పెట్రోలు ధరలు పెరిగాయని మా ఆయన స్కూటరు వొదిలి సైకిలు యెక్కాడు.

దారికాసిన పోలీసులు సైకిలు లాక్కున్నారు.

మా ఆయన హెల్మెట్ లేదనేమోనని అనుమానించి, హెల్మెట్ తెచ్చుకుంటాను అన్నాడు. వినలేదు. బెల్లే హారన్ అని ట్రింగు ట్రింగుమని కొట్టి చూపించాడు. వినలేదు. లైట్ వేసి చూపించాడు. వినలేదు. టూవీలర్ ఫోర్వీలర్ లైసెన్స్ వుంది, సైకిలుకి లైసెన్స్ తీసుకుంటాను అన్నాడు. వినలేదు. మేం త్రిబుల్స్ వెళ్ళడం లేదు కదా అన్నాడు. అయినా వినలేదు.

పోన్లే సైకిలు తీసుకుంటే తీసుకున్నారు. నడిచిపోతానని మా ఆయన బుద్ధిగా నడిచి వెళ్ళిపోతున్నాడు.

అప్పుడు పోలీసులు యెవరికో ఫోను చేశారు. వాళ్ళు వచ్చి మా ఆయన్ని వాసన చూశారు. నడుస్తున్న మా అయన నీడని ఫోటోలు తీశారు. వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆపై పట్టుకున్నారు. కేసు పెట్టారు. లోపలేశారు.

పిల్లల్ని కడుపులో పెట్టుకున్నాను. వాళ్ళ కడుపులోని ఆకలి నీరసాన్ని బయటపెట్టింది. అందరూ తోటకూర మొక్కల్లా వేళ్ళాడిపోయారు.

వంట చెయ్యబోతే గ్యాసు పొయ్యి మీద చేస్తావా అని మా అత్త భగ్గుమంది. రోజుకో తీరున సిలండరు పేలుతూ వుంటే నీకా చేతులతో వంటెలా చెయ్యబుద్ది అవుతోంది అంది, కొడుకుని గురించిన దుఃఖం మరిచిపోయి మరీ. అప్పటికీ వొళ్ళు మండి పచ్చివి తినలేం కదా అన్నాను. ఎనకటికి గ్యాసు స్టవులమీద వండి తిని బతకలేదు… అని మూతి మూడు వంకర్లు తిప్పింది. మూడు రాళ్ళు తెచ్చి పెట్టింది.

కట్టెలకోసం అడవికి వెళ్తే ఎన్కౌంటర్ చేస్తారన్నాడు మా చిన్నోడు, నా పైట కప్పుకొని.

కర్రల పొయ్యి అయితే కాలుష్యం కింద కేసులు పెడతారు అన్నది నా పెద్దకూతురు. ఇంటిని ఢిల్లీ చేసేస్తావా… అని గొణిగింది జడ అల్లుకుంటూ.

ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అని తిట్టుకుంటూ మా అత్త పొయ్యిలో కాళ్ళూ చేతులూ పెట్టి వంట చేసింది.

జగన్మోహిని సినిమా చూసినట్టే చూశారు పిల్లలు.

పోలీసులు వచ్చేశారు. మా వాలకాల్ని యెగాదిగా చూశారు. ఎప్పట్లాగే యెవరికో ఫోను చేశారు. వాళ్ళు వచ్చి మా అత్తని వాసన చూశారు. కాలుతున్న మా అత్త కాళ్ళని ఫోటోలు తీశారు. వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆపై పట్టుకున్నారు. కేసు పెట్టారు. లోపలేశారు.

మా ముసల్ది మా కానిది, నా కొడుకుతో పాటు నేనూ లోపల వుంటాను అని వాళ్ళ వెనుక యెగేసుకుంటూ వెళ్ళిపోయింది.

ఇంట్ల వుండడం వల్లకానిపని అనిపించింది. అందుకే యే గుడో చూసుకోవాల… అన్నానో లేదో అయోధ్య రామాలయం చందా యిమ్మన్నారు వచ్చిన మంద.

నాకు సర్రున కాలింది. దేవుడు దిబ్బైపోయిన దేవుడు, యెక్కడ వున్నాడు… అన్నాను. అంతే-

పోలీసులు వచ్చేశారు. నా వాలకాల్ని యెగాదిగా చూశారు. ఎప్పట్లాగే యెవరికో ఫోను చేశారు. వాళ్ళు వచ్చి నన్ను వాసన చూశారు. మండిపోతున్న నా ముఖాన్ని ఫోటోలు తీశారు. వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆపై పట్టుకున్నారు. కేసు పెట్టారు. లోపలేశారు.

కోర్టులో యింటిల్లిపాదినీ ప్రవేశ పెట్టారు. పిల్లలేం తప్పు చేశారని అడగకుండా వుండలేకపోయాను.

బ్రెడ్డు కోసం పిల్లలిద్దరూ టీ అమ్ముతున్నారని లాయర్లు చెప్పడం యింకా పూర్తి కాలేదు. అందులో తప్పేముంది అంది మా అత్త. నోర్ముయ్యమని సిబ్బంది జడ్జిగారి ముందు వీడియో ప్రదర్శించారు.

ఆ వీడియోలో టీ అమ్ముతూ ఆగిన అక్కాతమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కా, నేను టీ అమ్ముతా అన్నాడు తమ్ముడు. టీ అమ్మి మనం పైకి రావాలి అంది అక్క. టీ అమ్మడం వస్తే దేన్నయినా అమ్మడం వచ్చేస్తుంది యెంతో నమ్మకంతో అన్నాడు తమ్ముడు.

మళ్ళీ మళ్ళీ అదే బిట్ రిపీట్ అవుతోంది.

ఈ వీడియో వైరల్ అయి దేశం పరువు పోతోందని అభియోగం మోపుతూ ఆరొందల పేజీల డాక్యుమెంట్లు అందించారు వొక అధికారి. ఉపా పెట్టాలి అని ఆయన అంటుంటే బాబ్బాబు తొందరగా  పెట్టండి, తినేసి వెళ్ళిపోతాం అంది మా ముసల్ది. ఉప్మా యేదోవొకటి… అని గొణిగింది.

మేం నిరసన కారులమని మా జీవన విధానమే చెపుతోందని, అలాంటి వాళ్ళకు యెలాంటి పిల్లలు పుడతారని కూడా అంటూ వుంటే నేనూ మా ఆయనా కొయ్యబారిపోయాం.

ఉప్మా పెట్టండి బాబూ… మధ్యలో ముసల్ది.

జడ్జిగారు మమ్మల్ని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ‘నెక్స్ట్’ అని తరువాత కేసుని పిలిచారు.

Leave a Reply