హిడ్మే మర్కంను వెంటనే విడుదల చేయాలీ! చత్తిస్‌ఘఢ్‌లో పౌర హక్కుల కార్యకర్తలపై వేధింపులను ఆపాలి!
మార్చి 9, 2021
ఛత్తీస్‌ఘఢ్ పోలీసులు, పారా మిలటరీ దళాలు అదుపులోకి తీసుకుని శారీరక, లైంగిక హింసలకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకొన్న కావ్య నంది, పండే కవాసీ అనే యిద్దరు ఆదివాసీ యువతుల స్మృతిలో దంతేవాడ, సమేలిలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంనుంచి 28 ఏళ్ల ఖనిజ తవ్వకాల వ్యతిరేక, ఆదివాసీ హక్కుల కార్యకర్త హిడ్మే మార్కమ్‌ను నిస్సిగ్గుగా, చట్టవిరుద్ధమైన తీరులో ఎత్తుకెళ్లిన ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతుల్ని చేసింది.
ఆ తరువాత హిడ్మే మార్కంను, (d/o పోడియం మార్కం, బుర్గం గ్రామం, దంతేవాడ జిల్లా) UAPA సహా తీవ్రమైన ఆరోపణలతో 4 కేసులలో అరెస్టు చేసినట్లు చూపించారు. మహిళా దినోత్సవ కార్యక్రమంలోనే, ఆమె ప్రాథమిక హక్కుల్ని, అరెస్టు చేయడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద అరెస్టు చేయడానికి వున్న మార్గదర్శకాలను ఉల్లంఘించడం, అందులోనూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమక్షంలో మహిళా కార్యకర్తని బలవంతంగా తీసుకెల్ళారంటే ఎవరూ నమ్మరు. ఖైదీల విడుదల కమిటీ (జైల్ బందీ రిహాయి కమిటీ), ఛత్తీస్‌గఢ్ మహిళా అధికార్ మంచ్ కార్యకర్తలతో సహా 300 మంది సమక్షంలో ఆమెను లాక్కెళ్ళారు. హిడ్మే అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సోనిసోరిని, ఇతరులను పోలీసు సిబ్బంది దౌర్జన్యంగా పక్కకు నెట్టేశారు. హిడ్మేను వెంటనే విడుదల చేయాలని, నక్సలిజానికి సంబంధించిన ఆరోపణలతో ఆదివాసీ కార్యకర్తలను నిరాధారంగా అరెస్టు చేస్తున్న ఈ అంతులేని గాథకు ముగింపు పలకాలనీ డిమాండ్ చేస్తున్నాం.
పారామిలిటరీ క్యాంపుల నిర్మాణ వ్యతిరేక కార్యకర్తగా, నిర్వాసిత వుద్యమ కార్యకర్తగా, ఈ ప్రాంతంలో బాగా తెలిసిన హిడ్మే మార్కమ్, జైలు బంధి రిహాయీ కమిటీ కన్వీనర్‌గా తప్పుడు నేరారోపణలతో కేసులు పెట్టడానికి నిరసనగానూ, అరెస్టు చేసి జైళ్లలో పెట్టిన వారి విడుదల కోసమూ; పోలీసు క్యాంపుల స్థాపనకు వ్యతిరేకంగా, పవిత్ర స్థలాల్లో ఖనిజ తవ్వకాల వ్యతిరేక సమస్య లాంటి అనేక సమస్యల గురించి గవర్నర్, ముఖ్యమంత్రి, కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ తదితర అనేక ఇతర ఉన్నత స్థాయి అధికారులను కలిశారు అనేది గుర్తుంచుకోవాల్సిన కీలక అంశం. అందుకని, ఇప్పుడు ఎందుకు అరెస్టు చేసారు? అనే ప్రశ్నకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు సమాధానం చెప్పాలి.
ఈ ప్రశ్నలకు సమాధానం హిడ్మే మార్కమ్ కార్యకలాపాలలో చూడాలి. నక్సలైట్లు అనే ముద్రతో, తప్పుడు కేసుల్లో ఏళ్ళతరబడి విచారణా ఖైదీలుగా జైళ్ళలో వున్న వేలాది మంది ఆదివాసీలను విడుదల చేయాలని డిమాండ్ చేసే వేదిక, ఖైదీల విడుదల కమిటీ (జైల్ బందీ రిహాయి కమిటీ) కన్వీనర్ ఆమె. బాగెల్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు ఈ కమిటీ ఏర్పడిందనేది ఒక విచిత్రం.
అదానీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కార్పొరేట్ సంస్థలు నాశనం చేస్తున్న ఆదివాసీల పవిత్రమైన కొండ నంద్రాజ్ పహాడ్‌ను రక్షించడానికి జరుగుతున్న ఉద్యమంలో హిడ్మే పాల్గొన్నది. స్థానిక ప్రజలు దేవతగా భావించే, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యతకలిగిన కొండను నాశనం చేసే బైలాదిలా మైన్ డిపాజిట్ ప్రాజెక్ట్ 13కు వ్యతిరేకంగా మాట్లాడింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు భూమి, నీటి వనరుల క్షీణతకు, వేలాది చెట్ల నరికివేతకు కారణమవుతుంది. హిడ్మే మార్కమ్ దంతేవాడ, సుక్మా, బీజాపూర్ ప్రజల సమస్యల పైన పని చేస్తున్నది.
2019లో, పొటాలిలో, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డిఆర్జి) ఏర్పాటుచేసిన పోలీసు క్యాంప్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో, హిడ్మేతో పాటు వేలాది మంది ఆదివాసులు దంతేవాడ నుండి పాల్గొన్నారు. మహిళా సమస్యలపై ఛత్తీస్‌గఢ్ మహిళా మంచ్ కార్యకర్తగా చురుకుగా పనిచేస్తోంది. మహిళలపై లైంగిక హింస, రాజ్య అణచివేత (డబ్ల్యుఎస్‌ఎస్) నిర్వహించిన కార్యక్రమాల్లో వక్తగా పాల్గొంది.
హిడ్మే మార్కమ్ ప్రజల సమస్యలను పోలీసులతో సహా ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు తీసుకువెళ్ళింది, పిటిషన్లు ఇచ్చింది, ప్రజలపై పోలీసుల దుర్మార్గాలకు శాంతియుత నిరసన తెలిపింది. ప్రభుత్వానికి, కార్పొరేట్లకు యిబ్బంది కలిగిస్తున్న ఆందోళనల నేపథ్యంలో, ప్రజలను లక్ష్యంగా చేసుకోడానికి వివిధ మార్గాలను కనుగొంటున్న పోలీసుల వేధింపులను హిడ్మే నిరంతరం ఎదుర్కొంటోంది. ఈ రోజు, ప్రభుత్వ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నాలు చేసిన తననే, ఎలాంటి హెచ్చరిక లేకుండా, లేదా బంధువులకు ఏ వివరణ యివ్వకుండానే పోలీసులు వాహనంలో బలవంతంగా ఎత్తుకెళ్లారు.
ఛత్తీస్‌ఘఢ్ ప్రజల పరిస్థితిని బహిర్గతం చేయడానికి హిడ్మే మార్కమ్ అవిశ్రాంతంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయనీ, రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడే వారందరికీ సందేశం ఇవ్వడమే, ఆమె అరెస్టు వెనకనున్న ఉద్దేశ్యం అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రోజు, హిడ్మే మార్కమ్‌ను విడుదల చేయాలన్న డిమాండ్ కేవలం పోలీసుల దుర్మార్గాలను లేదా కార్యకర్తల అణచివేతను నిరసించడానికి మాత్రమే కాదు. ఆదివాసీల జీవితాలు ఉపేక్షించదగినవని అమానుషంగా భావించే ఛత్తీస్ గఢ్ ప్రజల హక్కులకు ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు, కారాగార వ్యవస్థల్లో బందీలుగా వుండడం కన్నా విడుదల కోసం పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదు.
మా డిమాండ్లు:
- మానవ హక్కుల కార్యకర్త హిడ్మే మార్కం ను వెంటనే విడుదల చేయాలి!
- ప్రజల్ని బూటకపు ‘లొంగిపోవడాలకి’ బలవంతం చేస్తున్న “లోన్ వరటు” (ఇంటికి రండి) పథకాన్ని రద్దు చేయాలి!
- రాజ్యాంగ వ్యతిరేక జిల్లా రిజర్వ్ గార్డ్స్ ఫోర్స్ (DRGF) ను రద్దు చేయాలి!
పీయూసీఎల్, చత్తీస్‌గఢ్
చత్తీస్‌గఢ్ మహిళా అధికార్ మంచ్