ప్రభుత్వం రుణంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం ద్వారా వృద్ధిని ఉత్తేజ పరిచి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతాన‌ని చెప్తుంది. కాని ప్ర‌భుత్వాలు చేస్తున్న‌ అధిక రుణాలు ప్రైవేట్ పెట్టుబడులను తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని పెంచడం, భవిష్యత్ తరాలపై అధిక పన్నుల భారాన్ని మోపడం వంటి ప్రమాదాలను కలిగి ఉంటాయి. దీని మొత్తం ప్రభావం రుణ-జిడిపి నిష్పత్తి, ఖర్చు ఉద్దేశ్యం, వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది.  తాజా గణాంకాల ప్రకారం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల మొత్తం అప్పు 2026 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో సుమారు 81 శాతంగా ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభు త్వాల వాటా గణనీయమైనది. అంతకు ముందు 2024లో రాష్ట్రాల సగటు అప్పు జిఎస్‌డిపి నిష్పత్తి సుమా రు 27 శాతంగా ఉంది. పంజాబ్ రుణభారమైతే జిఎస్‌డిపిలో 45శాతం కంటే అధికం. ఇది తీవ్ర ఆర్థిక ఒత్తిడి ని సూచిస్తోంది. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆ నిష్పత్తి 25శాతం కంటే తక్కువగా ఉండటం ఆర్థిక స్థిరత్వాన్ని చూపుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2027 మార్చి నాటికి ద్రవ్య లోటును జిడిపిలో 4.3 శాతానికి తగ్గించాలి. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవస రం. రాష్ట్రాల ఆదాయంలో సుమారు 12.4 శాతం వడ్డీలకే వెళ్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇదింకా ఎక్కువే ఉంది. వడ్డీ చెల్లింపులు పెరిగితే అభివృద్ధికి నిధులు తగ్గిపోవడమే కాకుండా… మౌలిక సదుపాయాలు ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో పెట్టుబడులు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది.

భారతదేశంలో పెరుగుతున్న ప్రభుత్వ రుణం తీవ్రమవుతున్న ఆర్థిక వత్తిడిని ప్రతిబింబిస్తోంది. అధికమవుతున్న అప్పులు, ఎక్కువ‌వుతున్న వడ్డీ చెల్లింపులు అభివృద్ధి వ్యయాన్ని తీవ్రంగా  ప్ర‌భావితం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో ఓటర్ల ఆకర్షణకు సబ్సిడీలు, నగదు బదిలీలు వంటివి  ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. మన దేశంలో రాష్ట్రాల  మొత్తం బకాయి రుణాలు రూ 90 లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఇందులో తమిళనాడు రూ 9.6 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ. 8.6 లక్ష కోట్లు, మహారాష్ట్ర రూ. 8.1 లక్షల కోట్లు రుణాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక ఆరోగ్యం ప్రధానంగా దాని మొత్తం రుణం కంటే ఆ రాష్ట్రం యొక్క రుణ-జిఎస్‌డిపి నిష్పత్తి ద్వారానే నిర్ణయించబడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి సంపన్న రాష్ట్రాలు తమ నిష్పత్తులను జిఎస్‌డిపిలో 20 శాతం కంటే తక్కువగా ఉంచుతుండగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నఅనేక  రాష్ట్రాలు ఆర్థిక సంఘం నిర్థారించిన 30 శాతం సురక్షిత పరిమితిని మించిన భారాలను మోస్తున్నాయి. 

ఆర్థిక వృద్ధిపై రుణప్రభావం ఒక నాన్- లీనియర్ మార్గాన్ని అనుసరిస్తుంది. మితమైన రుణం ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరుస్తుంది. కానీ అధిక రుణ సంచయం దీర్ఘకాలిక పనితీరును కుంటుప‌రుస్తుంది. సంస్థాగత బలం, వడ్డీరేట్, వాతావరణం, ప్రభుత్వ రుణమా లేక ప్రైవేట్‌దా అనే దానిపై ఆధారపడి కచ్చితమైన మలుపు తీసుకుంటుంది. అధిక రుణం ఒక ‘భారాన్ని’ సృష్టిస్తుంది. ఇది అధిక వడ్డీ రేట్లు, తగ్గిన మూలధన సమీకరణ, స్థానభ్రంశం చెందిన ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా వృద్ధిని మందగింప జేస్తుంది. రుణాన్ని వ్యూహత్మకంగా ఉపయోగించినప్పుడు, రుణం ఆర్థిక విస్తరణకు కీలక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఒక దుర్విష వలయంలో చిక్కుకున్నా యి. వృద్ధికి రుణం అవసరమే కాని, విపరీతంగా పెరుగుతున్న రుణ వ్యయాలు, అధిక రుణ చెల్లింపుల కారణంగా పేద దేశాలు ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకమైన ప్రజా సేవల కంటే అప్పుల కే ఎక్కువగా చెల్లిస్తున్నాయి!

అంతర్గత -బాహ్య అప్పులను కలిపితే భారతదేశ మొత్తం అప్పు 2024-25లో సుమారు 205 నుంచి 210 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇది దేశ జిడిపిలో 55-60 శాతం వరకు ఉంటుంది. దీనిలో విదేశీ అప్పు 2024 చివరి నాటికి సుమారు (650 బిలియన్ డాలర్లు రూ.54 లక్షల కోట్లు)గా ఉంది. భారత ప్రభుత్వ మొత్తం రుణం బాధ్యతలు (రుణం) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.214.82 లక్షల కోట్లుగా (దాదాపు 2.58 ట్రిలియన్ డాలర్లు) అంచనా వేయబడ్డాయి. ఇది అంతకు ముందు సంవత్సరం లోని రూ.197.18 లక్షల కోట్ల నుండి పెరిగింది. ఈ అప్పులు భవిష్యత్ తరాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఆర్థిక‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. దేశ జనాభా సుమారు 142 కోట్లుగా పరిగణిస్తే, ఒక్కో వ్యక్తిపై సగటు అప్పు దాదాపు 1.44 లక్షల రూపాయల నుంచి 1.48 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 

ఆర్థిక సంవత్సరం— అప్పులు (రూ. కోట్లలో)

2014-15                    62,75,553 కోట్లు

2015-16                         68,91,913 ,,

2016-17                         72,15,439  ,,

2017-18                         82,32,653  ,,

2018-19                         90,56,725  ,,

2019-20                        1,00,18,120 ,,

2020-21                        1,21,21,959 ,,

2021-22                        1,35,87,893 ,,

2022-23                       1,52,61,122 ,,

2023-24                       1,69,46,666 ,,

2024-25                       1,76,70,510 ,,

2025-26                      1,91,52,510 ,,

2026-27                      2,14,52,000 ,,

కౌర్, ముఖర్జీ ప్రచురించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క (2012)  ప్రత్యేక పత్రం, అధిక స్థాయిలలో ప్రభుత్వ రుణం ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఎత్తి చూపింది. భారతదేశానికి సాధారణ ప్రభుత్వ రుణం-జిడిపి  నిష్పత్తి యొక్క పరిమితి స్థాయి 61 శాతం అని, దానిని దాటితే రుణం వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వారు పేర్కొన్నారు. మోడీ పాలనలో రుణ-జిడిపి నిష్పత్తి పెరిగిందనే గణాంకం నుండి ఇది స్పష్టమవుతోంది, ఇది ప్రభుత్వ రుణ నిర్వహణలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తుంది. భారతదేశ సాధారణ ప్రభుత్వ రుణం (కేంద్ర, రాష్ట్రాల సంయుక్త బాధ్యతలు) స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో సుమారు 81 శాతం నుండి 83 శాతం వరకు ఉంది. ఆర్థిక వృద్ధి జరుగాలంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలను తగ్గించడం కంటే, మరిన్ని ఉద్యోగాలను సృష్టిం చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దీర్ఘకాలంలో వృద్ధి నిలకడగా ఉండాలన్నా, దేశం అభివృద్ధి చెందాల న్న, అసమానత, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై మనం దృష్టి పెట్టాలి. ప్రస్తుతం భారతదేశంలో ఈ సూచికలన్నీ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. 

విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.1.3 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. ఇవి రైతులు, పేదలకు సాయపడుతున్నా, ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఒత్తిడిని పెంచుతాయి. ప్రభుత్వాలు కొన్ని సార్లు బడ్జెట్‌లో చూపించకుండానే ప్రత్యేక సంస్థల ద్వారా అప్పులు తీసుకుంటాయి. ఇలాంటివి జిడిపిలో రెండు శాతం దాకా ఉండొచ్చు. 2030 నాటికి పింఛన్ల వ్యయం రూ. మూడు లక్షల కోట్లు దాటుతుందని అంచనా. ఇది కూడా ప్రభుత్వాలకు ఊపిరి సలపకుండా చేసేదే. పెట్టుబడి వినియోగ సామర్థ్యం తక్కువ గా ఉండటమూ ముఖ్యమైన సమస్యే. రాష్ట్రాల బడ్ౙెట్లలో పెట్టుబడులకు కేటాయిస్తున్న నిధుల్లో 65 శాతమే వినియోగమవుతున్నాయి. 

నీతి అయోగ్ 2023-24కు సంబంధించి రాష్ట్రాల పనితీరును విశ్లేషించే ‘ఆర్థిక ఆరోగ్య సూచీ (ఎఫ్‌హెచ్ఐ)-2026’ ని తాజాగా  విడుదల చేసింది. ఖర్చుల నాణ్యత, ఆదాయ సమీకరణ, ఆర్థిక వివేకం, రుణసూచీ, రుణస్థిరత్వం వంటి అయిదు ప్రధాన ప్రమాణాల ఆధారంగా దీన్ని రూపొందించింది. ఈ సూచీ ప్రకారం రాష్ట్రాలను నాలుగు వర్గాలుగా విభజించారు. అఛీవర్ వర్గంలో ఉన్న ఒడిశా, గోవా, ఝార్ఖండ్ బలమైన ఆదాయం, తక్కువ లోటు, క్రమశిక్షణతో ఉత్తమ ఆర్థిక స్థితిని ప్రదర్శిస్తున్నాయి. ఫ్రంట్ రన్నర్ వర్గంలోని గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక మంచి ఆర్థిక పనితీరును చూపుతున్నా, కొన్ని అంశాల్లో మెరుగుదల అవసరం. పెర్ఫార్మర్ వర్గంలోని మధ్యప్రదేశ్, హరియాణా, బీహార్, తమిళనాడు, రాజస్థాన్‌లు మోస్తరు పనితీరుతో మిశ్రమ ఫలితాలను సాధిస్తున్నాయి. యాస్పిరేషనల్ వర్గంలో ఏపి, పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ ఉన్నాయి. ఇవి అధిక లోటు, అప్పులు, బలహీన ఆదాయ వృద్ధితో సతమతమవుతున్నాయి. 

ఎఫ్‌హెచ్ఐలో ఏడో ర్యాంకు సాధించిన తెలంగాణ- అధిక జిఎస్‌టి వసూళ్లు, వృద్ధి వేగంతో ఆదాయ సమీకరణలో బలంగా ఉంది. ఐటీ, ఔషధ రంగాల్లో ప్రగతి ఇందుకు తోడ్పడుతోంది. అయితే భారీ సాగు నీటి ప్రాజెక్టులు, సంక్షేమ వ్యయాలతో ఖర్చుల్లో నాణ్యత మధ్యస్థంగానే ఉంది. ఎఫ్ఆర్‌బిఎం పరిమితు లను తరచూ అధిగమిస్తుండటంతో ద్రవ్యలోటును నమోదు చేస్తోంది. మౌలిక సదుపాయాలు, సంక్షేమం పై భారీ ఖర్చులే ఇందుకు కారణం. ఎఫ్‌హెచ్ఐ సూచీలో యాస్పిరేషన్ వర్గంలో ఉన్న ఏపి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అధిక రుణభారం, తక్కువ ఆదాయవృద్ధి, ఖర్చుల నిర్వహణలో సమస్యలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి రావడం. సంక్షేమ వ్యయాలే ఇందుకు కారణమవుతున్నాయి. 

జిఎస్‌టి పరిహార పంపిణీ 2022లో ముగియడం రాష్ట్రాలకు సమస్యగా మారింది. దీనివల్ల కొన్ని రాష్ట్రాలకు సుమారు రూ.80 వేల కోట్ల ఆదాయ లోటు ఏర్పడింది. రిజర్వు బ్యాంకు హెచ్చరిక ప్రకారం, రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే 2027 నాటికి వాటి అప్పు జిడిపిలో సుమారు 30 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అందుకని, రాష్ట్రాలు అప్పుల నిర్వహణపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. అయిదేళ్లలో జిఎస్‌డిపిలో అప్పును 2-3 శాతం తగ్గించే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఎఫ్ఆర్‌బిఎం చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో పెట్టుబడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. గ్యారంటీలు, అదృశ్య అప్పుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలి. రుణాలు తీసుకోవడంకన్నా, వాటిని ఎంతమేర ఉత్పాదక రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నామన్నదే ముఖ్యం. దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి అదే కీలకం. 

పెరుగుతున్న  ఈ అప్పుల వల్ల అధిక రుణ-జిడిపి నిష్పత్తి ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ అనేక సామాజిక, ఆర్థిక సూచికల విషయంలో అంతగా రాణించడం లేదు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవ నెత్తుతోంది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ఇలా రుణాలు తీసుకోవడం వల్ల లబ్ది పొందుతున్నది ఎవరు? ఈ తక్కువ సామాజిక-ఆర్థిక సూచికలు, ప్రభుత్వం ఈ డబ్బును ఖర్చు చేస్తున్న విధానంపై కూడా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుత ప్రభుత్వం దీర్ఘకాలిక సుస్థిర వృద్ధిపై దృష్టి పెట్టడం లేదని, దానికి బదులుగా ప్రకటనలు, స్వల్ప బదిలీల ద్వారా ఓటర్లను ప్రస్నం చేసుకుంటూ తమ ఎన్నికల లక్ష్యాన్ని సాధించడంలోనే నిమగ్నమై ఉందని అన్ని ఆర్థిక సూచికలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలంలో వృద్ధి నిలకడగా ఉండాలన్నా, భారతదేశం వంటి దేశం అభివృద్ధి చెందాలన్నా, అసమానత, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై దృష్ట పెట్టాలి. ప్రస్తుతం భారతదేశంలో ఈ సూచికలన్నీ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. 

అధిక రుణ-జిఎస్‌డిపి నిష్పత్తి కారణంగా, రాష్ట్రాలు తమ రాబడిలో అధిక భాగాన్ని కేవలం వడ్డీ చెల్లింపులకే ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల మూలధన వ్యయం (రోడ్లు, పాఠశాలలు), ఆసుపత్రుల నిర్మాణం) కోసం నిధులు తక్కువగా మిగులుతాయి. నిర్మాణాత్మక డిఫాల్ట్ లను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ధోరణులను నిశితంగా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత వినియోగం, ఉచిత పథకాలకు నిధులు సమకూర్చడానికి తరచుగా రుణాలు తీసుకునే రాష్ట్రాలను ఇది హెచ్చరిస్తుంది. రుణ పరిమితిలో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు, వరుసగా తమ జిఎస్‌డిపిలో 46.9 శాతం, 40 శాతం రుణ భారాన్ని మోస్తూ, రాష్ట్రాలలో అత్యంత భారీ రుణ భారాన్ని కలిగి ఉన్నాయి. మరోవైపు, గుజరాత్, మహారాష్ట్రలు సాపేక్షంగా తక్కువ ఆర్థిక భారంతో ఉన్నాయి. 17 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో రుణ- జిఎస్‌డిపి నిష్పత్తులు, 2018లో ఎఫ్ఆర్‌బియం సమీక్షా కమిటీ నిర్ధేశించిన 20 శాతం పరిమితిని ప్రస్తుతం మించి ఉన్నాయి. ఈ ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే.. అభివృద్ధి సంక్షేమం కుంటుప‌డి సమాజం అల‌జ‌డులు, అస్థిర‌త‌లో కూరుకుపోతుంది. ఫ‌లితంగా స‌మాజం అశాంతికి లోన‌వుతుంది. మొత్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన స‌మాజం ఏదైనా.. తీవ్ర సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఆక‌లి చావులు, ఆత్మ‌హ‌త్య‌లు నిత్య‌కృత్య‌మ‌వుతాయి. ఈ నేప‌థ్యంలోంచే..  అప్పులు స‌ద్వినియోగం కావాలి. అప్పులు ఆర్బాటాలు విలాసాల కోసం కారాదు. అప్పులు ప‌ప్పుకూడుకోసం అయితే.. ఆ అప్పులో సామాజిక ప్ర‌యోజ‌నం ఇమిడి ఉంటుంది.

Leave a Reply