ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల మోసపు బాగోతాల గుట్టు లోకానికి తెలిసొచ్చినట్లయింది. గతంలో క్రెటిడ్‌ సైట్స్‌ అనే పరిశోధక కంపెనీ ఒక నివేదికను విడుదల చేస్తూ అదానీ గ్రూపుకి తగిన అర్హత లేకున్నా మోడీ ప్రభుత్వం నుండి అవకాశాలు లభిస్తున్నాయని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ గ్రూపు పెద్దలతో క్రెడిట్‌ సైట్స్‌ సమావేశమైంది. దాంతో అది మెత్తబడి తన విమర్శను కూడా మెత్త బరిచింది. ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ తన నివేదికకు కార్పొరేట్‌ కంపెనీల చరిత్రలోనే అతి పెద్ద కంపెనీని ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్నుడైన అదానీ ఎలా నడిపిస్తున్నారు అనే శీర్షికతో విడుదల చేసింది.

            హిండెన్‌బర్గ్‌ రెండేళ్లపాటు శోధించి తయారుచేసిన ఈ నివేదిక బిజెపి, కార్పొరేట్ల కుమ్మక్కును మరోసారి బట్టబయలు చేసింది. బ్రాహ్మణీయ హిందూత్వ సాంస్కృతిక ఆధిపత్యం, కార్పొరేట్‌ ఆధిపత్యం రెండూ కలిస్తే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు అదానీ వ్యవహారంలో చూస్తున్నాం. దశాబ్దం క్రితం వరకు కార్పొరేట్‌ ప్రపంచంలో నామమాత్రమైన అదానీ మోడీ ప్రభుత్వ హయాంలో 120 బిలియన్ డాలర్ల (9.8 లక్షల కోట్ల రూపాయలు) సంపద పోగేసుకున్నాడు. ఇందులోనూ 10,000 కోట్ల డాలర్లు కొవిడ్‌ తదనంతర మూడేళ్ల కాలంలో పోగుచేసుకున్నాడు. అమెరికాకు చెందిన అతి చిన్న మదుపరుల సంస్థ భారతదేశంలోని అతి పెద్ద, శక్తివంతమైన అదానీ గ్రూప్‌ను సవాలు చేసి, దాని పునాదులనే కదిలించేసింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి అనే ఈ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ అదానీ గ్రూపుపై 129 పేజీలతో నివేదిక వెలువరించింది. అదానీ గ్రూపునకు చెందిన ఏడు కంపెనీలతో సంబంధమున్న 578 అనుబంధ సంస్థల, షెల్‌ కంపెనీల నిధుల సేకరణ కార్యకలాపాలు, దేశం వెలుపల సాగించే కార్యకలాపాల గురించి అనేక ఆధారాలను అందులో పొందుపరిచింది. ఇది ‘కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద మోసం’గా హిండెన్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది. నిధులు, బూటకపు కంపెనీల సంక్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఈ నివేదిక బయటపెట్టింది. ఈ షెల్‌ కంపెనీల్లో కొన్ని మారిషస్‌లో సైప్రస్‌లో, యుఎఇలో ఉన్నాయి.

            అదానీ గ్రూపుకు చెందిన ఏడు కీలకమైన లిస్డెట్‌ కంపెనీల షేర్ల ధరలు అమాంతం 819 శాతం పెరిగాయి. లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేయడానికి తెలివిగా ఈ షెల్‌ కంపెనీలను ఉపయోగించారు. అధిక రుణాలు, అంతంతమాత్రం ఆస్తులు మాత్రమే ఉన్న ఈ సంస్థల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉందని, రుణాలను చెల్లించగలిగే సామర్థ్యం వాటికి ఉందని చెప్పుకునేందుకు లిస్టెడ్‌ కంపెనీల ఆస్తి అప్పుల పట్టీ (బ్యాలన్స్‌ షీట్‌)లను చూపించారు. వాటికి డబ్బును మళ్లించడానికి ఈ డొల్ల కంపెనీలను వాడుకున్నారు. అదానీ కంపెనీల విలువను వాస్తవిక రేటు కన్నా దాదాపు 85 శాతం ఎక్కువ చేసి చూపారని ఆ నివేదిక అంచనా వేసింది. స్టాక్‌ మార్కెట్‌లో దారుణమైన అవకతవకలకు పాల్పడుతూ, అకౌంటింగ్‌లో పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడడం ఇదంతా అదానీ గ్రూపు ఒక పక్కా పథకం ప్రకారం చేసిన చర్యగా హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపించింది. మరో పాశ్చాత్య పత్రిక బ్లూమ్‌బర్గ్‌ బిజినెస్‌ వీక్‌ మ్యాగజైన్‌లో భారత ప్రజలను, ఆర్థిక వ్యవస్థను అదానీ-మోడీ స్నేహం, అదానీ అక్రమాలు, అదానీ గ్రూప్‌ షేర్ల పతనం తదితర అంశాలను కవర్‌ స్టోరీగా ప్రచురించింది.  

            హిండెన్‌బర్గ్‌ రిపోర్టులో లేవనెత్తిన పలు అంశాలు, ప్రశ్నలపై అదానీ సమాధానం చెప్పకుండా, తమను దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని ఎదురుదాడి చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదికను ‘భారత్‌పై ఒక పథకం ప్రకారం జరిగిన దాడి’ అంటూ అదానీ గ్రూపు ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.‘‘ఇది ఏదో ఒక కంపెనీపై చేస్తున్న దాడికాదు. భారతదేశం, దాని స్వతంత్రత, సమైక్యత, భారతీయ సంస్థలు, వృద్ధి, ఆశయాలపై కుట్రపూరితంగా చేస్తున్న దాడి’’ అని చెప్పడం వెనుక తన కార్పొరేట్‌ ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ దోపిడీని కప్పిపుచుకోడానికి అదానీ చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే, తన వాదనను సమర్థించుకోవడానికి అది ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. జాతీయవాదం ముసుగులో తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అది ప్రయత్నించింది. ‘‘భారతదేశ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యత, వృద్ధి కథనం, వడివడిగా అడుగులు వేయాలన్న భారత్‌ ఆకాంక్షను చూసి సహించలేకనే ఈ రకమైన దాడి’’ చేస్తున్నారని గావు కేకలు పెడుతోంది. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ మౌత్‌పీస్‌ ‘ఆర్గనైజర్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. అదానీ గ్రూప్‌పై దాడి భారతీయ ఆర్థిక వ్యవస్థపై దాడిగా పేర్కొంది. భారతీయ కంపెనీల విశ్వసనీయతను దెబ్బతీసి, అనుమానాలు వ్యాప్తి చేసేందుకు ఈ దాడి జరుగుతోందని పేర్కొంది. అదానీకి వ్యతిరేకంగా 2016-17 నుంచే కుట్ర జరుగుతోందని, ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల కాంట్రాక్ట్‌ తీసుకున్న అదానీకి వ్యతిరేకంగా ఓ ఎన్జీవో ‘అదానీ వాచ్‌ ఆర్గ్‌’ అనే సైట్‌ ప్రారంభించిందని అదానీని అప్రదిష్ట పాలు చేయడమే దాని ఉద్దేశమని పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదికలో భారత వామపక్షాలు, చైనా బహుళజాతి సంస్థలు, చైనాకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ కుట్రలో భాగమయ్యాయని అంటూ అదానీని వెనుకేసుకొచ్చింది. ఇవాళ దేశభక్తి, జాతీయత ముసుగులో తమ అక్రమాలను కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్న అదానీ గానీ, ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ప్రభుత్వానికి గానీ విదేశీ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టేటప్పుడు గానీ, సామ్రాజ్యవాద అమెరికాతో (వలసవాద దృక్పథంతో) కూటములు కట్టినప్పుడు దేశభక్తి గుర్తుకు రాకపోవడం శోచనీయం. నిజానికి అదానీ అక్రమాల విషయంలో మోడీ ప్రభుత్వ అండతో దేశంలోని పోర్టులు, గనులు, ఇతర సహజ వనరులను చేజిక్కించుకోవడం పట్ల ప్రజలు ప్రశ్నిస్తూ, ప్రతిఘాటిస్తూనే ఉన్నారు. బ్యాంకులు పరిమితులు దాటి రుణాలు ఇవ్వడం, ఎల్‌ఐసి మిగులు నిధులను అదానీ సంస్థల షేర్లలో పెట్టుబడి పెట్టడం కూడ దోపిడీలో భాగమే.  

            అదానీ ఖండనపై ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ స్పందించింది. జాతీయవాదం పేరుచెప్పి మోసం దాచిపెడుతున్నారని, తద్వారా దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకొంటున్నారని ధ్వజమెత్తింది. ‘దేశ భవిష్యత్తుకు అదానీ గ్రూపే అడ్డంకి. ఇది ముమ్మాటికీ నిజం. ఇదే మేము నమ్ముతున్నాం’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడిరది. తమ నివేదికలో 88 ప్రశ్నలడిగితే అందులో 62 కీలక ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ సమాధానాలు చెప్పలేదెందుకని ప్రశ్నించింది. అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా తమపై నిందలు వేయడమేంటని మండిపడిరది. అదానీ గ్రూప్‌ అసంబద్ధ సమాధానాలను చూస్తే, తమ రుజువులు నిజమని అర్థమవుతున్నదని, ప్రధాన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ఆ గ్రూప్‌ తప్పించుకొన్నదని ధ్వజమెత్తింది. తమ నివేదికపై కట్టుబడి ఉన్నామని, ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హిండెన్‌బర్గ్‌ చేసిన సవాల్‌పై అదానీ వైపు నుంచి స్పందన శూన్యం.

            నిజానికి స్టాక్‌ మార్కెటే ఒక మాయ. అందులో అదానీ లాంటి మహా మాయగాళ్లు ఎన్ని కుప్పిగంతులైనా వేయగలరు. కానీ అడుగులేని ముంతలు ఎల్లకాలం నిలబడడం అసాధ్యం అన్న అంశం అదానీ విషయంలో రుజువైంది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన ఏ కంపెనీకి కూడా సాధ్యం కానంత రీతిలో అదానీ గ్రూపు షేర్ల విలువ పెరగడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. విదేశాల్లో డొల్ల కంపెనీలు (ఎటువంటి వ్యాపారాలు లేకుండానే కేవలం బోర్డులు పెట్టి కథ నడిపించే సంస్థలు) పెట్టి, వాటి పేరిట డబ్బును స్వదేశంలోని తన సంస్థలకు మళ్లించడం ద్వారా షేర్ల విలువను విపరీతంగా పెంచుకొన్నాడని, ఆ విధంగా తన కంపెనీలకు లేని, రాని వ్యాపార లాభాలు షేర్‌ మార్కెట్‌లో చూపించుకొని కృత్రిమ మార్గంలో సంపదను అత్యంత ఉన్నత స్థాయికి చేర్చుకొన్నాడనేది హిండెన్‌బర్గ్‌ వెలికితీసిన కీలక అక్రమం. పైకి రోల్‌మోడల్స్‌గా కనిపించే నల్లకోటు కార్పొరేట్ల చీకటి దందాలు హిండెన్‌బర్గ్‌ నివేదికతో మరోసారి బహిర్గతం అయ్యాయి. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీల షేర్లను తిమ్మినిబమ్మిని చేసి కృత్రిమంగా ధరలు పెంచుతున్నారు.

            అదానీ గ్రూపు అకస్మాత్తుగా, అందరి దృష్టిని ఆకర్షించేలా ఎదిగిన తీరు, చాలా వేగంగా విస్తరించిన వైనాన్ని ప్రశ్నించే స్థితే లేకుండా చేశారు. ఏళ్ళ తరబడి, గౌతమ్‌ అదానీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరుపై అనేక తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలు వచ్చాయి. బొగ్గు దిగుమతులకు అధిక మొత్తాలు చెల్లించినట్లు చూపించడం, తన కంపెనీలకు విదేశాల్లో నిధులు అందడంపై పారదర్శకత పాటించకపోవడం, పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడం, నియమ నిబంధనలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాజెక్టులను పొందిన తీరుపై మీడియాలో వాణిజ్య విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూనే వచ్చారు. కానీ, వీటిల్లో ఏ అంశంపైనా సెబి కానీ, ఆర్‌బిఐ కానీ, ఇడి వంటి ప్రభుత్వ నియంత్రణా సంస్థలు కానీ స్పందించిన దాఖలాలు లేవు. తమ మోసపూరిత లావాదేవీలను ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడానికి, అణచివేయడానికి అదానీ తమ ధన, రాజకీయ బలాన్ని ఉపయోగించారు. అదానీ ఒప్పందాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసినా, ప్రసారం చేసినా సహించలేని స్థితి.

            అదానీ గ్రూపు సంపదలో చాలావరకు దేశ సహజ వనరులను అనేక ఏళ్లుగా లూటీ చేస్తూ, ప్రభుత్వ నిధులను కొల్లగొట్టడం ద్వారా సమకూర్చుకున్నదే. అందువల్లే అదానీ గ్రూపు మోసపూరిత లావాదేవీలపై ప్రజలు ఇంతగా ఆందోళన చెందుతున్నారు. అదానీ గ్రూపు ఓడరేవులు, విమానాశ్రయాలకు సంబంధించి అతిపెద్ద ప్రైవేట్‌ ఆపరేటర్‌గా అవతరించింది. ఆహార ధాన్యాల గిడ్డంగుల్లో అతిపెద్దదిగా ఉంది, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌లో అయిదోవంతు భాగాన్ని కలిగి ఉంది, సిమెంట్‌ పరిశ్రమను శాసిస్తుంది. బొగ్గు తవ్వకాల్లో అతిపెద్ద వాటా కలిగి దేశంలోనే అతిపెద్ద థర్మల్‌ విద్యుత్‌ ప్రైవేటు ఉత్పత్తిదారుగా అదానీ గ్రూపు ఉంది. మోడీ ప్రభుత్వ చలవతోనే అదానీ ఇంత వేగంగా ఎదిగాడనేది నిర్వివాదాంశం.

            అదానీ కంపెనీ షేర్లను తాకట్టుపెట్టి బ్యాంకుల నుండి అడ్డగోలుగా అప్పులు తెస్తున్నారు. అందినకాడికి పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉన్న సింగపూర్‌, మారిషస్‌, కరీబియన్‌ దీవులు, యునైటెడ్‌  అరబ్‌ ఎమిరేట్స్‌లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి లాభాలను వాటిలోకి మనీ లాండరింగ్‌ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇటువంటి ఆక్రమాలతోనే ఆదానీ గ్రూపులోని షేర్లు ఎకాయెకిన 819 శాతం పెరిగాయి. నికర విలువ 231 శాతానికి ఎగబాకింది. మూడేళ్ల క్రితం గ్రూపు వర్త్‌ రూ.1.62 లక్షల కోట్లు కాగా ఇప్పుడు 9.78 లక్షల కోట్లు. ఈ స్వల్ప సమయంలో 8.1 లక్షల కోట్లు పెరగడం అసాధారణం. కరోనా విలయంతో ప్రజలు అల్లాడుతుండగా అదానీ సంపద అనూహ్యంగా పెరిగింది మోసాల నిచ్చెనతోనేనన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదు.

             గతంలో సత్యం రామలింగరాజు కంపెనీది ఇదే బాపతు. హిండెన్‌బర్గ్‌ బాంబుతో అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. రూ.వేల కోట్ల విలువైన సంపద ఆవిరైంది. మొన్నటి వరకు ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతునిగా విరాజిల్లిన అదానీ రెండు రోజుల్లో పదిహేడవ స్థానానికి దిగజారాడు. షేర్‌ మార్కెట్‌లో సంపద గాలి బుడగ అనడానికి ఇదొక ఉదాహరణ. అదానీ గ్రూపులోని షేర్లలో 85 శాతం కుప్పకూలతాయని హిండెన్‌బర్గ్‌ చేసిన హెచ్చరికకు తాజా పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.

            ప్రధాని మోడీకి అదానీ ఆత్మీయ స్నేహితుడనేది అనేకసార్లు బయటపడిరది. నియమాలను ఉల్లంఘించి అహ్మదాబాద్‌, మంగళూరు, లక్నో, జైపూర్‌, గువహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను అదానీ సంస్థకు కట్టబెట్టినప్పుడే ఈ మైత్రి ఎంత లోతైనదో వెల్లడైంది. మోడీ 2015లో బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు ఆ దేశానికి విద్యుత్తును అమ్మడానికి సంబంధించి 4.5 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని అదానీ సాధించుకొన్నాడు. ఆ ఒప్పందం ద్వారా తాము విద్యుత్తును అమ్మినా, అమ్మకపోయినా నిర్వహణ చార్జీల కింద బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తమకు ఏటా 450 మిలియన్‌ డాలర్లు పొందేలా ఏర్పాటు జరిగిందని వెల్లడైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు, పబ్లిక్‌ భాగస్వామ్యం (పిపిపి) పేరిట కూడా ఇటువంటి బాగోతానికి తెర లేచింది. ఇటీవల ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనలో కూడా అదానీ ఇదే మాదిరిగా లబ్ది పొందినట్టు బహిర్గతమైన విషయం తెలిసిందే. అది సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు చైరన్‌ పదవిని బలి తీసుకున్నది. ప్రధాని మోడీయే స్వయంగా శ్రీలంక పాలకుల చెవిలో ఊది అదానీకి విద్యుత్తు ప్రాజెక్టును అప్పగించేలా చేసినట్టు వార్తలు వచ్చాయి.

            ఆశ్రిత పెట్టుబడిదారీ అడ్డదారిని వెడల్పు చేయడం ద్వారా అదానీ అతి కొద్ది కాలంలోనే అత్యంత వేగంగా ప్రపంచ మూడవ సంపన్నుడయ్యాడని బోధపడుతున్నది. ఈ విషయం ముందే మనందరికి తెలిసినప్పటికీ హిండెన్‌బర్గ్‌ పరిశోధనతో అది ధృవపడిరది. మన దేశంలో దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి  దాస్యం చేస్తున్నందున వాటి దర్యాప్తుల్లో అదానీ తప్పుడు వ్యాపారాల బండారం బయటపడే అవకాశం లేదు. కాని ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తర్వాత ఆయన వ్యాపారాలు ఇక ముందు ఇదే పద్ధతిలో కొనసాగే అవకాశం ఉండదు. 14 సంవత్సరాల క్రితం వెల్లడైన సత్యం కంప్యూటర్స్‌ దొడ్డిదారి కుంభకోణం కూడా ఇటువంటిదే. తనకు దాని ఆదాయాన్ని చూపించి, పుస్తకాల్లో అంకెలను విపరీతంగా పెంచి వేసి షేర్‌ విలువను అమాంతంగా అకాశానికి ఎక్కించి సంపదను పెంచుకొన్నానని స్వయంగా సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగ రాజు తెలియజేయడంతో ఆ కంపెనీ ఎలా మూతపడిరదో ఎరుకే. అదానీ గ్రూపు కూడా వెంటనే కాకపోయినా మున్ముందు అటువంటి దుర్గతిని చవిచూసే అవకాశం లేకపోలేదు.

            హిండెన్‌బర్గ్‌ నివేదిక వల్ల గౌతం అదానీ కంపెనీల్లో షేర్లు పడిపోయి మదుపరులకు దాదాపు పదిలక్షల కోట్ల నష్టం కలిగింది. దీంతో వారం రోజుల్లో ఆయన ఆస్తి విలువ బాగా పడిపోయింది. ఎల్‌ఐసి అదానీ గ్రూప్‌లో కొన్న షేర్ల విలువ రూ.81,268 కోట్ల నుంచి రూ.42,523 కోట్లకు దిగజారింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న అదానీ ఫిబ్రవరి 5 నాటికి 22వ స్థానానికి జారిపోయారు. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ రూ.20 వేల కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పిఒ)ను పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ చేసిన ఒక రోజు తర్వాత ఉపసంహరించుకోవడం సహితం పలు అనుమానాలకు దారీ తీస్తుంది. ఎఫ్‌పిఓ పూర్తిగా సబ్‌స్టయిన్‌ అయినా రిటైల్‌గా, గ్రూప్‌ ఉద్యోగులకు కేటాయించిన షేర్లు మాత్రం అమ్ముకు పోకపోవడం గమనార్హం, అంటే కృత్రిమంగా డిమాండ్‌ సృష్టించే ప్రయత్నం జరిగిందా? తద్వారా హిండెన్‌బర్గ్‌ ఆరోపణల సునామి నుండి తప్పించుకునే ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఉపసంహరించుకున్నారా? అన్నది అస్పష్టంగానే ఉంది. బిఎస్‌ఇలో అదానీ సంస్థ షేర్లు 28.45 శాతం నష్టపోయింది. మొత్తంగా అదానీ సంస్థ 100 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయింది.

            నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన దన్నుతోనే అదానీ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని చూడకపోతే అదానీ కథ అసంపూర్ణమే అవుతుంది. 2002లో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు అదానీ, మోడీ మధ్య సంబంధాలు మొదలయ్యాయి. అప్పటి నుండి అదానీ అదృష్టాలన్నీ మోడీ రాజకీయ పంథాతో పెనవేసుకుని సాగాయి. 2014లో మోడీ ప్రధాని అయ్యారు. ఆ సంవత్సరంలో రూ.50.4 వేల కోట్లుగా ఉన్న అదానీ సంపద, 2022 చివరి నాటికి వచ్చేసరికి అమాంతంగా అది రూ.10.30 లక్షల కోట్లకు పెరిగిపోయింది. మోడీకి అత్యంత ప్రీతిపాత్రుడైన పారిశ్రామికవేత్త అదానీకి ఇక పట్ట పగ్గాల్లేవు. ఏ ప్రభుత్వ నియంత్రణా సంస్థ కానీ, అధికారి కానీ ఆయనను ప్రశ్నించే సాహసం కానీ, అడ్డుకునే యత్నం కానీ చేయలేని స్థితి. ప్రభుత్వ అండ చూసుకునే అదానీ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతగా విస్తరించుకోగలిగింది. ఇటీవలి కాలంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇదొక అత్యంత దారుణమైన ఉదాహరణ. మోడీ-అదానీ సంబంధాలు ఈనాడు దేశాన్ని పాలిస్తున్న హిందూత్వ ఫాసిస్టు-కార్పొరేట్‌ శక్తుల పొత్తును నగ్నంగా బయటపెట్టింది.             హిండెన్‌బర్గ్‌ నివేదిక అదానీకో లేదంటే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకో పరిమితం కాదు. మోడీ ప్రభుత్వానికి పెద్ద కుదుపు. అదానీ-మోడీ మధ్య అవినాభావ సంబంధం బహిరంగం. 1988లో చిన్న ఎగుమతి, దిగుమతి కంపెనీతో వ్యాపారం ప్రారంభించిన అదానీకి 1991 నుంచి దేశంలో ప్రారంభమైన సరళీకరణ విధానాలు ఊపునిచ్చాయి. గుజరాత్‌ సిఎంగా మోడీ వచ్చాక అదానీ ప్రభ వెలిగింది. మోడీ దేశ ప్రధాని అయ్యాక అదానీ వాణిజ్య సామ్రాజ్యం అవధులు దాటింది. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వే, రోడ్డు, విద్యుత్‌, గ్యాస్‌, బొగ్గు, రియల్‌, ఒకటేమిటి…. సకలం అదానీ వశమవుతున్నాయి. కేంద్ర బిజెపి ఆశ్రితపక్షపాతం లేకుండా అదానీ ఇంతగా ఎదగడం అసాధ్యం. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లోనూ అదానీ మోనోపొలికి మోడీ సర్కారే కారణం. అదానీ పోర్టులు డ్రగ్స్‌ అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారాయని వెల్లడైంది. ఇంతకుముందు అక్రమాలకు సంబంధించిన కేసులలో అదానీ కంపెనీలపై సెబి నిషేధం విధించగా, దానిని జరిమానా కింద మార్చి అదానీ బయట పడ్డారు. సెబి, ఆర్‌ఒసి, ఇడి, సిబిఐ., నిఘా సంస్థలు కొమ్ముకాస్తున్నందున అదానీ మార్కెట్‌ మాయాజాలం సక్సెస్‌ అయింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతోనైనా కేంద్రం అదానీ ఆర్థిక అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి. ఆర్థిక నేరగాళ్లను బోనులో నిలబెట్టాలి. మోడీ- అదానీల బండారం ప్రజలందరికి తెలియాలి. అందుకు ప్రజలందరు ఐక్యంగా ఉద్యమించాలి.

2 thoughts on “అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

  1. Biased article. You commie it’s better you settle in China. Blatant misuse of freedom in India by anti nationals like you.

    1. It’s a anti-nationals propaganda, us is in danger that’s why it is doing this type of cheap tricks to down India’s growth and it’s common for US, but good thing is rats are coming out from holes now we can identify who is our internal bandicoots.

Leave a Reply