1
వర్తమాన భారతదేశంలో ప్రసారమాధ్యమాలన్నీ ‘‘హిందూ జాతీయవాదం’’ చేతిలో బందీలయ్యాయి. రాజకీయాలలో ఆమోదయోగ్యమైన ఒకే ఒక దృక్పథంగా హిందూ జాతీయవాదం కనపడుతోంది. దీని ప్రకారం ‘హిందూ’ అనేది ఒక పురాతన మతం, దానితోపాటు కల్పనాత్మకంగా పుట్టిన ఒక నరవర్గ (ఎథినిక్‌) సమూహం. ఆ కారణంగా ‘హిందువులు’ ఈ దేశపు శాశ్వతమైన స్వదేశీయులైపోయారు. భారతదేశాన్ని చరిత్ర పూర్వదశకు (అచారిత్రక) తీసుకువెళ్లడానికి ఈ రాజకీయ పథకం ప్రయత్నిస్తూంది. ప్రాచీన గ్రీకుల నుండి ఐరోపా వలస శక్తులవరకు, దేశం వెలుపల వున్న ‘మ్లేచ్చులు’ లేదా అపవిత్రులు, మిశ్రమజాతుల నుండి, స్వతంత్రంగా వున్న జాతి హిందువులని నిర్ధారించే ఆలోచన ఈ పధకానికి వున్నది.


రామాలయ నిర్మాణానికి శంఖుస్థాపన ఒక మత ఉత్సవంలాగా 2020 ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి ‘‘హిందూ రాజ్యం’’ ఉనికిలోకి వచ్చిందని ఉత్సాహపరులైన అనేకమంది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతక్రితం ఫైజాబాద్‌ అని పిలవబడిన ప్రస్తుత అయోధ్యలో ఈ దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఫైజాబాద్‌లో ఒకప్పుడు అదే స్థలంలో 16వ శతాబ్దానికి చెందిన మసీదు వుండేది. ప్రస్తుత పాలక భాజపాతో సహా వివిధ హిందూ సంస్థల నాయకుల ఆధ్వర్యంలో ఒక గుంపు ఆ మసీదును 1992లో కూల్చివేసింది. అన్ని ప్రధాన వార్తాఛానళ్ళు రామాలయ శంఖుస్థాపన ఉత్సవాన్ని ప్రసారం చేశాయి. లౌకిక రాజ్యాంగం కలిగివున్న ఒక దేశ ప్రభుత్వాధినేత, ఒక పురోహితుడులాగా వ్యవహరిస్తూ ఈ మత సంబంధ క్రతువులో పాల్గొన్నాడు. ఈ సంఘటన అదే రోజు జరగటానికి ఒక సందర్భం వున్నది. ఆ ఉత్సవంలో రాజ్యాంగపరమైన, మతపరమైన అంశాలు పరస్పరం కలగలిసిపోయాయి.


అంతకు ఒక సంవత్సరం ముందు, 2019 ఆగస్టు 5న భాజపా ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి ఒకపాటి స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని 370 నిబంధనను రద్దుచేసింది. ప్రభుత్వం ఆ ప్రాంతంలో సైనికుల సంఖ్యను పెంచింది, పౌరహక్కులను సస్పెండ్‌ చేసింది, ప్రసార సాధనాలన్నింటిని తీవ్రంగా పరిమితం చేసింది, నిరసనను తెలిపే ప్రయత్నాలన్నింటినీ అణచివేసింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించిన తరవాత తలెత్తిన నిరసనలను ప్రభుత్వం అణచివేయడం ప్రారంభించినప్పటి నుండి మిగిలిన భారతదేశంలో కూడా అణచివేత చర్యలే జరుగుతున్నాయి.


ప్రభుత్వం మత, కుల పాక్షికతను బహిరంగంగానే ప్రదర్శిచింది. ప్రభుత్వాన్ని, పౌరోహిత్యాన్ని కలిపివేసింది.తద్వారా అది రాజ్యాంగపు మౌలికసూత్రాలను తిరస్కరించింది. రాజ్యాంగం ఒక ఒడంబడిక. భారతీయులందరూ ఒకరితో ఒకరు చేసుకున్న ప్రజాస్వామిక వాగ్దానం. ఇప్పుడు మనం ఆ వాగ్దానానికి తూట్లుపడడం బహిరంగంగానే చూస్తున్నాం.


ప్రజలమీద దేశం మీద రాజ్యం మీద హిందూ మత గుర్తింపును బలవంతంగా రుద్దే పథకం చాలా బలమైందిగా కనపడుతోందిగాని ప్రారంభం నుంచే అది సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఆ పథకం నిలకడగా కొనసాగడం సాధ్యంకాదు.


19వ శతాబ్దపు మధ్యకాలంలో ఈ ఉపఖండంలో ఆధునిక రాజకీయ వ్యవస్థ నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు ఒకటికాకుండా రెండు విలక్షణమైన రాజకీయ భవిష్యత్‌ చిత్రపటాలు రూపొందడం గమనార్హం. ఆ రెండు రాజకీయ చిత్రపటాలు ప్రారంభం నుండి ఒకదానితో ఒకటి పొసగనివి. అవి రెండూ రెండురకాలైన రాజ్య నిర్మాణాలుగా మారి వుండేవి. అందులో ఒకటి, అగ్రకులాల ఆధిపత్యంలో కుల ఆధారిత నిర్మాణాన్ని కొనసాగించాలని కోరుకుంది. రెండవది, కులంతో సంబంధంలేని, లైంగిక వివక్షత లేని సమసమాజ రూపంలో నిజమైన స్వాతంత్య్రాన్ని ఊహించుకొన్నది. వర్తమానంలో హిందూ జాతీయవాదం ఉధృతి పెరగడంతో పైచేయి సాధించిన మొదటి చిత్రపటానికి జాతీయోద్యమ రాజకీయ నాయకుడు బాలగంగాధర్‌ తిలక్‌ ఆద్యుడు. సాటిలేని రాజనీతి తత్వ మేధావి, అలసట ఎరగని కార్యకర్త జ్యోతిరావ్‌ ఫూలే రెండవ వాదానికి ప్రతినిధి. కాంగ్రెస్‌తో సహా అన్ని అగ్రకుల వేదికలు దీన్ని అణచివేయాలనుకున్నాయి.


నిమ్నకులాల విముక్తికి సంబంధించిన తొలి ఆధునిక పధకానికి 19వ శతాబ్దంలో నాయకత్వం వహించి ప్రారంభించినవాడు ఫూలే. ఆయన వెనుకబడిన కులాల సామాజిక ఆర్థిక పరిస్థితులను విశ్లేషించాడు. వాళ్లకు విద్య నేర్పడానికి, సామాజిక సేవ చేయడానికి అనేకమైన సంస్థలను స్థాపించాడు. 1873లో సత్యశోధక్‌ సమాజ్‌ను స్థాపించాడు. అది కుల వ్యవస్థను ఖండిరచింది. పురోహితుల, విగ్రహారాధన, సంక్లిష్టమైన క్రతువుల అవసరాన్ని అది తిరస్కరించింది. 20వ శతాబ్దం తొలిరోజుల్లో ఫూలే వాదులు మహారాష్ట్రలో ఒక ప్రధానమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించారు. మహిళా విముక్తి వ్యతిరేక భావనలను, కుల వ్యవస్థ అనుకూల బ్రాహ్మణ మౌఢ్యాన్ని సవాల్‌ చేసి వాళ్ళు వాటి ప్రాధాన్యతను చాలా సంవత్సరాలు తగ్గించగలిగారు. అదేవిధంగా ఆ అగ్రకులాల రాజకీయ ఆకాంక్షలను కూడా వమ్ముచేయగలిగారు.


హిందూ రాజకీయ పథకానికి ప్రారంభకులు తిలక్‌, ఆయన అనుయాయులు. వాళ్లది బ్రాహ్మణీయ ప్రాపంచిక దృక్పథం. కుల వ్యవస్థ నుండి నిమ్నకులాలవాళ్ళను, మహిళలను విముక్తి చేయడాన్ని తిలక్‌వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. వేయి సంవత్సరాలకు పైగా భారత ఉపఖండంలో నివశిస్తున్న ముస్లింలతో సహా, తాము విదేశీయమైనవి అనుకున్న అన్నింటిని వాళ్ళు తిరస్కరించారు. బ్రిటిష్‌ వలస పాలన కారణంగా ప్రారంభమై అభివృద్ధి చెందిన ఆధునిక ప్రజాస్వామిక విలువలను, న్యాయవ్యవస్థలను తిలక్‌వాదులు పథకం ప్రకారం ఉపయోగించుకొని నాశనం చేశారు. ప్రస్తుత పాలనలో ఈ ధోరణి వేగవంతంగా కొనసాగుతూంది.
1980లు 90లలో ఈ రెండు దృక్పథాలు రాజకీయ రంగంలో ఒకదానిలో ఒకటి అత్యంత సమీపంలో తలపడ్డాయి. బి.సి.కులాల ప్రజలు ఎంతమంది వున్నారో నిర్ణయించి వాళ్లకు రిజర్వేషన్‌ కల్పించటానికి అనుసరించాల్సిన విధివిధానాల గురించి సలహాలివ్వడానికి ఏర్పడిన మండల్‌ కమీషన్‌ 1980లో తన నివేదికను సమర్పించింది. అప్పట్లో అధికారంలో వున్న కార్రగెస్‌ ఈ నివేదికను అమలుపరచాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. అందుకు బదులుగా, ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి అయిన రాజీవ్‌గాంధి హిందూ జాతీయవాదులు పూజలు జరపడానికి వీలుగా బాబ్రీమసీదు తలుపులు తెరిపించాడు.
వి.పి.సింగ్‌ నాయకత్వంలోని మిశ్రమ ప్రభుత్వం 1990 ఆగస్టులో మండల్‌ కమిషన్‌ రిపోర్టును అమలు పరిచే క్రమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలతో సహా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలలో అత్యధికం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఆ వెనువెంటనే 1990 సెప్టెంబరులో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అన్ని అనుబంధ సంఘాలు కలిసి సోమనాథ దేవాలయం నుండి బాబ్రీమసీదు వరకు, ఎల్‌.కె. అద్వానీని ముందు పీటీన నిలిపి రథయాత్ర నిర్వహించాయి. మసీదు స్థానంలో ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయాలన్నది వాళ్ళ డిమాండ్‌. వి.పి.సింగ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బెంచ్‌ ఆమోదించడంతో 1992 నవంబరు 16న మండల్‌ నివేదిక అమలు ప్రారంభమైంది. మూడువారాలు గడిచేలోగానే డిసెంబర్‌ 6న, రథయాత్రలో భాగస్వాములైన ఒక గుంపు బాబ్రీ మసీదును కూల్చివేసింది. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలో వుంది. విచారణ జరిపిన న్యాయస్థానం 2020 డిసెంబర్‌లో అద్వానీ, తదితర నాయకులతో సహా 32మందిపై ఆ కూల్చివేతకు సంబంధించిన కేసును విచారించి నిర్దోషులని తీర్పుచెప్పింది.


భారత జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం వహించిన తిలక్‌వాదుల ప్రణాళికనే కాంగ్రెస్‌ భాజపాలు స్వతంత్రం తరవాత కూడా కొనసాగించాయి. మండల్‌ కమిషన్‌ నివేదిక అమలు జరుగుతున్న సందర్భంలోనే బాబ్రీమసీదు కూల్చివేత జరగడానికి కారణాలను అర్థం చేసుకోవాలంటే, ఆధునిక భారతదేశంలో రెండు భావజాల దృక్పథాల మధ్య ఘర్షణను తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి. బాబ్రీ మసీదు కూల్చివేత తరవాత జరిగిన అన్ని పరిణామాలనుబాబ్రీ భూ వివాద తీర్పు, రామమందిర నిర్మాణ క్రతువును ప్రసారమాధ్యమాలు ప్రసారం చేయడం దాదాపు అన్ని రాజకీయపార్టీలు ఎందుకు అంగీకరించాయో అర్థం చేసుకపోవాలంటే, ‘హిందూ’ అనే పదం వెనక దాగివున్న రహస్యాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.


గత మూడు దశాబ్దాలుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ‘‘హిందూయిజం’’ ని ‘‘హిందూత్వ’’ నుండి వేరుచేస్తూ వచ్చాయి. మత మైనారిటీలను ‘‘హిందూ మెజారిటీవాదం’’ నుండి కాపాడాల్సిన అవసరాన్ని ప్రచారం చేశాయి. ‘‘హిందూ’’ పదానికి ఉన్న అర్థాన్ని కప్పిపుచ్చడంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల ప్రయోజనాలు దీని మూలంగా నెరవేరాయి.


తాము శత్రువులుగా భావిస్తున్నభారతదేశంలోని మతమైనారిటీలు, ప్రత్యేకించి ముస్లింలు ల పట్ల హిందూ జాతీయవాదులు అనుసరిస్తున్న వైఖరిమీద అందరూ దృష్టి నిలిపారు. కాని హిందూయిజం అనే భావన వెనుకవున్న కుతంత్రాన్ని గురించి చాలా తక్కువగానే రాయడం జరిగింది.‘హిందూ’ నిర్వచనంలో వస్తుగత వాస్తవికత లేదు. అంతేగాక వివిధ సామాజిక శాస్త్రాలలో ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనలకు అది భిన్నంగా వుంది. అణచివేతకు గురైన కులాల రాజకీయ ఆకాంక్షలను కంట్రోల్‌ చేసి అణచివేయడానికి మతాన్ని వాడుకున్నారు. ఈ కులాలకు చెందిన ప్రజలని వాళ్ళతో సంప్రదించకుండానే హిందూమతం అనే కేటగిరీలోకి చేర్చేసుకున్నారు. ఇలా ఈ మధ్యకాలంలో సృష్టించిన ఈ మత కేటగిరీ మెజారిటీ ప్రజల అస్థిత్వంగా ప్రచారం చేశారు. ఇలా చేయడం ద్వారా బ్రాహ్మణీయ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని హిందూ జాతీయవాదులు తాము మెజారిటీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోవడానికి అవకాశం పొందారు. ఈ విధంగా ఆధునిక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అగ్రకులాలు రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోగలిగాయి. ఉపఖండంలో నిత్యం వాస్తవంగా జరుగుతున్న కుల అణచివేతను, చరిత్రను వక్రీకరించగలిగారు. ఈ హిందూయిజం అనే పదాన్ని కొందరు చరిత్రకారులు, మేధావులు, మీడియా కూడా నిశ్శబ్దంగా అంగీకరించడంతో ఈ పదం పట్ల ప్రజలలో ఉండే అవగాహన, ఉపఖండంలోని దిగువ కులాల మెజారిటీ ప్రజల స్వీయ ఎరుకగా కూడా మారింది.


హిందూమతం పురాతన మతమనే వాదన ఒక పక్క ఉంది. మరోపక్క హిందూయిజం అనేది ఈ మధ్యకాలంలో జరిగిన సృష్టి అని చాలామంది మేధావులలో ఏకాభిప్రాయం వుంది. ఒక విశ్వాసాన్ని మతంగా గుర్తించాలంటే, ప్రభుత్వం, ఆ విశ్వాసాన్ని కలిగివుండే ఒక ప్రజాసముహం కూడా దాన్ని మతంగా అర్థం చేసుకుని వుండాలి. హిందూమతానికి సంబంధించి 20వ శతాబ్దపు ప్రారంభంలో మాత్రమే బ్రిటిష్‌ ప్రభుత్వం ఎవరిని హిందువులుగా గుర్తించాలన్న ఒక నిర్వచనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించింది. అప్పటివరకు బ్రిటిష్‌ అధికారులు హిందూయిజం అనే పదాన్ని తమ సౌకర్యంకోసం వాడుకున్నారు. దీన్ని వాళ్ళు క్రైస్తవ మిషనరీల నుండి తీసుకున్నారు. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు కానివాళ్ళందరినీ హిందువులుగా గుర్తించే ఒక నెగెటివ్‌ దృక్పథాన్ని వాళ్ళు అనుసరించారు.


లూయీస్‌ మెకైవర్‌ (ూవషఱం వీషIఙవతీ) అనే బ్రిటిష్‌ ప్రభుత్యోద్యోగి 1881 మద్రాస్‌ జనాభా లెక్కల నివేదికలో ఇలా రాశాడు. ‘‘ఒక మతంగా గాని లేదా కనీసం జాతిగా గాని గుర్తించడంలో ఈ పదాన్ని నిర్దిష్ట అర్థంలో కాక ఉదారంగా వాడడం జరిగింది. జాతి అనే దృక్పథంతో చూస్తే, నిజమైన ఆర్యబ్రాహ్మణులు, కొద్దిమంది క్షత్రియులు, దక్షిణ భారతదేశానికి చెందిన వెల్లలలు, పశ్చిమ భారతానికి చెందిన కల్లారులు, దక్షిణ పర్వతప్రాంతాలకు చెందిన పురాతన తెగలు ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక జాతిగా హిందూయిజం అని పిలిచారు. ఒక మత కేటగిరీగా చూస్తే అది వైదిక విశ్వాసాలను కొనసాగించే పవిత్ర బృందాలనీ రాక్షసులను పూజించే తిరునల్వేలి, దక్షిణ కెనరా ప్రాంతాలకు చెందిన ప్రజలనూ ఒకే గుంపుగా చేర్చింది’’
1921లో బ్రిటిష్‌ ఇండియాకు చెందిన ఒక జనాభా లెక్కల అధికారి తన నివేదికలో ఇలా రాశారు. ‘‘తమ మతంగా ‘హిందూ’ అనే పదం గురించి భారతీయులెవరికీ తెలియదు. 19వశతాబ్దం చివరవరకు, ఇంగ్లీషు భాషలో విద్యనభ్యసించిన కొద్దిమంది అగ్రకుల భారతీయులు మాత్రమే తమనితాము హిందూమతానికి చెందినవారిగా గుర్తించుకున్నారు. అటు ప్రభుత్వానికి, ఇటు ఎక్కువమంది ప్రజలకుప్రత్యేకించి అది బలవంతంగా రుద్దబడిన కిందికులాల ప్రజలకు సంబంధించిన పదంగా ‘హిందూ’అనే పదం కిందటి శతాబ్దంలో మాత్రమే ఉనికిలోకి వచ్చింది. అందుచేత హిందూమతాన్ని 20వ శతాబ్దపు సృష్టిగా రుజువు చేయవచ్చు. ఉపఖండ చరిత్రలో ఆధిపత్యం కలిగిన అగ్రకులాలు తమనితాముగాని ఇతరులనుగాని మతం ఆధారంగా గుర్తించలేదు. వాళ్లవాళ్ళ కులాల ఆధారంగానే గుర్తించారు. వర్తమానంలో పెరుగుతూన్న కుల దౌర్జన్యాలు అది ఇప్పటికీ వాస్తవమేనని రుజువుచేస్తున్నాయి. తాము అంటరానివాళ్ళుగా, తక్కువవారుగా భావించిన కింది కులాల ప్రజలతో కలిసి ఒకే కేటగిరీ కిందకు తమను తేవడాన్ని ప్రారంభంలో వాళ్ళు వ్యతిరేకించారు. 20వ శతాబ్దపు ప్రారంభంలో మాత్రమే అగ్రకులాల జాతీయవాద నాయకులు హిందూమతాన్ని ఒక రాజకీయ పథకంగా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువచ్చారు. గాంధీ, నెహ్రూల నాయకత్వంలోని కాంగ్రెస్‌పార్టీ ఈ కేటగిరిని ప్రశ్నించలేదు. అందుకు కారణం, అణచివేయబడ్డ కులాలతో కలిసి అధికారాన్ని పంచుకోవాల్సి వస్తుందనేది కాదు. ఆ కులాలను కూడా హిందూ కేటగిరిలో చేర్చడంతో వాళ్ళకు కూడా తామే ప్రాతినిధ్యం వహించే అవకాశం అగ్రకులాలవారికి కలిగింది. 1947లో అధికార మార్పిడి ఫలితంగా ఈ ప్రధాన అగ్రకుల శిష్టుల చేతుల్లోకి అధికారం వచ్చింది.


మిగిలిన అగ్రకుల నాయకులు ఈ హిందూ పథకాన్ని మరింత నిస్సిగ్గుగా స్వీకరించారు. ఆర్యసమాజానికి చెందిన బనియా నాయకుడు లాలా లజపతిరాయ్‌, ఛాందస సనాతన ఉద్యమానికి చెందిన బ్రాహ్మణ నాయకుడు మదనమోహన మాలవ్యాలు కలిసి 1915లో హిందూ మహాసభ అనే హిందూ జాతీయవాద రాజకీయ పార్టీని స్థాపించారు. భారతీయ జనసంఫ్‌ు, భాజపాలకు అది మాతృక. హిందూమహాసభలో సభ్యుడైన కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ 1925లో హిందూ గుర్తింపును ప్రచారం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అనే సంస్థను స్థాపించారు.


కిందికులాల ప్రజలను స్వాహా చేసి తమలో కలిపివేసుకోవడం ద్వారా ఒక హిందూ గుర్తింపును సృష్టించడానికి అగ్రకులాల నాయకులు 20వశతాబ్దమంతా ప్రయత్నించారు. ఆధిపత్య కులాలు పూజించే దేవుళ్ళను ప్రచారంలో పెట్టి, కిందికులాల సాంప్రదాయాలను కాలగర్భంలో కలిపివేయడం ద్వారా ఏకరూపమైన మత విశ్వాసాలను సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నించారు. హెన్రిక్‌ వాన్‌ స్టైటన్‌క్రాన్‌ (నవఱఅతీఱషష్ట్ర ఙశీఅ ూ్‌ఱవ్‌వఅషతీశీఅ) అనే ఒక జర్మన్‌ ఇండాలిజిస్ట్‌ వాయువ్య భారతదేశానికి చెందిన అగ్రకులాల దేవుళ్ళు, దేవతలు ‘‘ఇండియాను వలస’’గా చేసుకోవడం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, ‘‘స్థానిక దేవుళ్ళను, దేవతలను హైందవీకరణ చేసే క్రమం దేశంలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కొనసాగుతోంది.’’
ఈ పథకాన్ని మత సంస్కరణ పేరుతో జరుగుతున్న ఒక జాతి సంహారంగా వర్ణించవచ్చును. తెగలు, అణచివేయబడ్డ కులాల సాంస్కృతిక సంప్రదాయాలు మౌలికంగా మారిపోయాయి. ఉదాహరణకు ఒరిస్సా, కేరళ, తమిళనాడులలో ఎప్పటి నుంచో సాంప్రదాయక దేవతలుగా వున్న మారి అమ్మన్‌, భువాసుని, మానినగెశ్వరి, మాదన్‌, తంపూరన్‌లను స్థానభ్రంశం చేసి ‘గొప్ప’ హిందూ దేవుళ్ళు అయిన శివుడు, దుర్గ ఉనికిలోకి వచ్చారు. దేవాలయ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమాలు అనేకం జరిగాయి. దీని కారణంగా దేశంలోని అనేకచోట్ల దేవాలయాల ఆదాయం పెరిగింది.


కులాల మధ్య ఉద్రిక్తతలు తమ ప్రయోజనాలకు అడ్డంకిగా మారినప్పుడల్లా అగ్రకులాలు మతకలహాలను సృష్టించడానికి వీటిని పక్కదారి పట్టించాయి. కుల ఘర్షణలు తరచుగా హిందూ ముస్లిం హింసతో ముగిసేవి. ఆధిపత్య కులాల నుండి కింది కులాల ప్రజలు సామాజిక న్యాయంకోసం డిమాండ్‌ చేసినప్పుడల్లా, వాళ్ళ దృష్టి మరల్చడానికి ముస్లింలను ఉమ్మడి శత్రువుగా చూపెట్టారు. లేని ‘హిందూ’మతాన్ని సృష్టించడంతో హిందూ మెజారిటి అనే తప్పుడు భావన తలెత్తింది. నిమ్నకులాల ప్రజలే వాస్తవానికి మెజారిటీ అనే సత్యాన్ని అది కప్పిపెట్టింది. ఈ రకమైన హిందూ కుతంత్రం కారణంగా ముస్లింలు, ఇతర మత మైనారిటీలు బాధితులయ్యారు.


ఈ మధ్య కాలంలో మాత్రమే సృష్టించబడిన మతాన్ని సంస్కరించడం అనే ముసుగు కింద అగ్రకులాల ప్రజలు మెజారిటీగా వున్న కిందికులాల ప్రజలపై తమ అధికారాన్ని చెలాయించారు. ఈనాటికి కూడా దేవాలయాల్లో ప్రవేశించినందుకు, తమ కులాల వెలుపల వివాహాలు చేసుకున్నందుకు లేదా నీళ్ళను ‘అపవితర్ర’ చేసినందుకు దళితుల్ని హత్య చేస్తున్నారు. ఇందుకు శిక్షగా దళితుల బావులల్లో విషం కలుపుతున్నారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని గుర్తుచేయడం కోసం దళిత మహిళలపై అత్యాచారం చేస్తున్నారు. ప్రజాజీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూరాజకీయాలు, వ్యాపారం, మీడియా, న్యాయవ్యవస్థ వంటివి అణిచివేతకు గురైన అన్ని కులాలకు, ఆదివాసీలకు ప్రాతినిథ్యం నిరాకరించబడిరది. అణచివేతకుగురైన కుల నాయకులు సంస్కరణలను, ప్రాతినిధ్యాన్ని, వివక్షత అంతాన్ని కోరుతూ అనేక రాజకీయ ఉద్యమాలను నడిపారు.


ఈ రెండు రాజకీయ లక్ష్యాల మధ్య ఘర్షణలువేల సంవత్సరాలుగా సమాజంమీద కొనసాగుతున్న తమ ఆధిపత్యాన్ని హిందూ ఐక్యతా నినాదం ద్వారా కాపాడుకోవడానికి అగ్రకులాల ప్రయత్నం, కుల వ్యవస్థ నుండి విముక్తికోసం అణచివేతకు గురైన కులాల పోరాటం ఆధునిక భారత చరిత్రను తీర్చిదిద్దాయి.

Leave a Reply