొందిస్తూ చట్టబద్ధ పోరాటాలను ప్రజల పాత్రను పెంచడంలో ప్రశంసనీయమైన కృషి చేసింది. జిల్లా వ్యాపితంగా ఒక కొత్త పోరాట ఒరవడి నెలకొని పొరుగు జిల్లాలకు, రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఫలితాలను అత్యంత చాకచక్యంగా సంఘటితం చేసుకోవలసిన కీలక పరిస్థితులలో 2018 ఎప్రిల్‌ 22 నాడు కస్‌నూర్‌ తుమిరిగుండలో నమ్మక ద్రోహంతో జరిగిన పోలిసు కాల్పులలో 40 మంది కామ్రేడ్స్‌ అమరులయ్యారు. దానితో యావత్తు సబ్‌ జోన్‌ విప్లవోద్యమం భారీ కుదుపుకు లోనైంది. అలాంటి పరిస్థితులలో తిరిగి నూతన నాయకత్వ శక్తులను కస్నూర్‌ వారసులను తయారు చేసుకోవాలనీ విప్లవోద్యమంలో చేరాల్సిందిగా పిలుపు ఇవ్వడంతో   నూతన నిర్మాణాలకు ఆ పిలుపు ప్రాణ వాయువు అయింది. 

అప్పటికే కామ్రేడ్‌ నర్మద అనారోగ్యం తీవ్రమైంది. తాను చికిత్సకు వెళ్లాల్సినసమయంలోనే ఈ అసాధారణ నష్టాలు జరుగడంతో తన ప్రయాణాన్ని విరమించుకొని మిగిలిన కేడర్లతో, నెలకొన్న పరిస్టితులను సమీక్షించుకొని తిరిగి కర్తవ్య సాధనకై ద్విగుణీకృత పట్టుదలతో పని చేయాల్సిన దిశలో గైడ్‌ చేసింది. ప్రజలలో విశ్వాసం సన్నగిల్లకుండా నిలబెట్టేందుకు భవిష్యత్‌ కార్యక్రమాలను, పథకాలను  రూపొందించింది. 

అధ్యావకురాలుగా  నర్మదను నాయకత్వ శిక్షణా తరగతుల విద్యార్థులు సదా స్మరించుకుంటారు.  వాటిలో  విద్యార్థినిగా ఉపాధ్యాయురాలుగా పాల్గొంది. ఆమె అర్థశాస్త్రం తో పాటు నిర్మాణపర విషయాలను చెప్పడానికి ఎక్కువ మక్కువ పడేది. అంతకు ముందు ఆమె గ్రామ స్దాయి నిర్మాణాలను ప్రత్యక్షంగా గైడ్‌ చేసినపడు వారికి అన్ని విషయాలు చెప్పేది.

చట్టబద్ద పోరాటాలు చేపట్టిన కాలంలో ఆమె ముందుగా మితృల నుండి భారత రాజ్యాంగంలోని వివిధ షెడ్యూల్స్‌ లలో రాసిన విషయాల గురించి తెలుసుకొని వాటి మీద ప్రజల కోణంలో తయారై వాటి అమలు ద్వార ఒనగూరే లాభాలు, అంతిమంగా వాటికే పరిమితమైతే సంస్కరణవాదంలో మునిగిపోయె ప్రమాదం గురించి స్పష్టంగా బోధించేది.   మహిళలకు, పురుషులకు మహిళ సమస్యలపై   అవగాహనను అందించడానికి ఒక అధ్యాపకురాలుగా చాలా కృషి చేసింది.  

పితృస్వామ్య వ్యతిరేక పోరాటంలో కామ్రేడ్‌ నర్మద ఉద్యమంలోని మహిళలందరికి ఎంతో ఆదర్శ వంతమైన పాత్రను పోషించింది. ముందుగా   తన తల వెంట్రుకలను కత్తిరించుకొని అప్పటికే ఉద్యమంలో ముందు నిలిచిన సీనియర్‌ ఆదివాసీ మహిళల సరసన నిలిచి వారికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.   ఉద్యమంలో మహిళలు ఎదుర్కొంటున్న పురుషాధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఆమె   ప్రత్యేక కృషి చేసింది. ఆమె కేఏఎంఎస్‌ అధ్యక్ష బాధ్యతలలో వుంటూ ప్రజా సంఘాలలోని మహిళను పితృస్వామ్యానికి వ్యతిరేకంగా చైతన్యపరచడంలో ఆమె మహాసభలను, సెమినార్‌ లను అత్యంత శక్తిమంతమైన వేదికలుగా ఉపయోగించుకున్నది. పార్టీలో మహిళలు ఎదుర్కొంటున్న పితృస్వామ్య భావజాలానికి సంబంధించిన అనేక రకాల సమస్యలను విడిగా చర్చించడానికి   ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి చొరవ చేసేది. 2017 డిసెంబర్‌ లో తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికి ఆ విషయం తన కార్యకలాపాలకు అడ్డు రాకూడదని భుజంపై నుండి తువ్వాల కప్పుకొని తన బాధ ఇతరులకు తెలువకుండా ఆ వారం రోజులు ఎంతో ఉత్సహంగా  పాల్గొంది. పితృస్వామ్య వ్యతిరేక కేంపెయిన్‌ లను విజయవంతం చేయడానికి 2004, 2009, 2017లలో ఆమె సర్క్యులర్లను రూపొందించడం మొదలు కేంపెయిన్‌ రూపురేఖలను నిర్ణయించడం వరకు తన వంతు బాధ్యతలను చురుగ్గా నిర్వహించింది.   మహిళ‌లు త‌మ‌ సమస్యలను, ఉద్యమ సమస్యలను, అనుభవాలను సన్నిహితంగా పంచుకొని పరిష్కరించుకోవడానికి జరిపిన కృషి ఆ ఉద్యమ పురోగమనానికి చాలా తోడ్పడింది. యావత్‌ ఉద్యమంలోని మహిళలు ముఖ్యంగా సీనియర్‌ మహిళలు తాము ఎదుర్కొనే ఏ సమస్యనైనా కామ్రేడ్‌ నర్మదక్కతో షేర్‌ చేసుకునేవారు. ఆమె ఒక సీనియర్ కామ్రేడ్‌ గా, అనుభవం ఉన్న సహధ్యాయిగా,   ఆప్యాయత ప్రదర్శించే ఒక మంచి స్నేహశీలిగా  పరిష్కారాలు చూపేది.

రచయితగా కామ్రేడ్‌ నర్మద తెలుగు విప్లవ పాఠకులు నిత్యగా పరిచయం. తన ఇంటి దగ్గరి పేరులోని మొదటి అక్షరాన్ని, తన జీవిత సహచరుడి పేరులోని రెండవ అక్షరాన్నితీసుకొని తల కలం పేరుగా నిలుపుకుంది. ఆమె అరుణతార, సృజన, మహిళా మార్గం మున్నగు పత్రికలకు తన రచనలను పంపుతుండేది. ఆమె రాసిన ఛాయ్‌ గ్లాస్‌ కత చాలా మంది పాఠకులను కదలించింది. పిల్లలలో చిన్ననాటి నుండే పితృస్వామ్య భావాలు ఎలా వ్యవస్టీకృతమవుతాయో, ఆదివాసీ సమాజమూ అందుకు అతీతమేమీ కాదనీ ఆ కథలో కళ్లకు కట్టినట్టుగా చిత్రించింది. ఆమె ప్రేం చంద్‌ నవలలోని పాత్రలలో దర్శనమిచ్చే ఆనాటి పితృస్వామ్యాన్ని ప్రత్యేకంగా విశ్లేషిస్తూ బయటి విప్లవ పత్రికలకు (అరుణతార అనుకుంటా!) పంపింది. ఆమె అనేక కవితలను భావస్పోరకంగా రాసేది. ఆమె ప్రకృతిని ఎంతగా ప్రేమించేదంటే అడవిలో దారెంట నడుస్తున్నపుడైనా, తన డేరాలో (మకాం)నైనా అందమైన పూవులు అగుపడితే వాటిని తన మగ్గునే ఫ్లవర్‌ వైజ్‌ గా మలచుకొని తన పక్కన పెట్టుకొని దానిపై తన మనసులోని భావాలను అక్షరాలలోకి మలిచిన కాగితాన్నిపెట్టేది. తన తండ్రి మరణ వార్త విన్నాక ఆయన పెంపకంలో తనలో చోటుచేసుకున్న ప్రగతిశీల విప్ణవ భావాలు, ఆదర్శాలు, కుటుంబంలో తండ్రి పిల్లలకు అందించిన ప్రేమ సహ ఆయనతో తన గాఢానుబంధాన్ని రాసుకొని భద్రపరచుకుంది. తను వివిధ పత్రికలకు తన రచనలను పంపడంతో పాటుగా పోరు మహిళకు హిందీలోనే రిపోర్టులు, నివేదికలు, వ్యాసాలు రాసే పాఠకులకు చేర్చడంలో ప్రత్యేక శ్రద్ద కనపర్చేది. వందేళ్ల అంతర్జాతీయ మహిళా సంవత్సర వేడుకలను పురస్కరించుకొని దండకారణ్యంలోని 30 వసంతాల విప్లవ మహిళా ఉద్యమానికి అక్షర రూపం ఇచ్చి విప్లవోద్యమ చరిత్రలో ప్రత్యేక మహిళా సంఘాల ఆవిర్భావం నుండి రాజ్యాధికారంలో మహిళల భాగస్వామ్యం వరకు జరిగిన పరిణామాలను ప్రజలకు తెల‌ప‌డంలో  నర్మద తన వంతు పాత్ర చాలా చురుగ్గా పోషించింది.  

ఆమెలో బలమైన రచనా శక్తి, ఆసక్తి ఉండడంతో ఉద్యమంలోని అనేక విషయాలను రాసి భద్రపర్పడంలో విశేష కృషి సలిపింది. బంగ్లాదేశ్‌ నుండి వచ్చి స్థిరపడిన బంగాళీ పేద ప్రజల సమస్యలను అధ్యయనం చేసి   వారిని సంఘటితం చేయడానికి నిర్మాణ కృషి కొనసాగించింది. ఆ తరువాత గడ్చిరోలీ లో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో లేఖామేండా అనే గ్రామంలో నిర్మాణమైన గ్రామసభను ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఆ రిపోర్టును కూడ తన కమిటీకి అందచేసింది. ఆ నివేదిక తదనంతర కాలంలో మిగితా ఆదివాసీ గ్రామాలలో గ్రామసభల నిర్మాణంలో, వాటిని సంస్కరణవాదంలో మునిగిపోకుండా నిలపెట్టడంలో తనకు ఎంతగానో ఉపయోగపడింది. ఆమె ఒక రచయిత అందులో విప్లవ రచయిత కావడంతో వివిధ రచనలలోని లోపాలను ఎత్తిచూపుతూ వాటిని మార్క్సిస్టు దృష్టి కోణంలో అర్ధం చేసుకునేలా  ఇత‌రుల‌కు సలహాలు ఇచ్చేది.  దండకారణ్య ఉద్యమంలోని మహిళా రచయితల   పుస్తకంలో కామ్రేడ్‌ నర్మద రచనలూ ఉన్నవి.

కామ్రేడ్‌ నర్మద ఒక రచయితనే కాకుండా మంచి వక్త కూడ. ఆమెకు ప్రజల మధ్య పని చేసిన అపార అనుభవం ఉండడంతో ఆమె తన ఉపన్యాసాలలో విరివిగా స్టానిక ఉపమానాలను, అనేక జాతీయాలను అద్భుతంగా ప్రయోగించేది. ప్రజా సమస్యలపై ప్రజల మధ్య మాట్లాదేపుడు అక్క చెబుతున్నట్టు ఆ సమస్యపై సంఘటితం కావాలనే ఆలోచనలను శ్రోతలలో ప్రేరేపించేది.  విప్లవ వివాహ వేడుకలైనా, సంస్మరణ సభలైనా, ప్రజా సంఘాల మహాసభలైనా, విప్లవకర దినాలైనా ఆమె సందర్భోచితంగా అర్ధవంతంగా మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకునేది. ఆలోచింపచేసేది. వందేళ్ల అంతర్జాతీయ మహిళా సంవత్సర వేడుకలను నిర్వహిస్తూ పశ్చిమ బస్తర్‌ లోని కావడిలో నిర్మితమైన దాదాపు 35 అడుగుల స్తూపాన్ని ఆవిష్కరించడానికి వెళ్లి వచ్చి వేలాది మంది మహిళలతో జరిగిన ఆ సభ నుండి తాను అందించిన పోరాట సందేశాన్ని మా అందరితో పంచుకొని విప్లవ మహిళల శక్తిని ఎత్తిపట్టేది.

ఉద్య‌మాల్లో  ప్రచారం కన్నా ఆందోళనకర్త పాత్ర మరింత కఠినమైనది,దాని కన్నా ప్రజలను ఆ ఆందోళనల నుండి సంఘటితం చేసే నిర్మాణ కర్తవ్యం మరింత కష్టమైనది. కానీ, నర్మద మూడు రంగాలలోనూ ప్రతి పనీ పోటే పడి చేసేది. ప్రతి పోరాటం గురించి కరపత్రాలు రాయడం మొదలు వివిధ రూపాలలో రకరకాల ప్రచార సామగ్రిని తయారుచేయడం, వేల సంఖ్యలో ప్రజలను తమ సమస్యలపై కదలించడంతో పాటు వారిని సంఘటితం చేయడానికి తగిన నిర్మాణ కృషి కొనసాగేలా కమిటీలను గైడ్‌ చేసేది. చట్టపర పోరాటాల కాలంలో ఆమె అనేక సమస్యలపై ముఖ్యంగా రాజ్య హింసకు వ్యతిరేకంగా ప్రజలను వేల సంఖ్యలో కదలించింది. ఆమె వద్ద అవన్నీ రికార్డుగా భద్రంగా ఉండేవి. 2014లో సాధారణ వెదురు పోరాట కమిటీలను సంవత్సర కాలం గైడ్‌ చేసి వాటిని బలమైన చట్టబద్ద పోరాట వేదికలుగా మలచడమే కాకుండా చరిత్రలో అపూర్వ స్థాయిలో ప్రజలకే అడవులపై యాజమాన్య హక్కులతో కూడిన ఐదు రెట్ల అధిక రేటును సాధించుకునేలా గైడ్‌ చేయడం గడ్చిరోలీ ఉద్యమంలో ఒక మైలురాయి లాంటిది.

సుర్జాగఢ్‌ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా 2016 వేసవిలో 143 గ్రామాల నుండివందల సంఖ్యలో ప్రజలను ఆహ్వానించి జరిపిన విస్తాపన వ్యతిరేక సమావేశం గడ్డు పరిస్థితులైనప్పటికీ ప్రజల జీవన్మరణ సమస్యలపై వారిని కదలించగలమనే విశ్వాసాన్ని ఇచ్చింది.   అడవులపై ప్రజలదే యాజమాన్యం అనే దిశలో జల్‌, జంగల్‌, జమీన్‌ పై అధికారం లభించేలా వారిని పోరాటోన్ముఖులను చేసిన ఆందోళనకారిణి   నర్మద. పెసా చట్టం కేవలం లఘు అటవీ ఉత్పత్తులపైనే ప్రజలకు అధికారాన్ని కల్పించిందనీ, మధ్య తరగతి, భారీ ఉత్పత్తులన్ని తన అధీనంలోనే ప్రభుత్వం ఉంచుకొని తన దోపిడీ స్వభావాన్ని చాటుకుందనీ ప్రజలకు వివరించి ‘ఈ అడవి మాదేనని నినదించాలని వారికి మార్గదర్శకం చేసింది.

ఆమె ఒక ప్రేమ‌మ‌యి అయిన తల్లిగా   నర్మదను ఇప్పటికీ గుర్తు చేసుకునే ఉద్యమ పొత్తిళ్లలో పుట్టిన పిల్లలనేక మంది ఉన్నారు. నర్మద మహిళా ఉద్యమ నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించడం ఆమె మహిళల విషయంలో మరిన్ని అదనపు కర్తవ్యాలను నిర్వర్తించేలా చేసింది. ఆమె గ్రామాలలో మహిళలకు పౌష్టికాహారం అందించాలని ప్రతి సమావేశంలో ప్రత్యేకంగా గుర్తు చేసేది. ముఖ్యంగా గర్భవతి మహిళలకు పిల్లా-తల్లీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం ఉన్నప్రతిచోట జనతన సర్కార్‌ వైద్యులతో లేద ప్రజా మితృలతో, లేద ఇతరత్ర సంస్థల ముందు డిమాండ్‌ పెట్టి వైద్య శిబిరాలకు ప్లాను చేసేది.

ఉద్యమంలో తల్లులయిన వారి ఆరోగ్య విషయాలలో, ముఖ్యంగా వారి పిల్లల విషయంలో తను ప్రత్యేకంగా బాధ్యత పడేది. తల్లి, తండ్రి ఉద్యమంలో భాగమైనపుడు వారి పిల్లలకు ఉద్యమంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడంలో నర్మద చాలా శ్రద్ధ పెట్టేది. వారి శైశవావస్థలో వారికి అందించే పోషక ఆహారం వారి భవిష్యత్‌ ఎదుగుదలపై ప్రభావాన్ని వేస్తుందని తెలిసిన తాను ఆ పిల్లలకు పలు రకాల చిరుధాన్యాలతో కూడిన పిండి తయారు చేసి పాలతో కలిపి తినిపించేలా వారి సంరక్షులకు నేర్పేది. ఉద్యమంలో పుట్టి ఎదుగుతున్న పిల్లలు ఉద్యమ ప్రజల మధ్యనే పెరగాలనీ లేకపోతే వారు తల్లి తండ్రుల త్యాగాలకు భిన్నంగా తయారయే ప్రమాదం వుంటుందనీ అనేక ఉదాహరణల ద్వారా హెచ్చరిస్తూ వారిని ఉద్యమ ప్రజలకే పెంపకానికి ఇచ్చిన‌, ఇప్పిచ్చిన ఘటనలు ఉన్నాయి. వారిని తరచుగా కలుస్తూ విప్లవ రాజకీయాలకు దూరం కాకుండా ఉండేలా వారికి, వారి స్థాయికి తగిన బుద్ధులు  చెప్పేది. వారి సంరక్షులకు వారి తల్లి, తండ్రులు ఉద్యమంలో ఉన్నారనే విషయాన్ని తెలుపాలని, దాచకూడదని కోరేది.

నర్మదకు ఎక్కడైనా అరుదైన లేద తను పని చేస్తున్న ప్రాంతంలో లేనిదేదైనా అగుపడితే దాన్ని తమ ప్రాంతానికి తరలించి ప్రజలకు పరిచయం చేయాలనే ఆరాటం ఎంతగానో ఉండేది. ఆమె కావడి సభకు వెళ్లి పశ్చిమ బస్తర్‌ నుండి తీసుకువచ్చిన ఆకుకూర (పాయికా జబ్బా) గడ్చిరోలి లోని పలు ఆదివాసీ గ్రామాలలోని ప్రజలకు పరిచయం చేసింది.  

నర్మద ఆరోగ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ద పెట్టేది.  అవకాశం వున్నంత మేరకు   శారీరక దారుఢ్య‌తను కలిగి వుండడానికి నిత్యం కొంత టైం కేటాయించుకొని చేసేది. తిండి విషయంలో జనం ప్రేమ ఆప్యాయాలతో ఏది పెట్టినా వద్దనకుండా, తినననకుండా తీసుకొని వారితో పంచుకొని తినేది. కానీ, వయసు పెరుగుతున్న క్రమంలో శరీరంలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా కొద్ది సంవత్సరాలుగా నర్మదకు రెండు కాళ్ల జంతువు తప్ప నాలుగా కాళ్ల జంతువు మాంసం ఏది తీసుకున్నా విపరీతమైన అలర్జీ రావడం మొదలైంది. దానితో తనకు ఎంతో ప్రియమైన మాంసాన్ని ఆరోగ్యం కోసం వదలుకుంది.

రోజూ ఆహారంలో ఒకపూట చిరుధాన్యాలుండడం అవసరమనే ఆరోగ్య సూత్రాన్ని తాను పాటించడమే కాకుండా తన వయసు వారు, తన కన్న పెద్దవారు పాటించేలా చేసేది. ఆదివాసీ వ్యవసాయంలో చిరుధాన్యాలే ప్రధాన పంటగా వున్న ప్రాంతాలు నేటికీ ఇంకా మిగిలి ఉన్నాయి. అంతే కాకుండా చాలా చోట్ల ఆదివాసులు రాగులు పండిస్తారు. కామ్రేడ్‌ నర్మద తన కోసం, తోటి కామ్రేడ్స్‌ కోసం తనకు ఉన్న వనరుల ద్వారా రాగులు తెప్పించి పిండి నూర్పించి పాకెట్లలో అందించేది. ఆమె సాయంత్రం రాగి రొట్టి తింటూ మేమంతా రొట్టి తినేలా అలవాటు చేసిన మేలు మేమెవరం మరువలేం.

రజోని వృత్తి అయిన మహిళలకు అడవిలోని ఆహారంలో దొరికే కాల్షియం సరిపోదనీ అదనంగా మాత్రల రూపంలో తీసుకోవాలనీ వాటి అవసరాన్ని తెలుపుతూ తాను తింటూ తోటివారికి అందించేది. ఆరోగ్య నియమాలు ఎన్ని పాటించినా ఎనావీలివ్స్‌ మాత్రం వదిలేవి కావు. మలేరియా దోమలతో కూడుకున్న అడవులు కావడంతో చాలా మంది కామ్రేడ్స్‌ కు నెల, నెలా మలేరియా జ్వరం తప్పనట్టు కామ్రేడ్‌ నర్మదకు కూడ ప్రతి నెలా మలేరియా రాక తప్పేది కాదు. దానితో నెలకు కనీసం ఐదు రోజులు శరీరం శక్తిహీనంగా తయారయ్యేది. వైవాక్స్‌ అయితే అడవిలోని గెరిల్లాల శరీరాలన్నీ అలవాటు పడినాయి కానీ ఫాల్సిఫరం అయితే మాత్రం చాలా ఇబ్బంది పడకతప్పేది కాదు. కొన్ని సందర్భాలలో మలేరియాతో పాటు టైఫాయిడ్‌ కూడ దాడి చేసేది. అన్నీ విప్లవం కోసం భరించడం విప్లవమే నేర్పింది.

వయసు పెరుగుతున్న క్రమంలో ఆమెకు వినికిడి సమస్య ఎదురై ఇయరింగ్‌ మిషన్‌ వాడాల్సి వచ్చింది. ఇవన్నీ ఎన్ని రకాలుగా ఆమెను మధ్య మధ్యలో శారీరక ఇబ్బందులకు గురిచేసినప్పటికీ ఆమె చలించలేదు. ఒంట్లో ఏ కొద్దిగా సత్తువ వున్నా తన పనులు ఆపేది కాదు. గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూచోని తన పనులు సకాలంలో పూర్తి చేయడానికి అహర్నిషలు ప్రయత్నించేది. అలాంటి కామ్రేడ్‌ కు మరణాంతక కాన్సర్‌ వ్యాధి మొదలై తన జీవితాన్ని కబలించింది.

2014లో తొలిసారి తన రొమ్ములో చిన్న కురుపులాంటిది మొదలైందని వైద్యులకు చూపి వారిచ్చిన మందులు తీసుకొని తినసాగింది. ఆ తరువాత తనకు పరిచయమున్న ఇతర వైద్యలకు చూపి బయాప్సీ పరీక్షలు జరిపించుకొని అందులో లేదని నిర్దారణ కావడంతో మందులు తినడం మానేసింది. కానీ, ఆ తరువాత వ్యాధి ప్రబలుతుండడంతో బయాప్సీ పరీక్షలలో లోపం ఉందని అర్ధం చేసుకునే సరికి పరిస్థితి విషమించింది. అప్పటికైనా మెరుగైన ఆస్పత్రికి వెళ్లి వుంటే మరింత ముందుగానే వైద్యం అందేది. కానీ, ఉద్యమంలో ఎదురవుతున్న కఠిన పరిస్థితులతో, నష్టాలతో దాదాపు 10 మాసాలు వైద్యం పొడగించబడింది. దానితో కాన్సర్‌ వేగంగా విజృంభించి కిమోథెరపీ స్థాయికి వెళ్లింది.

 2018 ఆగస్టులో వైద్యులు బయటే ఉండి చికిత్స చేసుకోవాలని సూచించారు. దానితో తమకు పరిచయమున్న సానుభూతిపరుల సహాయాన్ని కోరింది. కానీ, వారు సున్నితంగానే తిరస్కరించారు. దీంతో ఉన్న చోటనే తోడుగా తన సహచరుడితో వుంటూ వైద్యం చేయించుకోసాగింది. వృత్తి ధర్మం రీత్యా, మానవతా దృష్టితో వైద్యులు, ఇతర సామాజిక కార్యకర్తలు, మితృలు ఆమెను ఎక్కువ రోజులు బతికించుకోవాలనీ ఎంతగానో ప్రయత్నించారు, ఆరాటపడ్డారు. కానీ, తుదకు ఆమె అరెస్టు కావడంతో ఆమె పోలీసుల నియంత్రణలోకి వెళ్లక తప్పలేదు. ఆమెకు అన్ని రకాల సహకరించిన వారికి ధన్యవాదాలు, విప్లవాభివందనాలు.

రెండు రాష్ట్రాల పోలీసులు పథకం ప్రకారమే హైదరాబాదులో 2019 జూన్‌ 11న వారిద్దరి జంటను అరెస్టు చేసి మహారాష్ట్రలోని సిరొంచలో అరెస్టు చేసినట్టు చూపారు. ఆమెపై అనేక తప్పుడు కేసులు మోపారు. వాటిలో 2014లో తప్పుడు ఆరోపణలపై దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొ. సాయిబాబా, విద్యార్థి హేం మిశ్రాలను తాను   గైడ్‌ చేస్తున్నదనే దానితో సహ తనకు సంబంధం లేని అనేక కేసులు ఆమెపై రుద్దారు.

పదుల కొద్ది కేసులలో ఆమెను నిందితురాలుగా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులలో సైతం కోర్టుల చుట్టూ తిప్పసాగారు. సరైన వైద్యం అందని స్థితిలో, పెరిగిన వయసులో, మరణాంతక వ్యాధితో ఆమె పరిస్థితి దిన దినం వేగంగా దిగజారసాగింది. అయినప్పటికీ నిర్ధాక్షిణ్యమైన న్యాయ వ్యవస్థ ఆమెకు కనీసం బెయిల్‌ ఇవ్వడానికి కూడ సిద్దం కాలేదు.

తుదకు ఇక వైద్యం లేని స్థితికి చేరిందని అంతిమ రోజులలో ఉంచే హాస్పైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడే ఆమె తన తుది శ్వాస విడిచింది. ఆ తుది ఘడియలలో తన జీవిత సహచరున్నైనా కలపడానికి ప్రత్యేక శ్రద్ధ చూపని నిర్దాక్షిణ్యమైన వర్గ వ్యవస్థలో విచారాధీనంలో ఉండగానే ఆమెను హత్య చేశారు.

ఆ వీర‌నారికి మరణం  లేదు. ఆమె విప్లవ ప్రజల గుండెలలో, విప్లవకారుల హృదయాలలో తనదైన స్థానాన్ని పదిలపరుచుకుంది.   

One thought on “సాహ‌సిక మేధావి, ప‌త్రికా ర‌చ‌యిత న‌ర్మ‌ద‌

Leave a Reply