ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అక్రమ యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతోంది. దేశ దేశాలు గ‌డ్డు ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యం.. గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా యుద్ధంలో పాల్గొనే దేశాలన్నీ వినాశకరమైన పరిణామా లను ఎదుర్కోవాల్సిందే అన్న సత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆ దేశాల్లో మౌలిక సదుపాయాలు ద్వంసమై, పర్యావరణం దెబ్బతిని, ఆ దేశాల అబివృద్ధి దశాబ్ధాల వెనుక‌కు వెళ్లిపోయింది. ఇరాన్‌లోని విస్తారమైన చమురు వనరులను స్వాదీనం చేసుకోవాలనే దురాశతో ఉన్న అమెరికా పెట్టుబడిదారీ వర్గం అనుకూల సమయం కోసం ఎదురు చూసింది. ప్రపంచంలో అత్యదిక చమురు వనరులు కలిగిన వెనిజులా దేశ అధ్యక్షుడిని, అతని భార్యను అమెరికా సైన్యం ఎత్తుకుపోవ‌డం, దానికి అంతర్జాతీయ ప్రతిఘటన రాకపోవడం, అలాగే గత సంవత్సరం దాడులకు ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిస్పందన లేకపోవడం వల్ల అమెరికన్ పాలకవర్గం ఇరాన్‌ను బలహీనంగా అంచనా వేసింది. వెనిజులాలో చేసినట్లే నాయకత్వాన్ని తొలగిస్తే ఒకరోజులోనే ఇరాన్‌ను స్వాదీనం చేసుకోవచ్చని భావించి గత సంవత్సర కాలంగా ఇరాన్‌లో అసంతృప్తి వాదులను ప్రోత్సహిస్తూ ఉద్యమాలను రెచ్చగొట్టింది. సిఐఎ, మోస్సాద్ ఏజెంట్లు ఇరాన్ రాజు మహ్మద్ షా రెజా పహ్లవి కుమారున్ని ఇరాన్‌ నాయకత్వానికి సిద్ధం చేశారు. అయితే ఈ పన్నాగాలను పటాపంచలు చేస్తూ ఇరాన్ ప్రతిదాడి చేసి 40 రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగించి అమెరికా దూకుడుకు కళ్లెం వేసింది.

            ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులకు ప్రతిగా హార్ముజ్ జలసందిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణా నిలిచిపోయి వాణిజ్యం స్తంభించి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ భారాన్ని తగ్గించే మార్గం తెలియక అనేక దేశాలు ఇబ్బందుల పాలవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైపోతున్న‌ది. అమెరికన్ డాలర్ల లెక్కలో ముడిచమురు ధరలు పెరిగిపోయాయి. దాని వెనువెంటనే ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా ఆసియా దేశాల కరెన్సీల విలువలు పడిపోవడం మొదలైంది. దీని ఫలితంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో కన్నా ఎక్కువ మోతాదులో మూడవ ప్రపంచ దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వలన ప్రజల కొనుగోలు శక్తి ప‌డిపోయింది. అందువలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న‌ది. ఈ ఆర్థిక మాంద్యం కూడా సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో కన్నా ఎక్కువ స్థాయిలో మూడవ ప్రపంచ దేశాలలో నెలకొంటోంది. చమురుకు కొరత ఏర్పడినందువలన ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. దాని ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తి దెబ్బతింటోంది. మూడవ ప్రపంచ దేశాలలో దుర్భర పరిస్థితుల మధ్య శ్రామిక ప్రజానీకం ఆహార సంక్షోభంలో  చిక్కుకుపోయే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.

            ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనేది ఒకేసారి అనేక దేశాలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన, విస్తృతమైన తిరోగమనం లేదా ఆర్థిక‌ ప్రతిష్ఠంభ‌న‌. ఇది పరస్పరం అనుసంధానించబడిన ఆర్థిక వ్యవస్థల ఫలితంగా ఏర్పడుతుంది. ఆర్థిక మార్కెట్లలో ఎక్కువ రిస్క్ తీసుకోవడం, కొలెటరలైజ్డ్ డెట్ ఆబ్లిగేషన్స్ (సిడిఓలు) వంటి సంక్లిష్టమైన ఆర్థిక సాధనాల ద్వారా ఇది ఏర్ప‌డుతుంది.ఈ నేప‌థ్యంతోనే.. పరస్పరం అనుసంధా నించబడిన బ్యాంకింగ్ వ్యవస్థలు, తగ్గిన అంతర్జాతీయ వాణిజ్యం, అస్థిరమైన మూలధన ప్రవాహాల ద్వారా సంక్షోభాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయి. అమెరికా గృహ మార్కెట్ పతనం వల్ల ప్రేరేపించబడిన 2007-08 ప్రపంచ ఆర్థిక సంక్షోభం (జిఎఫ్‌సి),  భారీ బ్యాంకుల నష్టాలు, దివాళాలు, తీవ్రమైన నిరుద్యోగానికి దారితీసింది. దీనికి ప్రభుత్వం భారీగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, మాహమ్మా రులు, యుద్ధం, చమురు ధరల పెరుగుదల వంటివి సరఫరా గొలుసులకు, డిమాండ్‌కు అంతరాయం కలిగించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అవాంతరాలను సృష్టిస్తాయి. పెరుగుతున్న చమురు ధరల ప్రభావం, భారత రూపాయి వంటి వర్ధమాన మార్కెట్ కరెన్సీలపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. దీంతోనే ప్రపంచ అనిశ్చితి వంటివి కొనసాగుతున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం :

            యుద్ధం, ఇంధన కొర‌త‌ ఆహార ధరలలో తీవ్రమైన పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ప్రపంచ దేశాలు గల్ఫ్ నుంచి వచ్చే చమురుపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుంచించుకుపోతాయి. ఎరువుల ధ‌రలు 40 శాతం పెరగొచ్చు. కేవలం ఇంధన ధరలే కాకుండా సామాన్యుడి ఆహార భద్రతపై కూడా ఈ యుద్ధం పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే సరఫరా గొలుసులో ఏర్పడిన ఆటంకాల వల్ల ఎరువుల ధరలు 30 నుండి 40 శాతం వరకు పెరిగాయి. దీని ఫలితంగా ఆహార వస్తువుల ధరలు 3 నుండి 6శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. భారతదేశానికి సుమారు 80 శాతం చమురు దిగుమతుల ద్వారానే లబిస్తుండగా, చైనా 65 శాతం చమురు దిగుమతి చేసుకుంటోంది.

            ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసందిగనుక యుద్ధం కారణంగా మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడటం ఖాయం. దీని ప్రభావం తొలుత ఆసియా ఖండంలోని దేశాలపై తీవ్రంగా ఉంటుంది. చమురుతో పాటు ఇతర సరుకుల రవాణాకు ఇరాన్ ఆదీనంలో ఉన్న హార్ముజ్ జలసంది కీలకమైనది. 2025లో రోజుకు సగటును రెండు కోట్ల బారెల్స్ ముడి చమురు, చమురు ఉత్పత్తులు ఈ మార్గం ద్వారానే రవాణా అయ్యాయి. ఈ జలసంది ద్వారా వెళ్లే నౌకల పై ఇరాన్ సుంకం విధించడంతో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. యుద్ధం కారణంగా ముడి చమురు ధర 70 డాలర్ల నుండి 125 డాలర్ల వరకు పెరిగి, తరువాత కొంత తగ్గినా మళ్లీ పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. ముడి చమురు ధ‌ర ప్రతి బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తి 0.2 శాతం తగ్గి, ద్రవ్యోల్బణం 0.6 శాతం పెరుగుతుంది. ఫలితంగా అమెరికా, జపాన్, యూరప్, భారత్ వంటి దేశాలలో జిడిపి తగ్గుదలతో పాటు వినియోగదారుల ధరల సూచిక కూడా గణనీయంగా పెరుగుతుంది.

            ముడి చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు ఆధారిత రసాయన పదార్థాలను వినియోగించే ఎరువులు, ఔషధాలు, ప్లాస్టిక్ వస్తువులు, కృత్రిమ దారాలు, ఇంధనాల ధరలు పెరగడంతో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితంగా లక్షలాది మంది ఉపాది కోల్పోతున్నారు. భారతదేశంలో స్థూల జాతీయ ఉత్పత్తి 1 శాతం తగ్గితే 1.1 శాతం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా జిడిపి ఒక శాతం తగ్గితే సుమారు 33 మిలియన్ల మంది నిరుద్యోగులవుతారు. ప్రస్తుత యుద్ధం కారణంగా ఇప్పటికే దాదాపు రెండు కోట్ల ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. ఈ విధంగా అమెరికా ఇజ్రాయెల్ వైఖరి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ఇంధన వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో కొనసాగే సంఘర్షణ ప్రపంచ జిడిపి వృద్ధిని గణనీయంగా తగ్గించి ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రమాదాలను పెంచుతుంది. పెట్టుబడులను తగ్గి దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక స్థిరత్వంపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతుంది.

యుద్ధంతో కుదేలవుతున్న దేశాలు :

            దేశాలపై ప్ర‌స్తుత యుద్ధ ప్రభావాన్ని పరిశీలిస్తే, అమెరికా చమురు ఎగుమతి దేశమే అయినప్పటికీ లాభాల కోసం పనిచేసే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరలను 20-40 శాతం వరకు పెంచి ప్రజలపై భారం మోపాయి. ఏప్రిల్‌లో వినియోగ వస్తువుల ధరలు 3.3 శాతం పెరిగి, ద్రవ్యోల్బణం 4.2 శాతంకు చేరగా, స్థూల జాతీయోత్పత్తి తగ్గుదలతో పాటు ఉద్యోగాల కల్పనలో కూడా తిరోగమనం కనిపించింది. ఇప్పటివరకు యుద్ధం కారణంగా అమెరికా ప్రజలపై 19 బిలియన్ డాలర్ల భారం పడింది. యూరోపియన్ యూనియన్ దేశాల పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అవి చమురు, సహజ వాయువుల దిగుమతులపై ఆధారపడుతూ, రష్యా నుండి చమురు కొనుగోలుపై అమెరికా విధించిన నిషేధం కారణంగా కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా నుంచే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తాత్కాలికంగా రష్యా చమురును కొనుగోలు చేయడానికి అనుమతులు ఇవ్వబడ్డాయి, దీనివల్ల రష్యా ఇప్పుడు మార్కెట్ ధరలకు అమ్ముకుంటోంది. అయితే ముడి సరుకుల కొరత, రవాణా సమస్యల కారణంగా పరిశ్రమలు నిలిచిపోతూ, ఉత్పత్తి విక్రయ వ్యవస్థలు దెబ్బతిని యూరప్ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.

            యుద్ధంలో చిక్కుకున్న గల్ఫ్ దేశాలు తమను అమెరికా రక్షిస్తుందని నమ్మకంతో ఉన్నాయి. తమ దేశాలలోని అమెరికా సైనిక  స్థావరాల నుండి ఇరాన్‌పై దాడులు చేయుటకు అవకాశాలను కల్పించాయి. ఇరాన్ తమపై దాడులు చేయడంతో ఆయా దేశాల ఆదాయ వనరులు మూసుకుపోతున్నాయి. ముడి చమురు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. విమానాలు రద్దు కావడంతో టూరిస్టుల సంఖ్య తగ్గిపోయింది. విమానయానం పైన చాలా గల్ఫ్ దేశాలు లాభాలను గడిస్తున్నాయి, ఆ ఆదాయం కూడా తగ్గిపోయింది. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డి-సెలినేషన్ ప్లాంట్లు అనేకం ఇరాన్ దాడులతో ధ్వంసం కావడంతో మంచినీరు కూడా దొరకని పరిస్థితులు ఎదురవుతున్నాయి. లక్షలాది మంది భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు గల్ఫ్ దేశాల నుండి ఇంటి బాట పట్టారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. చమురు పరిశ్రమ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది నిరుద్యోగులవుతున్నారు.

            సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలతో పాటు నూలు, పట్టు వస్త్రాలు, వ్రజాభరణాలు భారతదేశ ఎగుమతులలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. యుద్ధం వల్ల కొన్ని దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. వజ్రాలు, వస్త్ర పరిశ్రమలలో లక్షలాది మంది ఉపాదికోల్పోయారు. గుడ్లు, పండ్లు, సముద్ర ఉత్పత్తుల రంగంలో ఉన్న రైతులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. భారతదేశ ఎగుమతులు ఫిబ్రవరి 2026తో పోలిస్తే మార్చి నెలలో 10 శాతం క్షీణించాయి. అదేవిధంగా మనం చేసే దిగుమతులు, ముఖ్యంగా వంట నూనెలు, ముడి పదార్థాలు మొదలైనవి 10 నుండి 20 శాతం క్షీణించాయి. విదేశాలలో పనిచేసే భారతీయులు పంపే డబ్బు (విదేశీ మారక ద్రవ్యం) కూడా తగ్గిపోయింది. దాదాపు 25 శాతం తగ్గిందని అంచనా. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తోందని సూచిస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే అనేక వేల పరిశ్రమలు మూతపడుతూ, కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజిల్‌పై ధరలు పెంచని కారణంగా పెట్రోల్ ధరలు పెరగలేదు. ఎన్నికల తరువాత డీజిల్ ధరలు పెరిగి అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటించే అవకాశం ఉంది.

యుద్ధం ముగిసినా తేరుకోవడం కష్టమే? :

            యుద్ధం ముగిసినా పరిస్థితి తక్షణం చ‌క్క‌ప‌డ‌ద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మత్తు, ఉత్పత్తి పునఃప్రారభం, పశ్చిమాసియా నుండి రవాణా సమయం ఇవన్నీ కలిపి వారాల నుండి నెలల సమయం పట్టవచ్చు. యురేషియా గ్రూప్‌కు చెందిన హెన్నింగ్ గ్లాయ్‌స్టెయిన్  “ఈ ఇంధన కొరత పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది” అని స్పష్టం చేశారు. ఆసియా ప్రభుత్వాలు బడ్జెట్ వేసుకున్నప్పుడు చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్లు ఉంటుందని అంచనా వేశాయి. కానీ యుద్ధం కారణంగా  బ్రేంట్ క్రూడ్ 120 డాలర్లకు చేరింది. దేశాలు ఇప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాయి. చమురు సరఫరాదారులను వైవిధ్యపరచడం, సౌరశక్తి వంటి పునరుత్పాదక వనరులు, అణుశక్తి వంటి ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిపుణుడు అల్బర్ట్ పార్క్ “యుద్ధం ఎంత కాలం కొనసాగితే, ఆర్థిక నష్టాలు అంత పెద్దవి అవుతాయి” అని హెచ్చరించటం గ‌మ‌నార్హం.

ఆయుధ కంపెనీలకు యుద్ధమే పెట్టుబడి :

            ఈ యుద్ధం కారణంగా ఎన్నికలలో ట్రంప్‌కు మద్ధతునిచ్చిన అమెరికన్ ఆయిల్ కంపెనీలు, యుద్ధ పరిశ్రమల అధిపతుల లాబీ భారీగా లాభపడింది. ‘రెస్టాడ్ ఎనర్జీ’ అనే సంస్థ అంచనాల ప్రకారం అమెరికన్ ఆయిల్ కంపెనీలకు 63.4 బిలియన్ డాలర్లు, అంటే సుమారుగా 5,90,190 కోట్ల రూపాయలు అదనంగా లాభాలు వచ్చాయి. ఎక్సాన్ మొబిల్ కంపెనీకి 3.4 బిలియన్ డాలర్లు. షేవ్రాన్‌కు 2.2 బిలియన్ డాలర్లు, కొనొకో ఫిలిప్స్ కంపెనీకి ఒక బిలియన్ డాలర్లు అదనంగా లభించాయి. రవాణా సమస్య కారణంగా ఆయా కంపెనీల ఉత్పత్తి గణనీయంగా తగ్గినప్పటికీ ఇంతగా లాభాలను కూడగట్టుకున్నాయి. అమెరికన్ యుద్ధ పరికరాలు, విమానాలు, డ్రోన్లు తయారు చేసే కంపెనీలు కూడా విపరీతమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. సగటున 15 శాతం అదనపు లాభాలను ఆయుధ కంపెనీలు ఇప్పటికే పొందాయి.

            పెద్ద ఆయుధాల ఉత్పత్తి కంపెనీ అయిన లాక్హీడ్ మార్టిన్ ఆదాయం 2026లో 11 శాతం పెరుగుతుంది. రేతియోన్ కంపెనీ 92 బిలియన్ డాలర్ల ఆదాయం అదనంగా పొందుతోంది. జనరల్ డైనమిక్స్ కు అదనంగా ఆరు శాతం ఆదాయం లభిస్తుంది. యుద్ధ విమానాలను తయారు చేసే బోయింగ్ కంపెనీ షేర్ ధరలో పెరుగుదల 2026లో 104 శాతం ఉంటుందని అంచనా. 2027లో ఈ పెరుగుదల 854 శాతం ఉండ‌బోతున్న‌ది. యుద్ధం కారణంగా ఆయుధాలు, యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇప్పుడు వస్తే రాబోయే సంవత్సరాలలో లాభాలు వస్తాయి. ఇరాన్ ప్రజలు సైన్యం వీరోచితంగా అమెరికన్ సామ్రాజ్యవాదుల దురాక్రమణను ఎదుర్కొనడంతో తాత్కాలికంగా విరమించినట్లు కనిపించినప్పటికీ, సామ్రాజ్యవాదులు తమ లాభాల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ యుద్ధం అమెరికన్ కంపెనీలకు లాభాలను తెచ్చిపెడితే, అమెరికా, ఇరాన్‌లతో సహా ప్రపంచ ప్రజలకు కష్టనష్టాలను తెచ్చిపెట్టింది. చర్చలు అంటూనే మరో తీవ్ర దాడికి అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడి సన్నద్ధమవుతోంది. సకల దేశాలలోని శ్రామిక ప్రజలు సంఘటితమై అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవటం తక్షణ కర్తవ్యం.

ముగింపు :

            పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలు ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతున్నా యి. ఈ యుద్ధం గనుక 2027 వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో పతనమయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిది(ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరిం చారు. యుద్ధం త్వరగా ముగిసిపోతుందన్న ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయి. ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు పైనే ఉందన్నారు. దీని ఫలితంగా ఆహార వస్తువుల ధరలు 6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని జార్జివా తెలిపారు. కొనసాగుతున్న యుద్ధ భీభత్సం ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మందికి కావలసిన ఆహారం, ఔషధాలు అందకుండా చేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ప్రారంభమైన సామ్రాజ్యవాద అమెరికా-జియోనిస్టు ఇజ్రాయెల్ దాడులు, కీలకమైన మానవతా సహాయ మార్గాలను స్తంబింపజేశాయి.

            యుద్ధం వలన  ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సంక్షోభ ప్రాంతాలకు ప్రాణరక్షక సహాయం చేరడం ఆలస్యమైంది. ఆహారం, చమురు, రవాణా ఖర్చులు పెరగడంతో అదనంగా 4.5 కోట్ల మంది తీవ్ర ఆకలిలోకి నెట్టబడ్డారని అంచనా. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య ప్రస్తుత రికార్డు స్థాయి 3.1 కోట్ల నుంచి పైకి వెళ్తుందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్య్లూఎఫ్‌పి) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్లార్ స్కావ్ జెనీవాలో విలేకరులతో అన్నారు. “ఇది ప్రపంచ ఆకలి స్థాయిలను సర్వకాలిక రికార్డుకు తీసుకువెళ్తుంది. ఇది చాలా భయంకరమైన పరిణామం” అని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావ చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్ హెచ్చిరించటం భార‌త ప్ర‌జ‌లకు శ‌రాఘాతం.

Leave a Reply