మన ఇంటికి గోడలు ఎంత అవసరమో కిటికీలు, దర్వాజలు అంతకంటే ఎక్కువ అవసరం. అవి లేకుండా మనం గోడల మధ్య బందీలమైతే మనను బైటి గాలులేవీ తాకవు. బయటి వెలుతురేదీ మనకు సోకదు. మన ఇంటి గోడల బయటి కైవారాలు సురక్షితంగా ఉన్నాయా, లేదా కూడా మనకు తెలియదు.

కనుక మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే మనం గోడలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ఇళ్లకు చెందిన బయటి గోడలను పరిశీలించాల్సి ఉంటుంది. వివిధ ఇళ్ల గోడల మధ్యన ఉన్న రక్షక వ్యవస్థలను పరిరక్షించుకోవలసి ఉంటుంది. విధ్వంసక వ్యవస్థలను రూపుమాపుకోవాల్సి ఉంటుంది.

సరిగ్గా ఇలాగే మన స్వీయ అస్తిత్వాలను దాటి వెళ్లి ఇతర అస్తిత్వాల బాగోగులను పట్టించుకొని, వివిధ అస్తిత్వాల పరస్పర సంబంధాలను అర్థం చేసుకుంటే తప్ప మన అస్తిత్వాల బాగు మన చేతుల్లో ఉండదు. అలాగే అస్తిత్వాల మధ్య సంబంధాలను నియంత్రిస్తున్న, ఆ అస్తిత్వాల సమస్యలకు కారణ భూతమవుతున్న సకల అంశాలను పరిశీలించి అర్థం చేసుకోకుండా, వాటి నిర్మూలనకై సమన్వయంగా  కృషిచేయ(పోరాడ) కుండా ఏ విడి అస్తిత్వపు సమస్యలైనా పరిష్కారం కావు.

దృశ్యంలో అదృశ్యమై, కళ్ళతో చూస్తున్నా కనిపించని (అర్థంకాని) సమస్యలలో అనాగరికమైన, అత్యంత అమానవీయమైన పాకీపని ఒకటి. (మతం), కులం, జండర్ వ్యవస్థలు మనుషుల్ని విభజించి,అసమాన శ్రమ విభజనను సృష్టించి, తద నుగుణమైన భావజాలాలతో మనుషుల్ని సామాజికీకరిస్తున్నందువల్ల ఈ పాకీపని అసలు గుర్తింపులోకే రాదు.   

నిర్దిష్ట జన సమూహాల జీవితాలపై పితృస్వామిక, కుల కట్టుబాట్లు, నియంత్రణల వల్ల స్త్రీలు , దళితులు ఒకే పనిని ఒంటరిగా, కులపరంగా తరాలపాటు నిరంతరం కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా ఆ పని వాళ్ళ పనే అని, వారితోపాటు ఇతరులూ ఏ మాత్రం ప్రశ్నించకుండా అంగీకరిస్తుండడం వల్ల ఎప్పటికప్పుడు సామాజిక ఆమోదం తయారవుతోంది. అటువంటి ప్రజల సామాజిక ఆమోదంతోనే అమానవీయమైన, అనాగరిక పాకీ పనిని నిర్లక్ష్యం చేసే కుట్ర తరాల తరబడి మరుగుపరచబడుతోంది. అలా మరుగున పడిపోయిన పాకీ జన సమూహపు అస్తిత్వ సమస్యను బహిర్గతం చేస్తున్న పుస్తకమే ఈ ‘అశుద్ధ భారత్’.   

ఉత్తర భారతానికి (ఢిల్లీకి) చెందిన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అయిన భాషా సింగ్ లోతుగా పరిశోధించి రాసిన Unseen: The Truth about India’s Manual Scavengers అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని మరో ప్రముఖ సామాజిక కార్యకర్త, స్వతంత్ర జర్నలిస్టు సజయ గారు తెలుగులోకి అనువాదం చేయగా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు 2016లో ప్రచురించిన పుస్తకమే ఈ ‘అశుద్ధ భారత్’.

ఈ పుస్తక రచయిత కాశ్మీర్,ఢిల్లీ,బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాల్లో పర్యటించి పాకీ పని చేసే సమూహాలను కలిసి స్వయంగా చూసి వారి కడగండ్లను ఇందులో వివరించింది.

మనదేశంలో వివిధ రాష్ట్రాలలో ఈ పని చేసే వాళ్లను అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో భంగి, వాల్మీకి, మెహతర్ అనేవి అన్ని రాష్ట్రాల్లో సాధారణంగా వాడే పేర్లు. 75 ఏళ్ల ‘స్వతంత్ర’ భారతం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఆధునిక అభివృద్ధి జరుగుతోందని గొప్పలు చెప్పుకుంటున్న నేటి కాలంలో కూడా ఈ అమానవీయ, అనాగరిక పాకీ పనిని పైన పేర్కొన్న అట్టడుగు కుల సమూహాలే చేస్తుండడమనేది మత/కుల తత్వ ఫ్యూడల్ సామాజిక  పునాది ఆసాంతం చెదిరిపోలేదనడానికి సజీవ నిదర్శనం.

వ్యక్తిగత ఇళ్లల్లో మనుషులు ఏరిగిన పియ్యి పెంటల ను(ఎత్తుడు దొడ్లను)మరో మనిషి (అతడు/ ఆమె) శారీరక శ్రమ (చేతుల)తో ఎత్తి పారబోసి శుభ్రం చేయడం ఒక్కటే పాకీ పని అని అనుకోవడం సరికాదు. నగర పాలక సంస్థలలో, మునిసిపాలిటీలలో సెప్టిక్ ట్యాంకులను, వీధుల్లోని మురుగు కాలువలను శుభ్రం చేయడం, రైలు పట్టాలపై పడే మానవ మలమూత్ర విసర్జితాలను శుభ్రం చేయడం కూడా పాకీ పని కిందికే  వస్తుంది. ఈ పాకీ పనిని తరాల తరబడి చేస్తున్న వాళ్లు అట్టడుగు కులాలకు చెందిన వాళ్లే కావడం, కొన్నిచోట్ల ముస్లింలే కావడం గమనార్హం. పైగా మగవారి కన్నా ఎక్కువగా ఆడవాళ్లే ఈ పాకీ పని భారాన్ని మోస్తున్నారు. ఈ మొత్తం దోపిడీ, అణచివేతతో కూడిన అంటరాని వ్యవస్థకు ప్రాణం పోస్తున్నదీ కుల వ్యవస్థనే.

1993 లోనే పాకీ పని నిషేధ చట్టం వచ్చినప్పటికీ నేటికీ ఈ అమానవీయమైన పాకీ పని విధానం సంపూర్ణంగా నిర్మూలన కాలేదు. అది ఇతర రూపాలలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వివిధ ప్రభుత్వాలు తమ కాలపరిమితుల్ని తామే ఉల్లంఘిస్తూ తమ అనాధునిక స్వభావాన్ని బహిర్గతం చేసుకుంటున్నాయి. మరోవైపు చట్టాన్ని అమలు చేసి పాకీ పనిని తుదముట్టించాలని కోరుకునే వాళ్లు కోర్టులకు వెళితే దశాబ్దాల పాటు

విచారణలు జరుగుతూనే ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం సైతం సమయం లేదని చెబుతూ, పాకీ పనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే అబద్ధాలను నిరూపించే బాధ్యతను పిటిషన్ దారుల మీదే మోపింది. అంటే, సాధారణ సమాజానికే కాదు న్యాయస్థానాలకు కూడా ఈ పాకీ పని నేరంగా కనబడడం లేదు. ఒక నిర్దిష్ట ప్రజా సమూహమే, అందులో ఎక్కువగా ఆడవాళ్లే తరత రాలుగా ఈ పాకీ పని భారాన్నిఎందుకు మోయాల్సి వస్తోంది? ఈ ప్రశ్న మిగతా సమాజాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదెందుకు? అట్టడుగు కులాల వాళ్లే ఈ పాకీ పనిని చేస్తున్నప్పటికీ దళిత ఉద్యమాలలో పాకీ పని వాళ్ళ విముక్తి ప్రధాన భాగం కాలేదెందుకని సఫాయి కర్మచారి ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. అంటే, స్వీయ ఆస్తిత్వపు గోడలు దాటి రాకుండా కనీసమైన సహానుభూతి, సున్నితత్వం ప్రదర్శించకుండా ఉండడంలో ఏం పని చేస్తోంది? దీనికి సమాధానం ఏమిటంటే- పితృ స్వామిక, కులతత్వం అగ్రకులాలనే కాదు, స్త్రీలను,అట్టడుగు కులాల వారిని కూడా ఆవహించి ఉండడమే. ఇలా మనుషులు తమ అస్తిత్వపు

గోడలకు అంటిపెట్టుకొని ఉండడం వల్లనే ఇతర తోటి ప్రజల సమస్యలు కనిపించకుండా పోతున్నాయి. కనీస మాత్రంగానైనా గుర్తించబడడం లేదు. అందుకేవాటి పైన కప్పబడిన తరతరాల ముసుగుని  తొలగించి పొరలు పొరలుగా దాగివున్న అనేకానేక వాస్తవాలను ఈ పుస్తకం బహిర్గతం చేస్తుంది.

పాకీ పని తాము చేసే పనేనన్న భావజాలం ఆ పనిని కులం(గౌరవం)తో ముడిపెట్టి చూసేంతగా ఈ సమూహంలో జీర్ణం అయిపోయింది. సంపదకు/ ఆస్తికి సూచికగా ఉండే జాగిర్దారి అనే పదాన్ని పాకీ పనికి అంటగట్టి,ఈ దోపిడీని, పీడనను ఒక పటి ష్టమైన వ్యవస్థగా మలిచారు. ఈ పాకీ పని చేసే ఆడవాళ్లకు జాగీర్దార్లు అని కూడా పేర్లు పెట్టారు. ఈ ఆడవాళ్లు తమ తర్వాతి తరానికి (కోడళ్ళకు) ఈ ‘జాగీర్’ లేదా ‘జజ్ మనీ’లను వారసత్వంగా అందజేస్తున్నారు. ఫలితంగా మొత్తం వీరి సమూహమే ఆ పాకీ పని అనే చక్రబంధపు వ్యవస్థలో ఖైదు చేయబడుతోంది.

మరి ఇంతటి దుర్మార్గమైన పాకీ పని విధానం బైటి ప్రపంచానికి అర్థం కావాలంటే మనుషులు కేవలం ఇంద్రియాలు ఉపయోగిస్తే సరిపోదు. ఇంద్రియాల ద్వారా వాస్తవం ఉనికి గుర్తించబడి, పూర్తిగా అర్థమయి, సత్యం సమగ్రంగా దర్శనమయ్యే అవకాశం లేదు. కనుక మనిషికి బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇంద్రియాలకు అందని శాస్త్రీయ అవగాహన బుద్ధిని వినియోగించి, విశ్లేషించడం ద్వారా మనిషికి అందుతుంది.

మధ్యయుగాలనాటి ఈ దుర్మార్గమైన పాకీ పని విధానానికి ఆధ్యాత్మిక పవిత్రతను కూడా అంటగట్టే ప్రయత్నాలు నాటి గాంధీ మొదలు నేటి నరేంద్ర మోడీ లాంటి పాలకుల దాకా చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు, 2007లో నరేంద్ర మోడీ గారు రాసిన పుస్తకంలో “పాకీ పని అనేది వాల్మీకి కులస్తుల ఆధ్యాత్మిక అనుభవమని/ కార్యాచరణ” అని అన్నారు. “వారు ఈ పని చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చని కనుగొని ఉంటారు. అంతేగాని ఈ పనిని తమ కడుపు నింపుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారని నేను అస్సలు  అనుకోవడం లేదని” అన్నారు. ఇలా పాకీ పనిని ఆధ్యాత్మిక వాదంతో ముడి పెట్టడాన్ని కొన్ని ప్రజా సంఘాలు, దళిత సమూహాలు తీవ్రంగా విమర్శించాయి. కొందరైతే అలాంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి మోడీ గారు సిద్ధంగా ఉన్నారా? అని సవాలు కూడా విసిరారు.

ఈ పాకీ పని వల్ల లబ్ధి పొందుతున్న అగ్రకులాలకు చెందిన బయటి వాళ్ళనైతే మనం ఎట్లాగూ విమర్శిస్తాం. ఇతరత్రా పీడితులైన దళితులు ఈ సమస్యను పట్టించుకోకపోవడాన్ని ఎలా చూస్తాం? హిందూ కుల వ్యవస్థ తాలూకు దుర్మార్గం వల్ల దళితుల్లో కూడా ఉప కులాలు ఉన్నాయని, వాటి మధ్య అనేక వైరుధ్యాలను  పాదుకొల్పడం ద్వారా సయోధ్యకు ఆస్కారం లేకుండా చేశారని అర్థం చేసుకుంటాం. కానీ స్వయంగా పాకీ పని వాళ్ళే ఈ పుస్తక రచయితను ‘మీదే కులం’ అని ప్రశ్నించి, ‘నువ్వు మా కులం మనిషిలా కనిపించడం లేదే’ అని అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఈ ప్రశ్నను మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి- తరతరాలుగా పాకీ పనికి కట్టి వేయబడి ఉండడం వల్ల బయటి వారెవరూ తమ సమస్యను సక్రమంగా అర్థం చేసుకోలేరని బలంగా నమ్మడం; రెండవది – తమ సమస్య  పరిష్కారం విషయంలో బైటివారి పట్ల  ఉన్న అపనమ్మకం కారణంగా అలాంటి ప్రశ్న వేశారని అనుకోవచ్చు. వేరే విధంగా చెప్పాలంటే -వాళ్ళు ఒక రకంగా అస్తిత్వ (వాద)ఊబిలో కూరుకుపోయి ఉండడం కారణంగా చిత్తశుద్ధితో కూడిన బైటి సంఘీభావాన్ని అపనమ్మకంతో చూడడం వల్ల అలాంటి ప్రశ్న వేసారని అనుకోవాలి.

అయితే ఈ పుస్తక రచయితకు మార్క్సిజం తన అస్తి త్వాన్ని దాటి ఆలోచించడాన్ని నేర్పింది. అలా వస్తుగతంగా ఆలోచించడం వల్ల మనిషి తననే కాకుండా తనకు బయట ఉన్న ఇతరులను, ఇతరే తర అంశాలను కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి తగిన ప్రాథమిక పునాది ఏర్పడుతుంది. కాబట్టే రచయిత భాషాసింగ్ పాకీ పని వాళ్ళ, ముఖ్యంగా పాకీ స్త్రీల కష్టాలను స్వయంగా చూసి సరిగ్గా అర్థం చేసుకొని పాఠకులకు కళ్ళకు కట్టినట్లుగా వివరించింది. ఈ పాకీ పని స్త్రీల ఆత్మగౌరవాన్ని, మౌలిక మానవత్వాన్ని ఎలా చిదిమేస్తుందో కూడా ఆమె తెలియజేసింది.

ఈ దుర్మార్గమైన పాకీ పని గురించి అంబేద్కర్ ప్రస్తావన లేకుండా రాయడం అసాధ్యమని రచయిత ధృడంగా  అభిప్రాయపడుతుంది. అంబేద్కర్ ‘బానిసత్వానికి చిహ్నమే ఈ పాకీ పని’ అంటూ, అంటరాని వాళ్లకు పాకీ పని ఒక పవిత్రమైన మానవసేవ లాంటిదని గాంధీలాంటి వాళ్ళు ఉపదేశిం చడాన్ని తీవ్రంగా ఖండించాడు. కేవలం పాకీ పని వాళ్ళ గురించే కాకుండా దళితులందరి విముక్తి గురించి, స్త్రీల విముక్తి గురించి, మొత్తంగా పీడిత ప్రజల విముక్తి గురించి అంబేద్కర్ నిర్ద్వందంగా  వాదించి మాట్లాడాడు. సమాజపు అట్టడుగు పునాదుల నుండి ఆధునికతను నిర్మించాలని అహరహం పోరాడి నిలకడైన,నికార్సైన ఆధునికతవాదిగా చరిత్రకెక్కాడు.

చట్టపరంగా 1993లో పాకీ పని నిషేధ చట్టం, 2012లో పాకీ పని వారి ఉపాధి, పునరావాసం బిల్లు, 2013 లో ఆ బిల్లే వారి పునరావాస చట్టంగా  ముందుకొచ్చినప్పటికీ శారీరక శ్రమ (చేతుల)తో మనుషుల పియ్యి పెంటలను ఎత్తివేసే పాకీ పనిని నేటికీ లక్షలాది మంది చేస్తూనే ఉన్నారు. 20 13 చట్టంలోని కొన్ని సెక్షన్లు/ క్లాజుల ప్రకారం పియ్యి పెంటలను ఎత్తటానికి ఆధునిక పరికరాలు ఉపయోగిస్తే వారు పాకీ పని వాళ్ళ కిందకు రారని చట్టం చెబుతోంది. ఫలితంగా- చట్టాలున్నా ఈ అమానవీయ పాకీ పని ఇంకా కొనసాగుతూనే  ఉన్నది. పైగా, ఈ పాకీ పనికి జాగిర్దారి అనే ఫ్యూడల్ ముసుగును కప్పి జెండర్ వివక్షను కట్టుదిట్టం చేసి పాకీ స్త్రీలను ఎలా బంధించి వేశారో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. పాకీ పనికి సంబంధించి బయటి సమాజపు సౌకర్యవంతమైన ఆలోచనలను, నమ్మకాలను చెల్లాచెదురు చేసి, వాటి స్థానే ఆధునిక ఆలోచనలను ప్రేరేపించి ఉద్యమించడానికి సమాయత్తం చేస్తుందీ ‘అశుద్ధ భారత్’ పుస్తకం.

—————————————-**********************———————————–

One thought on “స్వచ్ఛ భారత్లో స్వచ్ఛత ఎక్కడ’?

Leave a Reply