పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి! ఇది యాధృచ్ఛికం కాదు. విధానపర మైన నిర్లక్ష్యం దౌర్బల్యం. అంతకు మించి ఆర్థిక నిర్వహణలో వైఫల్యం. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ఆ లాభం వినియోగదారుడికి చేరట్లేదు. పెరిగితే మాత్రం వెంటనే ప్రజలపై భారం మోపబ డుతున్నది. ఇది మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానం. దాంతో రోజు రోజుకు తీవ్రతరం అవుతు న్న సంక్షోభ కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం విజృంభించి, వేత నాల ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ జంట సంక్షోభాలు ఉండగా అదనంగా యుద్ధం వల్ల ధరల పెరుగు దల హడలగొడుతున్నాయి. కొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మన దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షో భం దిశగా పయనిస్తున్న తీరును కళ్లకు కడుతోంది. రోజుల తరబడి స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నా యి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి విలువ పతనం కొనసాగడం, ద్రవ్యోల్బణం అడ్డు అదు పు లేకుండా పెరగడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగుతున్నది. ఇవన్నీ కలిపి దేశ ఆర్థిక స్థితిపై ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
మనదేశం ముడిచమురు అవసరాల కోసం 85 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతున్నది. ఎప్పుడై తే ఇంధన ధరలు పెరుగుతాయో, రవాణా ఖర్చులు పెరిగి పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధర లు వెంటనే ఆకాశాన్ని తాకుతాయి. ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బిఐ) వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతుంది. దీనివల్ల కంపెనీల ముడిసరుకు ఖర్చలు పెరిగి లాభాలు తగ్గిపోతాయి. ఫలితంగా కార్పొరేట్ రంగంలో లే ఆఫ్స్ (ఉద్యోగాల కోత), జీతాల తగ్గింపు వంటి నిర్ణయాలు మొదలవుతాయి. ధరలు పెరిగినా వేతనాలు పెరగడం లేదు. ఉద్యోగాలు సృష్టించబడటం లేదు. కానీ జీవన వ్యయం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పట్టణాల్లో మధ్యతరగతి, పల్లెల్లో రైతు కూలీ ఇద్దరూ నెల చివరినాటికి అప్పులపాలవుతున్నారు. మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఒక్కరోజులోనే 1,465 పాయింట్లు కుప్పకూలి, 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి అయ్యిం ది. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ పరిణామాల కొనసాగిం పే మదుపరులలో నెలకొన్న విశ్వాస సంక్షోభాన్ని బట్టబయలు చేసింది.
దారుణ నిరుద్యోగం :
ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు మరింత ఆందోళనకరంగా ఉన్నది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బ ణం 3.48 శాతానికి చేరి 13 నెలల గరిష్ఠానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరగడం సామాన్య కుటుంబాలపై తీవ్రమైన భారం మోపుతోంది. పప్పుధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, పాల ఉత్పత్తుల ధరలు పెరిగిపోతుంటే.. ప్రజల ఆదాయం మాత్రం పెరగడం లేదు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుండటం, అసంఘటిత రంగంలో ఉపాది క్షీణించడం, మూలిగే నక్కపై తాటిపండు రాలిన చందంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాదిహామీ పనుల నిధులను తెగ్గోయడం వంటి చర్యలు ప్రజల కొనుగోలు శక్తిని దారుణంగా తెబ్బతీశాయి. ఈ ధరాఘాతం నుండి ప్రజలకు ఊరటనిచ్చే చర్యలు తీసుకోవడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం మరింతగా భారాలు మోపేందుకు సిద్ధమవటం దారుణం! అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతుండటాన్ని సాకుగా చూపుతూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతున్నాం అనేది ఓ సాకు మాత్రమే.
భారత ఆర్థిక దృశ్యంలో మరో ముఖ్యమైన సవాల్ నిరుద్యోగ సమస్య. 2026లో యువత నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరింది. 22-29 సంవత్సరాల వయస్సు గల గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 33 శాతంగా ఉంది. గ్రాడ్యుయేట్లలో సుమారు 40 శాతం మంది ఉపాదిలేకుండా ఉన్నారు. భారత్‌లో 15-29 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 367 మిలియన్ల యువకులు ఉన్నారు. ఇది అద్భుతమైన జనాభా సామర్థ్యం. అయితే విద్యా నైపుణ్యాలకు, సృష్టించబడుతున్న ఉద్యోగాలకు ఎంతో అంతరం ఉంది. ప్రతి సంవత్సరం 50 లక్షల గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కానీ తగినంత ఉద్యోగాలు లేకపోవడంతో ఈ విద్యా సామర్థ్యం సరైన ప్రయోజనాలను అందించడం లేదు. జనాభా డివిడెంట్ ప్రయోజనాన్ని పొందడానికి 20-30 నాటికి సమయం చాలా కఠినంగా మారుతోంది. ఆ తర్వాత కార్మిక వయస్సు జనాభా వాటా తగ్గడం ప్రారంభమవుతుంది. వాతావరణ మార్పు ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాల్సిన అంశం. ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే 100 నగరాల్లో 98 భారత్‌లోనే ఉండటం గమనించాల్సిన విషయం.
దేశంలో ఉద్యోగాల లేమి వల్ల ద్రవ్యోల్బణం కుటుంబాలకు మరింత ప్రాణాంతకంగా పరిణమించిం ది. వర్తమాన ఉద్యోగ లెక్కలు పరిశీలించే మాస పత్రిక చెప్పే ప్రకారం.. ఈ ఏడాది నిరుద్యోగ రేటు గత ఏడాది లాగే 5.1 శాతం ఉంది. పట్టణ ప్రాంతాలలో ఇది 6.8 శాతంగా ఉంది. ఇప్పుడు వారాల ప్రకారం వేసే ఉద్యోగ లెక్కలలో గతవారం ఒక గంట పనిచేసి ఉంటే ఉద్యోగం ఉన్నట్టే భావించాలి. ఈ రోజున ఉన్న నిరుద్యోగ సేనను బాగా కుదించి చూపేందుకే హాస్యాస్పదమైన ఈ నిర్వచన పద్ధతి తీసుకొచ్చారు. దేశంలో పట్టభద్రులైన తాజా ఉద్యోగ పరిస్థితి గురించి అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ రూపొందించిన నివేదిక ప్రకారమైతే.. వివరాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. 15-25 ఏళ్ళ మధ్య వారిలో 40 శాతం, 25-29 ఏళ్ల మధ్య వారిలో 20 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. యువ శ్రామిక బలగం ఎక్కువగా ఉండటం ఎంతో లాభదాయకమంటూ టముకు వేసుకుంటున్న ప్రచారాల బండారాన్ని ఈ నివేదిక చావుదెబ్బ కొట్టింది. 2030తో ఇది తారాస్థాయికి చేరుతుందనీ తర్వాత శ్రమ చేసి వయస్కుల నిష్పత్తి తగ్గుదల మొదలవుతుం దని అది హెచ్చరిస్తోంది. దీనివల్ల కలగాల్సిన ప్రయోజనాలను చేజార్చుకొనే పూర్తి బాధ్యత, నేరపూరిత నిర్లక్ష్యం పూర్తిగా మోడీ సర్కారుదే.
ఆర్థిక వ్యవస్థలో అసమానతలు :
దేశంలో ఆర్థిక అసమానత చాలా తీవ్రంగా ఉంది. వయోజన జనాభాలో అగ్రశ్రేణి 1శాతం మంది మొత్తం జాతీయ సంపదలో 40 శాతం కలిగి ఉండగా, అగ్రశ్రేణి 10 శాతం మంది సుమారు 65 శాతం నియంత్రిస్తున్నారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ, అది అధికంగా కేంద్రీకతృమై ఉంది. దీనివల్ల సంపన్న పట్టణ ఉన్నత వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు మధ్య పెద్ద అంతరాలు ఏర్పడుతున్నాయి. ఇటీవలి దశాబ్ధాలలో ఆదాయ అసమానత విపరీతంగా పెరిగింది. అత్యదిక ఆదాయం పొందుతున్న 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 58 శాతం దక్కించుకుంటుండగా, దిగువన ఉన్న 50 శాతం మంది కేవలం 15 శాతం తోనే బతుకుతున్నారు. ఆదాయ అసమానత కంటే సంపద అసమానత మరింత తీవ్రంగా ఉంది. దేశ మొత్తం సంపదలో కేవలం 6 శాతం కంటే కొంచెం ఎక్కువ సంపదను మాత్రమే జనాభాలో దిగువ 50 శాతం మంది కలిగి ఉన్నారు. నేడు దేశంలో నెలకొన్న అసమానతలు బ్రిటిష్ వలసపాలన నాటి కంటే ఎక్కువగా ఉన్నాయని ఆక్స్ ఫామ్ నివేదిక తెలుపటం గమనార్హం.
నిత్యావసరాల ధరల పెరుగుదల :
‘పెట్రో ధరలు పెరగవని నేను చెప్పలేను అంటూ సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇదే మాదిరి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపో వచ్చంటూ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలతో దేశంలో పెట్రో మోత తప్పద ని తేలిపోయింది. నాలుగేళ్లుగా పెట్రో ధరలు పెరగలేదంటూ తాజాగా చేయబోయే పెంపునకు సమర్థనగా కేంద్రం చేస్తున్న వాదనలు ఏ మాత్రం సమర్థనీయం కాదు. ప్రత్యక్షంగా పెంచకపోయినప్పటికీ, రకరకాల విన్యాసాలతో ప్రజల మూలుగులను ఇప్పటికే పీల్చి పిప్పి చేశారు. చమురు ధరలు పెరిగితే రవాణా వ్యయం పెరిగి, దాని ప్రభావం అన్ని వస్తువులపై పడటం ఖాయం. బంగారం కొనుగోలును ఏడాదిపాటు నిలిపివేయాలని ప్రధాని సూచించగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 6 నుండి 15 శాతానికి పెంచడం కూడా ప్రజలపై భారాలు మోపే చర్యే! హార్ముజ్ జలసంది మూసివేతతో రాకపోకలు నిలిచిపోవడం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిందని యుఎన్ రిపోర్ట్ పేర్కొంది. ముఖ్యంగా డీజిల్, ఎరువుల వంటి అత్యవసర ఉత్పాదకాల సరఫరా తగ్గిపోవడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగా యి. దీని ప్రభావం నేరుగా ఆహార వస్తువులపై పడింది. ఏప్రిల్ నెలలో వంట నూనెలు ధరలు ఏకంగా 5.9 శాతం పెరిగి జూలై 2022 తర్వాత అత్యదిక స్థాయికి చేరుకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల బయో ఫ్యూయల్ల్ కు గిరాకీ పెరిగి, అది వంట నూనెల మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తోంది.
ప్రజల ఆదాయాల క్షీణత :
ఆర్థిక సౌభాగ్యానికి సంబందించిన మరింత ప్రాథమికమైన అంశం ఆర్జనలు, ఆదాయాలు క్షీణించి పోవడం. 2025కు సంబంధించి అదే పిఎలఎఫఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. శ్రామిక బలగంలో పాతిక శాతం కన్నా కొంచెం తక్కువ (ఖచ్చితంగా చెప్పాలంటే 23.4 శాతం)గా నిర్ణీత ఉపాది పొందుతు న్నారు. అంటే వారికి క్రమబద్ధమైన జీతం, వేతనం ఉంటాయి. కాని ప్రజలలో అత్యదిక భాగం (56.2 శాతం) స్వయం ఉపాదిలో ఉన్నారు. వీరిలో వ్యవసాయ కార్మికులు, సర్వీసు రంగంలో శ్రమను అమ్ముకునే లక్షలాది మంది చేరి ఉన్నారు. 20 శాతం కన్నా కాస్త ఎక్కువ మంది క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ మూడు రకాల శ్రమ జీవులకు సగటున లభించే ఆదాయం ఎంతో తెలుసా? 64 శాతం కన్నా ఎక్కువ మంది కనీస వేతనాలు పొందలేకపోతున్నారు.
2022-25 మధ్య క్రమబద్ధమైన వేతనాలు, జీతాలు 1.2 శాతం పెరుగుదల మాత్రమే వార్షిక పెరుగుదల నమోదైంది. అదే క్యాజువల్ కార్మికులకైతే కేవలం 0.5 శాతం పెరుగుదల మాత్రమే ఉంది. స్వయం ఉపాదిలో వారికి ఒక శాతం పెరిగింది. మోడీ ప్రభుత్వ పన్ను రాయితీ పందేరాలు, ప్రోత్సాహకాలు, రుణాల మాఫీల వల్ల ఒకవైపున కార్పొరేట్ ప్రపంచం లెక్కలేని లాభాలు పోగేసుకుంటుంటే, బిలియనీర్ల సంఖ్య పెరిగిపోతుంటే మరోవైపున తక్కువ ఆదాయాలు లేక అసలు ఆదాయమే లేకపోవడం భారతీయ కార్మికులకు భారంగా మారింది.
ఎంత అబివృద్ధి చెందిన దేశం అయినా ‘వనరుల స్వావలంబన’, ‘ఆర్థిక స్థిరత్వం’ లేకపోతే ఆ దేశం అబివృద్ధి కేవలం నీటి మీద బుడగలాంటిదే. ఇప్పుడు ఇదే సూత్రం మన దేశానికీ కూడా వర్తిస్తుంది. బంగారం, ముడిచమురు దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చును డాలర్ రూపంలో చెల్లించాలి. మన దేశానికి వచ్చే రేమిటన్స్ తగ్గిపోవడం, ట్రంప్ నిర్ణయాలతో మన ఎగుమతులు తగ్గి దేశానికి డాలరు రాక తగ్గిపోయింది. కానీ బంగారం, ముడిచమురు, ఎరువులు వంటి ఇతర వస్తువుల దిగుమతి ఖర్చును డాలర్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. మన దగ్గర తగిన విదేశీ నిల్వలు(డాలర్) లేకపోవడం వలన అంతర్జా తీయ మార్కెట్లో డాలర్‌ను కొనుగోలు చేయవలసి రావడం వలన రూపాయి విలువ తగ్గి డాలర్ విలువ పెరుగుతుంది. ఏప్రిల్ 17, 2026 నాటికి దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703.308 బిలియన్ డాలర్లు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డాలర్ 100 రూపాయలకు చేరుతుంది. అప్పుడు దిగుమతులు మరింత భారం అవుతాయి. ఆ భారం దేశ ప్రజలపై పడుతుంది. అందుకే, దిగుమతులు తగ్గించుకోవాలి. అంటే, ప్రజలు బంగారు, పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, ఇతర దిగుమతులపై ఆధారపడ్డ వస్తువుల వినియోగం తగ్గించు కుంటే, అంతమేర దిగుమతులు తగ్గి ఈ కష్టకాలం నుండి బయట పడవచ్చు. అందు కొరకు భారతదేశ గతం, ప్రస్తుతం, భవిష్యత్తును కాపాడాలంటే అది ప్రజల సమైక్య శక్తి ద్వారానే సాధ్యమవుతుంది.
క్షీణిస్తున్న ఆర్థిక వృద్ధి :
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా భారత వృద్ధిపైనా ప్రభావం చూపుతున్నదని ఆర్బిఐ పేర్కొంది. అంతర్జాతీయంగా తలెత్తుతున్న సరఫరా వైపు ఒత్తిళ్లు దేశ జిడిపిని ఒడిదుడుకులకు గురిచేసే ప్రమాదం ఉందని ఆర్బిఐ తన తాజా స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదికలో హెచ్చరించింది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఈ అస్థిరత కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువులు, ప్రధాన లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారం మన దేశీయ మార్కెట్లలోకి దిగుమతి అవుతున్న సరుకుల అదిక ధరలు, ద్రవ్యోల్బణం రూపంలో చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని ఆర్బిఐ స్పష్టం చేసింది. ఈ అంతర్జాతీయ సంక్షోభ ప్రభావం భారతదేశ విదేశీ వాణిజ్యంపై స్పష్టంగా కనిపిస్తోందని ఆర్బిఐ తెలిపింది. దేశీయ వినియోగం మందగించడం, తయారీ రంగం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఒత్తిడిలో ఉండటం, రైతాంగ ఆదాయం స్థిరంగా లేకపోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల భారం ఊహించని విధంగా పెరగడం వల్ల, గత మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో దేశ వాణిజ్య లోటు మరింత పెరిగింది. మూలధన ప్రవాహాలు తగ్గడం, రూపాయి విలువపై ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి.
భారీగా తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డిఐ) :
భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల అంశాలు కానరాకపోవడంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతున్నాయి. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో స్థూల ఎఫ్‌డిఐ ప్రవాహాలు వచ్చినప్పటికీ ఇప్పుడు విదేశీ కంపెనీలు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను సొంత దేశాలకు తరలించు కుపోతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు లాభాలు, డివిడెండ్లు లేదా ఆస్తుల విక్రయ రూపంలో ఏకంగా 53.58 బిలియన్ డాలర్ల నిధులను దేశం నుండి వెనక్కి తీసుకెళ్లారు. దీనికి తోడు భారతీయ కంపెనీలు కూడా విదేశాల్లో తమ పెట్టుబడులను 33.29 బిలియన్ డాలర్లకు పెంచడంతో, దేశంలోకి వచ్చిన నికర ఎఫ్‌డిఐలు కేవలం 7.65 బిలియన్లకే పరిమితమయ్యాయి. ఇది ఇంతక్రితం సంవత్సరాల సగటు కంటే తక్కువ. ఆర్బిఐ రిపోర్ట్ ప్రకారం… గత మార్చిలో దేశంలోకి వచ్చిన విదేశీ నిధుల కంటే దేశం వెలుపలికి తరలిపోయిన నిధుల మొత్తం ఏకంగా 11.7 బిలియన్ల (దాదాపు రూ. 97,000 కోట్లు) మేర ఎక్కువగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తర్వాత విదేశీ నిధులు ఈ స్థాయిలో వెలుపలికి వెళ్లడం ఇదే మొదటిసారి.
ప్రజలపైన ఆర్థిక సంక్షోభ భారాలు :
ఆర్థిక సంక్షోభం మోడీ ప్రభుత్వం చెపుతున్నట్లు ఆకస్మికంగా ఉత్పన్నమయినది కాదు. గత దశాబ్దంలో ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక, వ్యూహాత్మక విధానాల పర్యవసానం. మన ఆర్థిక వ్యవస్థను దిగుమతులపై ఆధారపడేటట్లు చేయటం, కార్పొరేట్ల అనుకూల అబివృద్ధి విధానాలు అమలు చేయటం, వ్యూహాత్మక నిల్వల్లో బలహీనంగా ఉండటం లాంటి వాటితో అసలు సంక్షోభం ఈ ఆర్థిక వ్యవస్థ నమూనాలో నే ఉంది. అయినా, సంపన్నులకు రాయితీలు ఇచ్చి, సామాన్యులపై భారాలు మోపే విధానాలు కొనసాగి స్తూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్-మతతత్వ రాజకీయాలను కొనసాగిస్తోంది. ఇప్పటికైనా, ప్రభుత్వం ప్రజాకేంద్రిత ఆర్థిక విధానాలకు మరలాలి. ధరల నియంత్రణ చర్యలు, ఉపాది హామీ, వ్యవసాయ, చిన్న పరిశ్రమల రక్షణపై దృష్టి పెట్టాలి. లేని పక్షంలో దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం.
రానున్నది గడ్డు కాలమే- ఆర్బిఐ :
ప్రపంచ వాణిజ్యం, పరిశ్రమలకు రాబోయే దశాబ్దం అత్యంత సవాలుతో కూడుకున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. పెరుగుతున్న స్వదేశీ రక్షణవాదం, వాతావరణ మార్పు లు, సరఫరా గొలుసుల అస్థిరత వంటివి ఎగుమతిదారులు, తయారీదారులకు ప్రధాన ఆందోళనలుగా మారాయని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక పురోగతులు వివిధ దేశాలలో కార్మిక వ్యయాలను స్థిరంగా తగ్గిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆమె మాడ్లాడుతూ… పశ్చిమ ఆసియా సంక్షోభం అనేది కేవలం దౌత్యపరమైన లేదా భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదన్నారు. ఇది సామాన్య ప్రజలపై, చిన్న వ్యాపారాలపై దీర్ఘ ప్రభావాన్ని చూపుతోందని చెప్పుకొచ్చారు.
ముగింపు :
పాలకుల మాటల్లో దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోందన్న ఉత్సాహం ఓవైపు వ్యక్తమవుతుంటే, మరోవైపు రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఇది సగటు భారతీయుడి కొనుగోలు శక్తిని, దేశ ఆర్థిక స్వావలంబననూ తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం. ద్రవ్య లభ్యతపై ఒత్తిడిని తగ్గించి, పరోక్షంగా రూపాయిని స్థిరీకరించే లక్ష్యంతో వాణిజ్య బ్యాంకులతో 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్- రూపాయి మార్పిడి ఒప్పందాన్ని (స్వాపు) రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇది మే 29న అమలులోకి వస్తుంది. అయితే రూపాయిని బలోపేతం చేసే క్రమంలో నే విదేశీ మారక నిల్వలన్నీ ఆవిరైపోతాయి. దీంతో చెల్లింపుల లోటు , కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) కోసం చాలా తక్కువ మిగులుతుంది. మిగిలిన ఆ కొద్దిపాటీ డబ్బు కూడా యుద్ధ విమానాలు, ఆయుధాల దిగుమతికే ఖర్చవుతుంది. దీంతో అందరికీ ముందు ముందు కష్టకాలమే.
ప్రస్తుతం మన ముందున సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో విలాసవంతమైన దిగుమతి వస్తువులపై సుంకాలను పెంచడం అవసరం. ప్రపంచ స్థిరాదాయ పెట్టుబడి పత్రాల సూచీలలో భారత్‌కు మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకోవడం, రష్యా ఇరాన్ వంటి దేశాలతో అమలు చేస్తున్న రూపాయి చెల్లింపు విధానాలను, మరిన్ని దేశాలకు విస్తరించడం అత్యావశ్యకం. ఈ చర్యల ద్వారా డాలర్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే రూపాయి నిరంతర బలహీనత, మన ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణ పరమైన లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తుచేస్తోంది. ఆకాశమంత ఉన్నతంగా ఉన్న మన ఆర్థిక ఆకాంక్షలు నిజం కావాలంటే, ఉత్పాదకత పెంపు, ఉద్యోగ కల్పన లాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. అయితే, “అచ్ఛేదిన్ ” నినాదంతో అదికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం సామాన్యుడి జీవితాన్ని మరింత కష్టతరం చేస్తోంది. ఎన్నికల వాగ్ధానాలు వేరు, పాలన వేరు అయినప్పుడు, ప్రజాస్వామ్యంలో ప్రజలే తమ తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ధరల మంట ఆర్పే బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యత నుండి పాలకులు పారిపోవడం బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు, ప్రజాద్రోహం.




