తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను నిషేధించింది. సాహిత్య రంగంలో పనిచేస్తున్న విరసం మొదలు విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలను తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధించింది. వీటిలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఉంది. ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  చనిపోయిన విప్లవకారుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం, వారి అంత్యక్రియలు విప్లవ సాంప్రదాయంలో జరిపించేప‌ని ఈ సంఘం చేస్తోంది. చనిపోయిన వారికి చివరి వీడ్కోలును వారు నమ్మిన పద్ధ‌తుల‌లో జరపడం  ఒక మానవీయ విలువ‌. 

 ఇది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే నిషేధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విప్లవకారుల అంత్యక్రియలకు ఇప్పుటి తెలంగాణ ప్రభుత్వపు పెద్దలలో అనేక మంది హాజరైన వాళ్లే.  అధికారంలోకి వస్తే మావోయిస్టుల ఎజండాను అమలు చేస్తానని  కేసీఆరే అన్నాడు.  అధికారంలోకి వచ్చాక మావోయిస్టుల అవసరం కూడా లేదన్నాడు. బ‌హుశా అందుకే అధికారంలోకి రాగానే తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లకు తెర తీశాడు. మనుషులను చంపడం మొదలుపెట్టాడు. ఆయ‌న వ‌ర్గ స్వ‌భావంప‌ట్ల ఎవ‌రికీ అనుమానాలు లేవు. దానికి త‌గిన‌ట్లే ఆయ‌న ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఇది ఇంకా ముందుకుపోయి అంత్యక్రియలను జరపడం పై కూడా  నిర్బంధాన్ని ప్రయోగించాడు. హ‌త్య చేసి రాత్రికి రాత్రే శవాలను కాలబెట్టించాడు. అమరుల బంధుమిత్రుల సంఘం స‌భ్యులు వెళితే మృతదేహాల్ని కుటుంబాలకు ఇవ్వొదంటూ ఆదేశాలు ఇచ్చాడు. ఇన్నిటిని ధిక్కరించి అమ‌రుల కుటుంబ స‌భ్యుల ఆకాంక్ష మేర‌కు ఏబిఎంఎస్  విప్లవకారులకు విప్లవ సాంప్రదాయంలో అంత్యక్రియలు జరిపించింది. ఈ క్రమంలో అక్రమ కుట్ర కేసులను ఎదుర్కొంది. ఇవ‌న్నీ చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ఏకంగా ఆ సంఘాన్ని నిషేధించాడు.  

మృత‌వీరుల శవాలను తీసుకువచ్చే సంఘం అంటే ప్రభుత్వానికి  ఎందుకు ఇంత భయం?

 ఎందుకంటే ఆ శవాలు ఈ సమాజంతో సంభాషిస్తాయి.  చనిపోయి కూడా విప్ల‌వ‌కారులు  తమ రాజకీయాల విలువను ఈ సమాజానికి చేరవేస్తున్నారు. చ‌ర్చ‌నీయాంశం చేస్తున్నారు.  అక్కడ ఉంది అసలు సమస్య. వాళ్ళు నమ్మిన రాజకీయాలతోనే ఈ ప్ర‌భుత్వానికి అసలు పేచీ.  నూతన సమాజం కోసం అందరినీ వదిలి వెళ్లిన వాళ్ళు చనిపోయి కూడా ఆ రాజకీయాలను మాట్లాడటం ప్రభుత్వానికి నచ్చడం లేదు. అందుకు ఈ నిషేధం. 

బుద్ధిజీవులకో,  మేధావులకో రాజకీయాలు, రాజకీయ విశ్వాసాలు  ఉంటాయ‌ని అంద‌రూ అనుకోవ‌చ్చు. వాటితో ఏకీభావం లేనివాళ్లకు ఆ రాజ‌కీయాల ప్ర‌చారం ఇబ్బంది కావ‌చ్చు. అది పూర్తిగా  వేరే విషయం. మరి కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? సంవత్సరాల క్రితం తమను వదిలి వెళ్లిన వారు విగత జీవులుగా మళ్ళీ తమను చేరినప్పుడు వాళ్ళు తమ వాళ్ళే అనడానికి నమ్మిక ఏమిటి? ఎందుకంటే తమ వాళ్లు అవునో కాదో గుర్తు ప‌ట్ట‌డానికి వీల్లేని స్థితిలో వారు విగ‌త జీవ‌లై వ‌స్తారు. వాళ్ళ అసలు పేరు కూడా ఆ కుటుంబానికి తప్ప మిగతా వారికీ గుర్తుండదు. ఉన్న ఊరు నుంచి ఎక్కడో దూరాన పనిచేస్తూ మృత్యుఒడిలోకి చేరుతారు. ఉద్యమంలోకి వెళ్లిన నాడే సొంత ఊరు, సొంత మనుషుల‌ను వ‌దిలేసుకుంటారు. ఎక్క‌డెక్క‌డ ఎన్ని రూపాల్లో ప‌ని చేసి ఉంటారో.  కుటుంబ స‌భ్యుల‌కు ఈ విష‌యాలేవీ తెలియ‌వు. వాళ్ల మ‌ర‌ణ వార్త మాత్ర‌మే తెలుస్తుంది. వాళ్ల‌కు ఓదార్పు ఎక్క‌డ‌? త‌మ బిడ్డ‌ల‌, స‌హ‌చ‌రుల‌, త‌ల్లిదండ్రుల వివ‌రాలు తెలిసేదెలా?  ఆ మృత‌దేహాల‌ను తెచ్చుకొనేది ఎలా? వారికి ఉన్న ఒకేఒక్క ఆసరా బంధుమిత్రుల సంఘం.   

విప్లవకారులైన త‌మ‌వాళ్ల శ‌వాల‌ను తెచ్చుకోవ‌డం  అంత సులువైన విషయం కాదు. నూతన మానవావిష్కరణ కోసం వెళ్లిన విప్ల‌వ‌కారులు చేసే పోరు కంటే కూడా కుటుబాలకు ఇది ఇంకా పెద్ద పోరు. చనిపోయిన వాళ్ళు తమ వాళ్లే అనడానికి ఆధారాలు  తెలుసుకోవ‌డం మొదలు ఆసుపత్రి మార్చురీ దగ్గర వందలాది పోలీసుల మధ్య నుండి తమ వారి శ‌వాల‌ను తెచ్చుకోవడం ఒక పెద్ద యుద్ధం. ఇవన్నీ ఎదుర్కోలేని కుటుంబాలు ఈ ప్ర‌య‌త్నాల‌కు సిద్ధం కాలేరు. ఆ విషయం బయటికి చెప్పలేరు. తమ వారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయామనే బాధ మాత్రం వారిని బతికున్నంత కాలం  వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి కుటుంబాల కోసం ఏర్పడిందే అమరుల బంధుమిత్రుల సంఘం.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో శ‌వాల‌ స్వాధీన కమిటీ అనంతరం 2002 లో అమరుల బంధుమిత్రుల సంఘం ఏర్పడింది. ఎన్కౌంటర్లలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, మిత్రులతో ఇది ఏర్పడింది. ఎన్కౌంటర్లలో చనిపోయిన తమ వారి భౌతిక కాయాల‌ను  తెచ్చుకోలేక పోయిన‌వారు,  తెచ్చుకోవడంలో అనేక ఇబ్బందులు పడిన కుటుంబ స‌భ్యులలు  ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.  తమకు వచ్చిన ఈ కష్టం మరో కుటుంబానికి  రాకూడదని ఒక సమూహంగా కూడి వీరు పనిచేయాలనుకున్నారు. అందుకు సంఘం పెట్టుకున్నారు.  అలా గత ఇరవైఏళ్లుగా తెలుగు సమాజంలో బంధుమిత్రుల సంఘం పనిచేస్తున్న‌ది. 

ఈ ఇరవై ఏళ్లలో సుమారు ఏడువందల మంది విప్ల‌వ‌కారుల‌ మృతదేహాలను తీసుకువచ్చింది. కుటుంబాలకు అప్పచెప్పింది. వారి కోరిక మేర‌కు విప్ల‌వ సంప్ర‌దాయంలో క్రియలు జరిపించింది. ఇవన్నీ కూడా ఏమి సాఫీగా జరగలేదు. ఈ క్రమంలో ఆ  సంస్థ సభ్యుడు గంటి ప్రసాదం  హత్యకు గురయ్యాడు. సంఘ వ్యవస్థాపక సభ్యుడు ఉప్పు కృష్ణ రెండు చేతులు పోలీసులు   విరగొట్టారు. అనేక మంది పై కుట్ర కేసులు పెట్టారు.    శవాల స్వాధీనం   కూడా ఒక పెద్ద పోరాటంగా జ‌రుగుతున్న‌ది.  ఒక్కోసారి రోజుల తరబడి ఆసుపత్రి శ‌వాల గ‌ది బయట పడిగాపులు కాయాల్సి వ‌చ్చింది. బొత్తిగా  తెలియని చోట అక్క‌డున్న వారిని  బతిమిలాడుకుని ఇంత  జాగా సంపాదించుకొని అక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చేది. త‌మ ర‌క్త బంధువుల భౌతిక కాయాలు ఇచ్చేదాకా  అక్కడే ఉండాల్సి వ‌చ్చేది.  ఇదేదో  అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు.  న‌గ‌రాల్లో స‌భ‌లు నిర్వ‌హించ‌డం లాంటిది కాదు.    పోలీసుల ఇచ్చిన సమాచారం ఒకటికి పది సార్లు నిర్ధారించుకోవాల్సి వ‌చ్చేది.  దేనికంటే  అనేకసార్లు  పోలీసులు తప్పుడు సమాచారంతో కుటుంబాలను ఇబ్బంది పెట్టారు.  ఒక‌రి బ‌దులు మ‌రొక‌రి మృత‌దేహాలు ఇచ్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల‌కు ఈ ఘ‌న‌మైన చ‌రిత్ర కూడా ఉంది.  అంత్యక్రియలు అయ్యాక  ఎప్పటికో గాని అస‌లు విషయం బయటికి వ‌చ్చేది.  అలా తమ వారి చివరి చూపుకు కూడా నోచుకోకుండా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాలకు ఉంది. 

చనిపోయిన విప్ల‌వ‌కారుల  కుటుంబాలకు సమాచారం ఇవ్వడం, వారిని ఆసుపత్రి వద్దకు తీసుకురావడం అనేది ఒక పెద్ద  ప‌ని.  అంతా అయ్యాక ఊరిలో ఉండే పెద్దలను ఒప్పించడం, స్థానిక పోలీసుల నుండి వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడం  ఇంకో  యుద్ధమే. ఎందుకంటే ఈ సంఘంలో ఉన్నవారు ఎవరూ   పెద్దగా పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు కాదు.  అందరూ  తమ కుటుంబ సభ్యులను కోల్పోయి, తమ లాంటి కుటుంబాలకు అండగా ఉందామనే ఆశ‌యంతో సంఘం పెట్టున్న‌వారే.  సంఘంలో ఉన్నవారంతా ఎక్కువ‌గా  మహిళలు. నిత్య‌ జీవితంలో రైతులుగా, కూలీలుగా, రోజువారీ శ్రామికులుగా బ‌తికేవారు. ఎన్కౌంటర్ అయినపుడు   వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లడం వారు చేయగలిగిన పని.  అది కూడా ఈ రోజు ప్రభుత్వాలకు కంటగింపు అయింది.                    

చనిపోయిన వారికుండే రాజకీయ విశ్వాసాల వల్ల ఈ ప్రభుత్వాలకు ఈ ప‌ని ఇబ్బంది మారి ఉండవచ్చు. అందుకు నిషేధం విధించవచ్చు. నిషేధాలు, నిర్బంధాలు, రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాల‌కు అల‌వాటే.  కానీ ఒక మనిషి చనిపోయినపుడు చివరి చూపు కోసం  ఆ కుటుంటం ఆరాట‌ప‌డటం క‌నీస మాన‌వీయ విష‌యం. త‌మ వారి విశ్వాసాలకు అనుగుణంగా అంత్యక్రియలు జరపడం బాధ్య‌త‌. దీన్ని నిషేధించ‌డం ఎంత అనాగ‌రికం?  ప్ర‌జాస్వామ్యం అనేది చాలా పెద్ద మాట‌. మ‌నం మ‌నుషులం క‌దా, మాన‌వ‌జాతి చేసే అతి క‌నీస‌మైన ప‌ని చ‌నిపోయిన వారికి అతిమ సంస్కారం. ఈ ప‌ని ఎన్న‌టికీ  నిషేధం కాకూడదు. 

ఇలాంటి  నిషేధాలను ఆమోదించడం అంటే ప్రగతిశీల సమాజాల నడక ఆగినట్టే. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం రాజ్యమేలుతుతున్న కాలంలో శవాలు రాజకీయాలు ప్రచారం చేస్తాయనే  ఆరోపణతో బంధుమిత్రుల సంఘం నిషేధానికి గురైంది. ఇది ఇవాళ  ఈ   సమాజ స్థితి. 

కానీ త‌మ వారిని కోల్పోయిన  కుటుంబాల వైపు నుండి ఈ  విష‌యం ఆలోచించండి. ఎంత విషాద‌మో అర్థ‌మ‌వుతుంది. మ‌న స‌మాజం ఎంత వికృతంగా, విషాద‌క‌రంగా త‌యార‌వుతున్న‌దో అర్థ‌మ‌వుతుంది. ఈ నొప్పి తెలిసిన చైత‌న్య‌వంత‌మైన స‌మాజం కూడా మ‌న‌ది. దాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. దీన్ని గుర్తించిన వారంతా ఈ నిషేధాన్ని ఎత్తివేయించ‌డానికి  ముందుకు రావాల్సిన త‌రుణం ఇది.  ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు మాట్లాడాల్సిన అవసరం ఉంది.      

Leave a Reply