ఒకప్పుడు సుబ్రమణ్యం మా ఇంటికి రోజూ వచ్చేవాడు. ఎక్కువగా పొద్దున పూటే. ప్రత్యేకించి నాతో పనేమీ ఉండనక్కర్లేదు. అమ్మతో, జయతోనే పలకరింపు, అదీ ఎంత సేపు, అమ్మ ఇచ్చే కాఫీ తాగే వరకే. ఎప్పుడన్నా ఆలోగా బయల్దేరబోతే ‘సుబ్బూ కాఫీ తాగి వెళ్లూ..’ అని అమ్మ ఆపేది.

అట్లని తను మాకు చుట్టమేం కాదు. నా మిత్రుడు అంతే. ఎప్పటి నుంచో చెప్పలేను. గుర్తు చేసుకోలేను. అంతటి గతం.

ఆ మధ్య సొంత ఇల్లు కట్టుకొని మారిపోయాడు. అప్పట్లా రోజూ కాకపోయినా సుబ్రమణ్యం వస్తూనే ఉంటాడు.

1

రాత్రి పదిన్నరప్పుడు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటానో. అలాంటప్పుడు సత్తార్‌ నుంచి ఫోన్‌.

ఇప్పుడేమిటి? అనుకుంటూ ఎత్తా. ‘రేప్పొద్దున నీవు, జయా మా ఇంటికి రండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా..’ అని పెట్టేశాడు.
మా ఇద్దరి మధ్య ఓ కత నడుస్తోంది. దాని గురించే కావచ్చనుకున్నా.

నా పని ఒత్తిడంతా దూది పింజలా ఎగిరిపోయింది.

ఇంటికొచ్చాక ఆ సంగతి చెబితే తనూ ‘సరే వెళ్దాం. రేపు ఎట్లాగూ శనివారం. అత్తయ్య టిఫిన్‌ తినదు. మనకు సాబిరా పెడుతుందిగా…’ అంది ఉత్సాహంగా.

పొద్దున్నే మేం వెళ్లేసరికి సత్తార్‌ మా కోసమే ఎదురు చేస్తున్నట్లుంది. అట్లా కూచున్నామో లేదో సాబిరా రెండు ప్లేట్లలో ఇడ్లీలు తెచ్చి పెట్టింది.

‘నేను తినేశా..’ అని సత్తార్‌ కారు బైట పెట్టేందుకు వెళ్లాడు.

టిఫిన్‌ చేశాక చేయి కడుక్కోడానికి జయ సింక్‌ దగ్గరికి వెళ్లి, అటే వంట గదిలోకి వెళ్లింది. కాఫీ కలుపుతున్న సాబిరా తల‌ తిప్పి మెల్ల‌గా ఏదో చెప్పింది.

జయ కళ్లు మెరిశాయి.

ఆ మాట నాకూ వినిపించింది. బైటి నుంచి వచ్చిన సత్తార్‌ అది గమనించాడు. అప్పటి నుంచి జయ ముఖంలో అదే కాంతి.
స్లిప్పర్స్‌ వదిలేసి చెప్పులేసుకోడానికే వచ్చినట్లు వెంటనే సత్తార్‌ వాకిలి దగ్గర రడీగా ఉన్నాడు.

సాబిరా ఆప్యాయంగా జయను దగ్గరికి తీసుకుంది.

కార్లో మేమిద్దరం వెనుక కూర్చున్నాం.

సత్తార్‌ కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడాడు.

మేమూ ఏదో మాట్లాడాము. ఆ తర్వాత మళ్లీ మొదలు పెట్టాడు.

‘చిన్న పిల్ల అనుకోకుండా ఏదో జరిగిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చింది. భయపడి ఇంట్లో చెప్పలేదు. అంతా బైటపడేసరికి ఐదో నెల‌ దాటింది. పెండ్లి చేయాల‌ని చూశారు కానీ వాడు మోసం చేశాడు..’ అని తల తిప్పి మా వైపు చూశాడు.

మేం ఏమంటాం? అనే ప్రసక్తి లేనట్లుగా చెప్పాడు.

తనకు మా ఇద్దరి అంతరంగం అంత బాగా తెలుసు.

పది నిమిషాల్లో వెంకటరమణ కాలనీలోకి వెళ్లాం. ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ దగ్గర ఆపాడు. ఇంటి ముందు ఎప్పటి నుంచో ఉన్న మొక్కలు పచ్చగా మిస మిసలాడుతున్నాయి. మంచి పోషణ ఉంది.

కారు శబ్దానికే ఓ ముసలాయన బైటికి వచ్చాడు. తెల్ల‌టి వస్త్రాల‌తో, బంగారు వన్నెతో పండుబారి ఉన్నాడు. ముఖానికి గాంధీ అద్దాలు. పొడవాటి గడ్డం. బాగా చదువుకున్నవాడిలా, ధార్మికుడిలా అగుపించాడు.

లోపలికి వెళ్లి కూచోగానే సత్తార్‌ మా ఇద్దరినీ పరిచయం చేశాడు. నేనెంత సన్నిహితమో చెప్తూ నా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అప్పటికే అంతా చెప్పేసినట్లుంది… ఆయన పెద్దగా వివరాలేమీ ఆశిస్తున్నట్లు కనిపించలేదు. చాలా నమ్మకంగా, గౌరవంగా ఆ నాలుగు మాటలు విన్నాడు.

ఇక ఆయన గురించి సత్తార్‌ చెప్పడం మొదు పెట్టాడు.

‘సారు.. మా ఫాదర్‌కి బాగా తెలుసు. వాళ్లది చిన్నప్పటి స్నేహం. నా చిన్నప్పుడు సార్‌, ఆంటీ మా ఇంటికి వచ్చేవాళ్లు. మొదటి నుంచీ హైదరాబాదులోనే. కోడలు చాలా ఏళ్ల కిందే అనారోగ్యంతో చనిపోయింది. కొడుకు రెండేళ్ల కింద యాక్సిడెంట్‌లో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయి చనిపోయాడు. సార్‌ వాళ్లకు ఇంకెవరూ లేరు. మనవరాలు తప్ప. ఇందాక చెప్పానే, ఏదో అట్ల జరిగిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చాక బెంగుళూరు వెళ్లిపోయారు. అక్కడే డెలివరీ అయింది. నేనిక్కడ ఇల్లు చూస్తే వచ్చేశారు. పోయిన నెల‌లోనే హైదరాబాదులోని ఆస్తులు అమ్మేసుకున్నారు. తొందర్లోనే ఇక్కడి నుంచి కూడా వేరే వెళ్లిపోతారు. మనవరాల్ని మళ్లీ చదివించాల‌ని ఉంది. ఆ తర్వాత అన్నీ కుదిరితే పెళ్లీ అదీ..ఎట్లుంటదో చూడాలి..పాప మీకు ఓకే అయితే..’ అని ఆపేశాడు.

నేను ముసలాయన వైపే చూస్తున్నా. బహుశా జయ కూడా. అప్పుడాయన చాలా నిండుగా కనిపించాడు.

‘పాపకు ఎన్నెల్లు?’ జయ అడిగింది.

‘నాలుగో నెల ’ పెద్దాయన చెప్పాడు.

సత్తార్‌ ఇదంతా చెప్తున్నప్పుడు ఓ స్థూల‌కాయురాలు ఒకసారి లోపలి నుంచి వచ్చి వెళ్లిపోయింది.
ఆ ఇంత నిశ్శబ్దంలో లోపలి నుంచి పసిపాప అలికిడి. అద్భుతంగా ఉంది. పిల్ల‌లున్న ఇల్లెంత శోభాయమానంగా ఉంటుంది? ఈ సారి నా కళ్లలో జయ ఏదో చూసినట్లుంది.

నేను ఆత్రంగా ఉన్నానా? ఆయన అది గమనించాడేమో.

వెంటనే ‘చూస్తారా?’ అంటూ లేచాడు.

అది డబల్‌ బెడ్‌రూం ఇల్లు. లోపలి గదిలోకి తీసికెళ్లాడు. ముందు జయ, వెనుక నేనూ, సత్తార్‌.

మమ్మల్ని చూసి ఆ ఇద్దరు ఆడవాళ్లు కూచున్న చోటి నుంచి లేచారు. పెద్దావిడ మౌనంగా కిటికీ వైపు నడిచింది. ఆ అమ్మాయి మాత్రం భుజమ్మీది నుంచి చున్నీని తల‌ మీదిగా కప్పుకుంటూ నమస్కరించింది. అప్పుడామె పెదాలు వణికాయి.

గది మధ్యలో ఊయల‌.

అందులో పాప. అప్పుడే స్నానం చేయించినట్లుంది. ఒక రకమైన సుగంధం గది అంతా పరచుకొని ఉంది.

జయ ఊయల‌ దగ్గరికి వెళ్లి పాప బుగ్గను ముట్టుకొంది. అది చిన్న నోరు తెరిచి క్యార్‌మంది. ఎడమ చేత్తో చెవుల‌ మీద టపటప కొట్టుకొని ఓ అద్భుత విన్యాసం చేసింది.

నేను పాప పాదాల‌ను, చేతివేళ్లను స్పృశించాను. అపురూపమైన మెత్తన.
ఆ అమ్మాయి ఒకలాంటి మంద్రమైన నవ్వుతో ఊయల‌ దగ్గరికి వచ్చింది.
జయకు ఏం మాట్లాడాలో తోచినట్లు లేదు. నాక్కూడా అంతే.
‘ఏం పేరు పెట్టారు?’ అని తనే అడిగింది.
‘మీరే పెట్టాలి’ నిర్మలంగా అని జయ చేయిపట్టుకుంది.
గది అర నిమిషం పాటు మౌనం దాల్చింది.

‘సత్తార్‌ అంకుల్‌ మీ గురించి ఎన్నిసార్లు చెప్పారో. మీరు తన చెల్లెలిలాంటి వాళ్లని అన్నారు. మీ దగ్గర ఉంటే నా వడిలో ఉన్నట్లే అన్నారు..’ చివరి మాట ముగించలేకపోయింది. గొంతు జీరపోయింది. ముసలామె సముదాయించింది.

జయ ఈ పక్కకు వచ్చి ఆమె తల‌ మీద చెయి వేసింది.

ఆమె ఎంత తమాయించుకోవాని ప్రయత్నించిందో. చేతకాలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. చున్నీ ముఖానికి కప్పుకుంది.

సత్తార్‌ ముందుకు వచ్చి ‘ఏందిది, వాళ్లేమనుకుంటారు?’ అని చనువుగా అన్నాడు.

ఆమె కళ్లు తుడుచుకుంది. పాపను ఊయల‌లోంచి తీసి జయకు అందించింది.

వాళ్లెంత దృఢ నిశ్చయంతో ఉన్నారో, సత్తార్‌ వాళ్లకు ఎంత భరోసా ఇచ్చి సిద్ధం చేశాడోగాని ఆ ముసలావిడ నిండుగా నవ్వుతూ ‘అల్లా నీకిచ్చిన బిడ్డ’ అని జయ తల‌ మీద, పాప తల‌ మీద చేతులు వేసి ఆశీర్వదిస్తున్నట్లుగా అంది.

‘మనం బైటికి పోదాం పదా. వాళ్లు కాసేపు మాట్లాడుకుంటారు..’ అని సత్తార్‌ బైటికి నడిచాడు.

మేం బైట కూచున్నాం. నాకు మాటలు రాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా బాగుండదు…అనిపించింది.

ఇంక ఉండబట్టలేక ‘ఎప్పుడు తీసికెళ్లవచ్చు?’ అని అడిగాను.

ఆయన ఏమీ అనకముందే సత్తార్‌ ‘ఇప్పుడే తీసికెళ్దాం. సార్‌ వాళ్లు ఈ వారంలోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు..’ అన్నాడు.

ఆయన కూడా అవునన్నట్లు చూశాడు.

లోపల‌ అదే నడుస్తున్నట్లుంది.

కాసేపయ్యాక పెద్దావిడ బైటికి వచ్చింది. పాపతో జయ. వెనుక తల్లి.

రెండడుగులు వేసి జయ తల‌ తిప్పి తల్లి వైపు చూసింది.

ఆమెనలా చూస్తోంటే నాకు చాలా దు:ఖమనిపించింది.

జయ పాపను పెద్దావిడ చేతికి ఇచ్చి ఆమెను హృదయానికి హత్తుకుంది. అంతే. ఆమె అలా ఏడుస్తూ కర్చుకపోయింది.

నేను కూచున్న చోటి నుంచి ఎప్పుడు లేచానో. అప్రయత్నంగానే.

‘నాకు తెలుసు. . నాకు తెలుసు’ అని జయ అనునయంగా అంది.

ఒక నిమిషమయ్యాక ‘ఇది మాకు అదృష్టమే. కానీ నీ దు:ఖాన్ని ఎన్నటికీ మర్చిపోం. అది మమ్మల్ని హెచ్చరిస్తుంటుంది. నీ దు:ఖం నన్ను తల్లిని చేస్తోంది. నీ పాపను, నీ బాధను నేను గుండెల్లో దాచుకుంటాను..’ అన్నది తనూ ఏడుస్తూ.

పెద్దావిడ వచ్చి జయ భుజం మీద తల వాల్చింది.

ఎందుకో ఆ క్షణాన ఇది ఇట్లా జరగాల్సిందేనా? అనే మీమాంస నాలో తలెత్తింది. తట్టుకోలేకపోయాను.

పాప లేచి ఒక్క క్షణం క్యార్‌మని మళ్లీ నిద్రలోకి జారుకుంది.

అన్నిటికీ తెర తీస్తూ సత్తార్‌ వాకిటి వైపు నడిచాడు. తన పక్కనే లేచి నిలుచున్న నా మనో శరీర ప్రకంపనల్ని గమనిస్తున్నట్లుంది. వాటి అర్థాలు పసిగడుతున్నట్లుంది. ఇక జాగు చేయకూడదనుకున్నాడేమో.

ముసలాయన కూడా లేచి కదిలాడు. ఆ కుర్చీల‌ మధ్య నేనొక్కడినే. చాలా భారంగా ఉంది. ఒక సంబంధాన్ని తెంచివేస్తున్నప్ప‌టి ఒత్తిడి. ఇలా చేయడం సహజమా? నైతికమా? దేనికి ఇదంతా? ఆ వైపు గురించి సత్తార్‌ చెప్పినవేవీ నాకు గుర్తు లేనేలేవు.

కానీ ఆ పెద్దాయన ముఖం అప్పుడు గంభీరంగా ఉందేగాని తేలికపడ్డట్లూ ఉంది. ఆ పెద్దావిడ కళ్లలో కూడా.

పాపను జయ చేతుల్లో పెట్టేసింది. ఏదో గుర్తుకు వచ్చినదానిలో గబగబ లోనికి వెళ్లింది. ఓ చిన్న బ్యాగు తెచ్చి నా చేతికి ఇచ్చింది. ‘పాప బ‌ట్ట‌లు’ అనింది.

మరోసారి లోనికి వెళ్లి ఓ సన్నటి బంగారు గొలుసు తెచ్చి పాప మెడలో వేసి ముద్దు పెట్టుకుంది.

తల్లి వైపు పరీక్షగా చూశాను.

ఇప్పుడు ఆమె కూడా తేలికపడ్డట్లనిపించింది. ఎంత లోతైన మన:స్థితి అది. బాధ, ఊరట కల‌గల‌సిన తేట ముఖం.

2

సుబ్రమణ్యం చాలా మెత్తటి మనిషి. ఆయనతో ఉంటే చాలు.. ఆయన సొంత ప్రపంచంలోని మనుషులందరూ మనకు సన్నిహితులైనట్లే. మా ఊరికంటే వాళ్ల ఊరి భూగోళమే నాలో బాగా ముద్రించుకపోయింది. ఇది చాలు ఆయన ఎలాంటి వాడో చెప్పడానికి.

‘నీవు నమ్ముతావో లేదోగాని.. ఊరి మీదికి మనసు పోతే ఇక నిద్రపట్టదు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఊరికి పోదామా? అనిపిస్తుంది. ఊరిని కావలించుకోవానిపిస్తుంది..’ అంటాడు.

‘నాకు మా నాయన మనస్తత్వం వచ్చిందని అంటారు. ఆయన ఉంటే చుట్టూ ఉన్న వాళ్లకు నిశ్చింత. ఆ రోజుల్లో ఎంత జీతం? ఫ్రెండ్స్‌కో, కొలీగ్స్‌కో ఒంట్లో బాగా లేదని తెలిస్తే జేబులో డబ్బు పెట్టుకొనే బయల్దేరేవాడు. మనుషులంటే అంత ఇది. కానీ నా చిన్నప్పుడు మా క్లాస్‌మేట్‌ బర్త్‌డేకి వెళ్లి వాళ్లింటో తిన్నాను. వాళ్లు మాల వాళ్లని ఆరోజు మా నాయిన నన్ను బెల్ట్‌తో కొట్టాడు. నాకు ఎంత బాధయిందో’

ఆ సంఘటన ఇప్పుడే జరిగినట్లు చెప్తుంటాడు.

సుబ్రమణ్యం అంతే.

తను కాస్త పాటగాడే. నలుగురం తీరిగ్గా కలిశామంటే ఇష్టంగా గొంతెత్తుతాడు. పాత సినిమా పాట‌లు అందుకుంటాడు. చివర్లో దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అని ఒక రకమైన ల‌యాన్విత స్వరంలో పాడతాడు. సుబ్రమణ్యం పరిచయమైతే చాలు.. ఎవరికైనా ఇట్టే ఆయన టేస్టు కూడా తెలిసిపోతుంది. ఎంత మందిలో ఉన్నా స్పెషల్‌గా ఉంటాడు. మాటలో, మన్ననలో, ఆలోచనల్లో.

సుబ్రమణ్యాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు.

అలాంటి మనిషికి పిల్లంటే ఎందుకు ప్రేమ ఉండదు. మా ఇంటికి వచ్చాడంటే బంటీ లేదా? అని అడుగుతాడు.

అది మా పక్కింటి పిల్ల‌. అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగులు. నాలుగ్గంటకే స్కూలు బస్సు వచ్చి దించేసి పోతుంది. సరాసరి మా ఇంట్లోకే వస్తుంది. అమ్మ కాళ్లూ చేతు కడుక్కోమంటుంది. తినడానికి స్నాక్స్‌ పెడుతుంది. బంటీ ఒకటో క్లాస్‌లోకి వచ్చింది. ఒకటే ముచ్చట్లు చెబుతుంది. అమ్మకు దానితో పెద్ద కాల‌క్షేపం. అది మాటలు చెప్పడమంటే కతలు చెప్పడమే. ఊరక చెబుతుందా? ఎన్ని హావభావాలో. గదిలో అటు ఇటూ తిరుగుతూ, కాళ్లూ చేతులు ఊపుతూ, గంతులేస్తూ, కూచుంటూ లేస్తూ, చేతుల‌ వేళ్లతో లెక్కలేనన్ని ముద్రలు చూపుతూ, కళ్లతో, పెదాల‌తో, నోటితో .. అబ్బ చెప్పనవి కాదు. దాని కథల్లో జంతువులు మనుషుల్లా మాట్లాడతాయి. మనుషులు పక్షుల్లా, జంతువుల్లా ప్రవర్తిస్తారు. కొన్ని సార్లు రెంటిలోనూ రెండు క్షణాలు కలిసిపోతాయి.

వాళ్లమ్మ వచ్చి పిల్చేదాకా మా ఇంట్లోనే దాని మకాం.

సుబ్రమణ్యం వచ్చాడంటే బంటీతో కబుర్లు చెప్పకుండా వెళ్లడు. ఆ పిల్ల అమ్మానాన్న‌ల‌ను ఎప్పుడైనా చూశాడో లేదో. సుబ్రమణ్యానికి ఆ అవసరమే ఉండదు.

సుబ్రమణ్యం అంతే.

3

పాప వచ్చాక మా ఇల్లు కొత్త ప్రపంచంగా మారిపోయింది. ప‌సి పిల్ల కొత్తగా వచ్చిందా? లేక మేం ముగ్గురం పిల్ల‌ల‌మైపోయామా? మా అమ్మ కాస్త సీరియస్‌ టైప్‌. పాపను ఆడిస్తున్నప్పుడు ఆమె కూడా చిన్నపిల్ల అయిపోయేది.

‘ఈ దెబ్బతో నీ చదువు, రాత అన్నీ బంద్‌..’ అనడం మొదలు పెట్టింది జయ.

అంతక ముందు పిల్ల‌ల కోసం నేను కన్న కలల‌న్నీ చెప్పేవాడ్ని.

‘ఇంత బాధ ఎందుకు? ఎవర్నన్నా పెంచుకుంటే పోలా? మీ అమ్మ కూడా హాపీ అవుతుంది.’ అనేది.

అదే ఇక్కడి దాకా వచ్చింది. అనేక ప్రయత్నాల‌ తర్వాత.

రాత్రిళ్లు పాప ఏడుస్తోంటే ‘నీకింక నిద్ర ఉండదు. పిల్ల‌ల గురించిన కల‌లూ ఉండవు’ అని నవ్వేది.

రాత్రి ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు బస్టాండ్‌ దగ్గర టీ తాగడానికి ఆగాను. ఆ పక్కనే బస్సులు ఆగి ప్యాసింజర్లను దించేసి లోపలికి వెళతాయి. అక్కడ ఓ మూడేళ్ల పాప నిల‌బడి ఏడుస్తోంది. అరె.. పాప.. అని దగ్గరికెళ్లాను. తల్లి అక్కడెక్కడో ఉంటుందని చూశా. ఎంతకూ రాలేదు. కొంపదీసి ఈ అర్ధరాత్రి ఎవరైనా దుర్మార్గులు..

నేనిలా ఆలోచిస్తోంటే, అక్కడే టీతాగి వెళ్తున్నవాళ్లు ‘ఎవరో మహాతల్లి వదిలించుకొని వెళ్లిపోయినట్లుంది..’ అన్నారు.

ఏం జరిగిందో మరి. ఎవ్వరూ లేరు. పాపను ఊరుకోబెట్టే సరికి నా పని అయిపోయింది. ఓ గంట చూసి పాపను తీసుకొని ఇంటికి వచ్చేశాను.

ఇది నిజం కాదు. కల‌.

ఓ రోజు మధ్యాన్నం అన్నం తిని ఏదో చదువుకుంటూ కునుకు తీశా. ఇంతలో తలుపు ఓరగా తెరుచుకొని పిల్ల‌ల గుంపు. మెల‌కువ వచ్చింది. అంతా రెండు మూడేళ్ల వాళ్లే. అందరూ దిశ మొలతో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రంగు. ఇంద్రధనస్సు వర్ణాల్లా. అందరి చేతుల్లో పచ్చని ఆకులు, పూలు ఉన్న చెట్ల కొమ్ములు.

అరె పిల్ల‌లు అని లేచి వాకిట్లోకి వెళ్లాను.

ఇది కూడా నిజం కాదు. కలే.

‘నిజంగా ఇదంతా కల‌లాగే ఉంది..’ అని ఇప్పుడు పాపను అమ్మ ముద్దాడుతోంది.

4

సుబ్రమణ్యానికి కూడా తెలిసింది.

‘మంచిదే. కానీ ఎవరూ లేనట్లు తురకోల్ల పిల్ల ఏందీ?’ అన్నాడట.

అరె.. తనకు ఏమైంది? అన్నా కంగారుగా ఆ మాట చెప్పిన మనిషితో.

‘నీకు తెలియదులే’ అని అతను నవ్వేశాడు.

ఇదెక్కడి గోల‌. నాకు చప్పున అర్థం కాలేదు. కానీ సుబ్రమణ్యం అన్నమాట లోతుగా కుచ్చుకపోయింది. అబ్బ.. ఒక్క మాట చాలు కదా.

ఆ సంగతి సత్తార్‌కు కూడా తెలిసింది. ‘ఆయనకు దేశభక్తి జాస్తిలే’ అన్నాడు.

జయతో చెప్పాను. అసలేమీ విననట్లుగా ముఖం తిప్పుకుంది.

ఇంట్లో మనిషి లాంటి వాడు కదా. కొంపదీసి అందుకేనా ఇంతక ముందులాగా తరచూ రావడం లేదు. పాపను చూడ్డానికి తెలిసిన వాళ్లంతా వచ్చారు.

ఎప్పటికో సుబ్రమణ్యం కూడా వచ్చాడు.

అమ్మ పాపకు స్నానం చేయించి లోపలికి తీసికెళుతోంటే ఆరాగా చూశాడు. ఒక్క మాటైనా అనలేదు. జయ గమనించింది. అదే బంటీ గురించైతే ఒకటే ఆరా తీస్తాడు. అది కనిపిస్తే వదిలిపెట్టకుండా ముచ్చట చెబుతాడు.

లోప పాప ఏడుస్తోంది.

ఒక్క మాటైనా అనకపోతే ఎలా అనుకున్నాడేమో.

‘పిల్ల‌ల‌ ఏడుపులో ఓ రకమైన సౌందర్యం ధ్వనిస్తూ ఉంటుంది’ అన్నాడు నన్ను ఉద్దేశించి.

భలే అబ్జర్వేషన్‌.. అనిపించింది.

‘పిల్ల‌లు ఎంత ఏడ్చినా, నవ్వినా కంట తడి పెట్టరు. కన్నీళ్లు భావాల‌నుబట్టి ఉంటాయి. పిల్ల‌లు సోషలైజ్‌ అయ్యాకనే కన్నీళ్లు వస్తాయి…’ అన్నాడు.

నిజమే. పాప ఒకటే మారాం చేస్తోంటే అమ్మ ఆ మధ్య అన్నది. ‘కంట తడి లేదు, కడుపులో దు:ఖం లేదు’ అని. ఆ మాట వినడం అదే. పొయెటిక్‌గా చెప్పింది కదా? అనుకున్నా. ఇప్పుడు సుబ్రమణ్యం బోలెడు ఎనాసిస్‌ ఇచ్చాడు.

సుబ్రమణ్యం అంతే.

పాప గురించి చేసిన కామెంట్ వ‌ల్ల నాకైన గాయానికి ఇలా ఈ మాటతో మలాం రాశాడని అనిపించింది.

ఈసారి కాఫీ తాగకుండానే వెళ్లిపోయాడు.

5

ఆదివారం.

బంటీ వాళ్లమ్మకు సెల‌వు. నాన్నకు డ్యూటీనే. ఆమెకు వారం పనంతా సగబెట్టుకోక తప్పదు కదా. బంటీ మా ఇంట్లోకి వచ్చేసింది.

ఇప్పుడు దాని కథల్లో పాప కూడా పాత్ర అయిపోయింది. దాని కథల‌కు శ్రోత కూడా అయిపోయింది. అరగంట నుంచి ఏదో ముచ్చట చెబుతూనే ఉంది. వింటూనే పాప నిద్రపోయింది. ఇంకేం చేస్తుంది? అమ్మ దగ్గరికి వచ్చేసింది.

నాకు ఆఫీసు టైం అయింది. రడీ అవుతున్నా. అమ్మ టీవీ చూస్తూ బంటీ మాటలు వింటోంది. ఈలోగా సుబ్రమణ్యం వచ్చాడు. నన్ను కేకేసి పల‌కరించాడు. టీవీ చూస్తూ సెటిలైపోయాడు. బంటీ చానల్స్‌ మారుస్తోంటే దాని చేతి నుంచి రిమోట్‌ తీసుకున్నాడు. వెనక్కి తిప్పాడు.

రాజ్యసభ సెషన్స్‌ వస్తున్నాయి. అమ్మ కూడా అదే చూస్తోంది.

నేను హాల్లో ఆ మూల‌ సింక్‌ దగ్గర షేవ్‌ చేసుకోడానికి సిద్ధమయ్యా.

టీవీలో ఆయన గంభీరమైన హిందీలో ప్రసంగిస్తున్నాడు. రాజకీయ సంప్రదాయాలు, విలువ‌లు, ప్రవర్తనలు..చాలా హైట్స్‌లో ఉన్నాడు.

బంటీ అమ్మ పక్కనే సోఫాలో కూర్చొని నేల‌కు కాళ్లాడిస్తూ టీవీ చూస్తోంది.

సభలో గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు సన్నివేశం.

బంటీ ఉన్నట్లుండి ‘పులికి గడ్డం వచ్చేసింది’ అని పకపకా నవ్వేసింది.

గడ్డానికి షేవింగ్‌ క్రీం రాసుకుంటున్న నేను హతాసుణ్నయ్యాను.

ఏమి దీన్ని ఊహాశక్తి! అని అద్దంలోంచే బంటీ వైపు చూశా. అది టీవీలోని ఆయన వైపు, నా వైపు మార్చి మార్చి చూస్తోంది.

‘పులికి గడ్డం రావడం ఏమిటే, నీ దుంపతెగ’ అని అమ్మ దాన్ని మురిపెంగా దగ్గరికి తీసుకుంది.

తినేవి ఏవో జయ ముగ్గురికీ తీసుకొచ్చి పెట్టింది. కానీ సుబ్రమణ్యం ఆ ధ్యాసలోనే లేడు. టీవీలో లీనమైపోయాడు.

సభలో ఆయన నబీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ` అది రాజకీయాల‌కు అతీతమైనదని, ఎన్నటికీ మర్చిపోలేనిదని, ఆయన లేని లోటు ఈ సభలో తీర్చలేనిదని, తన జీవితంలో ఎన్నటికీ భర్తీ కాలేనిదనీ, కశ్మీర్‌ తన హృదయ పీఠమనీ.. ’ ఇంకా తాదాత్యంగా చెబుతుండగా ఆయన గొంతు పూడకపోయింది.

నేను షేవింగ్‌ ఆపి ఒకింత ఆసక్తిగా తిరిగి చూశాను.

…ఆయన మాట ఒణికింది. చాలా ప్రయత్నించాడు. కానీ చేతకాలేదు. ఆ క్షణాన తప్పించుకోలేని దు:ఖమూ, ఇది అనివార్యమైనదనే ఎరుక, దేశ ప్రజలందరూ చూస్తుంటారు కదా అనే అప్రమత్తత, తన లోలోపలిదంతా దాగని ఉద్విగ్నత.. ఇలా అనేక భావాలు కనిపించాయి. కంట తడిపెట్టాడు.

అలా గంభీరంగా కొద్ది సేపు ఉండిపోయాడు. అద్దాలు తీసి కండ్లు ఒత్తుకున్నాడు.

‘పులి ఏడుస్తోంది’ బంటీ టక్కున అనేసింది.

దాని మాట వినపడనంతగా ఆ ప్రసంగంలో సుబ్రమణ్యం లీనమయ్యాడు.

ఆ మాటను రిసీవ్‌ చేసుకొనే వాళ్లు లేరేమో అని దానికి తెలిసిందా? ఏమో మరి. గమ్మున ఉండిపోయింది.

టీవీలో ఆయన కన్నీటి మౌనం, బంటీ విసిరిన మాట, ఆ తర్వాత మళ్లీ మౌనం.. అన్నీ క్షణా వ్యవధిలోనే.. .దాన్ని బద్దలు కొడుతూ సుబ్రమణ్యం బళ్లున ఏడ్చేశాడు.

ఊహించనిది కదా. ఏం జరిగిందో తెలుస్తునే ఉన్నా.. ఆందోళన. నేను రేజర్‌ పడేసి అప్రయత్నంగానే హాలు మధ్యలోకి రెండడుగులు పరుగు తీశా.

ఏమైంది? అంటూ జయ వంట గదిలోంచి వచ్చేసింది.

అమ్మ బీరుపోయింది.

బంటీ సంగతి చెప్పనవసరం లేదు.

సుబ్రమణ్యం ఆ మరు క్షణమే తమాయించుకున్నాడు. కర్చీప్‌ తీసుకున్నాడు. కళ్లు తుడుచుకున్నాడు.

చెట్టంత మనిషి, అలా దు:ఖిస్తే, కన్నీరు కారిస్తే? జయ ముఖం అంతా విషాదం పరుచుకుంది.

‘ఊరుకో సుబ్బూ.. ఊరుకో.. ’ అని అమ్మ బాధ పడుతూ ఓదార్చింది.

బంటీకి పులి ఏడ్చిందని చెప్పగల కాల్ప‌నిక‌తే ఉన్నది కానీ, సుబ్రమణ్యం కంట తడికి అర్థం ఏం తెలుసు? సోఫాలో ఒదుక్కుపోయింది. దు:ఖిస్తున్న సుబ్రమణ్యానికి హాల్లో ఒకలాంటి సమ్మతి, సహానుభూతి.

కొన్ని క్షణాల్లోనే జయ తేరుకొంది. ఏమిటిది? అన్నట్లు సుబ్రమణ్యం వంక విసుగ్గా చూసింది.

గదిలో పాప ఎప్పుడు లేచిందో.

పక పక నవ్వులు వినిపిస్తున్నాయి. అది సోషలైజ్‌ కానందుకేమో. నా చెవుల‌కు మహాద్భుత నిసర్గ సౌందర్య ధ్వనిలా తోచింది.

టీవీలో ఆయన మిగతా ప్రసంగం వినబడటమే లేదు.
పాప నవ్వులు, కేరింతలు తప్ప.

One thought on “సుబ్రమణ్యం కంట తడి

  1. ‘సుబ్రమణ్యం కంట తడి’ కథ చాలా బాగుంది. ఊరకనే అనడం గాదు. కథను అనేక పొరల్లో చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. విభిన్న వర్గాలుగా, సమూహాలుగా విభజితమైన సమాజంలో మనుషుల్లోని మంచి, చెడులు సరిగ్గా గీత గీసినట్టుగా తేట తెల్లంగా ఉండవు.అవి పరస్పరం కలగలసి పోయి సంకీర్ణంగా, అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. అవి మనుషుల భావాల్లో, భావజాలాల్లో ఎలా ప్రతిఫలించగలవో కథ తెలిపింది. ముఖ్యంగా మార్పు కోసం జరిగే పోరాటాన్ని, ప్రత్యేకించి సాంస్కృతిక రంగంలోని వర్గాపోరాటాన్ని ఎంత సునిశితంగా చూసి, ఎంత లోతుగా అర్థం చేసుకోవాలో, అందుకు ఎంత సహిష్ణుత అవసరమో కూడా కథ హెచ్చరిస్తుంది. అలాగే వర్గ సమాజంలోని సోషలైజేషన్ ప్రభావాలు మనుషుల భావాల్లో ఎలాంటి రూపం తీసుకుంటాయో, వాటి పట్ల కూడా మార్పు కోరేవాళ్ళు, మార్పుకై పోరే వాళ్లు ఎలాంటి వైఖరితో వ్యవహరించాలో ఈ కథ హెచ్చరిస్తున్నట్టనిపించింది. ఇంకా చాలా… చాలా… రాయొచ్చు. ఇప్పటికింతే.

Leave a Reply