ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకోడానికి దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లోని అడవి లోతట్టు ప్రాంతానికి వెళ్ళాం –
అరుణాభ్ సైకియా

ఛత్తీస్‌ఘడ్‌ దక్షిణ కొనలో, తెలంగాణ సరిహద్దుకు చాలా దూరంలో, ఏప్రిల్ ఎండలో రాళ్ళు రప్పలతో నిండిన నిర్మానుష్య కొండపైన లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు మండుతున్నాయి. దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలు రాకెట్లా వున్న వస్తువుల పెద్ద శకలాలను సేకరించారు. అవి భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన అవశేషాలు అని చెప్పారు.

ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తాను మహువా పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆకాశంలో “తేనెటీగల ఝంకారంలా” వున్న విచిత్రమైన శబ్దం వినిపించిందని” అని భట్టిగూడ గ్రామానికి చెందిన రైతు భీమా కుంజం అన్నాడు.
పైకి చూస్తే , “చమ్గదర్” లేదా బ్యాట్‌లాగా వున్న గాలిలో ఎగురుతున్న నల్లటి వస్తువు కనిపించింది, క్షణాల వ్యవధిలో, పెద్ద శబ్దం “భ్రూమ్ భ్రూమ్” లాగా అడవిలో ప్రతిధ్వనించింది, “భూమి బద్దలవ్వబోతున్నట్లు” అనిపించింది.

హెలికాప్టర్ల నుండి కాల్పులు జరపడానికి ముందు “మూడు బాంబులు పడ్డాయి”. ఆకాశంలో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి, రెండింటి నుంచి మాత్రమే కాల్పులు జరిగాయి, “మరొకటి ఆ రెండింటి కంటే ఎత్తులో ఉండి, చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది” అని వివరించాడు. “అందరమూ ఆదరాబాదరాగా పరుగెత్తాం, చెట్ల క్రింద, బండరాళ్ల వెనుక, కందకాలలో దాక్కున్నాం. కొంతసేపయ్యాక తేరుకొగలిగాం కానీ అంతలోనే మళ్ళీ పేలుళ్లు, కాల్పులు మొదలయ్యాయి. దాదాపు రెండు గంటలపాటు అడపాదడపా అలాగే కొనసాగింది. కొండ మీద బుల్లెట్లు, బాంబుల వర్షం కురిపించారు. వారు మా అందరినీ చంపాలనుకుంటున్నారు” అని గ్రామం నుండి ఒక కిలోమీటరు చుట్టూ ఉన్న కొండ వైపు చూపిస్తూ చెప్పాడు. భట్టిగూడ అనేది ఛత్తీస్‌ఘడ్లోని బస్తర్ ప్రాంతంలో భాగమైన బీజాపూర్ జిల్లాలో లోతట్టు ప్రాంతంలో ఉన్న అటవీ గ్రామం, ఇక్కడ నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి చెందిన తీవ్రవాదులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్నారు.

దాదాపు 200 కుటుంబాలు నివసించే భట్టిగూడ మావోయిస్టుల నియంత్రణలో ఉంది. అడవిలో ఏర్పడిన పురాతన కాలిబాటల్లో మాత్రమే అక్కడికి వెళ్ళగలం, ఇక్కడ వేసవిలో తెందు పొదలపైగా, ఎత్తుగా మహువా చెట్లు పెరుగుతాయి. ఏళ్ల తరబడి తిరుగుబాటు నిరోధక చర్యలు చేపట్టినప్పటికీ అర్ధ సైనిక బలగాలు మావోయిస్టులను తరిమి కొట్టడంలోనే కాదు ఆ ప్రాంతంలోకి ప్రవేశించడంలో కూడా విఫలమయ్యాయి.
కానీ ఇప్పుడు, భద్రతా దళాల ఆయుధశాలలో వైమానిక బాంబు అనే కొత్త ఆయుధం వున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఏప్రిల్ 7న సమీపంలోని అడవిలో వైమానిక బాంబులు వేయడాన్ని, కాల్పులు జరగడాన్ని చూసినట్లు ఈ ప్రాంతంలో వున్న భట్టిగూడ, కవార్గట్ట, జబ్బగట్ట, మీనగట్ట అనే నాలుగు గ్రామాల నివాసితులు బృందానికి చెప్పారు. కానీ భద్రతా బలగాలు ఈ వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. పేలుడు పదార్థాలను వదలడానికి డ్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగించారా అని బస్తర్ పోలీసు చీఫ్ సుందర్రాజ్ పట్టిలింగంను అడిగినప్పుడు, “మాకు అలాంటి సామర్థ్యమూ లేదు, ఉద్దేశ్యమూ లేదు” అని అన్నారు.
ఇంతకు ముందు భారత రాజ్యం ఒక్కసారి మాత్రమే ప్రస్తుతం మిజోరంలో ఉన్న ప్రాంతంలో 1966లో వైమానిక దాడి చేసింది.

దక్షిణ బస్తర్లోని అటవీ గ్రామాల్లోని ఆదివాసీలు ఇలాంటి వాదనలు చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంతకుముందు, భట్టిగూడ నుండి దక్షిణంగా ఉన్న అనేక గ్రామాల నివాసితులు, ముఖ్యంగా మెటగుడ్డ ప్రాంతంలో జనవరి 11 న వైమానిక చర్య జరిగిందని చెప్పారు. గతంలో 2021, 2022 సంవత్సరాల్లో ఏప్రిల్ నెలలో ఈ ప్రాంతంలోని గ్రామస్తులు ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలు రెండు ఉన్నాయి. రెండు సార్లు కూడా భద్రతా దళాలు ఈ వాదనలను తీవ్రంగా ఖండించాయి.

ఆ ఘటనల సమాచారం అడవి నుండి బయటకు రావడానికి చాలా సమయం పట్టడంతో వాస్తవాలను పరిశోధించడానికి స్వతంత్ర పరిశీలకులు సమయానికి అక్కడికి చేరుకోవడం కష్టమైంది. కానీ ఈ ఏప్రిల్లో సమాచారం వేగంగా ప్రయాణించింది. “మహువాను సేకరించే సీజన్లో, హటాత్తుగా బాంబులు వేయడం, పైనుంచి కాల్పులు జరపడం ప్రజల్ని భయపెట్టి, తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోయేట్లు చేస్తుంది” అని అదే రోజు మావోయిస్టులు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసారు. నాలుగు రోజుల తర్వాత ఆరోపణలను పరిశోధించడానికి స్క్రోల్ బృందం వెళ్ళింది. పలు గ్రామాల ప్రజలతో మాట్లాడింది. చాలా ఆశ్చర్యకరంగా వారందరూ ఒకేలా చెప్పారు.


ఏప్రిల్ 7న అడపాదడపా చాలా గంటలపాటు పెద్ద పెద్ద శబ్దాలు విన్నామని, ఏప్రిల్ 12న ఉత్తర మార్గం నుండి భట్టిగూడకు వెళ్ళే దారిలో ఉన్న అనేక గ్రామాల ప్రజలు చెప్పారు. కొంతదూరంలో హెలికాప్టర్లను చూసినట్లు కూడా కొందరు చెప్పారు. “ఉదయం మహువా పువ్వులు సేకరించడానికి వెళ్లినప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. బహుశా ఉదయం 7 గంటలు అయి ఉండచ్చు” అని జొనగూడలో చన్నెర్ సోరి చెప్పాడు.
దంతేవాడలోని బంగాపాల్ పాఠశాలలో చదువుకున్నానని చెప్పిన 17 ఏళ్ల మిడియం హుర్రాను టేకల్గూడలో కలిసినప్పుడు పెద్ద శబ్దాలు వినడమే కాకుండా మూడు హెలికాప్టర్లను కూడా చూశానని చాలా స్పష్టంగా చెప్పాడు.

బాంబు దాడి జరిగిందని చెప్తున్న ప్రదేశానికి మరింత దగ్గరగా వున్న పువర్తిలో, రితేష్ మాండవి ఆ ఉదయాన్ని జ్ఞాపకం చేసుకోవడం మరింత ఖచ్చితంగా ఉంది. “ఉదయం 6 గంటలకు మొదలైన బాంబులు చాలా గంటలపాటు అడపాదడపా పడుతూనే ఉన్నాయి. బాంబులు ఎక్కడ నుండి పడ్డాయో నాకు తెలియదు. నేను చూడలేదు, కానీ నిజంగా చాలా పెద్ద శబ్దాన్ని విన్నాను…. కానీ నేను మూడు హెలికాప్టర్లను చూశాను. వాటి నుండి కాల్పులు జరిపారు.”

అందరూ చెప్పినదాని ప్రకారం దాడులు జరిగిన అసలు ప్రదేశం తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఏటవాలుగా వున్న కొండపై ఉంది. ఈ కొండపైన యిళ్లు లేవు, కానీ అటవీ ఉత్పత్తులను సేకరించేందుకు తరచూ కొండపైకి వెళ్తుంటామని, తమ ఇళ్లకు, పొలాలకు చాలా దగ్గరగా దాడులు జరిగాయని కొండ అంచులలో వున్న నాలుగు గ్రామాల నివాసితులు చెప్పారు. వీటిలో భట్టిగూడ గ్రామం ఒకటి. ఇక్కడ మాతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ దాడులు తమని వణికించేసాయన్నారు.

“మొదటగా ఝమ్మనే శబ్దం వినిపించింది. అది నిఘా డ్రోన్ శబ్దం అని తెలుసు. కానీ తెల్లవారుజామున 3 గంటలకు రావడంతో అనుమానం వచ్చింది. డ్రోన్ కెమెరాలు చాలా సంవత్సరాలుగా మా ఆకాశంలో తిరుగుతున్నాయి, కానీ అవి ఎప్పుడూ పగటిపూటనే వచ్చేవి” అని ముప్పై ఏళ్ల రైతు పోయం జోగా అన్నాడు. తెల్లవారుజామున చీకటిలో డ్రోన్ కనిపించడం, “ఏదో చెడు జరగబోతోందనే సంకేతాన్ని యిచ్చింది.”
గ్రామంలోని చాలా మంది మాదిరిగానే, జోగా కూడా మహువా పువ్వులు సేకరించడం కోసం బయటికి వచ్చినప్పుడు ‘అలవాటైన నిఘా డ్రోన్లకు భిన్నంగా ఝమ్మనే శబ్దం వినిపించింది. పైకి చూసేసరికి నల్లటి గబ్బిలం లాంటి వస్తువు కనిపించింది. కొండపై ఏదో పడినట్లు పెద్ద శబ్దం వచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి మూడు హెలికాప్టర్లు కనబడ్డాయి. కాల్పులు ప్రారంభమయ్యాయి.”

బీజాపూర్ జిల్లా ధర్మారం గ్రామంలో చదువుకున్నానని చెప్పిన గణేష్ వికా అనే 17 ఏళ్ల యువకుడు “ఇది కేవలం ఆరంభం మాత్రమే” అన్నాడు. భట్టిగూడలో పాఠశాలలు మూతబడ్డాయి. రెండు గంటలకు పైగా, 14 లేదా 15 సార్లు పెద్ద శబ్దాల్ని విన్నానని, మూడు హెలికాప్టర్లలో రెండింటి నుండి వైమానిక కాల్పులు జరిగాయని, డ్రోన్గా గుర్తించిన ఎగిరే వస్తువు దక్షిణం వైపున ఉన్న పామెడ్ బ్లాక్ వైపు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడాన్ని కూడా తాను చూశానని, కాల్పులు జరిపిన రెండు హెలికాప్టర్లు కూడా అటువైపే వెళ్ళాయని, మూడో హెలికాప్టర్ నుంచి కాల్పులు జరగలేదని, అది ఎక్కువ ఎత్తులో తిరుగుతోందని, ఉత్తరాన వున్న బీజాపూర్ పట్టణం వైపు వెళ్లాయని చెప్పాడు.


భద్రతా బలగాల తిరస్కరణ :


కేవలం ఛత్తీస్గఢ్ పోలీసులే కాదు, ఆ ప్రాంతంలోని ప్రధాన తిరుగుబాటు నిరోధక సంస్థ అయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కూడా ఏరియల్ బాంబింగ్ను ఉపయోగించారనడాన్ని ఖండించింది. ఛత్తీస్గఢ్ సెక్టార్ సిఆర్‌పిఎఫ్ హెడ్ ఇన్స్పెక్టర్ జనరల్ సాకేత్ కుమార్ సింగ్ : “మాకు ఖచ్చితంగా ఆ సామర్థ్యం లేదు.” అని అన్నారు అయితే జనవరి 11న మెట్టగూడకు సమీపంలో హెలికాప్టర్ నుండి తమ సిబ్బంది “ఆత్మ రక్షణ” కోసం కాల్పులు జరిపారని సింగ్ అంగీకరించాడు. “మేము దిగడానికి ప్రయత్నించినపుడు వారు కాల్పులు జరపడంతో మేము ప్రతీకారంగా కాల్పులు జరిపాము. అలా చేయడానికి మాకు అనుమతి ఉంది.”
మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు గ్రామస్తులు చేసిన ఆరోపణలపైన ప్రశ్నలను స్క్రోల్ ఇమెయిల్ చేసింది. ప్రచురణయ్యే సమయం వరకు ఏ స్పందనా అందలేదు.


కొండపై శిథిలాలు :


భట్టిగూడ దగ్గరలో వున్న కొండపైకి ఎక్కినప్పుడు లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు, ఎలక్ట్రానిక్ పదార్థాల అవశేషాలు కనిపించాయి. సాపేక్షికంగా చిన్న పరిమాణం, కేవలం రెండు అడుగుల వెడల్పు, లోతు వున్న రెండు గుంతలు కూడా ఉన్నాయి. కొన్ని శిలలు తెల్లటి పొడి లాంటి పదార్ధం అంటుకుని వుంది. కొన్ని చెట్ల బోదెలు చెక్కినట్లు కనిపించాయి; కనీసం ఒక చెట్టు మీద ఆకులు కాలిపోయినట్లు కనిపించాయి. అయితే పెద్దఎత్తున నష్టం వాటిల్లిన ఆనవాళ్లు కనిపించలేదు. గ్రామస్థులు పెద్దగా వున్న, మరింత ముఖ్యమైన శిధిలాలను చూపించి పేలని “బాంబు” అని పేర్కొన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఘటనాస్థలిని పరిశీలించేందుకు వెల్లినప్పుడు వాటిని సేకరించామని చెప్పారు.


పేలని వస్తువు రాకెట్ ను పోలి ఉంది. అందులో వైర్లతో అనుసంధానించబడిన మూడు విభిన్న భాగాలు – వెనుక భాగంలో ఒక రెక్క, మధ్యలో పొడవైన స్థూపాకార గొట్టం, అర్ధగోళాకార తలభాగం – వున్నాయి. ఇది దాదాపు రెండు అడుగుల పొడవు అంటే దాదాపు ఒక చేయి పరిమాణంలోనూ, గొట్టం వ్యాసం సుమారు మూడు అంగుళాలు వుంది.


మూడు భాగాలు వేర్వేరు పదార్థాలతో తయారు అయినవి. రెక్క తేలికైన ప్లాస్టిక్/మిశ్రమంగా కనిపించినప్పటికీ, స్థూపాకార ట్యూబ్ దృఢమైన ప్లాస్టిక్ లేదా ఫైబర్ గ్లాస్‌తో తయారు చేసినట్లు అనిపించింది. దృఢంగా, అన్నిటికంటే బరువుగా వున్న తల భాగం లోహంతో తయారైంది. మాకు చూపించిన ఇతర అవశేషాలు రాకెట్ లాంటి వస్తువులకు చెందిన శకలాలుగా అనిపించాయి. అర్ధగోళాకార తలలు ఇతర భాగాల కంటే చెక్కుచెదరకుండా కనిపించాయి. వాటి దిగువ భాగంలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్, వైర్లు జోడించి వున్నాయి. రెక్కలకు సర్క్యూట్ బోర్డ్లు, వైర్లను కలిగి ఉండే స్థూపాకార అటాచ్మెంట్లు ఉన్నాయి, ఇవి ప్రధాన ట్యూబ్ బాడీ లోపల సరిగా సరిపోతాయి. మేము పెద్దగా చెక్కుచెదరకుండా ఉండే కెపాసిటర్ లాంటి వస్తువును కూడా చూశాము – ఇది చిప్లో విద్యుత్ ఛార్జ్ ని నిల్వ చేయడానికి, విడుదల చేయడానికి ఉపయోగించే పరికరం. దీని మీద ఎలక్ట్రానిక్ భాగాలను తయారు చేసే జపనీస్-అమెరికన్ కంపెనీ Kyocera AVX ముద్ర ఉంది. తయారీకి సంబంధించి శిథిలాలలో మేం గుర్తించగలిగిన సమాచారం ఇది మాత్రమే. మేము వాడిన బుల్లెట్లను చూడలేదు.


రక్షణా నిపుణులు ఏమంటున్నారు :


వస్తువులు, శకలాల చిత్రాలు, వీడియోలను మేము అనేక స్వతంత్ర రక్షణ, భద్రతా నిపుణులకు చూపించాము. గాలిలో ప్రయాణించి నిర్దిష్ట లక్ష్యాన్ని చేధించడానికి రూపొందించబడిన ఖచ్చితత్వ-మార్గదర్శక విసిరగలిగిన పేలుడు పదార్ధాల చిత్రాలు ఉన్నట్లు దాదాపు అందరూ చెప్పినప్పటికీ, అవి ఖచ్చితంగా ఏమై ఉండవచ్చనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవి “ట్యాంక్ లపై పైనుంచి కిందకు (టాప్-డౌన్ స్ట్రైక్స్) దాడి చేయడానికి రూపొందించబడిన శకలీకరణ అస్త్రాలు (ఫ్రాగ్మెంటేషన్ వార్హెడ్లు)గా కనిపిస్తున్నాయి, వాటి కవచ రక్షణ చాలా తక్కువగా ఉంటుంది” అని భారత సైన్యం చేస్తున్న సాయుధ డ్రోన్ పరిశోధనల గురించి ఇటీవల వ్రాసిన డిఫెన్స్ అనలిస్ట్ అజయ్ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేసారు.


భూ-ఆధారిత, అధిక పరిమాణంలో ఉండే తుపాకులు లేదా డ్రోన్ల వంటి స్మార్ట్ మానవరహిత వైమానిక సాధనాలు అయివుండచ్చని సూచిస్తూ, ఇటువంటి ఆయుధాలను లాంగ్ రేంజ్ ఫిరంగి షెల్స్ నుండి లేదా “స్టాండ్-ఆఫ్ ఎయిర్బోర్న్ ఆయుధాల” ద్వారా ప్రయోగించి వుండవచ్చని శుక్లా చెప్పారు . అయితే ఈ ప్రాంతంలో పనిచేస్తున్న పారామిలటరీ, కేంద్ర పోలీసు బలగాలకు ఇటువంటి అధునాతన ఆయుధాలు అరుదుగా అందుబాటులో ఉంటాయని, ఇటువంటి ఆయుధాలు, యుద్ధాస్త్రాలు సాధారణంగా సైన్యానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి” అని శుక్లా చెప్పారు.


అవి “కొంత మార్గదర్శకత్వం లేదా ఖచ్చితత్వ వ్యవస్థతో కూడిన మోర్టార్ మందుగుండు సామగ్రిని పోలిన, సాధారణమైనవని ” ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్” ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ సాహ్ని చెప్పారు. మోర్టార్ ఆయుధాలను నేలపై ఉన్న బారెల్స్ నుండి ప్రయోగిస్తారు. ఆ ప్రాంతంలో పనిచేసే కేంద్ర అర్ధ సైనిక బలగాలతో “అందుబాటులో ఉన్న ఆయుధ వ్యవస్థలకు అనుగుణంగా” ఇటువంటి ఆయుధాలు ఉన్నాయని సాహ్ని స్పష్టం చేశారు. “వారికి అందుబాటులో ఉన్న వైమానిక ఆయుధాల గురించి నేనుఎప్పుడూ వినలేదు, వారి వద్ద ఉన్న డ్రోన్లు కేవలం నిఘా ప్రయోజనాల కోసం మాత్రమే” అని ఆయన చెప్పారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించినవని, “సామూహిక విధ్వంసం” కలిగించడం కోసం కాదని “గైడెడ్ ప్రొజెక్టైల్ వెపన్”ని శిధిలాలు సూచించాయని, అవి ఫ్యాక్టరీలో తయారు అయినవి, ఖచ్చితంగా మెరుగైనవి కాదు” అని పేలుడు పదార్థాల నిపుణుడైన విశ్రాంత భారత సైన్య సీనియర్ అధికారి అయిన మూడవ నిపుణుడు చెప్పారు.


ఇతర అవశేషాలతోపాటు, కొండపై శిధిలాల మధ్య తాము కనుగొన్న ” పేలుడు పదార్ధ తునకఅవశేషాలు”, రెండు డిటోనేటర్ల అవశేషాల ఆధారంగా ఒక లక్ష్యంతో ఉపయోగించిన ఆయుధంగా అంచనాకు వచ్చామని, తన పేరు చెప్పడానికి యిష్టపడని ఒక వ్యక్తి చెప్పారు.


“ఈ రకమైన పేలుడు పదార్ధం సాధారణంగా ఫిరంగి షెల్లలో కనిపిస్తుంది. మీరు నాకు చూపించినది కేవలం ఒక పౌండ్ పేలుడు పదార్థం కాబట్టి, తక్కువ పరిమాణం గల పేలుడు పదార్ధాల వల్ల కొండపై చాలా తక్కువ స్థాయిలో నష్టం జరుగుతుందనే మా పరిశీలనలకు అనుగుణంగా ఉందని” అతను చెప్పాడు. అయితే ఈ ప్రక్షేపకాలు దేని నుంచి ప్రయోగించబడ్డాయో కచ్చితంగా చెప్పలేమని, “కానీ అవి తక్కువ తీవ్రత, పౌర ప్రాణనష్టం లేకుండా నిర్దిష్ట లక్ష్యాలను చేధించడానికి ఉద్దేశించినవి అని స్పష్టంగా తెలుస్తుంది” అని విశ్రాంత అధికారి తెలిపారు.


చిత్రీకరణ చేసే డ్రోన్లు కొండపై తిరుగుబాటుదారులున్న ప్రదేశాన్ని చిత్రీకరణ చేసివుండవచ్చని, వారిని లక్ష్యంగా చేసుకోవడానికి పేలుడు పదార్థాలతో కూడిన రాకెట్లను హెలికాప్టర్ల నుండి ప్రయోగించి వుండవచ్చని ఆయన అన్నారు.


రాయ్‌పూర్‌కు చెందిన సీనియర్ సీఆర్‌పిఎఫ్ భద్రతా అధికారి మాట్లాడుతూ, మూడు వేర్వేరు తయారీల నిఘా డ్రోన్‌లు అందుబాటులో వున్నాయి. వాటిలో ఎక్కువ భాగం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన నేత్ర డ్రోన్‌లు. మిగిలినవి మావిక్, ఫాంటమ్.


అయితే ఏప్రిల్ 7న ఘటన జరిగినట్లు చెప్తున్న ప్రాంతాల్లో ఆ డ్రోన్‌లు వేటినీ చిత్రీకరణ ప్రయోజనాల కోసం ఉపయోగించకపోవచ్చని ఆ అధికారి తెలిపారు. “మా వద్ద ఉన్న డ్రోన్‌లు కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఎగరగలవు. భట్టిగూడ నుండి కనీసం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీఆర్పిఎఫ్ శిబిరమే అతి తక్కువ వైమానిక దూరంలో వున్నది, మా డ్రోన్లు ఎప్పుడూ ఆ ప్రాంతానికి వెళ్లలేదు” అని అధికారి చెప్పారు.
ఆయన చెప్పినది సరియైనది కాకపోవచ్చు – మేము ఆ ప్రాంతాన్ని సందర్శించిన రోజు డ్రోన్ శబ్దం విన్నాము. ఆకాశంలో హెలికాప్టర్లను కూడా చూశాం.


కొండపై కనిపించిన పేలని రాకెట్ లాంటి వస్తువు చిత్రాలను చూపించినప్పుడు, ఇది భద్రతా దళాలు గతంలో మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్న మెరుగైన అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్‌లను పోలి ఉన్నాయని అధికారి తెలిపారు. అయితే, స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు లేవని అతను అంగీకరించాడు.


ఈ ఆయుధాలతో కాల్చడానికి భద్రతా దళాలు డ్రోన్లను ఉపయోగించలేదని అన్న అధికారి, తమ కార్యాచరణ సామర్థ్యాలకు సాంకేతికత అందుబాటులో వుందని కూడా అన్నారు. “చేయవలసిందల్లా డ్రోన్లోకి ఒక బాంబును తిరిగి అమర్చడం, అది ప్రభావంతో పేలుతుంది,”. “ముఖ్యంగా, తగినంత సుదీర్ఘ పరిధి కలిగిన డ్రోన్ వుండాలి అంతే” అని అధికారి చెప్పారు.


డ్రోన్ల ఎర :


బస్తర్ వంటి అననుకూల భూభాగాల్లో నిఘా డ్రోన్ సాంకేతికత, లక్ష్యమైన వైమానిక మందుగుండు సామగ్రిని మోహరించే ఎరని అర్ధం చేసుకోవచ్చని; ఇది భద్రతా దళాలు కార్యాచరణ పరిమితులను అధిగమించడానికి సహాయపడుతుంది అని వ్యూహాత్మక విశ్లేషకులు చెప్పారు. ఈ ప్రాంతంలో సాంప్రదాయక భూమి మీద చేసే కార్యకలాపాలు తరచుగా భారీ ప్రాణనష్టానికి, తత్సంబంధిత నష్టానికి దారితీస్తున్నాయి. 2021 ఏప్రిల్ 7 నాటి ఘటన జరిగిన ప్రదేశానికి చాలా దూరంలో టేకల్‌గుడాలో సైనిక చర్య చేపట్టినప్పుడు 23 మంది భద్రతా సిబ్బంది మెరుపుదాడికి గురయ్యారు.


” ఈ రకమైన భూభాగంలో పనిచేస్తున్నప్పుడు క్రియాత్మక మేధస్సు అనేది ఒక పెద్ద సవాలు” అని సైనిక చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ అన్నారు. “నిఘా డ్రోన్‌లు మీకు మరింత వాస్తవ -సమయ పరిజ్ఞానాన్ని అందిస్తాయి, కానీ మీరు దానిపై ఎలా పని చేస్తారు? అన్నప్పుడే వైమానిక చర్యలు అమలులోకి వస్తాయి.
అయినప్పటికీ, అటువంటి సాంకేతికతకు దానికే సంబంధించిన పరిమితులు వుంటాయి అని గుర్తించాల్సిన అవసరం ఉంది అని రాఘవన్ అన్నారు. “ఇది మరింత ఖచ్చితమైన, కొలత ప్రకారం ప్రతిస్పందించే సామర్ధ్యం వుందనే అతిశయోక్తి భావాన్ని కలిగిస్తుంది”, “మన స్వంత ప్రజలు చేసే ప్రతి-తిరుగుబాటు కార్యకలాపాలపైన అటువంటి సాంకేతికతను ఉపయోగించేటప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ఉదాహరణల నుండి మనకు తెలిసినట్లుగా ఇది కేవలం తత్సంబంధ నష్టాన్ని కలిగించడం మాత్రమే కాదు, తప్పుడు లక్ష్యాలను కొట్టవచ్చు అని కూడా దీని అర్థం. ”

(ఈ కథనానికి ఛత్తీస్ ఘడ్ నుంచి రౌనక్ శివ్‌హరే సహాయం చేశారు)
తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply