(ఒక మీనూ, ఒక మానో, ఒక పుష్ప, ఒక సుజాత)

మీనూ,

నీవు ఒక పాపకు తల్లివి. ఒక ఇల్లాలివి. నేనూ ఒక తల్లిగా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. బిడ్డను కోల్పోయిన తల్లి వేదన ఎలా ఉంటుందో స్త్రీగా, తల్లిగా నాకు చెప్పాల్సిన పని లేదనే నమ్మకంతో రాస్తున్నాను.

ఇప్పుడు నేను జీవితంలో ఇంకెన్నడూ చూడలేని నా కూతురు యోగితా జ్ఞాపకాలను మోస్తూనే నీతో మాట్లాడుతున్నా. బిడ్డను కోల్పోయిన కన్నీటి తడి ఇంకా ఆరక ముందే, పొంగి వచ్చే దుఃఖాన్ని అది మిపట్టుకుంటూ ఇలా రాస్తున్నాను.

నీ భర్త కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హస్ గెరిల్లాల అదుపులో ఉన్నపుడు ఆ మూడు రోజులూ నీ వేదన ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. మా ఆదివాసులు వందల వేల మంది అరెస్టయితే ఏమైపోయారో, ఎక్కడికీ తీసికెళ్లారో కూడా మాకు తెలియదు. వారాలు, నెలలపాటు సమాచారమే ఉండదు. ఏండ్ల తరబడి జైళ్లలో ఉంటే మా కోసం పని చేసే లాయర్లన్నా అప్పట్లో ఉండేవారు. ఇప్పుడు అలాంటి వాళ్లను కూడా మీ సర్కార్ బందీలను చేసి జైళ్లలో పెట్టింది. కానీ ఏ హెబియస్ కార్పస్ అవసరం లేకుండానే, నీ భర్త మన్హస్ యోగక్షేమాలు నీకు వెంట వెంట గెరిల్లాలు తెలుపుతూ వచ్చారు. సామాజిక మధ్యమాల పుణ్యమా అంటూ ఏ దాపరికం లేకుండా ఆ వార్త నీ వరకు ఆ ఉత్కంఠ భరితమైన క్షణాలలో నీకు చేరి నిన్ను ఓదార్చి ఉండాలి.

అప్పుడు ఆయన మావోయిస్టు గెరిల్లాల చేతులలో ఓ యుద్ధబందీ. ఆయన పీ.ఎల్.జీ.ఏ. గెరిల్లాల కస్టడీలో, జనతన సర్కార్ అధీనంలో ఉన్నాడు. బీజాపుర్ జిల్లా జీరగూడ వద్ద 2021 ఎప్రిల్ 3నాడు జరిగిన గెరిల్లాల భారీ ప్రతి దాడిలో ఆయనను ప్రజా మిలీషియా కార్యకర్తలు అరెస్టు చేసి జనతన సర్కార్కు అప్పగించారు. ప్రతిక్షణం ట్రిగ్గర్పై వేలుతో ఉన్న ఫలితంగానే ఆయన్ని తమ కస్టడీలోకి తీసుకోవడం ప్రజా మిలీషియాకు ప్రాణాలతో చెలగాటంగానే ఉండింది. ప్రజల సహకారం లేకుంటే ఆయన సజీవంగా బందీ అయ్యేవాడా! చెప్పలేను.

ఆ తర్వాత ఆయన సురక్షితంగా నీ దగ్గరికి చేరుకున్నాడు. భార్యగా, తల్లిగా నీవు సంతోషించి ఉ౦టావు. ప్రపంచ తల్లుల దినం సందర్భంగా శ్రీమతి మీనూ మన్హస్.. నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను.

అ భీకర సంగ్రామం ఎలా జరిగిందో నీవు వినే ఉంటారు. “యుద్ధంలో జయమే కలుగుతుందనీ గర్వపడకూడదు. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ యుద్ధం చేయాలి” అనే నీతి రామాయణ కాలం నుండి నడుస్తోంది. కానీ రెండు వేల మంది సాయుధ బలగాలు తమ అధికారులు పంపడంతో అడవులను జల్లెడ పట్టి చివరకు దెబ్బతిని ‘ఉల్టా ఫసాయా” అనుకుంటూ కాలికి బుద్ధి చెప్పారు. జీరగూడ యుద్ధ చర్యలో ఒక మహిళ సహ నలుగురు గెరిల్లాలు అసువులు బాసారు. ఈ వార్త గెరిల్లాల చెర నుండి మన్హస్ విడుదల వరకు సామాజిక మాధ్యమాలలో సైతం సర్వత్రా పెద్ద సంచలనం సృష్టించింది.

‘ముఝే జల్టీ ఛోడ్ దో, ఘర్ వాలే పరేషాన్ హై ‘ (నన్ను త్వరగా వదలండి, మా ఇంటి వాళ్లు చాలా అందోళన పడుతున్నారు”) అంటూ నీ భర్త రాకేశ్వర్ మన్హస్ పదే పదే గెరిల్లాలను కోరాడు. ఆయనకు జమ్మూలోని మీ కుటుంబం గురించే చింత. గెరిల్లాల నుండి విడుదలయ్యాక ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అనేది కునుకు పట్టని ప్రశ్న ఆయనను వేధిస్తూ ఉండొచ్చు. కమాండో శిక్షణ ఫలితంగా అబ్బిన ప్రాణ భయంతో అయన మొదటి రోజు గెరిల్లాలను నమ్మ లేదు. దానితో బందీగా మారాక దాదాపు ఒక రోజున్నర వరకు ఆయన వాళ్లు ఇచ్చిన మంచి నీళ్లు సైతం ముట్టలేదు. గెరిల్లా కమాండర్లు ఆయనకు తమ విప్లవ లక్ష్యాలు, ఉద్దేశ్యాలు చాలా ఓపికగానే వివరిస్తున్నారు.

యుద్ధ ఖైదీలతో మర్యాదగా వ్యవహరించడం విప్లవ నియమం. అందులో మర్యాదే ఉండదు. మానవీయంగా ఉంటుంది. బందీ అయినంత మాత్రాన మనిషి కాకుండాపోడు. అది మా విప్లవ నియమం. దాన్ని గెరిల్లాలు అక్షరాల పాటిస్తూ మన్హస్ తో మసులుకున్నారు. అప్పటి దాకా ఆయనకు గెరిల్లాల గురించి ఏ అభిప్రాయాలు ఉండేవో మాకు తెలియదు. కానీ రెండో రోజుకే మన్హస్ కు విప్లవ శిబిరం వాతావరణం బోధపడింది. గెరిల్లాల మంచితనం అర్దమైంది. తనను వదలిపెడుతారన్న నమ్మకం కుదిరింది. వాళ్ల సంబంధాల్లో భాగమయ్యాడు. క్షుద్చాధ తీర్చుకోసాగాడు. ఆయనకు మొదట మీ ఇల్లు, నీవు, పిల్లలు, కుటుంబం, ఉద్యోగం గురించే తప్ప గెరిల్లాలు చెప్తుంది పట్టలేదు. అది వాళ్ల గొడవగానే అనిపించేది. కానీ మధ్యవర్తులను ప్రభుత్వం పంపిస్తే విడుదల చేస్తామని గెరిల్లాలు చెప్పి పంపాలనీ తెలిపినపుడు మాత్రం ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. మీడియా వారితో మాట్లాడాలన్నప్పుడు మాత్రం ఆయన ఎందుకో చాలా జడుసుకున్నాడు. ఇరవై గ్రామాల నుండి చేరిన వేలాది ప్రజల సమక్షంలో నిలబడి ఆయన వారినుద్దేశించి మాట్లాడాడు. అంత మంది ప్రజలతో మాట్లాడటం బహుశా ఆయన జీవితంలో ఒక అవిస్మరణీయ ఘట్టంగా మిగిలిపోతుంది. ఆ సందర్భంగా ఆయన తాను ఈ ఉద్యోగం నుంచి తొలగుతానని ప్రజలకు హామీ ఇచ్చాడు. అయినా కొంతమంది ప్రజలు అయన్ని వదలాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కానీ ఎక్కువ మంది మాత్రం క్షమించి వదలాలన్నారు. జనతన సర్కార్ కోర్టు మానవీయ, న్యాయ ప్రమాణాలతో పని చేస్తుంది. యుద్ధ ఖైదీ విషయంలో ఆ కోర్టుకు కచ్చితమైన రాజకీయ వైఖరి కూడా ఉంది. ప్రభుత్వ మధ్యవర్తులు పద్మశ్రీ ధర్మపాల్ సైనీ, తెల్లం బొరయ్య గార్లకు ప్రజాకోర్టు ఆయన్ని అప్పగించింది. ఆయన ఆ ప్రజా కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడా! లేదా! చూడాల్సిందే.

“ఉన్కో జల్టీ ఛుడ్వావో, పైలట్ అభినందన్ జైసా జల్టీ ఛుడ్వావో మోదీ జీ” మన్హస్ మల్లియ మీనూ ఆ రోజుల్లో నీ హృదయ విదారకమైన రోదనలు మీడియా రోజూ వినిపించేది. మూడు రోజులే కదా. అయినా నీవు ఆయన సహచరివి. నీ పిల్లలకు తల్లివి. కానీ ఏండ్ల తరబడి ఆదివాసులు ఏ నేరం చేయకుండానే దుర్మార్గమైన జైలు జీవితం గడుపుతున్నారు. వారు ఇక విడుదల అవుతారో లేదో తెలియదు. వాళ్ల తల్లుల వైపు నుంచి, భార్యా పిల్లల వైపు నుంచి ఆలోచించు. సోదరీ, వాళ్ల కన్నీటికి కరిగేవారెవరు? చివరికి నీ కన్నీటిని కూడా హిందూ హృదయ సామ్రాట్ మాత్రం గమనించి ఉండడు. ప్రజలలో గెరిల్లాలను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యం. వారి ‘పాషణ” హృదయాన్ని తెరకెక్కించడమే సంచలనాత్మక వార్తలంటూ సొమ్ము చేసుకునే మీడియాకు కావాల్సింది.  నీకు మోదీ కౌటిల్యం తెలియదని నీ ఆవేదనే తెలుపుతోంది.

2001 అక్టోబర్ 7 నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోదీ గత 20 సంవత్సరాలలో ప్రతి తడవ ఎన్నికలలో ముందరి కన్నా అధికంగా అబద్దాలు, దౌర్జన్యాలు, దుర్మార్గం, ఉన్మాదం, అక్రమాలు, అవినీతి, హత్యలు, అత్యాచారాలకు పాల్పడడంలో అందెవేసిన చేయి కావడంతోనే ఆ ‘హిందూ హృదయ సామ్రాట్ అధికారాన్ని కైవసం చేసుకోగలిగిందని, రాష్ట్రం నుండి కేంద్రానికి ఎగబాకాడనీ నీకు చెప్పే సందర్భం కాదిది. దేశ ప్రధాని పదవీ కోసం పుల్వామా దాడి ఎంత నాటకీయంగా జరిగిందో, అంతకన్నా నాటకీయంగా అభినందన్ అరెస్ట్రూ, విడుదల జరిగిపోయాయో తెలువనంత కాలం మోదీ చాణక్యనీతి వర్ధిల్లుతూనే ఉంది. నీవో విషయం గమనించే ఉంటావు. నీ భర్త విడుదలకు ఎవరి విజ్ఞాపలు వెలువడకముందే గెరిల్లాలు ఆయన్ని సురక్షితంగా వదిలేస్తామని ప్రకటించేశారు. ఇది విప్లవ నీతి. విష్లవంలోని మానవీయ విలువ.

ప్రజా కోర్టులో నీ భర్త మీద మీ చట్టాల ప్రకారం సీఆర్పీసీ 307 సహ అనేక ఆరోపణలు వచ్చాయి. కోరోనా వాహకులుగా అడవులలో, అదివాసీ గూడాలలో గస్తీ చేయడం జనతన సర్కార్ నియమాల ప్రకారం పోలీసుల చేసిన అతి పెద్ద నేరం. అయినప్పటికీ, యుద్ధ బందీ కావడంతో నీ భర్తను విచారించి వదిలారు.

కానీ, సోదరీ, జీరగూడ రణభూమి (కిల్లింగ్ జోన్)లో మృత జవాన్ల శవాలు మాత్రం అక్కడే అత్యంతదైన్యంగా రోజంతా పడున్నాయి. ఏ దిక్కులేని స్థితిలో వాటిని ఊర పందులూ, కుక్కలూ పీక్కు తిన్నాయి. ఆ శవాలకు అ గతి పట్టడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష వైఖరి తప్ప మరేం కాదు. దాదాపు 24 గంటలకు పైగా వాటిని ఏ ప్రభుత్వమూ, పోలీసు ఉన్నతాధికారీ పట్టించుకోలేదు. మానవత్వంతో స్థానిక మూలవాసీ ప్రజల మనసులు తన్లాడినా వాటి చెంతకు చేరడానికి వారు సాహసించలేదు. ఆ పనే చేస్తే అ తెల్లారి వారికి మీ ప్రభుత్వం నుంచి ఎదురయ్యే సవాలక్ష సవాళ్లకు జవాబులు తెలియవని ఆ ఆదివాసీ జనాలు వాటి కాపలాకు సిద్ధ పడలేదు. గెరిల్లాలు అ శవాలకు కాపు కాయడం అంటే వారు మరో దాడికి సిద్ధమవడమే. ఆ రిస్క్ ఆ టైంలో తీసుకోవడం వారికి భావ్యం కాదు. అలాంటి దుస్థితిలో వృత్తిధర్మాన్ని పాటించని, సంవేదనారహిత పాత్రికేయ ప్రబుద్ధులు కొందరు దొరికిందే అదనుగా శవాలతో గెరిల్లాల దాష్టీకం అంటూ “న్యూసెన్సేషనల్ నాన్సెన్స్ వార్తలతో రంగంలోకి దిగారు. నిజానికి వారికి గెరిల్లాల విలువలు, సంస్కృతి తెలియవు. తెలిసినా వారికి అవి జీర్ణం కావు. మా రావణ రాజును సంహరించిన మీ రాముడు ఆయనకు పరలోక హితం కోసం సంస్కరణల్ని చేయిస్తూ “ప్రాణాలున్నంత వరకే శతృత్వాలు, కానీ ప్రాణాలు పోయిం తరువాత కూదా ద్వేషాలెందుకు? అని చెప్పిన హితవు పోలీసు అధికారులు తెలుసుకుంటే మంచిదే.

మీనూ, ఈపాటికి నీవు నీ ప్రియ సహచరుడి ద్వారా ప్రజల పట్ల మా గెరిల్లాల వైఖరి, వ్యవహారం ఆయనకు అర్థమైన మేరకు తెలుసుకొని ఉంటావు. పార్థివ శరీరాలతో ఎవరికీ వైరం ఉ౦దడకూడదనే ఇంగిత జ్ఞానం, యుద్ధనీతి కడు హీన సంస్కృతికి అలవాటు పడుతున్న ఖాకీలకు తెలియదు. ఆ విషయం గెరిల్లాలకే చాలా బాగా తెలుసునని నీ కోబ్రా కమాండో భర్త నీకు చెప్పే ఉంటాడు. మీ రాకేశ్వర్ స్వభావం నాకు తెలియదు కానీ, మీ హైందవం స్త్రీలను చంచల స్వభావులు, క్రూరులు, ఆలోచన లేని పనులు చేస్తారు అంటూ నిత్యం నిందిస్తునే ఉంటుంది. మా అదివాసీ మహిళలు అ హీన దశకు చేరుకోలేదు. మాకు కొంత స్వేచ్చ, స్వతంత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. కశ్మీరీలు మహిళల గురించి కూడ కొంత ప్రజాస్వామికంగా ఆలోచిస్తారని ఎక్కడో చదివాను. కాబట్టి నువు మరోసారి గట్టిగా రాకేశ్వర్ కు ఆ కమాండో ఉద్యోగం వదులుకొమ్మని చెప్పు. ప్రజా కోర్టులో మా ప్రజలు కోరింది కూడ అదే! అలాగే, నువ్వు వీలైనమేరకు మృత జవాన్ల భార్యలకు, పిల్లలకు రణభూమిలో జరిగిన వాస్తవాలను తెలియజేస్తావు కదూ!

మీనూ,

ఈ సంవత్సరం మే నెల రెండో ఆదివారం అమ్మలదినం రోజు నీతో నీ పాప, రాకేశ్వర్ తో ఆయన తల్లీ అవధులు ఎరుగని సంతోషంతో ఉంటారు. రాకేశ్వర్ విడుదల తరువాత మీరు మా పీ.ఎల్.జీ.ఏ. గెరిల్లాలకు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు ధన్యవాదాలు. మీనూ, ఇక్కడే నీకు ఒక విషయం చెప్పనా! దండకారణ్యానికీ, కశ్మీరానికి మధ్య ఉన్న ప్రజా పోరాట అనుబంధం రాకేశ్వర్ సింగ్ విడుదల విషయంలో ఒక బోనస్ పాయింట్లా పని చేసింది. కశ్మీరీ జాతి ప్రజలకు రాకేశ్వర్సింగ్ విడుదల ఒక విప్లవ సందేశాన్ని అందిస్తోందనే భావన కూడ కొంత పని చేసింది.

ఈ సందర్భంగా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదల్చుకున్నాను. ఈ లేఖ ఇలా రాయడానికి అది కూడా ఒక కారణం. నీకు మానో, పుష్పలను పరిచయం చేస్తాను. నీ భర్త గెరిల్లాల యుద్ధ బందీ కావడానికి వారం రోజులకు ముందు మా అదివాసీ తల్లులు ఐదుగురు గర్భశోకానికి గురైనారు. ఒకరిద్దరు పిల్లలు అమ్మ లేని వారయ్యారు. గర్భశోకానికి గురైన వారిలో మా మానో దీదీ ఒకరు. వారిది హిచ్చామీ గోత్రం. అవిడకు తొమ్మిది మంది పిల్లలు. వారిది పేద కుటుంబం. కానీ విప్లవోద్యమ ఫలితంగా ఇక్కడి వేలాది ఆదివాసీ కుటుంబాలకు సాగు భూములు లభ్యమైనట్టే మానో దీదీ వాళ్లకూ దొరికాయి. ఆమె సంతానంలో రెండవవాడు మా పార్టీ నాయకుడు రుషి. ఆయన కష్టజీవి. ప్రాథమిక చదువు వదిలి పేద కుటుంబ పోషణలో అమ్మా నాన్నలతో భాగమయ్యాడు. వాళ్ల ఊళ్లో జనతన సర్కార్ అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేసింది. సాగు భూములకు నీటి వసతి కల్పించడంతో మంచి పంటలు పండేవి. అనేక పేద కుటుంబాలు తమ కష్టంతో మధ్యతరగతికి ఎదిగినట్టు మానో దీదీ కుటుంబం ఆ స్థాయికి చేరింది. అ క్రమంలో రుషి విప్లవోద్యమంలో భాగమయ్యాడు.

గడ్చిరోలీ విప్లవోద్యమంలో భాగమైన రుషి భాస్కర్ గా, పవన్ గా ప్రజలకు సుపరిచయం. ఆయన జిల్లాలో పనిచేయని ప్రాంతం లేదు. ఆయనకు సెక్యూరిటీ గార్డుగా నా కూతురు అస్మిత ఉండె. నా కూతురు 12 వరకు చదువుకుంది. ఆయన మా అస్మితను ప్రాణంలా చూసుకునేవాడు. మా ఆదివాసీ పేద పిల్లలలో ఆడపిల్లలు 12 వరకు చదువుకోవడం సాధారణ విషయం ఏమీ కాదు. అ తరువాత నా కూతురు చదువు మానేసి నా బాటలో విప్లవమార్గం పట్టింది. నాకు ముగ్గురు మగ పిల్లలూ ఉన్నారు. గడ్చిరోలీ సీ-60 కమాండోలు మార్చ్ 29నాడు కోబ్రామెండ అడవిలో జరిపిన దాడిలో మా మానో దీదీ, నేనూ మా బిడ్డలను కోల్పోయాం. మాకు దూరమైన మా బిడ్డలను తలచుకొని ఈ సారి తల్లుల దినం నాడు విలపించడం మా వంతు అవుతోంది. తల్లుల దినాన్ని బిడ్డలు గొప్పగా జరుపుతారట కదా. కానీ ఈ తల్లుల దినం నాటికి నేనూ, మా మనో దీదీ బిడ్డలను కోల్పోయిన దు:ఖంతో నిలబడ్డాం. మేమూ నీలాంటి తల్లులమే. కళ్ల ఎదుట పిల్లలను కోల్పోవడం కంటే తల్లులకు శోకం ఏముంటుంది చెప్పు? గత కొన్ని సంవత్సరాలుగా యేటా ఏదో ఊరిలో, ఏదో ఇంట్లో తల్లుల దినం నాడు తల్లులు గర్భశోకంతో గడపక తప్పడం లేదు. ఇది గత 20 ఏండ్లుగా యేటేటా పెరుగుతోంది.

నా పాపకు నేను యోగితా అనే పేరు పెట్టుకున్నాను. ఆమె ఆ పేరును సార్ధకం చేసింది. అమె ప్రజల కోసం తన ప్రాణాలను ధారపోసి అమర వీరాంగణయింది. ఇంతకూ నేను నా ఇళ్లు, పిల్లల్ని వదిలి ఎందుకు సాయుధమయ్యానో నీకు చెప్పలేదు కదూ!

మొన్న నీ భర్త విడుదల కోసం నీవు విజ్ఞప్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం 2018లో ప్రకటించిన 35 ‘ఆకాంక్ష’ జిల్లాల్లో మా గడ్చిరోలీ ఒకటి. 20 సంవత్సరాల క్రితం నాటికే నాకు యోగితా సహ నలుగురు పిల్లలు. అడవులలో ఆదివాసులు పడే కష్టాలు, హింస నీకు అంతగా తెలువకపోవచ్చు! కానీ, ఇపుడు మీ కశ్మీర్లో కూడా మోదీ పుణ్యమా అంటూ ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడి ఆదివాసీలకు ఎదురవుతున్న అటవీశాఖ దౌర్జన్యాలు వార్తలలో నీవూ గమనించాలి. దేశంలోని అడవులలో నివసించే ఆదివాసీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ, అభివృద్ధి పేరుతో వనరులను కాజేయడమే ప్రభుత్వాల లక్ష్యం. ఇప్పటికే వారి విధానాలకు దేశంలోని కోట్లాది ఆదివాసులు విస్థాపితులయ్యారు. మీ వాల్మీకి రామాయణ కాలం నుండి మావి విస్థాపిత జీవితాలే! అ కవి మహానుభావుడే 14 వేల మంది మా మూలవాసులను మీ మర్యాద పురోషోత్తముడు సంహరించాడని రాశాడు. మా నగరాలను శుక్రుడనే మీ రుష్యపుంగవుడెవరో శపించిన ఫలితంగా దండకుడి రాజ్యం అడవిగా మారిందని చెప్పాడు. అనాదిగా మా బతుకులపై బ్రాహ్మణం, అ తరువాత దానితో జతకలిసిన సామ్రాజ్యవాదం దాడులు చేస్తూనే వచ్చాయి.

విప్లవోద్యమ అండ మాకు లేకుంటే మేమూ, మా జీవితాలు ఈపాటికి తెల్లారిపోయేవి. అలా కాకూడదనీ నా భర్త మా కుటుంబాన్ని నాకు వదలి పాతికేళ్ల క్రితమే విప్లవోద్యమంలో చేరాడు. నేను ఇంటి వద్ద వ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ, కూలీ నాలీ చేసి ఆయన లేని లోటు తీర్చుకుంటూ కుటుంబాన్ని పోషించేదాన్ని. కానీ, పోలీసులు ఆయనను లొంగదీసుకోవడానికి నన్ను అనేక విధాలుగా వేధించారు. కుటుంబ హింస, తెగ హింస నాకు పెద్దగా ఎదురుకాలేదు. కానీ రాజ్యహింస మాత్రం నన్ను వెంటాడింది. పోలీసులు మా వాళ్ల ఇళ్లు కూల్చారు. ఇంట్లోని దినుసులు పాడు చేశారు. తుదకు పొట్ట గడువని స్థితిలో, రక్షణ, భద్రతా కరువైన దుస్థితిలో నా నలుగురు పిల్లలలో యోగితాను మా అన్నయ్య చేరదీసి తమ ఊళ్లో చదివించాడు. మా వాళ్లు నన్నూ నా సహచరుడితో కలసి విప్లవోద్యమంలో జీవించడమే నాకు అన్ని విధాలా భద్రతా, రక్షణా అన్నారు. అదే నాకూ నచ్చింది. నేనలా విప్లవ బాట పట్టాను. ‘పసివిడ్డలను, స్త్రీలను, వృద్ధులను హింసించకూడదు” అంటూ మీ ధర్మ శాస్త్రాలు ప్రబోధించే యుద్ధనీతిని రాముడి నుండి నేటి ‘శియారాం’ అనుచరుల వరకూ ఎక్కడా మీ పాలకులు పాటించలేదు.

నాకు ఇంటి వద్ద అక్షర జ్ఞానమే లేదు. కానీ, ఉద్యమంలో అ,ఆ లు దిద్దుకున్న నేను గత పదేళ్లుగా జనతన సర్కార్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయినిగా పని చేస్తున్నాను. యాభై మంది అదివాసీ పిల్లలు ఉంటారు. వారికి నేను ఒక తల్లిని, ఒక సంరక్షకురాలిని, ఒక ఉపాధ్యాయినిని. మా పాఠశాలను కూడ పోలీసులు కాల్చారు. కూల్చారు. సక్రమంగా పిల్లల చదువు సాగనివ్వడం లేదు. అయినప్పటికీ ఆ పిల్లల భవిష్యత్తును విప్లవ మార్గంలో తీర్చిదిద్దటానికి నేను శాయశక్తులా పని చేస్తున్నాను.

మా జంట ప్రభావం మా పిల్లలలో ముఖ్యంగా నా కూతురుపై బలంగా ఉంది. అదీ ఆడపిల్లే కావడం అందుకు ఒక కారణమై ఉంటుందేమో! నా బాటలో నా కూతురు నడవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కానీ, నా కన్న కూతురు నా కళ్ల ముందే మా అదివాసీ ప్రజల కోసం, వారి అస్మిత కోసం తాను అస్మితగా నిలిచి పోరాడి అమరమైంది. తను అలా అయిపోవడం నాకు తీరని వ్యథే. అది ఎన్నటికీ భర్తీ కాలేదు. కానీ దాని అసంపూర్ణ ఆశయాలను నేను ముందుకు తీసుకువెళ్లాలి. అది మరణించి, నేను జీవించి ఉన్నందుకు తల్లిగా కూడా నేను ఈ పని చేయాలి. నాకు ఇపుడు అస్మిత కన్నా చిన్నారులు 50 మంది పిల్లలున్నారు. వారంతా నాకు యోగితా లాంటి వాళ్లే. వాళ్లకు నేనొక అమ్మను. వాళ్లలో కొందరు నన్ను అలాగే సంబోధిస్తారు. ఇక వారిలోనే నేను నా యోగితాను నిత్యం చూసుకుంటాను.

ఇక్కడ నేను నా కూతురుతో పాటు అ బ్యాటిల్లో ప్రాణాలర్పించిన కామ్రేడ్ అమర్ గురించి తప్పక చెప్పాలి. ఆయన అద్భుతమైన గెరిల్లా. నలువైపులా చుట్టుముట్టిన శతృవును గండి కొట్టుకొని పోవాలని పవన్ ఆదేశించి అమర్ ను బ్రేకింగ్ టీం సభ్యుడ్ని చేశాడు. ఆ యుద్ధంలో అమర్ వీరమరణం పొందాడు. అమర్ కు అమ్మా నాన్న లేరు. వాళ్ల నాన్నను బస్తర్లో 2005-09 మధ్య శ్వేత భీభత్సం సృష్టించిన ఫాసిస్టు సల్వాజుడుం గూండాలు హత్య చేశారు. ఉద్యమ అవసరాల రీత్యా గడ్చిరోలీ వెళ్లి ఆ మట్టికే అంకితమయ్యాడు. కానీ ఆయన శవం…..! సుక్కా బీజాపుర్, దంతెవాడ తదితర జిల్లాలకు చెందిన వారు గడ్చిరోలీలో అమరులవుతున్నప్పుడు వారి పార్ధివ శరీరాలను పోలీసులే పూడ్చిపెడుతున్నారు. దీనిని వారి చట్టం కూడ అమోదించదు.

అన్ని విధాలా తమకు సేవలందించే పోలీసుల శవాలనే బాధ్యత రహితంగా వదిలేస్తున్న అధికారులు మా పిల్లల శవాలకు ఏపాటి సంస్కారంతో అంత్య సంస్కారం చేస్తారో ఆలోచించు. ఇది తలచుకుంటేనే ఒక తల్లిగా నా మనసు తట్టుకోలేకపోతోంది. మా పీఎల్జీఏ మాత్రం అత్యంత బాధ్యతగా ప్రతి అమరుడి జ్ఞాపకాలను (బట్టలు, ఫోటోలు మొదలైనవి) మా సంప్రదాయం ప్రకారం వారి కుటుంబాలకు అందచేస్తోంది. వారి స్వస్థలంలో జనతన సర్కార్లు, ప్రజలు విప్లవ సంప్రదాయాలతో మా అదివాసీ సంప్రదాయాలనూ కాదనకుండా వీరులకు అంత్య సంస్కారాలు జరుపుకోవడం ఒక వివ్లవ పరిపాటిగా మారింది.

మీనూ,

చివరగా చెప్పేదేమంటే, మా పోరాటం మానవాళి విముక్తి కోసం సాగుతోంది. మా విప్లవ ఆశయం ఉన్నతమైంది. న్యాయమైన మా పోరాటాన్ని పాలకులు సహించడం లేదు. అందుకే నీ భర్త లాంటి వాళ్లతో కోబ్రా విషనాగులను తయారు చేస్తున్నారు. ఒక చోట హాక్స్, మరో చోట స్కార్పియాన్, ఇంకోచోట గ్రేహౌండ్స్, ఒకచోట జాగ్వార్ ఇలా ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతో ప్రజల మీదికి తమ బలగాలను క్రూర జంతువులలాగా తయారు చేసి వదలుతున్నారు. జీతం రాళ్ల కోసం ఖాకీలు మాత్రం దోపిడీదారుల రక్షణ కోసం, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. అపార ప్రాకృతిక వనరులకు నిలయమైన మా దండకారణ్యానికి, జార్ఖండ్ అడవులకు వారి హుకుంపైనే చేరారు. పోలీసులకు అసలు వాస్తవాలు తెలియవు. మా జీవితాలూ, అచార వ్యవహారాలు, భాష సంస్కృతి, కట్టుబాట్లు అంతకన్నా తెలియవు. వారికి వారి అధికారులు తలకెక్కించే తప్పుడు దేశభక్తి, ప్రజా సేవే అర్థమైంది. ఈ దేశ పాలకులు తమ చేతిలోని మీడియా కూడా వాళ్లను రెచ్చకొడుతోంది. ఆ పని వారు ఎంత బలంగా చేస్తున్నారో మీ రాకేశ్వర్ మావారి అధీనంలో ఉన్నపుడే అర్ధమైంది. అందుకే నేను ఇంత వివరమైన లేఖ నీకు రాస్తున్నాను. మేం ఉగ్రవాదులం కాము. హంతకులం అంతకన్నా కాము. దోపిడీ మేమెరుగం. దౌర్జన్యం అనే పదం మా పదకోశంలోనే లేదు. మేం ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తాం. అదీ ప్రజల ప్రజాస్వామ్యాన్నే సుమా! పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉత్త మోసం.

ఈ సంవత్సర తల్లుల దినం నాడు నేను ఈ విషయాలను నీతో పంచుకొని ఖాకీలుగా యూనిఫాంలు ధరించి పేదలపై విరుచుకుపడుతున్న పోలీసులకు వాస్తవాలను చెప్పి వారిని ప్రజలలో భాగంగా నిలపాలనుకున్నాను. అందుకే, నా మనసులోని మాటలు ఇలా నీతో పంచుకుంటున్నాను. మీనూ! మీ ఆయనకు మా వాళ్లు ఈ విషయాలన్నీ చెప్పి ఉంటారు. నువూ ఆలోచించు. సరేనా!

కోబ్రామెండ దాడిలో నేను నా కూతురును కోల్పోతే, నా విప్లవ సోదరీ సుజాత ఆత్రం ప్రాణత్యాగం చేయడంతో తన కొడుక్కి తల్లి లేకుండా పోయింది. అమె కొడుకును పోలీసులు చేరదీసి తమ పక్షం మార్చుకోవడానికి వాడిని ఒక లంపెన్గా, క్రిమినల్గా తయారుచేస్తున్నారు. ఆమె భర్త ఒక విప్లవకారుడు. ఆమె కూడ నాలాగే తన ప్రియ సహచరుడితో కలిసి విప్లవోద్యమంలో భాగమైంది. వారిది ఇంటి వద్ద పెద్దలు చేసిన పెళ్లే. అమె భర్త గత ఏడేళ్లుగా చంద్రపుర్ జైళ్లో ఉన్నాడు. ఆయనకు ప్రజా వ్యతిరేక న్యాయస్థానంలో శిక్ష పడింది. సుజాత మరణవార్త ఆయన్ని ఎంతగా కలిచివేస్తుందో రాకేశ్వర్ కోసం ఎంతగానో ఆరాటపడిన నీకు నేను విడిగా చెప్పాలా!

అయితే ఇక్కడ నేను ఒక చేదు నిజం చెప్పాలి. రాకేశ్వర్ లేకుంటే మీ పరిస్థితి దయనీయం. అక్కడ మహిళల్లో చాలా మంది భర్త సంపాదన పైనే ఆధారపడి ఉంటారు. కానీ, మాలో ఏ ఒక్క మహిళా పురుషుడిపై అధారపడి జీవించడం లేదు. విప్లవ రాజకీయాలతో ప్రజల మధ్య ప్రజల కోసం ప్రజలతోనే మేం ఉన్నాం. ఉంటాం. మేం స్వతంత్ర జీవులం. స్వేచ్చగా బతుకుతున్నాం. ఇంకా మా దండకారణ్య అడవుల నుంచి మీ వరకు చేరని అనేక పాత్రలు ఉన్నాయి. అనేక వెతలున్నాయి. మూలవాసీ ప్రజలపై ఇక్కడ జరుగుతున్న ఘోరాలన్నీ మీ రాకేశ్వర్ కు తెలుసు. ఎందుకంటే ఆయన వాటిలో నిన్నటి వరకూ ఏదో రూపంలో భాగమే అయ్యాడు కదా! కానీ, మా వెతలు, మా కథలు, మా జీవిత సత్యాలు సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవడం లేదు. ఒకవేళ రాసినా ఈ మధ్య చాలా పాపులర్ పదంగా ఉనికిలోకి వచ్చిన గోదీ మీడియా అవాకులు, చవాకులతో వక్రీకరించే రాస్తోంది. వారికి సంచలన వార్తలు కావాలి. ప్రజల పక్షాన నిలిచే ఒక ప్రత్యామ్నాయ మీడియా ముందుకు వచ్చిననాడు మా యోగితా సహ అలాంటి అనేక మంది మా బిడ్డలు ధృవతారలనే సంగతి మీకూ తెలుస్తుందనే విశ్వాసంతో ఉన్నాను. అపుడే వాస్తవాలు ప్రపంచమంతా వినిపిస్తాయి, దర్శనమిస్తాయి. అ రోజు ఎంతో దూరం లేదు. దిల్లీ రైతులు తమ కోసం తమ “ట్రాలీ టైమ్స్’ను ప్రారంభించడం అభినందనీయం.

మీనూ నేను ఇక ఉంటా! ఈ ఆదివాసీ అమ్మ అవేదన గుర్తుపెట్టుకో, నీ వంటి తల్లులు ఇక్కడ ఎంత హింసలో, దుఃఖంలో ఉన్నారో మర్చిపోకు. ప్రభుత్వాల వల్ల మాకీ కన్నీరు తప్పడం లేదు. దోపిడీ ప్రభుత్వాల తరపున ఖాకీ యూనిఫాంలు ధరించవద్దని జీరగూడ మృత పోలీసుల కుటుంబాలు ప్రచారం చేయాలి. అర్ధసైనిక బలగాలలో అత్మహత్యలు కూడ పెరుగుతున్నాయి. జీరం ఘటన జరిగి వారమైనా గడువకముందే కాంకేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్ లక్నో వాసీ ప్రదీప్ శుక్లా అత్మహత్య చేసుకున్నాడు. భారత సైనికులలోనూ ఈ ధోరణి పట్ల అందోళనగానే ఉంది. తల్లులుగా మనం వీటినీ నివారించాలంటే మన పిల్లలకు సైనిక దుస్తులు ఎక్కించవద్దు.

మాతృదిన వందనాలతో,

ఒక తల్లి, (అస్మిత తల్లి)

పుష్ప పద్దా, (ఉపాధ్యాయిని)

డీకే. జనతన సర్కార్ పాఠశాల

(దండకారణ్య గెరిల్లాల అదుపులో నుండి కోబ్రా కమాండో  రాకేశ్వర్ సింగ్ మన్హస్ విడుదలై మాతృదినం నాటికి సరిగ్గా నెల రోజులవుతున్న సందర్భంగా …)

గోండి మూలం : పుష్ప పద్దా
తెలుగు అనువాదం : సుస్మిత

Leave a Reply