సుమ‌తి గురించి అంద‌రికీ తెలియాలి. అంత అద్భుత మ‌హిళ ఆమె. మొద‌ట ఆమె చాలా మామూలు మ‌నిషి. కానీ లోకాన్ని తెలుసుకున్న‌ది. త‌న‌నుతాను తెలుసుకున్న‌ది. పితృస్వామ్యాన్ని అర్థం చేసుకున్న‌ది. మాతృత్వ భావ‌న‌ను స‌హితం అధిగ‌మించి నూత‌న మాన‌వి అయిన‌ది.  వ్య‌వ‌స్థ సంకెళ్ల‌ను తెంచుకున్న‌ది.  ఎంత ప‌రిణామం జ‌రిగి ఉండాలి!  భౌతిక‌, భావ‌జాల ప్ర‌పంచంలో ప్ర‌జ‌లు సాగిస్తున్న మ‌హాద్భ‌త పోరాటాల ప్ర‌మేయం లేకుండా ఆమె కామ్రేడ్ సుమ‌తిగా ప‌రివ‌ర్త‌న చెందాదా?  మాన‌వ‌జీవితాన్ని విలువ‌ల‌, విశ్వాసాల ప‌రివ‌ర్త‌నా క్ర‌మంలో చూసే సాహిత్య‌కారుల‌కు త‌ప్ప‌క సుమ‌తి తెలిసి ఉండాలి. అందుకే నాకు తెలిసిన కామ్రేడ్ సుమ‌తి గురించి నాలుగు మాట‌లు మీతో. 

సుమతి   మూడున్నర దశాబ్దాల కాలం పాటు అజ్ఞాత యోధగా అత్యంత నిస్వార్థంగా  భారత విప్లవోద్యమానికి తన సేవలందించింది.  68వ ఏట తీవ్రఅనారోగ్యంతో ఒక మారుమూల పల్లెలో మరణించింది. ఆమె గొప్ప అనుభవాల తరగని గని, శ్రామిక మహిళా యోధ  సుమతి మరణం  విప్ల‌వోద్య‌మానికి  తీరని లోటు. 

సికింద్రాబాద్‌లో రైల్వే కార్మికుడు డి. రాఘవులు, డి. రంగమ్మల ఆరుగురు సంతానంలో2వ కూతురుగా కామ్రేడ్‌ సుమతి 1950లో జన్మించింది. మధ్యతరగతి కుటుంబం. సుమతి10వ తరగతి వరకు చదివింది. చిన్నతనంలో చురుకుగా, హుషారుగా అన్ని పనుల్లోముందుండేది. అమ్మాయిననే బెరుకుదనం లేకుండా ఒంటరిగా తను ఒక్కతే కుటుంబ పనులపైచుట్టాల ఇంటికి రైలులో ప్రయాణం చేసి పోయి వచ్చేది. అది అనాడు అరుదైన విషయమే.తనకు 22 ఏళ్ల వయస్సులో అంటే 1972లో కామ్రేడ్‌ ఉడుత శ్రీనివాసులుతో వివాహమైంది.అప్పటికే కామ్రేడ్‌ శ్రీనివాసులు పోస్టల్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తూ సి.పి.ఐ. రాజకీయాలపట్ల అకర్షితుడై కార్మికరంగంలో యాక్టివిస్టుగా పనిచేసేవాడు. తర్వాత అనతికాలంలోనే నక్సల్పరీశ్రీకాకుళం సాయుధ విప్లవ రైతాంగ పోరాటాల ప్రేరణతో సిపిఐ (ఎం. ఎల్‌) తో  సంబంధాలనుఏర్పరచుకొని అందులో కార్యకర్తగా మారాడు. కామ్రేడ్స్‌ సుమతిశ్రీనివాసుల‌ పెళ్లి కట్నకానుకలు,బాజా-బజంత్రీలు లేకుండా కమ్యూనిస్టు ఆదర్శాలతో స్టేజీపై ఉపన్యాసాలతో జరిగింది. వీరికిముగ్గురు సంతానం.

కామ్రేడ్‌ సుమతికి విప్లవ రాజకీయాల పట్ల పరిచయం తనకు వివాహమైన తర్వాతకార్మికసంఘం నాయకుడైన తన సహచరుడి ద్వారానే జరిగింది. తన ఇంట్లో విప్లవ సాహిత్యంపైజరిగే చర్చలు, విప్లవకారుల రాకపోకలతో కూడిన విప్లవకర వాతావరణం తను కూడావిప్లవకారిణిగా తయారవడానికి తోడ్ప‌డ్డాయి. తన సహచరుడు కార్మికులను సంఘటితం చేసిఉద్యమాలను నడిపే క్రియాశీల కార్మికసంఘ నాయకుడు కావడం వల్ల ఆయనను అధికారులుఒక చోటి నుండి మరో చోటికి ఏడాదికి ఒకసారి బదిలీ చేసి ఇబ్బందుల పాలు చేస్తుండేవారు.ఎమర్జెన్సీ కాలం (1975-76)లో ఇందిరా ప్రభుత్వం ఎందరో విప్లవకారులతో పాటుశ్రీనివాసులును కూడా జైలు పాలు చేసింది. దీనితో ఆ సమయంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను,కుటుంబ సమస్యలను, మానసిక ఒత్తిడులను కామ్రేడ్‌ సుమతి ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది.ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత శ్రీనివాసులు జైలు నుండి విడుదలయ్యాక ఆయన మళ్లీకార్మికరంగంలో విప్లవకర కార్యకలాపాలలో క్రియాశీలంగా పనిచేయడానికి కామ్రేడ్‌ సుమతి తన పూర్తి సహాయ సహకారాలను అందించింది.

1972-80 మధ్యకాలంలో  సుమతి పిల్లల పెంపకం పనిలో, ఇంటి పనిలోతీరిక లేకుండా ఉంటూనే తమ ఇల్లు ప్ర‌జా ఉద్య‌మాల‌కు  చాలా నమ్మకమైన చోటుగా ఉపయోగపడడంలో నిర్వహించిన పాత్ర కొనియాడదగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకార్మికోద్యమంతో పాటు వివిధ ప్రజా ఉద్యమాలు పెల్లుబికి విస్తరించిన 1980-85 మధ్య కాలంలోవీరి ఇల్లు ఎంతో మంది విప్లవకారులకు ఒక ముఖ్యమైన శిబిరంగా మారింది. ఈ కర్తవ్యనిర్వహణలో సుమతి అత్యంత సేవాభావంతో పనిచేస్తూ, ప్రేమాభిమానాలతో,అప్యాయతతో, చాలా కలుపుగోలుతనంతో ఉంటూ కామ్రేడ్స్‌ ఆదరాభిమానాలు చూరగొన్నది.ఈ కాలంలో ఆమె మ‌న దేశ ప్ర‌జా పోరాటాల‌కు, దేశ దేశాల విప్ల‌వ ప్ర‌జా ఉద్య‌మాల‌కు సంబంధించిన పుస్తకాలను అధ్యయనం చేసింది. అమ్మ, కాకలు తీరిన యోధుడు, నార్మన్‌బెతూన్‌ జీవిత చరిత్ర, నా కుటుంబం లాంటి నవలలు ఆమెను ఎంతో ఉత్తేజపరిచాయి. ఆమె విప్ల‌వోద్య‌మానికి అవ‌స‌ర‌మైన ప‌నులు చేసేట‌ప్ప‌డు  చాలా మంది కామేడ్స్‌కు కా. సుమతి తన వయసుకు, అనుభవానికి మించి ఒక అక్కలా, ఒక తల్లిలా ఎంతో చాతుర్యంగా తన బాధ్యతలను నిర్వహించింది. ఈ కాలంలో ఆమె ఉద్య‌మానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పనులలో తన సహకారాన్ని అందించింది.తమ ఇంటికి వచ్చిన కార్య‌క‌ర్త‌ల‌కు తలెత్తే అనారోగ్య సమస్యలకు చిన్న చిన్న సలహాలుసూచనలతో పరిష్కారాలు చూపించేది. ముఖ్యంగా   మహిళా కామ్రేడ్స్‌తోకా. సుమతి చాలా మాన‌వీయ  సంబంధాలు కొనసాగిస్తూ వారికి అన్ని విషయాల్లోనూతోడ్చాటునందించింది.   సుమతి అనారోగ్యంతో ఉన్న కొందరు మహిళా కార్య‌క‌ర్త‌ల‌కు ఒక మంచి మిత్రురాలిగానే  గాకుండా ఒక కమ్యూనిస్టు తల్లి లాంటి ప్రేమను పంచి,సేవలనందించి వారు త్వరగా కోలుకొనేలా తోడ్ప‌డింది. వారికి ఒక మంచి స్నేహితురాలిగా, శిక్షకురాలిగా, సలహాదారుగా ఉంటూ వారిని దృఢమైన  కార్య‌క‌ర్త‌లుగా తీర్చిదిద్దటానికి కృషిచేసింది. ఈ కాలంలో కొనసాగిన ప్రజావెల్లువలను, జనవాహినిని చూసి నూతనోత్తేజాన్ని పొందింది. ఇలా కా. సుమతి ఒక విప్లవకారిణిగా పరిణతి చెందింది.

1980ల తొలి భాగంలో కార్మికరంగంలో ఉద్యమ కార్యకలాపాలు బాగా విస్తరించాయి.వీటిలో కా. శ్రీనివాసులుతో సహా సంబంధిత నాయ‌కులు  క్రియాశీల నాయకత్వ పాత్ర వహించారు.వీటిలో పోస్టల్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌ కార్మికుల సమ్మె చెప్పుకోదగినది. ఆ సమ్మెకు మద్దతుగా వివిధకార్మికసంఘాలు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆ పోరాటం కార్మిక ఐక్యతపై మంచి ప్రభావాన్నికలిగించింది. దీనితో ప్రభుత్వం కన్నెర్ర జేసి 1983లో కామ్రేడ్‌ శ్రీనివాసులుతో పాటు మరికొంతమంది కార్మిక నాయకులను ఉద్యోగం నుండి తొలగించింది. తను కార్మిక సంఘంలో పాల్గొనననీ,తనది తప్పని పేర్కొంటూ హామీపత్రం రాసివ్వాలనీ అధికారులు బెదిరించినప్పటికీ ఆయన ఆబెదిరింపులకు తలవంచక దృఢంగా నిలిచి పోరాడడంలో ఆయనకు కామ్రేడ్‌ సుమతివిష్లవస్ఫూర్తితో అండగా నిలిచింది. ఆ  తోడ్పాటు మరువలేనిది. ఆ సమయంలోఉద్యోగాలు పోయిన కార్మిక కుటుంబాలకు కార్మికసంఘాలు చందాలు జమచేసి ఇచ్చి వారికిఅండగా నిలిచాయి. ఉద్యోగం పోయిన శ్రీనివాసులు కుటుంబానికి అలా దొరికిన కొద్దిపాటిసహాయ సహకారాలతోనే సహచరునితో పాటు అమె దృఢంగా నిలిచింది.

1980-85 మధ్య ర‌హ‌స్య  బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్య సమస్యలుఅమెకు ఇబ్బంది కలిగించేవి. తమ చిన్న ఇల్లు ఎప్పుడూ వచ్చే పోయే కార్య‌క‌ర్త‌ల‌తో, ఎల్లప్పుడూ త‌మ ద‌గ్గ‌ర ఉండే  ఇద్దరు ముగ్గురు కార్య‌క‌ర్త‌ల‌తో  సందడిగా ఉండేది. దీని ప్రభావం నిరంతరం పిల్లలపెంపకంపై, వారి చదువులపై పడినా, తనకు కుటుంబ ప్రైవసీ కొరవడినా, తన సహచరుడుకార్మికోద్యమ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండ‌టం వ‌ల్ల  బాధ్యత, భారాన్నంతటినీ తనపైననే వదిలిపెట్టినా, ఆయనకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఆమెచాలా ఓపికగా, నొచ్చుకోకుండా అన్నీ చాకచక్యంగా చకృబెట్టేది. ఇది కామ్రేడ్స్‌ అందరినీఅశ్చర్యపరిచేది. దీనితో అమెను అందరూ ఒక చాలా నమ్మకమైన, ఆదర్శవంతమైన కామ్రేడ్‌గా గౌరవించేవారు.

1985లో అంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విష్ణవోద్యమంపై ఫాసిస్టు ప్రభుత్వ నిర్బంధంతీవ్రతరమైంది. శత్రువు ఎంతో మంది మెరికల్లాంటి నవయువ విప్లవకారులను బూటకపు ఎన్‌కౌంటర్లలో క్రూరంగా కాల్చి చంపారు. మరెంతో మందిని జైళ్లలో పెట్టారు. దీనికి  సుమతి ఎంతో బాధ పడింది. కానీ ఉద్య‌మానికి  కలిగిన ఈ నష్టాలను చూసి అమె భీతిల్లకుండాచాలా ధైర్యంగా విప్లవస్ఫూర్తితో దృఢంగా నిలిచింది. అమరుల పోరాటదీక్షను, త్యాగాలనుచూసి ఆమె విప్లవ స్పూర్తి పొందేది. ఆ అమరుల త్యాగాల ముందు త‌మ  ఇబ్బందులు ఏపాటివనేది.అమె చెప్పే ఈ ధీరోదాత్త మాటలు తమ  ద‌గ్గ‌రికి  వచ్చే కామ్రేడ్స్‌ అందరికీ, ప్రత్యేకంగా మహిళాకామ్రేడ్స్‌కి నూతనోత్తేజాన్ని నింపేవి. నిర్బంధ కాండ మధ్య కామ్రేడ్స్‌ సుమతి-శ్రీనివాసులుప్రదర్శించిన ధైర్యసాహసాలు వీరిపై తమ సహ కామ్రేద్స్‌కు, తమ బంధుమిత్రులకు మరింతన‌మ్మ‌కాన్ని,  గౌరవాభిమానాలను పెంచాయి.

ఇలాంటి పరిస్థితులలోనే కామ్రేడ్స్‌ సుమతి-శ్రీనివాసులు కుటుంబం మొత్తంగా రహస్య జీవితంలోకి వెళ్లాలని ఉద్య‌మం  నిర్ణయించింది. దీనిని వీరు ఎలాంటి శషబిషలు లేకుండాఉన్నత చైతన్యంతో తమ బంధుమిత్రులను, పుట్టిన ఊరిని వదిలిపెట్టి మరొక రాష్ట్రంలోకి వెళ్లి  రహస్య   బాధ్యతలను చేపట్టారు. అక్కడ ఈ బాధ్యతలు నిర్వహిస్తుండగా రెండేళ్ల కాలంలోనే వారికి ఉద్య‌మంతో సంబంధం తెగిపోయింది.   ఆ సమయంలో కలిగిన ఆర్థిక తదితర అనేక ఇబ్బందులను కామ్రేడ్‌ సుమతి నిబ్బరంగా ఎదుర్మొన్నది. దీని తర్వాత కొంత కాలానికి వారు ఉద్య‌మ సంబంధాల్లోకి వ‌చ్చారు. ఆ కాలంలోనే ఉద్య‌మంలో తలెత్తిన అంతరంగిక సంక్షోభంలో  కూడా అమె తన సహచరునితో పాటు ఎలాంటి ఊగిసలాటలకు గురికాకుండా  ఉద్య‌మ పంథా  వైపు చాలా దృఢంగా నిలబడింది.

భారత విప్లవోద్యమ చరిత్రలో 1990వ దశకం అభివృద్ధికి, విస్తరణకు గీటురాయిగా మారింది. ఆ కాలం  ఒక ప్రత్యేకత కలిగిన‌ది.  ఇలాంటి దశకంలోకామ్రేడ్స్‌ శ్రీనివాసులు-సుమతిల కుటుంబం ఉద్య‌మ అవసరాలకు అనుగుణంగా  అనేక‌ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది.

ఇందుకోసం శ్రీనివాసులు-సుమతి ఇత‌ర  రాష్ట్రాలలో  ఉద్య‌మానికి అవ‌స‌ర‌మైన  కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగటానికి అన్ని విధాలా తోడ్పడ్డారు. తమకుమొదట పరిచయమైన, విప్లవోద్యమ పునర్నిర్మాణంలో కీలకమైన భూమిక నిర్వహించిన తొలి త‌రం నాయ‌కులు  ఆ ఉద్య‌మానికే ఆటంకంగా మారినప్పుడు అమె ఎలాంటి శషబిషలకుతావు లేకుండా వారిని వ్యతిరేకించింది. విప్లవోద్యమంలో సాధించిన విజయాలను చూసి,నూతన  నిర్మాణాల‌ ఏర్పాటును చూసి ఆమె ఎంతో సంతోషించింది. ఉద్యమక్రమంలో కలిగిన నష్టాలను చూసి సమాజ సమూల మార్పుకు, నూతన సమాజం నెలకొల్పడానికిఅపూర్వమైన త్యాగాలు తప్పవని ప్రగాఢంగా నమ్మేది. అనాడు   భారతవిప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించటానికి చేసిన కృషిలో ఈ విప్లవ కుటుంబం పాత్రవిడదీయలేనంతగా మిళితమై ఉంది. ఈ   విప్లవకారులు చేసిన అత్యంత కఠినమైనఇలాంటి నిస్వార్థ సేవ ఉద్య‌మానికి  ఒక పెన్నిధి.

1990వ దశాబ్దం ఆరంభం నుండి మన దేశంలో ఆరంభమైన నూతన ఆర్థిక విధానాలప్రభావం వల్ల సమాజంలో ముందుకు వచ్చిన సామ్రాజ్యవాద సంస్కృతిపై తన సహచరునితోపాటు కా. సుమతి మార్క్సిస్టు దృక్పథంతో సరైన అవగాహన ఏర్పరచుకొని దానికి వ్యతిరేకంగాపోరాటవైఖరిని అవలంభించింది. దీనికోసం వీలైనంత సహకారాన్ని కా. శ్రీనివాసులు నుండి,వేర్వేరు ఉన్నత స్థాయి నాయకత్వం నుండి తీసుకుంటూ తన రాజకీయ చైతన్యాన్ని మరింతగాపెంపొందించుకున్నది. తన పిల్లలకు కూడా విప్లవ రాజకీయాలు, కార్మికవర్గ సంస్కృతి,కమ్యూనిస్టు ఆదర్శాల గురించి ఎడ్యుకేట్‌ చేయడంతో పాటు అందుకనుగుణంగా వారు ఎలాజీవించాలనే విషయం గురించి కూడా నేర్పించింది. ఈ విషయంలో తన వంతు బాధ్యతనుచాలా చక్కగా నిర్వహించింది. తమ పిల్లలు విప్లవబాటలో పెరిగేలా చాలా ప్రోత్సాహాన్నిఅందించింది.

1995లో నాయ‌క‌త్వం కా. శ్రీనివాసులుకు అంధ్ర రాష్ట్రంలో కార్మికోద్యమ రంగంలో బాధ్యతలనుఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కామ్రేడ్‌ శ్రీనివాసులు మనస్ఫూర్తిగా తన ఆమోదాన్ని తెలిపాడు.కామ్రేడ్‌ సుమతి కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. తాను   పిల్లల బాధ్యతనుచూసుకుంటూ ఉద్యమం  ఇచ్చే పనిని తన శక్తికొద్దీ చేస్తానని చెప్పింది. కానీ కా. శ్రీనివాసులు ఇంకాఈ నూతన బాధ్యతలలో చేరక ముందే కొద్ది రోజుల్లోనే మలేరియా జ్వరంతో అకస్మికంగాఅమరుడైనాడు. అనుకోని ఈ ఘటన   సుమతినే గాకుండా పిల్లలను కూడా చాలాతీవ్రంగా కలచివేసింది. అప్పుడు వారి బాధకు అంతు లేదు. ఆ స‌మ‌యంలో వారికి  ఎవ్వ‌రితోనే   ఎలాంటి సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కా. సుమతి, పిల్లలు చాలా నిబ్బరంగాఉండి ఎంతో సమయస్ఫూర్తితో ఆయన అంతిమ సంస్కారం నిర్వహించారు.   శ్రీనివాసులుఅంతిమ సంస్కారానికి బంధుమిత్రులెవ్వరూ రాకపోవడం వల్ల  చుట్టుప్రక్కల వారి నుండిఎదురైన సమస్యలను   సుమతి, పిల్లలు ఎంతో ధైర్యంగా సమయస్ఫూర్తితోపరిష్కరించుకున్నారు. ఆ త‌ర్వాత ఉద్య‌మ సంబంధాల్లోకి వ‌చ్చారు.  అ తర్వాత కూడాకా. సుమతి తన పిల్లలను విప్లవకారులుగా తీర్చిదిద్దుతూ, కుటుంబమంతా విప్లవ కృషి లోనేనిమగ్నమయ్యేలాగా చేసింది. విప్లవంలో ఎందరో కామ్రేడ్స్‌ చేస్తున్న ప్రాణార్ప‌ణలలో  భాగంగానే తన సహచరుడి మరణాన్ని ఒక గొప్ప త్యాగంగాప‌రిగణించింది. అందువల్లే ఆమె, తన పిల్లలు యథావిధిగా  త‌మ‌కు అప్ప‌గిచ్చిన బాధ్యతను కొనసాగించారు.

1999లో ఓ ప్ర‌యాణంలో బస్సు ప్రమాదం జరిగి కాలు విరిగింది. గతం నుండే ఉన్న రక్తపోటుతో పాటు సైనస్‌, తలనొప్పి, కాళ్ల నొప్పుల వంటిసమస్యలు ఎదురైనప్పటికీ వాటిని తన పనులకు అడ్డు రాకుండా చూసుకునేది.  సుమతి2000 సంవత్సరంలో తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ కొంత విరామం తర్వాతతన ఆరోగ్య పరిమితులను దృష్టిలో పెట్టుకొని   అప్పగించిన పనిని  నిర్వహించటానికి   శాయశక్తులా కృషి చేసింది. తీవ్రతరమైన శత్రు నిర్బంధంతోపాటు తన అనారోగ్యాన్ని గమనంలో ఉంచుకొని గత దశాబ్ద కాలంగా ఉద్య‌మం  ఆమెకుక్రియాశీలంగా పనిచేసే అవకాశం కల్పించలేక పోయింది.   నూతనప్రజాస్వామిక రాజ్యాధికారం నడిచే ప్రాంతంలో  జ‌రుగుతున్న రాజ‌కీయ‌, ఉద్య‌మ‌, ప్ర‌త్యామ్నాయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకసారైనా పాల్గోవాలనే తన చిరకాల కోరిక తీర్చ‌లేక‌పోయింది.   వయస్సు పైబడుతున్న కొద్దీ అరోగ్యం క్షీణిస్తున్నాఎల్లప్పుడూ హుషారుగా ఉంటూ, అందరితో కలిసిపోయి ఉల్లాసంగా ఉండే  సుమతిఎక్కడైనా ఉద్య‌మ కార్య‌క‌ర్త‌ల‌కు, పరిచయస్థులకూ, ఇరుగుపొరుగు వారికీ మంచిస్నేహాన్ని పంచేది. మిత్రులను సంపాదించుకునేది. అలాగే 25 ఏళ్ల సుదీర్ణకాలం పాటు విప్లవకార్మికోద్యమ నాయకునిగా, ఒక సమర్థవంతుడైన వ్య‌క్తిగా, రాజ‌కీయ బోధ‌కుడిగా  పనిచేసిన తనసహచరుడు  శ్రీనివాసులు అమరుడైనా ఆమె ఎంతో ధైర్యంగా చివరి వరకూపనిచేసింది.

1972 నుండి 2018 వరకు గత 45 ఏళ్లుగా కామ్రేడ్‌ సుమతి సుదీర్హ విప్లవ జీవితకాలమంతా వివిధ రూపాలలో విప్లవ సేవ చేస్తూ నిరంతరం తన రాజకీయ చైతన్యాన్నిపెంపొందించుకోవటానికి కృషి చేసింది. ఆమె అనేక ఉద్యమ ఆటుపోట్లను చవిచూసింది.తనకు అత్యంత ‘ప్రేమాస్పదుడైన సహచరుడిని కోల్పోయినా, తనకు పరిచయస్తులు  కొందరు  ఉద్యమాన్ని వదిలిపోయినా, తనకు పరిచయస్థులు ఎందరో అమరులైనా,కష్టాలు, నష్టాలెన్ని ముందుకు వచ్చినా,  ఉద్య‌మంతో సంబంధాలు తెగిపోయినా ఆమె చలించలేదు.ఒక నిజమైన, నిస్వార్థమైన కమ్యూనిస్టుగా  విప్లవం పట్ల,  ప్రజల పట్ల అచంచలవిశ్వాసంతో  విప్లవోద్యమాన్ని తన సర్వస్వంగా భావించింది. నిరంతరం విప్లవోత్సాహంతో,ఉల్లాసంతో పనిచేస్తూ కామ్రేడ్స్‌ అదరాభిమానాల్ని చూరగొన్నది.

సుమతి కుటుంబ బంధాలను విప్లవ ప్రయోజనాలకు అడ్డురానివ్వకుండా  తనకు ఇచ్చిన బాధ్యతలను నిర్వహించింది. అమరుల త్యాగాల స్పూర్తితో, కమ్యూనిస్టు స్పిరిట్‌తోతన పిల్లలను విప్లవకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది. తన తుదిశ్వాస వరకు విప్లవోద్యమఅభివృద్ధినీ,  సహ విప్లవకారుల, ప్రజల శ్రేయస్సునే కాంక్షించింది. 2018లో తన 68వళ్ల వయస్సులో తీవ్ర అనారోగ్యంతో ఒక  మారుమూల పల్లెలో విప్లవకారుల మధ్యతుదిశ్వాస విడిచింది.  అందరి నుండి అంతిమ సెలవు తీసుకొంది.   సుమతికి అక్కడికామ్రేడ్స్‌ అశునయనాలతో వినమ్రంగా శ్ర‌ద్ధాంజలి ఘటించారు.  సుమతి విప్ల‌వ స్ఫూర్తి, నెలకొల్పిన కమ్యూనిస్టు ఆదర్శాలు మనందరికీ సదా ప్రేరణగా నిలుస్తాయి.  

సుమ‌తి ఒక గొప్ప మాన‌వి. మ‌హిళ‌ల‌కు ఈ వ్య‌వ‌స్థ విధించిన ప‌రిమితుల‌ను ఆమె చైత‌న్య‌వంతంగా ఎదుర్కొన్న‌ది. నూత‌న మాన‌వ ఆవిష్కారం అంటే ఎలా ఉంటుందో త‌న జీవితాచ‌ర‌ణ ద్వారా నిరూపించింది. సాహిత్య‌కారులు  త‌మ కాల్ప‌నిక శ‌క్తితో, ఊహా బ‌లంతో అందుకోవల‌సిన కొత్త ప్ర‌పంచాన్ని మ‌న క‌ళ్ల ముందు వాస్త‌వం చేసింది. విప్ల‌వం ఎంత సృజ‌నాత్మ‌క‌మైన‌దో క‌దా. సుమ‌తిలాంటి వేలాది మందిని నిరంత‌రం రూపొందిస్తోంది. సుమ‌తిని మ‌నం అక్క‌డ గుర్తించాలి. అదే ఆమెకు నివాళి.  

Leave a Reply