భీమా కోరెగావ్ సంఘటన తరువాత యుఎపిఎ కింద కొంతమంది కార్మికులను అరెస్టు చేసిన రాజ్యం యథావిధిగా తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. అసలు భీమా కోరేగాంకు కార్మికులకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. అయితే వాళ్ళు తమ శక్తివంతమైన యజమాని రిలయన్స్ కు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి పెద్ద నేరం చేశారు. ఈ కార్యకలాపాలపై దేశద్రోహ అభియోగాలు మోపలేక, వందలాది మంది కార్యకర్తలు, కార్మికులను ఇతర సాకులతో జైలులో ఉంచడానికి రాజ్యం నిస్సారమైన ఆరోపణలను చేస్తుంది.
తమపై మోపిన అభియోగాలను తొలగించుకోడానికి చాలా కాలమే పట్టింది. చిట్టచివరికి ఖైదులో వున్న ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) కార్మికులకు 3 సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరయింది. వారి యూనియన్ (ముంబై ఎలెక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్) అరెస్టు చేసిన కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు, యాజమాన్య దోపిడీకి గురైన కాంట్రాక్ట్ కార్మికుల పోరాటాలను కొనసాగించడానికీ ఈ క్రింది కరపత్రాన్ని విడుదల చేసింది. ఈ కరపత్రం హిందీ, తమిళ, తెలుగు భాషలలోకి అనువాదమైంది. ఎంతో స్పూర్తిదాయకమైన వీరి పోరాట విషయాలు ఈ కరపత్రం ద్వారా మనకు తెలుస్తాయి.
మన శక్తినంతా వెచ్చించి కార్మికుల హక్కును కాపాడుకుందామంటూ పిలుపునిచ్చిన ఆ కరపత్రం యథాతథంగా..
2018 ఫిబ్రవరి 5 నుండి జైలులో ఉన్న సైదులు సింగపంగాకు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి భారతి డాంగ్రే 2021 మే 5నాడు బెయిల్ మంజూరు చేసారు. ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) తిలక్ నగర్ యూనిట్ కార్యదర్శి కామ్రేడ్ సైదులు బెయిల్ పొందిన ఐదుగురు MEEU కార్యకర్తలలో చివరివాడు. మరో నలుగురు, కామ్రేడ్స్ శంకర్ గుండే, రవి మారపల్లె, బాబుశంకర్ వంగూరి, సత్యనారాయణ కరేలాలు 2019 చివరి నుండి 2020 ఆరంభ కాలావధిలో బెయిల్ పైన విడుదలయ్యారు.
చివరికి, కామ్రేడ్ సైదులు మే 10 న జైలు నుండి విడుదలయ్యారు. అడ్వాన్స్ సుదీప్ పస్బోలా, న్యాయవాదులు ఆరిఫ్ సిద్దిఖీ, సూసన్ అబ్రహం సహకారంతో చేసిన సుదీర్ఘ న్యాయపోరాటం ఫలితమే ఈ బెయిళ్ల మంజూరీ. 2018 జనవరి 13 న రిలయన్స్ కార్మికులను అరెస్టు చేసినప్పటి నుండి తానే స్వయంగా అరెస్ట్ అయ్యేవరకు అరుణ్ ఫెరేరా వారికి న్యాయవాదిగా ఉన్నారు. ప్రస్తుతం మరో 15 మందితో పాటు జైలులో ఉన్న అడ్వకేట్ అరుణ్ ఫెరీరా, కుఖ్యాత భీమా కోరెగావ్ కేసులో ముద్దాయి.
2018 జనవరి 13, న కామ్రేడ్స్ శంకర్ గుండే, రవి మారపల్లె, బాబుశంకర్, సత్యనారాయణ కరేలాలను, 2018 ఫిబ్రవరి 5న కామ్రేడ్ సైదులును ముంబై ఎటిఎస్ చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ) కింద అరెస్టు చేసింది. 2017 డిసెంబర్ 19 న చట్టబద్ధంగా అర్హత వున్న సహ కార్మికుడు, ESI కింద వైద్య చికిత్స జరగకుండా మరణించినప్పుడు, రిలయన్స్ కార్మికులందరూ చేసిన సమ్మెలో విధ్వంసానికి పాల్పడినట్లు వారిపై అభియోగాలు మోపారు. ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆశ్రయాన్ని కల్పించడం, నిషేధిత సంస్థ కోసం నిధులు సేకరించడంలాంటి అదనపు ఆరోపణలను కూడా వారిపై పెట్టారు.
బెయిల్ కోసం సైదులు దరఖాస్తుపై వాదనలు జరిగిన సమయంలో, అడ్వకేట్ పాస్బోలా గౌరవనీయ హైకోర్టు ముందు ప్రాసిక్యూషన్ సమర్పించిన పత్రాల నుండి, సైదులు నుండి నేర పూరిత సామాగ్రి ఏదీ స్వాధీనం కాలేదనీ, అతను 2018 ఫిబ్రవరి నుండి జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిన, UAPA వంటి క్రూరమైన చట్టం క్రింద అతనిపై ఆరోపించదగిన ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలు జరపలేదనీ నిరూపించగలిగారు.
కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆమోదించిన ఉమ్మడి తీర్మానం ప్రకారం శివాజీ జయంతి, మేడే/మహారాష్ట్ర దినోత్సవం దీపావళి మొదలైన పండగల సందర్భంగా వివిధ యూనియన్ నాయకులు, కార్యకర్తలకు చెక్కుల ద్వారా కాంట్రాక్టర్ అసోసియేషన్ విరాళాలు ఇచ్చేదని కాంట్రాక్టర్ నుండి డబ్బు వసూలు చేసిన ఆరోపణకు సంబంధించి అడ్వకేట్ పస్బోలా వివరించారు.
సైదులు బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వులో, “మిస్టర్ సింగపంగాపై యుఎపిఎలో పైన పేర్కొన్న అన్ని సెక్షన్ల కింద అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలను నేను చూడలేదు. అతనికి వ్యతిరేకంగా చెప్పిన అంశాలను బట్టి ఇకపై అతను జైలులో ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశానికి వ్యతిరేకంగా అసంతృప్తిని కలిగించే లేదా ఉద్దేశించిన ఏ చర్యను విషయాలు సూచించడం లేదు.” అని న్యాయమూర్తి భారతి దంగారే అన్నారు.
దానికి వివరణ అవసరం. కార్మికులు తమ సమిష్టి బలాన్ని, శక్తిని తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి మరింత సురక్షితమైన, మెరుగైన జీవితం కోసం సమిష్టిగా బేరం కుదుర్చుకోవడానికి యూనియన్లను ఏర్పాటు చేసుకుంటారు. దోపిడీని వ్యతిరేకించడానికి, ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం, కార్మిక హక్కులను సమర్థించడం కోసం యూనియన్లు ఏర్పడతాయి. యజమాన్య పక్షం నిలబడడానికి, కార్మికుల సమిష్టి ప్రయోజనాలకు వ్యతిరేకంగా యజమాన్యం, వారి ఏజెంట్ల నుండి సేకరించిన చెల్లింపుపై దోపిడీదారునికి మద్దతు ఇవ్వడానికైతే ఖచ్చితంగా యూనియన్లు ఏర్పడలేదు.
రిలయన్స్ లోనూ, దాని మునుపటి అవతారమైన బిఎస్‌ఇఎస్ (BSES)లోనూ, దాదాపు 6000 మంది కాంట్రాక్టు కార్మికులు, అందులో ఎక్కువగా తెలంగాణకు చెందినవారు పని చేస్తున్నప్పుడు విద్యుద్ఘాత ప్రమాదాలలో ఎంతమంది మరణించారనేదానికి లెక్కలు లేవు. 2005 సంవత్సరం వరకూ మరణ పరిహారం రూ. 25 వేలు మాత్రమే యిచ్చేవారు.
MEEU ఆరంభం నుండే కార్మికుల సమిష్టి ఫిర్యాదుల కోసం పోరాడింది. ప్రతి నెల 10 వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, పే స్లిప్ జారీ చేయాలని, బ్యాంక్ ద్వారా చెల్లింపు జరగాలని, అన్నిటికంటే మించి, పిఎఫ్‌లో చేరిన తేదీ ప్రకారం సీనియారిటీ ఆధారంగా శాశ్వత కార్మికుడిగా మారే హక్కు వుండాలని డిమాండ్ చేసింది. అటువంటి డిమాండ్ కోసం కాంట్రాక్ట్ కార్మికుల కోసం పని చేస్తున్నామనే ఇతర ఏ యూనియన్ పోరాడింది? పోరాడినట్లు గుర్తింపు పొందిన ఏ యూనియన్ అయినా ఆధారాలు చూపించగలదా? MEEU నిరంతరం కార్మికుల హక్కుల కోసం పోరాడింది. రిలయన్స్ లోని అన్ని యూనియన్లకు చెందిన కార్మికుల నుండి విస్తృత మద్దతును పొందింది. ప్రతి నెలా 10 వ తేదీన కార్మికుల వేతనాలు చెల్లించడం, పే స్లిప్స్ యివ్వడం, బ్యాంకుల ద్వారా చెల్లింపులు, యూనిఫాంలు, భద్రతా బూట్లు, రెయిన్ కోట్లు, మరణ పరిహారం, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతలపై మేనేజ్ మెంట్ మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టడం, 4 పండుగ సెలవులు, 21 రోజుల వార్షిక సెలవు, కనీసం కొంత మొత్తానికి వార్షిక బోనస్ చెల్లింపు మొదలైన డిమాండ్లను పోరాడి సాధించుకున్నారు.
ఈ సిరీస్‌లో ESI చివరిది. 4000 మంది కార్మికుల వేతనాలలో 4% ESI కోసం యివ్వాల్సి రావడం కంపెనీకి భారమన్పించింది. సోకాల్డ్ కాంట్రాక్టు కార్మికులుగా పిలిచే వారికి బీమా సౌకర్యాన్ని నిరాకరించి 44 కోట్ల రూపాయలను రిలయన్స్ ఆదా చేసింది. ESI కింద కార్మికులకు వైద్య సౌకర్యం కలిగించాలనే డిమాండే చేసి కంపెనీతో భారీ “ఖర్చు” చేయించి, లాభాలలో తగ్గుదల కలిగిస్తోందని MEEU కార్మికుల పట్ల రిలయన్స్ కంపెనీ చాలా కోపంగా వుంది.
నిబద్ధత కలిగిన MEEU కార్యవర్గ సభ్యులుగా వుండిన దివంగత అడ్వకేట్ ఎ.పి.కులకర్ణి లాంటి న్యాయవాదులు కోర్టుల్లో కార్మికుల సమస్యలకు సంబంధించిన కేసులు వేసి పోరాడారు. వివిధ సేవా కేంద్రాల్లో వున్న యూనియన్ కార్యకర్తలే MEEU విజయానికి కారణం. ఏ యూనియన్ అయినా పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మాకు తెలుసు.
2007 డిసెంబర్ లో రిలయన్స్ 11 మంది కార్యకర్తలను నిస్సారమైన ఆరోపణలతో తొలగించింది. 2018 డిసెంబర్‌లో అనిల్ అంబానీ రిలయన్స్ మీద విజయం సాధించిన అదానీ, సమ్మెచేసి తిలక్ నగర్‌లో వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపిస్తూ నలుగురు కార్యకర్తలను వెంటనే సస్పెండ్ చేశారు. 2019 జనవరిలో ఐదుగురు ప్రముఖ కార్యకర్తలను ‘ఉగ్రవాదులు’ అని ఎటిఎస్ అరెస్టు చేసింది.
2007 లో 11 మందిని తొలగించడం, 2018 డిసెంబర్‌లో నలుగురిని సస్పెండ్ చేయడం, అయిదుగురిని అరెస్టు చేయడం వంటివి కార్మికులను మాట్లాడకుండా చేయడానికి, వారి స్ఫూర్తిని తగ్గించడానికి ప్రణాళికాబధ్ధంగా చేశారు. ఈ చర్యలు కార్మికులపై ప్రభావం చూపాయి. రిలయన్స్, అదానీలు చేసిన కుట్ర కొంతకాలం పోరాడుతున్న కార్మికులలో గందరగోళాన్ని సృష్టించి, తప్పుడు పోలీసు కేసులు, అరెస్టులు, జైలు, ఉద్యోగాలు, జీవనోపాధి కోల్పోవడం మొదలైన కారణాల వల్ల నిజమైన యూనియన్ల నుండి వారిని దూరం చేయడం అనివార్యమవుతుంది. ఇలా జరగడం అత్యంత సహజం.
అదానీ ఎలక్ట్రిసిటీలో వున్న అన్ని కార్మిక సంఘాలలోని కార్మికులు తమ హక్కుల సాధన కోసం దృఢంగా నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం రూపొందించిన కొత్త లేబర్ కోడ్‌లు ప్రత్యేకించి పారిశ్రామిక యజమాన్య వర్గానికి ప్రయోజనం చేకూర్చేవి. కార్మిక రంగంలో జరిగిన ఇటువంటి పరిణామం నుంచి సోకాల్డ్ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే కాదు, శాశ్వత కార్మికులు కూడా తప్పించుకోలేరని స్పష్టమవుతుంది. ఒకవైపు కార్మిక చట్ట మార్పులను వ్యతిరేకించడానికి కార్మికులందరూ కలిసి నిలబడటం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటం, అన్ని రకాల దౌర్జన్యాల నుండి కార్మికులను విముక్తి చేయడాన్ని ఇది అనివార్యం చేస్తుంది.
కార్మికసంఘాల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం సమైక్యంగా నిలబడాలని కోరుకునే వారందరినీ కలుపుకునిపోవడానికి MEEU కట్టుబడి ఉంది.
MEEU పర్మనెంట్ ఉద్యోగాల కోసం జరిగే పోరాటంలో విజయం సాధిస్తుంది. తొలగించిన కార్మికులను తిరిగి నియమించడంలో MEEU విజయవంతమవుతుంది.
కామ్రేడ్స్,
2021 మే 10 న కామ్రేడ్ సైదులు సింగపంగా జైలు నుండి బయటకు వస్తున్నారు, కామ్రేడ్ శంకర్ గుండే, రవి మరపల్లె, బాబు శంకర్, సత్యనారాయణ కరేలాలు ఇంతకుముందు పొందిన బెయిల్ కార్మికుల ఐక్యతను సుస్థిరం చేస్తుంది. కేసు విచారణ పెండింగ్‌లో ఉంది. కార్మికుల హక్కును మన శక్తితో కాపాడుకుందాం.
పోరాడేవారిదే విజయం.
( https://tnlabour.in/factory-workers/12147 సౌజన్యంతో
అనువాదం : కె. పద్మ )