అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం దక్కదు.
ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే.
” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.
ఇంకో మాట కూడా అనేశారు
“ఎరికిలోలల్లో ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే! ”
ఎంతో మందిలో కొందరికే ఆ భాగ్యం దక్కుతుంది. ఒకరి గురించి పదిమంది పదికాలాల బాటూ మంచిగా చెప్పుకున్నారంటే, అదే వాళ్ళు చేసుకున్నభాగ్యం.అట్లా భాగ్యవంతురాలనిపించుకున్న వాళ్ళల్లో మా అత్త పేరు తప్పకుండా వుంటుంది. ఆమె పేరు కాంతమ్మ.
*
ఆ పేరు చెప్తే జనాలకు ఆమె ఎవరో కొంతమంది తెలియదనే చెపుతారు, కానీ కొళాయి కాంతమ్మ అంటే మాత్రం, పాతపేటలోనే కాదు, కొత్తపేటలో కూడా జనం ఆమె గురించి కథలు కథలుగా చెప్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే, పెద్ద పెద్ద నాయకులకు లాగా చాలా మందికి ఆమె ముఖ పరిచయం లేకపోయినా, ఆమె పేరు, ఆమె గురించిన సంగతులన్నీ చెప్పేస్తారు.అదీ ఆమె ప్రత్యేకత.
అట్లాగని ఆయమ్మ పెద్దగా చదువుకునిందని కాదు, పెద్ద ఉద్యోగం చేసిందనీ కాదు. ఆమె సంపాదించిన ఆస్థిపాస్తులు ఏమీ లేవు. నిజానికి ఆమె ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. అయినా
“ హోల్ ఇలాకాలోనే ఎరికిలోల్ల కాంతమ్మ అంటేనే వుండే గౌరవమే వేరు. ఆయమ్మ సెయ్యి మంచిది, ఆయమ్మ నోరు మంచిది . ఆయమ్మ గుణం మంచిది ” అని జనం అనటం వెనకాల ఆమె నిలుపుకున్న పెద్దరికం అలాంటిది. పదిమందిని సంపాదించుకున్న ఆమె మంచితనం అలాంటిది .
చిన్న బoకుఅంగడి పెట్టుకుని, ఆ చిన్న బంకులోనే అన్నీ పొందిగ్గా అమర్చి పెట్టుకునేది. పాతపేటలో అప్పట్లో అంగళ్లు తక్కువ ఉండేవి. పలమనేరు వూరి మధ్యలో నాలుగో నంబరు జాతీయ రహదారి వెడుతుంది. యo.బి.టి. రోడ్డు అంటారు.మద్రాస్, బెంగుళూరు గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఆ రోడ్డుకు అటు వైపు కొత్తపేట, ఇటు వైపు పాత పేట వుంటాయి. యస్టీ కాలనీ వుండేది పాతపేటలోనే.
కాలనీలో జనమే కాదు చుట్టు పక్కల ఆరేడు వీధుల్లో వాళ్లకి, ఎవరికేం కావాలన్నా, పదో ఇరవయ్యో సరుకు అప్పు కావాలన్నా , ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కొళాయి కాంతమ్మ అంగడే .
రకరకాల వస్తువులు, ఆకుకూరలు, కూరగాయలు, రోజువారీ, వారంవారీ కంతుల కింద అప్పులు తీసుకునే వాళ్ళ కోసం , అప్పు జమా నిల్వలు చూపించే పాకెట్ సైజు లెక్కల పుస్తకాలు, బాండు పేపర్లు , రెవిన్యూ స్టాంపులు,స్కూలు పిల్లలకోసం పెన్నులు, పెన్సిళ్ళు, ఆడపిల్లలకు కావాల్సిన సామాగ్రి రకరకాల వస్తువులు ఆ చిన్నఅంగడిలోనే పొందికగా అమర్చుకునేది. ఆ కాలంలో నాల్గో, ఐదో క్లాసు చదివినారంటే ఈ కాలం డిగ్రీ వాళ్ళతో సమానం కదా ఆ చదువు. ఆమెకి లోక జ్ఞానం , జ్ఞాపకశక్తి రెండూ ఎక్కువే. ఏ లెక్క అయినా, ఎంత కాలం అయినా, ఎవురెవరు ఎంతెంత బాకీ వున్నారో ,ఆమె కాగితం , పెన్నూ వాడకుoడానే చెప్పేయగలదు. వినే వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ నోటు పుస్తకాల్లోనో , క్యాలండర్లోనో ,డైరీలలోనో వాళ్ళు రాసింది ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ తిప్పించి మళ్ళించి చూసుకునే వాళ్ళు. అన్నీ చూసుకుని చివరకు ఆయమ్మ చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకునే వాళ్ళు.
వీధి కొళాయి దగ్గర రోజూ జరిగే పంచాయతీలను ఊరి పెద్దరాయుడి మాదిరి తీర్చేది మా అత్త . కొళాయి దగ్గర ఎవరికీ పెద్దరికాలు లేవు. అక్కడ అందరూ సమానమే. ఒకరు గొప్ప అని కానీ, ఇంకొకరు తక్కువ అని కానీ తేడాలు అక్కడ లేవంటే ఆమె దశాబ్దాలుగా అమలు చేసిన ఆ సమానత్వమే అందుకు కారణం.గలాటాలు,తోపులాటలు మాటల యుద్దాలు లేకుండా , వచ్చే నీళ్ళను సక్రమంగా అందరికీ అందేటట్లు ఆమె అజమాయిషీ చేసేది. కొళాయి దగ్గరికి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కాళ్ళు, చేతులు, మొహాలు కడుక్కుని తల దువ్వుకుని శుభ్రంగా రావాలని పట్టు పట్టింది.
ఎరికిలోళ్లు ఎందులోనూ తక్కువ కాదని ఇండ్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని, ఉన్నంతలో శుభ్రతలో కూడా ముందు ఉండాలని ఆమె తనకులపోళ్లకు శతవిధాలా నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. పందులు మేపేవాళ్లయినా సరే అది వాళ్ల వృత్తి వరకే పరిమితం కావాలని, వాళ్ళ ఇళ్ళు, వాకిళ్ళు ,పిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ శుభ్రంగా ఉండితీరాలని, శుభ్రత చాలా ముఖ్యమని ఆమె ఆ కాలం నుంచే మనుషుల్ని మారుస్తూ వచ్చింది.
పిల్లలు ఎవరు ఇంటిదగ్గర కనిపించినా బెత్తం తీసుకొని వాయించేసేది. ‘ఎందుకురా స్కూలుకు పోలేదు ‘ అని ఆరా తీసేది. ఆ పిల్లల అమ్మానాన్నలకు చదువు విలువ గురించి హితబోధలు చేసేది. కారణం లేకుండా ఒక పూట అయినా పిల్లలు స్కూల్ కు పోకపోతే ఆమె కంటికి కనిపించారంటే ఆమె అసలు ఒప్పుకునేది కాదు. ఆడపిల్లల్ని చదువు మానిపించే ప్రయత్నం చేసినా, చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ప్రయత్నించినా, ఆమె ఆ ప్రయత్నాలని అడ్డుకునేది. వాళ్ళ పైన తిరగబడేది. ఆమెకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ విపరీతంగా కొట్లాడేది. రచ్చ రచ్చ చేసేది. వాళ్లను బ్రతిమలాడేది, ఏడ్చి మొత్తుకునేది, చేతులు పట్టుకుని అడుక్కునేది. పిల్లల గొంతులు కొయ్యవద్దని భవిష్యత్తు నాశనం చేయొద్దని ఆమె నచ్చచెప్పేది. కొనే శక్తి లేని పిల్లలు ఎంతో మందికి ఆయమ్మ పలకా బలపాలు, పుస్తకాలు, పెన్సిల్లు, పెన్నులు ఉచితంగా ఇవ్వడం మా ఇండ్లల్లో అందరికీ తెలుసు.
ఆడపిల్లలు మొగుడి దగ్గర దెబ్బలు తిని ఏడుస్తా కనిపించినా, ఆమె దగ్గర సలహా కోసం వచ్చినా ఆమె పూనకం వచ్చినట్లు ఊగిపోయేది.
“ ఆడదనిపైన చెయ్యి చేసుకోవడం కూడా ఒక మొగతనమేనారా.
ఎంతో మురిపంగా సాకి బిడ్డను ఇచ్చేది మొగోడి వంశాన్ని నిలబెట్టే దానికి. భార్య అంటే తల్లి తర్వాత తల్లి మొగోడికి. ఆ బుద్ధి మొగోల్లకి ఉండల్ల. అత్త కూడా ఆ మాదిరే తన కోడలిని చూసుకోవల్ల.ఒక ఆడదానికి ఇంట్లో వుండే ఆడోల్లు సప్పోర్ట్ ఇస్తే సాలు, ఇంకేమి అవసరం లే ..అప్పుడు ఏ మొగోడి చెయ్యి అయినా పైకి లేస్తుందా ” అని వాదించేది.
ఆడోల్లకు చెప్పాల్సింది అడోల్లకి, మొగోల్లకి చెప్పాల్సింది మొగోల్లకి చెప్పేది. కులపోల్ల ఇంటి గలాటాలకి ఆడోల్లు, నోర్లు లేనోళ్ళు, గట్టిగా మాట్లాడనోల్లు, మొగోల్లని నిలదీసే ధైర్యం లేనోల్లకి ఆమే ఒక ధైర్యం . వాళ్ళ తరపున ఆయమ్మే పంచాయతీలో మాట్లాడేది, వాదించేది.
“నమ్మినోల్లకి ప్రాణం అయినా ఇస్తారు కానీ , ఎరికిలోల్లు ఎవురికీ నమ్మక ద్రోహం చెయ్యరు. ఎరికిలోల్ల ఇండ్లల్లో పుట్టుక పుట్టినాక ఒక తెగింపు ఉండల్ల బ్రతికేదానికి. మనం గానా కరెక్టుగా వుంటే ఏ ఆడదైనా ఏ మొగనాబట్టకీ భయపడాల్సిన పనే లేదు ? ”అని ఆడోల్లకి ధైర్యం చెప్పేది.
“ ఆడది వూరికే బోకులు తోమి,గుడ్డలు ఉతికి , ఇల్లూ వాకిలి పిల్లల్ని చూసుకుంటానంటే కుదిరే కాలం కాదుమ్మే ఇది. ఆడది కూడా ఏదో ఒక పని చెయ్యల్ల. కోళ్ళు పెంచుతారో , పందుల్ని మేపుతారో, కూలికే పోతారో, ఆవుల్ని పెట్టుకుంటారో, గంపలు ,చేటలు, బుట్టలు అల్లుకుంటారో అది మీ ఇష్టం. మీ కష్టానికి ఓ విలువుండల్ల, మీ సంపాదనకో లెక్క వుండల్లoతే. ” ఇదీ ఆమె అభిప్రాయం.
*
ఆమె ఇప్పుడు లేదు. చనిపోయి ఆరేళ్ళు అవుతోంది. ఎరుకల ఇండ్లల్లో ఎంతో మంది పిల్లల భవిష్యత్తును, ఎంతోమంది ఆడవాళ్ళ సంసారాలను కాపాడిన ఆమె గురించి దీపం పెట్టే సమయాల్లో ఏ ఇంట్లో అయినా తలుచుకోని వాళ్ళంటూ ఉండరు.
మా నాయనకు వరసకు ఆమె చెల్లులు అవుతుంది. మా నాయనకు స్వంత అక్కా చెల్లెళ్ళు ఉన్నప్పటికీ, ఆ అత్తావాళ్ళకంటే కూడా మాకు కాంతమ్మ అత్తే ఎక్కువ. ఎందుకంటే ఆమె మా పట్ల కనపరచిన ఆపేక్ష అలాంటిది. మా అమ్మతో ఆమెకు గల స్నేహం అలాంటిది. అందుకే మా కాంతమ్మత్త అంటేనే మాకు చాలా ఇష్టం .
“ ఆ యమ్మకు మనుషులంటే భలే ప్రీతి నాయినా, మనుషులతో మాట్లాడకుండా వుండలేoదు.దారిలో పొయ్యేవాళ్ళు ఎవరైనా ఆయమ్మను మాట్లాడక పోయినా , ఆయమ్మే నొచ్చుకుని పిలిచి మరీ మాట్లాడేది. ఏం ఎత్తుకుని పోతామబ్బా.. ఉండేది నాలుగు నాల్లె. ఆ నాలుగు నాళ్ళు, నాలుగు నోళ్ళల్లో మంచి అనిపించుకుని పోతే పోలేదా. అంత మాత్రానికి కోపాలు, గొడవలు , అపార్థాలు దేనికి మనుషుల మధ్య ?“ అనేది.
అట్లా అనడటమే కాదు, అట్లానే బ్రతికింది కడదాకా . ఆయమ్మ ఎంత నిఖార్సైన మనిషంటే , ఒక్క ఉదాహరణ చాలు చెప్పటానికి.
ఎంత జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఎట్లాంటి అనారోగ్యం ఎదురైనా సరే ఒక్క పూటంటే ఒక పూట అయినా ఆయమ్మ ఎవరింట్లో ఇంత ముద్ద తిని, చెయ్యి కడిగింది లేదు. చేసుకునే శక్తి వున్నప్పుడు తనే వండుకుని తినింది.కానీ ఒంట్లో ఆ శక్తి లేకపోతే, ఎంత సొంత మనుషులైన ఇంట్లో అయినా సరే, ఒక్క పూటైనా ఆమె అన్నం తినింది లేదoటే ఆయమ్మ పట్టుదల ఏపాటిదో అర్థం అవుతుంది. ఆయమ్మకు ఒకరికి పెట్టడమే తెలుసు కానీ, ఒకరింట్లో తినడం తెలియదు. ఒకరికి ఇవ్వటమే కానీ ఇంకొళ్ల దగ్గర చెయ్యి చాపింది లేదు.
ఆమెకు అరవయ్యేళ్ళు కూడా రాకుండానే పెద్ద జబ్బు చేసింది. నోట్లో పుండు లేచింది. కొడుకులు, కూతుర్లకి ఆయమ్మ అంటే చాల ఇష్టం కదా, చాలామంది డాక్టర్ల వద్ద చూపించారు.పలమనేరు, చిత్తూరు, తిరుపతిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల వద్దే చూపించారు కానీ , డాక్టర్లు ఆమె బ్రతకదని చెప్పేసినారు.
చెప్పకూడదని అనుకున్నారు కానీ, ఆమెకు ఎవరూ చెప్పకుండానే తన పరిస్థితి అర్థం అయిపోయింది. ముందు బాగా ఏడ్చింది. ఆమెకు అసలే మనుషులంటే అకారణమైన ప్రేమ కాబట్టి , మనుషుల్ని తలచుకుని తలచుకుని , గుర్తు తెచ్చుకుని మరీ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఒక రాత్రి రెండు పగళ్ళు, తిండీ , నీళ్ళుమాని మరీ ఏడుస్తూ వుండి పోయింది . ఏమవుతుంది ఈమె? అంత ధైర్యం గల మనిషి ఇట్లా అయిపోయిందే అని పిల్లలు భయపడిపోయారు.
కానీ ఏదో ఒక అధ్బుతం జరిగినట్లు ఆమెకు ఎక్కడినుంచి వచ్చిందో కానీ అంత ధైర్యం ఉన్నట్లుండి ఎక్కడి నుంచో వచ్చేసింది . అదిగో ఆ మహత్తర క్షణం నుండి ఆమె మారిపోయింది.
అప్పటిదాకా ఆయమ్మతో యెట్లా మాట్లాడాలో, ఆమెకు ఏం చెప్పి ఎట్లా ఓదార్చాలో అర్థం కాని కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు కోడలికి ఆమెలో వచ్చిన మార్పు ఒక షాక్ లాంటిది . అంత వరకూ ఆమెకు ఇంట్లో ఏమి కుదిరితే అది తినడటమే అలవాటు. అది సద్దిది కావచ్చు, సంగటి కావచ్చు, చారు, ఊరిబిండి కావచ్చు, పచ్చిపులుసు కావచ్చు.ఆమె చిన్నపటినుండే చాల కష్టాల్లో పెరిగిన మనిషి కదా ఆమెకు అన్నం విలువ, ఆకలి విలువా బాగా తెలుసు.
అప్పట్లో ఆమె చిన్నతనంలో కరువు కాలంలో గంజి తాగి బ్రతికిన మనిషి.అడవికి వెళ్లి కాయలు పండ్లు, మూలికలు, తేనె తెచ్చి అమ్మి బ్రతికిన మనిషి.
“ అత్తా చెట్లు కొట్టడం కూడా పాపమే కదా, తెలిసి నేను ఏ పాపం చేయాలేదురా అబ్బోడా .. అంటా ఉంటావు కదా ఎప్పుడూ ..” అని నేనోసారి మాటవరసకి ఆమెని అడిగేసాను.
అప్పుడు ఆయమ్మ మొహంలోకి నవ్వు వచ్చింది.
ఎప్పుడూ వక్కాకు వేసుకుని నమిలి నమిలి ఆమె పళ్ళు ఎప్పుడో గారబట్టి పోయాయి.ఆమె నోరు అందుకే ఎప్పుడూ ఎర్రగానే వుంటుంది. వక్కా,ఆకూ లేకుండా ఆమెకు ఒక పూట కూడా గడవదు. ఆమె నడుముకు, ప్రత్యేకంగా టైలర్ ముందు నిలబడి మరి దగ్గరుండి కుట్టించుకున్న గుడ్డ సంచి వేలాడుతూ వుంటుంది ఎప్పుడూ. వక్కాకు తిత్తి అంటారు కదా, దాన్ని నడుముకు ఎప్పుడూ చెక్కుకునే వుండేది. మూడు నాలుగు అరలు ఉండేవి ఆ సంచికి. ఒకదాంట్లో డబ్బు పెట్టుకునేది. ఇంకో దాంట్లో అవసరమైన మాత్రలు, ఇంకోదాంట్లో వక్కా ఆకు సరంజామా. ఆమెకు నైటీలు అలవాటు లేదు కాబట్టి రాత్రి నిద్రలో కూడా వక్కాకు సంచిని ఆమె నడుముకే అంటిపెట్టుకుని వుండేది .రకరకాల చీరరంగులకు జోడీ కుదిరేవిధంగా ఆమె వక్కాకు తిత్తి రకరకాల రంగుల్లో తయారుగా వుండేవి.
“ అబ్బోడా నాకు ముందునుంచే పాప భయం ఎక్కువ, మీ తాత చిన్నయ్య మన ఎరికిలోల్ల ఇండల్లో పుట్టల్సినోడు కాదు కదా, మమ్మల్ని యెట్లా పెంచినాడు అనుకున్యావు? చీమకు కూడా అపకారం సేయ్యకూడదని , పచ్చని చెట్టు కొడితే మహా పాపం అని రోజూ పాఠo మాదిరి దినామ్మూ చెప్తానే కదా మమ్మల్ని పెంచినాడు.మీకు చెపితే నవ్వుకుంటారు కానీ,మా ఇంట్లోకి తేల్లు, జర్రిలు ఎన్నో మార్లు వచ్చింటాయి కానీ ఒక్కసారి కూడా నేను చంపిన దాన్ని కాదు, పచ్చని మాను కొడితే పాపం అని కదా మా నాయన మాకు నేర్పించినాడు, అడవిలో ఎండుకట్టెలు ఏరుకుని సైకిల్ పైన పెట్టుకుని తోసుకుంటా తెచ్చేదాన్ని రా . సైకిల్ పైన ఫుల్లుగా కట్టెలు పేర్చుకుని తోక్కేది రాదు కదా అప్పట్లో , సైకిల్ తోసుకుంటా వచ్చేసే దాన్ని.మా వయసు మగోల్లకన్నా నా సైకిల్ పైనే ఎక్కువ కట్టెలు ఉండేవి. ఏం? మేం దేంట్లో తక్కువ? మాకూ మొగోల్లకి ఇంత తేడా ఎందుకని పోట్లాడే దాన్ని ? ఆ తర్వాత కాలంలో సైకిల్ నేర్చుకున్నా కానీ, ఆ తర్వాత తర్వాత వయసు బిడ్డ అని, నన్ను అడవికి పంపడం మాన్పించేసినాడు మా నాయన. ”.
ఆమె చిన్నతనంలోనే అన్ని పనులు, అన్ని విద్యలు నేర్చుకుంది. ఆమెకి చెట్లు ఎక్కడం కాయలు, పండ్లు, చింతాకులాంటివి కోయడం తెలుసు. దోటీతో చింతకాయలు రాల్చడం తెలుసు. చింతపండు కొట్టటం తెలుసు, రకరకాల మూలికావైద్యం తెలుసు. రెండు కాన్పులు అయ్యాక, మంత్రసాని పని కూడా నేర్చుకుంది. ఎవరికి ఏం సహాయం చేసినా ఎప్పుడూ ఆమె డబ్బు తీసుకోదు. మనిషికి మనిషే కదా సాయం చేయాల్సింది అంటుంది.
మా అత్త చెప్పక పోయినా అవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే. చిన్నప్పటి నుండి మేం ఆమె గురించి కథలు కథలుగా వింటూ పెరిగిన వాళ్ల మే కదా.
అయినా మాకు మా అత్త నోటివెంట ఆమె చిన్నప్పటి సంగతులు వినటం ఎప్పుడూ ఇష్టంగానే వుంటుంది. ఆమెకు కూడా వాళ్ళ నాయన గురించి, మా నాయన గురించి మా అమ్మ గురించి చెప్పటంలో ఆమె కళ్ళనిండా, గొంతు నిండా సంతోషం కనిపించేది.ఆమెకు ఎవరికీ లేనంత ఇష్టం మనుషులంటే బంధువులంటే ఎందుకో మాకు అర్థం అయ్యేది కాదు.
“ మా నాయన మాకు నేర్పింది ఒకటే అబ్బోడా ధైర్యంగా బతకడం. అది చాలు అబ్బోడా. ధైర్యం ఉంటే చాలు ఎట్లాగైనా తెగించి బ్రతికేయొచ్చు! దేంట్లోనూ ఆడోల్లు మొగోల్లకంటే తక్కువేమీ కాదురా, ఎరికిలోల్లల్లోనే కాదు ఏ కులం లో అయినా అంతే .! ఆడోల్లు మగోల్లకన్నా తక్కువేమీ కాదు.! ”
ఆ మాట అంటున్నప్పుడు ఆమె స్థిరత్వం, ఆమె ధైర్యం ఆమె తెగింపు నాకు ఆమె మొహంలో స్పష్టంగా కనిపించేది.
అయినా ఆమె చివరిదినాల్లో ఎందర్ని కలవరించిందో, ఎందుకు కలవరించిందో మాకు సరిగ్గా తెలియదు. ఎంత బాధలో వున్నప్పటికీ ఆయమ్మ నాకు ఈ నొప్పి వుంది, ఇంత కష్టం ఉంది అని చెప్పిందే లేదు. నోట్లోంచి ఒక్కమాట కానీ అరుపు కానీ, ఏడుపు కానీ బయటకు వచ్చిందే మాకు తెలియదు.
“ ఆ కాలం లో మొగ పిల్లోల్లని మాత్రమే మీ నాయిన సదివించినాడు కదత్తా? నీ అన్నతమ్ములు అదే మా చిన్నాయన పెద్దనాయన వాళ్ళు మాత్రం బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తా వుండారు. నీకు మాత్రం చదువు లేకుండా చేసినాడని మీ నాయన పైన నీకు ఎప్పుడూ బాధ అనిపించలేదా అత్తా, కోపం రాలేదా? ” అని అడిగినాను.
ఒక్క మాట కూడా వాళ్ళ నాన్నను పడనిచ్చేది కాదు మా అత్త . మా మామయ్య వాల్ల గురించి కానీ, వాళ్ళ అమ్మ నాయన గురించి కానీ ఎవురేం మాట్లాడినా ఆమె గొమ్మునా ఊరుకునేది, వాళ్ళ అత్తామామల గురించి కానీ, ఆడబిడ్డల గురించి కానీ ఏనాడూ ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ కలిగినా నోరు తెరిచి ఒక్క మాటైనా అనకపోవటం , ఇంటికి దూరం వెళ్లిపోయి, తన దారి తాను చూసుకున్న మా మామయ్యను సైతం ఒక్క మాటైనా అనకపోవడం ఆమె వ్యక్తిత్వం అనుకుంటాను. ఏదేమైనా వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాత్రం ఒక్క మాట కూడా పడనిచ్చేది కాదు.
“ మా నాయన తప్పేమీ లేదు అబ్బోడా. మా నాయన్ను గానా ఎవరైనా యేమైనా అంటే వాళ్లకు కండ్లు పోతాయి . మా నాయన ముందే చెప్పినాడు కానీ నేనే సరిగ్గా సదువుకోలేదు, సరిగ్గా సదువుకొని వుంటే ఏదో ఒక వుద్యోగం గ్యారంటీగా కొట్టేసి వుంటాను . నా జాతకమే మారిపోయి వుండేది. నా పిల్లోల్లు ఇంకా బాగా సెటిల్ అయిండే వాళ్ళు. సదువే బ్రతుకు అని మా నాయిన చెప్తానే వున్యాడు కానీ నా మట్టి బుర్రకే ఎక్కలే . ” ఇదీ మా అత్త మాట.
“ పెండ్లి అయినప్పటి నుంచి ఒక్క రోజైనా నువ్వు మీ నాయనను తలచుకోకుండా , పొగడకుంటా వుంటావేమో అని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తానే ఉండాను కానీ, ఒక్క పొద్దైనా నీ నోట్లోంచి మీ నాయన మాట రాకుండా ఉన్నింది లేదు కదమ్మే.ఇంతగా ప్రేమించే కూతురు వుండటం మీ నాయన చేసుకున్న పున్నెం. ఇన్నేండ్లు గడచినా నువ్వు మీ నాయన్ని, ఇప్పుడికీ తలచుకుంటా ఉండావు కానీ, నిన్ను నన్నూ ఇట్లా మన పిలకాయలు తలచుకుoటారంటావా ? మన పిల్లోల్లు రాబోయే కాలంలో ఎట్లుంటారో ఏమో “ ..అనే వాడు ఎప్పుడైనా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చే మా మామయ్య.
“ ఒకరిని ఆశించి ఏదైనా చేయడం దరిద్రం.పిల్లలు తమని చూస్తారని ఏ తల్లి తండ్రీ పిల్లల్ని కనరు, పెంచరు . ఎవురి బ్రతుకు వాళ్ళదేబ్బా.. ”. ఇదీ ఆమె జవాబు, ఆమె వ్యక్తిత్వం కూడా!.
మా నాయన చనిపోయినప్పుడు నేను తమ్ముడు చాల చిన్న వాళ్ళం. మా అమ్మకు యెట్లా ధైర్యం చెప్పాలో, ఆమెను యెట్లా ఓదార్చాలో మాకు తెలియదు. అదిగో సరిగ్గా అ సమయంలో మా అత్తే గనుక తోడు లేకుంటే మా అమ్మ ఏమై పోయి ఉండేదో మాకు తెలియదు.
ఇప్పటికీ ఒక దృశ్యం నా కళ్ళ ముందు అట్లాగే నిల్చిపోయింది. బహుశా ఆ దృశ్యం నేను బ్రతికి వుండేంత వరకూ నాతోనే వుండి పోతుందేమో.!
బాగా వర్షం పడుతోంది. మా అమ్మ ఏడుస్తా పడుకుని వుంది. మాది పెంకుటిల్లు. అక్కడక్కడా కారుతోంది. నేను, మా తమ్ముడు వాన నీళ్ళు పడేచోటికి బక్కెట్లు మారుస్తూ వున్నాం. నీళ్ళు నిండగానే రెండు చేతులతో బక్కెట్లు ఎత్తుకుని ఇంటి ముందు పారబోస్తున్నాం. ఆ రోజు మా అమ్మ ఉదయం నుండి అస్సలు ఏమీ తినలేదు. మేం ఎంత చెప్పినా లేయ్యలేదు, ఏమీ వండలేదు. హోటల్ నుండి అయినా ఏమైనా తెస్తాను మా అని అడిగినాను కానీ మా అమ్మ వద్దనింది.
వర్షం బాగా పెరిగి పోతోంది. చలి ఒక పక్క. అసలే మా ఊరిని పూర్ మెన్స్ ఊటీ అంటారు, అంత చలి వుంటుంది ఇక్కడ. మాకు ఆకలి అవతా వుంది. నేను, మా తమ్ముడు ఇద్దరూ మగపిల్లలమే అమ్మకు. మగపిల్లమే అయినా మాకు ఇంటిపనులన్నీ నేర్పించింది మా అమ్మ. చెత్తలు ఊడ్చటం , అంట్లు తోమడం, కల్లాపి చల్లి ముగ్గులు వెయ్యటం,వంట చెయ్యడo, బట్టలు ఉతకడం ఆన్నీ నేర్పింది మా అమ్మ. పని చేసేదాంట్లో ఆడా మగా అనే తేడా వుండకూడదు. మగపిల్లోల్లు పని చేసేదానికి నామోషి పడకుండా వుంటే చాలు, ఆడోల్ల జీవితాలు బాగుపడతాయి “ అనేదిమా అత్తయ్య అభిప్రాయం. మా అమ్మకు కూడా అదే నమ్మకం.
నిజానికి మా అమ్మకు ఆడపిల్లలంటే చాల ఇష్టం. అందుకే ఆడపిల్లలాగే నాకు తలదువ్వి, రోజూ జడ వేసేది. మాకు మునిదేవర చేసి తల వెంట్రుకలు మునీశ్వరుడికి సమర్పించే ఆనవాయితి ఉంది. తెల్లమచ్చ ఒక్కటి కూడా లేని నల్ల మేకపోతు కావాలి, పూజలు చేసి, అందరికి వండి పెట్టాలంటే విందుకు చాలా డబ్బే అవుతుంది. అది లేక మా మునిదేవర వాయిదా పడుతూ వచ్చింది.ఆ మునిదేవర అయ్యేంత వరకూ తల వెంట్రుకలు అట్లాగే వుంటాయి. జుట్టు కత్తరించడానికి వీల్లేదు.
నేను ఉప్మా చేశాను కానీ అమ్మ తినలేదని మేం కూడా తినకుండా అట్లాగే ఉదయం నుండి పస్తు వుండి పోయాం.
“ అమ్మా నువ్వట్లా వుంటే మేం ఏం కావాలి, నిన్ను చూస్తా వుంటే మాకు ఏడుపు ఆగడం లేదు , నువ్వు ధైర్యంగా వుంటేకదా మేo కూడా ధైర్యంగా వుంటాం, తినమ్మా … ” అని అప్పటికే చాలా సార్లు అమ్మను అడుక్కున్నాం..కానీ ఆమె మా మాట వినలేదు . మంచం పైనుండి లేవడం లేదు.
అంతకు ముందు రోజు రాత్రి కూడా ఆమె సరిగ్గా తినలేదు. కొన్ని సందర్భాలలో ఆమె చాలా మొండి మనిషి.ఎవ్వరు ఎంత చెప్పినా వినే రకం కాదు.
యెట్లా చెయ్యాలి, ఆమె చేత ఇంత అన్నం తినిపించడం యెట్లా రా నాయనా అని మేం బాధ పడే టైంలో సరిగ్గా మా అత్త, భోరోమని కురుస్తున్న వర్షాన్ని అస్సలేమాత్రం లెక్క చెయ్యకుండా , చీరకొంగు తలపై కప్పుకుని, ఒడి లో రెండు స్టీల్ గిన్నెలు దాచి పెట్టుకుని చీర కొంగు దాని చుట్టూ కప్పుకుని వర్షంలో తడుస్తానే వేగంగా ఇంట్లోపలికి వచ్చింది. అప్పుడు వచ్చిన ఆ వాననీళ్ళ వాసన జీవితాంతం చాలా సందర్భాలలో నన్ను వెన్నాడుతూనే వుంది.అదొక వర్షం వాసనే కాదు, వర్షంలో తడచిన మనిషి వాసన. పసి బిడ్డలాంటి, కన్నతల్లి లాంటి నిఖార్సైన మనిషి వాసన.!
“ వొదినా లెయ్యమ్మా, వేడి వేడిగా సంగటి, గురుగాకు తెచ్చినాను. అంగడి తలుపు కూడా ముయ్యలేదు. గభాలున తినేయ్యాల్లి. మా తల్లి కదా లేయ్యమ్మా. పిల్లోల్ల మొహాలు సూడు ఎట్లుoడాయో. నువ్వు అన్నమూ నీళ్ళు మానేసినంత మాత్రాన , పోయిన మా అన్నేమైనా తిరిగొస్తాడా సెప్పు ? ”
పసిబిడ్డను లేపినట్లు మా అమ్మను లేపి కూర్చోబెట్టింది. బలవంతాన మా అమ్మ చేత నాలుగు ముద్దలు ఉడుకుడుగ్గా తినిపించింది.
మా అమ్మ ఏమి చెప్పిందో ఏమో కానీ, మా అత్త ఆ రోజు నుండి మూడు నెలలు మా అమ్మకు తోడుగా పడుకునే దానికి, రాత్రి అన్నం తినేసి , మా అమ్మకు సంగటో, ఊరి బిండో, చింతాకు చారో, ఏదో ఒకటి అంత గిన్నెలో తీసుకుని మా ఇంటికి వచ్చేసేది. అమ్మ తినేసాక ఇద్దరూ వక్కా ఆకు నమలుకుంటా, పాత సంగతులెన్నో మాట్లాడుకుoటా రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటా వుండి పోయే వాళ్ళు. వాళ్ళ బాల్యం వాళ్ళ కష్టాలు వాళ్ల దుఃఖాలు, వాళ్ల ఒంటరితనాలు ఆ కబుర్లు నిండా వినిపించేవి. ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఓదార్చే వాళ్ళు. వాళ్ల తల్లిదండ్రుల్ని గుర్తుతెచ్చుకుని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకునేవాళ్ళు.
హరికథలకి , భజనలకి, గుడులకి, సావిత్రి సినిమాలకి వాళ్ళు ఇద్దరే వెళ్లి వచ్చే వాళ్ళు. మా నాయన పోయిన దుఖం లోంచి మా అమ్మ బయట పడిందంటే దానికి ఒకే కారణం మా కాంతమ్మ అత్త మాత్రమే !
తనకంటూ ఎప్పుడూ ఏమీ ప్రత్యేకంగా వండుకొని తినే అలవాటు లేని ఆయమ్మ, ఎప్పుడూ సంగటి ముద్దా, చెట్నీలు ఊరిబిండి, గొజ్జు, చింతపండు రసంతోనే కాలం గడిపేసిన మా కాంతమ్మ అత్త చివరి రోజుల్లో మాత్రం మనసు మార్చుకుంది. ఆ పది పదిహేను రోజులు ఆమె రాజీపడనే లేదు. తను జీవితాంతం ఏం తినాలని ఇష్టపడి, ఏం తినకుండా నిరాసక్తంగా ఉండిపోయిందో అవన్నీ కూతురి దగ్గర అడిగి మరి చేయించుకుని తినింది.
ఒక శుక్రవారం రోజు తలంటు పోసుకుని, ఆమెకు నచ్చిన పసుపు రంగు చీర కట్టుకుంది. కూతురిని చింతాకు వంకాయ పుల్లగూర ఉడుకుడుకు సంగటి చేసి పెట్టమని అడిగింది . పుష్పమ్మకు వాళ్ళ అమ్మ అంటే ప్రాణం కదా, ఊరంతా తిరిగి ఎక్కడా చింతాకు మార్కెట్లో దొరక్క పోతే, యూనివర్సిటీ దగ్గరకు పోయి, చింతచెట్టు కొమ్మల్ని దోటితో కిందకు వంచి లేత చింతాకు కోసుకుని వచ్చి లేత వంకాయలు తెచ్చి వాల్లమ్మ కోరినట్లే చింతాకు, వంకాయ పుల్లగూర , ఉడుకుడుకు సంగటి చేసి పెట్టింది. ఇష్టంగా తినేసి దూరంగా పడేసిన వక్కా ఆకు తిత్తి వెతికి మరీ నడుముకి దోపుకుంది. డాక్టర్లు వద్దంటే ఒక్క మాటతో మానేసిన వక్కా ఆకు ఆరోజు మాత్రం తెప్పించి వేసుకుంది. చాలా కాలం తర్వాత ఆమె నోరు మళ్లీ ఎర్రగా పండింది. అంత నీరసంలోనూ ఆమెకి ఎక్కడినుంచి అంత ఓపిక వచ్చిందో తెలియదు.
అప్పుడు మా అత్త మా అమ్మనే గుర్తు చేసుకుని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుoదని పుష్పమ్మ ఏడుస్తూ ఆ తర్వాత మా అత్త చావు రోజు ఏడుపుల మధ్య దీర్ఘాలు తీస్తా, చెపుతా వుంటే నాకు , మా తమ్ముడికి కన్నీళ్ళు ఆగనే లేదు.
“ మా వదిన జయమ్మ ఈ లోకంలో, ఈ కులంలో , ఈ కాలంలో ఉండాల్సిన మనిషే కాదుమేయ్. అందుకే ఆ దేవుడు ఆయమ్మని తొందరగా పైకి తీసుకుని పోయినాడు. ఆ పిల్లోల్లు ఉత్త అమాయకులు. మంచి తప్ప చెడు తెలియయనోళ్ళు . ఈ మాయదారి లోకంలో యెట్లా బ్రతకతారో ఏమో. కొంచెం వాళ్ళని చూస్తా ఉండండి , అట్లాంటి అమాయకపు మనుషుల్ని కాపాడితేనే , దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. ఈ లోకంలో అమ్మా ,నాయన లేనోళ్ళకి చుట్టూరా ఎంత మంది జనం వున్యా అనాధల కిందే లెక్క. ఆ బాధ అనుభవించినోల్లకే తెలుస్తుంది. ఆ బిడ్డలు జాగ్రత్తమేయ్. పైన నా కోసం మా జయమ్మ వదిన వక్కాఆకు తిత్తి చేతిలో పెట్టుకుని ఎదురు చూస్తా వుంటుంది. నేను పోయేటప్పుడు గుంతలో వక్కా ఆకుతో బాటూ ఈ కూడే వేసి, మన్ను వేసేయ్యండిమేయ్. నేను కూడా పోతాపోతా జయమ్మకి తీసుకుపోవల్ల కదా, ఏంతినిందో ఎప్పుడు తింనింటుందో? మా వదిన సగం ఆకలి తోనే ఉంటుంది ఎప్పుడూ. వస్తా వస్తా నేను తప్పకుండా ఏదో ఒకటి తనకోసం తెస్తానని నమ్మకంతో ఎదురు చూస్తా వుంటుంది మే… ”
అంత స్నేహం, ఇష్టం మా అమ్మంటే .అంతటి అపేక్ష మా అమ్మంటే.ఆమె మాట ప్రకారమే, ఎవరు ఏమనుకున్నా, ఆకూవక్కా, దుగ్గూ సున్నం తో బాటూ, లేత అరటి ఆకులో ఉడుకుడుకు సంగటి, కూరాకు గుంతలో ఆమెని పూడ్చేటప్పుడు ఆయమ్మ చెప్పినట్లే అదే గుంతలో ఆయమ్మతోబాటే బద్రంగా పూడ్చి పెట్టేసినారు కాంతమ్మ బిడ్డలు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట నిలబెట్టినారు. అంత ప్రేమ వాళ్లకు ఆయమ్మ అంటే.
బిడ్డలకు ఆమె పెద్దగా ఆస్తుల్ని ఇచ్చింది లేదు. కానీ, లోకంలో చాలా మంది బిడ్డలకు ఇవ్వలేని ఆస్తిని మాత్రం ఆమె ఇచ్చి వెళ్ళింది . అదేమిటి అంటారా ? ధైర్యంగా బతికే లక్షణం. మనుషుల్ని ప్రేమించే గుణం.! అంతకు మించి బిడ్డలకు తల్లి తండ్రులు ఇచ్చే ఆస్తి లోకం లో ఇంకేం ఉంటుంది ?
ఆయమ్మ సంపాదిoచుకున్నట్లే ఆయమ్మ బిడ్డలు కూడా చుట్టూ పది మందిని సంపాదించుకున్నారు.ఎరికిలోళ్ళు అనే పేరే లేకుండా, అన్ని కులాలోల్లు వాల్లని సొంత మనుషుల్లా చూసుకుంటారంటే , బంధుత్వాల్ని కలుపుకుని, కులాంతరo చేసుకున్నారంటే , కులాన్ని మించిన మంచిగుణం, మంచితనం, మనిషితనం వాళ్ళల్లో కనిపించబట్టే అని అందరూ అంటుంటారు.
ఒక పండగ వచ్చినా, ఒక దేవర వచ్చినా, ఒక గొడవ వచ్చినా, ఏదైనా పంచాయతి జరిగినా, మా ఇంట్లోనే కాదు, మొత్తం ఎస్టీకాలనీలోనే ఇప్పటికీ దేనికో ఒకదానికి ఆయమ్మ పేరు చెప్పుకోకుండా ఉండలేరు.
మా కాంతమ్మత్త చనిపోయినా, మా మాటల్లో, మనస్సులో, జ్ఞాపకాల్లో ఆమె సజీవంగానే వుందిప్పటికీ .
మనుషుల మాటల్లో, మనస్సుల్లో, జ్ఞాపకాల్లో బ్రతికి ఉండటమే కదా అమరత్వం అంటే? !