ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో  అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు.

పైకి  కథ  తాగునీటి సమస్య చుట్టూ  నడుస్తుంది. సారాంశంలో  కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది.

ఒకానొక  కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి  లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం  పడే  తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ  కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో  చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన  వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు  నీటిని సరఫరా చేయడం కంటే  సారాయి సరఫరాకే  రాజకీయ నాయకులు, వాళ్లు నడిపే ప్రభుత్వాలూ  వుబలాటపడుతుంటాయి.

మన కథానాయకుడు శీనూ  నిద్రలేస్తానే భార్య చవితి పండుగ నాడు నీళ్లు విడువని పంచాయతీ బాధ్యులను బండబూతుల మధ్యా” …గీపంచాయితోల్లకి ఆటయిపోయింది. గదే గాతుర్కోల్లయితే ముడ్డి మీద తంతరు. వాల్లది యా చిన్న పండుగొచ్చినా , చచ్చినట్టు ఇడుస్తరు భాడుకావు కొడ్కులు…” అంటుంది. ఈయన కూడా, ” ఔనుమల్ల , ఆల్లయితేనే ఈల్లకు సరిపోతారు..మనోల్లకేమొదమ్ముల్లేవాయె..” ఆమెకు వంత పాడతాడు. ఇక ఆతర్వాత సైకిల్ కి ఖాళీ బిందెలు కట్టుకొని  నీటి సేకరణ కోసం వూరి మీద పడతాడు.  అంజయ్య గౌడ్ అనే మిత్రుడు నీళ్లిస్తానని చెప్పి భార్యతో లేదనిపిస్తాడు. ఇంకో పెద్దకులమామె నీళ్లు లెట్రిన్ లోకైనా వదులుకుంటాను గానీ నీకివ్వనంటుంది. మన మతమే అనుకునేవాళ్లెవరూ వులకరూ బిందెడు నీళ్లకు పలకరు. నిరాశగా యిక యీ రోజు పండగలేదు అనుకుంటూ  వెనక్కొచ్చేప్పుడు, నవ్వుతూ పలకరించాడు ఉస్మాన్ భాయ్. గల్లలుంగీ, రెట్టల బనీనూ, ఉంగరాల జుత్తు, గుండ్రటి నల్లటి ముఖమూ గల ఉస్మాన్  మామూలుగా అయితే, మన కథానాయకుడికి నచ్చేవాడు కాదు. క్యాభై పానీకేలియే క్యా  అనడిగినప్పుడు. ఖాళీ బిందెలు పరెషాన్లో, ఔ భాయ్ సాబ్, నీళ్లు లేకపోతే పండుగెట్లా చేయాల్నో అర్థమయితలేదని  సమాధానమిస్తాడు. ఉస్మాన్  ఆదరంగా నీళ్లిస్తానంటాడు. ఈయన నమ్మలేకపోతాడు. ఉస్మాన్ ఇంట్లో నిజంగానే నీళ్లు దొరుకుతాయి. ఉస్మాన్ భార్య సలామాలేకుమ్ చెప్పి తాగడానికి మంచి నీళ్లిస్తుంది. శీనూకు  పొద్దుటి నుంచి పొందిన అలసట తీరుతుంది.

శీను తాతతండ్రుల మీద రజాకార్లు దాడులు చేసుంటారు. ఆచార వ్యవహారాలు మధ్యా అంతరముంది. చుట్టూ పరిస్థితులు ముస్లిం ద్వేషాన్ని పెంచుతూంటాయి. రాజకీయాలు విషప్రచారం చేస్తుంటాయి, వీటన్నిటి వల్ల ముస్లింలను ద్వేషిస్తున్నాం కదా అనే సత్యాన్ని శ్రీనూ  గుర్తిస్తాడు. కృతజ్ఞతతో, ఎవరడిగినా నీళ్లివ్వలేదు. మా మతం వాడివి కాకపోయినా నీళ్లిచ్చావు. ఈ పండుగ నీ పేరుమీద జరుపుకుంటానంటాడు. గదేంది భాయ్ గట్లంటావు….మతం కన్నా మనిషి ముఖ్యంగదా , అంటాడు ఉస్మాన్. శీనూ చదువుకున్నవాడూ, విషయాలను జనాలకు చెప్పగలవాడే అయినా, ఉస్మాన్ వల్ల చీకటి నిండిన హృదయంలోకి ఓ కొత్త వెలుతురు ప్రసరించింది. పండుగ పూట పాయసం తీసుకుని ఉస్మాన్ యింటికి బయల్దేరుతాడు.

చాలా సాధారణ కథలా కన్పిస్తుంది. కాలానికి నిలిచే కథై నిలబడుతుంది. నిద్రలేస్తూనే వాళ్ల సమస్యకు సంబంధం లేకున్నా, ఒకానొక అలవాటుపడిన ధోరణిలో, దేశ సమస్యలన్నింటికీ ముస్లింలే కారణమనుకునే  జనాలు చాలామందే వున్నారు. ఒకానొక  స్థిరీకరణ చెందిన మనస్తత్వం తో ధ్వేషం వెళ్లగక్కుతూ వుంటారు. వాళ్ల మూలాల్లో యేవో అనుమానాల వల్ల, చిన్నపాటి భిన్నత్వాలను అఖాతాలుగా వూహించుకుంటూ వుంటారు. ఇలాంటి వాళ్లకు యీ కథ యేదో మేరకు కదలిక కల్గించగలుగుతుంది. ఈ కథలోని ప్రొటాగనిస్టు లాగా ముస్లింలతో నిజ అనుభవం అందరి అనుభవం అవుతుందా అన్నదానితో  సంబంధం లేకుండా, కనీసం దళిత సమూహం వరుకూ అయినా యిది నిజమైతే బాగుండు అనే ఆకాంక్షను వ్యక్తం చేసింది కథ. మామూలుగా  ప్రారంభమై అసాధారణంగా ముగుస్తుంది.

Leave a Reply