సర్గుజా. ‘జల్, జంగల్, జమీన్’ను కాపాడేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్లో కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడి నిరసన ప్రదేశానికి నిప్పు పెట్టారు. నిరసన స్థలంలో నిర్మించిన గుడిసెలాంటి టెంట్‌ను దగ్ధం చేశారు.
750 రోజుల పాటుగా కొనసాగుతున్న ఉద్యమం:
సర్గుజా డివిజన్లోని ఉదయపూర్ బ్లాక్‌లోని హరిహర్‌పూర్ గ్రామంలో 750 రోజులుగా “హస్దేవ్ బచావో సమితి” ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. “హస్దేవ్ బచావో సమితి” బ్యానర్ క్రింద, ఛత్తీస్‌గఢ్ ఊపిరితిత్తుగా పిలువబడే హస్దేవ్ అరణ్యాన్ని రక్షించడానికి ఉద్యమం జరుగుతోంది. ఇందులో స్థానిక గిరిజన ప్రజలే కాకుండా పర్యావరణానికి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు. ఆదివారం, ప్రజలు నిద్రిస్తున్న సమయంలో, హరిహర్‌పూర్‌లోని నిరసన స్థలానికి అర్ధరాత్రి నిప్పు పెట్టారని కమిటీ చెబుతోంది. దీంతో వెదురుతో చేసిన టెంట్లు చాలా వరకు కాలిపోయాయి. కంపెనీ వ్యక్తులే ఈ అగ్నిప్రమాదానికి పాల్పడ్డారని కమిటీ ఆరోపించింది.
ఈ అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో డిసెంబర్ నెలలో పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేసారు. అలాగే, నిరసన స్థలానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో, పర్సా ఈస్ట్ కేతే బాసిన్ ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రధాన ద్వారం ఉంది. దానికి అవతల బొగ్గు గని ప్రారంభమవుతుంది. ప్రజలు ఈ చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
జన్ చౌక్ బృందం కమిటీలోని వ్యక్తులను సంప్రదించేందుకు ప్రయత్నించింది. మాతో మాట్లాడుతూ రాంలాల్ కొరియమ్ ఇలా అన్నారు, “మా ప్రతిపక్షం అడవిని నరికి ఈ స్థలాన్ని ఖాళీ చేయాలనుకుంటున్నారు, అలాంటి పని చేసింది వారే. కంపెనీ వాళ్ళు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు”.
37 గ్రామాల ప్రజలు నిరసన స్థలానికి వచ్చి కూర్చునేవారని చెప్పారు. ఇది కంపెనీ కుట్రతో కాలిపోయింది. మేం చనిపోతాం కానీ హస్‌దేవ్‌ను రక్షించే పోరాటాన్ని మాత్రం వదులుకోము అని అతను అన్నాడు.
దేశంలో ఎన్నికల వాతావరణం గురించి రాంలాల్ మాట్లాడుతూ, ఇంతకుముందు ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు కూర్చునేవారని అన్నారు. అయితే ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి నిరసన స్థలంలో తాము ప్రవర్తనా నియమావళిపై పూర్తి దృష్టి సారించి దానిని పాటిస్తున్నామని అన్నారు. అయినా మా నిరసన వేదికను ధ్వంసం చేసారు.
ఈ సంఘటన తర్వాత, ఉద్యమంలో చురుకుగా ఉన్న వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తమ సందేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారు.
ఓ యువకుడు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో అదానీ కంపెనీకి చెందిన వ్యక్తులు రాత్రి 2 గంటల సమయంలో నిరసన స్థలానికి నిప్పు పెట్టారని ఆయన చెప్పారు.
అతను ఇలా అన్నాడు, “ఇది కేవలం ఉద్యమం కాదు, ఇది ఒక ఆలోచన, దానిని అంతం చేయడం సాధ్యం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు గత 10 ఏళ్లుగా నిరసనలు చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాం, ఎప్పుడూ హింసాత్మకంగా మారలేదు. దీని తర్వాత కూడా మా నిరసన స్థలాన్ని కంపెనీ తగులబెట్టింది. ముఖ్యంగా కూర్చునే ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు”.
ఈ ఘటన తర్వాత రామ్‌లాల్ కొరియమ్, అతని సహచరులు ఉదయపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటికీ ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
ఈ విషయంపై, సర్గుజా ఎస్పీ విజయ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ విషయంపై ఫిర్యాదు అందింది. సుర్గుజా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నిపుణుడితో కూడా విచారణ చేయనున్నారు”, అన్నాడు.
“ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ అరణ్యలో, అదానీ బొగ్గు గనులకు వ్యతిరేకంగా గిరిజనులు గత 750 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆ నిరసన ప్రదేశాన్ని అర్థరాత్రి తగలబెట్టారు”, అని సీనియర్ జర్నలిస్ట్ అలోక్ పుతుల్ ‘X’ లో పోస్ట్ చేసారు.
ఇలాంటి హింసాత్మక చర్యలతో ఈ రాజ్యాంగ పోరాటాన్ని అణచివేయలేమని ఆదివాసీలు అన్నారు. ఆదివాసీలు నిరసన వేదికను పునర్నిర్మాణం చేయనున్నారు.
హస్దేవ్ అరరణ్యాన్ని రక్షించడానికి ప్రజలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. మహిళలు, పిల్లలు కూడా అడవుల నరికివేతను వ్యతిరేకిస్తున్నారు.
ఈ ఉద్యమంతో చాలా కాలంగా అనుబంధం ఉన్న సామాజిక కార్యకర్త అలోక్ శుక్లా మాట్లాడుతూ “సుమారు 750 రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగింది. ఎవరు తగులబెట్టారనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.“
ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీన్ని బట్టి ఈ కుట్ర కూడా అదానీ కంపెనీ చేసినట్టు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ ఈ ఘటనను ఖండిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
హస్ దేవ్ అరణ్యాన్ని నాశనం చేసే ప్రక్రియ 2010 నుండి ప్రారంభమైంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఉంది. 2010 లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా కోసం రాజస్థాన్ ప్రభుత్వానికి హస్ దేవ్ లో మూడు గనులను కేటాయించింది. కానీ అటవీ పర్యావరణం మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ హస్ దేవ్ అరణ్యంలో మైనింగ్ చేపట్టడం పై నిషేధం విధించింది, దానిని నిషేధిత జోన్‌గా ప్రకటించింది. అంతే కాక ఈ ప్రాంతం ఐదవ షెడ్యూల్ కిందికి వస్తుంది.

కానీ నిబంధనలను తుంగలో తొక్కుతూ, అటవీ మంత్రిత్వ శాఖలోని అటవీ సలహా కమిటీ పర్సా ఈస్ట్ మరియు కేతే బేసెన్ బొగ్గు గనులకు అనుమతి ఇచ్చింది. దీని ఫలితంగా కేతే గ్రామాన్ని ఖాళీ చేయించి, అక్కడ చెట్లను నరికి అక్కడ నుంచి ఓపెన్ మైన్ ద్వారా బొగ్గు వెలికితీశారు. ప్రస్తుతం ఇది పర్సా ఈస్ట్ ఎండ్ కేతే బసెన్ ఓపెన్ కాస్టింగ్ మైన్ ప్రాజెక్ట్ పేరుతో నడుస్తోంది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా 2012 లో బొగ్గు తవ్వకానికి అనుమతి లభించింది. మొదటి దశలో 726 హెక్టార్లలో 137 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకాలకు ఆమోదం లభించింది. హస్‌దేవ్‌లో తొలి దశ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నాయి. కేంద్రం నుంచి అనుమతి రావడంతో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది.
ఈ ఆమోదం తర్వాత, నో-గో జోన్‌ను దృష్టిలో ఉంచుకుని NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) మైనింగ్‌ను నిషేధించింది. కానీ 2015 సంవత్సరంలో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మొదటి దశ మైనింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో కేతే గ్రామ ప్రజలు నిర్వాసితులయ్యారు.
(https://www.janchowk.comలో మార్చ్ 26 నాడు పూనం మాసిహ్ రాసిన వ్యాసానికి అనువాదం)
మార్చి 26, 2024