గత రెండు దశాబ్ధాలుగా, బొగ్గు  సంబంధిత అవినీతి కథనాలను భారతదేశం చూసింది. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం పతనం కావడానికి, బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం బొగ్గు గనుల కుంభకోణం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో మరో బొగ్గు కుంభకోణం బయట పడింది . మోడీకి అత్యంత నమ్మకస్తుడైన గౌతమ్‌ అదానీ దిగుమతి చేసుకున్న విదేశీ బొగ్గు ధరను అత్యంత ఎక్కువగా చూపించి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కథనాన్ని లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక దినపత్రిక పైనాన్షియల్‌ టైమ్స్‌ ‘ద మిస్టరీ ఆఫ్‌ అదానీ బొగ్గు దిగుమతుల విలువ నిశబ్దంగా రెట్టింపు అవుతోంది’ అనే శీర్షికతో ఒక వివరణాత్మక పరిశోధనలో, అతిపెద్ద ప్రైవేట్‌ బొగ్గు దిగుమతిదారు అదానీ బొగ్గు ధరను పెంచుతున్నట్లు బయటపెట్టింది. అదానీని ‘మోడీ రాక్‌ఫెల్లర్‌’గా ఎలా అభివర్ణించాలో ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదిక చెబుతోంది. గత పదేళ్లలో అతని 10 లిస్టెడ్‌ కంపెనీలు అభివృద్ధి చెందాయి. అతను భారతదేశంలో అతిపెద్ద థర్మల్‌ కంపెనీ, అతిపెద్ద ప్రైవేట్‌ పోర్ట్‌ ఆపరేటర్‌గా అవతరించింది.

కార్పొరేట్‌ దిగ్గజం అదానీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయల్పడుతున్నాయి. భారీ మొత్తంలో పన్నుల ఎగవేత, అక్రమ పద్ధతుల్లో కంపెనీ షేర్‌ విలువ పెంపు ఇత్యాది ఆర్థిక కుంభకోణాలకు అదానీ గ్రూపు పాల్పడిరదని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపనలపై విచారణ జరుగుతుండగానే అదానీ బొగ్గు బాగోతాన్ని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక బయట పెట్టింది. మార్కెట్‌ ధరల కంటే రెట్టింపు ధరలకు బొగ్గును దిగుమతి చేసుకున్నట్లు తప్పుడు బిల్లులు చూపించి బొగ్గుఆధారిత విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నది ఆ పత్రిక కథనం సారాంశం. అదానీ చేతివాటం కేవలం బొగ్గు వినియోగదారులకే పరిమితం కాలేదు. బొగ్గు ధరలు పెంచడం మూలంగా థర్మల్‌ విద్యుదుత్పత్తి వ్యయం అమాంతం పెరిగేందుకు చక్రం తిప్పారు. ఫలితంగా ఈ కాలంలో ప్రజలకు కరెంట్‌ చార్జీల భారం తడిసి మోపెడైంది. చిన్న పరిశ్రమలకు, వ్యాపారులకు విద్యుత్‌ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

అంతేనా, డిమాండ్‌ కనుగుణంగా విద్యుదుత్పత్తి జరగనీయకుండా, ఉత్పత్తిలో ఎగుడు దిగుడులు, ఒడుదుడుకులకు, కృత్రిమ కొరత ఏర్పడటానికి, తద్వారా మరింతగా విద్యుత్‌ అమ్మకపు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఉత్తరోత్తరా దేశీయ విద్యుత్‌ రంగాన్ని అదానీ తన గుప్పెట్లో పెట్టుకొని శాసిస్తున్నారని అర్థమవుతుంది.భారతీయ కస్టమ్స్‌ పత్రాలలో పేర్కొన్న వివరణాత్మక విశ్లేషణను ఎఫ్‌టిప్రచురించింది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రకారం, భారతదేశంలో విద్యుత్‌ వినియోగదారుల నుండి అధిక చార్జీలు వసూలుచేయడం వల్ల కలిగే నష్టం ఏటా రూ.12 వేల కోట్లు దాటుతుంది. అయితే అదానీ గ్రూప్‌ దీనిని ఎప్పటిలానే కొట్టిపారేసింది. ఇక, భారతదేశంలోని మీడియా అయితే అలాంటి వార్తాపత్రిక ఒకటి ఉన్నదన్న విషయమే తెలియదన్నట్లుగా వ్యవహరించింది.

అదానీ గ్రూప్‌ గత ఏడేళ్లుగా ఇండోనేషియా నుంచి పెద్ద మొత్తంలో బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. దుబాయి, తైవాన్‌, సింగపూర్‌లోని మధ్యవర్తుల ద్వారా బొగ్గు దిగుమతి అవుతుంది. 2019 నుండి 2021 వరకు జరిగిన 30 రవాణా రికార్డులను ఆ పత్రిక పరిశీలించింది. ఇండోనేషియా నుంచి కొనుగోలు చేసిన వాస్తవ ధర కంటే మూడింతలు   ఎక్కువ ధరకు భారత ఓడరేవుల్లో దింపినట్లు స్పష్టమవుతోంది. ఈ రవాణా రికార్డుల విషయమే తీసుకుంటే… అదానీకి ఏడు కోట్ల డాలర్ల అదనపు లాభం వచ్చిందని స్పష్టమవుతోంది. అంటే టన్నుకు 25-30 డాలర్ల చొప్పున ఇండోనేషియాలో లోడ్‌ చేసిన బొగ్గును భారత నౌకాశ్రయాలలో దించాక… 65 నుంచి 80 డాలర్ల మధ్య ఉన్నట్లు చూపారు. అదానీ కంపెనీ బొగ్గును ఆ ధరకు భారతదేశంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ రంగాలలోని థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు, ఇతర కంపెనీలకు విక్రయించింది. దీనివల్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఉత్పత్తి వ్యయం పెరిగి… సరఫరా చేసి విద్యుత్‌ రేటు కూడా వాటికనుగుణంగా పెరగాల్సి ఉంది. అదానీ ఖజానాకు కోట్లాది రూపాయలు వచ్చాయిగానీ విద్యుత్‌ వినియోగదారులు మాత్రం దారుణంగా దోపిడీకి గురయ్యారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ విషయంలో ఫిర్యాదు రావడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) 2016లో దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా డిఆర్‌ఐ పలు కంపెనీలకు నోటీసులు జారీ చేయగా…50 నుంచి 100 శాతం మేర ధరలు పెంచినట్లు గుర్తించారు. ఈ కుంభకోణం జరిగిన పద్ధతి ఏమిటంటే, అధిక ధర కలిగిన ఇన్‌వాయిస్‌లను సిద్ధం చేసి, ఇండోనేషియా నుండి బొగ్గును భారతదేశానికి డెలివరీ చేయడం, అది మూడవ దేశంలోని ఏజెన్సీ ద్వారా వచ్చినట్లు చూపడాన్ని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ నివేదిక స్పష్టంగా వివరిస్తుంది. జనవరి 2019లో 74,820 టన్నుల బొగ్గుతో ఇండోనేషియా నుండి ఓడ బయలుదేరింది. ఎగుమతి రికార్డుల ప్రకారం ఇండోనేషియాలో దీని ధర 1.9 మిలియన్‌ డాలర్లు. అయితే, ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రాలో ఉన్న అదానీ సొంత ఓడ రేవుకు చేరుకోగానే చూపిన ధర 4.3 మి.లి బొగ్గును చమురు రవాణా ట్యాంకర్‌ డిఎల్‌ ఆకాసియాలో తీసుకొచ్చారు. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రకారం, ఆ సంవత్సరంలో అటువంటి సరుకు రవాణా 30సార్లు జరిగినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. బీమా, ఇతర నిర్వహణ ఖర్చులతో సహా మొత్తం దాని విలువ 142 మిలియన్‌ డాలర్లు  (9,360) కోట్ల డాలర్లు అయితే, భారత కస్టమ్స్‌కు సమర్పించిన పత్రాల్లో చూపించిన ధర 215 మిలియన్‌ డాలర్లు (11,200 కోట్ల డాలర్లు) ఆ విధంగా అదానీ గ్రూప్‌ భారత్‌లో బొగ్గును అత్యధిక ధరకు విక్రయించి లబ్ది పొందుతోంది.

గత రెండేళ్లుగా తైపీలోని ‘హై లింగోస్‌’, దుబాయిలోని ‘తారస్‌ కమోడిటీస్‌ జనరల్‌ ట్రేడింగ్ ’, సింగపూర్‌లోని ‘పాన్‌ ఆసియా ట్రేడ్‌ లింక్‌’ ఆఫ్‌ షోర్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌కు మధ్యవర్తులుగా వ్యవహరించాయి. వీటిని ఉపయోగించి 500 కోట్ల డాలర్ల విలువైన బొగ్గును మార్కెట్‌ ధర కంటే రెట్టింపు ధరలకు దిగుమతి చేసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు అదానీ గ్రూప్‌కి చెందిన బినామీ కంపెనీలని తేల్చి చెప్పింది. దుబాయిలో ఉన్న ఈ కంపెనీలను గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నడిపాడు. అతని రహస్య కార్యకలాపాలను హిండెన్‌బర్గ్‌ నివేదిక కూడా ప్రస్తావించింది. కస్టమ్స్‌ రికార్డుల ప్రకారం, అదానీ గ్రూప్‌ సెప్టెంబర్‌ 2021 నుండి జులై 2023 వరకు 2,000 నౌకల బగ్గును దిగుమతి చేసుకుంది. ఈ పద్ధతిలో 7.3 కోట్ల టన్నుల బొగ్గు భారతదేశానికి చేరుకుందని కస్టమ్స్‌ పేర్కొంది. కస్టమ్స్‌కు అదానీ అందించిన పత్రాల ప్రకారం టన్నుకు సగటున 130 డాలర్ల చొప్పున బట్వాడా చేసినట్లు వెల్లడవుతోందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. విదేశాల్లో దీని సగటు ధర 60-65 డాలర్లు మాత్రమే.

కస్టమ్స్‌ పత్రాలు, అనేక రకాల సమాచారాల ఆధారంగా జర్నలిస్టులు డాన్‌ మాక్రామ్‌. డేవిడ్‌ షెప్పర్డ్‌, మాక్‌ హార్లో రూపొందించిన కథనం అక్టోబర్‌ 12న ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో ప్రచురితమైంది. వాస్తవానికి, ఈ నివేదిక వెల్లడిరచింది గోరంత మాత్రమే. 2014 నుండి అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల గురించి తెలుసని ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌, ఎఫ్‌టి, ది గార్డియన్స్‌ దర్యాప్తులో భాగమైన నివేదిక వెలువరించింది. ఎగుమతులు, దిగుమతులపై నియంత్రణ చేసే వాచ్‌ డాగ్‌ సెబి పాత్ర కూడ వెలుగులోకి వచ్చింది. అనాటి సెబి డైరెక్టర్‌ ఇప్పుడు అదానీ యాజమాన్యంలోని ఎన్‌డిటివికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఏండ్ల తరబడి మోడీ నీడలో అదానీ సాగిస్తున్న ఈ వ్యాపారంలో లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు దాగి ఉన్నాయి. ఈ వార్త వెలువడినప్పుడు, అదానీ గ్రూప్‌ సరైన సమాధానం ఇవ్వకుండా, అందులో పేర్కొన్న ఆరోపణలను తిరస్కరిస్తూ పత్రికా ప్రకటనను మాత్రమే విడుదల చేసింది. నరేంద్ర మోడీ మామూలుగా మౌన బాబా పాత్ర పోషిస్తున్నారు.

2019- 2021 మధ్య 32 నెలల కాలంలో అదానీ కంపెనీ ఇండోనేషియా నుండి భారతదేశానికి 30 బొగ్గు రవాణాను పరిశీలించిన తర్వాత ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తన పరిశోధనలో మూడు కీలక అంశాలను లేవనెత్తింది. అదానీ దర్యాప్తును ‘‘పాత, నిరాధారమైన ఆరోపణ’’ ఆధారంగా అభివర్ణించారు. ‘‘బహిరంగంగా అందుబాటులో ఉన్న వాస్తవాలు మరియు సమాచారాన్ని తెలివిగా రీసైక్లింగ్‌ చేయడం, తప్పుగా సూచించడం’’ అని పేర్కొన్నారు. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ డైలీ కనుగొన్న నిర్దిష్ట సందర్భాల్లో, జనవరి 2019లో, అదానీ కోసం ఉద్దేశించిన బొగ్గు, ‘‘తూర్పు కాలిమంటన్‌లోని ఇండోనేషియాలోని కాలియోరాంగ్‌ ఓడరేవు నుండి 74,820 టన్నుల థర్మల్‌ బొగ్గును భారతీయ పవర్‌ స్టేషన్‌లో మంటలకు తీసుకువెళ్లింది. సముద్రయానం సమయంలో, అసాధారణమైన ఏదో జరిగింది దాని సరుకు విలువ రెట్టింపు అయింది. ‘‘ఎగుమతి రికార్డులలో ధర 1.9 మిలియన్‌ డాలర్లు, అదానీ నిర్వహిస్తున్న గుజరాత్‌లోని ముంద్రాలోని భారతదేశపు అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయానికి చేరుకున్నప్పుడు, ప్రకటించిన దిగుమతి విలువ 4.3 మిలియన్‌ డాలర్లు. అంటే అదానికి ఏడు కోట్ల డాలర్లు లాభం వచ్చింది.

బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరిగాయి. ఆ కాంట్రాక్టులను  రద్దు చేయాలని అంటూ సుప్రీంకోర్టు ఆదేశించినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆశ్రిత మిత్రునికి లబ్ది చేకూర్చేందుకు రూ.1.6  లక్షల కోట్ల ప్రాజెక్ట్‌ కట్టబెట్టేందుకు ఆదివాసీల జీవనాన్ని, జీవ వైవిధ్యాన్ని  సైతం పణంగా పెట్టారు. గౌతమ్‌ అదానీ ‘కోల్‌కింగ్‌’ గా మారడంలో ప్రధాని మోడీ పోషించిన పాత్ర అసాధారణమైనది. మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో, దట్టమైన హస్డియో అరంద్‌ అడవులు భారతదేశంలోని కొన్ని సహజమైన, సమీప అటవీ ప్రాంతాలలో ఒకటి, హస్డియో అరంద్‌ 1,500 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఎపిఫైటిక్‌ ఆర్కిడ్లు, స్మైలాక్స్‌ వంటి అరుదైన మొక్కలు, ఎలుగుబంట్లు, ఏనుగులు వంటి అంతరించిపోతున్న జంతువులు, సాల్‌ చెట్లు చాలా పొడవుగా ఆకాశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ అడవిలో 5 బిలియన్‌ టన్నుల బగ్గు కూడా ఉన్నట్లు అంచనా. ఈ బొగ్గు ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది, ఇది గని తవ్వకాన్ని సులభతరం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 23 ‘‘బొగ్గు బ్లాకులు’’గా విభజించింది, అందులో ఆరు మైనింగ్‌ కోసం ఆమోదించింది. కేట్‌ చుట్టుపక్కల గ్రామాలతో సహా ఆ ఆరింటిలో నాలుగింటికి అదానీ గ్రూప్‌ కాంట్రాక్టులను పొందింది. ఈ గనుల నిర్మాణం వల్ల కనీసం 1,898 హెక్టార్ల అటవీ భూమి నాశనమవుతుంది.

కేట్‌ కింద ఉన్న నిర్దిష్ట బొగ్గు బ్లాక్‌లో సుమారు 450 మిలియన్‌ టన్నులబొగ్గు ఉంది, దీని విలువ సుమారు 5 బిలియన్‌ డాలర్లు. హస్‌దేవ్‌ అరండోలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించిన బొగ్గు గనుల లీజును రద్దు చేయాలని కోరుతూ ఇక్కడి వేలాది మంది ఆదివాసీలు, గ్రామస్థులు 2013 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం(2006) నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న మైనింగ్‌ కారణంగా సమీపంలోని నదీజలాలు విషపూరితమయ్యాయని, తాము ఆవాసం కోల్పోయామని, లక్షలాది వృక్ష జాతులు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘హస్‌దేవ్‌ అరణ్య బచావో సంఘర్ష్‌ సమితి (హెచ్‌ఎబిఎస్‌ఎస్‌)’ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ, వందల కిలోమీటర్లలో పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. మైనింగ్‌ కార్యకలాపాలను రద్దు చేయాలంటూ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రానికి గత అక్టోబర్‌లో లేఖ రాసింది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

దేశ ఆర్థిక వ్యవస్థను తొలిచేస్తున్న అదానీ ఉదంతాన్ని హిండెన్‌బర్గ్‌ జనవరి 2023లో బయటపెట్టాక కూడా, సదరు అక్రమాల నిరోధానికి కానీ, జరిగిన దోపిడీపై విచారణకు కానీ మోడీ ప్రభుత్వం ఇసుమంతైనా స్పందించపోవడాన్ని బట్టి అదానీ, మోడీ సర్కారుకు మధ్య బంధం ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినా, జాయింట్‌ పార్లమెంటరీ కమిటి(జెపిసి) విచారణ డిమాండ్‌ను మోడీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. సుప్రీంకోర్టు ప్రత్యేక ప్యానల్‌ ఏర్పాటు చేశాక కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. అదానీపై చేపట్టిన దర్యాప్తును ఎందుకు మధ్యలో నిలిపివేయాల్సి వచ్చిందో కోర్టుకు సెబి నివేదిక ఇస్తేకానీ నిజం బయటకు రాదు. ఇంత జరిగినా ఆర్థిక సామ్రాజ్యానికి మోడీ ప్రభుత్వం కాపలా  కాయడం ఆపలేదు సరికదా దేశ, విదేశాల్లో, రాష్ట్రాల్లో కొత్తగా అదానీకి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు దక్కేలా మోడీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విషయానికి వస్తే పోర్టులు, విలువైన భూములు, కొండలు, బీచ్‌శాండ్‌, పంప్డ్‌ స్టోరేజి, సోలార్‌, సహా పలు పవర్‌ ప్రాజెక్టులు, చివరికి థర్మల్‌ కేంద్రాల్లో వెలువడే బూడిద(ప్లయాష్‌)… సమస్తం అదానీకి కట్టబెట్టడం వెనుక కేంద్రం ఒత్తిడి తప్పనిసరిగా ఉండి తీరుతుంది.

Leave a Reply