మా ఇంటిముందు
రోడ్డువారగా గులాబీ చెట్టు
చెట్టు చిన్నదేగాని
గుత్తులుగా పువ్వులు
అటుగా వెళుతున్న అందరిని
పలకరిస్తున్నట్టుగా ఉంటాయి

ఆ చెట్టు పువ్వులపై పడిన కళ్లల్లో ఆశ్చర్యం
పెదాలపై దరహాసం నడిచివెళుతుంది

ఒక పువ్వు కోసుకోమంటారా!
అటుగావెళుతున్న ఒక కేక
ఆపిలు విన్నప్పుడెల్లా
వినకుడాని మాటేదో విన్నటు చిరాకు

వద్దులే అని
సున్నితంగా తిరస్కరించినప్పుడు
ఆకేక
నిరాశగా
నిట్టూర్పుతో
వెనుదిరిగి వెళ్లిపోతుంటే
పువ్వులు ఊపిరి పీల్చుకుంటూ
ఒక కృతజ్ఞతను
నా మీదకు విసిరేసేవి

ప్రకృతిని శ్వాసించని
వికృతదేహాలు
పువ్వుల ప్రమేయంలేకుండా
వాటిని తాకుతున్నపుడు
కాళ్ళకింద నలిపేస్తున్నప్పుడు
నిరశిస్తాయి
నినదిస్తాయి
యుద్దాన్ని ప్రకటిస్తాయి

పువ్వులు లేనితోట
పువ్వులు లేనిఇల్లు
మబ్బులుకమ్మిన ఆకాశమే

పువ్వులు
ఆహ్లాదాన్నిస్తాయి
పువ్వులు
ఆనందాన్నిస్తాయి

పువ్వులు
వడలిపోయి రాలిపోతున్నప్పుడు
ఎన్నటికీ
కనిపించకుండాపోతున్న బిడ్డల్లా అనిపిస్తాయి

ప్రకృతిని
అమితంగా ప్రేమించే సూర్యం
చెట్టుని
పువ్వుల్ని
తన మొబైల్ ఫోన్ కెమెరాలో
జ్ఞాపకాలుగా దాచుకున్నప్పుడు
చెట్టు
చెలిమిచేసింది

శృతి చెట్టుని దాటుకుంటూ లోనికివస్తున్నప్పుడు
చెట్టే తనని పాలకరించిందో!
శృతియే చెట్టుని పాలకరించిందో!
ముందు
ఎవరిని ఎవరు పలకరించి
పరిచయం చేసుకున్నారోగాని
సూర్యం శృతి అమరులయ్యాక
చెట్టు
దుఃఖమయ్యింది
కన్నీళ్ల శోకమయ్యింది

తలలో తూటా దూసుకుపోయినా
శరీరం చివికిపోయినా
ముద్దలు ముద్దలుగా ఊడిపోతున్నా
అడుగు ముందుకేగాని
వెనక్కి తగ్గిందిలేదు

నిర్జీవమైనదేహం కనుపాపల్లోనుండి
నెత్తురు
కన్నీరుగా వొలుకుతున్నప్పుడు
చలించని మనుషులు వుంటారా!
కరిగిపోని హృదయాలు ఉంటాయా!
చెట్టు
మాట్లాడుతుంది

ఆకులు రాలిపోయినా
పువ్వులు రాలిపోయినా
చెట్టు
మళ్ళీ చిగురిస్తూ
పువ్వులు పూస్తూ
రోజురోజుకి విస్తరిస్తుందేగాని
కుంగిపోతూ
అక్కడే ఆగిపోదు

చెట్టు వేర్లు
మనిషి హృదయం చుట్టూ
అల్లుకుపోయినప్పుడు
చెట్టును కొట్టేయడమంటే
మనిషిని చంపేయడమే

20-6-2021 తేదీకిసూర్యం అమరుడై 6 సంవత్సరాలు

Leave a Reply