పులి లేడి ని చంపితే
ప్రకృతి ధర్మం
ఆహార వేట
పెద్ద చేప చిన్న చేపనూ!
చెట్టు కొమ్మ
పండు బరువుకి
వాలితే ప్రకృతే!
కొమ్మ ను నరికేది నరుడే!!
మనిషి మనిషి ని వేటాడితే
వికృతి
మనిషి ని రాజ్యం చంపదల్చుకుంటే
ఎన్ కౌంటర్
హత్య లు కాపు కాసి చేసే రోజులు కావివి
జన సమ్మర్దంలో బాహాటంగా
ప్రత్యక్ష ప్రసార వినోద క్రీడలు ఇప్పుడు!
అధికారం కోసం
అహం రాజ్యం లో భాగం
కులం మతం వనరు
ద్రవ్యం కొలమానం లో
దారిద్ర్య రేఖ ఊగిసలాట లో
అటూ ఇటూ మనిషి
వర్గాల కొమ్ము
లేని దైవం
రా రమ్మని పిలుస్తుందని
నమ్మ బలుకు తుంటే
గొర్రెల్లా బుద్దిజీవుల దూకుడు
పోలోమంటూ పోకిరీల గుంపులోకి !
రాజ్యాన్ని మనిషి ప్రశ్నిస్తే రాజ ద్రోహి
అప్పనం గా దోచేసే పెట్టుబడి దారుడు
పట్టుబడితే రాజ్యం భరోసా
రాజమాత శీలానికే మాయని మచ్చ!
ఉదయించని ప్రశ్నలు గళంలో
ఉదయించిన ప్రశ్నలు కారాగారంలో
అస్తమించిన ప్రశ్నలు ఎన్నో
ప్రశ్నలే లేని రాజ్యం కోసం మతం ఎర!
బతుకులు ఎసరు లో మరుగుతున్నా
మరుగున పడుతున్న రాజ్యం తప్పులు
గాఢ నిద్రలో జనులు
జగమెరిగిన మౌఢ్యం
నిజాలు సమాధి!!
రానున్న కాలమంతా నిరక్షర కుక్షుల ప్రణాళికలే!!
Related