రష్యాలో వానబడితే మనదేశంలో కమ్యూనిస్టులు గొడుగుపడతారు అని 1955కు ముందు ఇండియాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు వ్యాఖ్యానించే వాళ్లు. నిజానికి బోల్షివిక్ విప్లవం తర్వాత ఆరేళ్లకు గానీ ఇక్కడ కమ్యూనిస్టుపార్టీ పుట్టలేదు. లెనిన్ బతికుండగానే ఇండియా నుంచి ఎం.ఎన్.రాయ్ ఆసియా ఖండంలోనే మొదటివాడుగా ఇక్కడికి కమ్యూనిస్టుపార్టీని తెచ్చాడుగానీ ఆయనే అందులో నిలవక ఆ తర్వాత రాడికల్ హ్యూమనిస్ట్‌పార్టీ పెట్టి వేరుపడ్డాడు. అయితే బ్రిటిష్ సామ్రాజ్యవాద వలసపాలన దమనకాండ భరించచలేని ప్రజలు, ముఖ్యంగా జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఇంచుమించు అదేకాలంలో జరిగింది గనుక బోల్షివిక్ విప్లవంతో చాల ఉత్తేజితులయ్యారు. లెనిన్‌ను పీడితప్రజల, శ్రామికవర్గాల విముక్తిప్రదాతగా చూడసాగారు. అమెరికాలో ఉన్న సిఖ్కు మేధావులు కొందరు 1905 రష్యన్ విప్లవంతోనే ఉత్తేజితులై గదర్‌పార్టీ ఏర్పాటు చేసి దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని సాయుధంగా (తిరుగుబాటు లేదా విద్రోహం ద్వారా) కూల్చాలని వస్తున్న క్రమంలో వారిని ఓడలోనే అరెస్టు చేసి బంధించారు. అప్పటి మద్రాసు ప్రావిన్సు నుంచి నెల్లూరుకు చెందిన దర్శి చెంచయ్య కడలూరు జైల్లో ఉన్నపుడు ‘నేను-నాదేశం’ అని తన ఆత్మకథ రాసాడు.
అయితే 1930లలో గానీ ప్రపంచమంతా ఆర్థికమాంద్యంలో సంక్షోభానికి గురయి ఉండి రష్యాలో మాత్రమే ధరల స్థిరీకరణ, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండడం, అందరికీ ఉద్యోగభద్రత, జీవనభద్రత, నివాసభద్రత ఉండడం, మనదేశంలో సామాన్యప్రజలందరూ రష్యాలో అద్భుతమైన ప్రజానుకూల ప్రయోగం జరుగుతున్నదని ఒక ఆశాకిరణాన్ని చూసారు.
ఇంక స్పెయిన్ అంతర్యుద్ధంలో ప్రజలకే కాదు బుద్ధిజీవులకు కూడ ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిజం ఒక్కటే ప్రత్యామ్నాయమని అర్థమైంది. అందుకే 1936లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో సుప్రసిద్ధ రచయిత అన్‌టచబుల్ (అంటరానివాడు) అనే నవల రాసిన ముల్కరాజ్ ఆనంద్ ఇంటర్నేషనల్ బ్రిగేడ్‌లో చేరి స్పెయిన్ యార్డ్స్‌తో పాటు అంతర్యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లాడు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో బాలగంగాధర తిలక్ మొదలు గాంధీ వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనను కేవలం వలసపాలనగా చూసారు. దేశానికి డొమినియన్ స్టేటస్ మాత్రమే కోరారు. పైగా వీళ్లంతా ఇపుడు మన ఎన్నికలపార్టీలు మాట్లాడుతున్న భాషలో చెప్పాలంటే సాత్విక (సాఫ్ట్) హిందుత్వ లేదా కరడుగట్టిన (హార్డ్) హిందుత్వ అనే అర్థంలోనే జాతిని నిర్వచించారు. తిలక్ స్వయంగా భగవద్గీతకు ‘గీతారహస్యం’ అని వ్యాఖ్య రాసి హిందూ జాతీయవాదాన్ని మిలిటెంటుగా ముందుకు తెచ్చాడు.
గాంధీ అదే భగవద్గీతను అహింసకు ప్రేరణగా వ్యాఖ్యానించాడు గానీ వర్ణధర్మాన్ని నెత్తికెత్తుకున్నాడు. ‘నవజీవన్’ పత్రికకు రచన పంపమని గాంధీ కోరినపుడు డాక్టర్ బాబాసాహెబ్ అదేమాట చెప్పాడు. మీరు వర్ణధర్మాన్ని అంగీకరించినంత కాలం అస్పృశ్యతను రూపమాపలేరు అన్నాడు.
ఇపుడు మనదేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ మూలాల గురించి ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే ‘ఆనంద్‌మఠ్’ నవలా రచయిత బంకించంద్ర ఛటర్జీ నుంచి సావర్కర్ వరకు ఈ సంఘపరివార్ భావజాలానికి అవసరమైన సైద్ధాంతిక ఇంధనాన్ని అందించారు. వీటికితోడు గోరఖ్‌పూర్ ఒక హిందూ మతప్రచార భావజాల సంస్థగా పనిచేసిన గీతాప్రెస్ రెగ్యులర్‌గా పత్రిక నిర్వహింంచడమే కాకుండా వందల వేల హిందూ మతప్రచార సాహిత్యాన్ని పుస్తకాలు గానూ, కరపత్రాలు గానూ ప్రచారం చేసింది. ఈ పత్రికతో సంబంధం లేని పారిశ్రామికవేత్తలలు లేరు. దాల్మియాలు, బిర్లాలు, గోయెంకాలు అందరూ క్రియాశీలంగా ఈ మతప్రచారాలకు, గాంధీ రాజకీయాలకు అండగా నిలిచారు. గాంధీకి బిర్లా కుటుంబానికి ఉన్న అనుబంధం లోకానికంతా తెలిసిందే. బిర్లాలు ఒకళ్లనే కాదు దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా దేశసంపదకు, శ్రామిక ప్రజల శ్రమసంపద (అంటే పారిశ్రామికకోత్పత్తిలో పాల్గొనే కార్మికవర్గ ఉపాధి, శ్రేయస్సు) కు ధర్మకర్తృత్వసంఘం (ట్రస్టీ)గా వ్యవహరించాలని గాంధీ కోరుకున్నాడు. బిర్లా యే జాతీయ కాంగ్రెస్‌కు ‘స్వాతంత్య్రానంతర ఆర్థిక ప్రణాళిక’ (బాంబే ప్లాన్) రాసిచ్చిన ఉదంతాన్ని పూసగుచ్చినట్టుగా కాళళీపట్నం రామారావు గారు తన ‘కుట్ర’ కథలో వివరించే ఉన్నాడు.
నెహ్రూవియన్ సోషలిజాన్ని లేదా లౌకిక ప్రజాస్వామ్యాన్ని మోడీత్వ సందర్భంలో ఉదార ప్రజాస్వామ్యవాదులు మొదలు కమ్యూనిస్టుల వరకు ఎందరో గుర్తు చేసుకుంటున్నారు. కాని ఆ నెహ్రూ కూడ టాటా బిర్లాలను నవభారత నిర్మాతలుగా అభివర్ణించాడు. ప్రధాని కాగానే అటు కశ్మీర్ లోనూ, ఇటు హైదరాబాదు సంస్థానంలోనూ లక్షలాది మందిని అంటే అతిశయోక్తి అనుకుంటారేమో కానీ వేలాదిమంది పేదముస్లింల మారణకాండకు కారణమైన సైనికచర్యలకు పూనుకున్నాడు. పైగా రాజ్యాంగం అమలులోకి రాకముందు మొదటి సార్వత్రిక ఎన్నికలు కూడ జరుగకముందే కేవలం తాను సర్దార్ పటేల్ తీసుకున్న నిర్ణయాలుగానే ఈ చర్యలు తీసుకున్నాడు. అధికారికంగానే ఆయన మిశ్రమ ఆర్థిక విధానాన్నే అమలుచేసాడు. పబ్లిక్రంగంలోని పరిశ్రమలు సోవియెట్‌రష్యా, తూర్పుయూరపు దేశాల సహకారంతో, ప్రైవేటురంగంలో పరిశ్రమలు యూరపు, అమెరికా సామ్రాజ్యవాదుల సహకారంతో నెలకొల్పడానికి ప్రోత్సహించాడు.
షహీద్ భగత్‌సింగ్ ఒక్కడే గదర్‌పార్టీ సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయాలను ముందుకు తీసుకపోవడమే కాకుండా దేశంలో భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక సాయుధ చర్యల ద్వారా కార్మిక కర్షక రాజ్యాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో నవజవాన్ భారత సభను నెలకొల్పాడు. పార్లమెంటులో బాంబుదాడి చేసి అరెస్టయినపుడు ‘ఫిలాసఫీ ఆన్ బాంబ్’లో తమది హింసావాదం కాదని రెండు కార్మిక వ్యతిరేక, నిర్బంధ చట్టాలను వ్యతిరేకించడానికే ఈ ‘బధిరాంధక పార్లమెంటులో బాంబు వేసామ’ని ప్రకటించాడు. పార్లమెంటులో ఎవరికీ హాని తలపెట్టకుండా జాగ్రత్త పడ్డామని కూడ చెప్పాడు. ఇంక జైల్లో లెనిన్ రచనలు క్షుణ్ణంంగా చదివి ఆకళింపు చేసుకొని లెనిన్ మార్గంలో మాత్రమే మనదేశం లోనూ విప్లవం సాధ్యమని భావించాడు. చరిత్రకారుడు బిపిన్‌చంద్ర ఆయనను రూపొందుతున్న లెనిన్‌గా పేర్కొన్నాడు. ఇప్పటికీ భగత్‌సింగ్ విప్లవాచరణ పై ప్రామాణికమైన సృజనాత్మక పరిశోధనలు చేస్తున్న ఆయన మేనల్లుడు జగ్మోహన్సింగ్ గానీ, ప్రొఫెసర్ చమన్‌లాల్ గానీ ఆయన అముద్రిత రచనలు, లేఖలు, ప్రసంగాలు, డైరీల నుంచి ఈ సత్యాన్వేషణయే చేస్తున్నారు.
లాహోర్ కుట్రకే సులో భగత్‌సింగ్‌తో పాటు విజయకుమార్ సిన్హా వంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులను కూడ బ్రిటిష్ ప్రభుత్వం ముద్దాయిలుగా చూసింది గానీ అప్పటికే ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీ నిర్మాణంలోకి భగత్‌సింగ్‌ను ఆహ్వానించలేదు. బహుశా చాలకాలం దాకా కమ్యూనిస్టుపార్టీ భారత జాతీయ కాంగ్రెస్‌లో సోషలిస్టు గ్రూపుగా పనిచేయడం కారణం కావచ్చు.
స్థూలంగా ఈ పై కారణాల వలన కమ్యూనిస్టుపార్టీ, దాని కార్యకలాపాలకు విశాల ప్రజారాశుల్లో గుర్తింపు మాత్రం 1936-45 మధ్యకాలంలోనే వచ్చింది. కమ్యూనిస్టుపార్టీ ఈ దేశంలో కూడ కార్మికవర్గ పోరాటానికి అగ్రగామిగా రూపొందుతున్నదనే భరోసా కూడ పీడితప్రజల్లో ఈ కాలంలోనే ఏర్పడిరది. ఆ విశ్వాసం ఇంచుమించు 1951లో తెలంగాణ సాయుధపోరాటం విరమించుకునే దాకా కొనసాగింది. ఈ కాలాన్ని అంటే 1923 (లెనిన్ మరణానంతరం) నుంచి 53 దాకా మూడుదశాబ్దాల ప్రపంచ చరిత్రను సిపిఎం నాయకుడు మోటూరు హనుమంతరావు ‘స్టాలిన్‌యుగం’గా పేర్కొన్నాడు. ఇందులో 1923 నుంచి ఫాసిజం స్పెయిన్‌లో తలఎత్తిన 36 వరకు (పార్లమెంటుకు ఎన్నికయిన స్పెయిన్యార్డులకు అధికారం ఇవ్వకపోవడం ద్వారా) అది నగ్నంగా ఒక జాతీయోన్మాదంగా ముందుకువచ్చి పార్లమెంటును తగులబెట్టే (జర్మనీ) దశకు ముదిరేదాకా ప్రపంచవ్యాప్తంగా సావియెట్రష్యా స్ఫూర్తితో కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు చేస్తూ ఎదుర్కున్నకాలం. ఈ కాలంలోనే మాగ్జింగోర్కీ నాయకత్వంలో రష్యాలో సోవియెట్ రచయితల అకాడమీ పక్షాన ప్రపంచ మేధావులకు ‘మీరే పక్షం’ అని ప్రశ్న వేసాడు. లండన్‌లో ఏర్పడిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ రూపొందించిన మానిఫెస్టో ఆధారంగా ఇండియాలో ప్రేంచంద్ అధ్యక్షుడుగా, కమ్యూనిస్టుపార్టీ క్రియాశీల సభ్యుడు సజ్జాద్ జహీర్ కార్యదర్శిగా 1936లో ఏర్పడిరది. ఆ తర్వాత బలరాజ్‌సాహ్ని వంటి వారితో ఇప్టా ఏర్పడిరది. హైదరాబాదులో ఆలంఖూంద్మీరీ మగ్దూంమొహియుద్దీన్ రాజబహదూర్‌గౌడ్ వంటి వారితో కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడిరది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలన్నీ ఈ కాలంలోనే వెలువడినవి. ఆయన ‘మహాప్రస్థానం’ గీతాల రచనాకాలం (1933-45) సరిగ్గా ఫాసిస్టు ప్రమాదం నుంచి మొదలై బెర్లిన్ ఎర్రసైన్యం హస్తగతం అయిన 1945తో ‘గర్జించు రష్యా’గా ముగిసింది.
‘గర్జించు రష్యా’ అనేది ఒక్క శ్రీశ్రీ చేసిన ఆవాహన మాత్రమే కాదు, మనదేశంలో సామ్రాజ్యవాద ఫాసిజం దాడినుంచి ప్రజాస్వామ్య శక్తులను కాపాడుకోవడానికి పీడిత ప్రజలు మొదలు బుద్ధిజీవులందరూ చేసిన కృషికి వ్యక్తీకరణ. తెలుగునేలమీద అభ్యుదయరచయితలసంఘం 1943లో ఏర్పడిరది. ప్రజానాట్యమండలి, సుంకర ` వాసిరెడ్డి ‘మాభూమి’, ‘వీరకుంకుమ’ నాటకాలు, డాక్టర్ రాజరావు కృషి ఇవన్నీ తెలంగాణలో కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి ఎంతో దోహదం చేసాయి. ఈ విషయాలన్నీ పాఠకులదృష్టికి పలుమార్లు వచ్చిన విషయాలే కానీ రెండు సందర్భాలు మాత్రం ఇక్కడ ప్రస్తావించాలి. అవి ` ఒకటి ` మొదటిదశ ` కమ్యూనిస్టుపార్టీ, సాహిత్య సాంస్కృతిక రళారంగాలు 1936 నుంచి 45 వరకు ఫాసిజానికి వ్యతిరేకంగా చేసిన కృషి ` యుద్ధారంభదశ నుంచి యుద్ధం ముగిసేవరకు. రెండవది దేశంలో పునప్రావాయలార్ (మలబార్ ప్రాంతం) ` తెభాగా (బెంగాల్) పరాకాష్ఠగా తెలంగాణలో అది విముక్తిపోరాటంగా కూడ కొనసాగడం ` జాతివిముక్తి పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో కొనసాగినపుడు అది విప్లవంగా గుణాత్మక పరిణామం చెందేదశకు చేరుకోవడం.
పునప్రానాయలార్ ` లేదా మలబార్లో వాళ్లు అచ్చంగా నంబూద్రి బ్రాహ్మణ భూస్వామ్య యాజమాన్యాన్ని ప్రతిఘటించిన ముస్లింలు. అందుకే ఇపుడు సంఫ్‌ుపరివార్, బిజెపి మలబార్ రైతాంగ సాయుధపోరాటాన్ని చరిత్రలో ఒక మచ్చగా, విధ్వంస కార్యక్రమంగా చెరిపేయాలని చూస్తున్నది. తెభాగా పోరాటం కూడ పండినపంటలో మూడిరట ఒకవంతు వ్యవసాయకూలీలకు, కౌలురైతులకు ఇవ్వాలన్న పోరాటం ఎక్కువగా తూర్పుబెంగాల్‌లో జరిగింది. ఇందులో అత్యధికంగా వ్యవసాయకూలీలయిన మహిళలు, భూమిలేని నిరుపేద ముస్లింలు పాల్గొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం పిలుపు ఇచ్చిన ముగ్గురిలో ఒకరు మగ్దూం మొహియుద్దీన్ మెదక్‌జిల్లా నుంచి వచ్చిన పేదముస్లిం కుటుంబానికి చెందినవాడు. కాని విద్యావంతుడై హైదరాబాదు సిటీకాలెజిలో లెక్చరర్‌గా చేరి కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు తర్వాత కమ్యూనిస్టుపార్టీలో చేరాడు. హైదరాబాదు, వరంగల్ పట్టణాల్లో బట్టలమిల్లుల్లో కార్మికసంఘాలను ప్రారంభించాడు. దేశంలోనే పేరెన్నికగన్న కవిగా లక్షలాదిమందిని తన ప్రసంగాలతో, కవిత్వంతో ఉత్తేజితులను చేసాడు. 1947 సెప్టెంబర్ 11న రావినారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డితో పాటు సాయుధపోరాటానికి పిలుపు ఇచ్చాడు. ఇక్కడ క్లుప్తంగానయినా 1946`48 మధ్య అప్పటి నైజాంరాష్ట్రంలో పరిణామాలు చెప్పుకోవాలి. దేశానికి స్వపరిపాలన ఇవ్వడానికి ఒప్పుకొని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటింటినాక ` సంస్థానాల విషయంలో ఏర్పడబోయే ఇండియా ` పాకిస్థాన్ లలో ఎందులోనైనా చేరవచ్చునని, లేదా స్వంతంత్రంగానైనా ఉండవచ్చునని సూచించిన తర్వాత నైజాం రాజు ఉస్మానలీఖాన్కు స్వతంత్రంగా ఉండాలన్న ఆశ పుటమరించింది. ఢల్లీిలో ప్రొవిజనల్ ప్రభుత్వం ` తాత్కాలిక ప్రభుత్వం ` నెహ్రూ, పటేల్ నైజాంతో యధాతధ ఒడంబడిక చేసుకున్నారు. అందుకే 47 ఆగస్టు 15 తర్వాత సెప్టెంబర్ 11న కమ్యూనిస్టుపార్టీ సాయుధపోరాట పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. 1946 నవంబర్ నుంచి 1947 ఆగస్టు 15, ఆ తర్వాత 48 సెప్టెంబర్ దాకా కూడ నైజాం స్వతంత్రపాలనకు వత్తాసుగా కాశీం రజ్వీ అనే ఇత్తిహాదుల్ ముస్లిమీన్ నాయకుడు ‘రజాకార్లు’ అనే ఒక ముస్లిం తీవ్రవాద సాయుధ బలగాన్ని సిద్ధం చేసాడు. అయితే గ్రామీణ ముస్లింలెవరూ ఈ రజాకార్ల ప్రభావంలోకి రాలేదు. వ్యవసాయకూలీలుగా, రైతులుగా, భూమిలేని నిరుపేదలుగా ఉన్న వీళ్లంతా కమ్యూనిస్టుపార్టీ, కాంగ్రెస్‌పార్టీ ప్రభావాలలోనే ఉన్నారు. పట్టణాల్లో ఆర్యసమాజ్ హిందుత్వ, మిలిటెన్సీకి వ్యతిరేకంగా కొందరు విద్యావంతులైన ముస్లిం మిలిటెంట్లు ఎక్కువగా నిరుద్యోగ లుంపెన్లు ఇందులో చేరారు.
అంతకన్నా ముఖ్యంగా తెలంగాణ లోని దొరలు, దేశముఖ్ దేశపాండే జాగీర్దార్లు కమ్యూనిస్టుల భూస్వాధీన పోరాటాలనుంచి తమభూమిని అధికారాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ఈ రజాకార్లను తమ గడీల్లో నియోగించుకున్నారు. గ్రామాలపై దాడులకు ప్రోత్సహించారు. వీళ్లలో అత్యధికులు రెడ్డి, వెలమ, బ్రాహ్మణ భూస్వాములు. కొన్నిచోట్ల ముస్లిం జాగీర్దార్లు కూడ ఉండవచ్చు గానీ రెడ్లు, వెలమలే పెద్దభూస్వాములు. నవాబు ముస్లిం గనుక ప్రతి ముస్లిం నవాబే అనే ఈ రజాకార్ల ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న ఏ పేదరైతు అంగీకరించలేదు. అయినా రజాకార్ల దురంతాలు, హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు ఈ 47`48 మొత్తంగా 46 నవంబర్ ` 48 సెప్టెంబర్ మధ్యకాలంలో జరుగలేదని కాదు, కాని కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో గ్రామాల్లో గుత్పల సంఘాలు, గ్రామరక్షణదళాలు ఏర్పడి ప్రతిఘటించాయి.
రజాకార్లను, కమ్యూనిస్టుపార్టీ 47 సెప్టెంబర్ 11న ఇచ్చిన సాయుధపోరాట పిలుపును నెపంగా పెట్టుకొని పోలీసు యాక్షన్ పేరుతో ఆపరేషన్ పోలో సైనికచర్యకు ఢిల్లీ ప్రభుత్వం పూనుకున్నది. సెప్టెంబర్ 13 నుంచి 17 లోపల అది నైజాం ప్రతిఘటన ఏమీ లేకుండానే ముగిసింది. నైజాం సెప్టెంబర్ 17న లొంగిపోయి హైదరాబాదు రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసానని ప్రకటించి కేంద్రప్రభుత్వం నియమించిన రాజప్రముఖ్‌గా 1956 వరకు ఉస్మాన్‌అలీఖాన్ కొనసాగాడు. సెప్టెంబర్ 17 తర్వాత చరిత్ర రచనలో తప్ప రజాకార్ మిగలలేదు కాని రజాకార్ల పేరుతో లాతూర్ వంటి మరాట్వాడా ప్రాంతాల్లో మద్దూరు, లద్దనూరు వంటి వరంగల్జిల్లా ప్రాంతాల్లో నలభైవేల నుంచి రెండులక్షల దాకా ముస్లింలను ఇండియన్ యూనియన్ సైన్యం చంపిందని హోంమంత్రీ, దేశంలో ఆంతరంగిక వ్యవహారాల మంత్రి కూడ అయిన సర్దార్‌పటేల్ కార్యదర్శి విపి మీనన్‌కు డాక్టర్ జయసూర్య నివేదిక ఇచ్చాడు. డాక్టర్ జయసూర్య కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసిన సుప్రసిద్ధ కవి సరోజినీనాయుడు కొడుకు. తెలంగాణలో 40లలోనే ఈ కుటుంబం పౌర, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడిరది. అందుకే కమ్యూనిస్టుపార్టీపై నిషేధం ఉండగానే 1952లో సార్వత్రిక ఎన్నికలు వస్తే కమ్యూనిస్టులు డాక్టర్ జయసూర్య నాయకత్వంలో ఏర్పడిన పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) తరఫున పోటీచేసి తెలంగాణలో 90 శాసనసభ స్థానాల్లో 48 గెలుచుకున్నారు. ఆ వివరాలకన్నా జెఎన్ చౌధురి నాయకత్వంలో భారతసైన్యం ముస్లింల విషయంలో హిందూసైన్యంగా వ్యవహరించిందని చెప్పడమే ఉద్దేశం.
ఇది కేవలం మిలటరీ జనరల్ జె.ఎన్.చౌధురీ ఆధ్వర్యంలో జరిగిందేమీ కాదు. హైదరాబాదు సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేంతవరకే ఆయన బాధ్యత. ఆ నాలుగరోజుల హింసాకాండయే ఆయన ఆధ్వర్యంలో జరిగింది అనవచ్చు. తర్వాత హైదరాబాదు రాష్ట్రానికి ఎం.కె.వెల్లోడి సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాడు. 1952లో సార్వత్రిక ఎన్నికలు అయ్యేదాకా కేంద్రప్రభుత్వం వెల్లోడీని ముఖ్యమంత్రిగా కూడ ప్రకటించింది. 1951 నవంబర్ వరకు కమ్యూనిస్టుపార్టీ సాయుధపోరాటం కొనసాగించింది. అందులో మూడువేలమందికి పైగా కమ్యూనిస్టు విప్లవకారులు, సానుభూతిపరులు తెలంగాణలో మాత్రమే కాకుండా కోస్తాజిల్లాల్లో కూడ సైన్యందాడుల్లో కాల్పుల్లో అమరులయ్యారు. తెలంగాణలోనైతే అది వెట్టిచాకిరీ వ్యతిరేకంగా మొదలైన దాసీ, బానిస వ్యవస్థను రద్దుచేసిన బానిసల తిరుగుబాటు కనుక క్షేత్రస్థాయిలో అంటే గడ్డివేళ్లస్థాయిలో సైన్యం దాడిలో మరణించిన వారంతా దళిత బడుగు వర్గాలవారే. ఇంక కృష్ణాజిల్లా కాటూరు పామర్రు గ్రామాల్లో స్త్రీ పురుషులనందరినీ వివస్త్రలను చేసి గాంధీవిగ్రహం చుట్టూ పరుగెత్తిస్తూ సైన్యం చేసిన అత్యాచారాలు, అకృత్యాల గురించి సుప్రసిద్ధ కవి, కళాకారుడు, నాటకకర్తా, సరోజినీనాయుడు తమ్ముడు హరింద్రనాథ్ చటర్జీ రాసిన దీర్ఘగీతం ఆరుద్ర అనువాదంతో సుందరయ్యగారు రాసిన ‘ తెలంగాణ పోరాటం ` గుణపాఠాలు’ కు అనుబంధంగా చేర్చబడిరది. ఇవన్నీ నెహ్రూపటేల్ల దృష్టికి రాకుండా జరిగినవి కావు. ఆ నాలుగురోజుల్లో (సెప్టెంబర్ 13-17) దురంతాల గురించే డాక్టర్ జయసూర్య నివేదిక హోంమంత్రి కార్యదర్శికి సమర్పిస్తే, ఆ తర్వాత నెహ్రూ సన్నిహితమిత్రుడు సుందరలాల్ కూడ తన నివేదికలో నలభైవేలమంది ముస్లింలను రజాకార్ల పేరుతో సైన్యం చంపిందని నెహ్రూ దృష్టికి తెచ్చాడు. కమ్యూనిస్టులు, నెహ్రూ సోషలిజంలో భ్రమలు ఉన్నవాళ్లు ఈ దురంతాలకు, మారణకాండకు పటేల్‌ను బాధ్యునిగా చూపుతారు గానీ, పటేల్ కుండే కమ్యూనిస్టు వ్యతిరేకత అందరికీ తెలిసిందే గానీ కశ్మీరీపండిట్గా నెహ్రూకున్న బ్రాహ్మణీయ హిందుత్వ భావన ఆయన పాలనవిధానంలో దాగేది కాదు. ఈ మారణకాండలో, దమనకాండలో సైన్యం ద్వారా వ్యక్తమయిందంతా ముస్లిం మైనారిటీల మీద, దళిత బడుగువర్గాల మీద అణచివేత, అత్యాచారాలు, మారణకాండనే. సాకు మాత్రం రజాకార్లు, కమ్యూనిస్టులు.
1947 దేశవిభజన సందర్భంలో జరిగిన హిందూ ముస్లిం ` సిఖ్కు ముస్లిం ఘర్షణలను పరిశీలిస్తే ఈ బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టుదాడి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మౌంట్‌బాటెన్ దేశాన్ని ఇండియా పాకిస్థాన్‌లుగా విభజిస్తూ ప్రకటనచేసిన దగ్గర్నించీ, విభజనకు గురయ్యే పంజాబ్ బెంగాల్ లలో రాజకీయనాయకుల స్వార్థప్రయోజనాల కోసం ఈ ఘర్షణల్లో లక్షలాదిమంది మరణించారు.
ముఖ్యంగా బెంగాల్లో జరిగిన నౌఖాలీ మారణకాండ ఆగిపోయేదాకా గాంధీ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని నెహ్రూ, ఉత్తర ప్రావిన్సు (ఇప్పటి ఉత్తరప్రదేశ్) ముఖ్యమంత్రి లియాఖత్అలీలను స్వయంగా నౌకాలీకి వెళ్లి ఈ ఘర్షణలను ఆపాలని నిర్దేశించాడు. తాను స్వయంగా ఈ నౌఖాలీ ఘర్షణలను ఆపడానికే వెళ్లాడు. గాంధీ అస్పృశ్యత గురించి ఎటువంటి శుష్క ఔదార్య సంస్కరణవాదాన్ని చేపట్టాడో, ముస్లింల విషయంలో కూడ అటువంటి వైఖరియే చేపట్టాడు. నెహ్రూతోసహా జాతీయకాంగ్రెస్లో ఉన్న ఏ రాజకీయ నాయకుణ్ని కూడ హిందూ స్వప్రయోజనచట్రానికి, అధికారానికి అతీతంగా ఆచరణలో వ్యవహరించేట్లు చేయలేకపోయాడు. ఉదాహరణకు దేశవిభజన తర్వాత పాకిస్థాన్‌కు చెందవలసిన బ్రిటిష్ ఇండియా ఆదాయ, వ్యయాల్లో చెల్లించవలసిన డబ్బు విషయం మొదలు పట్టుపట్టి అలక చూపాడు తప్ప నెహ్రూప్రభుత్వం మీద అటువంటి నైతిక అధికారాన్ని అమలుచేయలేకపోయాడు. దళితులకు ఎంతో ప్రయోజనకరమైన ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనను డా.బి.ఆర్.అంబేద్కర్ విరమించుకోవడానికి నిరాహారదీక్ష చేసి చనిపోతాడని భయపడి, అది విరమింపజేయడానికి అక్కడ అంబేద్కర్ నైతిక మానవీయ వైఖరి పూనా ప్యాక్టుకు కారణమయింది గానీ మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ ఇండియాలో భాగంగానే ముస్లింలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని కలిగించలేకపోయాడు.
నైతిక మానవీయ విలువలు రాజకీయాచరణలోకి మారనపుడు మహాత్ముడనిపించుకునేవాడు ఇరువర్గాల విశ్వాసాన్ని కోల్పోతాడు. వర్ణాశ్రమధర్మంలో విశ్వాసం ఉండి తాను హిందువుగా ప్రకటించుకుంటూ వైష్ణవ భజనగీతంతో పాటు ఈశ్వర్ అల్లా ఏకీనామ్ ` రఘుపతి రాఘవ రాజారామ్ అంటే గాంధీ రామ్ రహీమ్‌లు ఒకటే అంటే హిందువులు ఒప్పుకోరు. పాకిస్థాన్ ఏర్పడకుండా తమకు న్యాయం జరుగుతుందని జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ విశ్వసించలేదు. ముస్లింల పట్ల బుజ్జగించే అపీజ్మెంట్ పాలసీ అనుసరిస్తున్నాడని భావించిన హిందూరాజ్య సంస్థాపన లక్ష్యం గల సావర్కర్ అనుయాయి నాథూరాం గాడ్సే గాంధీని 48 జనవరి 30న హత్యచేసాడు. సంఫ్‌ుపరివార్ అప్పటినుంచి ఇప్పటిదాకా సావర్కర్‌ను తమ అంతరంగంలో గాంధీకి ప్రత్యర్థిగా అరాధిస్తున్నది. గాంధీ హంతకుడయిన నాధూరామ్ గాడ్సే పట్ల కూడ సావర్కర్ అనుయాయిగా అంతే ఆరాధనాభావం ప్రదర్శిస్తున్నది.
విచిత్రమేమిటంటే సావర్కర్ కూడ అస్పృశ్యతయే కాదు హిందూమతంలోని కులాలకు కూడ వ్యతిరేకి. ఎందుకంటే ఆయన ఆశించే హిందూరాజ్యంలో ముస్లిం వ్యతిరేకతయే కీలకమైనది ` అది హిందూమతంలోని కూలాల ఐక్యత వల్ల ` వలస సామ్రాజ్యవాద సమర్ధన వల్ల మాత్రమే సాధ్యం ` సారాంశంలో అది బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలమే.
దేశవిభజన సందర్భంగా జరిగిన మారణకాండ హిందూ ముస్లిం ఘర్షణలుగా కనిపించినదానికన్నా లోతయిన రాజకీయ స్వార్థాన్ని, అధికారదాహాన్ని నగ్నంగా బయటికి తెచ్చినదే. ఇరువైపులా సామాన్యులు బలి అయిపోయారు. దేశవిభజన సందర్భంగా జరిగిన అత్యాచారాలు, మారణకాండల గురించి వచ్చిన సాహిత్యం ఉర్దూ హిందీ ఇంగ్లిషులలో, భారతీయ సాహిత్యంలోనే అన్ని కాలాల్లోనూ ఎంతో ప్రామాణికమైనదీ విలువైనదీ. దాదాపు ఈ సాహిత్యమంతా 1936 నుంచి 1945 వరకు అంటే ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక సాహిత్య సాంస్కృతిక కళా పోరాటాలు నిర్వహించిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఇప్టాల నుంచి వచ్చాయి (ఇప్పటికీ వస్తూనే వున్నాయి). ఫైజ్ అహ్మద్‌ఫైజ్ ప్రపంచ ప్రసిద్ధమైన కవి. పిడబ్ల్యుఎ ప్రముఖ నాయకుడు. 47 ఆగస్టు 14 రాత్రి ఢిల్లీ నగరంలోని మారణకాండను చూసి ఇటువంటి సాతంత్య్రాన్నేనా మనం కోరుకున్నది అని రాసాడు. కె.ఎ.అబ్బాస్, బలరాజ్‌సాహ్ని వంటి వాళ్ల ఆత్మకథల్లో కైఫీ ఆజ్మీ, సాహిర్ లూథియాన్వి వంటివాళ్ల కవిత్వంలో ఈ మారణకాండ విషాదమంతా కళ్లకు కడుతుంది. బలరాజ్‌సాహ్ని సోదరుడు భీష్మ సాహ్నీ రాసిన ‘తమస్’ నవల ఈ మతఘర్షణల పట్ల మానవీయ లౌకిక, ప్రజాస్వామిక స్పందనకు, విలువలకు అద్దం పట్టే రచన. రాజకీయ స్వార్థ ప్రయోజనాల్లో జరిగిన ఈ మారణకాండలో సాధారణ మానవులుగా ముస్లింలు, హిందువులు పరస్పరం ఎట్లా మాన ప్రాణాల రక్షణ కోసం సహకరించుకున్నారో కూడ చిత్రిస్తుంది. ఇది ఎంత ప్రభావాన్ని చూపిన నవల అంటే తర్వాత ఇది నాటకీకరింపబడి టివిలో సీరియల్‌గా వచ్చింది. ఎక్కడ ఎప్పుడు మతఘర్షణలు జరిగినా ఈ ఎపిసోడ్‌ను జనం గుర్తుచేసుకుంటారు. ఢిల్లీ నుంచి పాకిస్థాన్‌కు పంజాబ్ మీదుగా వెళ్తున్న ముస్లింలు మారణకాండలో వేలు లక్షలుగా మరణిస్తుంటే శవాలతోనే లాహోర్, కరాచీ, రావల్పిండి లను చేరుకున్న ప్రత్యేకరైళ్ల విషాద ఉదంతాలను సుప్రసిద్ధ పత్రికారచయిత, సాహిత్యవేత్త, పంజాబ్ చరిత్రకారుడు కుష్వంత్‌సింగ్ ‘ట్రెయిన్ టు పాకిస్థాన్’ అని చిరస్మరణీయమైన నవల రాసాడు. అయితే వీళ్లందరూ ఒక ఎత్తు ` సాదత్ హసన్ మంటో ఒక ఎత్తు. ఒక మనిషి, ఒక సున్నితమయిన భావుకుడు, మనషుల్ని మనుషులుగానే ప్రేమించేవాడు దేశవిభజన సందర్భంగా మతఘర్షణలకు ఎంత చలించిపోయాడో దేశవిభజనను, రాజకీయస్వార్థాన్ని ఒక సగటుమనిషి ఎంత చేదు అనుభవంగా తీసుకున్నాడో మంటో కథలు, వ్యాసాలు, జ్ఞాపకాలు, సాహిత్యం అంతా అద్దం పడతాయి. అప్పుడు జరిగిన మారణకాండ బీభత్సానికి ‘ఖోల్దో’, ‘ఠండా గోష్త్’ లు ఎంత బీభత్స వాస్తవిక చిత్రణలో. ఒక మనిషిగా, ఒక రచయితగా ఎల్లలు లేని శ్రమజీవితాన్ని కోరుకునేవ్యక్తిగా ‘టోబాటేక్సింగ్’ అటువంటి కథ. ఒక పంజాబ్ రైతు తన గ్రామం ఎక్కడుందో పోల్చుకోలేక పిచ్చిలేసి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద పడిపోయి చనిపోయినట్లు రాస్తాడతను. ఒకవిధంగా టోబాటేక్సింగ్ సాదత్‌హసన్ మంటో ఆత్మకథ. నిజానికాయన పూర్వీకులది కశ్మీరు. ఆయన తనమూలాలు వెతికే క్రమంలో నహర్ నుంచి నెహ్రూ వచ్చినట్లుగా మంటో శబ్దం కూడ వచ్చిందని భావిస్తాడు. దేశవిభజన జరిగాక కశ్మీరు నుంచి ప్రవహించి సింధునదిలో విభజింపబడిన పంజాబ్‌లో ఉన్న పాకిస్థాన్‌లో కలిసే జలాలను నెహ్రూ ప్రభుత్వం పాకిస్థాన్‌కు వదలడం లేదని తెలిసినపుడు నెహ్రూకు ఒక వ్యంగ్యలేఖ కూడ రాస్తాడు. మనుషులు అందరికీ చెందిన నేలను, నీళ్లను తమ అధికారంతో పంచుకోవడాన్ని ప్రశ్నిస్తాడు. నిజానికి మంటో బొంబాయిలోనే స్థిరపడ్డాడు. బొంబాయి సినీరంగంలో రచయితగా ప్రసిద్ధుడయ్యాడు. అప్పటికే సుప్రసిద్ధ నటులైన అశోక్‌కుమార్‌కు, శ్యామ్‌కు ప్రాణమిత్రుడు. అశోక్‌కుమార్ మంటోకు స్క్రిప్టు రచనకు, కథారచనకు అవకాశం కల్పించి జీవిక కల్పించి ఎంత కష్టకాలం లోనూ ఆదుకున్నవాడు. శ్యాం అయితే ఇంక ఇద్దరివీ శరీరాలే వేరు గానీ ఒకే ఆత్మగా జీవించినవారు. ఒక పంజాబీ సిఖ్కు కుటుంబంలో తల్లీతండ్రి పిల్లలనందరినీ ముస్లిం ముఠా ఒకటి వచ్చి ఎట్లా చంపిందో వివరిస్తూ విచలితుడై ఆ స్థితిలో నేనుంటే నాకూ వాళ్లమీద అట్లే ప్రతీకారం తీర్చుకోవాలనిపించవచ్చు అంటాడు. దానితో మంటో షాక్‌కు గురయి బొంబాయి వదిలి పాకిస్థాన్‌కు వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. కాని మంటో దేశంలోని పరిణామాలు చూసి తన నిర్ణయం మార్చుకోడు. మనం ఒకరికొకరం బొంబాయి కరాచీ రేవుల్లో కదిలే కాగితపు పడవలను సముద్రతీరంలో స్వీకరించి మన స్నేహాలు చదువుకుందాం అని శ్యామ్‌కు రాస్తాడు. మంటో, ఎం.ఎఫ్.హుస్సేన్ వంటి రచయితలకు, కళాకారులకు చోటులేని విశాలదేశంగా మిగిలిన ఇండియా మళ్లీ ఇవ్వాళ అటువంటి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం సవాల్‌ను ఎదుర్కోవాలంటే స్టాలిన్‌యుగం నుంచి పాఠాలు తీసుకోవాలి.