మంచికో చెడుకోగాని తేనెతుట్టె మరోసారి కదిలింది. అకాడమీ అవార్డుల మీద తీవ్రమైన చర్చే జరిగింది. ఫేస్‌బుక్ మీద కాబట్టి ఇంతకంటె గొప్పగా ఉండాలని ఆశించేందుకు లేదు. నింపాదిగా, నిలకడగా మాట్లాడుకోలేకపోవడం, తక్షణ ప్రతిస్పందనతో సరిపెట్టుకోవడం ఇవాల్టి మేధో సంస్కృతి. అట్లని అంతా ఇదే కాదు. తెలుగులో ఓపికగా జరుగుతున్న అత్యవసరమైన మేధో అన్వేషణ కూడా ఉన్నది. కేంద్ర సాహిత్య అకాడమీ గురించి, అది అవార్డులను ప్రకటించే పద్ధతి గురించి గతంలో కూడా చాలా వాద వివాదాలు జరిగాయి. అయితే ఇప్పటికైనా ఈ చర్చ అన్ని రకాల అవార్డులు, సన్మానాలు, పురస్కారాల గురించి మరింత దృఢంగా ముందుకు సాగవలసి ఉన్నది.
అవార్డులు, గుర్తింపులు, ప్రతిఫలాలు, సామాజిక న్యాయాలు సాహిత్యమనే ఒంటి స్తంభపు ఒంటరి ప్రపంచానికి సంబంధించినవి కావు. సాహిత్యం, రచయితలు సమాజం మొత్తంలో భాగం. కాబట్టి ఈ చర్చ వీలైనంత విశాలం కావాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అస్తిత్వాన్ని, దాని ప్రకటిత అప్రకటిత లక్ష్యాలను, సాహిత్యరంగంలో అది నిర్వహిస్తున్న పాత్రను మళ్లీ మళ్లీ విమర్శనాత్మకంగా పరిశీలించాలి.
సాహిత్యం భావజాల సంబంధమైనదని అందరమూ నమ్ముతాం. కాబట్టి అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరికి ఎలా పంచుతోందనే దానితోపాటు అది పంచే భావజాలం ఏమిటో గుర్తించి, దాని మీద ప్రజానుకూల రచయితల వైఖరి ఏమై ఉండాలో కూడా చర్చలోకి రావాలి. రచనలో అద్భుతమైన ప్రజా జీవితాన్ని చిత్రిస్తూ కూడా రచయితలుగా ప్రజానుకూల రాజకీయాలను, భావజాలాన్ని ప్రకటించుకోని వాళ్ల సంగతి వదిలేద్దాం. ఏదో ఒక పీడిత అస్తిత్వ, పీడిత వర్గ సమూహాల వైపు నుంచి ప్రజాస్వామిక విలువల గురించి ఆరాటపడే వాళ్లయినా ఈ ఎరుకను ప్రదర్శించాల్సిన సమయం ఇది.
దేశంలో ఫాసిజం వచ్చినందు వల్ల, ఫాసిస్టు భావజాలం ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రసాహిత్య అకాడమీ గురించిన చర్చగా ఇదంతా కుదించుకపోవడానికి వీల్లేదు. బహుశా మరే భారతీయ భాషా సాహిత్యంలోకంటే తెలుగులోనే అవార్డుల మీద తీవ్రమైన విమర్శ, ప్రత్యేకమైన ఆసక్తి మొదటి నుంచీ ఉన్నాయి. తెలుగు సాహిత్యం రాజకీయంగా, అంతకంటే ఎక్కువ సాంస్కృతికంగా ఎదిగిన సమాజమనడానికి ఇదంతా నిదర్శనం. కాబట్టి చర్చ కేవలం కేంద్ర సాహిత్య అకాడమీ గురించే కాదు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, విశిష్ట వ్యక్తిత్వ పురస్కారాలు, తామరతంపరగా పెరిగిపోయిన ప్రైవేట్ అవార్డులు, అందులో ప్రగతిశీల వ్యక్తులు, సంస్థలు కూడా నడుపుతున్న పురస్కారాలు, సాహిత్య పోటీలు మొదలైనవన్నిటినీ కలుపుకొని చర్చించగల నైతిక ధృతి ఉన్నదా లేదా? అని అందరూ ఆలోచించుకోవాలి. ఈ మొత్తానికి సమంజసమైన, హేతుబద్ధమైన, ఆచరణయోగ్యమైన, ప్రజానుకుల విలువల సంబంధమైన ప్రమాణాలను ఏర్పరుచుకోగలమా? అనేది అంతకంటే ముఖ్యమైన విషయం. అలాంటివేవో తేల్చుకోకుండా చర్చించడం గడ్డి దుబ్బులోంచి గుండు సూదిని వెతికే ప్రయత్నంగా మిగిలిపోతుంది.
ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తక్కెడశిల జానీ రాసిన ‘వివేచని’ అనే సాహిత్య విమర్శ పుస్తకానికి ఇచ్చారని తెలిసినప్పటి నుంచి ఫేస్ బుక్ మాధ్యమంలో చర్చ మొదలైంది. ఫేస్‌బుక్ కాబట్టి అదొక దుమారంగా లేచి చల్లారిపోయింది. ఇందులో ప్రధానంగా తక్కెడశిల జానీ కాపీ కవి అని, సాహిత్యం చదవని సాహిత్య విమర్శకుడని, అకాడమీ అంగీకరించగల భావజాల రచనలు చేశాడని, అవార్డు సంపాదించడానికి ఆ సంస్థకు సన్నిహితంగా ఉండే వాళ్ల మెప్పుపొందగలిగే వ్యాసాలు రాశాడని, అలాంటి వాళ్ల పైరవీ వల్లనే అవార్డు వచ్చిందని, అకాడమీ జ్యూరీలో ఉన్న వాళ్లకు సాహిత్యమంటే ఏమో తెలియకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని, అవార్డుల జాబితాలో ఉన్న సమర్థులైన రచయితలకు అన్యాయం జరిగిందని, దీంతో యువ పురస్కారానికి అర్హులైన వాళ్ల వయసు ఈ ఏడాదితో మీరిపోయి వాళ్లు అవకాశం పూర్తిగా కోల్పోయారని, జానీ సాహిత్య విమర్శకు అవార్డు ఇవ్వడం ద్వారా తెలుగేతర భాషల్లో తెలుగు సాహిత్య విమర్శ పరువు తీసేశారని, అకాడమీ తాను నిర్దేశించుకున్న ప్రమాణాలు, పద్ధతులు పాటించడం లేదని, ఉన్న ప్రమాణాలు కూడా బాగా లేవు కాబట్టి ప్రతిభ, విద్వత్తు ఉన్న రచయితను ఎంచుకోగల, సామాజిక న్యాయం సాధించగల కొత్త పద్ధతులు నెలకొల్పాలని.. ఇలా కొన్ని డజన్ల వాదనలు వచ్చాయి. జానీకి అవార్డు రావడం పట్ల విసుగు, విసుర్లు, ఎత్తిపొడుపులు, ఇష్టా ఇష్టాల్లోంచి వచ్చిన ఆక్రోశాలనూ పక్కన పెడితే నికరంగా పైన చెప్పిన తరహా వాదనలు ఇంకా చాలానే ఉన్నాయి.
ఈ మొత్తంలో తక్కెడ శిల జానీకి కాకుండా అర్హులకు ఇచ్చి ఉంటే ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసిన వాళ్లలో చాలా మంది సంతృప్తి చెంది ఉండేవారు. ఎప్పటిలా అవార్డు పొందిన వాళ్లను అభినందనలతో, ప్రసంశలతో ముంచెత్తేవారు. దాంతో ఈ అంకం ప్రశాంతంగా ముగిసిపోయేది. దానికి భిన్నంగా కవిత్వంలో అనుకరణ, విమర్శలో ప్రమాదకర భావజాలం ఉన్నదనే విమర్శ ఎదుర్కొంటున్న తక్కెడశిల జానీకి రావడం వల్ల అనర్హత, పైరవీ అనే రెండు ముఖ్యమైన కోణాల్లో ఎన్నో విషయాలు బైటపడ్డాయి. అనర్హత, పైరవీ అనే వాటిని తప్పక చర్చించవలసిందే. ఈ సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ మీద వచ్చిన విమర్శలన్నీ దాదాపుగా వీటి చుట్టూనే ఉన్నాయి.
ఇంతకూ జానీ సందర్భంలోనే అకాడమీ ఇంత అవాంఛనీయంగా వ్యవహరించిందా? తన పవిత్రతను కోల్పోయిందా? దీనివల్లే తెలుగు సాహిత్యానికి దిద్దుకోలేని అపచారం ఇప్పుడే జరిగిందా? అని కూడా ఆలోచించాలి. గతంలో అందరూ అంగీకరించే రచనలకు కూడా కొన్నిసార్లు అవార్డులు వచ్చి ఉండవచ్చు. ఏ పైరవీ జరగకుండా చాలా సహజంగానే అప్పటి జ్యూరీ అవార్డులు ప్రకటించి ఉండవచ్చు. కాబట్టి ఆ రచయితల విషయంలో వివాదమే లేకపోవచ్చు. అంత మాత్రాన అకాడమీ చరిత్రలో బైటి ప్రభావం ఏమీ లేకుండా, పైరవీ జరగకుండా అవార్డులు వచ్చాయని ఈ చర్చ చేసిన వాళ్లెవరైనా చెప్పగలరా? యువ అవార్డుల సంగతే ఎందుకు? వృద్ధ అవార్డుల పంపకాలప్పుడు కూడా ఫలానా వాళ్లకు ఈసారి అవార్డు వస్తుందని చివరి దాకా అనుకుంటూ ఉండగా అది తారుమారైందని అవార్డుల సాహిత్య బృందాల్లో ఎన్నిసార్లు చర్చ జరగలేదు? ప్రాంతాల వారిగా, కులాల వారిగా అన్యాయం జరిగిందని ఆవేదన చెందిన సందర్భాలు ఎన్ని లేవు? ఒక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డనే కాదు, మిగతా అనేక అవార్డుల్లో ఏది ఎవరికి రాబోతోందో రచయితలు గుసగుసలుగా చెప్పుకొని అవి ఎన్నిసార్లు బహిరంగం కాలేదు? నిజమో అబద్ధమోగాని అవార్డులు ఇప్పించగల పరపతి ఫలానా వారికి ఉన్నదని, వాళ్ల వల్లే అవార్డులు వచ్చాయని, అందువల్లే వాళ్ల చుట్టూ రచయితలు తిరుగుతుంటారని ఎందరి విషయంలో అనుకోవడం లేదు? అంటే అవార్డుల ఎంపికకు చాలా పెద్ద కసరత్తు చేయవలసిన పద్ధతులు అకాడమీకి ఉన్నప్పటికీ, ముందస్తుగా జరిగిపోవడం, దానికి ఎవరి బలాన్నిబట్టి వారు పైరవీ చేసుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది కదా? అందుకే ఎన్ని మినహాయింపులైనా ఉండవచ్చుగాని, ఎవరికీ ఏ అవార్డూ దానికదిగా రాదని, ప్రయత్నించి తెచ్చుకోవాల్సిందేనని, దాని కోసం ఎవరి కష్టం వారు చేయాల్సిందే అనేది అవార్డుల ప్రపంచపు నానుడిగా లోపలి వాళ్లే నిర్ధారించి ప్రచారంలో పెట్టారు.
కాబట్టి అకాడమీ జ్యూరీలో ఉన్న వాళ్లు పైరవీలకు లొంగిపోయారని, చివరికి ఏది సాహిత్యమో, ఏది కాదో కూడా పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారని, అకాడమీ పద్ధతులను విస్మరించారని అనే విమర్శ ఈ ఒక్క సందర్భానికే వర్తించేది కాదు. అవార్డుల ఎంపికకు కొన్ని పద్ధతులు ఉన్నా, ఏ పైరవీ లేకుండా కొందరికి అవార్డులు ఇచ్చి ఉన్నా, ఆశ్రిత పక్షపాతం, ఇష్టాఇష్టాలు, ముందస్తు ఎంపిక, పేరున్న వాళ్ల ప్రభావం మొదలైన వాటి ప్రకారం పని చేయడమే ఆ సంస్థ ప్రధాన స్వభావం అని దానికదే రుజువు చేసుకుంది. ఇవన్నీ తెలుస్తున్నా..ముందు దానికి ఒక పవిత్రతను ఆపాదించి, అది కోల్పోయిందని వాదించడం, ఆవేదనపడటం ఎంత పెద్ద విచిత్రం.
నిజానికి అకాడమీ చాలా పాదర్శకంగానే పని చేస్తున్నది. అది కొత్తగా ఇప్పుడే భ్రస్టుపోయిందేమీ లేదు. ఈ వాస్తవాన్ని అంగీకరించేవాళ్లు కూడ మరీ ఇలాంటి రచయితకా అవార్డు ఇచ్చేది అని విస్తుపోయేంతగా ఈసారి అకాడమీ తనను తాను బట్టబయలు చేసుకున్నది. అందుకే ఫేస్‌బుక్‌లో ఇంత చర్చ జరిగినా.. అకాడమీ ‘మంచి’ గురించి మాట్లాడటానికి ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. ఇది సంతోషించాల్సిన విషయం. ఇదేం తెలియజేస్తోందంటే.. అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లాంటిదే అకాడమీ అనీ, దానిలో మంచి వెతికేందుకు ఏమీ లేదని, దాన్ని సమర్థించబోతే ఇరకాటానపడతామని రుజువు కావడం.
దేనికంటే సాహిత్య ప్రమాణాలు, విలువలు వంటి అతి ముఖ్యమైన అంశాలను అకాడమీ అనే ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించాక తక్కెడ శిల జానీలాంటి రచయితలకు అవార్డులు వస్తునే ఉంటాయి. ఈ విపత్తు ఇప్పుడే జరగలేదు. అసలు ప్రభుత్వం సాహిత్య సేవ చేయాలని ఎందుకు అనుకుంటోంది? లక్షల రూపాయల ప్రజల సొమ్ము సాహిత్యకారులకు అవార్డుల పేర దేనికి ఇస్తోంది? ఇది అసమ సమాజం అని అంగీకరిస్తే, ఈ వ్యవహారమంతా కేవలం సేవకు, డబ్బులకు సంబంధించిందేనా? అనే సందేహాలు రావాలి.
నిజానికి అవార్డులు ఇవ్వడం అకాడమీల పనుల్లో ఒకానొకటి మాత్రమే. అది చేసే అన్ని పనులనూ కలిపే దాని ఉద్దేశాలు గ్రహించాలి. దాని పాత్రను అంచనా వేయాలి. అట్లా కాకుండా జ్యూరీలో ఉన్న వాళ్లు పైరవీలకు పాల్పడ్డారనీ, అవార్డుల ఎంపికలో సాహిత్య ప్రమాణాలు పాటించలేదని అనుకోవడం రోగ లక్షణం గురించిన చర్చగా మిగిలిపోతుంది. ప్రభుత్వ రంగ సంస్థలత్లో బ్యురాక్రాట్లు, రాజకీయ నాయకులు ఉంటేనే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ప్రమాణాల పతనం జరుగుతుందికానీ సాహిత్యకారులే జ్యూరీ సభ్యులుగా ఉండే అకాడమీలో అలాంటి వాటికి తావులేదని భ్రమపడటానికి లేదు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న అవలక్షణాలు అకాడమీలో కూడా ఉంటాయి. అన్ని ఆఫీసుల్లో అక్కడక్కడా మంచి వాళ్లు ఉన్నట్లే, పద్ధతులు పాటించేవాళ్లు ఉన్నట్లే అకాడమీలో కూడా ఉండవచ్చు. వ్యక్తిగత స్థాయిలో ఆ సంస్థ నిర్దేశించుకున్న పద్ధతుల ప్రకారమే ఆలోచించి నిర్ణయాలు తీసుకొనే వాళ్లూ ఉండవచ్చు. అంత మాత్రాన వాటి మౌలిక స్వభావంలో ఏ తేడా ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం వల్ల ప్రజలకు జరిగే మేలు కూడా ఉంటే ఉండవచ్చుగాని రాజ్యం సమాజం మీద, ప్రజల మీద స్వైర విహారం చేయడానికి, తన అధికారాన్ని ఒక పద్ధతి ప్రకారం నడపడానికి, సమాజాన్ని తన ఆధీనంలో ఉంచుకోడానికి యంత్రాంగాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్క విషయం తెలిస్తే అకాడమీ పట్ల సాహిత్యకారులు స్పష్టమైన వైఖరి తీసుకోవచ్చు. అకాడమీలను రాజ్యం తన భావజాల యంత్రాంగంలో కీలకమైన పనిముట్టుగా ఏర్పాటు చేసుకుంది. దేనికంటే భావజాలం సమాజమంతా విస్తరించి ఉంటుంది. ఏ మూల ఎవరో, ఏ బృందమో రాజ్యం మీద, సమాజ యథాతథ స్థితి మీద తిరుగుబాటు లేవదీయడానికి అవకాశం ఉంటుంది. అన్ని రాజకీయ సంచలనాలకు మొదట్లో ఏదో ఒక మేరకు భావజాల, సాంస్కృతిక తిరుగుబాట్లు జరిగాయి. ఈ సంగతి భావజాల రంగంలో ఉన్నవాళ్లకంటే ఎక్కువగా రాజ్యానికి తెలుసు. కాబట్టి ఆ రంగాన్ని అప్పనంగా సమాజంలోని వ్యక్తులకు, బృందాలకు రాజ్యం ఇచ్చేయదు. అక్కడి నుంచి ఉద్భవించే తిరుగుబాట్లను చూస్తూ ఊరుకోదు. అంత తెలివితక్కువదనం ఉంటే రాజ్యానికి మనుగడ కష్టం. ఇదంతా ఊహ అని కొట్టి పడేయదల్చుకుంటే మనకు భావజాలమంటే ఏమిటో తెలియనట్లే. పాలకవర్గం మాత్రం పోలీసు వ్యవస్థ, న్యాయస్థానంలాంటి వాటిలాగే అకాడమీలను కూడా స్థాపించుకుంది. తృణమో పణమో దానికి కేటాయించి పుస్తకాలు అచ్చువేస్తుంటుంది. అనువాదాలు చేయిస్తుంది ఒక్కోసారి అవి చాలా మంచివే కావచ్చు. ఎంతగానంటే ఇంత పెద్ద పని అకాడమీలాంటి సంస్థలే చేయగలవు.. అని చాలా మంది అనుకొనేలాంటి భారీ పనులు కేంద్ర, రాష్ట్ర అకాడమీలు చేస్తూ వచ్చాయి.
వీటన్నిటి మధ్య పూలల్లో దారంలా రాజ్యానికి తన సొంత ప్రయోజనం ఉంటుంది. ఏ వ్యవస్థలో అయినా అనేక అంతుస్తులు ఉంటాయి. అన్నిటి మీద ప్రభుత్వ అజమాయిషీని నిర్వహించేవారు అందులోనే ఉంటారు. అకాడమీ కూడా అట్లాగే ఉంటుందని ఊహించడం కష్టమేమీ కాదు. అందలోని వివిధ స్థాయిల్లో రచయితలు ఉన్నప్పటికీ అంతిమంగా ప్రభుత్వ అజమాయిషీ కింద, దాని ఉద్దేశాల మేరకు పని జరిగే మెకనిజం అందులో ఉంటుంది. అందులో వాళ్లకు స్వేచ్ఛ ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ అకాడమీ విధించిన పరిధిని దాటి చేయడానికి ఏమీ ఉండదు. అయినా సరే కొందరు ఇవన్నీ మంచి పనులే కదా అనేవాళ్లు ఉండవచ్చు. ‘మేం ఈ పరిమితుల్లో పని చేస్తాం.. ఎవరికైనా ఏవో కొన్ని పరిమితులు ఉంటాయి కదా’ అనే సమర్థనకు దిగేవాళ్లు ఉండవచ్చు. ‘ఈ పనులు సమాజానికి అవసరం లేదా?’ అని కూడా అనుకోవచ్చు. ఇలాంటివన్నీ కలిసి ఒక పథకం ప్రకారం సమాజాన్ని, రాజ్యాన్ని విమర్శనాత్మకంగా చూసే సాహిత్యం, ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఉంటుందని చెప్పే సాహిత్యం అప్రధానమయ్యే స్థితి ఏర్పడుతుంది. చివరికి ఏ రకమైన సాహిత్యాన్ని అకాడమీ ఎత్తిపడుతుందో ఆ రకమైన రచనలు చేయడానికి సాహిత్యకారులు అలవాటుపడతారు. అవార్డులు సంపాదించుకోడానికి పైరవీలకు పాల్పడతారు. పైరవీలు చేసిపెట్టే బృందాలు అన్ని రంగాల్లోలాగే సాహిత్యంలో కూడా తయారవుతాయి. వాళ్లలో సాహిత్యం రాయని వాళ్లు కూడా ప్రముఖ రచయితలుగా చెలామణి అవుతూ ఉంటారు.
సాహిత్యం భావజాల కేంద్రకమని మనం అంటూ ఉంటాం. కానీ ఆ సంగతి మనకంటే రాజ్యానికి బాగా తెలుసు. దానితో ఎలా వ్యవహరించాలో అంతకంటే బాగా తెలుసు. అక్కడి నుంచి వస్తువు, శిల్పం, ప్రయోగం, ప్రమాణాలు వంటివన్నీ అకాడమీ నుంచి రాజ్యం చేతిలోకి వెళ్లిపోతాయి. లేదా దాని తరపున అకాడమీ నిర్ణయిస్తుంది. ఏ పుస్తకం అచ్చేయాలి? ఏ అనువాదం చేయించాలి? ఏ పుస్తకానికి అవార్డు ఇవ్వాలి? అనే ‘మంచి’ పనుల దాపున రాజ్యం తన భావజాలానికి తగినట్లు సాహిత్యరంగాన్ని తయారు చేసుకుంటూ పోతుంది. అకాడమీల్లో ఒకరో ఇద్దరో మంచి వాళ్లు ఉన్నప్పుడు అర్హతగల సాహిత్యానికి అవార్డు వచ్చిందని సంబరపడుతూ ఉంటే, ఆ చప్పట్ల చాటున రాజ్యం తన భావజాల కృషిని వీళ్లతోనే చేయించుకుంటుంది.
కాబట్టి సాహిత్య ప్రమాణాలను ఒక ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించడం ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే ఈ మొత్తాన్ని తిప్పేసి చూసినట్లవుతుంది. ప్రమాణాలను సాహిత్యంలో విమర్శకులు, సమాజంలో పాఠకులు తేల్చాలి. జ్యూరీలో ఉన్నది సాహిత్యకారులే కావచ్చు. కానీ వాళ్లకు ప్రభుత్వ ఆశయాలను దాటి పని చేయడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వరంగ సంస్థలన్నిటిలోనూ ఉండే పైరవీలకు అతీతంగా కేంద్ర సాహిత్య అకాడమీ మాత్రం ఎలా ఉంటుంది? ఒక క్రమంలో పైరవీలకు సాహిత్యేతర శక్తుల అవసరం లేకుండా సాహిత్య పైరవీదారులను అకాడమీ తన ఓన్ ప్రొడక్ట్‌గా తయారు చేసుకుంటుంది. ఏ సంస్థ అయినా రూపంలో బైటికి కనిపించే తన రూల్స్‌ను అమలు చేసే వ్యక్తులనేగాక, తన సారానికి ప్రతినిధులైన మనుషులను తయారు చేసుకోకుండా ఉనికిలో ఉండజాలదు. పైరవీ అనేదాన్ని కేవలం ఆ సంస్థ ప్రకటించుకున్న రూల్స్‌కు వ్యతిరేకంగా చూడ్డానికి లేదు. అది ఆ సంస్థ దృక్పథానికి సంబంధించింది. అలాంటి వాళ్లు లేకుండా అది పని చేయలేదు.
అకాడమీ తన భావజాల ప్రయోజనాల కోసం చాలా సహజంగా చేస్తున్న పనినే మనం పైరవీ అని నిందిస్తున్నాం. జ్యూరీ సభ్యులు పైరవీకి లొంగిపోయారని కొందరు అంటున్నారు. నిజానికి అది దాని పని తీరులో భాగం. జ్యూరీలోకి కూడా పైరవీలతో చేరే సభ్యులు ఉండవచ్చు. కాబట్టి అలాంటి వాళ్లను పక్కన పెడితే అందులో ఉండే ‘అర్హత’గల సాహిత్యకారులు తక్కెడశిల జానీ రచనలను చూపినప్పుడు నవ్వుకొని ఉండరా? కానీ అవార్డు ఇచ్చేశారు. ‘దొడ్డిదోవన అవార్డు సంపాదించుకున్న వాళ్లను కాదు, ఇచ్చిన జ్యూరీ సభ్యులను, వాళ్లను ప్రభావితం చేసిన వాళ్లను అనాల’ని చాలా మంది ఫేస్‌బుక్‌లో అభిప్రాయపడ్డారు. పైకి అట్లా అనిపిస్తుంది కాని ఇవి ప్రభుత్వ సంస్థగా అకాడమీ స్వభావాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి ప్రధానంగా అది చర్చనీయాంశం కావాలి.
అక్కడి దాకా వెళ్లి ఆలోచించకపోతే ఇప్పుడు అకాడమీని విమర్శిస్తున్న వారు రెండు రోజుల్లో దాన్ని వదిలేస్తారు. రేప్పొద్దున తాము అర్హులని అనుకొనే వారికి అవార్డు వస్తే ఆనందిస్తారు. తాము అంగీకరించే వాళ్లకు వస్తే చప్పట్లు కొడతారు. పీడిత అస్తిత్వ సమూహాలకు చెందిన వాళ్లకు అవార్డు ఇస్తే సామాజిక న్యాయం జరిగిందని తీర్మానిస్తారు. ఒకవేళ నిజంగానే పైరవీ లేకుండా అవార్డు ఇవ్వవలసిన వాళ్లకు ఇస్తే అకాడమీ సేవలను కూడా ప్రస్తుతిస్తారు. తక్కెడశిల జానీకి అవార్డు ఇచ్చి అకాడమీ పోగొట్టుకున్న తన పవిత్రతను తిరిగి నిలబెట్టుకున్నదని, అడపాదడపా ఇలాంటి పొరబాట్లు జరిగినా అవార్డు ‘విలువ’కు ఢోకా లేదని తేల్చిచెబుతారు. దీన్ని ఎలా చూడాలి?
దీనికి పూర్తి భిన్నమైన కోణంలో తెలుగు సాహిత్యానికి అద్భుతమైన ప్రతిఘటనా స్వభావం ఉంది. ధిక్కార లక్షణం కూడా ఉంది. అవార్డులకు దూరంగా ఉండటం ఫలానా రాజకీయాలున్న అసాధారణ రచయితల వైఖరి కాదని, అది రచయితలందరి మౌలిక స్వభావమనే ఆమోదం తెలుగు సాహిత్యంలోలాగా మరే భాషలోనూ పొంది ఉండదు.
ఫలానా రాజకీయాలకు, సంస్థలకు దగ్గరిగా ఉన్నందు వల్ల రావలసిన అవార్డులకు దూరమయ్యానని వగచే వాళ్లూ, అవార్డుల కోసమే దూరం పాటించేవాళ్లూ, అవార్డు తీసుకున్నా మాటలో, చేతలో ఏ తేడా లేకుండా బతికినవాళ్లూ, అవార్డు తీసుకొని కూడా అవార్డు వాపసీ ఒక ఉద్యమంలా సాగినప్పుడు ఒక విలువ కోసం తిరిగి ఇచ్చేసినవాళ్లూ, అవార్డు దోవ అవార్డుదే… మా విశ్వాసాలు మావే.. అనే సమర్థించుకొనే వాళ్లూ, రచనకు రాజ్యం ఇచ్చే ప్రతిఫలంగా యావజ్జీవ జైలు శిక్షలు` ఏండ్ల తరబడి చీకటికొట్టు జీవితాలు` దుర్భర ప్రవాసాలు` అర డజనకు పైగా యుఏపిఏ కేసుల్లో పదుల సంఖ్యలో నలిగిపోతున్న రచయితలూ, కళాకారులూ తెలుగులో ఉన్నారు. తెలుగు సమాజపు రాజకీయ, సాంస్కృతిక ప్రత్యేకతలన్నీ మన సాహిత్యరంగంలో ఉన్నాయి. అందుకే ఇది సాహిత్యమనే ద్వీపంలోని అవార్డుల మతలబు కాదు. సాహిత్యం, రచయితలు, అకాడమీ అన్నీ ఈ సమాజంలో భాగం. కాబట్టి అవార్డు ఇవ్వడానికి సాహిత్యపు అర్హతలు, అవార్డు ఎంపికకు పద్ధతులను దాటి ఈ చర్చ బైటికి రావాలి.
అవార్డు వల్ల సాహిత్యానికి గుర్తింపు వస్తుందని వాదించేవారూ ఉన్నారు. వాళ్లకు తమ సాహిత్యానికి పాఠకులను సొంతంగా తయారు చేసుకోగల శక్తి లేకపోవడం, దానికి తగిన సామాజిక, రాజకీయ జీవితం లేకపోవడం వల్లే ఈ వాదన చేస్తారు కావచ్చు. అసలు అవార్డులు, సన్మానాలు, పురస్కారాలు, పోటీల్లో విజేతలు కావడం అనే వ్యవహారంలో పాఠకుల ఊసే లేకుండా గుర్తింపు కోసం రచయితలు ఆరాటపడుతుంటారు. ప్రతి వ్యక్తికీ తనదే అయిన ప్రతిభ ఉంటుందిగాని, సాహిత్య సృజనను వ్యక్తిగత ప్రతిభ అనుకోవడంలోనే సమస్య ఉన్నది. దీని వల్ల వ్యక్తులు సమూహం నుంచి వేరైపోతారు. అలాంటి వాళ్లలో చాలా మంది కొద్దికాలానికి ఒట్టిపోతారు. అయితే వీళ్లు సాహిత్యంలో ఎలైట్‌గా మారే అవకాశం ఉంది. ఇదంతా గుర్తింపు జాబితాలో భాగమే. రచయితలకు, కళాకారులకు గుర్తింపు కావాలనే కోరిక ఉండటం సహజమే. అయితే అది ఎలాంటి గుర్తింపు, ఎవరి గుర్తింపు, దేని వల్ల వచ్చే గుర్తింపు..అనే ఎన్నో విషయాలను చర్చించగల ఓపిక ఉండాలి. వీటన్నిటికంటే ముందు ఒక రచయిత తనను తాను ఎలా గుర్తించుకుంటున్నారు? అనేది చాలా ముఖ్యం. గుర్తింపు అనేది విలువల ఆధారంగా ఉండాలి. అప్పుడు ఆ విలువలు ఏమిటి? వాటిని ఎందుకు పాటించాలి? ‘గుర్తింపు’ వల్ల వాటికి భంగం కలగకుండా ఎలా చూసుకోవాలి? అనేవి రచయితల వ్యక్తిగతస్థాయిలో తేల్చుకోవాలి.
అందుకే అవార్డు తీసుకోవడమంటే డబ్బు తీసుకోవడమే కాదు. ప్రభుత్వ గుర్తింపు పొందడమే కాదు. ప్రభుత్వం నిర్మించే భావజాలంలో భాగం కావడం అనే ఆలోచన వస్తుందా? లేదా? అనేదే ముఖ్యం. ఇట్లా కూడా చూడవచ్చుని అంటే మనస్తాపానికి గురికాకుండా ఆలోచించేందుకు సిద్ధం కాగలరా? అసలు అవార్డులను తిరస్కరించాలని ఎవరో చెప్పాల్సిన పని లేదు. దాన్ని పాటించాల్సిన పని కూడా లేదు. భావజాల సంబంధమైన ఈ విషయంలో రచయితలు తమంత తాము ఈ సమాజం నుంచి ఏం తీసుకోవాలి? ఏం వదిలేయాలి? అని నిర్ణయించుకోగలగాలి. ఇతరుల కోసం కాదు. అచ్చంగా తమ కోసమే ఏదో ఒక వైఖరి పెట్టుకోవాలి. తమకు నచ్చిన, తమకు వీలైన ప్రమాణాన్ని పాటించాలి. ఫలానా దాన్ని తీసుకోను, ఫలానా వాళ్ల పక్కన నిలబడను.. అనే పట్టింపు ఉండాలి. దానిని ఒక విలువగా అనుసరించాలి. అకాడమీ మంచి చెడ్డలను పక్కన పెట్టి రచయితలుగా ఈ వైపు నుంచి ఆలోచించలేరా? అవార్డు తీసుకోడాన్ని సమర్థించుకోడానికి ఎన్ని వాదనలు అవసరం అవుతాయో. వద్దనడానికి ఒక చిన్న విలువ సరిపోతుంది. ఇప్పుడు ఈ అభిప్రాయాలు చదివి కూడా అవార్డు ఎందుకు తీసుకోవడం తప్పేమీ కాదనే వాదన ఎన్ని రకాలుగా ముందుకు వచ్చేదీ ఊహించవచ్చు. తీసుకుందామనుకున్నాక మన గడసరితనం వల్ల సమర్థించుకోవడమేగాని వాదనలు ఎందుకు?
అసలు అవార్డుల గొడవ ఒక్కటే ఇవాళ సాహిత్యరంగంలోని సమస్య కాదు. సాహిత్యం, సాహిత్యకారుల మంచి చెడ్డలకు అవార్డులే ఏకైక ప్రమాణం కానక్కరలేదు. అది ముఖ్యమైనదే. అలాంటివే ఇంకా చాలా ఉన్నాయి. జీవితం, సమాజం, రాజ్యం అనే కొలిమిలో నిత్యం కాలుతూ ఏ రచయిత ఎట్లా రుజువు అయ్యేదీ వేరే ఎవరో చెప్పనవసరం లేదు. కాలం తనంత తనే ఆ రచయితకు గుర్తింపు గీటురాయిగా నిలిచిపోతుంది.
చివరాఖరికి అందరూ ఒక పాయింట్ దగ్గరికి వచ్చి చేరుకుంటారు. ఏ ప్రభుత్వమైనా సరే అవార్డు ఇవ్వ జూస్తే.. ‘ప్రజల సొమ్మును నీవూ, నీ ఆశ్రిత రాజకీయ నాయకులు, కార్పొరేట్లు కొల్లగొట్టింది చాలక అవార్డులనీ, పురస్కారాలనీ మాకూ ఇవ్వాలనుకుంటున్నావా? మా సాహిత్యానికి గుర్తింపు ఇవ్వడానికి నీవెవరు?’ అనే ప్రశ్న రచయితలు వేయగలరా? బహుశా అవార్డుల వ్యవహారం అంతిమంగా తేలేది ఇక్కడే కావచ్చు. అంత దూరం వెళ్లదల్చుకోకపోతే ఈ సంవత్సరానికి కేంద్ర సాహిత్య యువ అవార్డు సంపాదించుకున్న తక్కెడశిల జానీని, ఆయనకు అవార్డు ఇచ్చిన జ్యూరీ సభ్యులను క్షమించి వదిలేయడమే మంచిది.
విశ్వంభర నుండి వివేచని దాకా
Politics play big rule in all kinds of awards —this is not new one—dig history –