1980`81 విద్యా సంవత్సరంలో నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పుడు పాఠశాల క్లాస్మేట్, డిగ్రీలో సీనియర్ అయిన పటేల్ సుధాకర్ రెడ్డి, నేను అప్పుడప్పుడే విద్యార్థి ఉద్యమంలో అడుగుపెడుతున్న సందర్భం. ఆ సమయంలో సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటి అనే చర్చ వచ్చింది. దానికి సమాధానంగా కొకు సాహిత్య ప్రయోజనం అనే వ్యాస సంకలనం మాకు బాగా పనికి వచ్చింది. దాన్ని చదువుకున్న తర్వాత ప్రాథమికంగా సాహిత్యం రాజకీయాలు కలిసే ఉంటాయని స్పష్టతకు వచ్చాం. ఆ వ్యాసాల సంకలనకర్త కేతు విశ్వనాథ రెడ్డి గారు. అప్పుడు మొట్టమొదట ఆయన పేరు విన్నాం.
ఆ తర్వాత కొకు సాహిత్య సంపుటాలు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో చూశాను. వాటికి సంపాదకుడిగా కేతు విశ్వనాథ రెడ్డి గారు. ఆ ఆ తర్వాత అనంతపురంలోని ఒక సాహితీ సభలో ఆయన్ను ప్రత్యక్షంగా చూశాను. హైదరాబాద్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పలకరిద్దామని వెళ్లాను. ఆయన లేచి నిలబడి రా కూచో అని ఆహ్వానించారు. మళ్లీ 21. 5. 2023న బ్రౌన్ గ్రంథాలయంలో ఒకే సభలో మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ సార్ భార్య అనారోగ్యంగా ఉన్నదని ఒంగోలు వెళుతున్నానని వెళ్లి ఇక మళ్ళీ రాకపోవడం బాధాకరం.
కేతు విశ్వనాథరెడ్డి కథకుడు, విమర్శకుడు, సంపాదకుడు కూడా. కొకు సాహిత్య సంపుటాలని తన సంపాదకత్వంలో విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించారు. కేవలం కథ, నవల సాహిత్యం మాత్రం. ఆ తర్వాత విరసం కొకు మొత్తం సాహిత్యాన్ని ప్రచురించింది. కేతు విశ్వనాథరెడ్డి కత, విమర్శ, సంపాదకత్వ రంగాల్లో చేసిన కృషిని విడివిడిగా చర్చించుకోవచ్చు. ప్రస్తుతం ఆయన విమర్శ గురించి కొన్ని విషయాలనే ప్రస్తావించుకుందాం. ఆధునికుడిగా, మార్క్సిస్టుగా ఆయన సాహిత్య దృక్పథాన్ని విమర్శలో చాలా స్పష్టంగా గమనించివచ్చు.
కేతు విశ్వనాథరెడ్డి వేర్వేరు రూపాల్లో రాసిన విమర్శ రచనలన్నీ నా దగ్గర అందుబాటులో లేకపోయినప్పటికీ ప్రధానంగా దృష్టి అనే వ్యాస సంపుటిలో ఆయన ముఖ్యమైన సాహిత్య అభిప్రాయాలు కనిపిస్తాయి. ఈ పుస్తకం మీద రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మరో చర్చ అన్న తన గ్రంథంలో కేతు విశ్వనాథరెడ్డి దృష్టి అనే సాహిత్య విమర్శ వ్యాసం రాశారు.
ఇందులో కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య విమర్శకు సామాజిక శాస్త్రాల ఆసరా అనివార్యం అంటారు. అసలు విమర్శే అవసరం లేదన్న ప్రతిపాదనలు వినిపిస్తున్న కాలంలో సాహిత్య విమర్శ అవసరం చెప్పడమేగాక దానికి సామాజిక శాస్త్రాలు అవసరం అనే ఆయన ప్రతిపాదన చాలా ముఖ్యమైనది. ఈ మాట తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శలో కేతు విశ్వనాథరెడ్డికంటే ముందే ప్రతిపాదించినవాళ్లు ఉన్నారు. సాహిత్య విమర్శకు సామాజిక శాస్త్రాలను అన్వయించి విమర్శను అభివృద్ధి చేసిన వారు ఎందరో ఉన్నారు.
ఈ క్రమంలో కేతు విశ్వనాథరెడ్డి కూడా ఆ రెంటికీ ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సాహిత్యంలో సామాజిక సమస్యలు ప్రస్పుటం అవుతాయి కాబట్టి వాటిని విశ్లేషించుకోవడానికి సామాజిక శాస్త్రాలు అవసరం తప్పనిసరి అని కేతు విశ్వనాథరెడ్డి అభిప్రాయం. సాహిత్యంలోని సామాజిక జీవితాన్ని, అందులోని సమస్యను గుర్తించడానికి, అర్థం చేసుకోడానికి సామాజిక శాస్త్రాల పద్థతి లేకుంటే సాహిత్య విమర్శ సాహిత్యాన్ని పరిశీలించలేదు. సామాజిక శాస్త్రాల అవసరం రోజురోజుకు పెరుగుతున్నది రచయితలకైనా విమర్శకులకైనా.
ఒక రచనను విశ్లేషించేందుకు ఏ సామాజిక శాస్త్ర సహాయం కావాలో రచనలో వ్యక్తం అయ్యే సామాజిక అంశాలు నిర్ణయిస్తాయని కూడా కేతు విశ్వనాథరెడ్డి వివరిస్తారు. ఇందులో కూడా సమకాలీనంగా అభివృద్ధి చెందుతున్న సామాజిక శాస్త్రాలే అవసరం అవుతాయని అంటారు. విమర్శకుల సామర్థ్యాన్ని, అవసరాన్ని బట్టి ఎన్ని సామాజిక శాస్త్రాల సహాయమైనా తీసుకొని ఒక రచనను విశ్లేషించవచ్చు అని కూడా ఆయన అంటారు.
ఈ సూత్రీకరణల ద్వారా సంప్రదాయవాదుల సాహిత్య ప్రమాణాలను ఓడిరచే లక్ష్యం ఆయనకు ఉన్నది. వాళ్లు సాహిత్యేతర ప్రమాణాలు సాహిత్య అధ్యయనంలో ఉన్నాయని ఆరోపిస్తూ ఉంటారు. వాటి జోలికి వెళితే తమ కుల, వర్గ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది సాంప్రదాయవాదుల వాదన. కానీ సాహిత్యంలోని సామాజిక జీవితాన్ని అర్థం చేసుకోడానికి సామాజిక శాస్త్రాలు కావాల్సిందే అంటారు కేతు.
50 ఏళ్ల తెలుగు సాహిత్యంలో కథ అన్న మరో వ్యాసంలో కేతు విశ్వనాథరెడ్డి చేసిన ఒక ప్రతిపాదనను గమనించాలి. స్వాతంత్య్రానికి పూర్వం కథల్లోని తాత్వికత మూడు విధానాలుగా కనిపిస్తుంది అంటారు. ఒకటి: విశ్వనాథ ధర్మవాదం, రెండు: కుటుంబారావు సమిష్టి వాదం, మూడు: వ్యక్తి వాదం. ఈ కొత్త ఆలోచన కథా సాహిత్యంలో వచ్చిన పరిణామానికి ఉదాహరణ.
ఇంకో వ్యాసం నవల`నవలా పఠనం. ఇందులో ఒకటి: విషయ వాస్తవ స్థాయి, రెండు: వస్తు లక్ష్య స్థాయి, మూడు: సాహిత్య స్థాయి, నాలుగు: తాత్విక స్థాయి అని నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని చదివితే నవల శాస్త్రీయ అవగాహనకు పనికి వస్తుంది అని అంటారు. నిజానికి ఇవి విడివిడిగా చూడవలసిన అంశాలు కాదు. అన్నిటిని సమన్వయంలో చదవాలి. ఆనాటి అరసం చంద్రం, తుమ్మల, గజ్జల మల్లారెడ్డి ప్రధానంగా సంప్రదాయవాదులను పూర్వ పక్షం చేస్తూ విమర్శలు రాసిన వాళ్లే. ప్రత్యామ్నాయ బాటలు వేసిన వారు కాదు. సాహిత్య విమర్శను మలుపు తిప్పిన నక్సల్బరి తర్వాత అభ్యుదయ సాహిత్యకారుల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. దానికి అరసం వరుసలోని కేత విశ్వనాథరెడ్డి ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక శాస్త్రాలను ఆమోదించని వారికి, విమర్శకు అవి అవసరం లేదనే వారికి విశ్వనాథరెడ్డి వ్యాసాలు సమాధానం.
సాహిత్య విమర్శ అంటే సాహిత్య సామాజిక విమర్శ అని తెలుసుకోడానికి కేతు విశ్వనాథరెడ్డి వ్యాసాలు కావాలి. సాహిత్య జీవితంలో తన నమ్మిన విశ్వాసాలను అంటిపెట్టుకున్న విశ్వనాథరెడ్డికి జోహార్లు.