కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ బీహార్‌ రాష్ట్రానికి చెందిన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమ ప్రధాన నాయకులలో ఒకరు. ఆయన తన 89వయేట, డిసెంబర్‌ 23న తీవ్ర అనారోగ్యంతో మరణించారు.

1983 లో విరసం చొరవతో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎల్‌ఆర్‌సి) ఏర్పడిరది. అదే సంవత్సరం అక్టోబర్‌ 14, 15 తేదీలలో ఏఐఎల్‌ఆర్‌సి ప్రథమ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరిగాయి. ఈ మహాసభల్లో బీహార్‌ రాష్ట్రం నుండి పాల్గొన్న ప్రతినిధులలో కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ ఒకరు. ఆ రాష్ట్రం నుండి రెండు విప్లవ సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఏఐఎల్‌ఆర్‌సిలో భాగస్వామ్యం అయ్యాయి. వాటిల్లో ఒకటి, క్రాంతికారీ బుద్ధిజీవి సంఘం (కెబియస్‌), రెండోది క్రాంతికారీ సాంస్కృతిక సంఘం (కెఎస్‌ఎస్‌). వీటిల్లో కెబియస్‌ తరఫున కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ ఏఐఎల్‌ఆర్‌సి కార్యవర్గంలో సభ్యులుగా ఎన్నికయ్యారు. 2002 జనవరి 13, 14 తేదీలలో హైదరాబాద్‌లో ఏఐఎల్‌ఆర్‌సి 8వ మహాసభలు జరిగాయి. అందులో కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఏఐఎల్‌ఆర్‌సిలో చేరడానికి పూర్వం ఆయన బీహార్‌లో క్రాంతికారీ నవజన్‌వాదీ సాంస్కృతిక సంఘం బాధ్యతలు నిర్వహించారు. బీహారీ జన జీవితంతో పెనవేసుకుపోయిన వ్యక్తిత్వం ఆయనది. ఆజానుబాహు విగ్రహం. నిత్యం నవ్వు తొణికిసలాడే ముఖం. అక్షరాలా ప్రసన్నవదనుడు. చూపులకు సున్నితత్వంలేని వ్యక్తిగా అనిపించినప్పటికీ ప్రజలపట్ల అతి సున్నితమైన స్పందన ఆయన జీవలక్షణం. ఎవరినైనా మనసారా ప్రేమించి, నోరారా పలకరించేవాడు. గొప్ప వక్త, కంచుకంఠం. ఆయన నినాదాలిచ్చే ప్రత్యేకమైన తీరు ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేసేది. వీటన్నింటికిమించి గొప్ప కార్యదక్షత. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో చివరికంటా కొనసాగారు. బీహార్‌ రాష్ట్రంలో జరిగిన అనేకానేక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ఉద్యమాలలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఆ రాష్ట్రంలోని అగ్రకుల పెత్తందారీ భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా అణగారిన ప్రజలు నిరంతరం చేసిన పోరాటాలతో మమేకం అయ్యారు. ఆ క్రమంలో ఆయన కుల వర్గ పోరాటాలు జమిలిగా కొనసాగాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకున్నారు. తన కుల చిహ్నమైన ‘సింగ్‌’ పదాన్ని తన పేరు నుండి వదులుకుంటున్నానని, ఇక నుండి రాజ్‌ కిషోర్‌గా కొనసాగుతానని బహిరంగ సభలో ప్రకటించారు.

కెబియస్‌ నాయకుడుగా, ఏఐఎల్‌ఆర్‌సి కార్యవర్గ సభ్యుడుగా దేశంలోని విభిన్న ప్రాంతాలలో జరిగిన అనేక సభలలో సెమినార్లలో పాల్గొన్నారు. ఒకవైపు ఏఐఎల్‌ఆర్‌సిలో కొనసాగుతూనే మరోవైపు అఖిల భారత ప్రజాప్రతిఘటనా వేదిక, రివల్యూషనరీ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ సంస్థల తరఫున కూడా దేశమంతటా పర్యటించి ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. 1998లో పాట్నాలో ఏఐఎల్‌ఆర్‌సి తరఫున మహిళా సమస్యలపట్ల మార్క్సిస్టు వైఖరికి సంబంధించిన జాతీయ సెమినార్‌ను నిర్వహించడంలో కీలకపాత్ర వహించారు.

కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ ప్రసంగాలలో స్థానిక వాస్తవిక పరిస్థితుల చిత్రణతోపాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల చిత్రణ కూడా వుండేది. సమస్యలను మార్క్సియన్‌ తాత్విక దృక్పథం నుండి విశ్లేషిస్తూ ప్రసంగించేవారు. బీహారీ ప్రజల భాషలో సరళంగా ప్రసంగించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం ఆయనకు అబ్బిన గొప్ప కళ. కేవలం ఒక ఆలోచనాపరుడుగానో వక్తగానో మిగిలిపోకుండా ప్రజా ఉద్యమాలలో నిరంతరం ఆచరణలో మునిగితేలినవాడు రాజ్‌ కిషోర్‌. ఎన్నడూ ఎలాంటి రాజ్య నిర్బంధానికి వెరవలేదు. ఆయన కార్యాచరణను అడ్డుకోవడానికి పాలకవర్గాలు చేసిన ప్రయత్నాలను, ఆయన భాగస్వామ్యం వహించిన ఉద్యమం ప్రజా సహకారంతో తిప్పికొట్టింది. ఒక దశలో పోలీసులు ప్రయోగించిన చిత్రహింసల ఫలితంగా ఒక కాలు విరిగి కూడా ఆయన తన కార్యకలాపాల నుండి వెనకంజ వేయలేదు. కొద్దికాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.

విరసంపట్ల గాఢమైన అభిమానాన్ని ప్రేమను ప్రదర్శించేవాడు. విరసంతో నిత్య సంభాషణలో వుండేవాడు. తెలుగులో వచ్చిన విప్లవ కథలు, కవితలను స్థానిక భాషలోకి అనువాదం చేయించడంలో చొరవ చూపేవారు. అలా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా విరసానికి సన్నిహితుడుగా స్నేహితుడుగా విరసం బలపడడాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషిగా వున్న కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ అకాల మరణం మాకెంతైనా బాధాకరం. ఆయనకు వినమ్రపూర్వక జోహార్లు.

Leave a Reply