సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి 2018 లో ప్రచురించిన “నిత్యకల్లోలం” కథాసంపుటి లోని , ఈ కథను చదివితే నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి ? అది ఎవరి కోసం? అభివృద్ధి ఫలితాలు ఏమిటి? అవి ఎవరి కోసం ?

నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలు వార్తా కథనాలై, ప్రత్యక్ష ప్రసారాలై, మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయి ? మనిషి వాటికి ఎలా స్పందిస్తున్నాడు  అనే ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.

నిద్రపుచ్చటం కన్నా ప్రశ్నించటం మంచిది అనుకుంటే, ప్రశ్నించే గుణం ,తత్వం ఈ రచయిత్రి కి ఈ రచయిత్రి సృష్టించిన అనేక పాత్రలకు పుష్కలంగా ఉన్నాయి.
*
అన్నీ మరిచిపోయి మనిషి నిద్రపోతాడు అన్నది అంతిమ సత్యం. ప్రభుత్వాలు ఎన్ని మారినా- పరిస్థితులు ఎంత మాత్రం మారవు అన్నది మనిషి నిశ్చిత అభిప్రాయం. ఎటొచ్చీ మనిషిని నిత్యం కలవరపరిచేవి రోజువారి సంఘటనలు, సందర్భాలు, సంఘర్షణలే. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవితం’ నిత్య కల్లోలం’. సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి రాసిన కథ పేరు కూడా ఇదే. 2018లో పాలపిట్ట బుక్స్ ప్రచురించిన (22 కథలు) ముదిగంటి సుజాతా రెడ్డి కథా సంపుటికి శీర్షిక కూడా ఇదే. మనిషిని కలవరపెడుతున్న నిత్య కల్లోలాల గురించిన కథాంశమే, చర్చనీయాంశమే  ఈ కథ.

పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు నిజమని నిర్ధారించిన విషయం కూడా ఇదే. మనిషి నిత్య కల్లోల జీవితంలో సున్నితమైన స్పందనలను కోల్పోతున్నాడు. జడ పదార్థంలా తయారయిన మనిషి లోపలి మానవీయత మరుగున పడుతోంది. మనిషి లోపలి శిశువు మరణించడమే వర్తమానత.
*
ఈ క్రమంలో  పైకి సాధారణంగా చెబుతున్నట్లు అనిపించినా అపరిమితమైన వేదనతో సంఘర్షణతో మనిషిలో, సమాజంలో మార్పుని ఆశిస్తూ, ప్రశ్నిస్తూ రాసిన కథ ఇది. పరిష్కారాన్ని రచయిత్రి ఈ కథలో చూపించదు చెప్పదు కానీ, మనిషి లోపలి విధ్వంసాన్ని ఈ కథలో చదివాక ఈ కథ ముగిసాక పాఠకుడిలో ఆలోచన మొదలవుతుంది. ఎన్నో కొత్త ఆలోచనలు విస్తరిస్తాయి. పాతవో, కొత్తవో అయిన ప్రశ్నలకు సమాధానాల్ని అన్వేషించమంటాయి. తమని తాము తడుముకుని తమని తాము వెతుక్కుని తమని తాము గుర్తించే క్రమంలో  తాము అప్పటిదాకా కోల్పోయింది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మనిషి పోగొట్టుకుంది, పోగొట్టుకుంటున్నదీ ఏమిటో ఈ కథ చెబుతుంది. మొన్ననో, నిన్న నో   జరిగిన కథ కాదు ఇది. ముగిసిన కథ కూడా కాదు, ముగింపు లేని కథ ,వర్తమాన కథ, భవిష్యత్తు కథ, నిత్యం కొనసాగుతున్న కథ ఇది. అసలు నిత్య వర్తమానతే ఈ కథ.
*
అత్యంత వినోదాత్మకమైన క్రీడలా ఉంటుంది రాజకీయపార్టీల విన్యాసం. ప్రభుత్వాల మెజారిటీ లేదా మైనారిటీ, స్వతంత్రుల మద్దతు లేదా ఉపసంహరణ, పార్టీల ఫిరాయింపు లేదా పదవవులనే విసర్జించటం ప్రభుత్వాలను నిలబెట్టడమో, సందిగ్ధంలో, సంక్షోభంలో పెట్టడమో, కూలదోయటమో ఇదంతా ఒక ఆట.. ఒక జూదం.! ఒక కుట్ర. నిత్య కల్లోలాలకు ఈ పరిస్థితి , ఈ అనిశ్చిత వాతావరణం కూడా ఒక ముఖ్య కారణమే.

ఈ కుట్రలో తెలియకుండానే  బలవుతున్న వాళ్లు, అంతకంతకూ బలహీనపడుతున్న వాళ్ళు,  విభజించబడుతున్న వాళ్లు సాధారణ ప్రజలు, దళితులు, మైనార్టీలు, బడుగు వర్గాల వారు, మహిళలు విద్యార్థులు రైతులే. నష్ట పోయే వాళ్లు నష్టపోతూనే ఉన్నా  లాభపడే వాళ్లు లాభపడుతూనే ఉంటారు. శ్రామికులు, సాధారణ రైతులు, కౌలు రైతులు, రైతు కుటుంబాలు, మహిళా రైతులు, రైతు పిల్లలు రకరకాల దోపిడీకి గురై, ప్రపంచీకరణ కారణంగా,  నిత్యం మార్కెట్ కు బలవుతూనే ఉన్నా, వ్యాపారస్తుడు  నష్టపడక పోవడమే నష్టాలకు గురి కాకపోవడమే రాజకీయం. ఇక్కడ దోపిడీకి గురవుతున్నది సాధారణ కొనుగోలుదారుడూ, సాధారణ పౌరుడే.

తన సంపాదనతో ధైర్యంగా ఉల్లిగడ్డలు కొనలేని స్థితిలో ఉన్న సాధారణ మనిషికి ఎల్సిడి టీవీని చూస్తే అద్భుతం అనిపిస్తుంది ,కళ్ళు తిరుగుతాయి, లక్షా యాభై వేల రూపాయలు ఆ టీవీ ఖరీదు అంటే అతడికి ప్రాణం పోయినంత పని అవుతుంది.

డి ఎ పెరిగితే టీవీ కొనాలనే అత్యాశ కలిగిన ఉద్యోగి ప్రసాద్. నిత్యం కంప్యూటర్ మీద గంటలు గంటలు పని చేసే వాళ్ళకి కనీసం మంచి కుర్చీ ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేని అధికారులు, వ్యవస్థ ఆఫీసు ప్రక్షాళనకు మాత్రం కోట్లు ఖర్చు పెట్టడం విశేషం , విచిత్రం. దేనికి తప్పనిసరిగా డబ్బు ఖర్చు పెట్టాలో దానికి బడ్జెట్ కేటాయించకపోవడం, అనవసరమైన వాటికి నిరుపయోగమైన వాటికి నిష్ప్రయోజనమైన వాటికి లక్షలాది కోట్లాది రూపాయలు కేటాయించడం  గమనార్హం. కథ ప్రారంభంలోనే ఈ అంశం ప్రస్తావనతో, అభివృద్ధిని ఎట్లా చూడాలి, ఏ కళ్ళతో చూడాలి అనేది అర్థం అవుతుంది. ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు, సాధారణ మనిషికి డీఏ పెరిగినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని తెలిసిపోతుంది.
తీవ్రమైన నడుము  నొప్పికి, వెన్నెముక నొప్పికి కారణమైన కుర్చీని అధికార యంత్రాంగం లేదా రాజ్యం మార్చకపోవడం లేదా అతడైనా  మార్చుకోలేకపోవటం, అందుకు  సమర్థవంతంగా ప్రయత్నించకపోవడం, మనిషిలో కొరవడిన రాజకీయ చైతన్యానికి ఒక గొప్ప సూచన అని ఈ కథలో చెప్పడం రచయిత్రికి ఉన్న రాజకీయ అవగాహనకు నిదర్శనం.

*

ధరల నియంత్రణ లేకపోవడం, గిట్టుబాటు ధర అందకపోవడం, బ్రతుకు భరోసా లేకపోవడం, వేతనాల పెంపు లేకపోవడం, కరువు భత్యం చాలకపోవడం రైతుని సగటు మనిషిని కలవరపెట్టే అంశాలు. సమాజంలోని అనిశ్చిత స్థితి, రాజకీయ అభద్రత,  రాజకీయ కల్లోలం  ఉల్లిగడ్డలు సైతం కొనలేని స్థితిలోకి సగటు మనిషిని కలచివేసే అంశాలు.

*

సగటు ఉద్యోగి ప్రసాద్ ఆఫీస్ నుండి బయలుదేరి బస్టాండ్ కి వస్తాడు. ఎంతకూ బస్సు రాదు. బంద్ కారణంగా కార్యకర్తలు బస్సులను అద్దాలు పగలగొట్టి పెట్రోలు పోసి తగలబెట్టి ఉంటారని, అప్పుడు బస్సులు బంద్ అయి ఉంటాయనీ అనుకుంటాడు. భార్య మనం కొత్త టీవీ కొందాం అని చెప్పి ఉంటుంది. బజార్ వైపు నడుస్తూ షాపుల్లో జనం బాగానే ఉన్నారని అనుకుంటాడు.
ఇక్కడి నుండి కథ వేగంగా కదులుతుంది. రకరకాల టీవీలను చూస్తాడు. టీవీలో రకరకాల దృశ్యాలు మనసును కలచి వేస్తాయి.

యువ నాయకుడి ఉపన్యాసం.. చుట్టూ ఇసుక వేస్తే రాలని జనం ఇతర పార్టీల నుంచి చాలా సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చి అతడి పక్షంలో చేరుతున్నారు. పార్టీ పేరు ఇంకా ప్రకటించలేదు. పార్టీ మెజారిటీ పడిపోయే పరిస్థితి. ప్రభుత్వం పడిపోయినా పడిపోవచ్చు అనేది వార్త.

ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా  ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటాడు ప్రసాద్.

ఇంకో  కంపెనీ టీవీలో.. ఇంకో దృశ్యం. నిరాహార దీక్ష చేస్తున్న నాయకుడు దూరంగా గుంపులు గుంపులుగా జనం.నిరాహార దీక్ష చేస్తున్న నాయకునికి మద్దతు పలుకుతూ తండోపతండాలుగా రైతులు వచ్చారు అన్నది వార్త. లాఠీఛార్జి జరిగి, జనం రక్తసిక్తమై పరిగెత్తడం చూసి చలించిపోతాడు ప్రసాద్.

మరొక టీ.వీ లో మరొక దృశ్యం..

ప్రధానమంత్రి మౌనధారణలో ఉంటాడు మంత్రులు అరుస్తూ ఉంటారు. మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ భూమి మీద ఎవరు ధరించని ధరించడానికి వీలులేని డ్రెస్సులతో స్టేజి మీద జీవం లేని బొమ్మల్లెక్క నడుస్తున్న మోడల్స్..మరో వైపు.
తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న పదహారేళ్ళ  యువతి యువకుల శవాలు ఇంకోవైపు.
ఐదు,పదేళ్ల  వయసు నుంచే ప్రేమించుకున్న ట్లు సినిమా లో చూపిస్తే సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దృశ్యాలను కత్తిరించరు ఎందుకు? అని ప్రసాద్ బాధపడతాడు.

చవకగా వస్తుంది చైనా టీవీ కొనండి అని సేల్స్ మెన్ అంటాడు కానీ ప్రసాద్ భార్య చైనా టీవీ వద్దని, మాటిమాటికి చెడిపోతుందని ముందుగానే చెప్పి ఉంటుంది. డీఏ అరియర్స్ వస్తాయేమో చూడాలి అప్పుడే టీవీ కొనవచ్చు అని నిర్ణయించుకుంటాడు ప్రసాద్.

ఛానల్ మారుతుంది.

కథనంలోని వేగం, నిశితమైన పరిశీలన  చూడండి. అన్ని సభలకు సమావేశాలకు నిరసనలకు ఉత్సవాలకు ఊరేగింపులకు ఈ జనం ఎక్కడి నుంచి వస్తారు అనేది రచయిత్రి ప్రశ్న?

నిజానికి వీళ్లంతా’ లెక్కకెక్కని మనుషులు’. ప్రత్యేకంగా  ఊరేగింపు సభలకు, నిరసన ప్రదర్శనలకు కూలి కోసం హాజరయ్యే వాళ్ల గురించి ప్రత్యేకంగా ఈ  రచయిత్రి రాసిన మరో కథ ‘లెక్కకెక్కని మనుషులు’. ఒక్కోసారి పోలీసుల కాల్పుల్లో ఇలాంటి వారు చనిపోయినా వాళ్ల ఆనవాళ్లు కూడా మిగలదని, వాళ్ల కోసం వెతికే వాళ్ళు, వాళ్ల గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరని, వాళ్ళు ఎవరికీ లెక్కల్లో లేని మనుషులని ఈ కథలో చదివి చలించకుండా ఉండలేం.ఇదంతా వేరే కథ.

మళ్లీ”నిత్యకల్లోలం” కథలోకి వస్తే కథ ఇలా కొనసాగుతుంది…

నిజమే ఎక్కడి నుంచి వస్తారు ఇంత జనం?

ప్రసాద్ ఇంటికి వస్తాడు.

బిగ్ బజార్ లైట్లు పగలే వెన్నెల కురిసి నట్టుగా వెలుగులను వెదజల్లుతున్నాయి అనే వాక్యం గమనార్హం. ముందు భయపడినా తర్వాత మనుషులు బ్రతికే ఉన్నారని అర్థం చేసుకుంటాడు. కథలోని అంతరార్థం ఇదే.
*
టీవీలో జనం అరుస్తున్నారు. ఛానెల్ మారినట్లుగా వుంది. ఎక్కడా ఇసుక పోస్తే రాలని జనమే! ఎక్కడ్నుంచి వస్తారు ఇంత జనం! వాళ్ళకేం పనులుండవా! “ప్రతిపక్షాలన్నీ పెరిగిన ధరలకు నిరసన తెలుపుతూ ర్యాలీ తీసారు…” అని బొమ్మవెనుక వార్త చదువుతున్నారు. “ఉల్లిగడ్డల ధరలు దిగాలె! పెట్రోలు ధరలు దించాలి. ఇట్లా ఎన్నో నినాదాలు. “ప్రభుత్వం ముర్దాబాద్! ధరలు అరికట్టలేని ప్రభుత్వం రాజీనామా చేయాలె! ప్రజావ్యతిరేక విధానాలననుసరించే ప్రభుత్వం ఇంకా ఎంతోకాలం నిలువదు!..” అని కేకలు! నినాదాలు

“ప్రజావ్యతిరేకం కాని ప్రభుత్వం ఏదైనా వుందా అసలు!” నవ్వుకున్నాడు. ప్రసాద్.

“ఏ ప్రభుత్వమైతే ఏంటి తల పగులగొట్టుకోవటానికి!”- ప్రసాద్ వెంటనే మనస్సులో విసుక్కున్నాడు.

ఇంకా ఎలక్షన్లు మూడేండ్లున్నాయ్! అప్పుడే ప్రతిపక్షాల గోల ఏమిటి? నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా ఎప్పుడూ నిరసనలు ర్యాలీలే!

ప్రసాద్ పక్క టీవీ వైపుకి కదిలాడు. ఇది ఎల్  సిడి టీవీలాగుంది. బొమ్మ స్పష్టంగా కండ్లకు ఆహ్లాదంగా వుంది. కాని టీవీలో కన్పించే దృశ్యాలు గుండెను కదిలించేటట్లుగా వున్నాయి. తుఫాను వానలతో నాని పడిపోయిన వరివెన్నులు! ఆకాల వర్షాలతో కుప్పకుప్పలుగా కూలిపోయిన వరిపొలాలు! వాటిని చూసుకొని చేతికందిన పంట ఇట్లా అయిందే అని విచారించే రైతులు. నోటికాడి బుక్కను తన్నుకపోయిన వానదేవున్ని తలచుకొని దుఃఖిస్తున్నారు. “ప్రభుత్వం ఆదుకోకపోతే మేమెట్ల బతుకుతం ” అంటూ విలపిస్తున్న రైతన్నల భార్యలు. అదంతా చూసి ప్రసాద్ ముఖం చిన్నబోయింది.

“అయ్యో! ఈ యేడు బియ్యం ధర పెరగటం ఖాయం. పెరిగిన డి.ఏ. దేనికి పనికి వస్తుంది!” అనుకున్నాడు ప్రసాద్, కండ్లెత్తి పక్కకు చూసాడు. ఎదురుగా టీవీలో  జనం! తండోపతండాలుగా జనం! దోషులను శిక్షించాలె! జెండాలతో ప్లేకార్డులతో బ్యానర్లతో పిడికిళ్ళు ఎత్తి అరుస్తున్న వాళ్ళ మధ్య ఎవరో గుడ్డలతో చేసిన చెప్పులు దండలు వేసిన బొమ్మను కాళ్ళతో తొక్కితొక్కి నిప్పంటిస్తున్నారు. గుప్పుమని మంటలు లేచాయి! లాఠీలతో పోలీసులు ముందుకు వచ్చారు. దెబ్బలు పడ్తున్నా జనం నిల్చున్నారు.  రక్తం! అంగీలు చినిగిపోయాయి! ఎవరో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారు. పేవ్మెంట్ మీదికి పరిగెత్తిన అతని వెంట జనం! కాలికాలి అతడు ఒకచోట కూలిపోయాడు. “ఒక వ్యక్తి ఆత్మాహుతి! జనంలో ఉద్రిక్తత! ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వుంది!…” అని స్క్రోల్లో వార్త. ఇంతలో టీవీలో బొమ్మ గీతలతో కదిలింది.

“సార్! కరెంటు ఫ్లక్చుయేషన్ వల్ల అట్లా అవుతున్నది. మీరు రెగ్యులేటరు. పెట్టుకుంటే ఏం ప్రాబ్లమ్ వుండదు. ఇది చాల మంచి టీవీ సార్ బిల్లు చేయమంటారా? అడిగాడు సేల్స్ మాన్ ఆతురత ధ్వనించే గొంతుతో, ఎంత తొందరగా అమ్మితే అంత మంచిదని అతడు చూస్తున్నాడు. వస్తువును అమ్ముకోవాలని అతని ఆరాటం! ప్రసాద్ వద్దన్నట్టుగా అడ్డంగా తలూపాడు. ముందుకు కదిలాడు. ఎదురుగా పెద్ద టీవీ, సినిమా స్క్రీన్ అంత టీవీ స్క్రీన్!

“ఎల్సెడీ త్రీడీ టీవీ అండి అది. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చింది. అంతా మీ కండ్ల ముందే జరుగుతున్నట్లుగా బొమ్మలు కన్పిస్తాయి. బిల్లు చేయమంటారా?” అడిగాడు సేల్స్ మ్యాన్ వెనుక నుంచి, “వీడు ఎక్కడికిపోయినా నన్ను వెంటాడుతున్నాడు. నన్ను కొనేదాకా వదిలేటట్లు లేదు!” అనుకుంటూ టీవీ వైపు పరీక్షగా చూసాడు. కింద దాని ధర వ్రాసి వుంది- “లక్షాయాభైవేటు!”

“ఏంది! ఈ టీవీ ధర లక్షాయాభైవేలా!” కండ్లెత్తి టీవీ స్క్రీనైవైపు చూసాడు ప్రసాద్. అప్పుడే సేల్స్ మ్యాన్ టీవీని ఆన్ చేసినట్లున్నాడు.

సినిమావాళ్ళు! పాటల క్యాసెట్ రిలీజింగ్ ఫంక్షన్. ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు. ప్రేక్షక దేవుండ్లు ఆదరిస్తే యీ సినిమా వందరోజులు కాదు, వేయి రోజులు నడుస్తుందంటున్నారు. పాటలకు డ్యాన్స్ షురూ! బొడ్డుకింద లంగాలతో చేతుల్లేని బ్లౌజులతో ఉత్సాహంగా, ఆనందంగా గంతులు వేస్తున్నారు. ఎంత చింతలేకుంట ఉన్నారు వాళ్ళు! ప్రసాద్ అనుకునేసరికి ఎవరో ఛానెల్ మార్చారు.
“మధ్యాహ్నం మానవ బాంబు పేలింది. యాభైమంది చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. ఈపని మేమే చేసామంటూ…” బొమ్మవెనుక నుంచి వార్తలు చదువుతున్నారు. భూమంతా రక్తంతో తడిసింది. తెగిపడిన కాళ్ళు, చేతులు, తలలు, మొండాలు! “ఎక్కడిది? పాకిస్తానా? ఇరాకా? ఇండియానా?… మరెక్కడన్నా” ప్రసాద్ భరించలేక కండ్లు మూసుకున్నాడు. కరెంటు పోయినట్టుంది. టీవీ టక్కున ఆగిపోయింది. పైన ఫ్యాన్ ఆగిపోయి గాలి ఆగిపోయింది. ప్రసాద్ కు కాసేపట్లో ముచ్చెమటలు పట్టాయి. దుకాణం బయటికి నడిచాడు. పెద్ద స్క్రీన్ మీద చూసిన దృశ్యాలు సజీవంగా తన ముందే జరుగుతున్నట్లుగా అనిపించి లోలోపల గజగజ వణికిపోయాడు. లేటెస్టు టెక్నాలజీ! – అంటే దుఃఖించే రైతులు పోలీసులు లాఠీల దెబ్బలు తినే జనం రక్తపాతం! హత్యలు, హంతకులు అంతా తన కండ్లముందు జరిగినట్లుగానే చూపిస్తుంది ఈ టెక్నాలజీ! ఆ టీవీకి లక్షాయాభైవేలా? ఆ టీవీ కొనుక్కుంటే ఏడాదంతా తన కుటుంబం పస్తులుండ వలసిందే!

ప్రసాద్ భయంతో షాపు బయట మెట్లు దిగసాగాడు. కింది మెట్టు మీదు బిచ్చగాడు! “నాయిన ఒక్క రూపాయి వుంటే ఇయ్యి. పొద్దట్నుంచి ఏం తినలేదు. నాయిన! పుణ్యమొస్తది నాయిన!-” బిచ్చగాని మాటలు విని ప్రసాద్ బొమలు ముడివేసాడు. బొక్కలెల్లిన బిచ్చగాడు! ప్రసాద్ జేబులు తడుముకున్నాడు. చిల్లరలేదు.

“ఆ లక్షాయాభైవేల టీవీని ఈ బిచ్చగానికి బిచ్చమేస్తే!…” నవ్వుకున్నాడు ప్రసాద్.. వేగంగా ముందుకు కదిలాడు. బిగ్ బజార్ లైట్లు పగలే వెన్నెల కురిసినట్లుగా వెలుగులను వెదజల్లుతున్నాయి. కొంచెం దూరం నడువంగనే ఎవరో వ్యక్తి ఉరుకులాంటి నడకతో వచ్చి ప్రసాద్ కు తగిలాడు. ఆ వ్యక్తి ఆగి ప్రసాద్ వైపు చూసి భయాందోళనతో సముద్రం ఉప్పొంగి వస్తున్నది. తెలంగాణంత మునిగిపోతదంట! సునామీయేమో .ఉరుకు ఉరుకు!! అని ఆ వ్యక్తి వేగంగా ముందుకురికాడు.

ప్రసాద్ కేం తోచలేదు. “ఆ వ్యక్తి భయాందోళనకు కారణం ఏంది? తెలంగాణ మునిగిపోవటమేంది? ఇన్ని చానెళ్ళు చూసిన గద! ఏ టీవీ చానెళ్ళల్లో ఈ వార్త రాలేదే? ఏందో ఏమైతుందో తెలుస్తలేదు. ఈ దేశం వుంటద? పోతద?” ఆలోచనలో మునిగిపోయిన ప్రసాద్ ఇల్లు చేరుకున్నాడు.

ఇంటి తలుపులు బిగించి వున్నాయి. అంతా చీకటి మయంగా వుంది. “దేశమే చీకట్లో వుంది! ఇల్లు నిశ్శబ్దంగా వుంది ఏమైంది ?తన ఇల్లెవరైన దోచుకున్నర ఏంది? – ఎవరైన హంతుకులు ఇంట్లోళ్ళను హత్య చేయలేదు గద!”- భయాందోళనతో ప్రసాద్ దబదబమని తలుపులు కొట్టాడు. చాలాసేపటికి భార్య గొంతు వినిపించింది.

“ఎవరు? ఎవరు?

“అమ్మయ్య! బతికే వున్నారు” నిశ్వాస వదిలాడు ప్రసాద్.

మాలతి తలుపులు తీసింది. “బెల్లు వుందిగద! మరచిపోయిండ్ర” అంది

“కరెంటు లేదనుకున్న”

“కరెంటు పోయి ఇప్పుడే వచ్చింది. అన్నం తింటర?” అడిగింది మాలతి.

“అన్నమా? బియ్యమున్నయా!”. “బియ్యంలేక ఏమతయి! పిచ్చిమాటలు! ఇంతకు అన్నం తింటర లేద?” నిద్రమబ్బుతో కోపంగా అంది మాలతి.

“ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర వండి”. “ఉల్లిగడ్డనా!” కరెంటు షాకు తగిలినట్లుగా అరిచాడు ప్రసాద్..

“ఉల్లిగడ్డ ధర మండిపోతున్నది. నిజమే కాని తినకుంట వుంటమ! అయిన కూరగాయల ధరలేం తక్కువున్నయ, అవీ మండిపోతున్నాయి. ఏదైనా ఒక్కటే అని ఉల్లిగడ్డ కూర వండిన” వంటింటి వైపు కదిలింది మాలతి..

ప్రసాద్ తుఫాను వానలకు తడిసిన వరిపంట గుర్తుకు వచ్చి అన్నం తినబుద్ధి కాలేదు.

“వద్దులే! పండుకో పో నువ్వు”. అన్నాడు ప్రసాద్. అక్కడే వున్న పాత టీవీని ఆన్ చేసాడు.

“పార్టీ మైనారిటీలో పడిపోయింది” అని ప్రతిపక్ష నాయకుడు.

“ముఖ్యమంత్రి అసెంబ్లీలో బలనిరూపణ చేయాలె…” అంటున్నాడు. టీవీలో బొమ్మ మారింది. ఇదేం రోగం ఈటీవీకి. దానికదే ఛానెళ్ళు మారుతుంటాయి. మెకానిక్ ‌ను పిల్చి బాగుచేయమంటే- “టీవీ పాతదైంది. ఇంకోటి కొత్త మోడల్ కొనుక్కోండి. అదే అగ్వ అయితది” అన్నాడు.

“అవినీతిని అంతం చేయాలె. స్క్యామ్లు చేసినవాళ్ళను కఠినంగా శిక్షించాలె!…” అని ప్లకార్డులు బ్యానర్లు పట్టుకొని జనం చిన్నపెద్దా గుంపులుగా నడుస్తున్నారు. అరుస్తున్నారు. వాళ్ళ వెంట లాఠీలతో పోలీసులు నడుస్తున్నారు.

“ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మారవు!” ప్రసాద్ గోడ గడియారం వైపు చూసాడు. పన్నెండయింది! “అందుకేన ఇంట్ల లైట్లన్నీ ఆర్పి పండుకున్నారు. ఇంత రాత్రయిందని ఏర్పడనేలేదు? ఇక పండుకోవాలే. రేపు ఆఫీసుంది! ఈ వార్తలు రోజూ వుండేవే” ప్రసాద్ నిద్రకుపక్రమించాడు. అన్నీ మరిచిపోయి.
*
ఇదీ కథ.
ఇందులో రకరకాల టీవీలు అత్యాధునిక టీవీలు ఖరీదైన టీవీలు వస్తు వినియోగానికి వస్తు ప్రపంచానికి వాణిజ్య ప్రపంచానికి ఆడంబరాలకు విలాసాలకు, పెట్టుబడి దారి మాయాజాలానికి ఉదాహరణలు.వీటిని సమాజంలోని  అసమస్థితికి అంతరాలకు సూచనగా చెప్పవచ్చు.ఈ ఉపద్రవాలు మనుషుల్ని ఎంతగా భయపడతాయో, ఒకవైపు పట్ట పగల్లా వెలుగుతున్న బిగ్ బజార్ లైట్లు, మరోవైపు ఇంట్లో కరెంటు ఉందో లేదో తెలియని స్థితి. కరెంటు ఉన్నా లేనటువంటి మనఃస్థితి, అసలు ఇంట్లో వాళ్ళు బ్రతికే ఉన్నారా లేదా అనే అయోమయం, భయం మనిషి అనుభవించే నిత్య కల్లోలాల కు ఉదాహరణలు.
కరెంటు లేదు అనుకుంటాడు. ఇంట్లో బియ్యం లేదనుకుంటాడు. ఉల్లిగడ్డ కూర చేసిందంటే కరెంట్ షాక్ తగిలినట్టు గా భయపడి పోతాడు.

పాత టీవీని మరమ్మతు చేయాలి అనుకుంటే అందుకు ఎక్కువ ఖర్చు అవుతుందని అంతకంటే కొత్త మోడల్ కొనుక్కోవడమే చవక అని మెకానిక్ అన్న మాటలు వ్యవస్థ గురించేనా?.

అనుభవిస్తున్న అణచివేతను కానీ అసంతృప్తిని కానీ అసమానత ని కానీ గుర్తించ లేక పోవడమే, గుర్తించినా గుర్తించనట్లు నిరాసక్తంగా చేతకాని వాడిలా ఉండిపోవడమే మానవ అస్తిత్వ నైజం. సామాజిక చైతన్యానికి కారణం అవ్వాల్సిన సామాజిక అస్తిత్వం , రాజకీయ అవగాహన , భయాందోళనలనుండి బయట పడేసే తెంపరితనం, అధిగమించాల్సిన ఉదాసీనత.. ఈ కథలో చర్చనీయాంశాలు. పంటలకి వ్యవసాయానికి రైతుకి సగటు మనిషికి, జీవితానికి, సమాజానికి సామాజిక భద్రత కి, సామాజిక చైతన్యానికి, సామాజిక అస్తిత్వానికి, పరస్పరత కి దేనికైనా భరోసా లేకపోవటం, సాంకేతికత అభివృద్ధి, వ్యాపార వ్యవహార లాభాలే ముఖ్య లక్ష్యాలుగా పెట్టుబడిదారుల కనుసన్నల్లో కొనసాగుతున్న పరిపాలన గురించిన ఎన్నో ప్రశ్నలు ఈ కథలో పాఠకులకు ఎదురవుతాయి. నిరంతరం బాహ్య అంతర కల్లోలాలకు గురయ్యే మనిషి అసలు ఒక్కపూటైనా నింపాదిగా అన్నం తినగలడా? అన్నదే ఈ కథలోని ప్రశ్న.

మనిషిలో, అతడి అవగాహనలో, ఆలోచనలలో, వ్యక్తిత్వంలో స్వభావంలో; సమాజంలో పరిపాలనలో వ్యవస్థలో రావాల్సిన మార్పు గురించి తక్షణమే ఆలోచింపచేసే మంచి కథల వరుసలో తప్పక నిలిచే కథ “నిత్య కల్లోలం”.

One thought on “*అభివృద్ధి*ని ప్రశ్నిస్తున్న క‌థ

Leave a Reply