అవును రాజ్యం ఇప్పుడు
బానిసత్వాన్ని కోరుకుంటుంది
వర్ణ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తుంది
మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ వెలికి తీస్తుంది
మానవత్వాన్ని చంపుతూ
మనిషిని హత్య చేస్తుంది

అది కాశ్మీర్ ఫైల్స్ చూడమంటుంది
కానీ 
గుజరాత్ ఫైల్స్ అంటే గజగజా
వణుకుతూ కళ్ళెర్ర చేసి చూస్తుంది
అది ఒక మతాన్ని ఒక
దేవుడిని కలుపుకుపోతుంది
ఈ దేశపు ముఖచిత్రంపై
అది కాషాయపు జెండాను కప్పుతుంది
ఒక నినాదంతో మనిషిలోని
మూఢనమ్మకాన్ని బలపరుస్తుంది
అది సగటు మనిషి
నిత్యవసరాలను పెంచుతుంది
రైతుల ఆత్మహత్యలకు 
కారణం అవుతుంది
దళితులు అంటే అది
శూద్రులుగా చూస్తుంది 
వాళ్ళను హత్యలు చేయడానికి
కంకణం కట్టుకుంటుంది
ప్రశ్నించే వారి గొంతులను కోస్తుంది

చివరికి...
దేశ సంపదను కార్పోరేట్
చేతులకి అమ్ముతుంది
నిజానికి దేశాన్ని పరిపాలించేది
రాజకీయ నాయకులు కాదు
ఆదానీలు,అంబానీలు
ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు, దళారీలు పరాన జీవులు
మనిషి గొంతు పై నిలబడి
మానవాళి శ్వాసను నలిపేస్తున్నారు

మిత్రమా..!!
ఇంకా ఎంతకాలం..?!!
అలా అంధకారపు నిద్రలో
అమాయకపు జోలపాటకి
అసమర్థ్యంగా నిద్రపోతుంటావు
లే.....!
దేశ దిశలలో ఒక ఎర్రని మెరుపు 
ఎన్నో పోరాటాలకి స్ఫూర్తినిస్తుంది
పిడికిలెత్తి రొమ్ము చాచి
ఉరి కొయ్యలపై ఉయ్యాలలు 
ఊగిన ఆ నినాదాన్ని
"ఇంక్విలాబ్ జిందాబాద్" 
అంటూ ముందుకు సాగిపో
కామ్రేడ్ వై కదిలిపో

మిత్రమా!!
ఈ దేశపు మార్పు మనతోనే
మొదలవాల్సి ఉంది.

Leave a Reply