జమ్ము, కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలోఐదు సంవత్సరాలకు పైగా 2010 రోజులు.. జైలులో వున్న కశ్మీర్ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్ గాథ 2024 ఫిబ్రవరి29 న, ఇంటికి తిరిగి వచ్చారు . అప్పుడు ఆసిఫ్ సుల్తాన్ ఆరేళ్ల కుమార్తె అరీబా తన తండ్రిని మొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యక్తిగా చూసింది. అంతకుముందు, శ్రీనగర్ సెంట్రల్ జైలు జాలీ గోడ వెనుక చేతికి సంకెళ్లతో కటకటాల వెనుక వున్నప్పుడు చూసింది. ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జైలుకు, ఆపై జమ్మూలోని కోట్ భల్వాల్ జైలుకు తరలించారు.
“అరీబాకి తన తండ్రిని మొదటిసారి చూసినట్లు అనిపించింది” అని ఆసిఫ్ 67 ఏళ్ల తండ్రి మహ్మద్ సుల్తాన్ సయ్యద్ ఐదున్నర సంవత్సరాల తర్వాత సుల్తాన్ ఇంటికి తిరిగి వచ్చిన రోజు గురించి జ్ఞాపకం చేసుకున్నాడు.
కానీ జమ్ము, కశ్మీర్ పోలీసులు ఐదేళ్ల నాటి కేసులో మళ్లీ అదే రోజున అరెస్టు చేయడంతో, గడచిపోయిన కాలాన్ని మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న సుల్తాన్, అతని కుమార్తె ఆశలు అడియాసలయ్యాయి.
“ఆసిఫ్‌ను మళ్లీ అరెస్టు చేసిన వెంటనే, నాతో “ఇప్పుడే తిరిగి వచ్చాడు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్లాడు? “ అని అరీబా అడిగితే ‘ఖురాన్ సగమే చదివాడు, పూర్తిగా చదవడానికి వెళ్ళాడని చెప్పాను. ఆరేళ్ల బాలికకు ఇంక ఏం చెప్పగలను? అతను పండగరోజులకల్లా తిరిగి వస్తాడని ఆశ’ అని అంటారు, ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన, ఆసిఫ్ తండ్రి సయ్యద్.
పండగ వచ్చి వెళ్లిపోయింది కానీ సుల్తాన్ శ్రీనగర్ సెంట్రల్ జైలులో 2019 ఏప్రిల్ 4 నాడు జరిగిన ఒక అల్లర్ల ఘటనకు సంబంధించిన ఉపా కేసులో జైలులో ఉన్నాడు.
సుల్తాన్ ఇంటికి తిరిగి వచ్చిన రోజునే జమ్ము కశ్మీర్ పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. 2018 ఆగస్టు ఉపా కేసులో 2022 ఏప్రిల్‌లో బెయిల్ వచ్చింది. 2019 ఆగస్టులో పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ (పిఎస్ఎ) కింద నిర్బంధ ఉత్తర్వు 2023 డిసెంబర్ 7న రద్దు అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని జైలు అధికారులు సుల్తాన్‌ను విడుదల చేయడానికి 78 రోజులు లేదా రెండున్నర నెలలకు పైగా సమయం తీసుకున్నారు. అతను విడుదల కావడానికి రెండు వారాల ముందు 2024 ఫిబ్రవరి 15 న హోం సెక్రటరీ అతనిపై కేసును ఆమోదించారు.
హిజ్బుల్ ఉగ్రవాదుల “ఓవర్ గ్రౌండ్ వర్కర్” (ఓజిడబల్యూ) అని జమ్ము- కశ్మీర్ పోలీసులు సుల్తాన్ పైన ఆరోపణ చేశారు. జులైలో శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి 2018 ఆగస్టు 31న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందాడు.
ఆరోపించిన నేరాలకు సుల్తాన్‌కు సంబంధం వున్నదనడానికి “ప్రత్యక్ష సాక్ష్యం” లేదా “నిర్ధారిత సాక్ష్యం” లేదని 2022 ఏప్రిల్ 5నాడు సుల్తాన్‌కు బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి చెప్పారు.
అతను ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, సాక్షులు అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, సహ నిందితులు అతన్ని గుర్తించలేదని న్యాయమూర్తి అన్నారు.
“కాశ్మీర్‌లో మీడియాపై అణిచివేత 2018లో ఆసిఫ్ కేసుతో ప్రారంభమైంది. “ఇది ఆసిఫ్‌పై కాదు, కశ్మీరీ జర్నలిజంపై చార్జిషీట్” అని తన గుర్తింపుని తెలియచేయడానికి యిష్టపడని ‘కశ్మీర్ రీడర్’లోని సుల్తాన్ పూర్వ సహోద్యోగి అన్నారు.
2018లో సుల్తాన్ అరెస్టయిన తర్వాత, 1990ల ప్రారంభం నుండి తిరుగుబాటు పట్టులో ఉన్న ముస్లిం మెజారిటీ ప్రాంతంలో కశ్మీరీ ప్రభుత్వం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడిన లేదా వ్రాసిన జర్నలిస్టులు ఎడతెగని దాడులను ఎదుర్కోవడం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు పరిమిత స్వయంప్రతిపత్తిని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి నేరుగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది.
విమర్శనాత్మక కథనాలను రాసిన జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు రప్పించడం, వారి ఇళ్లను సోదా చేయడం, కేసులు నమోదు చేయడం, తీవ్రమైన నేరాలు మోపడం, అరెస్టులు మొదలైన చర్యలు పత్రికల వెన్ను విరిచాయి. అంతకు ముందు, ప్రపంచంలోనే అత్యంత సైనికీకరణ జరిగిన ప్రాంతంగా పేర్కొనే ఆ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ వైఫల్యాలు, వ్యక్తుల గురించి వ్రాయగలిగే పరిస్తితి వుండేది.
హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం, 2019 నుండి, కనీసం 35 మంది కశ్మీరీ జర్నలిస్టులు తమ రిపోర్టింగ్ కారణంగా “పోలీసు విచారణ, దాడులు, బెదిరింపులు, భౌతిక దాడులు, ఉద్యమ స్వేచ్ఛపై పరిమితులు లేదా తప్పుడు క్రిమినల్ కేసులు” ఎదుర్కొన్నారు. అక్టోబర్ 2022లో ఫోటోగ్రఫీకి పులిట్జర్ బహుమతిని అందుకోకుండా అడ్డుకొన్న సన్నా ఇర్షాద్ మట్టూతో సహా మరి కొందరిని దేశం బయటికి వెళ్లడానికి అనుమతించలేదు.
సుల్తాన్ కేసు కాకుండా, మరో ఐదుగురు జర్నలిస్టులు – ఫహద్ షా, గౌహర్ జిలానీ, మస్రత్ జహర్, మనన్ గుల్జార్ దార్, ఇర్ఫాన్ మెహ్రాజ్‌ల పైన ఉపా కింద; ముగ్గురు జర్నలిస్టులు ఫహద్ షా, ఖాజీ షిబ్లీ, సజాద్ గుల్‌ల పైన పిఎస్‌ఎ కింద కేసు పెట్టారు. ముగ్గురు జర్నలిస్టులు – సజాద్ గుల్, ఇర్ఫాన్ మెహ్రాజ్, మరియు సుల్తాన్ – ఇప్పటికీ కటకటాల వెనుక ఉన్నారు.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 2023లో భారతదేశం 161వ స్థానంలో ఉంది, ఇది రెండు దశాబ్దాలలో కనిష్ట స్థానం. జర్నలిస్టులపై, పత్రికా స్వేచ్ఛపై రాజ్య అణచివేతకు సంబంధించిన ప్రధాన ప్రపంచ కేసుల్లో ఒకటిగా సుల్తాన్ కేసు మారింది.
2019లో, యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ప్రెస్ క్లబ్ సుల్తాన్‌కి జాన్ ఆబుచాన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డును అందించింది. నేషనల్ ప్రెస్ ఒక ప్రకటనలో, “సుల్తాన్ కేసు కశ్మీర్‌లో పత్రికలు, పౌరుల అధ్వాన్నమైన పరిస్థితులను ప్రతిబింబిస్తుంది” అని పేర్కొంది.
టైమ్ మ్యాగజైన్ 2019 మే ఎడిషన్‌లో సుల్తాన్ కేసును “ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు కలిగించే అత్యంత ముఖ్యమైన కేసులలో ఒకటి”గా వర్ణించింది.
2020లో, జర్నలిస్టుల రక్షణ కమిటీ, 400 మంది జర్నలిస్టులు, పౌర సమాజ సభ్యులతో పాటు, “ఆసిఫ్ సుల్తాన్‌ను తక్షణమే, బేషరతుగా విడుదల” చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు.
ఇప్పటికీ జర్నలిజంలో ఉన్నప్పటికీ అధికారుల దృష్టిని ఆకర్షించే అంశాలపై నివేదికలు రాయడానికి సాహసించని సుల్తాన్ స్నేహితుడు ఒకరు ఇలా అన్నాడు “కేవలం తన పనిని తాను చేసినందుకు పాలనాయంత్రాంగమ ఆసిఫ్, అతని కుటుంబ జీవితాన్ని ఐదేళ్లపాటు లాగేసుకుంది.”
“ఈరోజు, ఇతర జర్నలిస్టులు ఆసిఫ్ కేసును అధికార యంత్రాంగం ఎంత దూరం వెళ్లగలదు అనేదానికి ఒక భయంకరమైన ఉదాహరణగా చూస్తున్నారు.”
మళ్లీ అరెస్టు
ఫిబ్రవరి 29 మధ్యాహ్నమే సుల్తాన్ ఇంటికి చేరుకున్నాడని, నాలుగు గంటలకు వచ్చిన ఫోన్ కాల్‌లో తమ్ముడు మాట్లాడినప్పుడు తాము బత్‌మాలూ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నామని, జమ్ము, కాశ్మీర్ వెలుపల జైలులో వుండడం వల్ల ఆసిఫ్ కొన్ని కాగితాలపై సంతకం చేయాల్సి ఉందని చెప్పారు.
సయ్యద్, అతని సోదరుడు కూడా ఆసిఫ్‌తో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆసిఫ్‌కు అకస్మాత్తుగా తల తిరగడం ప్రారంభించడంతో, వారు అతన్ని శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారీతో పాటు ఒక పోలీసు ఉన్నాడు.
తొమ్మిది గంటలకు తిరిగి పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు, పోలీసులు ఆసిఫ్‌ను రైన్‌వారీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ అరెస్టు చేశారు. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారో ఆ రోజు కుటుంబసభ్యులకు తెలియలేదు.
2019 ఏప్రిల్‌లో శ్రీనగర్ సెంట్రల్ జైలులో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పోలీసులు యూఏపీఏ కింద రెండో కేసు నమోదు చేశారని సుల్తాన్ తరపు న్యాయవాది ఆదిల్ అబ్దుల్లా పండిట్ తెలిపారు. కేసు గురించి కుటుంబ సభ్యులకు పెద్దగా సమాచారం లేదు.
బ్యారక్‌లో విధ్వంస కాండ
లాకప్ కాంప్లెక్స్‌లో మరమ్మత్తు పనుల కారణంగా ఖైదీలను లోయ నుండి తరలిస్తారనే పుకారు వ్యాపించడంతో శ్రీనగర్ జైలు ఖైదీలు 2019న ఏప్రిల్ 04న సిబ్బందితో ఘర్షణ పడ్డారు. అదే రోజు, శ్రీనగర్‌లోని రైనావారి పోలీస్ స్టేషన్‌లో, ఉపా చట్టం సెక్షన్ 13, రణబీర్ శిక్షాస్మృతి (ప్రస్తుతం ఇండియన్ పీనల్ కోడ్) కింద “అల్లర్లు”, “ఆయుధాలు ధరించి మారణకాండకు పాల్పడడం”, “ప్రాణహాని కలిగించడం”, “ఆస్తికి నష్టం కలిగించడం”, “ప్రభుత్వ ఉద్యోగులను గాయపరచడం”, “హత్య ప్రయత్నం” లాంటి ఆరోపణలతో తొమ్మిది సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, “చేపడుతున్న మరమ్మతుల్లో భాగంగా పోలీసులు బ్యారక్‌లోని కొంత భాగాన్ని తొలగించారు. “భారతదేశ వ్యతిరేక/చట్టవ్యతిరేక కార్యకలాపాలు” నిర్వహించడానికి కొంతమంది ఖైదీలు, ఆ తర్వాత సమీపంలోని బ్యారక్‌ల నుండి వచ్చిన మరికొంతమంది ఖైదీలు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. తాళాలు, తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లను ధ్వంసం చేశారు. మరమ్మత్తు పనులు చేస్తున్న కార్మికులు, జైలు సిబ్బందిపై రాళ్లు రువ్వారు.
ఖైదీల క్యాంటీన్‌లోని ఏడు గ్యాస్ సిలిండర్లను కూడా ఖైదీలు లాక్కొచ్చి జైలులోని ప్రధాన ద్వారంతో సహా పలు ప్రాంతాల్లో నిప్పంటించారని పోలీసులు తెలిపారు. లైట్లు, సిసి కెమెరాలను పగులగొట్టారు. కొత్తగా కట్టిన గోడను కూల్చేసారు.
జైల్లోని ఓ నిర్మాణాన్ని కూడా ఖైదీలు తగలబెట్టారని అప్పటి పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ చెప్పారు. అయితే, సెంట్రల్ జైలులో అల్లర్లు జరిగిన రోజు చిత్రీకరించినట్లుగా చెప్పబడుతున్న వీడియోలో కనబడేది మరొక విధంగా వుంది.
బహుశా ఖైదీ (కెమెరాలో ముఖం కనబడడం లేదు) స్వరం ప్రకారం, జైలు అధికారులు “ఖురాన్‌ను అపవిత్రం చేసారు; ఖైదీలు అందుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.”
సుల్తాన్ తరపు న్యాయవాది పండిట్, 2024న మార్చి 1న శ్రీనగర్‌లోని సెషన్స్ కోర్టులో బెయిల్ దరఖాస్తును దాఖలు చేశారు. బెయిల్‌ను వ్యతిరేకిస్తూ చేసిన పిటిషన్‌లో ప్రభుత్వం, అల్లర్లు జరిగిన దాదాపు ఐదేళ్ల తర్వాత – సుల్తాన్‌తో పాటు 26 మంది నిందితులుగా ఉన్న ఖైదీలలో మరో ఖైదీతో కలిసి “కీలక నిందితుడు”, “ప్రేరేపకుడు” పాత్ర పోషించాడని ఆరోపించింది.
జైలు బ్యారక్‌లకు నిప్పంటించడంలో, “ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు”, “హత్యాయత్నాలు”, “దేశ వ్యతిరేక నినాదాలు చేయడం”, “జాతీయ సమగ్రతకు వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాప్తి చేయడం”లో సుల్తాన్ “కీలక పాత్ర” పోషించాడని; సుల్తాన్‌కు “దేశవ్యతిరేక ధోరణి” ఉందని; “శాంతి, ప్రశాంతతపై ప్రభావం చూపడం”పై దృష్టి సారించిన పోలీసులు, సుల్తాన్‌కు “ఉగ్రవాద అంశాలతో అనుబంధం లేదా అలాంటి ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయాలనే ఉద్దేశం వుంది” అని కూడా ప్రభుత్వం ఆరోపించింది.
నిందితుడు బెయిల్‌పై విడుదలైతే సాక్ష్యాలను తారుమారు చేసి కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
“సరైన సమయంలో మేము ఈ విషయంలో సానుకూలమైన ఫలితాన్ని సాధిస్తామని నాకు నమ్మకం ఉంది” అని న్యాయవాది 2024 మార్చి 19న చెప్పారు.
జర్నలిజంను ఎంచుకోవడం
తెలిసిన వారు సుల్తాన్‌ను సాంప్రదాయ దుస్తులు ధరించి, మృదువుగా మాట్లాడే , నిశ్శబ్దంగా, సమర్థవంతంగా తన పనిని తాను చేసుకొనే ఒక అందమైన జర్నలిస్టుగా అభివర్ణిస్తారు. పెద్దగా మాట్లాడేవాడు కాదు, ఆఫీసు రాజకీయాలు, కబుర్లలో పాల్గొనేవాడు కాడు అని చెప్పారు.
తన పేరు చెప్పకూడదనే షరతుతో, మీడియా ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ (ఎంఇఆర్‌సి)లో అతని క్లాస్‌మేట్, ప్రస్తుతం ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలా అన్నారు, “అతను తన బంధు మిత్రులతో చాలా తక్కువగా మాట్లాడతాడనేది వాస్తవం. కానీ అతను ఒక పెద్దమనిషి, తన పని తాను చూసుకొనేవాడు, జర్నలిస్టిక్ సర్కిల్‌లో మంచి గౌరవం పొందాడు.”
పూర్వ ఆరోగ్య కార్యకర్త కుమారుడిగా, తన తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చడానికి సుల్తాన్ డాక్టరు అవాల్సింది. కానీ, ముగ్గురు పిల్లలలో చిన్నవాడైన సుల్తాన్ చిన్నవయసులోనే వ్రాయాలనే అభిరుచిని పెంచుకున్నాడు, విద్యార్థిగా వున్నప్పుడు ఆ అభిరుచిని మెరుగుపరుచుకొన్నాడు.
తన తండ్రి కోరిక మేరకు శ్రీనగర్‌లోని శ్రీ ప్రతాప్ కాలేజీలో మైక్రోబయాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదివాడు. 2008లో ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత, సుల్తాన్ కశ్మీర్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం, లైబ్రరీ సైన్స్, మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకుంటే సీటు దొరికింది.
రచనల పట్ల తనకున్న అభిరుచికి తన తండ్రి కోరికను తీర్చడానికి జరిగిన పోరాటం మధ్య, సుల్తాన్ జర్నలిజాన్ని ఎంచుకున్నాడు. కానీ, ఈ నిర్ణయంపై కశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతంలో జర్నలిజం చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తన తండ్రి నుండి హెచ్చరికను కూడా అందుకున్నాడు. అతను తన కుటుంబంలో జర్నలిస్టుగా మారిన మొదటి సభ్యుడు.
తన పేరు బయటపెట్టవద్దన్న సుల్తాన్ చిన్ననాటి స్నేహితుడు ఇలా అంటాడు, “అతను తన జీవితమంతా జర్నలిజం ప్రాథమికాలను నేర్చుకోవడానికి అంకితం చేశాడు. అతను చాలా క్రమశిక్షణ, ధార్మిక మనస్తత్వం కలిగిన, నిజాయితీపరుడు. వృత్తి విలువలతో ఎనాడూ రాజీ పడలేదననడంలో సందేహం లేదు.”
విద్యార్థిగా, సుల్తాన్ కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని మీడియా ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ విభాగంలో చేరాడు, అక్కడ, అతను ఒకప్పుడు అదే విభాగంతో అనుబంధం కలిగిన, శ్రీనగర్‌లో కన్వేయర్ మాసపత్రిక సంపాదకుడు అయిన షౌకత్ మొట్టా పరిచయం అయారు. అతను సుల్తాన్ ప్రొఫెసర్ సిఫారసు మేరకు ఇంటర్న్‌షిప్ యిచ్చాడు.
2009లో సుల్తాన్ కన్వేయర్‌గా నియమితుడయ్యాడు. పత్రికలో రాజకీయాలు, మానవ హక్కులు పర్యావరణాన్ని గురించి వచ్చేది. 2012 వరకు ఇక్కడ పనిచేశాడు. నష్టాల కారణంగా పత్రిక మూతపడింది.
సుల్తాన్ 2012 మే లో ‘కశ్మీర్ రీడర్’లో చేరాడు, ఆపై 2015లో ‘కశ్మీర్ నరేటర్’లో చేరారు. 2018 ఏప్రిల్ 4 నాడు కశ్మీర్ నరేటర్’లో సహాయ సంపాదకుడుగా వున్న సుల్తాన్, “ఒక మరణిస్తున్న తిరుగుబాటుదారుడు షోపియాన్ కచ్‌దూరాలో తన రక్తంతో కలిమాను వ్రాసినప్పుడు” అనే శీర్షికతో ఒక రిపోర్టు రాసాడు. దానితో పాటు గోడపై వచనం రాసి వున్న ఫోటో కూడా ఉంది.
2018 ఏప్రిల్ 1నాడు దక్షిణ కశ్మీర్, షోపియాన్ జిల్లాలోని కచ్‌దూరా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చిన ఘటనపై ఆధారపడిన రిపోర్టు యిది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు, ముగ్గురు పౌరులు కూడా మరణించారు.
‘కశ్మీర్ నరేటర్’ పూర్వ ఉద్యోగి, తన పేరు చెప్పవద్దనే షరతుతో, “వార్త ప్రచురించతమయ్యాక, వార్తాపత్రిక యజమాని, సంపాదకుడు షౌకత్ మొట్టాకు సిఐడి నుండి వచ్చిన ఫోన్‌లో వారిద్దరూ తీవ్రవాదాన్ని కీర్తించారని ఆరోపించారు” అని వివరించారు.
పైన పేర్కొన్న ఉద్యోగి ప్రకారం, “నిజాయితీ గల జర్నలిస్ట్‌గా, ఆన్‌లైన్ డెస్క్‌ను నిర్వహించే ఆసిఫ్, రాళ్లదాడి, ఇతర ఘటనలతో సహా అన్ని రకాల వార్తల పైన రిపోర్టు తయారుచేసేవాడు. అతనికి ఈ ఘటనలు కేవలం వార్తలే. “రాజకీయాలు, పర్యావరణం, విద్య, సామాజిక సమస్యలపై నివేదికలు ఉన్న ఆసిఫ్ విభిన్న రిపోర్టింగ్ పోర్ట్‌ఫోలియో (వృత్తికి సంబంధించిన వివరాలు)ను ప్రభుత్వం చూడలేకపోయింది.”
ఆ సమయంలో పోలీసులు సుల్తాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ, అధికారుల దృష్టిలోకి వచ్చాడు అని అతను తెలిపారు.
“ఈ రోజు, ఆసిఫ్ అసంబద్ధ ఆరోపణలపై కేసులను ఎదుర్కొంటున్నా లేదా అరెస్టు తర్వాత అరెస్టు చేస్తున్నా, ఇదంతా ఆ వార్తతో ప్రారంభమైంది” అని ఉద్యోగి చెప్పారు.
కచ్‌దూరా ఘటనపై వార్త ప్రచురితమైన రెండు నెలల తర్వాత, ఆసిఫ్ రెండేళ్ల క్రితం హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీపై ఒక కథనాన్ని వ్రాసాడు (వనీ హత్య కశ్మీర్‌లో అపూర్వమైన నిరసనలకు దారితీసింది, ఇందులో దాదాపు 100 మంది పౌరులు మరణించారు). 2018 జూలై 1న ‘కశ్మీర్ నరేటర్’ వనీపై ఒక కథనాన్ని ప్రచురించింది. 4000 పదాల వార్త శీర్షిక “బుర్హాన్ వనీ ఎదుగుదల”.
మాజీ ఓవర్ గ్రౌండ్ వర్కర్‌లు, యుద్ధ నిపుణులు, పోలీసు మూలాల ఇంటర్వ్యూల ఆధారంగా రాసిన వార్తా కథనం , హత్యకు గురైన కమాండర్ జీవితాన్ని లోతుగా పరిశోధిస్తుంది. ” సజీవంగా ఉన్న బుర్హాన్ కంటే సమాధిలో వున్న బుర్హాన్ ఎందుకు ఘాతకుడుగా ఉన్నాడు?”అని ప్రశ్నిస్తుంది.
ఓజిడబల్యూ అంటే ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్. అంటే మిలిటెంట్లకు సహాయం, నగదు, ఆశ్రయం అందించే వ్యక్తులు. కానీ వారు వీరు తమ ఇళ్లను లేదా గ్రామాలను వదిలేసి ఆయుధాలు చేపట్టరు.
సుల్తాన్ పూర్వ సహోద్యోగి ఇలా అన్నాడు, “అసిఫ్ బుర్హాన్ మిలిటెంట్ కమాండర్‌గా వనీ జీవితాన్ని కొత్త కోణంలో అన్వేషించాలనుకున్నాడు. ఒకప్పుడు వనీ నెట్‌వర్క్‌లో భాగమైన కొంతమంది మాజీ ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్‌తో అతను ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ వార్తలో ప్రత్యేకమైన వివరాలతో పాటు మునుపెన్నడూ చూడని కొన్ని ఫోటోలు ఉన్నాయి.
ఈ వార్త చాలా రోజులుగా కశ్మీర్‌లో చర్చనీయాంశంగా మారింది; అధికారుల దృష్టిని ఆకర్షించింది.
ఆ ఉద్యోగి ప్రకారం, వార్త ప్రచురితమైన కొన్ని రోజుల తర్వాత, పోలీసులు ‘కశ్మీర్ నరేటర్’ “జర్నలిస్టిక్ విలువలను విచ్ఛిన్నం చేస్తున్నారని”, “ఉగ్రవాదాన్ని భావాత్మకంగా మారుస్తున్నారని” ఆరోపించారు. ఆ వార్తను ఎందుకు ప్రచురించారో వివరించమని ఎడిటర్‌ను అడిగారు.
అయితే, విషయం వెంటనే ఊపందుకోలేదు. దాదాపు రెండు నెలల తర్వాత, ఆగష్టు 27న, పోలీసులు సుల్తాన్ ఇంటిపై దాడి చేసి, అతనిపై తీవ్రవాద ఆరోపణలపై కేసు నమోదు చేసి, మూడు రోజుల తర్వాత అరెస్టు చేశారు.
అరెస్టు
2018 ఆగస్టు 12న సుల్తాన్‌పై కేసు నమోదైంది. ఆ రోజు, ఉగ్రవాదుల గుంపు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు శ్రీనగర్‌లోని బత్‌మలూ ప్రాంతంలోని ఒక ఇంటిని చుట్టుముట్టాయి.
వారు ఇంటిని సోదా చేయడం ప్రారంభించినప్పుడు, ఉగ్రవాదులు లోపల నుండి కాల్పులు ప్రారంభించారు, నలుగురు భద్రతా దళాల సిబ్బంది గాయపడ్డారు. వీరిలో జమ్ము కాశ్మీర్ పోలీసులకు సంబంధించిన ఒకరు మరణించారు. ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు.
ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఇల్లు బత్‌మలూలోని దియర్వానీ ప్రాంతానికి చెందిన మాజీ ఉగ్రవాది మహ్మద్ షఫీక్ భట్‌కు చెందినది. సంఘటన జరిగిన ప్రదేశం నుండి సుల్తాన్ ఇల్లు ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉంది.
అదే రోజు, పోలీసులు బత్‌మలూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, “ఇంట్లో ఉగ్రవాదులను దాచిపెట్టి, ఆశ్రయం కల్పించాడు” అనే ఆరోపణలపై భట్‌ను అరెస్టు చేశారు.
“సక్రియ టెర్రరిస్టులకు మద్దతు ఇవ్వడానికి కుట్ర పన్నారు” అనే ఆరోపణతో అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వసీం అహ్మద్ ఖాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
2019 ఫిబ్రవరి 6 న దాఖలు చేసిన పోలీసు ఛార్జిషీట్ ప్రకారం, భట్ తన ఇంట్లో ఉంటున్న ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించాడు; వాళ్ళను అక్కడికి అతనే తీసుకువచ్చాడు. చార్జిషీట్‌లో మరో ముగ్గురిని బిలాల్ అహ్మద్ భట్, షాజియా యాకూబ్, ఆసిఫ్ సుల్తాన్ – ఉగ్రవాదుల సహ-కుట్రదారులు, సహచరులుగా చేర్చారు.
సహ నిందితులు బిలాల్, షాజియాలను ఆగస్టు 23న అరెస్టు చేయగా, నాలుగు రోజుల తర్వాత సుల్తాన్‌ను అతని ఇంటి నుంచి తీసుకెళ్లి అధికారికంగా అరెస్టు చేసే వరకు అక్రమ నిర్బంధంలో ఉంచారు.
సుల్తాన్‌పై ఛార్జ్ షీట్ ప్రకారం, అతను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అబ్బాస్ షేక్‌ను హతమార్చడానికి “ఆశ్రయం, సహాయం అందించడం”; “శ్రీనగర్ పట్టణంలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం”లో పాల్గొన్నాడు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో సుల్తాన్ పనిచేశాడని, అరెస్టు సమయంలో సుల్తాన్ ఇంటి నుంచి ఉగ్రవాద సంస్థకు చెందిన 17 పేజీల లెటర్‌హెడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. సుల్తాన్ తన ఫేస్‌బుక్ ఖాతా నుండి హిజ్బుల్ ముజాహిదీన్ సందేశాలను “పంపిణీ, పోస్టింగ్, ప్రచారం” చేస్తున్నాడని ఛార్జ్ షీట్ ఆరోపించింది.
తరువాత, సుల్తాన్‌పై ఆరు ఉపా నేరాలు; హత్య, హత్యాయత్నం, ప్రమాదకరమైన ఆయుధాల ద్వారా తీవ్రంగా గాయపరచడం, నేరపూరిత కుట్ర; ఉమ్మడి ఉద్దేశ్యంతో నేరం చేయడం వంటి ఐదు ఐపిసి సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
ఆ తరువాత “ఉగ్రవాద కార్యకలాపాలు”, “కుట్ర”, “ఉగ్రవాద ముఠా; ఉగ్రవాద సంస్థలో సభ్యుడు”, “ఒక ఉగ్రవాద సంస్థలో సభ్యత్వం”, “ఒక ఉగ్రవాద సంస్థకు సహాయం చేయడం” అనే ఉపా అభియోగాలు చేర్చారు.
2019లో విచారణ ప్రారంభమైంది; ఇప్పటికీ కొనసాగుతోంది. 2018 సెప్టెంబర్ 4న బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సుల్తాన్‌కు 2022 ఏప్రిల్ 5 న బెయిల్ వచ్చింది.
రుజువు లేదు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) కోర్టు న్యాయమూర్తి మంజిత్ సింగ్ మన్హాస్ సుల్తాన్‌కు “ఏ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధాలు వున్నాయని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయి” అని బెయిల్ మంజూరు చేశారు.
2022 ఏప్రిల్ 5 నాటి తన ఆర్డర్‌లో, ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్షులు సుల్తాన్‌ను ఆరోపించిన నేరాలతో ముడిపెట్టగల “నిందితుడికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు” అని ప్రత్యేక కోర్టు పేర్కొంది.
ఇంటి నుండి “పోలీసులు స్వాధీనం చేసుకున్న” హిజ్బుల్ ముజాహిదీన్ లెటర్‌హెడ్‌పై సుల్తాన్‌పై ప్రయోగించిన ఉపాలోని సెక్షన్ 39ని ప్రశ్నిస్తూ, న్యాయమూర్తి మన్హాస్, సాక్షులు ఎవరూ “లెటర్ ప్యాడ్‌ను గుర్తించలేదు లేదా ఆసిఫ్ సుల్తాన్ ఇంటి నుండి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించడానికి వీలుగా ప్రాసిక్యూషన్ వాటిని కోర్టులో చూపించలేదు” అనే అంశాన్ని లేవనెత్తారు.
“అంతేకాకుండా, ప్రాసిక్యూషన్ లెటర్‌హెడ్‌ల ముద్రణపై దర్యాప్తు చేయలేదు లేదా లెటర్ ప్యాడ్‌లను ముద్రించిన ప్రింటర్‌ను స్వాధీనం చేసుకోలేదు” అని అన్నారు.
లెటర్ పాడ్ స్వాధీనం గురించి చెబుతూ కోర్టు, నిందితురాలు షాజియా ఆసిఫ్ సుల్తాన్‌కు హిజ్బుల్ ముజాహిదీన్ లెటర్‌హెడ్‌లను ఇచ్చానని చెప్పిందని, కానీ ఫోటోలను గుర్తించే ప్రక్రియలో … షాజియా యాకూబ్ స్పష్టంగా, “ఆ ఫోటో నంబర్ 6 (ఇది ఆసిఫ్ సుల్తాన్‌ది) గురించి తనకు ఏమీ తెలియదు” అని చెప్పింది.
మళ్ళీ అరెస్టు
అయితే, 2022 ఏప్రిల్‌లో సుల్తాన్ మొదటి ఉపా కేసులో బెయిల్ పొందే సమయానికి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కశ్మీర్ పరిమిత స్వయంప్రతిపత్తిని వెనక్కి తీసుకుని రెండు సంవత్సరాలకు పైగా అయింది. అది న్యూఢిల్లీ ప్రత్యక్ష పాలనలోకి వచ్చింది. లోయలో ప్రతిఘటనకు వ్యతిరేకంగా దాడులు తీవ్రతరమయ్యాయి.
కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత, అసమ్మతిని అణిచివేసేందుకు జమ్ము- కశ్మీర్‌లో పరిపాలనాపరమైన నిర్బంధ చట్టం అయిన, ప్రజా సురక్షా చట్టం1978 (పిఎస్‌ఎ)ని ఉపయోగించడం ప్రారంభించింది. ఈ చట్టాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ “చట్టరహిత చట్టం” అని నిర్ధారించింది. ఈ చట్టం ప్రకారం “రాష్ట్ర భద్రతకు లేదా శాంతిభద్రతల నిర్వహణకు వ్యతిరేకంగా” వ్యవహరించకుండా నిరోధించడానికి ఒక వ్యక్తిని నిర్బంధించవచ్చు.
అధికారిక ఆరోపణలు లేదా విచారణ లేకుండా ప్రజలను రెండేళ్ల వరకు నిర్బంధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న, కోర్టులో బెయిల్ పొందిన లేదా కోర్టు నిర్దోషిగా విడుదలైన వ్యక్తిపై కూడా ఈ చట్టాన్ని ఉపయోగించవచ్చు.
2019 ఆగస్టు 5నుంచి, న్యూఢిల్లీ నియమించిన జమ్ము-కశ్మీర్ పరిపాలనా యంత్రాంగం ఈ చట్టాన్ని విమర్శకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపైన ఉపయోగించింది; వారిని జైలు నుండి బయటకు రాకుండా చేసింది. వారిలో సుల్తాన్ కూడా ఒకడు.
అతను విడుదలయ్యేలోపు, రాజ్యం అతనిపైన పిఎస్‌ఎ విధించింది. శ్రీనగర్‌లోని అతని ఇంటికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్ సెంట్రల్ జైలు నుండి 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూలోని కోట్ బల్‌వల్ జైలుకు పంపించారు.
పిఎస్‌ఏ డాసియర్ ప్రకారం, “అతను తన కథనాల ద్వారా వేర్పాటువాద ఆలోచనను సమర్ధించాడు. వ్రాసిన ప్రతి కథనం శీర్షిక మీరు వ్యాప్తి చేయాలనుకుంటున్న ప్రచారాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశ వ్యతిరేక భావాలను ప్రతిబింబించేలా బాధితుల కథనం ఆధారంగా వార్తలు చేయడం మీ విధానం” అని ఆరోపించారు.
అతను ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వా ఉల్ హింద్‌కు ఓజీడబ్ల్యూగా పనిచేస్తున్నాడని కూడా రాజ్యం పేర్కొంది. ఓజీడబ్ల్యూ అయిన సుల్తాన్ తన ప్రాంతంలో “చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో నిమగ్నమయేలా యువతను ప్రేరేపించాడు” అని, “ఉగ్రవాద సంస్థలైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ మరియు జైష్-ఎ-మహ్మద్ కార్యకలాపాలకు” సహాయం చేసాడు అని ఆరోపించారు.
ఆదేశం రద్దు
2022 మే 1న సుల్తాన్‌ను జమ్మూలోని కోట్ బల్‌వల్ జైలు నుంచి, అతని ఇంటికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని అంబేద్కర్ నగర్ జైలుకు పంపారు. ఇక్కడ అతన్ని 22 నెలల పాటు, అంటే జమ్ము-కశ్మీర్, లడఖ్ హైకోర్టు న్యాయమూర్తి వినోద్ ఛటర్జీ కౌల్ 2023 డిసెంబర్ 7న ఆదేశాన్ని రద్దు చేసే వరకు వుంచారు.
సుల్తాన్ నిర్బంధానికి సంబంధించిన విధానపరమైన నిబంధనలను అధికారులు పాటించలేదని తీర్పు పేర్కొంది.
సుల్తాన్‌ను పీఎస్‌ఏ క్రింద నిర్బంధించే సమయంలో అధికారులు యూఏపీఏ కింద కేసును దృష్టిలో ఉంచుకున్నట్లు కనిపిస్తోందని జస్టిస్ కౌల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ అధికారులు సుల్తాన్‌కు ఎఫ్‌ఐఆర్ కాపీలు లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 161 కింద నమోదు చేసిన స్టేట్‌మెంట్‌ల కాపీలను ఇచ్చారా లేదా అనే అంశాన్ని కస్టడీ ఆర్డర్‌లో చూపించలేదు.
విడుదల చేయవలసిందిగా అధికారులను ఆదేశిస్తూ, “నిర్బంధ ఉత్తర్వుల సమయంలో ఖైదీకి అవసరమైన మెటీరియల్‌ని సరఫరా చేయడంలో అధికారుల వైఫల్యం నిర్బంధ ఉత్తర్వును చట్టవిరుద్ధమైనదిగానూ, అస్థిరమైనదిగానూ చేస్తుంది. మరే ఇతర కేసులో అవసరం లేకుంటే సుల్తాన్‌ను విడుదల చేయాలి” అని జస్టిస్ కౌల్ ఆదేశించినప్పటికీ, ఆసిఫ్ సుల్తాన్‌ను విడుదల చేయడానికి రాజ్యానికి 78 రోజులు పట్టింది.
కశ్మీర్‌లోని అధికారుల నుండి “క్లియరెన్స్ లెటర్” రావడం ఆలస్యం కావడమే కారణమని జైలు అధికారులు అంటున్నారు.
ఇంకా కటకటాల వెనుకనే
జైలు అల్లర్ల కేసులో జమ్ము- కశ్మీర్ పోలీసులు సుల్తాన్‌ను మళ్లీ అరెస్టు చేయడంతో స్వేచ్ఛగా చాలా కాలం పాటు ఉంటాడనే కుటుంబం ఆశ త్వరలోనే అడియాసైంది.
అతని స్థితి జర్నలిస్ట్ స్నేహితులను కలవరపెట్టింది, వారు తమ వృత్తిని విడిచిపెట్టేసారు లేదా “అలాంటి” వార్తలను వ్రాయడం మానేశారు.
ఆర్టికల్ 370ని తొలగించినప్పటి నుండి ‘కశ్మీర్ నరేటర్’ పత్రిక మూతబడింది. 2021 సెప్టెంబరులో, సుల్తాన్, పూర్వ ఎడిటర్ షౌకత్ మొట్టా, మరో ముగ్గురు జర్నలిస్టులు – హిలాల్ మీర్, షా అబ్బాస్, అజర్ ఖాద్రీ ఇళ్లపై పోలీసులు దాడి చేశారు.
2020లో శ్రీనగర్‌లోని కోఠి బాగ్ పోలీస్ స్టేషన్‌లో “గుర్తు తెలియని వ్యక్తుల”పై ఉపా సెక్షన్ 13, ఐపిసి సెక్షన్ 506 కింద నమోదైన కేసులో ఈ దాడులు జరిగాయి. ఉపా సెక్షన్ 13, “ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వాదించే, సహాయం చేసే, సలహా ఇచ్చే లేదా ప్రోత్సహించే” అనుమానితులకు సంబంధించినది అయితే ఐపిసి సెక్షన్ 506 “నేరపూరిత బెదిరింపు”తో వ్యవహరిస్తుంది.
“జర్నలిజం కారణంగా సుల్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు” అని సుల్తాన్ పూర్వ సహోద్యోగులు, స్నేహితులు అన్నారు.
‘కశ్మీర్ నరేటర్’లో అతని సహోద్యోగి ప్రకారం, “ప్రభుత్వ పంథాను అనుసరించని” వారికి ఆదర్శంగా నిలిచేందుకు ఆసిఫ్‌ను రాజ్యం “సులభ లక్ష్యం”గా ఉపయోగించుకుంది. అతని విమర్శనాత్మక జర్నలిజం రాష్ట్రానికి ముల్లులా ఉంది; కశ్మీర్‌లో ఈ రకమైన జర్నలిజాన్ని అంతం చేయాలని రాజ్యం అనుకున్నది. అలా చేయడంలో సఫలం అయింది కూడా. వారి అరెస్టు తర్వాత, రాజ్యానికి వ్యతిరేకంగా వ్రాయడానికి ధైర్యం చేసేవారిని వేధింపులకు గురి చేస్తారు; మోసపూరిత ఆరోపణలపై విచారణ చేస్తారు. కశ్మీర్‌ను “సంఘర్షణ”తో ముడిపెట్టే ఏదైనా విమర్శనాత్మక సమాచారం వారికి, దేశ వ్యతిరేకమైనదిగా కనబడుతుంది.”
సుల్తాన్ కుమార్తె అరీబాకు తన తండ్రి ఖురాన్ చదవడానికి వెళ్లాడని చెప్పి రెండు నెలలు గడిచాయి. “అరిబాకు ఇలాంటి కథలు ఎంతకాలం చెప్పగలం?” అని సుల్తాన్ తండ్రి అడుగుతున్నాడు.
(ఫోటో, నివేదిక ఆర్టికల్ 14 సౌజన్యంతో)
తెలుగు : పద్మ కొండిపర్తి