ఇంటిమనిషిని కోల్పోయిన నొప్పిలా ఉంది సలుపు

చేప ముల్లు గొంతులో దిగితే
దవఖానకు పరుగెట్టొచ్చు

తూట వెన్నులో దిగితే
కుప్పకూలడం తప్ప దారేది

తెలియకుండా జరిగినదే కావచ్చు
మీ తుపాకులకు గందపు వాసన తప్ప
కన్నీటి వాసన తెలియదు

కడుపుకోతకు గురైన ఇండ్లలోకి
మనుషులుగా వెళ్ళి చూడండి
గుమ్మాల్లో మనుషులకు బదులుగా
దుఃఖాలు గుండెలు బాదుకుంటూ
ఉంటాయి

మీకు తెలియకుండా జరిగినదే కావచ్చు
జరిగింది ఆస్తినష్టం కాదు
ప్రాణనష్టం

కూలింది కూలీలు
కుటుంబాన్ని కాపు కాసే మట్టిగోడలు

సాయమందించి చేతులు దులుపుకున్నా
కొన్ని ప్రేమలబాకీ ఎవరు తీరుస్తారు

కలచివేసే వార్త ఈ రోజు వరకే
అన్ని సర్దుకపోతాయి
ప్రజలూ మరచిపోతారు

రాని తండ్రి కొరకు …
ఓ బిడ్డ ఇంకా తలుపు వద్ద
బొమ్మను నిద్రపుచ్చుతూ ఎదురుచూస్తోంది

ఏ షా దిగివస్తాడు
బిడ్డను ప్రేమతో నిద్రపుచ్చడానికి  .

( 5 డిశంబర్ 21 తేదిన నాగాలాండ్లో భారతసైన్యం
విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 14 మంది
పౌరులు చంపివేయబడ్డారు. ప్రభుత్వ ప్రకటన తెలియకుండా జరిగిన పొరపాటని)

Leave a Reply