‘ఇతర దేశాలలో ఒకరిని పొరపాటుగా విచారించినట్లయితే వారు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు’

[ప్రధానమంత్రి నరేంద్ర మోడిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే పోలీసులు చేస్తున్న ఆరోపణతో సహా యితర ఆరోపణలతో 2018 నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద విచారణ లేకుండా జైల్లో వున్న  కవి వరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్‌లకు సీనియర్ అడ్వకేట్ ఆనంద్ ఆనంద్ గ్రోవర్ న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు.]

స్టాన్‌స్వామి మరణం పట్ల మీ స్పందన ఏమిటి?

ఇది మొత్తంగా నేర న్యాయవ్యవస్థ వైఫల్యం. పోలీసులు, ప్రాసిక్యూటర్, జైలు లేదా కోర్టు- అన్నిటి చట్ట నియమాలు విచ్ఛిన్నమై పోయాయి! అవి చట్ట ప్రకారం తమ విధులను నిర్వర్తించలేదు.

మొట్ట మొదటిగా, మనకు యుఎపిఎ అనే ఒక అణచివేత చట్టం వుంది,  ఇందులో “ఉగ్రవాదాని”కి నిర్వచనం ఒక నిర్దిష్ట విషయం లేదా ప్రయోజనానికి పరిమితం కాకుండా చాలా విశాలంగా వుంది. ఇందులో బెయిల్ దొరకడం అసాధ్యం కాదు కానీ చాలా కష్టమవుతుంది.

రెండవది, ఎటువంటి ఆధారం లేనప్పుడు,  బెయిల్ మంజూరు అవదని నిర్ధారించడానికి మాత్రమే, ఏకపక్షంగా, ఎంపికచేసినవారిపై, అణచివేతకు ఎగ్జిక్యూటివ్ దీన్ని ఉపయోగిస్తుంది.

మూడవది, ఎగ్జిక్యూటివ్ చర్యలను న్యాయస్థానాలు సరిగా పరిశీలించడం లేదు.

చివరగా, జైళ్లు అణచివేత సంస్థలు, ఇవి బలహీనమైన, వృద్ధాప్య ఖైదీలను యిక కోలుకునే అవకాశం లేకుండా అనారోగ్యంపాలు చేస్తాయి.

ఫాదర్ స్టాన్ స్వామి చనిపోవాల్సిన అవసరం లేదు. వ్యవస్థే అతని మరణానికి కారణం. మన నేర న్యాయ వ్యవస్థలో వున్న అన్యాయానికి ఆయన సారాంశం.

ఇంతకు ముందు కూడా చాలా మంది మరణించారు. ఈ సంవత్సరం జనవరి 12న కాంచన్ నానావరె జైలు కస్టడీలో మరణించారని మనకు తెలుసు. ఆమె, ఆమె భర్త అరుణ్ బెల్కేను 2014 సెప్టెంబర్‌లో పూణేలో నకిలీ గుర్తింపు కార్డులను తీసుకున్నారనే ఆరోపణతో వారిని అరెస్టు చేశారు. ఫోర్జరీ చేసిన నేరానికి వారిపై అభియోగాలు మోపవచ్చు. కానీ, తమకు వీలుగా, వారిపై మావోయిస్టు ముద్రవేసి, యుఎపిఎ కింద అభియోగాలు మోపి, బెయిల్ నిరాకరించి, పూణేలోని యెరవాడ జైలుకు పంపించారు. తనకు విపరీతమైన తలనొప్పిగా వుందనీ, ఊపిరాడడం లేదని కాంచన్ ఫిర్యాదు చేస్తే, సాసూన్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళి చేయించిన పరీక్షలో, మెదడులో ఒక గడ్డ వుందని (క్లాట్) గుర్తించారు. అపస్మారక స్థితిలో వున్న కాంచన్‌కు, ఆమె భర్త అరుణ్ సమ్మతి తీసుకోకుండా లేదా కనీసం సమాచారం కూడా యివ్వకుండానే మెదడుకి శస్త్రచికిత్స చేసారు. ఆమె ఐసియులోనే మరణించారు. ఆమె వయసు 37 సంవత్సరాలు మాత్రమే. జైలులోనే వున్న ఆమె భర్తకు ఐదు రోజుల తరువాత అంటే జనవరి 19 న విషయం చెప్పారు. 19, 20 తేదీలలో ఆమెను చూడటానికి తీసుకెళ్తారని అతను ఎదురుచూస్తున్నాడు. కానీ అప్పటికే కాంచన్ లేదు.

బొంబాయి హై కోర్టులో బెయిల్ విషయం పెండింగ్‌లో ఉంది. ఆమె చనిపోయాక, ఆ పిటిషన్‌ని అతి సాధారణంగా కొట్టిపారేసారంతే… కాంచన్‌ను మరచిపోయారు, అగమ్య గోచర కోర్టు రికార్డుల్లో ఖననం చేసేశారు. జైలు కస్టడీలో జరిగిన ఆమె మరణంపై న్యాయ వ్యవస్థ నుంచి కనీస స్పందన లేదు.

మరోవైపు, ఫాదర్ స్టాన్ స్వామి విషయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సార్వజనిక సమస్యగా మారింది. ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ అందువల్ల వచ్చే తేడా ఏమీ లేదు. ఎంతోమంది ఇతరులలాగానే   వ్యవస్థ అతన్ని విస్మరించింది.

UAPA లో శిక్షపడిన కేసుల సంఖ్య 2.5% కన్నా తక్కువ. మరి ఎందుకని మనం ఇదంతా చేస్తున్నాం?

విషాదం ఏమిటంటే ప్రాసిక్యూషన్ విజయవంతమైంది. విభేదించేవారికీ, నిరసన తెలియచేసేవారికీ పాఠం నేర్పాలనే, అత్యంత భయానకమైన సందేశాన్ని పంపాలనే కారణాలు వారికి ఉన్నాయి. ఫాదర్ స్టాన్‌స్వామికి పట్టిన గతే మీకు పడుతుందనేది ఆ సందేశం. ఇది జైలులో నిదానంగా సంభవించే మరణం. కానీ కొంతమంది ఆస్తికులు చెప్పినట్లు, దేవుడు ఫాదర్ స్టాన్‌ను ఆ వేదన నుండి విముక్తి చేశాడు.

దీనికి ఎవరో ఒకరు జవాబ్దారీ వహించాలి. ఫాదర్ స్టాన్‌స్వామిని అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం, చికిత్స అందించకపోవడం, పదేపదే వాయిదాలు వేయడం మొదలైనవాటన్నింటినీ యిప్పుడు  బొంబాయి హైకోర్టులో  కొనసాగుతున్న కేసులో విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

ఎల్గార్ పరిషత్‌లో ఏమి జరిగింది:

డిసెంబర్ 31 న జరిగిన ఏకైక ఘటన ఎల్గార్ పరిషత్. ఎల్గార్ పరిషత్ అనే సంస్థ పూర్వ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.బి సావంత్ నేతృత్వంలోని కమిటీ క్రింద ఉంది.

ఉపన్యాసాలిచ్చారు, కవితలు చదివారు, పాటలు పాడారు, అన్నీ రాజ్యాంగానికి విధేయత చూపించేవే. ఆ తర్వాత ఏమీ జరగలేదు. ఆ తర్వాత ఎటువంటి హింస జరగలేదు.

మర్నాడు, విజయ్‌స్తంభ్‌ దగ్గర  భీమా కోరేగావ్ యుద్ధం 200 వ వార్షికోత్సవాన్ని మితవాద సమూహాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఆ తరువాత హింసకు దారితీసిన సందర్భం పూర్తిగా భిన్నమైనది.

మనం ఎల్గార్ పరిషత్‌ను హింసతో జోడించలేం. ఒకవేళ  జరిగినా, అవి అల్లర్లు మాత్రమే. దాంతో వ్యవహరించడానికి ఒక చట్టం ఉంది.

దీన్ని ఉగ్రవాదం అని మీరు ఎలా పిలుస్తారు? UAPA కిందికి రాదు. UAPA ని పెట్టడం అంటే దానిని దుర్వినియోగం చేయడమే అవుతుంది.

భీమా కోరేగావ్ కేసులలో సాధించిన పురోగతి:

ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ బెయిల్ కోసం దరఖాస్తులు వేశారు. వాటిని ట్రయల్ కోర్టులు తిరస్కరించాయి. వాటిపై అప్పీళ్లు వేస్తున్నారు. అనేక మంది భీమా కోరేగావ్ కార్యకర్తలు తమకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు చేయాలని వాదిస్తున్నారు. అంటే జైలులో ఒక నిర్దిష్ట కాలం, 60, 90 లేదా 180 రోజులు వున్నాక, ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే, అదుపులో ఉన్న వ్యక్తి చట్టబద్ధమైన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు ఒక హక్కుగా బెయిల్ లభిస్తుంది.

కానీ సాధారణ చట్టమైన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) నిందితులకు అవసరమైన భద్రతలతో వర్తిస్తుంది. కానీ, యుఎపిఎ, ఎన్డిపిఎస్ చట్టం, పిఎమ్ఎల్ఎ లాంటి ఇతర చట్టాలకు, సిఆర్పిసి కాకుండా వేర్వేరు విధానాలు వర్తిస్తాయి, ఇవి నిందితుల హక్కులను హరిస్తాయి.

నా అభిప్రాయంలో, వివిధ విధానాలు అవసరం లేదు. ఐపిసి క్రింద, యుద్ధం చేయడం అనేది నేరాలన్నింటిలోనూ పెద్ద నేరం. దీనికి వర్తించే విధానం సాధారణ CrPC. యుద్ధం చేసే నేరానికి సాధారణ సిఆర్‌పిసి వర్తిస్తే, “ఉగ్రవాదం” నేరానికి, రాజ్యానికి సడలింపు యిచ్చే వేరే విధానం ఎందుకు ఉండాలి?

అంతర్జాతీయ బాధ్యతల కారణంగా మీకు ఉగ్రవాదంపై ఒక చట్టం  ఉండాలంటే, ఉగ్రవాదాన్ని చేర్చడానికి ఐపిసిని సవరించాలి, లేదా ఉగ్రవాద చట్టంలో సిఆర్ పిసి మాదిరిగానే విధానాలు ఉండాలి

రాజ్యం ఇలా ఎందుకు చేయదు? ఎందుకంటే భారతదేశంలో జవాబుదారీతనం లేదు. మీరు జైలులో ఉండి నిర్దోషులుగా ప్రకటితులైతే, భారతదేశంలో పరిహారం కోసం ఎటువంటి సహాయం లేదా పరిష్కారం లేదు. ED, NIA, సాధారణ పోలీసులు కూడా ఎవరికీ బాధ్యత పడరు!

ఇతర దేశాలలో, ఒకరిని చేయని నేరానికి  విచారణ జరిపితే, వారు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు, నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు, ఆ మొత్తం భారీగా కూడా ఉండవచ్చు.

మొదటి UAPA, NDPS చట్టం, PMLA [మనీలాండరింగ్ నిరోధక చట్టం] లాంటి చట్టాలు సాధారణ నేర చట్టం కంటే వేరుగా వున్నాయి. వీటిలో, ప్రాసిక్యూషన్ ఒక నేరాన్ని బలపరచడానికి కేవలం ఒక ప్రైమా ఫేసీ కేసు ఉందని మాత్రమే చూపించాల్సి ఉంటుంది. ప్రాసిక్యూషన్ కోసం పరిమితి చాలా తక్కువగా వుంటుందీ

కోర్టులు బెయిల్ ఇవ్వకపోవడంపై:

అంతేకాకుండా,  సాక్ష్యాలను కోర్టు నిశితంగా పరిశీలించకూడదు అని సుప్రీంకోర్టు [జహుర్ అహ్మద్ షా] వటాలి కేసులో నిర్దేశించి విషయాన్ని మరింత కష్టతరం చేసింది. దాన్నే ఢీల్లీ హైకోర్టు ఆసిఫ్ తన్హా కేసులో మార్చడానికి ప్రయత్నించింది.

ఇది కాకుండా, అటువంటి సందర్భాలలో న్యాయవ్యవస్థ ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగానూ, నిందితులకు వ్యతిరేకంగానూ ఉంటుంది. న్యాయమూర్తులు వ్యక్తి స్వేచ్ఛ గురించి ఆలోచించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది, కాని వ్యవస్థ అలా ఆలోచించదు.
NDPS, దేశద్రోహం, PMLA లేదా UAPA లాంటి కేసులన్నింటిలోనూ నిందితులపట్ల బలమైన ప్రతికూలాభిప్రాయం ఉంటుంది.

విస్తృత ప్రభావం?

అది ఎంత బలంగా వుంటుందంటే, కొంతమంది న్యాయమూర్తులు వైద్యచికిత్స  బెయిల్ కూడా ఇవ్వరు. వాస్తవానికి, యుఎపిఎతో సహా ఈ అన్ని చట్టాలలో మెడికల్ బెయిల్ తొలగించలేదు. వాస్తవానికి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో వైద్య బెయిల్ భద్రత వుంది. వరవరరావుకు యోగ్యతల్లోకి వెళ్లకుండా వైద్యపర బెయిల్ దొరికింది.

రాజ్యం సర్వశక్తివంతంగానూ, ఏజెన్సీలు ప్రభుత్వం చేతిలో అణచివేత సాధనాలుగానూ మారాయి. ఈ ఏజెన్సీలు స్వతంత్రంగా ఉండాలి, కాని లేవు. “పంజరంలో చిలుక” అనే వివరణ సిబిఐకి మాత్రమే కాదు ED, IT, NCB మొదలైన వాటికి కూడా వర్తిస్తుంది.
కార్యకర్తలు, అసమ్మతివాదులు మొదలైనవారందరిలోనూ ఒక భయోత్పాత వాతావరణం వుంది. న్యాయవాదులు కూడా తప్పించుకోలేరు. ఇప్పుడు భీమా కోరేగావ్ 15 లో ఒకరైన సురేంద్ర గాడ్లింగ్ చాలా సమర్థుడైన న్యాయవాది, “మావోయిస్టులు” అని ఆరోపించిన వారితో సహా చాలా మంది కార్యకర్తలకు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. తానే యిప్పుడు “మావోయిస్ట్”అనే ఆరోపణతో జైలులో ఉన్నాడు. అతని ఇతర సహచరులను కూడా వెంటాడుతున్నారు.

కాంగ్రెస్ పాలనలో కూడా ఇలానే జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం అన్ని సంస్థల స్వతంత్రతని, తద్వారా చట్ట పాలనను నాశనం చేసే కళలో సంపూర్ణ ప్రావిణ్యాన్ని సంతరించుకొంది.

మిమ్మల్ని “ఉగ్రవాది”, “మాదకద్రవ్యాల వినియోగదారు”, “హవాలా దారుడు” అని ముద్ర చేసి, మిమ్మల్ని అరెస్టు చేసి జైలులో పెట్టాలనేది వారి ఆలోచన.

ఫాదర్ స్టాన్ స్వామీ విషయంలో, ఛార్జ్ షీట్ దాఖలు చేసారు, అరెస్టు చేసి జైలులో పెట్టారు. అరెస్టు చేసిన తరువాత అతన్ని ప్రశ్నించనేలేదు. కాబట్టి అరెస్టు చేయవలసిన అవసరం ఏముంది?  అతను పారిపోయే స్థితిలో లేడు. అతను పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 83 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు; అతను త్రాగడానికి ఒక సిప్పర్ అవసరం. దీనికి భిన్నంగా, అతను తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడంలో ఆసక్తి చూపించాడు. అతన్ని జైలులో పెట్టడం అంటే అతన్ని చిత్రహింసలపాలు చేయడమే.

నిందితుడిని ఒకసారి  జైలుకి పంపిస్తే  తర్వాతి విషయాలు జైలు పరిస్థితులు చూసుకుంటాయి. జైలు లోపల పరిస్థితులు దయనీయంగా వుంటాయి. ఫాదర్ స్టాన్‌స్వామి ఉన్న తలోజా జైలులో అల్లోపతి వైద్యులు లేరు, ముగ్గురు ఆయుర్వేద వైద్యులు మాత్రమే వున్నారు, పరీక్షలకు ప్రయోగశాల లేదు, నర్సులు లేదా అటెండర్లు లేరు. అతని సహ నిందితులు, వెర్నన్ గొంజాల్వ్స్, అరుణ్ ఫెర్రెరాలు అతని సహాయకులుగా మారారు.

అంతేకాకుండా, అతనికి  కోవిడ్ 19 వచ్చింది. అతన్ని వైద్య బెయిల్ పై విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఖైదీల కోసం వున్న కోవిడ్ ప్రోటోకాల్ యుఎపిఎ కింద అభియోగాలు మోపిన ఖైదీలను ఎప్పటిలాగానే విడుదల చేయడానికి అనుమతించలేదు.

దానికి ఎటువంటి హేతువు లేదు. స్టాన్‌స్వామీ స్థితిలో ఉన్న వారేవరైనా ఆరోగ్యం క్షీణించి మరణిస్తారు. అదే వారి ఉపాయం.

అతను వైద్య, సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతనికి కోర్టులు బెయిల్ ఇవ్వలేదు. జస్టిస్ షిండే అతన్ని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో వైద్య చికిత్స కోసం పంపించాడు.

ప్రాసిక్యూషన్ పట్టించుకోలేదు. వారికి విజయాలు సాధించడం మాత్రమే కావాలి. వారికి, ఫాదర్ స్టాన్‌స్వామిని ఒక ఉదాహరణగా చేయాలి. ఒక సందేశాన్ని పంపడానికి వారికున్న శక్తిని ఇది తెలియచేస్తుంది. ఆ సందేశం బయటికి వెళ్లింది. ‘జాగ్రత్త! అతనిలాగే ఎవరైనా జైలులో చనిపోవచ్చు!!’

ఇది ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనుకునే వ్యక్తులను భయభ్రాంతులను చేస్తుంది. వారికి మాత్రం అతని మరణం ఒక గణాంకం మాత్రమే.

UAPA గురించి:

POTA విఫలమైంది, TADA విఫలమైంది, UAPA కూడా విఫలమైనట్లు కనపడుతోంది. UAPA క్రింద, ఉగ్రవాదం నిర్వచనం చాలా విశాలంగా వుంది, బెయిల్ దొరకడాన్ని చాలా క్లిష్టతరం చేశారు. బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. UAPA ను దుర్వినియోగం చేయవచ్చు. ఇది పోవాలి. ఈ రకమైన చట్టం ఉండకూడదు. యుగాల తరబడి విచారణ జరగదు. ప్రజలు అనవసరంగా ఎక్కువ కాలం జైలులో మగ్గుతున్నారు. ఇది కార్యకర్తలను, అసమ్మతివాదులను భయపెట్టడానికి ఒక సాధనంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ఉగ్రవాదంపై చట్టం వుండాల్సిన అవసరం ఉందా? యుద్ధం చేయడానికి, ఉగ్రవాదానికీ మధ్య వున్న తేడా ఏమిటి? యుద్ధం చేయడం ఉగ్రవాదం కంటే తీవ్రమైన నేరం. కానీ దానికి సాధారణ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వర్తిస్తుంది.

కానీ యుఎపిఎ, ఎన్డిపిఎస్ చట్టం, పిఎమ్ఎల్ఎ లాంటి చట్టాలకు, సిఆర్పిసి కాకుండా వేర్వేరు విధానాలు వున్నాయి. ఇలా వుండడం దుర్వినియోగం చేసే అనుమతినిస్తుంది.
నా అభిప్రాయం ప్రకారం, వివిధ విధానాలు అవసరం లేదు. ఐపిసి క్రింద, యుద్ధం చేయడం నేరాలలో అతి పెద్ద నేరం. సాధారణ CrPC విధానం దీనికి వర్తిస్తుంది. యుద్ధం చేసే నేరానికి సాధారణ సిఆర్‌పిసి వర్తిస్తే, “ఉగ్రవాదం” చేసిన నేరానికి వేరే విధానం, రాజ్యానికి సడలింపు విధానం ఎందుకు ఉండాలి?

అంతర్జాతీయ బాధ్యతల కారణంగా మీకు ఉగ్రవాదంపై ఒక చట్టం కావాలంటే, ఉగ్రవాదాన్ని చేర్చడానికి ఐపిసిని సవరించాలి, లేదా ఉగ్రవాద చట్టంలో సిఆర్ పిసి మాదిరిగానే విధానాలు ఉండాలి

రాజ్యం  దీన్ని ఎందుకు కొనసాగించగలదంటే, భారతదేశంలో జవాబ్దారీతనం లేదు. మీరు జైలులో ఉండి నిర్దోషులుగా ప్రకటించబడితే, పరిహారం కోసం భారతదేశంలో ఎటువంటి సహాయం లేదా పరిష్కారం లేదు. ED, NIA, సాధారణ పోలీసులు కూడా ఎవరికీ జవాబ్దారీగా ఉండరు!

ఇతర దేశాలలో, ఎవరిపైనైనా పొరపాటున  విచారణ జరిపితే, బాధితులు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు. నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు, ఆ మొత్తం భారీగా కూడా ఉండవచ్చు.

ఖైదీలు ఇప్పుడేం చేయాలి?

రాబోయే 3 సంవత్సరాల వరకు విచారణ ప్రారంభం కాదు కాబట్టి బెయిల్ తీసుకోవడమే తదుపరి లక్ష్యంగా వుండాలి.

వారు ఇప్పటికే 3 సంవత్సరాలు గడిపారు, రాబోయే 3 లేదా 4 సంవత్సరాల్లో విచారణ జరిగేటట్లు కనిపించడం లేదు కాబట్టి వారికి బెయిల్ ఇవ్వండి. NIA ఇప్పటికీ దర్యాప్తు చేస్తూనే వుంది, అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితులకు యింకా ఇవ్వలేదు, అందుకు ఇంకా సమయం పడుతుంది.

బెయిల్ రావాల్సిన సమయం ఇది. అది త్వరలో జరగవచ్చు.

(అనువాదం : కె. పద్మ)

Leave a Reply