జాతీయ విద్యా విధానం-2020(జా.వి.వి.)ని భారత యూనియన్ ప్రభుత్వం కేవలం ఒక ప్రకటన ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఎటువంటి చర్చ గాని, ఆమోదం గాని లేకుండానే ప్రవేశపెట్టబడిన ఈ జా.వి.వి. కవర్ పేజీ సరిగ్గా జా.వి. వి-1986 కవర్ పేజీ లాగే కనబడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి, ఆర్థిక మంత్రుల ప్రసంగాలలో దీనిని అత్యంత గొప్పదిగా ప్రశంసించారు. ఇప్పటికే ఇందులోని అనేక అంశాలను అమలులోకి తీసుకొచ్చారు. ఇంకా ఇతర అంశాలను తన అధికారిక ప్రకటనలు, మెమొరాండాల ద్వారా యూనియన్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను, అకడెమిక్ సంస్థలను  కూడా త్వరగా అమలు చేయమని ఒత్తిడి చేస్తోంది. నిజానికి రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం చూస్తే జా.వి.వి-2020  ఒక విధాన పత్రమే గాని చట్టం కాదు. ఇందులోని చాలా అంశాలు ఇదివరకున్న చట్టాలను సవరిస్తే గాని అమలులోకి రావు. అయినప్పటికీ ప్రభుత్వం తన  తిరుగులేని కార్యనిర్వహణాధికారం ద్వారా ఈ జా.వి.వి-2020 ని అమలు చేయమని ఒత్తిడి చేస్తోంది.

 బహుశా గతంలో  వివిధ విద్యా విధానపు డ్రాఫ్ట్ లను ప్రజలు పెద్ద ఎత్తున విమర్శించడం వల్ల ఈ జా.వి.వి-2020 లోని ముఖ్యమైన విషయాలను సంక్లిష్టమైన పదాడంబరంతో ఆలంకారిక భాషలో వ్యక్తీకరించి ఆధునిక ముసుగు కప్పారు. సాధారణ మీడియా కూడా వెంటనే స్పందించి తనదైన ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇతర వైపుల నుండి కూడా సానుకూల సందేశాలు వెల్లువెత్తాయి. పనిలో పనిగా స్వార్థపరశక్తులు సైతం తమ ఆమోదాన్ని వెలిబుచ్చాయి. ముఖ్యంగా జా.వి.వి-2020  రెండు లక్ష్యాల పట్ల సాధారణ జనామోదాన్ని పొందాలని చూసింది. మొదటిది- ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక ఎజెండా. రెండవది- విద్యారంగంలోని జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి ప్రయోజనాలను నెరవేర్చడం. సర్వవ్యాప్తమైన విస్తృత ప్రచారం ద్వారా జా.వి.వి-2020 లోని వాస్తవమైన ఉద్దేశాలను

 తెలుసుకోవడాన్ని ప్రజలకు చాలా కష్టసాధ్యమైన పనిగా చేశారు. అయినప్పటికీ కొన్ని విమర్శనాత్మక ప్రశ్నల ద్వారా దాని ఆలంకారిక భాషా సంక్లిష్టతను అధిగమించి దాని వాస్తవ ఉద్దేశాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జా.వి.వి-2020 ని ఒక తటస్థ విద్యావిధానంగా కాకుండా నిర్దిష్ట భావజాలంతో కూడిన ఒక రాజకీయ విధాన పత్రంగా మనం చూడాల్సి ఉంటుంది. అనేక అసమానతలతో, విద్యాపరమైన వెలివేతలతో కూడిన సుధీర్ఘ భారత చరిత్రను మొత్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా విధానాన్ని సందర్భంగా చెప్పుకోవాలి .

ఈ జా.వి.వి-2020 మనదేశంలోని సామాజిక, చారిత్రిక వెలివేతను ఎలా బలోపేతం చేస్తుందో మనం లోతుగా  పరిశీలించి తెలుసుకోవాలి. అనేక రకాల సామాజిక అసమానతలతో అత్యధిక శాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. 85 శాతం మంది ప్రజలు వేర్వేరు సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనానికి చెంది ఉండి చారిత్రకమైన వివక్షకు, ఆర్థికపరమైన లేమికి  గురవుతున్నారు. వారిలో దళితులు, వెనుకబడిన కులాల వాళ్లు; ఆదివాసీ సమూహాలు; మతపరమైన మైనారిటీలు; శారీరకక, మానసిక, దృష్టిపరమైన మాంద్యం గల వాళ్లు; ట్రాన్స్ జెండర్లు; వీళ్ళందర్లో ముఖ్యంగా స్త్రీలూ ఉన్నారు. వీళ్ళందరూ పీడితులుగా బైటికి ఒకే తీరుగా కనపడినప్పటికీ, అంతర్గతంగా చాలా భిన్నత్వం, వైవిధ్యం గలవాళ్లు. ఉదాహరణకు, బయటి సమాజంతో పరస్పరం వ్యవహరించడంలో 15% మంది ప్రజలు అనేక రకాల శారీరక,మానసిక, దృష్టిపరమైన సామర్థ్యాల విషయంలో ఎన్నో పరిమితులను ఎదుర్కొంటున్నారు. వాళ్లలో ఎక్కువమంది సామాజిక ఆర్ధిక వెలివేతకు గురవుతున్న వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలైతే రెండింతల వివక్షను ఎదుర్కొంటున్నారు. అయితే ఎవరికి వారు తమ సొంత అస్తిత్వపు అనుభవం(జ్ఞానం)తో మాత్రమే మొత్తం సామాజిక వాస్తవాన్ని అర్థం చేసుకోవడం సాధ్యంగాదు. కాబట్టి పరస్పర అంతరాస్తిత్వ దృష్టి కోణం ద్వారానే సామాజిక వెలివేతను మనం సరిగ్గా అర్థం చేసుకోగలం.

ప్రస్తుతం సుమారు 85 శాతం మంది బడిపిల్లలు నియత పాఠశాల విద్యను సంపూర్ణంగా పొందలేకపోతున్నారు. ఇది రాజ్యాంగం లోని సామాజిక న్యాయం, రిజర్వేషన్ ల ఎజెండాను ప్రశ్నార్థకం చేస్తున్నది. మరోవైపు దేశంలో సమగ్రమైన భూసంస్కరణలు జరగలేదు. నాణ్యమైన, సమ్మిళితమైన, సమాన విద్యకు సంబంధించిన సెక్షన్లు ఈ జా.వి.వి-2020 లో ఉన్నప్పటికీ, ముఖ్యంగా వ్యవస్థాపరమైన అసమానతలున్న సమాజంలో, మార్కెట్ శక్తుల దోపిడీకి గురవుతున్న అసంఖ్యాక ప్రజాశ్రేణులున్న సమాజంలో వెలివేతకు గురవుతూ బయటికి నెట్టివేయబడుతున్న బడి పిల్లలకు, యువతకు ఈ జా.వి.వి. సమానమైన, నాణ్యమైన, సమ్మిళిత విద్యను  అందించగలుగుతుందా?, సామాజిక న్యాయం సమానత్వం వంటి మౌలిక రాజ్యాంగ హక్కులు పలుచబారవా? అన్న ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి.

ఎందుకంటే- విద్యార్థుల నమోదు విషయంలో నికర సంఖ్యపై ఆధారపడకుండా స్తూల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం వల్ల డ్రాప్ అవుట్స్ సంఖ్య చాలా తక్కువగా చూపబడింది. పైగా ఇందులో గైర్హాజరీలను, తప్పుడు నమోదులను కలుపుకొని పరిగణించడం వలన నిజమైన డ్రాప్ అవుట్స్ సంఖ్య రికార్డ్ కాలేదు.

ఇంకా డ్రాప్ అవుట్స్ కు సంబంధించిన నిర్దిష్టమైన సంఖ్యా వివరాలు ఆరవ సెక్షన్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాల గురించి చెప్పేటప్పుడు ఇవ్వబడ్డాయి. అయితే డ్రాప్ అవుట్ విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి ఇందులో కొత్తగా ప్రతిపాదించిన ముఖ్యమైన చర్యలేవీ లేవు. అట్లని సహాయకారీ చర్యలకు కూడా గడువు ఏదీ విధించలేదు. మొత్తంగా ఇందులో ప్రతిపాదించిన సిఫారసులేవీ విద్యా సమస్యలను మౌలికంగా పరిష్కరించేవి కావు. వెలివేత సమస్యకు సామాజిక పరమైన, జ్ఞానశాస్త్రపరమైన పరిష్కారాలేవీ అందించకుండానే కేవలం పాఠశాలలోని మౌలిక సదుపాయాలను కాస్త మెరుగుపరిచి స్థానిక భాషలో మాట్లాడే వాలంటీర్లను, టీచర్లను నియమించడం వంటి సానుకూల చర్యలను మాత్రమే ప్రతిపాదించారు. కనుక ఒకవైపు ఎప్పటిలాగే సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన అవకాశాలున్న  విద్యార్థులు ఇంగ్లీష్ వంటి ఆధిపత్య భాషలలో సకల సౌకర్యాలుండే ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వారి కుటుంబాల ఆర్థిక మద్దతుతో హాయిగా చదువుకుంటారు. మరోవైపు- సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులేమో వారి రోజువారీ తిండి కోసం ఒంటరిగానో,కుటుంబ సభ్యులతోనో కలిసి పనిచేస్తూ స్థానిక భాషలలో చదువు చెప్పే పాఠశాలలలో లేదా ఓపెన్ స్కూల్ విధానమున్న తక్కువ ప్రమాణాలు కలిగిన పాఠశాలల్లోనో, సింగిల్ టీచర్ స్కూళ్లలోనో చేరుతారు. విద్యాహక్కు చట్టం గానీ, జా.వి.వి- 2020 గాని విద్యార్థి హాజరును తప్పనిసరి చేయలేదు కాబట్టి జా.వి.వి-2020 ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనేది అస్పష్టమే.

జా.వి.వి- 2020 ని కూలంకషంగా చదివితే దాని సాంస్కృతిక రాజకీయం మనకు స్పష్టంగా అర్థ మవుతుంది. లక్ష్యాల జాబితాను పరిశీలిస్తే ఈ విధానపత్రం ముఖ్యంగా ప్రాచీన, ఆధునిక యుగాల భారతీయ సంస్కృతుల వైవిధ్యాన్ని, గత సంస్కృతీ గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. కానీ మధ్యయుగాల పరిణామాల గురించి గానీ, ఆ కాలపు వికాసం గురించి గానీ ఇందులో ఏ ప్రస్తావనలూ లేవు. చీకటి యుగం అనే పేరిట ఇస్లాం మతాన్నే కాకుండా సిక్కిజం, సూఫిజం, భక్తి  వంటి ఇతర సంప్రదాయాలను కూడా పూర్తిగా నిరాకరించారు.

ఇందులో ప్రాచీన యుగాన్ని ఉదహరించినప్పుడు కూడా మతతాత్విక రంగాలలోని జైనిజం, బుద్ధిజం, చార్వాకం తదితర బ్రాహ్మణేతర సంప్రదాయాల గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. భారత ప్రాచీన యుగాన్ని గొప్ప యుగమని కీర్తిస్తూనే వాస్తవ కుల వివక్షను గుర్తించకుండా ఈ జా.వి.వి.విస్మరిస్తుంది. ఆధునిక యుగంలోనూ బ్రాహ్మణవాద, పితృ స్వామిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన వైవిధ్యపూరితమైన పోరాటాలను, స్వాతంత్ర పోరాట కాలంలో  జరిగిన విద్యాపరమైన చర్చనూ ఇందులో ఎక్కడా పేర్కొనలేదు. అలాగే గత రెండు వందల ఏళ్లుగా క్రిస్టియన్ మిషనరీలు చేసిన ప్రయత్నాలను, సంఘసంస్కర్తలు, స్వాతంత్ర యోధులు చేసిన కృషినీ పూర్తిగా పట్టించుకోకుండా దాటవేశారు. అదేవిధంగా  స్వాతంత్ర్యనంతర  కాలంలో జరిగిన విద్యా కార్యక్రమాలను, విద్యా చర్చలను శాస్త్రీయంగా విశ్లేషించకుండా మొత్తంగా తిరస్కరించారు.

మొత్తం జా.వి.వి పత్రంలో ఎక్కడా ముస్లింల ప్రసక్తి లేనేలేదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గురించి ప్రస్తావించినప్పుడు కూడా కేవలం మైనారిటీలు అని మాత్రమే ఉపయోగించారు. సచార్ కమిటీ నివేదిక, దాని సిఫారసుల గురించి గానీ, ఉర్దూ భాష గురించి గానీ ఎటువంటి ప్రస్తావనలు చేయలేదు.

జా.వి.వి 2020లో ప్రస్తావించబడిన వెనుకబడిన సమూహాలు రాజ్యాంగంలో గుర్తించబడినట్లుగా చారిత్రకంగా వివక్షకు గురవుతున్న సమూహాలు  కావు. సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక, జెండర్ అస్తిత్వాలతో కూడిన, ఆర్థిక వెనుకబాటుతో కూడిన ప్రత్యేకతలు, వైవిధ్యతలున్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్లు, స్త్రీలు, ఇతర వైకల్యాలున్న మనుషులు కారు. ఈ విద్యా విధాన పత్రం కేవలం వెనుకబడిన సమూహాలను  నాణ్యమైన, సమ్మిళితమైన, సమాన విద్యను అందుకోవాల్సిన వారిగానే చూసింది. ఇందులో సోషలిజం, సెక్యులరిజం, అందరికీ ఉచిత విద్య, కామన్ స్కూల్ విధానం వంటి పదాలు లేనేలేవు. మాతృభాషలో ప్రాథమిక విద్య, విద్యను పొందే మౌలిక రాజ్యాంగ హక్కు, అడ్మిషన్లలో, ఉద్యోగాలలో, ప్రమోషన్ లలో రిజర్వేషన్లు, పెన్షన్లు, శాశ్వత ఉద్యోగుల నియామకం వంటి వాటి పట్ల ఈ విధాన పత్రం మౌనాన్నే పాటించింది.

ఇందులో ప్రతిభ గురించి ప్రస్తావించినప్పుడు కూడా దాని సామాజిక మూలాలను పట్టించుకోకుండా కేవలం పై పైన మాట్లాడడం మనం చూస్తాం. సామాజికంగా , ఆర్థికంగా వెనుకబడిన  తరగతులకు చెందిన విద్యార్థులు ప్రతిభను ప్రదర్శిస్తే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని ఇందులో పేర్కొన్నారు. అంటే ఎంతో కష్టంగా విద్యను అందుకున్న ఏ కొందరికో తప్ప మెజారిటీ విద్యార్థులకు ఆర్థిక సాయం, రాజ్యాంగపరమైన హక్కుగా ఉన్న రిజర్వేషన్లు నిరర్ధకం అవుతాయని అర్థం. ఇదివరకే ఉన్నత విద్యారంగంలో ప్రైవేటీకరణ ప్రవేశించి శరవేగంగా విస్తరిస్తున్న నేటి సందర్భంలో జావివి-2020  కూడా దానినే బలోపేతం చేస్తుంది. ఈ విద్యా విధానం వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ప్రైవేటు/ దాతృత్వ విశ్వ విద్యాలయాలు స్కాలర్ షిప్ లను అందజేస్తాయని పేర్కొన్నది. కానీ నిజంగా జరగబోయేది ఏమిటంటే- బలహీన, బడుగు వర్గాల విద్యార్థులకు మున్ముందు విద్యను పొందడం మోయలేని ఆర్థిక భారంగా పరిణమిస్తుంది లేదా ప్రభుత్వం ద్వారా ప్రజా ధనం పైన పేర్కొన్న విశ్వవిద్యాలయాలకు బదిలీ అవుతుంది.

ఈ జా.వి.వి-2020 ‘విశ్వగురు’, ‘విజ్ఞాన మహాశక్తి’  లాంటి సాంస్కృతిక జాతీయవాద భాషనుఉపయోగిస్తూ అంతర్జాతీయ, దేశీయ కార్పొరేట్లు ఆదేశించినట్లుగా ప్రపంచీకరణ ఎజెండానే ముందుకు తీసుకుపోతుంది. ఇండియా నిజంగా విశ్వ గురువు కావాలంటే మన విశ్వ విద్యాలయాలను విదేశాలలో నెలకొల్పాలి గాని,  విదేశీ విశ్వ విద్యాలయాలను మనదేశంలోకి ఆహ్వానించకూడదు. ప్రపంచ బ్యాంకు ఇదివరకే మన దేశంలోని పాఠశాల విద్యారంగాన్ని ఆక్రమించి మూడవ దశలోకి అడుగు పెడుతున్నది. మొదటి దశలో జిల్లా ప్రాథమిక విద్యా ప్రాజెక్టు(DPEP)ను , రెండవ దశలో సర్వ శిక్ష అభియాన్(SSA)ను ప్రవేశపెట్టింది. జా.వి.వి-2020 ని ఆమోదించే ముందే సమగ్ర శిక్ష అభియాన్(SSA) అనే అతిపెద్ద ప్రాజెక్టును భారత ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే స్టార్స్(STARS) అనే మూడవ దశ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికి 2020 నుండి 2025 వరకు ప్రపంచ బ్యాంకు నుండి ఒక శాతం సహకారం అప్పు రూపంలో లభిస్తుంది.

ఇలా 2020 లో పరస్పర విరుద్ధమైన అంశాలెన్నో  ఉన్నాయి. ఉదాహరణకు, ఈ విధానం సంస్థాగత స్వయం ప్రతిపత్తిని, సృజనాత్మకతను పెంపొందిస్తుందని గొప్పగా భ్రమాత్మక  ప్రకటనలు చేసినప్పటికీ అది మోసపూరితమే. ఎందుకంటే- విద్యా ప్రైవేటీకరణలో అంతకంతకూ అధికార కేంద్రీకరణే తప్ప సమాఖ్య లక్షణం బలపడదు. పైగా విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, విధానపరమైన నిర్ణయాలన్నీ కేంద్రం చేతిలోనే ఉంటాయి. ఈ విద్యా విధానం స్థానిక భాషలను, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను కాపాడుతానని నొక్కి చెప్పినప్పటికీ, అందులో ప్రతిపాదించిన కేంద్రీకరణ చర్యలన్నీ భాషా, జ్ఞాన క్రమాలకు సంబంధించి ఏకరూపతను, సామాజిక ఆధిపత్యాన్ని  ప్రోత్సహించేవిగానే ఉన్నాయి. నిజానికి విద్యారంగం లోని అన్ని స్థాయిలలో జ్ఞానోత్పత్తికి, జ్ఞాన ప్రసారానికి ఏ భాషనైనా ఉపయోగించవచ్చు. కానీ చారిత్రిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని నిర్దిష్టమైన భాషలను తగిన లిపి, పదసంపద లేని కారణంగా మనం ఉపయోగించలేం.

 విద్యాహక్కు చట్టం-2009 లో సాధ్యమైనంత మేరకు 1 నుండి 8 వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలని చేసిన నిర్దేశాన్ని ఈ జా.వి.వి-2020 లో తెలివిగా 5 వ తరగతి వరకు తగ్గించారు. పైకి మాత్రం, వీలైతే 8 వ తరగతి వరకు మాతృభాషలో బోధించండని సన్నాయి నొక్కులు నొక్కారు. అంటే, ప్రాథమిక విద్యను ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడానికి పబ్లిక్, ప్రైవేట్ స్కూళ్లను అనుమతించడం తప్ప ఇది మరేమీ కాదు. కనుక జా.వి.వి-2020 లో  5 వ తరగతి వరకు, వీలైతే  8 వ తరగతి వరకు మాతృభాషనే బోధనా భాషగా ఉపయోగించాలని చేసిన సిఫారసులు ఒక రాజీ ధోరణితో చేసినవే గాని కొత్తవేమీ కాదు. అదేవిధంగా ఇందులో ఉన్నత విద్యకు సంబంధించి స్థానిక, ప్రాంతీయ భాషలలో విద్యా బోధన చేయాలని చెప్పిన సిఫారసులు కూడా శుష్క వాగ్దానం కిందికే వస్తాయి. ఎందుకంటే- వివిధ కోర్సులలోని విషయ పరిజ్ఞానాలను ఆ స్థానిక భాషలలోకి ఇప్పటికీ అనువాదం చేయనే లేదు. ఇంకా జా.వి.వి-2020 కొన్నిచోట్ల ‘బహు భాషల’ గురించి ప్రస్తావించింది గాని ‘కొన్ని భాషలనే’ ఉద్దేశించినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ విద్యా విధానం భాషను ఒక సాంస్కృతిక కోణంలో తప్ప ఇతర కోణాలలో చూడలేకపోయింది.

 అలాగే కొఠారీ కమిషన్ నివేదికలో చెప్పిన ‘కామన్ స్కూల్ విధానం’ అనే సిఫారసును పట్టించుకోకుండా కేవలం ‘స్కూల్ కాంప్లెక్స్’ అనే భావనను మాత్రమే తీసుకోవడం, నిధుల కొరత గల విద్యాసంస్థలను వదిలేసి తగిన నిధులు ఉన్న విద్యాసంస్థలకు మరిన్ని ఆర్థిక సదుపాయాలను అందించడం లాంటివి విద్యా హక్కు చట్టం లోని నిబంధనలు, ప్రమాణాల ఆవశ్యకతను నిర్లక్ష్యం చేయడమే అవుతుంది. ‘లాభాపేక్ష లేని’ దాతృత్వ సంస్థల పేరిట విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూనే ‘విద్యా వ్యాపారీకరణ నివారణ’ గురించి మాట్లాడడం తప్ప ఈ విద్యా విధానం ఎటువంటి కొత్త పటిష్టమైన చర్యలను ప్రతిపాదించలేకపోయింది.

అలాగే ఈ విధానం ఉపాధ్యాయుల భద్రత, సర్వీసు పరిస్థితుల గురించి పూర్తి మౌనం పాటిస్తూనే ఉపాధ్యాయుల ప్రాధాన్యతను నొక్కి చెప్పింది. పైగా సమాజంలో అవకాశాలు అందని వెనుకబడిన తరగతులకు చెందిన మెజారిటీ విద్యార్థులకు eవిద్యా కార్యక్రమాల కింద, అనేక టీవీ, రేడియో చానళ్ళ ద్వారా కేంద్రీకృత, ఏకరూప ఆన్ లైన్ విద్యా బోధనను ప్రోత్సహిస్తూనే, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను జత కలిపే సిఫారసు ద్వారా, 5-10 కి.మీ. పరిధిలో స్కూల్ కాంప్లెక్స్ లను ప్రతిపాదించడం ద్వారా ఈ విద్యా విధానం ఉపాధ్యాయులను అనేక పాఠశాలలను సంచరించే దేశదిమ్మరి వృత్తి ఉద్యోగులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది.

ఇంకా నియత విద్యారంగంలో విద్యావంతులు గాని వారిని ఉపాధ్యాయులుగా, నైపుణ్య బోధకులుగా, పరిపాలకులుగా ఈ విద్యా విధానం అనుమతించడం వల్ల రెగ్యులర్ ఉపాధ్యాయుల స్థాయి తీవ్రంగా దిగజారిపోతుంది. ఎంతో కాలంగా కొనసాగుతూ నిర్దిష్ట కాలపరిమితిలో దానంతట అదే ముగిసే ప్రొబేషన్ పద్ధతికి భిన్నంగా, ‘టెన్యూర్ ట్రాక్’ పేరిట కొన్ని కొత్త ప్రొబేషన్ నిబంధనలు  విధించడం ద్వారా ఈ జా.వి.వి-2020 ఒక ప్రత్యేక భావజాలం గల ఉపాధ్యాయులను మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా, మిగతా వారిని కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించమని నిర్దేశించి యావత్ పాఠశాలల, కళాశాలల మౌలిక పాత్రనే మార్చబోతుంది. సాంకేతికతను విద్యలో సమ్మిళితం చేసే పేరిట అనుసరించే విధానాలు దీర్ఘకాలిక విద్యా లక్ష్యాలను దెబ్బతీసి ఉద్యోగులను ఆధిపత్యానికి లోబర్చేలా బలవంత పెడతాయి. జా.వి.వి-2020 ‘స్వేచ్ఛాయుత’ ఎంపిక పేరిట అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయపరమైన సామాజిక హెచ్చుతగ్గులను పునరుత్పత్తి చేస్తుంది. 8 వ తరగతి తర్వాతనే వృత్తి విద్యను అందిస్తామని చెబుతున్నప్పటికీ, వృత్తి విద్యను ఒక విడి కోర్సుగా అమలుపరిచే ప్రమాదం ఉన్నది. వృత్తి విద్యను శ్రమ ద్వారా అభ్యసించే ఒక బోధనా పద్ధతిగా కాకుండా  నైపుణ్య భారత మిషన్ లో భాగంగా కేవలం పారిశ్రామిక అవసరాలను తీర్చే చౌక శ్రామికులను ఉత్పత్తి చేయడమే ధ్యేయంగా ఈ విద్యా విధానం కొనసాగే అవకాశం ఉంది.

విచిత్రంగా జా.వి.వి-2020 ఒకవైపు (ఒక విషయాన్ని ముక్కలుగా కాకుండా మొత్తంగా అర్థం చేసుకునే) సంపూర్ణ దృక్పథం కలిగిన విద్యార్థులను తయారు చేసే లక్ష్యాన్ని ప్రకటిస్తూనే, మరోవైపు పాఠశాల పూర్వ దశ నుండి ఉన్నత విద్య వరకు ప్రతి దశలో కొన్ని ‘నిర్ధారిత నైపుణ్యాలను, విలువలను’ పొందుపరిచింది. సంపూర్ణ దృక్పథం కలిగిన విద్యార్థులు తయారు కావాలంటే వాళ్ల అంతర్గత  సామర్ధ్యాలు వికసించే స్వేచ్ఛ కావాలి గాని ఇలాంటి నిర్ధారిత నైపుణ్యాలు, విలువలు పనికి రావు. అవి విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిని అరికట్టి అధికారంలో ఉన్న ఆర్ ఎస్ ఎస్, బిజెపి వంటి రాజకీయ వర్గాల భావజాలాన్ని మాత్రమే పెంపొందిస్తాయి. అంతేగాదు,  జా.వి.వి-2020 యావత్ ఉన్నత విద్యను నియంత్రించే భారత  ఉన్నత విద్యా

కమిషన్ అనే ఒక సర్వాధికార కేంద్ర సంస్థను నెలకొల్పాలని ప్రతిపాదిస్తుంది. ఇందులో జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ మండలి(NHERC), జాతీయ గుర్తింపు ధ్రువీకరణ మండలి(NAC), ఉన్నత విద్యా విరాళాల మండలి(HEGC), సాధారణ విద్యా మండలి(GEC) నాలుగు ఉపసంస్థలు ఉంటాయి. మొదటి రెండు సంస్థలు దేశంలోని ఉన్నత విద్యా నిర్వహణను నియంత్రించేవిగా ఉండగా, మూడవది ఆర్ధిక నిధుల కోసం కాగా, నాల్గవది ఉన్నత విద్యాసంస్థలలోని విద్యా ఆవరణంలో జోక్యం చేసుకొని ఆశించిన అభ్యసన లక్ష్యాల కోసం పనిచేస్తుంది. మొత్తానికి  దేశంలోని  ఉన్నత విద్యాసంస్థలలో సాగే యావత్ విద్యా ప్రక్రియను నియంత్రించే ఒక విశాల చట్రాన్ని ఈ జా.వి.వి-2020 నిర్దేశించిందని చెప్పవచ్చు. అటువంటి కేంద్రీకృత నియంత్రణలో భాగంగానే 4  సం.ల పూర్వస్నాతక కోర్సును( 4-year Undergraduate Course), నైపుణ్యాల అభివృద్ధి కోర్సులను(Skill Enhancement Courses), అదనపు కోర్సులను(Value Added Courses) ఇందులో మనం చూడవచ్చు.

అన్నిటికీ మించి కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో మౌలిక పరిశోధనను ప్రోత్సహించి పెంపొందించడానికి, ఉత్తమ పరిశోధనకు నిధులు కేటాయించడానికి ఒక జాతీయ పరిశోధనా సంస్థ(NRF) ను నెలకొల్పాలని ఈ విద్యా విధానం ఆదేశిస్తుంది. అంటే, ఇది దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలలో జరగబోయే పరిశోధనను కేంద్ర ప్రభుత్వంచే నియంత్రించే చర్యేనని స్పష్టమవుతుంది. ఇందులో మానవ నాగరికత వికాసానికి పరిశోధన, జ్ఞానోత్పత్తి చాలా అవసరమని అనేక చోట్ల చెబుతూనే, ఇటువంటి కేంద్రీకృత జాతీయ పరిశోధనా సంస్థను నెలకొల్పాడమంటే మౌలిక మానవ ఆలోచనలను, దేశీయ పరిశోధనా ప్రక్రియలన్నింటినీ అస్మదీయ కార్పోరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా నియంత్రించి నిర్దేశించడమే తప్ప వేరుగాదు.

 అలాగే ఒక జాతీయ పరీక్షా సంస్థ(NTA) ద్వారా దేశంలోని ప్రవేశ పరీక్షలన్నింటినీ కేంద్రీకృతంగా నిర్వహించాలని ఈ జా.వి.వి-2020 ప్రతిపాదించింది. అంటే, సమాఖ్య రాజకీయ వ్యవస్థలో వివిధ రాష్ట్రాల హక్కులకు భంగకరంగా ఈ పరీక్షలన్నీ నిర్వహించబడతాయని అర్థం. ఉన్నత విద్యారంగంలో ఇప్పుడున్న అధ్యాపకుల అకడమిక్ మండలి, కార్యనిర్వాహక మండలి లాంటి వాటిని తొలగించి అచ్చంగా మార్కెట్ శక్తులచే ఆర్ ఎస్ ఎస్ లాంటి పాలకవర్గానికి చెందిన మేధావులచే రూపొందించబడిన గవర్నర్ల బోర్డులు ఉన్నత విద్యా సంస్థలను పరిపాలించాలని జా.వి.వి-2020 ప్రతిపాదించింది. ఇంతకుముందు అనేకచోట్ల తీవ్ర పదాడంబరంతో ఉన్నత విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని ప్రకటించిన ఈ విద్యా విధానమే ఈ రకమైన ఏకైక కేంద్ర నియంత్రణ సంస్థను ప్రతిపాదించి, ‘లైట్ గా కానీ టైట్’ గా నియంత్రణ ఉండాలని సిఫారసు చేయడం ఎవరికైనా  ఆశ్చర్యం కలిగించే విషయమే. పైగా వేలాదిమంది విద్యార్థులను ఆకట్టుకునే పెద్ద ఉన్నత విద్యాసంస్థల, పలు శాస్త్రాలను ఏకకాలంలో బోధించే క్లస్టర్ విశ్వవిద్యాలయాల ప్రాధాన్యతను ఈ జాతీయ విద్యా విధానం నొక్కి చెబుతున్నదంటే, వీటిని స్పష్టంగా బడా కార్పోరేట్ కంపెనీలకు లాభదాయక వనరులుగా మార్చే ప్రయత్నంగానే భావించాలి. ఇది కచ్చితంగా నిర్దిష్టమైన విద్యా లక్ష్యాలతో వివిధ చారిత్రక పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన ఎన్నో చిన్నస్థాయి ఉన్నత విద్యాసంస్థలను దెబ్బతీస్తుంది.

ఇంకా గ్రేడ్ లవారీ గుర్తింపునిచ్చే విధానం ద్వారా కళాశాలలకు గ్రేడ్ లవారీ స్వయంప్రతిపత్తిని కల్పించే దశల వారీ విధానాన్ని నెలకొల్పాలని ఈ జా.వి.వి.లో ప్రతిపాదించారు. ఇది కచ్చితంగా ఇదివరకే ఉన్న విశ్వవిద్యాలయ పరిధిలో ఉండి మెరుగ్గా పనిచేసే ఉన్నత విద్యాసంస్థలను ప్రత్యేక విశ్వవిద్యాలయాలుగా మార్చడమే అవుతుంది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అపఖ్యాతి పొంది మూసి వేయబడతాయి.

ఇప్పుడున్న 3 సం.ల డిగ్రీ కోర్స్ తో పాటే 4 సం.ల డిగ్రీ కోర్సును, అలాగే 2 సం.ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ తో పాటే 1 సం. పి.జి. కోర్సును కూడా అందించే సంస్థాగత స్వేచ్ఛను కూడా ఈ జా.వి.వి లో కల్పించారు. దీంతో అనవసరమైన గందరగోళం, ఉద్యోగ అర్హతల విషయంలో తీవ్ర సంక్లిష్టతలు తలెత్తుతాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును ఒక సంవత్సరానికి తగ్గించి ఎం.ఫిల్ ను తీసివేయడమంటే- నాణ్యమైన పరిశోధనకు ఆవశ్యకమైన విషయ పరిజ్ఞానాన్ని బలహీనపరిచి, విద్యార్థుల విద్యా ప్రమాణాలను దిగజార్చడమే అవుతుంది. ఇలా డిగ్రీ స్థాయిలో ఒక్కొక్క సంవత్సరాంతంలో బహుళ నిష్క్రమణ మార్గాలను ప్రవేశపెట్టే  ప్రతిపాదన మరోచోట ఈ విద్యా విధానమే ప్రకటించిన సంపూర్ణ దృక్పథంతో వివిధ శాస్త్రాలను బోధించే విద్యా లక్ష్యానికి పూర్తి విరుద్ధమైనది. 4 సంవత్సరాల డిగ్రీ కోసం వేర్వేరు విభాగాలుగా విభజించబడిన ఒక కోర్స్ ను రూపొందించామని చెబుతూనే, ఒక్కొక్క సంవత్సరాంతంలో విద్యను ఆపివేసే విద్యార్థులకు ఒక్కొక్క డిగ్రీని ప్రదానం చేయడమనేది ఎంత మాత్రం అభివృద్ధికరమైన విద్యా విధానం కాదు. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు, ప్రత్యేకించి స్త్రీలు  విద్యను అందుకోవడంలో ఎదుర్కొనే వైఫల్యాలను కప్పిపుచ్చే విధానంగానే దీనిని చూడాల్సివుంటుంది. విద్యార్థులు తమ విద్యను ఒక్కసారి ఆపివేసి కుటుంబాదాయం కోసం ఏదో ఒక ఉద్యోగంలో చేరితే, ఇక వారు మళ్లీ విద్యా ప్రపంచంలోకి అడుగుపెట్టడమనేది  ఎంతో కష్ట సాధ్యమైన విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే- మధ్యలోనే విద్యను ఆపివేసిన( డ్రాప్ అవుట్స్ ) లేదా విద్య నుండి నెట్టి వేయబడిన (పుష్ అవుట్స్) విద్యార్థుల సంఖ్యను మరుగుపరిచే దుష్ట ప్రయత్నం ఇది.

ఇలా జా.వి.వి.లో ఉన్న ఎన్నో పరస్పర విరుద్ధమైన అంశాలన్నీ యాదృచ్ఛికమైనవి కానే కాదు. లోతుగా ఆలోచిస్తే అవి తెలివైన  వ్యూహాత్మకమైన రాజ్య విధానపు విన్యాసాలేనని స్పష్టమవుతుంది. బహుశా రాబోయే రోజులలో నిజంగా ఆశాజనకమైన పరిష్కారాల కంటే రాజీ పరిష్కారాలే రాజకీయ అధికార వర్గాలకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయేమో. ఎందుకంటే- కొఠారీ కమిషన్ కు కార్యదర్శిగా ఉన్న ప్రఖ్యాత విద్యావేత్త జె.పి. నాయక్ ఆ తర్వాత 1975లో రాసిన “Equality, Equity & Quantity” అనే గ్రంథాన్ని చదివే నేను ఈ విషయం చెబుతున్నాను. కొఠారీ ప్రధానంగా ప్రతిపాదించిన  కామన్ స్కూల్ విధానాన్ని పక్కనపెట్టి నాయక్ గారు కొన్ని మధ్యంతర విధానాలను వ్యూహాత్మకంగా ప్రతిపాదించారు. వాటిని భారత రాజకీయ అధికార వర్గాలు వివిధ విద్యా విధానాలలో అనుసరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జా.వి.వి-2020 కూడా అటువంటి నాసిరకం ప్రమాణాలు గల పరిష్కారాలనే సూచిస్తున్నందువల్ల భారత విద్యారంగంలోని పరిస్థితి మెరుగైన రీతిలో మారదు గాక మారదు అని చెప్పవచ్చు. ఎప్పటిలాగే ఉన్నత వర్గాల/ కులాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతూ ఉంటే, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాసిరకమైన విద్య అందించబడుతూ ఉంటుంది. 1882 లో హంటర్ కమిషన్ కు సమర్పించిన నివేదికలో జ్యోతిరావు ఫూలే చెప్పినట్లుగా- యావత్ జాతి సంపదను సృష్టించినప్పటికీ, నిజమైన ఆ సంపద సృష్టికర్తలే ‘అజ్ఞానంలో మునిగిపోతారు’ అన్నది అక్షర సత్యమే. అలాగే జా.వి.వి-2020లో ప్రతిపాదించబడిన విద్యా చట్రం గాంధీ చెప్పినట్లుగా- ‘అట్టడుగు వ్యక్తి’ని ప్రమాణంగా తీసుకొని రూపొందించినది కానే కాదు.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన కొన్ని పెట్టుబడి దేశాలు, కొన్ని కమ్యూనిస్టు దేశాలు వాటి జాతీయ అభివృద్ధి కోసం పబ్లిక్ విద్యా విధానంలోనూ పెట్టుబడులు పెట్టాయి. కానీ వ్యూహాత్మకంగా ‘విద్య కోసం డబ్బు చెల్లించలేని వారికి’ మాత్రమే విద్యనందించమనే దౌత్యనీతిని మనలాంటి దేశాలకు బోధిస్తాయి. అలాగే సుమారు 250 ఏళ్ల క్రితం 1776 లోనే “జాతుల సంపద” అనే గ్రంథంలో ఆడమ్స్ స్మిత్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రతి జాతి ఆర్థిక అభివృద్ధిలో ‘రాజ్యపు అదృశ్య హస్తం’ సహజంగా ఉంటుందని చెబుతూనే, విద్యను మాత్రం మార్కెట్ కు బయట ఉంచాలని వివరిస్తాడు. కానీ మన ప్రస్తుత (బిజెపి) భారత ప్రభుత్వమేమో సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రచారం చేస్తూ ఆ దౌత్యనీతిని ఏమాత్రం చెవికెక్కించుకోవడం లేదు.

కాబట్టి జా.వి.వి-2020 లోని నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలంటే- మనం దాని భాషాలంకారపు ముసుగుల్ని చేధించి, అందులోని కీలక ప్రతిపాదనలను తాజాగా సందర్భికరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే, గత 30 ఏళ్లకు పైగా కార్పొరేట్ పెట్టుబడుదారులే రాజ్యంలోని ప్రజా వ్యవస్థలన్నింటిపై  ఆధిపత్యం చెలాయిస్తూ వాటి బలహీనపరుస్తున్న నేటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని జా.వి.వి- 2020 ని లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది.

(రచయితా అసోసియేట్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ ; అధ్యక్షవర్గ సభ్యులు, అఖిల భారత విద్యాహక్కు వేదిక )

Leave a Reply